తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీలో ఓ కోర్సుకు హాజరు కావడం ఎంతైనా అభినందనీయం. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు కానీ.. నాయకత్వ లక్షణాలన్న అంశంపై సాగిన ఈ కోర్సులో ఆయన అంతర్జాతీయ పోకడల గురించి నేర్చుకుని ఉండవచ్చు. అయితే కోర్సు ముగించుకుని హైదరాబాద్ రావడంతోనే ఆయనలో పాత రాజకీయ నాయకుడు మళ్లీ ప్రత్యక్షమైనట్టు కనిపిస్తోంది. భాష, తీరులో రెండింటిలోనూ ఏ మాత్రం మార్పు కనిపించలేదు. ఇతర రాజకీయ పార్టీల నేతలు భిన్నంగా ఉండకపోవచ్చు. అది వేరే సంగతి. మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలలో రేవంత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
బీఆర్‌ఎస్ అధినేత, విపక్ష నేత కేసీఆర్‌పై పరుష వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజలను ఆకర్షించడానికి, కాంగ్రెస్ కేడర్‌లో ఊపు తేవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. సాధారణంగా మున్సిపల్ ఎన్నికలు లోకల్ సమస్యల ఆధారంగా జరుగుతాయి. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు మెజార్టీ స్థానాలు దక్కినా, బీఆర్‌ఎస్ కూడా గణనీయ విజయాలు సాధించింది. దీంతో మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకం అవుతున్నాయి. ఫలితాలు నాయకత్వంపై ప్రభావం చూపుతుందన్న అంచనాతో రేవంత్ కాంగ్రెస్ 90 శాతం సీట్లు గెలుచుకోవాలని మంత్రులకు, నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఆ క్రమంలో రేవంత్ చేస్తున్న ప్రసంగాలలో ప్రభుత్వం చేసిన అభివృద్ది కార్యక్రమాలు, అమలు చేసిన హామీలు మొదలైన వాటి గురించి కంటే కేసీఆర్, బీఆర్‌ఎస్‌లపై విమర్శలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు అనిపిస్తోంది.
‘‘మొగుడు,పెళ్లాల ఫోన్లు విన్నోడు జాతిపిత ఎట్లయితడు? నీ జాతికి నువ్వు జాతిపిత కావచ్చు.. మాకు కాదు. సన్నాసి, దొంగ ఎప్పటికి జాతిపిత కాలేడు’’ అన్న వ్యాఖ్యలు ఆ కోవకు చెందినవే. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ఫ్రొఫెసర్ జయశంకరే జాతిపిత అని రేవంత్ స్పష్టం చేశారు. ‘‘జర్నలిస్టులు, సినీ తారలు జడ్జిల ఫోన్లు విన్నారు.. మీరు చేసిన తప్పులకు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు ముసుగు తొడిగి విచారణకు తీసుకురావల్సింది అని కూడా వ్యాఖ్యానించారట. ఇది పూర్తిగా అభ్యంతరకరం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీరిపై ఆరోపణలకు ఆధారాలుంటే వాటిని జనానికి చూపించవచ్చు కాని ఇంతవరకు అలాంటివి ఏవీ ప్రజల దృష్టికి రాలేదు. తాజాగా ఫోరెన్సిక్ లాబ్ అగ్ని ప్రమాదానికి గురి కావడంతో ఎన్ని కేసుల ఆధారాలు పోయాయో చెప్పలేని పరిస్థితి. ప్రజలు నిజానికి ఇలాంటి వాటిని పట్టించుకుని ఓట్లు వేసే పరిస్థితి ఉందా అన్నది సందేహం.
ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడానికి ముందు ఆయన పై వచ్చిన కేసు కూడా తీవ్రమైనదే. జైలుకు కూడా వెళ్లవలసి వచ్చింది. అయినా తర్వాత కాలంలో రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. కాలం కలిసి వచ్చి ముఖ్యమంత్రి కూడా అయ్యారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హామీలు అమలు చేయడం, నాలుగు మంచి పనులు చేయడం ద్వారా ప్రజల ఆదరణ చూరగొనడానికి ప్రయత్నం చేస్తే కీర్తి వస్తుంది. అలా కాకుండా కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను దూషించుకుంటూపోతే ఏమి కలిసి వస్తుంది? రాజకీయ విమర్శలు చేయడం తప్పు కాదు.కాని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల రాజకీయ పార్టీల మధ్య ద్వేషాలు పెరుగుతాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అచ్చంగా ఇదే తరహాగా ఉన్నవి, లేనివి ఆరోపణలు చేస్తూ అసలు విషయాలను పక్కదారిని పట్టించడానికి, జగన్‌పై విషం కక్కడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఆయన శిష్యుడైన రేవంత్ కూడా అదే ధోరణిలో వెళుతున్నారా అన్న అనుమానం వస్తుంది. తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు అంటూ ఆరోపణలు చేసి చంద్రబాబు అప్రతిష్టపాలయ్యారు. తెలంగాణలో రేవంత్ జడ్జిల ఫోన్లు, సినిమా తారల ఫోన్లు, చివరికి మొగుడు ,పెళ్లాల ఫోన్లు టాప్ అయ్యాయని అంటున్నారు. ఇది బట్టకాల్చి మీద వేయడమా? లేక వాస్తవాలు ఉన్నాయా? సినిమా తారల ఫోన్లు టాప్ కాలేదని పోలీసు అధికారులే స్పష్టం చేసినట్లు కేటీఆర్ అంటున్నారు. అలాగే అంతకన్నా సంచలనం జడ్జిల ఫోన్లు టాప్ అయ్యాయని ఒక ముఖ్యమంత్రి అంటే అది సీరియస్ అంశం అవుతుంది. బహుశా రాజకీయ ప్రసంగంగా పరిగణించి న్యాయ వ్యవస్థ పట్టించుకుని ఉండకపోవచ్చు. ఎదుటి వారిపై వ్యక్తిత్వ హననం అన్నది చంద్రబాబు విధానం. దానినే రేవంత్ కూడా ఫాలో అవుతున్నారా అన్న సంశయం కలుగుతుంది.
కేసీఆర్ జాతిపిత కాదని విమర్శ చేసినంతవరకు ఫర్వాలేదు కాని, ‘‘నీ జాతికి పిత’’ అనడం బాగోలేదు. కేసీఆర్‌ను జైలులో వేశాక బీజేపీ ఓట్లు వేయాలని రేవంత్ అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేసింది తెలంగాణ ప్రభుత్వం కదా!కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయలేదు? దీనిని బీజేపీ తప్పుపడుతుంటే కేంద్రం సీబీఐ విచారణ చేయాలని రేవంత్ అంటున్నారు. ఇది ఒక గేమ్ గా మారింది.తెలంగాణలో ఎవరు ఎవరితో రహస్య అవగాహనతో ఉన్నారో తెలియని రీతిలో రాజకీయాలు సాగుతున్నాయన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడుతోంది. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన విమర్శలకు బదులుగా తనను రేవంతుద్దీన్ అంటే సంతోషమేనని బదులు ఇచ్చారు.
దీనివల్ల కాంగ్రెస్‌కు కొంత నష్టం, కొంత లాభం ఉండవచ్చు. కేసీఆర్‌కు కేటీఆర్ దొంగపుత్రుడు అయితే, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దత్తపుత్రుడు అని విమర్శించారు. కిషన్ రెడ్డి కిషన్ రావుగా మారి కేసీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. గతంలో చంద్రబాబు కూడా ఇలాటి డైలాగులనే వాడి ప్రధాని మోడీకి జగన్ దత్తపుత్రుడు అంటూ విమర్శలు చేసేవారు. కాని సీన్ కట్ చేస్తే చంద్రబాబు వెళ్లి మోడీతో పొత్తు పెట్టుకున్నారు.తెలంగాణలో అలా జరుగుతుందని కాదు..రాజకీయ విమర్శల బదులు వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఇలాంటివి ప్రస్తావనకు వస్తాయి.
ఈ రకమైన వ్యాఖ్యల వల్ల రేవంత్ అమెరికా వెళ్లి నేర్చుకువచ్చింది ఏమిటి అన్న ప్రశ్నకు తావిస్తున్నారు.రేవంత్‌పై కేటీఆర్ కొన్ని అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. వాటిపై రేవంత్ వివరణ ఏమిటో తెలియదు.అయితే కేటీఆర్ కూడా రేవంత్ ను ఘాటుగానే విమర్శిస్తున్నారు. దానిని కూడా సమర్ధించజాలం. అయినా, ముఖ్యమంత్రి గా ఉన్నది రేవంత్ కనుక ఆయన మరింత బాధ్యతగా ఉంటే రాజకీయాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి.కాని ఓట్ల వేటలో రాజకీయాలలో ప్రమాణాలు ఆశించడం అత్యాశే అవుతుందా!

కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


