
అదర్‌సైడ్
జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనే తకాయిచి చరిత్ర సృష్టించారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో... ‘అచ్చం మార్గరెట్ థాచర్ హెయిర్ స్టైయిల్‌లా ఉండాలి’ అని తన హెయిర్ స్టయిల్ మార్చారు. అయితే ఆమె మార్చింది కేవలం హెయిర్ స్టైల్ మాత్రమే కాదు... పితృస్వామ్య ఆధిపత్యంతో కూడిన ఎన్నో స్థిర అభిప్రాయాలను! తకాయిచి సుపరిచిత రాజకీయ జీవితం మాట ఎలా ఉన్నా, అదర్‌సైడ్ బహుముఖ ప్రజ్ఞావంతురాలు. సింగర్, డ్రమ్మర్, బైక్ రైడర్, కరాటే ఫైటర్, టీవీ ప్రెజెంటర్... ఒకటా రెండా!
సనే తకాయిచికి మెటాలిక, ఐరన్ మెయిడెన్, బ్లాక్ సబ్బాత్ లాంటి హెవీ మెటల్ మ్యూజిక్ బ్యాండ్‌లు అంటే చాలా ఇష్టం. బిగ్గరగా, దూకుడుగా ధ్వనించే రాక్ స్టైల్ హెవీ మెటల్ బ్యాండ్‌ల సొంతం. సంగీత అభిమానిగా ఉన్న తకాయిచి కాలేజీ బ్యాండ్‌లో డ్రమ్ వాయించేవారు. ఆమె బ్యాండ్ వాయించడం ఎంత ఉధృతంగా ఉండేది అంటే కర్రలు తప్పనిసరిగా విరిగిపోయేవి! అందుకే బ్యాకప్‌గా నాలుగు జతల కర్రలను తీసుకువెళ్లేవారు. స్కూల్ రోజుల్లో గిటార్ వాయించేవారు.
వయసుతో పాటు ఉత్సాహం పెరుగుతూనే ఉంది..!
కళలపై ఎంత పాషన్ ఉన్నా సరే వయసుతోపాటు కొందరిలో ఉత్సాహం తగ్గిపోతుంది. అయితే తకాయిచి అలా కాదు. ఇప్పటికీ ఇంట్లో డ్రమ్స్ వాయిస్తారు. రాజకీయాలు అన్నాక ఒత్తిడి సహజం కదా! ఎప్పుడైనా మరీ ఒత్తిడికి గురైనప్పుడు డ్రమ్స్ వాయించే సమయం రెట్టింపు అవుతుంది.
రాజకీయ నేపథ్యం లేదు... ధైర్యం మాత్రమే ఉంది...
జపాన్‌లోని పితృస్వామ్య రాజకీయ వ్యవస్థలో తకాయిచి ప్రధానిగా ఎన్నికకావడం అనేది ఆశ్చర్యకరమైన, అరుదైన విజయం. ఆమె దేశభక్తి విద్యను ప్రోత్సహిస్తున్నారు. యుద్ధాలను త్యజించే విధానాలకు మద్దతు ఇచ్చారు. తన రాజకీయ సహచరులలో చాలామందిలా ఆమెకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. తండ్రి ఒక కార్ల కంపెనీలో పనిచేసేవాడు. తల్లి పోలీస్ ఆఫీసర్. రాజకీయాల్లోకి రాక ముందు తకాయిచి టీవి కామెంటేటర్‌గా పనిచేసేవారు. నవ్వుతూ, నవ్విస్తూ ఇంటర్వ్యూలు, టీవి కార్యక్రమాలు చేసేవారు. జపాన్ పార్లమెంట్‌లో మొదటిసారి అడుగు పెట్టిన కాలంలో తన జుట్టు స్టైల్ మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు ‘అచ్చం మార్గరెట్ థాచర్ హెయిర్ స్టైల్‌లా ఉండాలి’ అని హెయిర్ డ్రెస్సర్‌కు చెప్పారు.
మార్గరెట్ థాచర్‌కు ఆమె వీరాభిమాని... ‘
గుంపు వెంట పరుగెత్తడం కాదు... ఆ సమూహం నిన్ను అనుసరించేలా చేసుకోవాలి’... ఇలా థాచర్ ప్రసిద్ధ మాటలు ఎన్నో తకాయిచి నోట వినిపించేవి.
బైక్ రైడింగ్‌కు గుడ్‌బై...
బైక్ రైడింగ్ అంటే తకాయిచికి బోలెడు ఇష్టం. సమయం చిక్కేది కాదా? భద్రతా కారణాలా? తెలియదుగానీ 32 సంవత్సరాల వయసులో పార్లమెంట్‌లోకి అడుగు పెట్టిన తకాయిచి తనకు అత్యంత ప్రియమైన కవాసకి జెడ్400జీపి మోటర్ సైకిల్‌కు గుడ్‌బై చెప్పారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపి)లో తనదైన ప్రత్యేకత నిలుపుకున్న తకాయిచి ఎన్నో క్యాబినెట్ ర్యాంక్ పదవుల్లో రాణించారు. పార్టీ పాలసీ రీసెర్చ్ కౌన్సిల్‌కు అధ్యక్షురాలిగా పనిచేశారు.
భవిష్యత్ ఏమిటి?
‘ప్రధానిగా తకాయిచి ఎన్నిక పార్టీకి అదృష్టాన్ని తెస్తుందా? పార్టీని పునర్జీవింపజేస్తుందా? లేక పార్టీ క్షీణతను వేగవంతం చేస్తుందా?’ అంటూ విశ్లేషణలు చేస్తున్నారు రాజకీయ పండితులు.
మహిళలకు సంబంధించి ఆమెకు ఉన్న అభిప్రాయాలు కొన్ని వివాదాస్పదం అయ్యాయి. అయితే ఎన్నికల ప్రచారంలో బేబీ సిట్టింగ్ కోసం పన్ను మినహాయింపులు, పిల్లల సంరక్షణ కోసం కార్పొరెట్ ప్రోత్సాహకాలను ప్రతిపాదించడం అనేది మహిళా–స్నేహపూర్వక విధానాల వైపు తకాయిచి అడుగులు వేస్తున్నారు అని చెప్పడానికి సంకేతం.
ఒక లవ్ స్టోరీ... లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ)లో తన రాజకీయ సహచరుడు యమమోటోను తకాయిచి వివాహం చేసుకున్నారు. అతడు ఆమెను ఎంతోకాలంగా మౌనంగా ప్రేమిస్తున్నాడు. ఇట్టి విషయాన్ని ఆమె గమనించక పోలేదు. ఒకానొక రోజు ఆయన ఫోన్ చేసి లవ్ ప్రపోజ్ చేశారు. ఆమె ఒప్పుకున్నారు. పెళ్లి జరిగింది. ‘మీకు లవ్ యూ చెప్పాలంటే ఎంతో ధైర్యం కావాలి. మీరు అంత త్వరగా ఎలా ఒప్పుకున్నారు?’ అనే ప్రశ్నకు తకాయిచి ఇలా జోక్ చేశారు... ‘నిజం చెప్పమంటారా! నేను భోజనప్రియురాలిని. మంచి రుచికరమైన భోజనం చేయకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. యమమోటోని పెళ్లి చేసుకుంటే మంచి భోజనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే ధైర్యంతో ఒప్పుకున్నాను. ఎందుకంటే ఆయన ట్రైన్‌డ్ చెఫ్!’ రాజకీయా అభిప్రాయాలలో తేడా కారణంగా విడిపోయిన ఈ దంపతులు 2021లో తిరిగి వివాహం చేసుకున్నారు.