తెలుగువారి పరువు తీస్తున్న బాబూ అండ్‌ కో! | Kommineni Comments On Chandrababu And Pawan Kalyan Politics | Sakshi
Sakshi News home page

తెలుగువారి పరువు తీస్తున్న బాబూ అండ్‌ కో!

Feb 10 2026 10:27 AM | Updated on Feb 10 2026 10:59 AM

Kommineni Comments On Chandrababu And Pawan Kalyan Politics

తమిళనటుడు కమల్‌హాసన్‌ తెలుగువారి కీర్తి దశదిశలా మారుమోగేలా చేశారు. రాజ్యసభ సభ్యుడి హోదాలో చేసిన తొలి ప్రసంగంలో తెలుగువారు గర్వించదగ్గ కవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కవిత ‘వస్తున్నాయ్‌.. వస్తున్నాయ్‌ జగన్నాథ రథచక్రాల్‌’’ను చదివి వినిపించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ కవితకు ఆర్థం తెలుగువారికి బాగా తెలుసంటూ ఆయన నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు అది వేరే సంగతి.

ఒక పక్క ఓ తమిళ నటుడు తెలుగువారి సాహితీ వైభవాన్ని చాటిచెబితే ఇంకోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌లు అందరి ఆరాధ్యదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం వ్యవహారాన్ని పదే పదే ప్రస్తావిస్తూ మాట్లాడటం మాత్రం తెలుగువారికి ఏమంత గర్వకారణం కాదు. అంతేకాదు.. ఈ రాజకీయ బురదలోకి బాబు అండ్‌ కో బీజేపీ నేత మాధవ్‌ను కూడా దింపేశారు. కల్తీ మకిలిని మాజీ సీఎం జగన్‌పైకి నెట్టేందుకు టీడీపీ అన్ని రకాలుగా ప్రయత్నించినా విఫలం కావడం.. జగన్‌ జనాల్లో తిరుగుతూ ప్రభంజనాన్ని సృష్టిస్తుండడంతో చంద్రబాబుకు ఎటూ పాలుపోవడంలేదు

అందుకేనేమో.. పవన్‌కళ్యాణ్‌, బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌, మరికొందరు మంత్రులతో మూకుమ్మడిగా ప్రెస్‌మీట్ పెట్టి జగన్, వైసీపీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పించారు. మత కోణాన్ని తెచ్చి జగన్‌ను దెబ్బతీయాలని ప్రయత్నించి బోర్లాపడ్డారు. ఈ క్రమంలోనే పక్కనే పవన్‌ కళ్యాణ్‌ ఉన్నప్పటికీ చంద్రబాబు హిందూ ధర్మంలో విడాకులు ఉండవని, పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయని వింత వ్యాఖ్యలు చేస్తూ విడాకులు తీసుకోవడాన్ని తప్పుపట్టారు. సహజంగానే ఈ వ్యాఖ్యలపై పవన్ అభిమానులు తీవ్ర అసహనం కలిగింది.

అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అప్పుడే చంద్రబాబు తప్పు మాట్లాడుతున్నారని ధైర్యంగా చెప్పగలిగి ఆయన గౌరవం పెరిగేది జనసైనికులలో ఆయనపై నమ్మకం కలిగేది. కాని ఆయన మౌనంగా కూర్చోవడం వారి గుండె మంటకు కారణమైంది. ఎందుకంటే హిందూ ధర్మం అయినా, మరే మత ధర్మమైనా అవి విశ్వాసాలే. కాని దేశానికి ఒక రాజ్యాంగం, చట్టం ఉంటాయి.రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసిన  ఒక ముఖ్యమంత్రి విడాకుల గురించి అలాంటి మాటలు మాట్లాడితే మరి చట్టం మాటేమిటి? ఏ కారణం వల్లనైనా దంపతుల మధ్య కలహాలు ఏర్పడినా, మహిళలు హింసను కూడా భరించాలని చంద్రబాబు చెప్పదలిచారా? సంసారాలు విడాకుల వరకు వెళ్లగూడదని చెప్పడం వేరు. అసలు విడాకులు  తీసుకోవమే నేరం అన్నట్లు మాట్లాడడం వేరు.

ఇది ఒక కోణమైతే వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసేందుకు వైసీపీ ప్రభుత్వంలో కుట్ర జరిగిందని చంద్రబాబు ఇంకో దిక్కుమాలిన వాదన తీసుకువచ్చారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న తన ఆరోపణలో నిజం లేదని వెల్లడయ్యాక, ప్రజలలో వచ్చిన అప్రతిష్టను  డైవర్ట్ చేయడానికి మరో కుట్ర చేసినట్లు కనిపిస్తుంది. నిజానికి రాజకీయ ప్రత్యర్థి జగన్‌పై బురద రాయాలన్న తాపత్రయంలో, ఓట్ల రాజకీయంలో భాగంగా చంద్రబాబు ఈ ఆరోపణ చేశారన్న విషయం అందరికి తెలుసు.

విశేషం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఏమో తిరుమలకు అపవిత్రత రాకూడదన్న లక్ష్యంతో పాకులాడుతుంటే, తాను స్వామివారి భక్తుడిని అంటూ ఆయనకే అపచారం చేసే విధంగా మాట్లాడడానికి చంద్రబాబు వెనుకాడడం లేదు. తన హయాంలో జరిగిన తప్పులను సైతం వైసీపీపై తోసివేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం వికటిస్తున్నా, గోబెల్స్ మాదిరి అదే తప్పుడు ప్రచారం పదే, పదే చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. దీనికి ఎల్లో మీడియా డైరెక్షన్ ఎటూ ఉంది.

పవన్ కళ్యాణ్ తాను గతంలో చేసిన  కొన్ని ఆరోపణల విషయంలో వెనక్కి తగ్గినట్లు కనిపించింది. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడానికి సీఎంకు ఏమి సంబంధం ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబుతో భేటీ తర్వాత పాతపాటే పాడారు. చంద్రబాబు బతిమలాడారా? బెదిరించారా?  ఈ వివాదంలో బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అంటీ అంటనట్లే ఉంటున్నారు. కాని చంద్రబాబు ఆయన్నూ పనికట్టుకుని ప్రెస్‌మీట్లో పాల్గొనేలా చేశారు. తద్వారా ఆ బురదను ఈయనకు కూడా అంటించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు  లడ్డూ వివాదాన్ని సృష్టించడానికి ఏ రకంగా పనిచేసింది వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఒక క్రమ పద్ధతిలో వివరించారు. అదంతా వింటే జగన్‌పై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి చంద్రబాబు ప్లాన్ చేశారని స్పష్టమవుతుంది. లడ్డూ ప్రసాదం కల్తీపై దర్యాప్తునకు సిట్ వేస్తున్నట్లు  ప్రభుత్వం ప్రకటించగానే, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెంటనే సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దాంతో ఈ విచారణ చాలావరకు చంద్రబాబు చేతి నుంచి జారి పోయింది. రాష్ట్ర పోలీసు అధికారులు ఇద్దరు సిట్‌లో ఉన్నా ప్రధాన పాత్ర సీబీఐది కావడం వల్లనే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని స్పష్టమైన నివేదిక ఇవ్వగలిగారు.

ఈ పరిణామంతో తాము జనంలో బాగా పలుచనయ్యామన్న సంగతిని అర్థం చేసుకున్న చంద్రబాబు లడ్డూలో కల్తీ జరిగిందని ఏకంగా ఫ్లెక్సీలు కట్టి జగన్, సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డిలపై దుష్ప్రచారం చేయించారు. జంతు కొవ్వు ఆరోపణ చేయడం, అరాచకపు ఫ్లెక్సీలు కట్టించడం, లడ్డూకు ఏదో అయిందన్నట్లు అదే పనిగా ప్రచారం చేయించడం.. వీటిని కదా వెంకన్నకు మకిలి అంటించే కుట్ర అనేది? జగన్ గుంటూరు పర్యటనకు జనం విశేషంగా రావడం, అక్కడ లడ్డూ అంశాన్ని ప్రస్తావించి చంద్రబాబును తీవ్రంగా తప్పుపట్టడంతో చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి  మరింత గందరగోళంగా మాట్లాడారు. 

ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని కొన్ని ప్రశ్నలు సంధించారు. నెయ్యి కల్తీ జరిగినట్లు చెబుతున్న నెయ్యి శాంపిల్స్ తీసింది కూటమి ప్రభుత్వంలోనా? కాదా? వెనక్కి పంపించిన నాలుగు ట్యాంకర్లు కొన్నాళ్లు శ్రీకాళహస్తిలో ఉంచడం, తదుపరి ఆ నెయ్యిని కూడా స్వీకరించారని సిట్ తెలిపిందా? లేదా? బోలేబాబా కంపెనీ వచ్చింది 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనేనా? కాదా? చంద్రబాబు హయాంలోనే కిలో నెయ్యి రూ.291లకే టీటీడీ ఎలా కొనుగోలు చేసింది?

ఈ ప్రశ్నలకు చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్‌లు ఎక్కడా జవాబు ఇవ్వలేదు. నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సిట్ తేల్చింది కదా అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించినప్పుడు చంద్రబాబులో కనిపించిన అసహనం అన్నిటికి జవాబు చెబుతోంది. ప్రెస్‌మీట్ లో పాల్గొన్నవారిలో ఒక్కరి ముఖంలో నెత్తురు చుక్క కనిపించడం లేదని, తప్పు చేశామన్న గిల్టితో ఉండి దబాయింపు చేసి బయటపడాలన్న వారి తాపత్రయం కనబడుతోందని  జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ చేసిన వ్యాఖ్య అర్థవంతం అనిపిస్తుంది.

ఇక పవన్ కళ్యాణ్ మరోసారి మాట మార్చి భగవంతుడిపైనే పగబట్టారు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.దానికి పేర్నినాని జవాబు ఇస్తూ పవన్ కళ్యాణ్ ఒకసారి క్రిస్టియన్ అని, బాప్టిజం తీసుకున్నానని చెబుతారు. మరోసారి ముస్లిం అని అంటారు. ఇంకోసారి తన తండ్రి దీపారాధన వత్తుల మంటలో సిగరెట్  వెలిగించుకుంటారని అంటారు..ఇక ఆయన సోదరుడు తాను నాస్తికుడనని చెబుతారు.. మళ్లీ  హిందూ సనాతని అన్నట్లు మాట్లాడుతున్నారు..అని మండిపడ్డారు.వీరంతా రాజకీయ అవసరాల  కోసం రకరకాల అవతారాలు ఎత్తుతున్నారని వైసీపీ ధ్వజమెత్తుతోంది.

నిజంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితర కూటమి నేతలు హిందూ ధర్మం పట్ల నిబద్దత ఉంటే నిత్యం అబద్దాలు చెబుతారా?  మోసపూరిత హామీలు ఇచ్చి  జనాన్ని మభ్య పెడతారా? అన్న ప్రశ్నలకు జవాబు ఇవ్వలేరు.  తనపై తనకు నమ్మకం లేనప్పుడు, తమ అసమర్ధతను ప్రజలు బాగా గుర్తిస్తున్నారని భయపడినప్పుడే పాలకులు మతాన్ని తెరపైకి తెస్తారని ఒక రచయిత అంటారు. నిజమే కావచ్చు.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement