breaking news
Sanae Takaichi
-
జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు
జపాన్ ప్రధాని సనాయే తకాయిచీ భారత పర్యటన రెండు ప్రత్యేక నేపథ్యాల మధ్య జరిగింది. ఒకటి ఆర్థికమైనది, మరొకటి రక్షణ పరమైనది. ఈ రెండు నేపథ్యాలు ఇరు దేశాలకూ వర్తించేవే. అదే సమయంలో ఒకటి గుర్తించాలి. ఆర్థికమైన వర్తింపు ఉభయులకూ సమానమే కాగా, రక్షణ కోణంలో కొన్ని సామ్యాలతో పాటు కొన్ని తేడాలున్నాయి. ప్రధాని మోదీ, తకాయిచీ మధ్య ఢిల్లీలో ఈ నెల 2న జరిగిన చర్చలు, ఒప్పందాలు కూడా ఈ పరిస్థితులన్నింటిని ప్రతిఫలించాయి. వేర్వేరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు, వాటి అభివృద్ధి ప్రయత్నాలు ఎప్పుడూ ఉండేవే. ఆర్థిక వ్యవస్థల రీత్యా ప్రముఖమైనవి అయిన ఇండియా, జపాన్ వంటి దేశాల మధ్య ఇవి ఇంకా బహు ముఖంగా ఉంటాయి. ఆ మేరకు వేర్వేరు రంగాలలో వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త ఒప్పందాలు ఎల్లప్పుడూ ఉన్నవే. అటువంటి స్థితిలో కొత్తగా ఏర్పడిందంటున్న ప్రత్యేక నేపథ్యం ఏమిటి?ప్రత్యేక నేపథ్యంఈ ప్రశ్నకు సమాధానం చర్చల అనంతరం ఇరువురు ప్రధానులు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఉంది. అది, ‘‘నేటి అనిశ్చిత పరిస్థితుల మధ్య ఆర్థిక, ఇంధన భద్రతల ప్రాముఖ్యతను రెండు దేశాలు పూర్తిగా అర్థం చేసుకోవటం. దానిని దృష్టిలో ఉంచు కుని ఆర్థిక భద్రత కోసం ఒక ఉమ్మడి రోడ్ మ్యాప్‌ను రూపొందించటం’’. నేటి అనిశ్చిత పరిస్థితులన్నవి కేవలం ఇరాన్ యుద్ధం వల్ల తలెత్తినవి కావు. భారత్, జపాన్‌లతో పాటు ప్రపంచానికంతా అటువంటి ఒడిదుడుకులు ఉక్రెయిన్ యుద్ధంతో నాలుగేళ్ల క్రితం మొదలై, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు, కొత్త వాణిజ్య ఒప్పందాల కోసం ఒత్తిడుల మీదుగా ఇరాన్ యుద్ధం వరకు సాగివస్తున్నాయి. ఇవి స్థూలంగా పైకి కనిపించేవి. కొంత లోతుకు వెళితే,ప్రపంచ ఆర్థిక రంగానికి అనిశ్చితిని సృష్టిస్తున్న పరిణామాలు మరికొన్ని ఉన్నాయి. అవి, రెండవ ప్రపంచ యుద్థం తర్వాత బ్రెట్టన్‌వుడ్స్ వ్యవస్థలతో మొదలై ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్యాలను, ఆర్థిక సంస్కరణలను సులభతరం చేసిన నియమ నిబంధనలు ఇటీవల కొద్ది సంవత్సరాలుగా భంగపడుతుండటం. ఆ వ్యవస్థలను, నిబంధనలు సృష్టించిన దేశాలే వాటిని బలహీన పరుస్తుండటం. వాటి ప్రతికూల ప్రభావాలు మధ్యమ స్థాయి దేశాలపై అట్లుంచి, మొదటి 10 స్థానాలలో గల భారత, జపాన్ వంటి ఆర్థిక వ్యవస్థలకు సైతం అనిశ్చితిని కల్పిస్తున్నది. ఇది ఇరాన్ యుద్ధంతో మరింత తీవ్రమైంది. ఇండియా, జపాన్ గత అక్టోబర్‌లో తకాయిచీ అధికారానికి రాక ముందు కూడా పలు ఒప్పందాలు చేసుకున్నాయి. మోదీ ప్రభుత్వంపై ఇతరత్రా ఎన్ని విమర్శలైనా ఉండవచ్చు గాక. కానీ, వేర్వేరు దేశాలతో, ప్రాంతీయ ఆర్థిక కూటములతో వీలైనన్ని ఆర్థిక ఒప్పందాల కోసం నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు అనిశ్చితులు ఉండగా, మరొకవైపు ఈ పోటీ ప్రపంచం, దేశంలో అంతర్గతంగా ఎదురవుతున్న ఆర్థిక ఒడిదుడుకులు ఈ విధా నాల వెనుక ముప్పేటగా పనిచేస్తున్నాయని చెప్పాలి. అసమ వాణిజ్యంజపాన్ పరిస్థితి భారత్ కన్న కొంత మెరుగైనప్పటికీ పైన పేర్కొన్న పరిణామాల మధ్య సమస్యలు తప్పటం లేదు. వాటికి ఇటీవల మరొకటి తోడవుతున్నది. అది, చైనాతో పెరుగుతున్న వివాదాలు. తైవాన్ విషయమై తకాయిచీ వైఖరికి ఆగ్రహించిన చైనా, పలు విధాలైన చర్యలతో జపాన్ ఆర్థిక రంగాన్ని వీలైనంత కుంటుపరచటం మొదలు పెట్టింది. మరొకవైపు ఇండో–పసిఫిక్ రక్షణ బాధ్యతల నుంచి అమెరికా కనీసం పాక్షికంగా ఉపసంహరించుకుంటూ ఆ బరువును ఆ ప్రాంతంలోని జపాన్ తదితర మిత్ర దేశాలపై మోపుతుండటంతో జపాన్ సైనిక వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక భారాలన్నీ మోసేందుకు తకాయిచీ ప్రభుత్వం ఆసియా నుంచి యూరప్ వరకు వేర్వేరు దేశాలతో శరవేగంగా ఆర్థిక ఒప్పందాలు చేసుకుంటున్నది. ఈ విధంగా ఆర్థిక అనిశ్చితులు, వాటిని తట్టుకునే చర్యలన్నవి భారత్, జపాన్‌లకు ఒకే విధంగా ఉన్నట్లు గమనించవచ్చు. కనుక, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో 2వ తేదీన జరిగిన ఆర్థిక ఒప్పందాలన్నీ హర్షించవలసినవే. ఒప్పంద వివరాలు వెంటనే తెలియరాలేదు గానీ తకాయిచీ వెంట సుమారు 100 జపనీస్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు రావటాన్ని బట్టి చర్చలు ఏ స్థాయిలో జరిగి ఉంటాయో ఊహించవచ్చు. ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్వయంగా చెప్పిన దానిని బట్టి, రెండు దేశాల మధ్య గత సంవత్సర కాలంలో 100కు పైగా వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. వాటివల్ల జపాన్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇది గాక వచ్చే పదేళ్లలో రెట్టింపు జపనీస్ కంపెనీలను, 10 ట్రిలియన్ల జపనీస్ యెన్ పెట్టుబడులను (మారకం విలువ 1 రూపాయికి 1.69 యెన్లు) ఆకర్షించటం లక్ష్యమన్నారు. ఇండియాలో ఇప్పటికే 1,400కు పైగా జపాన్ కంపెనీలు, 5,000కు పైగా వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఈ సంఖ్యలు రెట్టింపు కావటం ఎట్లున్నా, ఇరువురు ప్రధానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులలో ఎంత విస్తరిస్తే అంత మేలు కలుగుతుంది. అదే సమయంలో భారత ప్రభుత్వంపై కొన్ని పెద్ద బాధ్యతలు కూడా ఉంటాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సాలీనా ఎగుమతి దిగుమతుల విలువ 27 బిలియన్ డాలర్ల మేర ఉంది. అది సంతృప్తి కరమైనదే. కానీ, ఇండియా ఎగుమతులు కేవలం 6 బిలియన్లు, దిగుమతులు 21 బిలియన్లు (మూడున్నర రెట్లు) అంటే ఆ వివరాలు ఎంత అసంతృప్తికరమైనవో వేరుగా చెప్పనక్కరలేదు. ఇంకా చెప్పుకోవాలంటే, భారతదేశపు ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 6వ ర్యాంకుకు చేరినప్పటికీ, సాలీనా వాణిజ్య లోటు 10 బిలియన్ డాలర్లకు మించి ఉంది. జరగాల్సిన కృషిఆర్థిక రంగానికి సంబంధించి జపాన్ ప్రధానితో జరిగిన చర్చలలో చమురు తదితర ఇంధన భద్రతలు, ప్రత్యామ్నాయ ఇంధ నాలు, అరుదైన లోహాలు, ఖనిజాల ప్రస్తావనలు అనివార్యంగా వచ్చాయి. వాటికి అనుబంధంగా ఇండో–పసిఫిక్ సముద్ర మార్గాల ద్వారా స్వేచ్ఛాయుత రవాణాకు అవకాశాలను కల్పించుకోవటం. ఈ నిర్దిష్టమైన అంశాలన్నీ ఇండియా, జపాన్‌లతో పాటు అన్ని దేశాలలో చర్చలు జరుగుతున్నవే. అయితే ఇవి ఎంత కీలకమైనవో అంత క్లిష్టమైనవి కూడా. వీటి గురించి ఎవరికి వారు అంతర్గత కృషి చేయటం, ఇతరుల సహకారంతో సామరస్య పరిష్కారాలు కనుగొనటం రెండూ అవసరం. ఈ కొత్త పరిస్థితులలో ఆ ప్రయత్నాలు లోగడ కన్నా ఎక్కువగా జరగక తప్పదు. చర్చలలో ప్రస్తావనకు వచ్చిన మరొక కీలకాంశం రక్షణ. ఇందుకు రెండు కోణాలున్నాయి. ఒకటి, ఇండో–పసిఫిక్ ద్వారా సముద్రయానాలు. ఇది రెండు దేశాలకు సంబంధించినది. రెండు, ఈ మార్గాలలో, అంతకన్నా ఎక్కువగా పసిఫిక్‌లో చైనాను కట్టడి చేసే విషయం. ఈ విధమైన కట్టడి అవసరం ఇండియాకు పరిమిత స్థాయిలో ఉండగా, జపాన్‌కు, దానిని తమ సమగ్ర వ్యూహంలో భాగంగా చేసుకున్న అమెరికాకు అపరిమిత స్థాయిలో ఉంది. అమెరికా ఇటీవల ‘క్వాడ్’ ప్రత్యక్ష బాధ్యతల నుంచి నెమ్మదిగా తగ్గుతూ జపాన్, ఆస్ట్రేలియాల బాధ్యతను పెంచుతుండటంతో కొత్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ బాధ్యతను తలకెత్తుకున్న తకాయిచీ రక్షణ వ్యయాన్ని పెంచుతూ, పలుదేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ రక్షణ విషయాలైతే ఢిల్లీలో ‘చర్చకు’ వచ్చాయి గానీ, ‘ఒప్పందాలు’ లేకపోవటం ఇండియా విధానాలకు అనుగుణమైనదేనని చెప్పాలి. టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
జపాన్‌తో ‘మిత్రలాభం’
శిఖరాగ్ర సమావేశాలకు దౌత్యంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. రెండు దేశాల మధ్య ఆ స్థాయి సమావేశం జరిగిందంటే ఆ దేశాల అధినేతలు నేరుగా మాట్లాడుకుని, సంక్లిష్ట సమస్యల పరిష్కార సాధనకు కృషి చేస్తున్నారనీ, ఈ క్రమంలో ఎంతో జాప్యం చోటు చేసుకునే అధికారస్వామ్య ప్రమేయాన్ని అధిగమించదల్చుకున్నారనీ అర్థం. జపాన్ ప్రధాని సనే తకాయిచి మన దేశంలో మూడు రోజులు పర్యటించి శుక్రవారం వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీతో శిఖరాగ్ర సమావేశం జరిపారు. ఈ పర్యటనలో కృత్రిమ మేధ(ఏఐ), ఇంధనం, రక్షణరంగం, ఖనిజాల వెలికితీత తదితర రంగాల్లో 17 ఒప్పందాలు కుదిరాయి. ఇందులో రక్షణ సాంకేతికతల్లో అత్యంతాధునికమైన ‘యూనికార్న్’ ప్రాజెక్టు ఒప్పందం అన్నివిధాలా ప్రత్యేకమైనది. యుద్ధ నౌకలపై వేర్వేరు అవసరాల కోసం వినియోగించే ఉపగ్రహ కమ్యూనికేషన్, రాడార్, నావిగేషన్, రేడియో కమ్యూని కేషన్ వంటి పనుల కోసం విడివిడిగా యాంటెన్నాలుంటాయి. యుద్ధసమయాల్లో ఇవి చిక్కులు తెస్తాయి. శత్రువుల రాడార్లకు సులభంగా దొరికిపోతాయి. యూనికార్న్ సాంకే తికతలో ఈ యాంటెన్నాలన్నీ ఒకే ఒకదాన్లో ఒదిగిపోతాయి. శత్రు నౌకలకు చిక్కకుండా, వాటి ఆనుపానుల్ని తెలుసుకోవటంలో దీని పని తీరు అద్భుతం. వచ్చిపడే క్షిపణుల్ని చాలా ముందే పసిగట్టడం, ఎదురుదాడికి అవకాశం ఇవ్వటం దీని ప్రత్యేకత. ఈ యూనికార్న్ మాస్ట్‌లను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ద్వారా దేశీయంగా తయారు చేసేందుకు జపాన్ సంసిద్ధత తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం రక్షణ ఎగుమతుల జోలికి పోవద్దని జపాన్ తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవలే తకాయిచీ సడలించారు.అమెరికా విధిస్తున్న అడ్డగోలు సుంకాలు, పశ్చిమాసియాలో ఏర్పడిన అనిశ్చితిరెండు దేశాలనూ సమంగా పీడిస్తున్నాయి. ఈ దశలో పరస్పర సహకారం మరింతగా పెరిగితే ఈ పరిస్థితిని అధిగమించవచ్చునన్న అభిప్రాయం రెండు దేశాలకూ ఉంది. జపాన్‌తో మన సంబంధాలు విలక్షణమైనవి. రెండు దేశాల సంబంధాలను అభివర్ణించ టానికి దౌత్యంలో కొన్ని విశేషణాలుంటాయి. సహజమైన, ప్రత్యేకమైన, విశ్వసనీయ మైన, అనివార్యమైన... వంటివి అందులో కొన్ని. జపాన్‌తో మన సంబంధాల స్థాయిని తెలియజేయటానికి చాలామంది దౌత్యనిపుణులు వీటిని ఉపయోగిస్తారు.కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నం. ఎంత మెరుగైన సంబంధాలున్నా అవి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందాన ఉన్నాయి. ఇరుదేశాలమధ్యా సుహృద్భావం ఉంది. వేరే దేశాలతో ఏర్పర్చుకునే సంబంధాలకుండే రాజకీయ పరిమితులు కూడా ఇక్కడ లేవు. చైనాతో ఇరు దేశాలకూ ఉండే సమస్యలవల్ల వాటి మధ్య సాన్నిహిత్యానికి అవకాశాలెక్కువ. కానీ ఆసంబంధాలు తగినంతగా ఎదగలేదు. ఇరు దేశాలమధ్యా వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడి చాన్నాళ్లవుతున్నా వ్యాపార సంబంధాలు అంతంతమాత్రం. ద్వైపాక్షిక వాణిజ్యం 2,748 కోట్ల డాలర్లున్నా అందులో మన ఎగుమతుల విలువ కేవలం 600 కోట్ల డాలర్లు. మిగిలిందంతా జపాన్ నుంచి మనకొచ్చే దిగుమతుల వాటాయే. మన దేశానికి 1991 వరకూ జపాన్ అధికారిక అభివృద్ధి సాయం(ఓడీఏ) కింద ఆర్థిక సాయం అందించేది. ఢిల్లీ మెట్రో, ఈశాన్య రాష్ట్రాల సరుకు రవాణా కారిడార్ వంటి మౌలిక సదుపాయాల్లో జపాన్ ముద్ర ఉంది. కానీ పెట్టుబడులు పెట్టడంలో, వాణిజ్య విస్తరణ అంతంతమాత్రం. మన దేశంలో జపాన్ పెట్టుబడులు 4,000 కోట్ల డాలర్లు. కానీ తరచు లడాయివుండే చైనాలో దాని పెట్టుబడులు 13,000 కోట్ల డాలర్ల పైమాటే. చిన్న దేశం వియత్నాంలో కూడా జపాన్ 8,000 కోట్ల డాలర్ల మదుపు పెట్టింది. మన దేశంలో పనిచేస్తున్న జపాన్ సంస్థలు 1,400 మించవు. ఇందుకుభిన్నంగా థాయ్‌లాండ్‌లో జపాన్ సంస్థల సంఖ్య 6,000. మన మొత్తం వ్యాపార కార్యకలాపాల్లో జపాన్ కంపెనీల వాటా ఒక శాతం. అందులో కూడా ఆటోమొబైల్ వాటాయే అధికం. మన జనరిక్ మందులపై జపాన్‌లో అనేక రకాల ఆంక్షలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన ఫార్మా రంగం ఎన్నో విజయాలు సాధిస్తున్నా అక్కడ సమస్యలు తప్పడం లేదు. ఇలాంటి అవరోధాలు అధిగమించగలిగితే ఇరు దేశాల సంబంధాలూ మరింత మెరుగైన స్థాయికి చేర తాయి. తకాయిచీ పర్యటన ఆ దిశగా మంచి ముందడు గని చెప్పుకోవచ్చు. -
ఇక సుదృఢ ఆర్థిక బంధం
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకొనే దిశగా భారత్, జపాన్ కీలకమైన కార్యక్రమాలు, ఒప్పందాలను ప్రకటించాయి. ఆర్థిక భాగస్వామ్య చట్రం, సైనిక పరికరాలను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు రక్షణ ఒప్పందం సహా చమురు సంక్షోభాలను ఎదుర్కోవడానికి ఇంధన సంబంధాలను పెంపొందించే చర్యలు చేపట్టాలని నిర్ణయానికి వచ్చాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి సనే తకాయిచీ గురువారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, ఇంధనం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, రక్షణ, ప్రజల మధ్య సంబంధాల వంటి అంశాల్లో భారత్–జపాన్ సంబంధాలపై సమగ్ర సమీక్ష జరిపారు.ఇరుదేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఆర్థిక భద్రత, కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో సహకారం, ఇంధన సరఫరా వ్యవస్థలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని తీర్మానించారు. ఇండో–పసిఫిక్ పరిస్థితులపై అభిప్రాయాలు పంచుకున్నారు. అక్కడ చైనా సైనిక ప్రాబల్యం పెరుగుతుండడంపై చర్చించారు. నౌకా నిర్మాణం, విమానయానం, సరుకు రవాణా(లాజిస్టిక్స్) రంగాల్లో సహకారాన్ని సులభతరం చేయడానికి భారత్, జపాన్ ఒక మొబిలిటీ ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేశాయి. ఆర్థిక భద్రత, క్లీన్ ఎనర్జీ, కీలక సాంకేతికతలు, పరిశోధన–అభివృద్ధిపై ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలపై ఈ సందర్భంగా సంతకాలు జరిగాయి. భేటీ అనంతరం మోదీ, తకాయిచీ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఇండో–పసిఫిక్‌లో శాంతి, పురోగతికి మార్గం నేటి అనిశ్చిత పరిస్థితుల్లో ఆర్థిక, ఇంధన భద్రతల ప్రాముఖ్యతను భారత్, జపాన్ పూర్తిగా అర్థం చేసుకున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆర్థిక భద్రత కోసం ఒక ఉమ్మడి రోడ్‌మ్యాప్ రూపొందించామని తెలిపారు. దీనిద్వారా సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ వంటి వ్యూహాత్మక రంగాల్లో సప్లై చైన్లను పటిష్టం చేయబోతున్నామని వివరించారు.స్వేచ్ఛాయుతమైన, సుసంపన్నమైన, నియమ–ఆధారిత ఇండో–పసిఫిక్ ప్రాంతం తమ ఉమ్మడి ప్రాధాన్యత అని ఉద్ఘాటించారు. ఈ ప్రాంతంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య, మార్కెట్ ఆర్థిక వ్యవస్థలుగా ఈ రోజు అనేక కీలకమైన కార్యక్రమాలను ప్రారంభించామని వివరించారు. వీటి ద్వారా ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, పురోగతికి మార్గం సుగమం చేస్తామన్నారు. ఇంధన భద్రత రంగంలో కూడా ఇరుదేశాలు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాయని మోదీ పేర్కొన్నారు. భారత్, జపాన్ సంబంధాల పునాది.. రెండు దేశాల మధ్య గత ఏడాది కాలంలో 100కు పైగా కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా భారత్‌కు జపాన్ నుంచి 10 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు రానున్నాయని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. రాబోయే పదేళ్లలో జపాన్ నుంచి భారత్‌కు 10 ట్రిలియన్ల జపాన్ యేన్ల పెట్టుబడులను ఆకర్శించడం, భారత్‌లో జపనీస్ కంపెనీల సంఖ్యను రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని తేలి్చచెప్పారు. 17 వ్యూహాత్మక రంగాల్లో పెట్టుబడులు పెట్టుబడులు, ఆవిష్కరణల రంగంలో సహకారం ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించడంపై భారత్, జపాన్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయని సనే తకాయిచీ వివరించారు. 17 వ్యూహాత్మక రంగాల్లో పెట్టుబడుల ద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించడం, జపాన్ సప్లై చైన్లు, సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరచడం తన ధ్యేయమని ప్రకటించారు. భవిష్యత్తులో పరస్పర సహకారం, పెట్టుబడుల ద్వారా మన దేశాలను బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. భారత్, జపాన్ సంబంధాలకు 2027లో 75 ఏళ్లు పూర్తికాబోతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఇరుదేశాలు నిర్ణయానికొచ్చాయి. తకాయిచీ నా చిట్టి చెల్లెలు జపాన్ ప్రధాని తకాయిచీని నరేంద్ర మోదీ తన చిట్టి చెల్లెలుగా అభివర్ణించారు. ఆమె గొప్ప దార్శనిక, ప్రజాదరణ కలిగిన నాయకురాలు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం మోదీ, తకాయిచీ మీడియాతో మాట్లాడారు. భారత్–జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం భారత్‌కు తొలిసారిగా విచ్చేసిన తకాయిచీకి స్వాగతం పలకడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని వివరించారు. ఆమె జపాన్‌లోని నారా ప్రాంతానికి చెందినవారని, ఈ ప్రాంతం భారత్, జపాన్ల ఉమ్మడి బౌద్ధ వారసత్వానికి అత్యంత ముఖ్యమైన కేంద్రంగా నిలుస్తోందని తెలిపారు.మోదీ తనను చెల్లెలుగా భావిస్తూ సంబోధించడం పట్ల తకాయిచీ ఆనందం వ్యక్తంచేశారు. అన్నాచెల్లెళ్లుగా పనిచేస్తూ భారత్, జపాన్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామన్నారు. నిర్దేశించుకున్న ఉమ్మడి లక్ష్యాలను సాధించుకోవాలని, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అంగీకారానికి వచ్చినట్లు స్పష్టంచేశారు. భారత్‌లో తనకు అద్భుతమైన ఆతిథ్యం లభిస్తోందన్నారు. మోదీకి, భారత ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. -
జపాన్ ప్రధాని నా అందమైన చెల్లెలు: మోదీ
జపాన్ ప్రధాని సనాయె తకాయిచీని తన అందమైన సోదరిగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ చూపిన ఆప్యాయతకు చిరునవ్వుతో స్పందించిన జపాన్ ప్రధాని.. తనను అందమైన చెల్లెలు అని పిలిచినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ (గురువారం) ఢిల్లీలో ప్రధాని మోదీతో జపాన్ ప్రధాని భేటీ అయ్యారు. భారత్-జపాన్ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి.వచ్చే పదేళ్లలో రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా.. ఫార్మా, ఢిఫెన్స్, ఏఐ టెక్నాలజీ రంగాల్లో ఒప్పందాలు జరిగాయి. భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం మొదటిసారి భారతదేశాన్ని సందర్శిస్తున్న నా చెల్లెలు, జపాన్ ప్రధాని తకాయిచీకి నేను ఘన స్వాగతం పలుకుతున్నాను. ఆమె జపాన్‌కు మొదటి మహిళా ప్రధాన మంత్రి, అలాగే దూరదృష్టి గల నాయకురాలిగా ప్రజాదరణ పొందారంటూ ప్రధాని మోదీ ప్రశంసించారు.జపాన్ ప్రధాని మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం భారత్‌కు చేరుకున్నారు. భారత్‌లో ఇదే ఆమె మొట్టమొదటి అధికారిక పర్యటన. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పర్యటనకు వచ్చారు. ఇవాళ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో మోదీతో ఆమె సమావేశమయ్యారు. వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, పెట్టుబడులు తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. అలాగే 16వ ఇండియా–జపాన్ వార్షిక సదస్సులో పాల్గొన్నారు.భారత్‌లో అడుగుపెట్టిన ఫొటోను తకాయిచీ ‘ఎక్స్’లో షేర్ చేశారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. భారతదేశంలో తొలి పర్యటన సందర్భంగా తకాయిచీకి ఆతిథ్యం ఇవ్వడం తమకు ఎంతో సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు. భారత్–జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేలా గురువారం జరగబోయే సమగ్ర చర్చల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. మన ఉమ్మడి కృషి ద్వారా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్ధిని పెంపొందించడాన్ని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. -
భారత గడ్డపై అడుగుపెట్టిన జపాన్ ప్రధాని
జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన జూలై ఒకటి నుంచి 3 వరకు కొనసాగనుండగా.. ఇందులో భారత్-జపాన్ 16వ వార్షిక శిఖరాగ్ర సమావేశం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు భారత్‌కు వచ్చిన సనాయే తకైచి.. ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ సహకారం, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు, స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ వ్యూహం తదితర అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా అభిప్రాయాలు పంచుకోనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత సనాయే తకైచి భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటనతో భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.#WATCH | Japanese Prime Minister Sanae Takaichi arrives in Delhi on her Official Visit to India. Union Minister Dr Jitendra Singh receives her at the airport. pic.twitter.com/RNz9gnSIT4— ANI (@ANI) July 1, 2026 -
తొలిసారి భారత్‌కు జపాన్ ప్రధాని
ఢిల్లీ: జపాన్ ప్రధాని సనాయే తకాయిచి వచ్చే నెల(జులై) 1 నుంచి 3 వరకు భారత్ పర్యటనకు రానున్నారు. 16వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఆమె పాల్గొననున్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి, మరింత బలోపేతం చేసేందుకు చర్చలు జరగనున్నాయి.అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అభిప్రాయాలను కూడా రెండు దేశాల నాయకులు పంచుకోనున్నారు. జపాన్ ప్రధాని హోదాలో సనాయే తకాయిచి భారత్‌కు రావడం ఇదే తొలిసారి. గత ఏడాది ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టోక్యోలో జరిగిన 15వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు.ఆ పర్యటన అనంతరం ఇప్పుడు తకాయిచి భారత పర్యటన చేపట్టడం, భారత్-జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలన్న ప్రధాన అజెండాగా ఈ భేటీ సాగనుంది. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం వంటి అంశాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై నేతలు చర్చించనున్నట్లు సమాచారం. -
జపాన్ అనూహ్య నిర్ణయం.. 80 ఏళ్ల నియమానికి స్వస్తి!
జపాన్ ప్రధాని సనాయే తకైచీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. 80 ఏళ్ల రాజ్యాంగ నియమానికి స్వస్తి పలుకుతూ ఇతర దేశాలకు యుద్ధ విమానాలు సహా ఆయుధాలను విక్రయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవలి భౌగోళిక రాజకీయ పరిణామాలు, తమ సైన్యం విస్తృత ప్రపంచంతో వ్యవహరించే తీరుపై జపాన్ తన దృక్పథాన్ని మార్చుకునేలా చేశాయి. అయితే ఆయుధాల విక్రయంలో జపాన్ కొన్ని కఠిన నిబంధనలు విధించింది. ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు కట్టుబడి ఉండే దేశాలకు మాత్రమే ఆయుధాలను విక్రయిస్తామని ప్రధాని తకైచి స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఏ దేశం కూడా తన రక్షణను తాను ఒంటరిగా చూసుకోలేదు. అందుకే ఇతర దేశాల సహకారం కూడా అవసరం’ అని తకైచి పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి తర్వాత జపాన్ కొత్త రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. రాజ్యాంగ నియమం ప్రకారం ఆయుధాల ఎగుమతిపై కఠిన నిషేధాన్ని విధించింది. అయితే మారుతుఉన్న అంతర్జాతీయ భద్రతా సమీకరణాల దృష్ట్యా జపాన్ ప్రధాని సనాయే తకైచి ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆయుధ మార్కెట్లో తాము ఏం విక్రయిస్తామనేది అధికారికంగా జాబితాను ప్రకటించనప్పటికీ, ఫైటర్ జెట్లు, క్షిపణులు, అత్యాధునిక యుద్ధనౌకలను విదేశాలకు విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి సుమారు 17 దేశాలు జపాన్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడానికి అర్హత సాధించినట్లు జపాన్ మీడియా స్పష్టం చేసింది. పాత నియమాల ప్రకారం జపాన్ కేవలం నిఘా పరికరాలు, మైన్ స్వీపింగ్ వంటి ప్రాణాంతకం కాని సామగ్రిని మాత్రమే ఎగుమతి చేసేది. కానీ ఇప్పుడు ఏకంగా ఫైటర్ జెట్ల విక్రయానికి సిద్ధమవ్వడం ద్వారా అమెరికా, రష్యా, చైనా వంటి ఆయుధ దిగ్గజ దేశాలకు జపాన్ గట్టి పోటీ ఇవ్వబోతోంది. -
శాంతిదూత డొనాల్డ్ ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జపాన్ మహిళా ప్రధాని సనే తకాయిచి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలో శాంతిని నెలకొల్పే సామర్థ్యం ఆయనకు ఉందని చెప్పారు. ట్రంప్‌ను శాంతిదూతగా అభివరి్ణంచారు. హార్మూజ్ జలసంధిలో చమురు నౌకల రక్షణకు యుద్ధ నౌకలను పంపించడానికి జపాన్ ముందుకు రాలేదంటూ రుసరుసలాడుతున్న ట్రంప్ ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రయతి్నంచారు. అమెరికా అధ్యక్షుడితో సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామంటూ సంకేతాలిచ్చారు. తకాయిచి గురువారం వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా యుద్ధంపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాలు చేపట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తకాయిచి స్పష్టంచేశారు. తకాయిచి నాయకత్వాన్ని ట్రంప్ కొనియాడారు. ఆమె బహుళ ప్రజాదరణ కలిగిన శక్తివంతురాలైన నేత అంటూ ప్రశంసించారు. ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు జపాన్ అందించే సాయంపై వారు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ యుద్ధంలో జపాన్ సహకారాన్ని ట్రంప్ కోరుతున్నారు. షెడ్యూల్ ప్రకారం డొనాల్డ్ ట్రంప్ త్వరలో చైనాలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనకు ముందుకు ఆయన జపాన్ ప్రధానమంత్రితో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. -
విన్స్మోర్
‘నీ దగ్గర సైన్యం లేదు... మరచిపో... నీ దగ్గర ఆయుధం లేదు... మరచిపో... అయితే ఆశ... అనే అద్భుతాన్ని మాత్రం ఎప్పుడూ మరచిపోవద్దు. ఆ ఆశే నీ ఆయుధం అవుతుంది... సైన్యం అవుతుంది’... అనేది జపాన్ ప్రఖ్యాత నాయకుడు షింజో అబే మాట. ఆ మాటే సనై తకాయిచికి ధైర్యాన్నిచ్చింది. ‘జపాన్ ఐరన్ లేడీ’ని చేసింది. గత సంవత్సరం జపాన్ తొలి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించిన తకాయిచి... తాజాగా జపాన్ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో (ముందస్తు) ఘన విజయం సాధించారు...మూడు నెలల్లోనే పార్లమెంట్‌ను రద్దుచేసి, ఎన్నికల బరిలోకి దిగడం ఆషామాషీ విషయం కాదు. తమ మీద తమకు గట్టి నమ్మకం ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. ఆ నమ్మకం ఎప్పుడూ తకాయిచితోనే ఉంది. అందుకే ఆమె సనై తకాయిచి అయ్యారు! తాజా ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మరోసారి తానేమిటో నిరూపించుకున్నారు.టకాయిచి టాక్ చాతుర్యం... అమోఘం!తకైచి గురువు షింజో అబే. ఆయన వాక్చాతుర్యం అంటే తకైచికి బాగా ఇష్టం. షింజో జపాన్‌లోని ప్రముఖ ప్రజానాయకుడు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ(ఎల్డీపీ) అధ్యక్షుడు అయిన షింజో అబే జసాన్ చరిత్రలో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు. ‘ప్రజలతో కలిసి పనిచేస్తున్నంత కాలం నాకు వేరే శక్తి అవసరం లేదు. ప్రజలే నా శక్తి. ఆ శక్తితో ఎన్ని రకాల సవాళ్లనైనా ఎదుర్కోగలను’ ‘మనిషికి ఆశ ఎప్పుడూ ఉండాలి. ఆ ఆశే అయుధం. కలను సాకారం చేసుకునే సాధనం’... గురువు నోట వినిపించే ఇలాంటి మాటలు అంటే తకాయిచికి చాలా ఇష్టం. ‘ప్రజలను ఉద్దేశించి ఉపన్యాసం ఇస్తుంటే ఎవరో పరాయి వ్యక్తి వచ్చి మాట్లాడినట్లు ఉండకూడదు. మన ఊరి వ్యక్తో, కుటుంబ సభ్యులో మాట్లాడుతున్నట్లు సహజంగా ఉండాలి.’.. అని చెప్పకనే చెప్పినట్లుగా ఉంటుంది షింజో అబే వాక్చాతుర్యం. అలాంటి సహజ వాక్చాతుర్యాన్ని సొంతం చేసుకున్నారు తకాయిచి.ధైర్యమే దారి చూపిందిఅమెరికాలో యూనివర్శిటీ విద్య పూర్తయిన తరువాత స్వదేశానికి తిరిగి వచ్చిన తకాయిచి కొంత కాలం టీవీ యాంకర్‌గా పనిచేశారు. 1996లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అగ్రనేత షింజో అబేకు ప్రియ శిష్యురాలు అయ్యారు. అంతర్గత వ్యవహారాలు, సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) 2024లో ఉభయ సభలలో మెజారిటీ కోల్పోయింది. కొమైటో పార్టీతో దశాబ్దాల పొత్తు కూలిపోయింది. ఎటు చూసినా నిరాశే అన్నట్లుగా ఉంది పరిస్థితి. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యం, ఆశ కోల్పోలేదు తకాయిచి. ఆమెకు ప్రజలలో ఉన్న ఆదరణే పార్టీని నిలబెట్టింది. గత ఏడాది ఆమె ప్రధానిగా ఎన్నికైనప్పుడు... ‘ప్రధానిగా తకాయిచి ఎన్నిక పార్టీకి అదృష్టాన్ని తెస్తుందా? పార్టీని పునర్జీవింపజేస్తుందా?’ అనే ప్రశ్న వేశారు రాజకీయ విశ్లేకులు. ఆ ప్రశ్నకు తాజా విజయం జవాబు చెప్పింది. తకాయిచి పాలనకు జనం ఆమోదముద్ర వేశారు. ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. తకాయిచి దారి... రహదారి!వర్క్ వర్క్ వర్క్ అండ్ వర్క్!⇒ ‘వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలి’ అనే మాట ఎప్పుడూ వినబడుతూ ఉంటుంది. అయితే ఈ సమన్వయ ధోరణికి తకాయిచి వ్యతిరేకం.⇒ ‘దేశం కోసం ఎప్పుడూ పనిచేస్తూ ఉండాలి. వర్క్ వర్క్ వర్క్ అండ్ వర్క్. అందరూ గుర్రంలా పనిచేయాలి’ అంటారు తకాయిచి.⇒ ‘వర్క్ వర్క్ వర్క్ అండ్ వర్క్’ అనే మాట జపాన్‌లో బాగా పాపులర్ అయింది. ప్రతి సంవత్సరం జపాన్‌లో విడుదల చేసే పాపులర్ మాటల పుస్తకంలో ఈ మాట చేరింది!ఆ దూకుడు... ఇప్పటికీ!చిన్నప్పుడు సనై తకాయిచికి ‘బైకర్ అమ్మాయి’ అని పేరు. జపాన్ రోడ్లపై స్పీడ్‌గా దూసుకెళ్లేది. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత బైక్ డ్రైవింగ్‌కు దూరమైనా ఆ దూకుడు, స్పీడ్ మాత్రం తగ్గలేదు. అదే ఆమె ఎనర్జీ! కరుడు కట్టిన సంప్రదాయవాది, జాతీయవాదిగా ముద్ర పడినప్పటికీ ఆమె గిరి గీసుకొని కూర్చోలేదు. కొరియన్ సంగీతం, నాటకాలను బాగా ఇష్టపడతారు.యస్... ఇప్పటికీ డ్రమ్స్ మోగాల్సిందే!యూనివర్శిటీ రోజుల్లో సరదాగా డ్రమ్స్ వాయించడమే కాదు ఒక మ్యూజిక్ బ్యాండ్‌లో కూడా చేరారు సనై తకాయిచి. పాకెట్‌మనీకి సరిపడ డబ్బులు వచ్చేవి! మరి ఆమె రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆ డ్రమ్స్ మూలన పడ్డాయా? గత జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయా?అదేమీ కాదు. ఆమె ఇప్పటికీ డ్రమ్స్ వాయిస్తారు. వేదికలపై కాదు... ఇంట్లోనే! రాజకీయ రణరంగంలో బోలెడు ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి నుంచి బయట పడడానికి, తనను తాను రీఛార్జ్ చేసుకోవడానికి ఇప్పటికీ డ్రమ్స్ వాయిస్తుంటారు.గత నెల జపాన్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో చర్చలు జరిపారు తకాయిచి. చర్చలు పూర్తయిన తరువాత ఇద్దరూ సరదాగా కె–పాప్ పాటలు పాడుకున్నారు. డ్రమ్స్ ప్లే చేశారు. -
తకాయిచీ అపూర్వ విజయం
టోక్యో: జపాన్ పార్లమెంట్‌కు ఆదివారం జరిగిన కీలకమైన ఎన్నికలో ప్రధానమంత్రి సనే తకాయిచీ ఘన విజయం సాధించారు. పార్లమెంట్లో శక్తివంతమైన దిగువ సభలోని 465 సీట్లకుగాను మూడింట రెండొంతుల సీట్లు అవసరం కాగా, తకాయిచీ సారథ్యంలోని లిబరల్ డెమోక్రాటిక్ పారీ్ట(ఎల్డీపీ) ఆ మార్కును సునాయాసంగా అధిగమించింది. ఇప్పటికే 316 సీట్లలో గెలుపు బావుటా ఎగరేసింది. 1955లో ఈ పార్టీని స్థాపించిన తర్వాత లభించిన అతిపెద్ద విజయమిది. 1986లో నకసొనె హయాంలో మాత్రమే ఎల్డీపీ 300 సీట్లను సొంతంగా గెలుచుకుంది. కాగా, జపాన్ మొట్టమొదటి మహిళా ప్రధానిగా గతేడాది అక్టోబర్‌లో పగ్గాలు చేపట్టిన తకాయిచీ, అధికార ఎల్డీపీలో ప్రజామోదం కలిగిన ఏకైక నేతగా ఉన్నారు. గత ఏడు దశాబ్దాలుగా ఈ పారీ్టయే దాదాపుగా అధికారంలో కొనసాగింది. ఇటీవల కాలంలో వరుస కుంభకోణాలు ఈ పార్టీ ఇమేజీని తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ సమయంలో ఆమె విధానాలు, పాలనకు ప్రజామోదం లభించింది. ఇదే అవకాశంగా ఆమె కేవలం మూడు నెలల్లోనే పార్లమెంట్‌ను రద్దు చేసి, ఆకస్మికంగా ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలను తన పాలనపై రెఫరెండంగా ఆమె ప్రకటించుకున్నారు. చైనాతో ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆమె పలు చర్యలను ప్రకటించారు. అమెరికాతో మరింత సన్నిహిత సంబంధాలను ఆమె కోరుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు తకాయిచీ విధానాలకు ప్రజలిచ్చిన సానుకూల సంకేతంగా చెబుతున్నారు. తన విధానాలను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నానని ఫలితాలు వెలువడిన అనంతరం తకాయిచీ ప్రకటించారు. అధికార పక్షానికే మెజారిటీ సీట్లు దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనా నిజమైంది. తకాయిచీ సాధించిన విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. తకాయిచీకి అభినందనలు తెలియజేశారు. -
కొత్తగా సైబర్ సెక్యూరిటీ వ్యూహాత్మక భాగస్వామ్యం
టోక్యో: సైబర్ సెక్యూరిటీతోపాటు అరుదైన ఖనిజాల సరఫరాలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని, పరస్పరం కలిసి పని చేయాలని జపాన్, బ్రిటన్ నిర్ణయించుకున్నాయి. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ శనివారం జపాన్‌లో పర్యటించారు. జపాన్ ప్రధాని సనే తకాయిచీతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. జపాన్, బ్రిటన్ సంబంధాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. అట్లాంటిక్, ఇండో–పసిఫిక్‌లో సహకారం, భద్రతపై తకాయిచీతో చర్చించినట్లు స్టార్మర్ తెలిపారు. తమ ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోవడానికి సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించామని, ఇందుకోసం కలిపి పనిచేస్తామని చెప్పారు. ఇందుకోసం కొత్తగా సైబర్ సెక్యూరిటీ వ్యూహాత్మక బాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. మరోవైపు అరుదైన ఖనిజాల విషయంలో బ్రిటన్‌తో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. -
వెళ్లిరా పాండా..!
అది కేవలం ఒక జూ కాదు.. ఒక దేశపు ఉద్వేగం.. ఆదివారం ఉదయం నుంచే టోక్యోలోని ‘ఉయెనో జూ’వెలుపల వేలాది మంది ప్రజలు నిలబడి ఉన్నారు. వారి చేతుల్లో కెమెరాలు, పాండా బొమ్మలు ఉన్నాయి.. కానీ కనులు మాత్రం వర్షిస్తున్నాయి. ఆఖరి నిమిషం.. కేవలం 60 సెకన్ల పాటు తమ ప్రియమైన కవల పాండాలను కళ్లారా చూసుకునేందుకు వారు పడుతున్న ఆరాటం వర్ణనాతీతం. ఎందుకంటే, ఆ నిమిషం తర్వాత జపాన్ గడ్డపై పాండాల శకం శాశ్వతంగా ముగిసిపోతోంది.. సెకనులో.. చెదిరిన కల వీటిని ఆఖరిసారిగా చూసుకునేందుకు.. ఆన్లైన్ లాటరీలో ఒక్కో టికెట్ కోసం 24 మంది పోటీ పడ్డారంటే ఆ పాండాలంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. ఆఖరిసారిగా.. వెదురు ఆకులను నములుతూ, అమాయకంగా అటూ ఇటూ తిరుగుతున్న కవల పాండాలు.. షా జియావో, లీలీలను చూసి అభిమానులు దుఃఖాన్ని నియంత్రించుకోలేకపోయారు. టికెట్ దొరకని వేలాది మంది జనం జూ గోడల బయటే నిలబడి, పాండాల ఉనికిని అనుభూతి చెందుతూ మౌనంగా వీడ్కోలు పలికారు. రాజకీయాల మధ్య నలిగిన అమాయక ప్రేమ.. పాండాల తరలింపు వెనుక ఒక విషాదకరమైన రాజకీయ నేపథ్యం ఉంది. 