చైనాకు ‘పాండా’ నేస్తాల తరలింపు
ముక్కలైన జపాన్ గుండె..
అది కేవలం ఒక జూ కాదు.. ఒక దేశపు ఉద్వేగం.. ఆదివారం ఉదయం నుంచే టోక్యోలోని ‘ఉయెనో జూ’వెలుపల వేలాది మంది ప్రజలు నిలబడి ఉన్నారు. వారి చేతుల్లో కెమెరాలు, పాండా బొమ్మలు ఉన్నాయి.. కానీ కనులు మాత్రం వర్షిస్తున్నాయి. ఆఖరి నిమిషం.. కేవలం 60 సెకన్ల పాటు తమ ప్రియమైన కవల పాండాలను కళ్లారా చూసుకునేందుకు వారు పడుతున్న ఆరాటం వర్ణనాతీతం. ఎందుకంటే, ఆ నిమిషం తర్వాత జపాన్ గడ్డపై పాండాల శకం శాశ్వతంగా ముగిసిపోతోంది..
సెకనులో.. చెదిరిన కల
వీటిని ఆఖరిసారిగా చూసుకునేందుకు.. ఆన్‌లైన్ లాటరీలో ఒక్కో టికెట్ కోసం 24 మంది పోటీ పడ్డారంటే ఆ పాండాలంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. ఆఖరిసారిగా.. వెదురు ఆకులను నములుతూ, అమాయకంగా అటూ ఇటూ తిరుగుతున్న కవల పాండాలు.. షా జియావో, లీలీలను చూసి అభిమానులు దుఃఖాన్ని నియంత్రించుకోలేకపోయారు. టికెట్ దొరకని వేలాది మంది జనం జూ గోడల బయటే నిలబడి, పాండాల ఉనికిని అనుభూతి చెందుతూ మౌనంగా వీడ్కోలు పలికారు.
రాజకీయాల మధ్య నలిగిన అమాయక ప్రేమ..
పాండాల తరలింపు వెనుక ఒక విషాదకరమైన రాజకీయ నేపథ్యం ఉంది. 1972లో చైనా–జపాన్ దౌత్య సంబంధాల పునరుద్ధరణకు గుర్తుగా వచ్చిన ఈ పాండాలు.. ఇప్పుడు అవే దౌత్య సంబంధాలు క్షీణించడం వల్ల వెళ్లిపోతున్నాయి. తైవాన్ విషయంలో జపాన్ ప్రధాని సనాయే తకైచి చేసిన వ్యాఖ్యలు చైనాకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. సంబంధాలు దెబ్బ తినడంతో, పాండాల లీజు ఒప్పందాలను పొడిగించడానికి చైనా నిరాకరించింది. ఫలితంగా, జనవరి 27న ఈ కవలలు చైనాకు తిరిగి వెళ్లిపోతున్నాయి. మంగళవారం ఈ కవలలు చైనా వెళ్లిపోయాక, జపాన్‌లో ఒక్క పాండా కూడా ఉండదు. అర్ధ శతాబ్దపు చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.
అవి మా సొంత బిడ్డలు!
‘నేను ఈ పాండాల కోసం 15 ఏళ్లలో ఒక కోటి ఫొటోలు తీశాను. నా సొంత పిల్లలే నన్ను వదిలి వెళ్తున్నట్టు ఉంది’.. అని తకాహిరో అనే అభిమాని భారమైన హృదయంతో చెప్పిన మాటలు అక్కడున్న అందరినీ కదిలించాయి. ‘ఈ పాండాలు కేవలం జంతువులు కావు, మా కుటుంబ సభ్యులు. అవి మాకు ఎంతో ఓదార్పునిచ్చాయి’.. అంటూ 54 ఏళ్ల మెచికో కన్నీరు పెట్టుకుంది. పాండాల తరలింపుతో ఏటా సుమారు రూ.1,100 కోట్ల ఆదాయాన్ని జపాన్ కోల్పోనుంది. వ్యాపారులు తమ దుకాణాల బోర్డులు మార్చడానికి నిరాకరిస్తూ, ‘అవి మళ్లీ తిరిగి వస్తాయి’.. అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మూగబోయిన జపాన్ హృదయం!
ప్రేమకు, ఓదార్పుకు గుర్తుగా నిలిచిన ఈ మూగజీవాలు.. దేశాల మధ్య సరిహద్దు గొడవలకు బలైపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంగళవారం వీటిని తరలించే విమానం గాల్లోకి ఎగిరినప్పుడు, దాని రెక్కలు ఒక దేశపు 54 ఏళ్ల జ్ఞాపకాలు, కోట్లాది మంది భారమైన హృదయాలను కూడా మూటగట్టుకుని వెళ్లిపోతాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్


