తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం | Municipal Election Campaign Ends In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం

Feb 9 2026 5:14 PM | Updated on Feb 9 2026 5:16 PM

Municipal Election Campaign Ends In Telangana

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం అధికారికంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల సైలెంట్ పిరియడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మైకులు మూగబోయాయి. ర్యాలీలు, సభలు నిలిచిపోయాయి. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఎలాంటి ప్రచారం జరగకుండా ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు చేపట్టింది.

ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం 13న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2,996 వార్డులకు పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం కల్పించారు. ఓటర్ల సంఖ్య 52.43 లక్షలు కాగా, అందులో మహిళా ఓటర్లు 26.80 లక్షలు, పురుష ఓటర్లు 25.62 లక్షలు ఉన్నారు. ఈసారి బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఓటింగ్ జరగనుంది. అందుకోసం 16,301 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు.

పోలింగ్, కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 25,000 మంది పోలీసులను బందోబస్తులో నియమించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1,900గా గుర్తించగా అత్యంత సమస్యాత్మక కేంద్రాలు 1,400గా గుర్తించారు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి సీసీటీవీ మానిటరింగ్‌తో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తయింది. స్ట్రాంగ్ రూమ్‌లలో 24 గంటల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement