ఇళ్లల్లో రోజువారీ వంటచేసేది మహిళలే అయినా, బయట మాత్రం పాకనిపుణులుగా పురుషులే రాణిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ షెఫ్‌లుగా పేరుపొందిన వారిలో పురుషులే ఎక్కువగా ఉన్నా, నెమ్మదిగా పరిస్థితులు మారుతున్నాయి. ఈ రంగంలోకి మహిళలు మరింతగా రావాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే మహిళలు షెఫ్‌లుగా రాణిస్తూ ఉన్నా, ఈ రంగంలో మహిళా షెఫ్‌ల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. నేను వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్‌ని అయినా, అమెరికాలో ఉన్నప్పుడు అనివార్యంగా వంట చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
క్రమంగా వంటలపై ఆసక్తి పెరిగి, షెఫ్‌గా మారాను. మాది అనకాపల్లి. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఆర్క్, ఐఐటీలో ఎంఆర్క్ చేశాను. మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లినప్పటి నుంచి నాకు వంటపై ఆసక్తి పెరిగింది. ఇండియాకి తిరిగి వచ్చేశాక ఒకవైపు ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తూనే, మరోవైపు హోమ్ షెఫ్‌గా షెరటాన్, మేరియట్‌లాంటి హోటళ్లలో; ఇంట్లో ఓనం సధ్యలాంటివి హోస్ట్ చేయడం మొదలుపెట్టాను.
పలు ఫైవ్ స్టార్ హోటల్స్‌లో తెలుగు వంటల ఈవెంట్స్ చేశాను. ఈ రంగంలోకి వచ్చిన మొదట్లో కొన్ని ఇబ్బందులూ ఎదుర్కొన్నాను. అమ్మాయినని చిన్నచూపు చూసేవారు. వెళ్లిన ప్రతిచోటా అమ్మాయిలు షెఫ్‌గా ఉన్నా, తొక్కేయాలనే చూస్తారు. అయితే, నా ప్రతిభా సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది.
మీరా గిరిజ తాడిమేటి షెఫ్
వివక్ష ఇంకా పోలేదు..
అది 2000 సంవత్సరం. నేను వరంగల్‌లో ఒక గవర్నమెంట్ స్కూల్‌లో ఆడపిల్లలకు క్లాస్ చెబుతున్నాను. ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ నా క్లాస్‌లోకి అడుగుపెట్టింది. ఏమైందని అడిగితే, కాలి మీద కాల్చిన వాత చూపించింది. గిన్నెలు కడగలేదని వాళ్ల నాన్న పొయ్యిలోని కట్టె తీసి కాల్చాడని చెప్పింది. వెంటనే అమ్మాయిని తీసుకుని వాళ్ల ఇంటికి వెళ్లాను. వాళ్ల అమ్మా నాన్నలు నన్ను చూసి ఆశ్చర్యపోయారు. ‘ఆడపిల్లను అలా కాలుస్తావా?’ అని వాళ్ల నాన్నను అడిగాను. ఆయన చాలా క్యాజువల్‌గా ‘తప్పేముంది, పని చేయకపోతే ఆడపిల్ల ఎందుకు?’ అని అడిగాడు. ఆడపిల్ల ఎందుకు చదువుకోవాలో వివరంగా చెప్పాను. చివరకు తప్పయిందని ఒప్పుకున్నాడు. ఇకపై స్కూలుకు పంపిస్తానని చెప్పాడు.
ఈమధ్య నేను గోవాకు వెళ్లాను. అక్కడ బీచ్‌కి వెళ్లాం. నాకు ఒక దృశ్యం కనిపించింది. ఒక తండ్రి పదేళ్ల పాపను తిడుతూ, కాళ్లతో వెనకవైపు తంతున్నాడు. నేను వెళ్లి ఆ తండ్రిని అడిగేలోపే జనంలో కలిసిపోయారు. ఇన్నాళ్లలో ఆడపిల్లల జీవితాలు ఏమీ మారలేదు కదా అనిపించింది.
నేను గత 26 సంవత్సరాలుగా ఆడపిల్లలు, మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేస్తూ వస్తున్నాను. నేను 2000 సంవత్సరంలో నా సంస్థ మొదలుపెట్టినప్పుడు ఆడపిల్లలపై వివక్ష, భ్రూణహత్యలు, ఎనీమియా, పౌష్టికాహార లోపం, బాల్యవివాహాలు, బాల కార్మికులు, ఆడపిల్లలపై అత్యాచారాలు తదితర ఎన్నో అంశాలపై పనిచేయాల్సి వచ్చింది.
ఆడపిల్లలను వద్దనుకుని, చెత్తకుండీలలో పడేస్తున్నప్పుడు ఆస్పత్రులు, బస్టాండ్లు, అంగన్వాడీ కేంద్రాలలో ‘తరుణి’ ఊయలలు పెట్టి, ఆడపిల్లలను రక్షించగలిగాం. ఎన్నో వేల బాల్యవివాహాలను ఆపగలిగి,ఆ ఆడపిల్లలను మళ్లీ చదువులో పెట్టగలిగాం. మేం 2004లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో వేసిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఫలితంగా బాల్యవివాహ నిరోధక చట్టం–2006 వచ్చింది.
బాలికలపై లైంగిక అత్యాచారాలను నిరోధించడానికి అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. తెలంగాణ పోలీసులతో కలిసి భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయగలిగాం. హైదరాబాద్‌లో మొదలైన ఈ భరోసా కేంద్రాలు ఇప్పుడు 33 జిల్లాలకూ విస్తరించాయి. అత్యాచార బా«ధితులైన బాలికల్లో ఆత్మహత్యలు పెరుగుతుండటం చూసి, వారి కోసం తరుణి స్వావలంబన రీహాబిలిటేషన్, స్కిల్ సెంటర్‌ను హైదరాబాద్‌లో రెండేళ్లుగా నడుపుతున్నాం.
మహిళల్లో కూడా దురలవాట్లు, సంపాదించగలమనే ధైర్యంతో బాధ్యతారాహిత్యం పెరిగాయి. మహిళల్లో పెరిగిన దురలవాట్లను మాన్పించడానికి ‘సాంత్వన’ డీఅడిక్షన్ సెంటర్, అలాగే చంచల్‌గూడ మహిళా జైలులో ‘నివృత్తి’ డీఅడిక్షన్ సెంటర్ నడుపుతున్నాం. లింగవివక్షను రూపుమాపడానికి మా సంస్థ తరఫున ‘సమదృష్టి’ అనే వేదికను నిర్వహిస్తున్నాం. తరుణి సంస్థ పలు ప్రైవేటు, ప్రభుత్వ ఆఫీసులలో ఎక్స్‌టర్నల్ మెంటర్‌గా అంతర్గత కమిటీలలో పనిచేస్తూ, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
డాక్టర్ ఆచంట, మమతా రఘువీర్, తరుణి స్వచ్ఛంద సంస్థ
వంటల పుస్తకం రాసిన తొలి మహిళ
అనా వెకర్. జర్మనీలోని న్యూరెంబర్గ్‌కు చెందిన అనా, 1596లో ‘న్యూ డిలైట్‌ఫుల్ అండ్ యూజ్‌ఫుల్ కుక్‌బుక్’ రాశారు. ఈ పుస్తకం పలు భాషల్లోకి అనువాదం పొంది ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఇళ్లలో రోజువారీ వండుకునే వంటకాలు, ప్రత్యేక వంటకాలు, వంటకాల రుచిని పెంచే చిట్కాలను ఇందులో విపులంగా రాశారు. వంటకాల రచన మాత్రమే కాకుండా, అనా వెకర్ అరుదుగా కొన్ని కవితలు కూడా రాశారు.
నిర్మలా రెడ్డి
(చదవండి: ‘ఆమె’ ఆరోగ్యమే... సమాజ ఆరోగ్యం!)


