ఇజ్రాయెల్‌ చేరుకున్న అమెరికా భారీ యుద్ధనౌక | Uss Gerald R Ford Arrives Near Israel | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ చేరుకున్న అమెరికా భారీ యుద్ధనౌక

Feb 27 2026 8:23 PM | Updated on Feb 27 2026 9:40 PM

Uss Gerald R Ford Arrives Near Israel

అప్‌డేట్స్‌

ఏ క్షణంలోనైనా ఇరాన్‌పై దాడి చేయడానికి అగ్రరాజ్యం అమెరికా అన్ని విధాల సన్నద్ధమవుతున్నది. జనవరి నుంచి ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరగడంతో పశ్చిమాసియాలో అతి పెద్ద సైనిక కేంద్రమైన ఖతార్‌లోని అల్‌-ఉదీద్‌ వైమానిక స్థావరంలో ఉన్న అమెరికా దళాలు పేట్రియాట్‌ క్షిపణులను మొబైల్‌ ట్రాక్‌ లాంచర్లలోకి ఎక్కించి తరలించాయి.  ఒకవేళ అమెరికా యుద్ధానికి సిద్ధమైతే దాన్ని తిప్పికొట్టేందుకు ఇరాన్‌ సైతం అన్ని విధాలా సమాయత్తమవుతోంది.

 

  • ఇరాన్‌లో అత్యంత అధికంగా శుద్ధి చేసిన యురేనియం నిల్వల్లో కొంత భాగం.. ఆ దేశ మిలటరీ విభాగాలకు చేరింది. 
  • జూన్‌లో అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులలో  ఇరాన్‌ సొరంగ  సముదాయంలోని ప్రవేశ ద్వారం దెబ్బతిన్నప్పటికీ, అది పూర్తిగా దెబ్బ తినలేదనేది తాజా పరిస్థితిని  బట్టి అర్ధమవుతోంది.
  • ఇరాన్‌పై అమెరికా దాడికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ గెరాల్డ్ ఆర్‌ ఫోర్డ్ ఇజ్రాయెల్ ఉత్తర తీరానికి చేరుకుంది. 

  • గతంలో వెనిజులాపై అమెరికా చేపట్టిన ఆపరేషన్‌లో ఈ నౌక కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఇరాన్‌పై జరగబోయే దాడికి కూడా సిద్ధంగా ఉందని సమాచారం.

  • ఇప్పటికే పశ్చిమాసియాలో మోహరించిన అమెరికా యుద్ధ నౌకలు మోహరించాయి. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఎఫ్22 రాప్టర్ స్టెల్త్ 12 యుద్ధ విమానాలను ఇజ్రాయెల్‌కు అమెరికా తరలించింది. 

  • ఈ యుద్ధ విమానాలు ఫిబ్రవరి 24 బ్రిటన్‌లోని లాకెన్‌హీత్ ఎయిర్‌బేస్ నుండి బయలుదేరి దక్షిణ ఇజ్రాయెల్‌లోని  ఓ వైమానిక స్థావరానికి చేరుకున్నట్లు సమాచారం.

 

వివిధ దేశాల్లోని బేస్‌ల నుండి యుద్ధ విమానాలు కదులుతున్నాయి. ఖతార్‌లోని 'అల్-ఉదైద్' బేస్‌కు సంబంధించి ఈ ఉదయం విడుదలైన ఫోటోల ప్రకారం.. అక్కడ ఒక్క అమెరికన్ ఇంధన నింపుకునే విమానం కూడా మిగిలి లేదు. అదే సమయంలో.. వాటిలో చాలా విమానాలు ఇజ్రాయెల్‌లోని 'బెన్ గురియన్' విమానాశ్రయంలో నిలిపి ఉంచినట్లు కనిపించాయి.

తాజా చిత్రాల ప్రకారం.. అల్-ఉదైద్ బేస్‌లో కేవలం 12 రవాణా విమానాలు (6 C-17 మరియు 6 C-130), మూడు అటాక్ హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయి. నిన్నటి సమాచారం ప్రకారం, అమెరికా సైన్యం అక్కడ చాలా తక్కువ విమానాలను వదిలివెళ్లింది. ఒక KC-135 ట్యాంకర్ విమానం (ఇది కూడా ఇప్పటికే టేకాఫ్ అయి ఉండవచ్చు), రెండు C-130 రవాణా విమానాలు, ఏడు సాయుధ హెలికాప్టర్లు మాత్రమే అక్కడ ఉన్నాయి.

గ్రీస్‌లోని 'చానియా' విమానాశ్రయం నుండి యూఎస్ నేవీకి సంబంధించిన దృశ్యాలు విడుదలయ్యాయి. అక్కడ సుమారు ఎనిమిది రీఫ్యూయలింగ్ విమానాలు, రెండు RC-135 నిఘా విమానాలు, F-15 యుద్ధ విమానాలు, ఒక రవాణా విమానం కనిపించాయి. బాంబర్ ఐలాండ్‌లో ఈ ఉదయం ఇక్కడ సుమారు 14 యూఎస్ ఎయిర్ ఫోర్స్ విమానాలు రికార్డయ్యాయి. ఇందులో యుద్ధ విమానాలు, ఇంధన విమానాలు, రవాణా విమానాలతో పాటు సముద్రపు నిఘా, యుద్ధతంత్రం కోసం ఉపయోగించే P-8 విమానాలు కూడా ఉన్నాయి. సౌదీలోని 'ప్రిన్స్ సుల్తాన్' బేస్‌లో కూడా భారీ సంఖ్యలో విమానాలు కనిపించాయి. వీటిలో KC-135 రీఫ్యూయలింగ్ విమానాలు, కమాండ్ అండ్‌ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే E-11A విమానాలు ఉన్నాయి.

మరోవైపు, ఒక వేళ ఇరాన్‌పై దాడి జరిగితే.. అమెరిక స్థావరాలపై కూడా ఇరాన్ ప్రతి చర్య దాడులకు తెగబడే అవకాశం ఉంది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో యుద్ధవిమానాలు, నౌక దళాలను యూస్‌ మోహరించింది. పలు సైనిక స్థావరాల్లో దాదాపుగా 10 వేల మంది యూఎస్ సైనికులు మోహరించారు. ఇరాన్‌పై క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం.

టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయం. అమెరికా సైనిక విమానాలతో నిండిపోయింది. కాగా, ఇరాన్‌లోని పర్చిన్ (Parchin) ప్రాంతంలో ఉన్న రివల్యూషనరీ గార్డ్స్ సైనిక స్థావరం వద్ద గత కొన్ని నిమిషాల క్రితం భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్‌పై అమెరికా దాడులకు తెగబడే అవకాశం ఉండటంతో రక్షణ చర్యల్లో భాగంగా ఇజ్రాయెల్ పార్లమెంట్ సమీపంలో 'ఐరన్ డోమ్' క్షిపణి రక్షణ వ్యవస్థ బ్యాటరీని ఏర్పాటు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement