ఆహా..ఓహో.. ఆఫ్గాన్‌పై యుద్ధం వేళ పాకిస్థాన్‌పై ట్రంప్‌ ప్రశంసలు | Amid Rising War Tensions Between Pakistan And Afghanistan, Donald Trump Lauds Shehbaz Sharif And Asim Munir | Sakshi
Sakshi News home page

ఆహా..ఓహో.. ఆఫ్గాన్‌పై యుద్ధం వేళ పాకిస్థాన్‌పై ట్రంప్‌ ప్రశంసలు

Feb 28 2026 2:37 AM | Updated on Feb 28 2026 12:50 PM

donald trump comments on afghanistan and pakistan war

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి షెహ్‌బాజ్ షరీఫ్, పాకిస్థాన్‌ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (cdf)  ఆసిమ్ మునీర్‌లను డొనాల్డ్‌ ట్రంప్‌ పొగడ్తలతో ముంచెత్తారు. పాకిస్థాన్‌-ఆప్ఘనిస్థాన్‌ యుద్ధం పతాక స్థాయికి చేరుకున్న క్రమంలో ట్రంప్‌ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చాంశనీయంగా మారాయి. 

పాకిస్థాన్‌-ఆఫ్గనిస్థాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. వైట్‌ హౌస్‌లోని సౌత్‌లాన్‌లో ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ..‘ పాకిస్థాన్‌తో నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇస్లామాబాద్‌తో నేను చాలా బాగా కలిసిపోతాను’అని వ్యాఖ్యానించారు. షెహ్‌బాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. వారు గొప్ప నాయకులని అభివర్ణించారు.

ఒకవైపు యుద్ధం కొనసాగుతున్నప్పటికీ, ట్రంప్‌ పాకిస్థాన్‌ నాయకత్వంపై ప్రశంసలు కురిపించడం, అమెరికా ఇస్లామాబాద్‌ వైపు దౌత్యపరమైన మద్దతు చూపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఆఫ్గనిస్థాన్‌కి అమెరికా నుంచి ప్రత్యక్ష మద్దతు లభించకపోవచ్చనే సందేహాలను కూడా రేకెత్తిస్తోంది.

ఓపెన్ వార్ 
పాక్‌-ఆఫ్గనిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు ‘ఓపెన్ వార్’ స్థాయికి చేరుకున్నాయి. పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ శుక్రవారం అధికారికంగా యుద్ధాన్ని ప్రకటించారు. ఆఫ్గనిస్థాన్‌ నుంచి జరిగిన సరిహద్దు దాడులకు ప్రతిగా, పాకిస్థాన్‌ ‘ఘజబ్ లిల్-హక్’ అనే ఆపరేషన్ ప్రారంభించి కాబూల్‌తో పాటు మరికొన్ని ప్రావిన్స్‌లపై వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో వందలాది తాలిబాన్‌ సైనికులు మృతి చెందారని పాకిస్థాన్‌ వర్గాలు ప్రకటించాయి. మరోవైపు, ఆఫ్గనిస్థాన్‌ కూడా పాకిస్థాన్‌ సైన్యంపై గణనీయమైన నష్టం కలిగించామని చెప్పింది. ఇరువైపులా భారీ ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం.

పాకిస్థాన్‌-ఆఫ్గనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఫిబ్రవరి 26న సరిహద్దు కాల్పుల తర్వాత వేగంగా ‘ఓపెన్ వార్’ స్థాయికి చేరుకున్నాయి. తాలిబాన్‌ అధికారులు నంగర్‌హార్‌, కునార్‌, ఖోస్ట్‌ వంటి తూర్పు ప్రావిన్స్‌లలో రాత్రి ఎనిమిది గంటల సమయంలో దాడులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇస్లామాబాద్ (పాక్‌ రాజధాని)మాత్రం ఆఫ్గన్‌ తాలిబాన్‌ అనవసరంగా కాల్పులు ప్రారంభించిందని ఆరోపించింది. అందుకు ప్రతిస్పందనగా కాల్పులకు దిగినట్లు తెలిపింది.

కొన్ని గంటల్లోనే పాకిస్థాన్‌ వైమానిక దాడులు,ఆర్టిలరీ దాడులు అంటే సరిహద్దు ప్రాంతాల్లో , యుద్ధరంగంలో శత్రు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జరిపే దాడులను కాబూల్‌తో పాటు సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. తాలిబాన్‌ కూడా ప్రతిదాడులు జరిపి పాకిస్థాన్‌ సైనిక స్థావరాలపై డ్రోన్‌ దాడులు చేశామని తెలిపింది. ఇరువైపులా ప్రాణనష్టం గణనీయంగా జరిగిందని వర్గాలు చెబుతున్నప్పటికీ, మృతులు,గాయపడిన వారి సంఖ్యలపై స్పష్టత రావాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement