చలో హైదరాబాద్‌ | funday crime stroy | Sakshi
Sakshi News home page

చలో హైదరాబాద్‌

Mar 1 2026 12:01 PM | Updated on Mar 1 2026 12:08 PM

funday crime stroy

ఆసిఫ్‌ రజా కమాండో ఫోర్స్‌ను (ఏఆర్‌సీఎఫ్‌) ఇండియన్‌ ముజాహిదీన్‌గా (ఐఎం) మార్చిన అమీర్‌ రజా ఖాన్‌ పాకిస్తాన్‌లో ఉంటూ ఇక్కడ కథ నడిపించాడు. 2005 నుంచి విధ్వంసాలు ప్రారంభించిన ఐఎంలో రియాజ్‌ భత్కల్‌ కీలక పాత్ర పోషించాడు. ఇతడికి ఖయాముద్దీన్‌ కపాడియా కుడిభుజంగా వ్యవహరించాడు. 2008లో అహ్మదాబాద్‌ పేలుళ్లు తర్వాత ముంబైలో దొరికిన వాహన చోరుల తీగ లాగితే ఢిల్లీలో బాట్లాహౌస్‌ ఎన్‌కౌంటర్‌ డొంక కదిలింది. దీంతో ఐఎం ఉగ్రవాదుల అరెస్టులు ప్రారంభం కావడంతో రియాజ్, కపాడియాలతో పాటు అనేక మంది ఐఎం ఉగ్రవాదులు హైదరాబాద్‌కు క్యూ కట్టారు. ఎందుకు? ఇక్కడ ఎవరిని కలిశారు?...

దేశవ్యాప్తంగా పేలుళ్ల కోసం ఐఎం ఉగ్రవాద సంస్థ చెక్క పెట్టెలతో పడవల మాదిరిగా తయారు చేసిన షేప్డ్‌ బాంబ్స్‌ వాడారు. టైమర్‌ ఆధారంగా పేలే సర్క్యూట్‌ ఉన్న వీటిలో ఓ ఎలక్ట్రానిక్‌ మైక్రోచిప్‌ అత్యంత కీలకంగా పని చేసింది. వీటిని కేరళలోని మలప్పురం నుంచి వచ్చి హైదరాబాద్‌ శివార్లలోని రాజేంద్రనగర్‌లో స్థిరపడిన షయనుద్దీన్‌ అలియాస్‌ సత్తార్‌ తయారు చేశాడు. వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్‌ అయిన ఇతడికి కేరళలో ఉండగానే స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమీ) ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పడ్డాయి. 1995లో కేరళ ముఖ్యమంత్రి ఈకే నయనార్‌ను హత్య చేయడానికి కుట్రపన్నిన కేసులో అరెస్టు అయ్యాడు. సిమీ ద్వారానే రియాజ్‌ భత్కల్‌తో ఇతడికి సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో 2005 నుంచి ఎలక్ట్రానిక్‌ మైక్రోచిప్స్‌ తయారీ బాధ్యతల్ని రియాజ్‌ భత్కల్‌ ఇతడికి అప్పగించాడు.

సత్తార్‌ అందించిన మైక్రోచిప్స్‌ను రియాజ్‌ భత్కల్‌ గుజరాత్, కర్ణాటక తదితర ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లకు వినియోగిస్తాడు. 2008 జూలైలో అహ్మదాబాద్, సూరత్‌లను ఐఎం టార్గెట్‌ చేసింది. ‘ది పూల్‌ ఆఫ్‌ ఆల్‌ టెర్రరిస్టు’ పేరుతో పెద్ద సంఖ్యలో వరుస పేలుళ్లకు పథకం వేస్తుంది. దీనికోసం తయారు చేసే దాదాపు 70 బాంబుల్లో ఉంచాల్సిన మైక్రోచిప్స్‌ తయారు చేసి ఇవ్వాల్సిందిగా రియాజ్‌ నుంచి సత్తార్‌కు ఆదేశాలు అందాయి. అన్నింటినీ తక్కువ సమయంలో తానొక్కడే తయారు చేయలేనని భావించిన సత్తార్‌... తన భార్య, కుమారులకు విషయం చెప్పకుండా ఈ పని అప్పగించాడు. వారికీ ఈ రంగంలో ప్రవేశం ఉన్నా, పరిపక్వత లేదు. వీరు తయారు చేసిన మైక్రోచిప్స్‌ను రియాజ్‌ ఆదేశాల మేరకు మరో ఐఎం ఉగ్రవాది నౌషాద్‌ వచ్చి తీసుకువెళ్లాడు. అహ్మదాబాద్‌లో పెట్టిన బాంబుల్లో సత్తార్‌ తయారు చేసిన చిప్స్, సూరత్‌ బాంబుల్లో అతడి భార్య, కుమారుడు తయారు చేసిన చిప్స్‌ వాడారు. ఈ కారణంగానే సూరత్‌లో ఒక్క బాంబు కూడా పేలకుండా దొరికాయి. 

బాట్లా హౌస్‌లో సజీవంగా దొరికిన ఉగ్రవాది ఆరిజ్‌ ఖాన్‌ విచారణ తర్వాత వివిధ ఏజెన్సీలు వరుసపెట్టి ఐఎం ఉగ్రవాదులను అరెస్టు చేశాయి. 2008 అక్టోబరు 3న ఒకేసారి అరెస్టయిన 15 మందిలో సయ్యద్‌ నౌషాద్‌ ఒకడు. ఇతడి విచారణలోనే మాస్టర్‌మైండ్‌ రియాజ్‌ భత్కల్, సత్తార్‌ మధ్య ఉన్న సంబంధాలు వెలుగులోకి వస్తాయి. అదే సమయంలో జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సత్తార్‌ సమీప బంధువు రహీంతో పాటు ఫయాజ్, ఫయీజ్‌ అనే ఉగ్రవాదులు చనిపోయారు. వారిద్దరూ 2008 సెప్టెంబరులో ఉగ్రవాద శిక్షణ కోసం హైదరాబాద్‌ వచ్చి, సత్తార్‌ వద్ద ఆశ్రయం పొందారనే ఆరోపణ ఉంది. నౌషాద్‌ విచారణలోనే చిప్స్‌ను రియాజ్‌ ఆదేశాల మేరకు సత్తార్‌ తయారు చేసి ఇచ్చినట్లు, తాను హైదరాబాద్‌ వెళ్లి వాటిని తీసుకువచ్చినట్లు అంగీకరించాడు.

ఐఎం మిస్టరీని ఛేదించిన ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు 2008 సెప్టెంబరు, అక్టోబరుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 20 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఈ మాడ్యుల్‌ మొత్తానికీ హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్‌లో బాంబు పెట్టిన, జంట పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న రియాజ్‌ భత్కల్‌ కీలకమని గుర్తించి వేట ప్రారంభించి, 2008 అక్టోబరు 6న ఐఎం మీడియా సెల్‌ ఇన్‌చార్జ్‌ మహ్మద్‌ మన్సూర్‌ అస్ఫర్‌ పీర్భాయ్‌ను పుణేలోని అతని ఇంటి నుంచి అరెస్టు చేశారు. ఆ సమయంలో రియాజ్‌ భత్కల్‌ అక్కడి ఖాండ్వాలోని డాక్టర్‌ అన్వర్‌ అలీ భగ్వాన్‌ ఫ్లాట్‌లో ఉన్నాడు. పీర్భాయ్‌ అరెస్టు సమాచారం అందుకున్న భత్కల్‌ తన అనుచరుడు ఖయాముద్దీన్‌ కపాడియాతో కలిసి అక్కడ నుంచి పరారై హైదరాబాద్‌ వచ్చి సత్తార్‌ను కలిసి ఆశ్రయం ఇవ్వాలని కోరాడు. అయితే హైదరాబాద్‌ నగరంలో ఉండటం అంత మంచిది కాదని అతడు చెప్పడంతో కర్ణాటకలోని కర్వార్‌కు పారిపోయారు. 2009 జనవరిలో తెలంగాణ, కేరళ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో సత్తార్‌ చిక్కాడు.  

అక్కడ నుంచి తన సోదరుడు ఇక్బాల్‌తో పాటు మరికొందరితో కలిసి రియాజ్‌ భత్కల్‌ దేశం దాటేశాడు. పాకిస్తాన్‌ చేరిన వీళ్లు ఐఎస్‌ఐ రక్షణలో అక్కడి నుంచే అమీర్‌ రజా ఖాన్‌తో కలిసి ఇక్కడ మరికొన్ని విధ్వంసాలు చేయించారు. రియాజ్‌ సమీప బంధువైన యాసీన్‌ భత్కల్‌ ఐఎంకు కో–ఫౌండర్‌గా మారాడు. 2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చి సెంటర్‌ వద్ద మరికొందరు ఉగ్రవాదులతో కలిసి ఇతడే చేయించాడు. అదే ఏడాది ఆగస్టులో నేపాల్‌లో ఇంటెలిజెన్స్‌ బ్యూరో చేపట్టిన ఆపరేషన్‌లో యాసీన్‌ చిక్కాడు. ఈ కేసులో ఇతడితో పాటు మిగిలిన వారికీ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు ఉరి శిక్ష విధించింది. దీన్ని తెలంగాణ హైకోర్టు ఖరారు చేసింది. యాసీన్‌ సహా ఉగ్రవాదులపై ఇతర రాష్ట్రాల్లో నమోదైన కేసుల విచారణ పూర్తి కావడంతో పాటు ఇతర ఫార్మాలిటీస్‌ పూర్తి అయితే ఇది అమలయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement