మహిళల టీమ్ విభాగంలో టైటిల్ నిలబెట్టుకున్న హరియాణా
సాక్షి, విజయవాడ: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టీమ్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ హరియాణా 3–0తో ఆంధ్రప్రదేశ్‌ను ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారత స్టార్ పీవీ సింధు ఫైనల్ మ్యాచ్‌కు దూరంగా ఉంది. తొలి మ్యాచ్‌లో దేవిక సిహాగ్ 20–22, 21–16, 21–16తో నవ్య కందేరిపై గెలిచింది.
రెండో మ్యాచ్‌లో ఉన్నతి హుడా 21–14, 21–14తో సూర్య చరిష్మా తామిరిపై నెగ్గి హరియాణాకు 2–0తో ఆధిక్యాన్ని అందించింది. మూడో మ్యాచ్‌లో ఉన్నతి–అన్‌మోల్ ద్వయం 21–13, 24–22తో నవ్య–సూర్య చరిష్మా జంటపై గెలవడంతో హరియాణాకు టైటిల్ ఖరారైంది. రన్నరప్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్ జట్టులో నవ్య, సూర్య చరిష్మా, సీహెచ్‌ఎస్‌ఆర్ ప్రణవి, దీపిక దేవనబోయిన, కవిప్రియ సభ్యులుగా ఉన్నారు.
పురుషుల టీమ్ విభాగంలో తమిళనాడు చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో తమిళనాడు 3–2తో హరియాణా జట్టును ఓడించింది. విజేత జట్లు హరియాణా, తమిళనాడు జట్లకు రూ. 3 లక్షల 50 వేల చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. నేటి నుంచి ఐదు రోజులపాటు పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి.