1972లో చైనా–జపాన్ దౌత్య సంబంధాల పునరుద్ధరణకు గుర్తుగా వచ్చిన ఈ పాండాలు.. ఇప్పుడు అవే దౌత్య సంబంధాలు క్షీణించడం వల్ల వెళ్లిపోతున్నాయి. తైవాన్ విషయంలో జపాన్ ప్రధాని సనాయే తకైచి చేసిన వ్యాఖ్యలు చైనాకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. సంబంధాలు దెబ్బ తినడంతో, పాండాల లీజు ఒప్పందాలను పొడిగించడానికి చైనా నిరాకరించింది. ఫలితంగా, జనవరి 27న ఈ కవలలు చైనాకు తిరిగి వెళ్లిపోతున్నాయి. మంగళవారం ఈ కవలలు చైనా వెళ్లిపోయాక, జపాన్‌లో ఒక్క పాండా కూడా ఉండదు. అర్ధ శతాబ్దపు చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. అవి మా సొంత బిడ్డలు! ‘నేను ఈ పాండాల కోసం 15 ఏళ్లలో ఒక కోటి ఫొటోలు తీశాను. నా సొంత పిల్లలే నన్ను వదిలి వెళ్తున్నట్టు ఉంది’.. అని తకాహిరో అనే అభిమాని భారమైన హృదయంతో చెప్పిన మాటలు అక్కడున్న అందరినీ కదిలించాయి. ‘ఈ పాండాలు కేవలం జంతువులు కావు, మా కుటుంబ సభ్యులు. అవి మాకు ఎంతో ఓదార్పునిచ్చాయి’.. అంటూ 54 ఏళ్ల మెచికో కన్నీరు పెట్టుకుంది. పాండాల తరలింపుతో ఏటా సుమారు రూ.1,100 కోట్ల ఆదాయాన్ని జపాన్ కోల్పోనుంది. వ్యాపారులు తమ దుకాణాల బోర్డులు మార్చడానికి నిరాకరిస్తూ, ‘అవి మళ్లీ తిరిగి వస్తాయి’.. అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూగబోయిన జపాన్ హృదయం! ప్రేమకు, ఓదార్పుకు గుర్తుగా నిలిచిన ఈ మూగజీవాలు.. దేశాల మధ్య సరిహద్దు గొడవలకు బలైపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంగళవారం వీటిని తరలించే విమానం గాల్లోకి ఎగిరినప్పుడు, దాని రెక్కలు ఒక దేశపు 54 ఏళ్ల జ్ఞాపకాలు, కోట్లాది మంది భారమైన హృదయాలను కూడా మూటగట్టుకుని వెళ్లిపోతాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫిబ్రవరి 8న జపాన్‌లో ఎన్నికలు
టోక్యో: జపాన్ ప్రధానమంత్రి సనే తకాయిచీ అనూహ్య నిర్ణయం తీసుకు న్నారు. పార్లమెంట్‌ను రద్దు చేసి, తక్షణమే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం టోక్యోలో జరిగిన మీడియా సమావేశంలో తకాయిచీ ఈ విషయం ప్రకటించారు. పార్లమెంట్‌లోని శక్తివంతమైన దిగువ సభను ఈ నెల 23వ తేదీన రద్దు చేస్తానని వెల్లడించారు. ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు నిర్వహించడం ద్వారా తమకున్న ప్రజామద్దతును దిగువ సభలో అత్యధిక మెజారిటీ సాధించేలా మల్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ‘ఇది అత్యంత కఠినమైన నిర్ణయం. ప్రజలతో కలిసి జపాన్ పురోగమనాన్ని ఖరారు చేసే నిర్ణయం. తకాయిచీ ప్రధాని పదవికి అర్హురాలా, కాదా? అన్నది ప్రజలు తేల్చే నిర్ణయం’అని ఆమె వ్యాఖ్యానించారు. గతేడాది అక్టోబర్ 21వ తేదీన దేశ మొట్టమొదటి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తకాయిచీకి, ఆమె కేబినెట్‌కు ప్రజల మద్దతు ఉంది. అయితే, ఆమె లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ(ఎల్డీపీ) మాత్రం ప్రజాదరణలో వెనుకబడింది. అయిదేళ్ల కాలంలో ప్రధానిగా పీఠం ఎక్కిన నాలుగో ఎల్డీపీ నేత తకాయిచీ. దీంతో, ఆకస్మిక ఎన్నికల వ్యూహం ఏమేరకు ఫలిస్తుందన్నది తెలియాల్సి ఉంది. దిగువ సభలోని 465 మంది సభ్యుల ఎన్నికకు సంబంధించిన ప్రచారం ఈ నెల 27వ తేదీ నుంచి మొదలుకానుంది. 1955 నుంచి జపాన్‌లో అత్యధిక కాలం ఎల్డీపీయే అధికారంలో ఉంది. ఈ పార్టీకి దిగువ సభలో 199 మంది సభ్యుల బలముంది. మాజీ ప్రధాని షింజో అబే శిష్యురాలిగా తకాయిచీకి పేరుంది. షింజో అబే తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకురాలుగా తకాయిచీ నిలిచారు. -
జపాన్ పార్లమెంటులో 73 మంది మహిళా ఎంపీలకు ఒకే ఒక్క టాయిలెట్
టోక్యో: జపాన్ పార్లమెంట్లో మహిళా ఎంపీలకు మౌలిక సదుపాయాల కొరతపై తీవ్ర చర్చ మొదలైంది. ప్రస్తుతం దిగువ సభలో 73 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. కానీ వారికి ప్రధాన ప్లీనరీ సెషన్ హాల్ వద్ద కేవలం ఒకే ఒక్క మరుగుదొడ్డి మాత్రమే ఉండడం దేశవ్యాప్తంగా విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో పరిస్థితిపై మహిళా ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరిన్ని టాయిలెట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సుమారు 60 మంది మహిళా ఎంపీలు పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కొత్త ప్రధాని సేన్ తకైచి కూడా దీనిపై కలత చెందినట్లు సమాచారం.జపాన్ పార్లమెంట్ భవనం 1936లో నిర్మించబడింది. ఆ సమయంలో దేశంలో మహిళలకు ఓటు హక్కు కూడా లేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి తర్వాత 1945 డిసెంబర్లో మహిళలకు ఓటు హక్కు లభించింది. అనంతరం 1946 ఎన్నికల్లో తొలిసారి మహిళలు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అయితే కాలం మారినా భవనంలోని మౌలిక సదుపాయాలు మహిళలకు పెరుగుతున్న ప్రాతినిధ్యానికి అనుగుణంగా మారలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.జపాన్ ప్రముఖ వార్తాపత్రిక యోమియురి షింబున్ నివేదిక ప్రకారం... పురుషుల కోసం పార్లమెంటులో 12 మరుగుదొడ్లు (మొత్తం 67 స్టాల్స్) ఉన్నాయి. మహిళల కోసం 9 మరుగుదొడ్లు (మొత్తం 22 క్యూబికల్స్) మాత్రమే ఉన్నాయి. కాగా ప్రధాన విచారణలు జరిగే ప్లీనరీ హాల్ వద్ద మాత్రం మహిళలకు కేవలం ఒక్క టాయిలెట్ ఉంది. దాంతో సమావేశాలకు ముందు సుదీర్ఘ క్యూలు ఏర్పడుతున్నాయి. కొన్నిసార్లు మహిళా ఎంపీలు భవనంలోని మరో భాగానికి వెళ్లి టాయిలెట్ వినియోగించుకోవాల్సి వస్తోంది. ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ మహిళా ఎంపీ యసుకో కొమియామా స్పందిస్తూ.. పార్లమెంటు సమావేశాల సమయంలో మహిళా సభ్యులు టాయిలెట్ బయట క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఇది చాలా అవమానకరమైన పరిస్థితి అని వ్యాఖ్యానించారు.ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్‌లో 148 దేశాల్లో జపాన్ 118వ స్థానంలో నిలిచింది. వ్యాపారం, మీడియా, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం ఇప్పటికీ చాలా తక్కువగా ఉందని ఆ నివేదిక పేర్కొంది. ఎన్నికల సమయంలో మహిళా అభ్యర్థులు తరచూ సెక్సిస్ట్ వ్యాఖ్యలు ఎదుర్కొంటున్నారని, రాజకీయాలకంటే ఇంట్లో పిల్లలను చూసుకోవాలి అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని మహిళా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పార్లమెంటులో మహిళల సంఖ్య పెరుగుతోందిప్రస్తుతం: దిగువ సభలో 465 మంది ఎంపీలలో 72 మంది మహిళలు, ఎగువ సభలో 248 మందిలో 74 మంది మహిళలు ఉన్నారు. మహిళలకు కనీసం 30 శాతం ప్రాతినిధ్యం కల్పించాలన్నది జపాన్ ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ పరిణామాల నడుమ, కొత్త ప్రధాని సేన్ తకైచి నిర్వహించిన సమావేశం తర్వాత దేశంలో పని, జీవిత సమతుల్యతపై మరోసారి చర్చ మొదలైంది. గతంలో ఆమె పని, పని, పని మాత్రమే అనే వైఖరితో వార్తల్లో నిలిచారు. తాను రోజుకు 18 గంటలు పనిచేస్తానని, పని, జీవిత సమతుల్యతను నమ్మనని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి.మొత్తంగా జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా మహిళలు మౌలిక సౌకర్యాల కోసం ఇంకా పోరాడాల్సిన పరిస్థితి ఉందన్న విషయం ఈ ఉదంతం మరోసారి స్పష్టం చేస్తోంది. -
మనది స్వర్ణయుగ బంధం
టోక్యో: చైనాతో వాణిజ్య యుద్ధ భయాల వేళ.. ఆ దేశానికి చారిత్రక శత్రువు అయిన జపాన్‌కు మరింత దగ్గరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. సోమవారం నుంచి జపాన్‌లో రెండురోజుల పర్యటనలో ఉన్న ఆయన జపాన్ తొలి మహిళా ప్రధాని సనాయి తకాయిచితో అనేక అంశాలపై చర్చలు జరిపారు. మంగళవారం రోజంతా ఈ ఇద్దరు నేతలు వివిధ కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు. ట్రంప్‌ను ప్రసన్నం చేసుకొనేందుకు తకాయిచి ప్రయత్నించగా, జపాన్ నుంచి బలవంతంగానైనా పెట్టుబడులు రాబట్టేందుకు ట్రంప్ ప్రయత్నించారు.పనిలో పనిగా నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్‌ను నామినేట్ చేసేందుకు తకాయిచిని ఒప్పించారు. తకాయిచితో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా జపాన్‌కు ట్రంప్ పలు హామీ ఇచ్చారు. ‘జపాన్‌కు సాయం చేసేందుకు నేను చేయాల్సిందంతా చేస్తాను. మన ద్వైపాక్షిక సంబంధాలు ఇప్పుడు చాలా బలమైన స్థాయిలో ఉన్నాయి’అని పేర్కొన్నారు. లంచ్ మీటింగ్‌లో భాగంగా ఇరువురు నేతలు అంతర్జాతీయ పరిణామాలతోపాటు వాణిజ్యం, పెట్టుబడులపై చర్చించారు. రెండు దేశాల మధ్య కీలకమైన ఖనిజా లపై వాణిజ్య సంబంధాల్లో ప్రస్తుతం స్వర్ణ యుగం నడుస్తోందని ఇద్దరు నేతలు వ్యాఖ్యానించారు. అమెరికాలో జపాన్ భారీ పెట్టుబడులుట్రంప్ తన సహజ ధోరణిలో జపాన్‌కు వరాలు ప్రకటిస్తూనే నిందలు కూడా మోపారు. జపాన్ అసలు అమెరికా వాహనాలను కొనటం లేదని ఆరోపించారు. అమెరికాలో 550 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు లంచ్ మీటింగ్‌లో ఒప్పందాలు చేసుకున్నాయి. అమెరికాకు చెందిన 150 ఫోర్డ్ ట్రక్కులకు కొనుగోలు చేస్తామని తకాయిచి ప్రకటించారు.అనంతరం టోక్యో సమీపంలోని అమెరికా సైనిక స్థావరం వద్ద ఉన్న అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్‌పై కూడా ట్రంప్, తకాయిచి సమావేశమయ్యారు. మరోవైపు అమెరికా రాయబార కార్యాలయంలో అమెరికా, జపాన్ కంపెనీల సీఈవోలకు ట్రంప్ విందు ఇచ్చారు. జపాన్ కంపెనీల సీఈవోలతో అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ విందు సమావేశం నిర్వహించి భారీగా పెట్టుబడులు రాబట్టారు. వెస్టింగ్‌హౌస్, జీఈ వెర్నోవా సంస్థలు అమెరికాలో అణు విద్యుత్ ప్రాజెక్టుల్లో 100 బిలియన్ డాలర్ల చొప్పున పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. ట్రంప్‌కు శుభవార్తనోబెల్ శాంతి పురస్కారం కోసం తహతహలా డుతున్న ట్రంప్‌కు జపాన్ ప్రధాని శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్‌ను నామినేట్ చేస్తామని తకాయిచి హామీ ఇచ్చినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ లీవిట్ తెలిపారు. ఈ ఏడాది పాకిస్తాన్, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు, వ్యక్తులు ట్రంప్‌ను నామినేట్ చేసినా నోబెల్ కమిటీ ఆయనకు శాంతిపురస్కారం ఇవ్వలేదు. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య సమావేశంలో పాల్గొనేందుకు ట్రంప్ బుధవారం దక్షిణకొరియాకు బయలుదేరి వెళ్లనున్నారు. గురువారం ఆయన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో చర్చలు జరుపనున్నారు. -
హెయిర్ స్టైల్‌నే కాదు చరిత్రనే మార్చేసింది!
జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనే తకాయిచి చరిత్ర సృష్టించారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో... ‘అచ్చం మార్గరెట్ థాచర్ హెయిర్ స్టైయిల్లా ఉండాలి’ అని తన హెయిర్ స్టయిల్ మార్చారు. అయితే ఆమె మార్చింది కేవలం హెయిర్‌స్టైల్ మాత్రమే కాదు, పితృ స్వామ్య ఆధిపత్యంతో కూడిన ఎన్నో స్థిర అభిప్రాయాలను! తకాయిచి సుపరిచిత రాజకీయ జీవితం మాట ఎలా ఉన్నా, అదర్‌సైడ్ బహుముఖ ప్రజ్ఞావంతురాలు. సింగర్, డ్రమ్మర్, బైక్ రైడర్, కరాటే ఫైటర్, టీవీ ప్రెజెంటర్... ఒకటా రెండా!సనే తకాయిచికి మెటాలిక, ఐరన్ మెయిడెన్, బ్లాక్ సబ్బాత్ లాంటి హెవీ మెటల్ మ్యూజిక్ బ్యాండ్లు అంటే చాలా ఇష్టం. బిగ్గరగా, దూకుడుగా ధ్వనించే రాక్ స్టైల్ హెవీ మెటల్ బ్యాండ్ల సొంతం. సంగీత అభిమానిగా ఉన్న తకాయిచి కాలేజీ బ్యాండ్‌లో డ్రమ్ వాయించేవారు. ఆమె బ్యాండ్ వాయించడం ఎంత ఉధృతంగా ఉండేది అంటే కర్రలు తప్పనిసరిగా విరిగిపోయేవి! అందుకే బ్యాకప్‌గా నాలుగు జతల కర్రలను తీసుకువెళ్లేవారు. స్కూల్ రోజుల్లో గిటార్ వాయించేవారు.వయసుతో పాటు ఉత్సాహం పెరుగుతూనే ఉంది..! కళలపై ఎంత పాషన్ ఉన్నా సరే వయసుతోపాటు కొందరిలో ఉత్సాహం తగ్గిపోతుంది. అయితే తకాయిచి అలా కాదు. ఇప్పటికీ ఇంట్లో డ్రమ్స్ వాయిస్తారు. రాజకీయాలు అన్నాక ఒత్తిడి సహజం కదా! ఎప్పుడైనా మరీ ఒత్తిడికి గురైనప్పుడు డ్రమ్స్ వాయించే సమయం రెట్టింపు అవుతుంది.రాజకీయ నేపథ్యం లేదు... ధైర్యం మాత్రమే ఉంది... జపాన్‌లోని పితృస్వామ్య రాజకీయ వ్యవస్థలో తకాయిచి ప్రధానిగా ఎన్నికకావడం అనేది ఆశ్చర్యకరమైన, అరుదైన విజయం. ఆమె దేశభక్తి విద్యను ప్రోత్సహిస్తున్నారు. యుద్ధాలను త్యజించే విధానాలకు మద్దతు ఇచ్చారు. తన రాజకీయ సహచరులలో చాలామందిలా ఆమెకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. తండ్రి ఒక కార్ల కంపెనీలో పనిచేసేవాడు. తల్లి పోలీస్ ఆఫీసర్. రాజకీయాల్లోకి రాక ముందు తకాయిచి టీవి కామెంటేటర్‌గా పనిచేసేవారు. నవ్వుతూ, నవ్విస్తూ ఇంటర్వ్యూలు, టీవి కార్యక్రమాలు చేసేవారు. జపాన్ పార్లమెంట్లో మొదటిసారి అడుగు పెట్టిన కాలంలో తన జుట్టు స్టైల్ మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు ‘అచ్చం మార్గరెట్ థాచర్ హెయిర్ స్టైల్లా ఉండాలి’ అని హెయిర్ డ్రెస్సర్‌కు చెప్పారు.మార్గరెట్ థాచర్‌కు ఆమె వీరాభిమాని... ‘గుంపు వెంట పరుగెత్తడం కాదు... ఆ సమూహం నిన్ను అనుసరించేలా చేసుకోవాలి’... ఇలా థాచర్ ప్రసిద్ధ మాటలు ఎన్నో తకాయిచి నోట వినిపించేవి.బైక్ రైడింగ్‌కు గుడ్‌బై... బైక్ రైడింగ్ అంటే తకాయిచికి బోలెడు ఇష్టం. సమయం చిక్కేది కాదా? భద్రతా కారణాలా? తెలియదుగానీ 32 సంవత్సరాల వయసులో పార్లమెంట్‌లోకి అడుగు పెట్టిన తకాయిచి తనకు అత్యంత ప్రియమైన కవాసకి జెడ్400జీపి మోటర్ సైకిల్‌కు గుడ్‌బై చెప్పారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపి)లో తనదైన ప్రత్యేకత నిలుపుకున్న తకాయిచి ఎన్నో క్యాబినెట్ ర్యాంక్ పదవుల్లో రాణించారు. పార్టీ పాలసీ రీసెర్చ్ కౌన్సిల్‌కు అధ్యక్షురాలిగా పనిచేశారు.భవిష్యత్ ఏమిటి? ‘ప్రధానిగా తకాయిచి ఎన్నిక పార్టీకి అదృష్టాన్ని తెస్తుందా? పార్టీని పునర్జీవింపజేస్తుందా? లేక పార్టీ క్షీణతను వేగవంతం చేస్తుందా?’ అంటూ విశ్లేషణలు చేస్తున్నారు రాజకీయ పండితులు.మహిళలకు సంబంధించి ఆమెకు ఉన్న అభిప్రాయాలు కొన్ని వివాదాస్పదం అయ్యాయి. అయితే ఎన్నికల ప్రచారంలో బేబీ సిట్టింగ్ కోసం పన్ను మినహాయింపులు, పిల్లల సంరక్షణ కోసం కార్పొరెట్ ప్రోత్సాహకాలను ప్రతిపాదించడం అనేది మహిళా–స్నేహపూర్వక విధానాల వైపు తకాయిచి అడుగులు వేస్తున్నారు అని చెప్పడానికి సంకేతం. ఒక లవ్ స్టోరీ... లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపీ)లో తన రాజకీయ సహచరుడు యమమోటోను తకాయిచి వివాహం చేసుకున్నారు. అతడు ఆమెను ఎంతోకాలంగా మౌనంగా ప్రేమిస్తున్నాడు. ఇట్టి విషయాన్ని ఆమె గమనించక పోలేదు. ఒకానొక రోజు ఆయన ఫోన్ చేసి లవ్ ప్రపోజ్ చేశారు. ఆమె ఒప్పుకున్నారు. పెళ్లి జరిగింది. ‘మీకు లవ్ యూ చెప్పాలంటే ఎంతో ధైర్యం కావాలి. మీరు అంత త్వరగా ఎలా ఒప్పుకున్నారు?’ అనే ప్రశ్నకు తకాయిచి ఇలా జోక్ చేశారు... ‘నిజం చెప్పమంటారా! నేను భోజనప్రియురాలిని. మంచి రుచికరమైన భోజనం చేయకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. యమమోటోని పెళ్లి చేసుకుంటే మంచి భోజనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే ధైర్యంతో ఒప్పుకున్నాను. ఎందుకంటే ఆయన ట్రైన్డ్ చెఫ్!’ రాజకీయా అభిప్రాయాలలో తేడా కారణంగా విడిపోయిన ఈ దంపతులు 2021లో తిరిగి వివాహం చేసుకున్నారు. -
జపాన్‌కు మహిళా సారథ్యం
వరస కుంభకోణాలూ, పడిపోతున్న రేటింగ్‌లతో నలుగురు ప్రధానులు వచ్చినంత వేగంగానూ నిష్క్రమించిన జపాన్‌లో తొలిసారి మహిళా నాయకురాలు సనే తకాయిచిని మంగళవారం ఆ దేశ పార్లమెంటు ప్రధానిగా ఎన్నుకున్నది. సంప్రదాయ, జాతీయవాద లిబరల్ డెమాక్రటిక్ పార్టీ (ఎల్డీపీ)కి చెందిన తకాయిచి రాజకీయాల్లోనూ, ప్రభుత్వంలోనూ మహిళల ప్రాతినిధ్యం పెరగాలని వాదిస్తారు. కానీ విశ్వాసాల రీత్యా ఆమె ఫక్తు సంప్రదాయవాది. అదే ఆమెకు కలిసొచ్చింది. మొన్న జూలైలో ఎగువసభకు జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలవటానికి సంప్రదాయ ఓటర్లు అతి మితవాద పక్షం సన్సిటో పార్టీవైపు మొగ్గటం వల్లేనని ఎల్డీపీ లెక్కేసింది. అంతక్రితం నామమాత్రంగావుండే ఆ పార్టీ ఆ ఎన్నికల్లో 15 స్థానాలు గెల్చుకుంది. ఈ పరిస్థితుల్లో తకాయిచి వైపు పార్టీ మొగ్గుచూపింది. అందుకే ఈ నెల మొదట్లో పార్టీలో ఆమె నలుగురు పురుష అభ్యర్థులను అధిగమించి ప్రధాని పదవికి ఎంపిక కాగలిగారు. అన్ని దేశాల్లోనూ అతి మితవాద పక్షాలకు స్ఫూర్తినిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జపాన్‌లోనూ తన ప్రభావం చూపారు. సన్సిటో ఎదుగుదల ఆయన పుణ్యమే! ‘మేక్ జపాన్ గ్రేట్ అగైన్’ నినాదాన్ని సన్సిటో వల్లించటం యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ పైపై కారణాలు. కానీ ఇందులో ఎల్డీపీ స్వయంకృతమే అధికం. గత ఏడు దశాబ్దాల్లో దేశాన్ని అత్యధిక కాలం పాలించింది ఆ పార్టీయే. అందువల్ల చాలా సమస్యలకు మూలం అక్కడేవుంది. 2023లో బద్దలైన అక్రమ నిధుల వ్యవహారంలో ఎల్డీపీ తీవ్రంగా దెబ్బతింది. ఈ వ్యవహారంలో నాటి ప్రధాని కిషిదా నలుగురు మంత్రులకు ఉద్వాసన పలకవలసి వచ్చింది. పర్యవసానంగా ఆ మరుసటి ఏడాది ఎన్నికల్లో తొలిసారి అత్తెసరు మెజారిటీ వచ్చింది. అటుతర్వాత కూడా వరస ఎదురుదెబ్బలు తప్పటం లేదు. దానికితోడు ఏళ్లు గడుస్తున్నకొద్దీ రుణభారం పెరుగుతూపోతోంది. ఆహారపదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. సరుకుల కొరత జనాన్ని పీడిస్తోంది. వీటన్నిటి వల్లా మార్కెట్లు దెబ్బతిన్నాయి. ఇక ట్రంప్ సుంకాల బెదిరింపులు సరేసరి. వీటిని సరిచేసే మార్గం తోచక, జనంలో నానాటికీ పెరుగుతున్న అసంతృప్తిని నివారించలేక చివరకు తకాయిచి ఎంపికే సరైందని పార్టీ నాయకులు భావించారు. అతి మితవాద పక్షం బలం పుంజుకుంటుంటే, తాము సైతం అదే పరిభాషలో మాట్లాడి జనాన్ని బోల్తా కొట్టించవచ్చని ఇతర పార్టీలు చాలా దేశాల్లో భ్రమపడుతున్నాయి. మితవాద భాష అలవాటు చేసుకున్న ఎల్డీపీ ఆ తరహా భ్రమల్లోనే ఉన్నట్టు కనబడుతోంది.తకాయిచి వల్ల తాత్కాలికంగా మార్కెట్లు కోలుకున్న మాట వాస్తవమే అయినా వివిధ అంశాలపై ఆమె వైఖరి పార్టీ కొంప ముంచుతుందని వాదిస్తున్నవారూ లేకపోలేదు. కావటానికి దేశ తొలి మహిళా ప్రధానేగానీ ఆమె నుంచి మహిళలు పెద్దగా ఆశించటానికేం లేదు. పితృస్వామ్య భావనలు బలంగా వేళ్లూనుకున్న సమాజంలో ఆమె తీరు ఈ తరం మహిళలకు మింగుడుపడటం లేదు. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే చాలా... సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం కోసం ఏమీ చేయలేరా అని కొందరు ప్రశ్నించటం అందుకే! పెళ్లయినంత మాత్రాన కన్నవారింటి పేరును మహిళలు ఎందుకు వదులుకోవాలని వాదించే వారితో ఆమె ఏకీభవించరు. పెళ్లయ్యాక ఏ మహిళైనా ‘ఆడ’ పిల్లేనని తకాయిచి అంటారు. కుటుంబ వారసత్వం మగవాళ్లకు దక్కటం న్యాయమేనని వాదిస్తారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు బద్ధ వ్యతిరేకి. అలాగే వలసలపైనా నిప్పులు కక్కుతారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు అవసరమని మాత్రం ఆమె డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ వచ్చే 2028 ఎన్నికలనాటికి ఎల్డీపీని తకాయిచి గట్టెక్కించటం మాట అటుంచి ఇప్పుడున్న అత్తెసరు మెజారిటీతో సుస్థిర పాలన అందించగలరా అన్న సంశయం అందరినీ పీడిస్తోంది. దిగువసభలో కావలసిన మెజారిటీ కన్నా కేవలం నాలుగు ఓట్లు మాత్రమే అధికంగా సాధించిన తకాయిచికి విపక్షంలో ఉన్న అనైక్యత తోడ్పడింది. కానీ ఉభయసభల్లో తగిన మెజారిటీ కొరవడినందున ఏ చట్టం చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా విపక్షాలను అర్థించకతప్పదు. కనుక ప్రభుత్వాధినేతగా తకాయిచి బలహీనురాలు. అందువల్ల తాను ఎంతగానో అభిమానించే బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్‌ను అనుకరించాలని తకాయిచి ప్రయత్నించకూడదు. అలా చేస్తే మొదటికే మోసం వస్తుంది! -
జపాన్ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం
జపాన్ దేశపు రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. జపాన్‌లో తొలి మహిళా ప్రధానిగా సనాయే టాకాయిచీ (Sanae Takaichi) ఎన్నికయ్యారు. ఓ మహిళ జపాన్‌లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ప్రధాని పదవికి షిగేరు ఇషిబా నిన్న రాజీనామా చేశారు. ఒక ఏడాదిపాటు జపాన్ ప్రధానిగా పని చేసిన ఆయన.. క్యాబినెట్‌తో సహా రాజీనామా సమర్పించారు. ఈ క్రమంలోనే సనాయే టాకాయిచీని ప్రధానిగా ఎన్నుంది ఆ దేశ పార్లమెంట్. లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ (LDP)కి ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 1993లో స్వతంత్ర అభ్యర్థిగా లోయర్ హౌస్‌లోకి ప్రవేశించిన ఆమె.. 1996లో ఎల్డీపీలో చేరారు. షిన్జో అబే మంత్రివర్గంలో ఆమె మంత్రిగా పని చేశారు.ఈ ఎన్నికతో జపాన్ రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయని, కొత్త దిశలో మార్పు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.France: మాజీ అధ్యక్షుడి జైలు జీవితం ప్రారంభం-


