2029లో అసెంబ్లీ ఎన్నికలు! | Telangana assembly polls will be held in 2029: CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

2029లో అసెంబ్లీ ఎన్నికలు!

Feb 10 2026 1:25 AM | Updated on Feb 10 2026 1:25 AM

Telangana assembly polls will be held in 2029: CM Revanth Reddy

మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో వేం నరేందర్‌రెడ్డి

2028 అక్టోబర్‌లో జరిగే అవకాశం లేదు 

జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది 

జన గణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన 

ప్రోరేటాతో లోక్‌సభ స్థానాలు పెంచితే అన్యాయమే.. 

మీడియాతో ఇష్టాగోష్టిలో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. 2028 అక్టోబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం లేదన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జన గణన, కుల గణన ప్రక్రియ తర్వాత నియోజకవర్గవర్గాల పునరి్వభజన జరుగుతుందని, అలాగే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు, జమిలి ఎన్నికలు.. ఇవన్నీ అమలు చేయాలని కేంద్రం భావిస్తోందని చెప్పారు. సోమవారం తన నివాసంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 

‘పార్లమెంట్‌ స్థానాల డీలిమిటేషన్‌ను జనాభా లేదా ప్రోరేటా ప్రకారం చేసినా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. అందుకే ప్రస్తుతం ఉన్న మాదిరిగానే సీట్ల పెంపు ఉండాలి తప్ప మార్చకూడదు. అయితే ఏ విధానాన్ని అవలంభిస్తారన్నది కేంద్రం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. కానీ కొత్తగా కట్టిన పార్లమెంట్‌ను 840 సభ్యులు కూర్చొనే విధంగా నిర్మించారు. 50 శాతం సీట్ల పెంపు ప్రోరేటా పద్ధతిలో చేస్తే తమిళనాడులో 40 సీట్లున్న లోక్‌సభ స్థానాలు 60కి పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్‌లో 80 నుంచి 120కి పెరుగుతాయి..’ అని సీఎం చెప్పారు. 

జిల్లాలను ముట్టుకోవడానికి వీల్లేదు 
‘రాష్ట్రంలో జిల్లాల కుదింపు లేదా పెంపు ఏదీ చేపట్టడానికి ఇప్పుడు వీలులేదు. ఎందుకంటే జనగణన పూర్తయ్యే వరకు ఎలాంటి సరిహద్దుల మార్పులు చేయొద్దని కేంద్రం అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలిచి్చంది. అయినా ఎలాంటి మార్పు చేయాలన్నా అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామే తప్ప నాలుగు గోడల మధ్య కాదు. పరిగిలో జరిగిన సమావేశంలో నేను మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అన్నట్లు పత్రికల్లో రాయడం సమంజసం కాదు. చేవెళ్ల నియోజకవర్గంలోని మునిసిపాలిటీలకు నిధులు తీసుకురావడం, అభివృద్ధి చేసే బాధ్యతను రంజిత్‌రెడ్డికి ఇస్తానని నేను చెప్పా..’ అని రేవంత్‌ వివరణ ఇచ్చారు.  

కల్వకుంట్ల కవితది ఇంటి సమస్య.. 
కల్వకుంట్ల కవిత సమస్య వారి అంతర్గత కుటుంబ సమస్య అని సీఎం వ్యాఖ్యానించారు. కవిత వెనుక తానున్నానన్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పలు రాష్ట్రాల్లోని రాజకీయ కుటుంబాల్లో సమస్యలుంటే వాటన్నింటికీ నేను బాధ్యుడినా అని ప్రశ్నించారు. అధికారం ఉన్నంతవరకు కవిత, అందరూ కలిసే ఉన్నారుగా అని వ్యాఖ్యానించారు. తానేదో బూతులు మాట్లాడుతున్నట్లు తప్పుపడుతున్న వారు.. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఉద్దేశించి రండా అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ‘మంది సంసారాలను కూలదోసేలా వార్తలు ప్రసారం చేస్తే జైలుకు వెళ్లాల్సిందే.

కాళేశ్వరంపై సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదు? వారు తిరస్కరిస్తే మేము విచారణ చేయిస్తాం. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు 3 నెలలుగా పురోగతి సాధిస్తోంది. నేను ఏ ఎన్నికలను రెఫరండంగా భావించడం లేదు. స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేదు. స్థానిక నాయకులకే వదిలిపెట్టాం. ఎన్ని మునిసిపాలిటీల్లో విజయం సాధిస్తామన్నది అంచనా వేయలేదు. అజహరుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నియమించేందుకు గవర్నర్‌కు ప్రతిపాదన పంపించాం..’ అని సీఎం తెలిపారు.  

జైలుకెళితే సీఎం అవుతామనుకుంటున్నారు.. 
తిరుమల లడ్డూ వ్యవహారంపై విలేకరులు ప్రశ్నించగా..అది పక్క రాష్ట్రానికి సంబంధించిన విషయమని రేవంత్‌ అన్నారు. తెలంగాణలోని దేవాలయాల్లో విజయా డెయిరీ నెయ్యినే వాడాలని ఆదేశించామని తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో జైలుకెళ్లడానికి కేటీఆర్, హరీశ్‌ పోటీ పడుతున్నారని, అలా వెళ్తే సీఎం కావచ్చని భావిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే జైలుకెళ్లిన కవిత కూడా సీఎం అవుతానని భావిస్తోందని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement