సోమవారం పరకాలలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కరపత్రాన్ని చూపుతూ మాట్లాడుతున్న కేటీఆర్
భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్ సభల్లో కేటీఆర్
ఇప్పటికే గోస పడుతున్నం.. ఇకపై ఆ పరిస్థితి వద్దు
కేసీఆర్‌ను తిట్టినోళ్లను వదిలిపెట్టం
సాక్షి ప్రతినిధి, వరంగల్/మహబూబాబాద్/భూపాలపల్లి/గూడూరు: ‘అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సోనియాగాందీ, రాహుల్ గాందీల మీద ఒట్టేసి హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత వాటిని గాలికి వదిలేశారు. ప్రజలు, ప్రతిపక్షాలు అభివృద్ధి,సంక్షేమం గురించి నిలదీస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అబద్దపు హామీలు, మాటలు నమ్మి ఓట్లేస్తే మళ్లీ ఆగమైతం..’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి డబ్బులకు తోడు తులం బంగారం కలిపి ఇస్తామని చెప్పడంతోపాటు అనేక ఇతర హామీలిచ్చి నెరవేర్చలేని రేవంత్ రెడ్డికి పాలన చేయడం చేతకావడం లేదని విమర్శించారు. రెండేళ్ల తర్వాత ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు.
సోమవారం ఉమ్మడి వరంగల్‌లోని భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్ మున్సిపాలిటీలలో కార్నర్ మీటింగ్‌ల ద్వారా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాని రేవంత్‌రెడ్డి కేవలం కేసీఆర్‌ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, కేసీఆర్‌ను తిట్టినోళ్లు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం ఎవరితరం కాదన్నారు. ఓటుకు నోటు కేసులో ఆధారాలు ఉండకూడదని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నిప్పు పెట్టి తగులబెట్టారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో మళ్లీ అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా.. కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి చెప్పాలన్నా 11న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఆయన కోరారు.
కాంగ్రెస్ గెలిస్తే..జిల్లాలు ఉండవు
ప్రభుత్వం ప్రజలకు దగ్గరకు చేర్చాలనే ఆలోచనతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ మారుమూల మానుకోట, భూపాలపల్లిని జిల్లాలుగా మార్చారు. ప్రజలకు కలెక్టర్, ఇతర అధికారులను దగ్గర చేర్చారు.. కానీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలు తీసివేస్తారటా.. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే జిల్లాలుండవు.. ఏది కావాలో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని కేటీఆర్ అన్నారు. వెనకటి రోజులు తెస్తానని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నిజం చేస్తున్నారన్నారు. వెనకటి రోజులు అంటే యూరియా కోసం చెప్పుల క్యూ పెట్టడమా.. కరెంట్ లేని రాత్రులు గడపడమా.. అని విమర్శించారు. ఆయా కార్యక్రమాల్లో శాసన మండలి డిప్యుటీ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్, శంకర్‌నాయక్, చల్లా ధర్మారెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాళ్లు గండ్ర జ్యోతి, మాలోతు కవిత, పాల్గొన్నారు.
మరుగుజ్జుకు కేటీఆర్ ఆర్థిక హామీ..
మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి సోమవారం నర్సంపేట మీదుగా వస్తున్న మాజీ మంత్రి కేటీఆర్.. భీరవెళ్లి భరత్ కుమార్‌రెడ్డి కోరిక మేరకు మార్గమధ్యలో గూడూరులోని రెవెన్యూ కార్యాలయానికి సమీపంలో గల ఓ చాయ్ కొట్టు వద్ద ఆగారు. కేటీఆర్ చాయ్ తాగుతూ ఎదురుగా కనిపిస్తున్న ఓ చిన్న బాలుడి లాంటి వ్యక్తిని చూసి దగ్గరికి పిలిచి అతడిని ఎన్ని సంవత్సరాలుంటాయి నీకు అని అడిగాడు. అక్కడే ఉన్న భరత్‌కుమార్‌రెడ్డి ‘సార్.. ఇతని పేరు ధారావత్ వినోద్‌కుమార్. 30ఏళ్లు ఉంటాయి. డిగ్రీ చదువుకొని ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు’అని చెప్పాడు. అది విన్న కేటీఆర్ ఏమైనా చిరువ్యాపారం చేసుకుంటావా? అని అతన్ని అడగ్గా, చేసుకుంటా సార్ అన్నాడు. భరత్‌కుమార్‌రెడ్డిని చూపుతూ ‘ఇతను నీకు తెలుసా’అని అడగ్గా తెల్సు సార్ అన్నాడు. వెంటనే ‘ఈయనకు రూ.2లక్షలు పంపిస్తా.. నీకు ఇస్తాడు. ఇంటి వద్ద ఏదైనా కిరాణం పెట్టుకో’అన్నాడు.


