ఢిల్లీ: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పాక్ సైన్యం ఆప్ఘన్ ప్రజలపై వైమానిక దాడులు ప్రారంభించింది. ‘ఆపరేషన్ గజబ్ లిల్ హక్’పేరిట కాబూల్, కాందహార్, పాక్తియా తదితర ప్రాంతాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో కనీసం 274 మంది తాలిబన్లు మరణించారు. ఈ నేపథ్యంలో దాడులపై పలు దేశాలు స్పందిస్తున్నాయి.
ఉద్రిక్తతలపై చైనా, రష్యా ఆందోళన
పాక్, అఫ్గాన్ మధ్య 2,611 కిలోమీటర్ల మేర సుదీర్ఘ సరిహద్దు ఉంది. దీన్ని డ్యురాండ్ లైన్ అని పిలుస్తుంటారు. అయితే, ఈ సరిహద్దును తాలిబన్లు గుర్తించడం లేదు. ఇటీవల డ్యురాండ్ లైన్ వద్ద అఫ్గాన్ దళాల కాల్పుల్లో 55 మంది తమ సైనికులు మృతి చెందినట్లు పాకిస్తాన్ రక్షణశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. తాలిబన్లు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే దాడులకు దిగుతున్నారని, తమను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. తమ చెక్‌పోస్టులను కూడా స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది.
పాక్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ తుర్కియే, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు. తాజా పరిణామాలను వారికి వివరించారు. పాక్, అఫ్గాన్ సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నామని ఆయా మంత్రులు స్పష్టంచేశారు. మరోవైపు పాక్–అఫ్గాన్ ఉద్రిక్తతలు పెచ్చరిల్లడంపై చైనా, రష్యా ఆందోళన వ్యక్తంచేశాయి. వివాదాలను దౌత్య మార్గాల్లో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుదేశాలకు సూచించాయి. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని చైనా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. పరిస్థితి మరింత విషమించకముందే సాధ్యమైనంత త్వరగా కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని కోరింది.


