‘హెల్త్‌కేర్‌’లో నారీశక్తి | Womens Health and Empowerment: | Sakshi
Sakshi News home page

‘హెల్త్‌కేర్‌’లో నారీశక్తి

Mar 11 2026 4:43 PM | Updated on Mar 11 2026 4:52 PM

Womens Health and Empowerment:

హెల్త్‌కేర్‌ రంగంలో మహిళల భూమిక రోజురోజుకూ విస్తరిస్తోంది. ఆరోగ్యరంగంలో మహిళల ఆరోగ్యం కోసం కృషిచేయాల్సిన రంగాలు నిజానికి చాలా ఎక్కువే ఉన్నాయి. ఇటీవల తమ సాధికారతలో భాగంగా మహిళా డాక్టర్లు కేవలం చికిత్సకే పరిమితం అయిపోవడం లేదు. దాంతోపాటు కొత్త స్టార్టప్‌ల ఏర్పాటు; హాస్పిటల్‌ నిర్వహణ బాధ్యతలూ; మహిళలకు పీరియడ్స్‌ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత; ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌; సురక్షితంగా ప్రసవం జరపడం, హోమ్‌ సర్వీసెస్, పాలియేటివ్‌ కేర్‌ వంటి అనేక రంగాల్లో పనిచేస్తున్నారు. 

ఈ అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు అందివస్తున్న కొత్త టెక్నాలజీ సహాయంతో మహిళలకు ఉపయోగపడే స్టార్టప్స్‌ ఏర్పాట్లు చేయడం వంటి అంశాల్లో చొరవ తీసుకుంటున్నారు. హస్పిటల్స్‌/ క్లినిక్స్‌ నిర్వహణ, స్టార్టప్స్, పబ్లిక్‌ హెల్త్, టెక్నాలజీ వంటి కీలకమైన నాలుగు అంశాల్లో మహిళల బాగు కోసం అనునిత్యం శ్రమించడంతో పాటు ఈ అంశాల్లో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగడానికి మహిళా వైద్యులు విశేషంగా కృషిచేస్తున్నారు.  

ఆ నాలుగింటినీ విపులీకరిస్తే, తొలి అంశంగా– తాము ఎవరి కోసమో పనిచేయకుండా కేవలం తమ కోసం తామే సంస్థను ఏర్పాటు చేసుకోదలచుకున్న వారు... ఉదాహరణకు చూసినప్పుడు గైనకాలజీ రంగంలో సొంతంగా ఐవీఎఫ్‌ వంటి సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడమూ, కాస్మెటిక్‌ గైనకాలజీ, ఈస్తటిక్‌ గైనకాలజీ రంగాలలో విస్తృతంగా తమవైన క్లినిక్స్‌ ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే పీడియాట్రీ, డెర్మటాలజీ, యూరోగైనకాలజీ వంటి స్పెషాలిటీ క్లినిక్స్‌ కూడా ప్రారంభిస్తున్నారు. 

ఇక పెద్ద పెద్ద హాస్పిటల్‌ సెటప్స్‌ కష్టం అనుకుంటే పొద్దున్నే సర్జరీ చేసేసి, పేషెంట్‌ను సాయంత్రానికల్లా ఇంటికి పంపించే ‘డే కేర్‌’ సెంటర్స్‌ మొదటి కేటగిరీలోకి వస్తాయి. ఇక రెండో అంశానికి వస్తే, ఇందులోనే హెల్త్‌ యాప్స్‌ రూపొందించి, మెంటల్‌ హెల్త్‌ వంటి విభాగాల్లో బాధితులకు అవసరమైన మార్గదర్శకాలు చెప్పడం; ప్రెగ్నెన్సీ సమయాల్లో పాటించాల్సిన జాగ్రత్తలపై సలహా, సూచనలందించడం వంటి స్టార్టప్స్‌ యాప్‌ల రూపకల్పన అనుకోవచ్చు. వీటిల్లో భాగంగానే డయాగ్నస్టిక్‌ సేవలందించే సంస్థలనూ ఏర్పాటు చేస్తున్నారు. 

ఇక మూడో విభాగంలో వెల్‌నెస్‌తో పూర్తి సమగ్ర ఆరోగ్యం పొందడం కోసం అనుసరించాల్సిన యోగా, ధ్యానం వంటి ప్రక్రియల గురించి వివరించేందుకు అవసరమైన ప్లాట్‌ఫామ్స్‌ ఏర్పాటు చేయడం. జీవనశైలి కారణంగా అందరిలోనూ వచ్చే లైఫ్‌స్టైల్‌ జబ్బులైన డయాబెటిస్‌ వంటివి మొదలుకొని మహిళల్లోనే వచ్చే పీసీఓఎస్‌ (పాలీ సిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌), ఎండోమెట్రియాసిస్‌ వంటి వాటి విషయంలో అవసరమైన మేనేజ్‌మెంట్‌ గురించి అవగాహన కల్పించే కేంద్రాలను నెలకొల్పుతున్నారు. ఇక్కడ సమగ్ర చికిత్స అంటే... సమస్యకు ప్రిస్క్రిప్షన్‌ సూచించడం ఒక్కటే కాకుండా తీసుకోవాల్సిన ఆహారాలూ, చేయాల్సిన వ్యాయామాలు... ఇలా 360 డిగ్రీలలో అవసరమైనవన్నీ అందేలాంటి సెంటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. 

