తకాయిచీ అపూర్వ విజయం | Japan PM Takaichi on course to win snap election by landslide | Sakshi
Sakshi News home page

తకాయిచీ అపూర్వ విజయం

Feb 9 2026 4:54 AM | Updated on Feb 9 2026 4:54 AM

Japan PM Takaichi on course to win snap election by landslide

జపాన్‌ ఎన్నికల్లో ఎల్డీపీ రికార్డు

దిగువ సభలో 316 సీట్లు కైవసం

అభినందనలు తెలిపిన మోదీ 

టోక్యో: జపాన్‌ పార్లమెంట్‌కు ఆదివారం జరిగిన కీలకమైన ఎన్నికలో ప్రధానమంత్రి సనే తకాయిచీ ఘన విజయం సాధించారు. పార్లమెంట్‌లో శక్తివంతమైన దిగువ సభలోని 465 సీట్లకుగాను మూడింట రెండొంతుల సీట్లు అవసరం కాగా, తకాయిచీ సారథ్యంలోని లిబరల్‌ డెమోక్రాటిక్‌ పారీ్ట(ఎల్‌డీపీ) ఆ మార్కును సునాయాసంగా అధిగమించింది. ఇప్పటికే 316 సీట్లలో గెలుపు బావుటా ఎగరేసింది. 

1955లో ఈ పార్టీని స్థాపించిన తర్వాత లభించిన అతిపెద్ద విజయమిది. 1986లో నకసొనె హయాంలో మాత్రమే ఎల్డీపీ 300 సీట్లను సొంతంగా గెలుచుకుంది. కాగా, జపాన్‌ మొట్టమొదటి మహిళా ప్రధానిగా గతేడాది అక్టోబర్‌లో పగ్గాలు చేపట్టిన తకాయిచీ, అధికార ఎల్డీపీలో ప్రజామోదం కలిగిన ఏకైక నేతగా ఉన్నారు. గత ఏడు దశాబ్దాలుగా ఈ పారీ్టయే దాదాపుగా అధికారంలో కొనసాగింది. ఇటీవల కాలంలో వరుస కుంభకోణాలు ఈ పార్టీ ఇమేజీని తీవ్రంగా దెబ్బతీశాయి. 

ఈ సమయంలో ఆమె విధానాలు, పాలనకు ప్రజామోదం లభించింది. ఇదే అవకాశంగా ఆమె కేవలం మూడు నెలల్లోనే పార్లమెంట్‌ను రద్దు చేసి, ఆకస్మికంగా ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలను తన పాలనపై రెఫరెండంగా ఆమె ప్రకటించుకున్నారు. చైనాతో ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆమె పలు చర్యలను ప్రకటించారు. 

అమెరికాతో మరింత సన్నిహిత సంబంధాలను ఆమె కోరుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు తకాయిచీ విధానాలకు ప్రజలిచ్చిన సానుకూల సంకేతంగా చెబుతున్నారు. తన విధానాలను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నానని ఫలితాలు వెలువడిన అనంతరం తకాయిచీ ప్రకటించారు. అధికార పక్షానికే మెజారిటీ సీట్లు దక్కుతాయని ఎగ్జిట్‌ పోల్స్‌ వేసిన అంచనా నిజమైంది. తకాయిచీ సాధించిన విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. తకాయిచీకి అభినందనలు తెలియజేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement