సింగిల్స్‌ రన్నరప్‌ వైష్ణవి | Vaishnavi Adkar finished as the runner up at the ITF W100 Bangalore Open | Sakshi
Sakshi News home page

సింగిల్స్‌ రన్నరప్‌ వైష్ణవి

Feb 23 2026 4:07 AM | Updated on Feb 23 2026 4:07 AM

Vaishnavi Adkar finished as the runner up at the ITF W100 Bangalore Open

బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) డబ్ల్యూ–100 బెంగళూరు ఓపెన్‌లో భారత క్రీడాకారిణి వైష్ణవి అడ్కర్‌ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన వైష్ణవి 0–6, 1–6తో ప్రపంచ 124వ ర్యాంకర్‌ హనీ వాండెవింకెల్‌ (బెల్జియం) చేతిలో ఓడిపోయింది. 56 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో వైష్ణవి ఒక్క గేమ్‌ మాత్రమే గెలిచింది. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయింది. 

విజేత వాండెవింకెల్‌కు 15,239 డాలర్ల (రూ. 13 లక్షల 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 100 ర్యాంకింగ్‌ పాయింట్లు... రన్నరప్‌ వైష్ణవికి 8,147 డాలర్ల (రూ. 7 లక్షల 39 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 65 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 690వ ర్యాంక్‌లో ఉన్న వైష్ణవి ఈ టోర్నీలో ‘వైల్డ్‌ కార్డు’తో బరిలోకి దిగింది. ఫైనల్‌ చేరే క్రమంలో ఈ పుణే అమ్మాయి తనకంటే మెరుగైన ర్యాంక్‌ ఉన్న ముగ్గురు క్రీడాకారిణులను ఓడించింది. 

వైష్ణవి ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 220వ ర్యాంకర్‌ మాయ్‌ హొంటామా (జపాన్‌)పై, క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 148వ ర్యాంకర్‌ టేలా ప్రెస్టన్‌ (ఆ్రస్టేలియా)పై, సెమీఫైనల్లో ప్రపంచ 126వ ర్యాంకర్‌ లాన్లానా (థాయ్‌లాండ్‌)లపై సంచలన విజయాలు సాధించింది. తద్వారా 2009లో పట్టాయా ఓపెన్‌లో సానియా మీర్జా ఫైనల్‌ చేరిన తర్వాత... డబ్ల్యూ–100 లెవెల్‌ టోర్నీలో సింగిల్స్‌ టైటిల్‌ పోరుకు చేరిన రెండో భారతీయ క్రీడాకారిణిగా వైష్ణవి గుర్తింపు పొందింది. 

Advertisement
 
Advertisement
Advertisement