ఇక నాలుగో విభాగంలోకి వస్తే హోమ్‌ హెల్త్‌కేర్‌ సేవలు. ఇటీవల హాస్పిటల్‌ ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ఒకరోజు హాస్పిటల్‌లో ఉండాల్సి వస్తే లక్షల్లో ఖర్చు. 
కాని, అంతే క్వాలిటీ సేవలు ఇంట్లోనూ అందితే? ఈ కొత్త కాన్సెప్ట్‌తో పేషెంట్‌ కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడానికి సర్జరీ అనంతర సేవలూ, వృద్ధులకు అవసరమైన కేర్, జీవిత చరమాంకంలో ఉన్నవారికి అవసరమైన పాలియేటివ్‌ కేర్‌ లాంటి అత్యంత కీలకమైన రంగంలోనూ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌కు అవకాశాలు చాలా విస్తృతంగా పెరిగాయి. 

ఇవే కాకుండా, సాంకేతికత పెరుగుతున్న కొద్ది, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అందు బాటులోకి వస్తున్న కొద్ది అందివస్తున్న కొత్త సాంకేతికత సహాయంతో ఈ రంగాలను మరింత విస్తృతపరచే అవకాశం ఎంతో ఉంది. దానికి ఆకాశమే హద్దు. మరి మహిళలంటేనే ఆకాశంలో సగం అంటూ చెబుతుంటారు. ఇలా చూసినప్పుడు వారికి మరింత విశాలమైన అవకాశాలున్నాయో ఊహించవచ్చు. అంతేకాదు, వీటిలో మరింతగా విస్తరించడానికి మహిళల్లో సహజంగా ఉండే ఆర్ద్రత, దయ, సానుభూతి, సహానుభూతి, మల్టీ టాస్కింగ్‌ సామర్థ్యాల వంటి సహజ లక్షణాలు వారికి మరింతగా అవకాశమిస్తుంటాయి. అందుకే మహిళలు తమ సహజ లక్షణాలతో మరింతగా ముందుకు దూసుకుపోవాలనేది ఓ మహిళగా నా అభిలాష.
డాక్టర్‌ మంజుల అనగాని, సీనియర్‌ గైనకాలజిస్ట్‌ ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత
యాసీన్‌

పరిష్కారాలు మనమే వెతుక్కోవాలి
యంగ్‌ జనరేషన్‌ గమనించాల్సింది ఏమిటంటే, మన చాయిస్‌ పట్ల మనం ప్యాషనేట్‌గా ఉండాలి. మన ప్రొడక్టివిటీని మగవాళ్లతో సమానంగా, చెప్పాలంటే కాస్తంత ఎక్కువగానే రిజల్ట్స్‌ చూపించాలి. మనం చేసే పని ప్యాషనేట్‌గా చేస్తూ, ఇతరులకు సహాయం చేయగలిగితే, పరిశోధనారంగంలో సక్సెస్‌ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అమ్మాయిలు తమ అభిరుచి ఎందులో ఉందో గుర్తించి, మనస్ఫూర్తిగా ఆ రంగంలో పనిచేస్తూ పోవాలి. అయినా అందులోనూ ఆటంకాలు, అపజయాలు వస్తాయి. ఆటంకాలు వచ్చినప్పుడు ఎవరో వచ్చి మనకు ఏదో చేస్తారని ఎదురుచూడకూడదు. మనకు మనమే ధైర్యంగా ముందుకు సాగాలి. 

సమస్యలు ఎదురైనప్పుడు సమస్యలకు పరిష్కారాలను మనమే వెతుక్కోవాలి. నేను అలాగే పనిచేశాను. మనం ఎవరికన్నా తక్కువ కాదు. మనం అందరితోనూ సమానం, సమానం కంటే మనం ఎక్కువ అనే భావనతో మనం పనిచేసినప్పుడే ఆనందంగా ముందుకు సాగిపోగలం.

నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బయోకెమిస్ట్రీలో పీజీ, జేఎన్టీయూ నుంచి బయోటెక్నాలజీలో ఎంటెక్‌ పూర్తి చేశాను. అప్పట్లో నాకు యూజీసీ ఫెలోషిప్‌ వచ్చినా, సెంటర్‌ ఫర్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)లో పీహెచ్‌డీ చేయాలని మా ప్రొఫెసర్స్, పేరెంట్స్‌ ఒత్తిడి చేయడంతో ఇందులో చేరాను. అలాగని సీసీఎంబీలో చేరడం పట్ల నాకు ఎలాంటి విచారం లేదు. 

కేంద్ర ప్రభుత్వ సంస్థ కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) పరిధిలో పనిచేసే సీసీఎంబీ హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఉంది. సీసీఎంబీ ఫౌండర్‌ డైరెక్టర్‌ పుష్పమిత్ర భార్గవ, ప్రొఫెసర్‌ లాల్జీ సింగ్‌ నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆయన వద్దనే ఏడాదిన్నర పాటు డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ వర్క్, తర్వాత డాక్టర్‌ ఎం.ఆర్‌.దాస్‌ వద్ద బ్రెస్ట్‌ ట్యూమర్స్, హెపటైటిస్‌–బి వైరస్‌ పరిశోధనలు సాగించాను. ఆ తర్వాత 1996లో ప్లాంట్‌ మాలిక్యులర్‌ బయాలజీకి మారి, అక్కడి పరిశోధనల్లో కొత్త వరివంగడాలను కనుగొనడం చాలా సంతోషకరమైన కాంట్రిబ్యూషన్‌. 

మన దేశంలోని రైతులకు ఉపయోగపడే వరివంగడం కనుగొనడంలో కీలక పాత్ర పోషించాను. వరి పంటకు ఎక్కువగా సోకే ఎండాకు తెగులు (బ్యాక్టీరియల్‌ లీఫ్‌ బ్లైట్‌) తట్టుకునే వరివంగడాన్ని నాటి గవర్నర్‌ నరసింహన్‌ చేతుల మీదుగా 2008లో నల్లగొండ జిల్లా గడ్డపల్లిలో విడుదల చేయించాం. మా సూపర్‌వైజర్‌ డాక్టర్‌ రమేష్‌ శొంఠి. ఆయన ఆధ్వర్యంలో ఈ వర్క్‌ అంతా నేనొక్కదాన్నే చేశాను. నిజానికి ఇది ముగ్గురు మనుషులు చేయాల్సిన పని. మహిళలు తలచుకుంటే చేయలేనిది ఏదీ లేదు అనేదే నా సందేశం. మహిళల్లో మల్టీ టాస్కింగ్‌ టాలెంట్‌ ఎక్కువగా ఉంటుంది. 

వరి వంగడాలపై నా పరిశోధన
వరి పండించే రైతులకు ఎండాకు తెగులు (బ్యాక్టీరియల్‌ లీఫ్‌ బ్లైట్‌) పెద్ద సమస్య. ఈ తెగులును తట్టుకునే రోగనిరోధక శక్తిగల జన్యువులను సన్నబియ్యం దిగుబడిని ఇచ్చే వరిలోకి ‘ఇంట్రోగ్రెస్‌’ చేసి, 2008లో ‘ఇంప్రూవ్డ్‌ సాంబ మసూరి’ రకాన్ని విడుదల చేశాం. ఇప్పుడు దాని మీద మరిన్ని పరిశోధనలు సాగి స్తున్నాం. ‘స్టీల్త్‌ బ్లైట్‌’, ‘బ్రౌన్‌ ప్లాంట్‌ హోపర్‌’ వంటి వ్యాధులను తట్టుకోవడమే కాకుండా, ఫాస్ఫరస్‌ లోపం, పొలంలో నీరు నిల్వ చేరడం, నీటిలో అధిక లవణీయత వంటి ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకునేలా దీనిని రూపొందించడానికి కొన్ని జన్యువులను ఇదే వరి వంగడంలోకి చొప్పించి, మూడు కొత్త వంగడాలను సృష్టించాం. 

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ మూడు రకాల వంగడాలను జాతికి అంకితం చేశారు. వీటి విత్తనాలను త్వరలోనే రైతులకు ఉచితంగా పంపిణీ చేయనున్నాం. ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రీసెర్చ్‌’ సహకారంతో సీసీఎంబీ వరి వంగడాలను అభివృద్ధి చేస్తోంది. సీసీఎంబీ రూపొందించిన వంగడాలను ఐఐఆర్‌ఆర్‌ బ్రీడింగ్‌ చేస్తోంది. మా పరిశోధనల ఫలితంగా రైతన్నలకు అధిక దిగుబడులు వచ్చి, వారికి గిట్టుబాటు ధర లభించి, వారి జీవితాల్లో కొంతైనా మార్పు తేగలిగినందుకు మాకు సంతృప్తిగా ఉంది.
డాక్టర్‌ విష్ణుప్రియ, శాస్త్రవేత్త, సీసీఎంబీ 
గోపాలకృష్ణ మయ్యా

(చదవండి: ‘ఆమె’ ఆరోగ్యమే... సమాజ ఆరోగ్యం!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement