కాంగ్రెస్, బీజేపీ మధ్యే మున్సిపోరు: కిషన్‌రెడ్డి | BJP Leader Kishan Reddy Fires On Congress And BJP During Municipal Election Campaign, More Details Inside | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, బీజేపీ మధ్యే మున్సిపోరు: కిషన్‌రెడ్డి

Feb 10 2026 4:50 AM | Updated on Feb 10 2026 9:57 AM

BJP Leader kishan Reddy Fires On Congress, BJP

సోమవారం గోదావరిఖనిలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

గోదావరిఖని ఎన్నికల ప్రచారంలో కిషన్‌రెడ్డి

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ కనుమరుగైంది.. 

హామీలను విస్మరిస్తూ కాంగ్రెస్‌ వంచన

గోదావరిఖని/శ్రీరాంపూర్‌: రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ కనుమరుగైందని, మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సింగరేణి కార్మీకులకు ఇప్పటికే కోత విధించిన ఆదాయపన్ను తిరిగి చెల్లిస్తామని, భవిష్యత్‌లో పూర్తిగా మాఫీ చేస్తామని మంత్రి కిషన్‌రెడ్డి అభయం ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం బీజేపీ కేంద్ర నాయకుడు ఎస్‌.కుమార్‌ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో భయాకమైన పరిస్థితులు నెలకొన్నాయని, సింగరేణి అధికారులతో సమీక్షించాక అనేక విషయాలు వెలుగు చూశాయని తెలిపారు. రూ.51వేల కోట్లకన్నా అధికంగానే ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉందని, బొగ్గు, విద్యుత్‌ తీసుకుంటూ ఒక్కపైసా చెల్లించడం లేదన్నారు. సంస్థ పనితీరు, సంక్షోభం గురించి కార్మీక సంఘాలు కూడా నిర్మొహమాటంగా అనేక విషయాలు వెల్లడించారన్నారు. ఈ విషయాలను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి చెప్పారు. 

ముస్లిం ఓట్ల కోసమే రేవంత్‌ఖాన్‌గా.. 
ముస్లిం ఓట్లకోసమే సీఎం రేవంత్‌రెడ్డి తన పేరును రేవంత్‌ఖాన్‌గా పెట్టుకున్నారని మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మజ్లిస్‌ కనుసన్నల్లోనే కాంగ్రెస్‌ పనిచేస్తోందని ధ్వజమెత్తారు. గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సింగరేణి సంస్థను దోచుకున్నాయని, రెండు పార్టీలకు సింగరేణి ఏటీఎంగా మారిందన్నారు. కారు గుర్తుకు భవిష్యత్‌ లేదని కేసీఆర్‌ కూతురు కవిత వ్యాఖ్యానిస్తున్నారని, కారులో ఒకటైరు కవిత, మరోటైరు కేటీఆర్‌ తీసుకెళ్లారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌కే పరిమితం అయ్యారని, బీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో కనుమరుగైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను విస్మరిస్తూ ప్రజలను వంచనకు గురిచేస్తోందన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తేనే రామగుండం అభివృద్ధి చెందుతుందన్నారు. నాయకులు ఎస్‌.కుమార్, దుగ్యాల ప్రదీప్, బల్మూరి వనిత, సంధ్యారాణి, సంజీవరెడ్డి, గోమాస శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, కాసిపేట శివాజీ, కోమళ్ల మహేశ్, రాజమౌళి గౌడ్‌ పాల్గొన్నారు. 

సింగరేణిని దోచుకుంటున్నారు.. 
కాంగ్రెస్‌ అంటేనే కమీషన్, కరప్షన్, మోసం, దగా అని, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సింగరేణిని దోచుకుంటున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ బస్టాండ్‌ వద్ద కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. సింగరేణిని రక్షించుకోవాలంటే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టాలని, ఒకవేళ వారు గెలిస్తే మనకు వాత పెడుతారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌రావు, జోనల్‌ అధ్యక్షుడు సత్రం రమేశ్, అభ్యర్థులు కమలాకర్‌రావు, ముఖేశ్‌గౌడ్, పొన్నవేని సదానందం, వనపర్తి కేత రాజేశ్, కాదాసి భీమయ్య తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement