నోబెల్ విజేతకు ఏడున్నరేళ్ల జైలుశిక్ష | Narges Mohammadi Sentenced Seven Years Jail | Sakshi
Sakshi News home page

Narges Mohammadi: పలుమార్లు జైలుకి.. ఇప్పుడు మరోసారి!

Feb 9 2026 4:58 AM | Updated on Feb 9 2026 4:58 AM

Narges Mohammadi Sentenced Seven Years Jail

నోబెల్ శాంతి పురస్కార గ్రహీత నర్గెస్ మొహమ్మదికి ఇరాన్ కోర్టు మరోసారి కఠిన శిక్ష విధించింది. తాజా తీర్పు ప్రకారం ఏడున్నరేళ్ల జైలు శిక్ష పడింది. దేశం విడిచి వెళ్లకుండా రెండేళ్ల పాటు నిషేధం విధించారు. ఓవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తుండగానే ఈ తీర్పు వచ్చింది. ఇది వెలువడిన వెంటనే అంతర్జాతీయంగా పెద్ద చర్చ మొదలైంది. ఈ మేరకు నర్గెస్ న్యాయవాది మోస్తఫా నీలీ పలు వివరాలు వెల్లడించారు.

నర్గెస్ లాయర్ చెప్పిన ప్రకారం.. ఈమెపై ప్రభుత్వం రెండు ప్రధాన ఆరోపణలు మోపింది. దేశ భద్రతకు వ్యతిరేకంగా కుట్రలు చేయడం, సమావేశాలు నిర్వహించారనే ఆరోపణపై ఆరేళ్లు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణపై ఏడాదిన్నర జైలు శిక్ష విధించారు. మొత్తంగా ఏడున్నరేళ్లు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయమై ఇరాన్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళల హక్కుల కోసం నర్గెస్‌ మొహమ్మది చాన్నాళ్లుగా పోరాడుతున్నారు. ఈ విషయమై ఇదివరకే పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. శిక్ష కూడా అనుభవించారు. కొరడా దెబ్బలు సైతం ఓర్చుకున్నారు. గత మూడు దశాబ్దాలుగా నర్గెస్ చేస్తున్న పోరాటానికి గుర్తింపుగానే 2023లో ఈమెని నోబెల్‌ శాంతి బహుమతి వరించింది. జైల్లో ఉండగానే నోబెల్‌కు ఎంపికవడం విశేషం.

హ్యూమన్ రైట్స్ వాచ్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థలు.. నర్గెస్ మొహమ్మదిని తక్షణమే విడుదల చేయాలని, ఆమె తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆమె ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని హెచ్చరిస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం కూడా మానవ హక్కుల్ని గౌరవించాలని ఇరాన్ ప్రభుత్వాన్ని కోరుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement