స్త్రీవాదం ఒక ఉద్యమంగా మొదలై దశాబ్దాలు గడచి, స్త్రీలు ఓటింగ్ హక్కు సంపాదించుకుని శతాబ్దం దాటి, ప్రపంచమంతా స్త్రీల సాధికారతపై ప్రతి ఏటా మార్చి 8 న గొంతులు చించుకునే సందర్భంలో– ఈ 21 వ శతాబ్దంలో, జెన్ జీల కాలంలో– ఫ్రాన్స్‌లో ఒక భర్త తన భార్యకు మత్తుమందిచ్చి, తను రేప్ చెయ్యడమే కాక మరెందరో స్నేహితుల చేత ఆమెను కొన్ని ఏళ్ల పాటు రేప్ చేయిస్తాడు;
ఒక మాజీ భర్త, తనకు విడాకులిచ్చి మళ్లీ పెళ్లి చేసుకుని 4 నెలల గర్భం దాల్చిన భార్యను నరికి చంపేస్తాడు. ప్రపంచనాయకత్వం ప్రకటించుకునే దేశంలో, మరింత గొప్ప వలసాధిపత్య దేశం రాజకుమారుడు, బాలికలపై ఏళ్ల తరబడి అత్యాచారం చేస్తాడు. అక్కడిదాకా ఎందుకు? యూట్యూబ్ ఛానెల్ నడిపే ఆడపిల్లలను ట్రోలింగ్‌తో మానసిక హింసకు గురిచేయడం తన జన్మహక్కు అనుకుంటాడు సగటు తెలుగు మగోడు; ఇక మన అగ్రేసర తెలుగు నటుడు, ‘థప్పడ్’ వంటి సినిమాలు వచ్చిన తర్వాత కూడా నాయికను లాగి చెంపదెబ్బ కొడతాడు; ఇంకో సూపర్ స్టార్ కొడుకు కమ్ అందాల హీరో దాదాపు ప్రతి సినిమాలోనూ తన నాయికను చెంపదెబ్బలు కొట్టందే ప్రేమించలేడు.
జీవితంలోనూ, కళలోనూ కూడా అదే హింస. కాని, మనం మాత్రం స్త్రీలు చాలా చాలా ప్రగతి సాధించారు. రాజ్యాలేలుతున్నారు; బిజినెస్ టైకూన్లు అయ్యారు; పార్లమెంటులో గొంతు వినిపిస్తున్నారు. పార్టీలకు నాయకత్వం వహిస్తున్నారు; అంతర్జాతీయ సమావేశాల నుంచి తమకు నచ్చకపోతే వాకౌట్లు చేస్తున్నారు– అని పొంగిపోతున్నాం. ఇంకా చెప్పాలంటే, స్త్రీలకట... స్వేచ్ఛ ఎక్కువైంది. కనక భర్తలను హతమారుస్తున్నారు; యూట్యూబ్‌లో రెచ్చిపోయి మగవాళ్లను ఆడిపోసుకుంటున్నారు.
‘అసలు స్త్రీలకు స్వేచ్ఛ ఇవ్వకుండా ఉండాల్సింది’ అని బాధపడిపోయే జనాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? 19 వ శతాబ్దిలో మొదలైన స్త్రీల అస్తిత్వ పోరాటాలు సత్ఫలితాలను ఇచ్చాయని, అందుకే ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా స్త్రీల పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందనీ పొంగిపోదామా? ఎందరో స్త్రీలు గృహహింసకు ఇప్పటికీ గురవుతూండగా, దొంగ కట్నం కేసులతో అత్తారింటివారిని జైళ్ళకు పంపుతున్న కొంతమంది స్త్రీల అవివేకానికి ఎక్కువ ప్రచారం వస్తోందని బాధపడదామా? ఎందరో భర్తలు అతి చిన్న కారణాలకు భార్యలను హతమారుస్తున్న రోజుల్లో, కొందరు భార్యలు భర్తలను, తాగుడు భరించలేకో, మరెందుకో హతమారుస్తున్నందుకు వారిపై తీర్పులు చెప్దామా? మరోవైపు, తమ తల్లులు ఊపిరాడనివ్వని బంధనాల నుంచి విముక్తి కోసం ఎంతగా పోరాడారో తెలిసి కూడా, తమ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటున్న ఆడపిల్లలను చూసి జాలి పడదామా? ఈ రోజున మహిళా దినోత్సవాన్ని గురించి మాట్లాడుకోవడం ఎప్పటికంటే చాలా ఇబ్బందికరంగా ఉంది.
