‘అమెరికాతో యుద్ధం వచ్చినా..’..ఇరాన్ కీలక ప్రకటన | Iran Refuses To Halt Uranium Enrichment, Asserts Sovereign Rights Amid Talks With US, More Details Inside | Sakshi
Sakshi News home page

‘అమెరికాతో యుద్ధం వచ్చినా..’..ఇరాన్ కీలక ప్రకటన

Feb 9 2026 7:03 AM | Updated on Feb 9 2026 10:31 AM

Does Not Scare UsIran On US Military Deployment

టెహ్రాన్‌: అమెరికాతో జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఇరాన్ ఒక కీలక ప్రకటన చేసింది. తమ దేశ అణు కార్యక్రమాల్లో భాగంగా చేపడుతున్న యురేనియం శుద్ధి ప్రక్రియను ఎలాంటి పరిస్థితుల్లోనూ నిలిపివేయబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. అమెరికాతో యుద్ధం ముంచుకొచ్చినా సరే, తమ సార్వభౌమత్వానికి సంబంధించిన ఈ విషయంలో ఎప్పటికీ రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. తమ ప్రవర్తనను శాసించే హక్కు ఏ దేశానికీ లేదని, శాంతి చర్చల పేరుతో తమను లొంగదీసుకోవాలని చూడటం అస్సలు సాధ్యం కాదని అబ్బాస్ అరాగ్చీ పునరుద్ఘాటించారు.

తమ దేశ సరిహద్దుల్లో అమెరికా తన సైనిక బలాన్ని పెంచడంపై ఇరాన్ ఏమాత్రం ఆందోళన చెందడం లేదని అరాగ్చీ పేర్కొన్నారు. ముఖ్యంగా అరేబియా సముద్రంలో అమెరికాకు చెందిన యుద్ధనౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ మోహరింపు తమను ఎంతమాత్రం భయపెట్టలేదని  అన్నారు. అమెరికా ఒకవైపు చర్చలు జరుపుతూనే, మరోవైపు సైనిక చర్యల ద్వారా బెదిరింపులకు పాల్పడటం వారి ద్వంద్వ నీతిని నిదర్శనమని విమర్శించారు. అగ్రరాజ్యం అనుసరిస్తున్న ఈ ధోరణి  కారణంగా చర్చలపై తమకు నమ్మకం సడలుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఒమన్ వేదికగా ఇరాన్- అమెరికా ప్రతినిధుల మధ్య జరుగుతున్న చర్చల్లో వాషింగ్టన్ చిత్తశుద్ధిపై ఇరాన్ అనుమానం వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై సుంకాలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, చమురు ఎగుమతులను అడ్డుకునేందుకు ఆంక్షలు విధించడం చర్చల ప్రక్రియకు విరుద్ధమని అరాగ్చీ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తమ వ్యూహాత్మక భాగస్వాములైన చైనా, రష్యాతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, అమెరికా తీరును అనుసరించి చర్చల కొనసాగింపుపై ఒక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇరాన్ అణు బాంబు తయారీ కోసం ప్రయత్నిస్తున్నదన్న పాశ్చాత్య దేశాలు, ఇజ్రాయెల్ ఆరోపణలను అరాగ్చీ తోసిపుచ్చారు. ఇరాన్‌పై ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయడమే ఈ చర్చల్లో తమ ప్రధాన లక్ష్యమని, దానికి ప్రతిగా అణు కార్యక్రమాల విషయంలో నమ్మకాన్ని కలిగించే చర్యలు తీసుకుంటామన్నారు. 

ఇది కూడా చదవండి: Bangladesh: కీలక నేత కన్నుమూత.. ఎన్నికల ముందు విషాదం

Advertisement
 
Advertisement
Advertisement