ఇటీవలి కాలంలో ప్రసవం అంటేనే సిజేరియన్ అంటున్నారని, వాటి కంటే సురక్షిత, సాధారణ ప్రసవాలే ఎప్పుడూ శ్రేయస్కరమని కిమ్స్ గ్రూప్ ఆస్పత్రుల సీఈఓ డాక్టర్ అభినయ్ తెలిపారు. సాధారణ ప్రసవాల మీద అవగాహన పెంపొందించే లక్ష్యంతో డాక్టర్ కె.శిల్పిరెడ్డి ఫౌండేషన్, కిమ్స్ కడల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహించిన మిసెస్ మామ్ తొమ్మిదో సీజన్ గ్రాండ్ ఫినాలె కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. డాక్టర్. శిల్పిరెడ్డి, డా. శిల్పిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ ప్రత్యేక కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు మాతృత్వంలో ఉన్న సవాళ్లు, ఆనందాల గురించి తెలుసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించింది. తొమ్మిదో సీజన్‌కు మొత్తం 220 జంటలు పేర్లు నమోదుచేసుకోగా వారిలో 57 జంటలు గ్రాండ్ ఫినాలెకు అర్హత సాధించారు. వారందరినీ డాక్టర్ అభినయ్ అభినందించారు. మాతృత్వం అనేది ఒక మధురానుభవం అని, అందులోని ప్రతి దశనూ తల్లిదండ్రులు ఇద్దరూ ఆస్వాదించాలని తెలిపారు. గర్భిణి అయిన భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవడంతో పాటు, పుట్టబోయే బిడ్డ సంరక్షణ విషయంలో కూడా తండ్రులది చాలా కీలక పాత్ర అని ఆయన చెప్పారు.
భర్త చేదోడువాదోడుగా ఉంటే భార్య తన మాతృత్వాన్ని మరింత ఆస్వాదించగలదని వివరించారు. సాధారణ లేదా సిజేరియన్ సురక్షిత ప్రసవాలు మంచివని డాక్టర్ అభినయ్ అన్నారు. గ్రాండ్ ఫినాలెకు హాజరైన అతిథులు, జంటలను ఉద్దేశించి కిమ్స్ కడల్స్ ఆస్పత్రి ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కె. శిల్పిరెడ్డి మాట్లాడుతూ.. “సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంతో పాటు కుటుంబం యొక్క గొప్పతనాన్ని పరిచయం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. తల్లిదండ్రులు ఏం తినాలి, పిల్లలకు ఏం పెట్టాలనే అంశాలను వారికి వివరించాం.
70-80 రకాల అంశాలను ఈ తల్లిదండ్రులకు పరిచయం చేశాం. ఇంతమందికి ఒకేచోట అవగాహన కల్పించగలిగితే వాళ్లు సమాజంలో ఈ సందేశాన్ని పంచుతారు. సాధారణ ప్రసవం అనగానే నొప్పులు భరించలేం అన్నట్లుగా చెబుతున్నారు. ఇది తప్పు. గతంలో అన్నీ సాధారణ ప్రసవాలే ఉండేవి. తర్వాత క్రమంగా వివిధ కారణాలతో సిజేరియన్లు పెరిగాయి. ప్రసవం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. దాన్ని అలాగే జరగనివ్వాలి. ఇంతకుముందు సీజన్లలో పాల్గొన్నవారిలో 85% మందికి సాధారణ ప్రసవాలే జరిగాయి. వక్రీకరణలు చాలా జరుగుతున్నాయి కాబట్టి, వీరికి అవగాహన పెంచాలి. ఇక్కడ పాల్గొన్నవారు తమ బంధువులు, స్నేహితులకు చెప్పినా నెమ్మదిగా సమాజం మొత్తం మారుతుంది” అని చెప్పారు. గర్భధారణ సంరక్షణ తోపాటు భవిష్యత్తు తల్లిదండ్రులకు అవసరమైన అవగాహన కల్పించారు.