రోజురోజుకీ ప్రశ్నలే ఎక్కువవుతున్నాయి, సమాధానాలు అంత సులభంగా దొరకడం లేదు. ప్రపంచమంతా స్వార్థపూరితమైపోతున్న వేళ, ప్రపంచమంతా ఒక మార్కెట్‌గా, లాభనష్టాలే అసలైన విలువలవుతున్న వేళ, ఎవరికీ తమ ప్రయోజనాలు తప్ప, ఏ విలువల పట్లా ఏ నిబద్ధతా, ఏ అంకితభావమూ లేకుండా పోతున్న వేళ– సమాజాన్ని కాస్తంత మానవీయం చేయడానికి స్త్రీలు మాత్రమే కాదు; వారితో పాటు పురుషులు ఏం చెయ్యగలరో ఆలోచించడం ఇప్పటి అవసరం.
మృణాళిని, సాహితీవేత్త
తొలి నవలా రచయిత్రి
ప్రపంచ సాహిత్యంలో తొలి నవలా రచయిత్రి మూరాసాకీ షీకీబు. జపాన్ రాజాస్థానంలో రాచ మహిళలకు సహాయకురాలిగా పనిచేసేది. పదకొండో శతాబ్దిలోనే ఆమె ‘గెంజీ మోనోగటారి’ (ది టేల్ ఆఫ్ గెంజి) నవల రాసింది. ఆమె ఈ నవల రాసేనాటికి ప్రపంచంలోని మరే భాషలోనూ నవలా పక్రియ రూపుదిద్దుకోలేదు. ఈ నవలను మూరాసాకీ షీకీబు క్రీస్తుశకం 1010–1021 కాలంలో రాసి ఉంటుందని చరిత్రకారుల అంచనా.
అప్పట్లో జపాన్‌లో చైనీస్ భాష రాచభాషగా ఉండేది. హెలాన్ రాచమహిళలు చైనీస్ భాషను నేర్చుకోరాదనే నిషేధం ఉండేది. అయినా మూరాసాకీ తన తండ్రి ద్వారా చైనీస్ భాషను నేర్చుకుని, ఆ భాషలోని మేలి రచనలు చదువుకుంది. చైనీస్ సాహిత్యాధ్యయనం వల్ల అబ్బిన పరిజ్ఞానానికి తన సృజనాత్మకతను జోడించి, జపానీస్ భాషలో నవల రాసింది. ప్రపంచ సాహిత్యంలో ఇదే తొలి నవలగా పరిశోధకులు పరిగణిస్తారు.
నిలదీతలో పదునెక్కుతున్నామా?
ఏటా జరుపుకొనే మహిళా దినోత్సవమే. ఆ ప్రాతిపదికన మహిళలుగా మన ఆలోచనలను మెరుగుపరచుకునే దిశగా చూస్తున్నామా? సమాజంలో గుర్రపుడెక్కలా అల్లుకుపోయిన మూఢత్వాన్ని, అశ్లీలతనీ, హింసను నిలదీయటంలో పదునెక్కుతున్నామా? మనల్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? ఇటువంటి ప్రశ్నలకు ‘అవును’ అని చెప్పుకోవాలంటే అందుకు భూమికలు ఏవి; కాదు అని తలవాల్చుకునేట్లయితే, కారణాలు వెతికి పట్టుకుని పరిష్కారాలు ఏవి అని ఆలోచించవలసి వుంటుంది.
భిన్న రంగాల్లో దూసుకుపోతున్న అమ్మాయిల తెలివితేటల్ని, చొరవను, ఆర్థికస్వేచ్ఛను– వీటన్నిటి ఫలితమైన స్వతంత్ర వ్యక్తిత్వాన్ని, నిర్ణయాత్మకతను– మగపిల్లలు సహించలేకపోతున్న స్థితి రాజ్యమేలుతున్నది. భారతదేశానికి గర్వకారణమైన క్రీడాకారిణి మిథాలీ ఏమన్నదో గుర్తున్నదా! తనకు ఎదురైన పెళ్ళి ప్రతిపాదనలలో ఒకరు ‘అత్తగారిని చూసుకోవాలి’ అన్నారు. (అది తప్పు కాదు– కానీ ఒక రంగంలో శిఖరస్థాయికి చేరిన వ్యక్తిని, కేవలం మహిళ అయిన కారణంగా, షరతులతో బంధించాలని చూడటం నేరం.) మరొకరు, ‘వేరే వ్యాపకం వద్దు– ఇల్లు, పిల్లల్ని చూసుకోవాలి‘ అన్నారని చెప్పిన మిథాలీ, ‘కనీసం ముందే చెప్పినందుకు వాళ్ళకి థాంక్స్‘ అన్నది. ఇటువంటి అనుభవాలే ఎందరో మహిళా డాక్టర్లు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలవి! అంటే తమకు ఏమి కావాలో నిర్ణయించుకోగల స్థాయిలో ఆధునిక యువతులు వుండగా, న్యాయమైన వారి ఆశలు ఆకాంక్షల్ని సహించలేని యువకులూ మన ముందే కనిపిస్తున్నారు.
ప్రేమ, పెళ్ళి వంటి సొంత వ్యవహారాలలో తమ ఎంపిక, తమ నిర్ణయమే చెల్లాలనే అబ్బాయిల ధోరణి వల్ల తెల్లవారి లేస్తే దినపత్రికల నిండా ఏకపక్షపు ప్రేమ(!)వంటివాటి దుష్ఫలితాల్ని చూస్తున్నాం. అయితే స్వార్జన, స్వేచ్ఛ వల్ల అందరమ్మాయిలలోనూ వ్యక్తిత్వ పటిష్ఠత ఏర్పడటం లేదు. ఇప్పటికీ ప్రేమ పేరిట వంచనకు, అఘాయిత్యాలకు, ఆధునిక సాంకేతికత పుణ్యమా అని బ్లాక్ మెయిలింగ్ వంటి ద్రోహాలకూ అమ్మాయిలు ఆస్కారం ఇస్తుండటం విషాదకరం. తన ప్రేమికుడు వేరొక అమ్మాయితో సాన్నిహిత్యం వెలగబెడుతుంటే అతన్ని ఛీత్కరించి దూరంపెట్టవలసింది పోయి, ‘అతను నావాడు... నువ్వు పో’ అంటూ ఆ రెండో అమ్మాయి మీద దాడి చేయటం చూస్తున్నాం.
మరోపక్క ఆధునిక ఉద్యోగ జీవితాలు, నిరంతరం కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక సౌకర్యాల వల్ల వెర్రితలలు వేస్తున్న ప్రలోభాలు మనుషుల్ని నిలవనివ్వక వ్యామోహాలపాలు, తత్ఫలితంగా నేరాలపాలు చేస్తున్నాయి. సరైన పెంపకం, మొక్కగానే వంచి బుద్ధులు చెప్పే సంస్కృతి నానాటికీ కొరవడుతున్నప్పుడు ఆడ, మగపిల్లలు శారీరక ఉద్వేగాలకు, ఉద్రేకాలకు, మానసిక ఘర్షణలకు లోనుకావటమే జరుగుతుంది. ఇరవైల వయసులోనే ఉద్ధృతమైన సంపాదనలతో విలసిల్లుతున్న నేటి అమ్మాయిలు, అబ్బాయిలకు మందలింపులు అటువుంచి– సలహాలు ఇచ్చేందుకూ పెద్దలు భయపడుతున్నారు కదా!
ఈ సామాజిక సామూహిక విషమస్థితికి అంతర్జాల విషాలగాలం ముఖ్యకారణమని ఎన్నో అధ్యయనాలు తేల్చిచెప్తున్నాయి. యువతీ యువకులకే కాక, కౌమార దశలో వున్న పిల్లలకు– ముఖ్యంగా బాలికలకు అంతర్జాలపు కత్తిఅంచు ప్రాణాంతకమవుతున్నది. గర్భాలతో ప్రాణాల మీదకు తెచ్చే అశాస్త్రీయ గర్భస్రావాలతో మన నగరాలు, పల్లెలు ఒక్కలాగే అతలాకుతలమవుతున్నాయి. ఒకవైపు పూర్ణ వంటి అట్టడుగు సామాజిక స్థాయినుంచి వచ్చిన బాలికలు పర్వతారోహణ, క్రీడలు, శాస్త్రవిజ్ఞానం, కళలు, అంతరిక్షయానాల వంటి విభిన్న రంగాల్లో వజ్రాల్లా ప్రకాశిస్తుంటే, మరోవైపు జీవితాల్ని ఛిన్నాభిన్నం చేసుకుంటున్న బాలికలు, యువతులు, మహిళలు కొల్లలుగా కనిపిస్తూండటం బాధాకరం.
ఇప్పటికీ మహిళలు గృహహింసకు గురవుతూనే వున్నారు. భార్యా పిల్లల్ని, ‘ఎముకలు విరిగేలా లేదా రక్తస్రావ మయ్యేలా కొడితే మాత్రమే‘ నేరమని, అదైనా ‘నిరూపించబడితేనే శిక్షార్హ’మని, ఆ శిక్ష కూడా గరిష్టంగా పదిహేనురోజులని చట్టం చేసిన తాలిబన్ రాజ్యం మన పొరుగునే ఉన్నది. ‘శారీరకంగా చొరబడకుండా కేవలం స్ఖలనం జరిగితే అత్యాచారం కాదు’ అని వాకృచ్చే న్యాయస్థానాలు మన దేశంలోనే ఉన్నాయి! ఇప్పటికీ కొందరు రాజకీయనాయకుల దృష్టిలో ‘రేప్’ అంత పెద్ద నేరం కాదు!
మౌలికంగా మన ఇళ్ళలో ఆడ, మగ పిల్లల పట్ల సమదృష్టి, సమధోరణిలో వాళ్ళ పెంపకం, లింగవైవిధ్యం పట్ల శాస్త్రీయదృష్టి ఏర్పరచుకునే దిశగా ప్రోత్సాహం, విజ్ఞానం సద్వినియోగం పట్ల అవగాహన పెంపుదల, మనుషుల మధ్య లింగవివక్షతో సహా– ఎటువంటి విభజనలైనా కేవలం కృతకమైనవనే వాస్తవాలను బోధించే సంస్కారం, వివేచన పాదుకున్నప్పుడే నేటి సామాజిక రుగ్మతలబారి నుంచి తల్లులు, చెల్లెళ్ళు, యావత్ మానవజాతి బయటపడేందుకు దారులు ఏర్పడతాయి.
ఘంటశాల నిర్మల కవయిత్రి, సీనియర్ జర్నలిస్ట్
ఆఖరి మైలు వరకు నడవాలి
నన్ను నేను కచ్చితంగా ఒక మహిళగా భావిస్తాను, అలాగే ఒక ప్రచురణకర్తగా కూడా భావిస్తాను, కాని ఎప్పుడూ నన్ను నేను ఒక మహిళా ప్రచురణకర్తగా మాత్రం చూసుకోలేదు. ఒక మహిళగా నాకు అదనపు గౌరవం లభించిందని, అందువల్ల నేను వివక్షకు గురికాలేదని చెప్పడం సులభమే. కాని, ఈ ప్రయాణంలో ఇబ్బందులు ఉన్నాయి, అవి పని స్వభావం వల్ల ఎదురైనవే తప్ప, నేను చేస్తున్న ప్రచురణ వల్ల కాదు. ఉదాహరణకు, ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు కనీసం పబ్లిక్ టాయిలెట్‌లు కూడా ఉండేవి కావు.
బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లలోనూ మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉండేవి. పుస్తకాలు అమ్మడానికి రోజంతా స్టాల్ వద్దే నిలబడాల్సి వచ్చేది. అలాంటి సమయంలో పక్కనే ఉన్న ఇళ్లకు వెళ్లి వారి అనుమతి కోరడం లేదా వేరే దారి లేనప్పుడు మొహమాటాన్ని వదిలేసి పని పూర్తి చేయడమే ముఖ్యం అని నాకు తోచేది. పురుషులతో పని చేసేటప్పుడు వారు నాతో మాట్లాడటానికి సంకోచించేవారు. నేను పని మీద ఒకరి ఇంటికి వెళ్తే, వారు నన్ను నేరుగా చూడటానికి భయపడేవారు. ‘ఇంట్లోకి వెళ్లి మా ఆవిడతో మాట్లాడు’ అని వంటగది వైపు చూపించేవారు. కానీ నేను పని మీద వచ్చింది మిమ్మల్ని కలవడానికేనని స్పష్టంగా చెప్పేదాన్ని.
సమాజంలో మార్పే లక్ష్యంగా..
నక్సలైట్ ఉద్యమ స్ఫూర్తితో, సమాజంలో మార్పు తీసుకురావాలనే పట్టుదలతో 26 ఏళ్ల వయసులోనే ఈ రంగంలోకి అడుగుపెట్టాను. ఎందరో మహానుభావుల మార్గదర్శకత్వంలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఒక మహావృక్షంలా ఎదిగింది. ఆ రోజుల్లో ప్రజలు సమయాన్ని డబ్బుతో కొలిచేవారు కాదు, నిస్వార్థంగా పని చేసేవారు. ఆర్థిక సరళీకరణల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
పాఠకుల నమ్మకమే...
మహిళనైనందుకు నాకు కొన్ని ప్రయోజనాలు కూడా కలిగాయి. వయసులో పెద్దవారైన రచయితలు, మేధావులు నన్ను ఎంతగానో ఆదరించారు. పాఠకులు మహిళలను ఎక్కువగా నమ్మేవారు. ఈ నమ్మకమే ఈ రంగంలో రాణించడానికి నాకు ఎంతగానో సహాయపడింది. కేవలం సాయంత్రం వేళల్లో జరిగే మందు పార్టీల చర్చలకు మాత్రం నేను దూరంగా ఉండాల్సి వచ్చేది. కీలక నిర్ణయాలన్నీ అక్కడే జరుగుతుంటాయి. ఒక మహిళగా ఆ వాతావరణంలో నేను ఇమడలేకపోయాను. అక్కడ నాకు ప్రవేశం కూడా ఉండేది కాదు.
కొత్త తరం అమ్మాయిలు..
నేడు చాలామంది మహిళలు ఈ రంగంలోకి రావడం సంతోషకరం. భాగ్యలక్ష్మి (మంచి పుస్తకం), పూర్ణిమ తమ్మిరెడ్డి (ఎలమి) వంటి వారు ముందు వరుసలో ఉంటే, జ్యోతి వలబోజు (జేవీ పబ్లికేషన్స్), శ్వేత (అజూ పబ్లికేషన్స్), ఉష ప్రత్యూష (బాలా బుక్స్), మానస ఎండ్లూరి, అపర్ణ తోట వంటి వారు ప్రస్తుతం ఈ రంగంలో రాణిస్తున్నారు.
ప్రచురణ నా ప్యాషన్
దశాబ్దాల కాలంలో పుస్తక విక్రేతలు, రచయితలు, అనువాదకులు, సమీక్షకులతో ఏర్పడిన అనుబంధం వెలకట్టలేనిది. ఈ రంగం అనుకున్నంత ఆడంబరంగా ఉండదు. దీనికి గుండె ధైర్యం, అంతులేని ఓపిక కావాలి. ఇక్కడ రకరకాల మనుషులు ఉంటారు.
ప్రూఫ్ రీడింగ్ కోసం గంటల తరబడి కళ్లు కాయలు కాచేలా చూడటం, ప్రింటర్ల వెనుక పడటం, అనువాదకులను ఒప్పించడం, పుస్తక విక్రేతల నుంచి బాకీలు వసూలు చేయడం– ఇవన్నీ తెర వెనుక అలసటతో కూడిన పనులు. కొందరు రచయితల్లో అహం ఎక్కువగా ఉంటుంది. అనువాదకులు మాత్రం అణకువతో ఉండి పుస్తకాలను ప్రేమిస్తారు. ఇన్ని సవాళ్లున్నప్పటికీ మళ్ళీ అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా ప్రచురణనే ఎంచుకుంటాను కానీ మరే వృత్తినీ ఎంచుకోను.
డబ్బుతో ముడిపెట్టలేనిది
ప్రచురణ రంగం కేవలం పుస్తకం మీద ఉన్న మమకారంతో, ఆఖరి మైలు వరకు నడిచే సత్తా ఉన్నవారికి మాత్రమే! ప్రైవేట్ కంపెనీలకు కూడా ఈ రంగంలో వచ్చే లాభాలు చాలా తక్కువ. అవినీతి ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటేనో లేదా పాఠ్యపుస్తకాలు అమ్ముకుంటేనో తప్ప, ఇందులో ఆర్థికంగా స్థిరపడటం కష్టం. ఇది కేవలం ప్యాషన్‌తో చేసే అక్షర యజ్ఞం.
గీతా రామస్వామి, ప్రచురణ కర్త
జంబుల రమాదేవి
(చదవండి: నేను... ఉమన్ జర్నలిస్ట్)


