ఇంటర్నెట్ యుగంలో వైరల్ అవుతున్న కంటెంట్‌లో చాలావరకు వినోదం, ట్రోల్స్ లేదా షాకింగ్ అంశాలే ఎక్కువ. కానీ కొన్నిసార్లు అత్యంత సాదాసీదా భావోద్వేగ క్షణం కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హృదయాలను కదిలిస్తుంది. అలాంటి అరుదైన కథే పంచ్ అనే 7 నెలల జపనీస్ మకాక్‌ది. జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో ఉన్న ఈ చిన్న కోతి, తల్లి వదిలేయడంతో ఒంటరిగా మిగిలిపోయింది. ఆ ఒంటరితనంలో, తనకు ఏకైక సాంత్వనగా మారింది ఒక ‘స్టఫ్డ్ ఒరంగుటాన్ బొమ్మ’. దాన్ని గట్టిగా పట్టుకుని నిద్రపోతూ, భయపడినప్పుడు మరింత బలంగా ఆలింగనం చేసుకుంటూ ఉన్న దృశ్యాలు, వీడియోలుగా బయటకు రావడంతో, సోషల్ మీడియాలో తుఫానులా వ్యాపించాయి. ఈ ట్రెండ్ హైదరాబాద్‌లోనూ కనిపించింది. దీంతో ఈ బొమ్మకు నగరంలోనూ, ఆన్‌లైన్‌లోనూ ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి. పంచ్ పట్టుకున్న ఆ ప్లష్ టాయ్ ప్రపంచ ప్రఖ్యాత ఫరి్నచర్ బ్రాండ్ ఐకియాకు చెందినది కాగా.. ఈ ప్రభావంతో పలు దేశాల్లోని తమ ఐకియా స్టోర్స్‌లో ఈ బొమ్మకు సోల్డ్ ఔట్ బోర్డుల పెట్టడం విశేషం.
ఒక జూలో ఒరంగుటాన్ బొమ్మతో కోతి (మకాక్) వైరల్ పంచ్ వీడియోలు వైరల్ కావడానికి కారణం కేవలం ‘క్యూట్’ ఫ్యాక్టర్ మాత్రమే కాదు. ఈ తరం సోషల్ మీడియా వినియోగదారులు కూడా. ముఖ్యంగా హైదరాబద్ వంటి నగరాల్లో నివసించే యువత.. భావోద్వేగ అనుబంధం, మానసిక ఆరోగ్యం, ఒంటరితనం వంటి అంశాల పట్ల మరింత సున్నితంగా స్పందిస్తున్నారు.
పంచ్ కథలో కనిపించింది అదే మానవీయ కోణం. ‘కంఫర్ట్’ అనేది మనుషులకు మాత్రమే కాదు, జంతువులకూ అవసరమనే భావన ఈ కథ ద్వారా బలంగా ముందుకొచి్చంది. ఈ ప్రభావంతో హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఈ ప్లష్ బొమ్మకు ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడిందని ప్రముఖ ఈ–కార్ట్ సంస్థలు వెల్లడించాయి. ముఖ్యంగా యువత, పెట్ లవర్స్ ఈ బొమ్మలను పెద్ద సంఖ్యలో ఆర్డర్ చేస్తున్నారని చెబుతున్నాయి. కొందరు ఈ బొమ్మలతో దిగిన ఫొటోలు, రీల్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరింత సందడి చేస్తున్నారు.
‘జూ’కు వెళ్లోద్దామా..
హైదరాబాద్ యువతలో పెరుగుతున్న పెట్ కల్చర్, మెంటల్ హెల్త్ చర్చలు, ‘కంఫర్ట్ ఆబ్జెక్ట్స్’ పట్ల ఆసక్తి.. ఇవన్నీ పంచ్ కథను నగరానికి మరింత దగ్గర చేశాయి. రీల్స్, షార్ట్స్, స్టోరీల రూపంలో ఈ కథ స్థానిక సోషల్ మీడియా ఫీడ్స్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కారణంగా నగరంలోని జూలకు వెళ్లే వారి సంఖ్య పెరగనుందని పలువురి అభిప్రాయం. అసలు అలాంటి జంతువు నగరంలోని జూ పార్క్‌లో ఉందా అని పలువురు ఔత్సాహికులు గూగుల్ సెర్చ్‌లో అడగడం కొసమెరుపు. అయితే నగరంలోని జూలో ప్రస్తుతం విభిన్న రకాల కొండవానరాలు (మకాక్) కనిపిస్తాయి.. టఫ్టెడ్ మార్మోసెట్, స్క్విరెల్ మంకీ, క్యాపుచిన్ మంకీ, బోనెట్ మకాక్, లయన్–టెయిల్డ్ మకాక్, రేసస్ మకాక్ వంటి స్థానిక కోతులు ఉన్నాయి. కానీ జపనీస్ మకాక్ (పంచ్ మాదిరి) మాత్రం ఇందులో ఉండదు. ఇక ఒరంగుటాన్ వంటి ఏషియాటిక్ గొరిల్లా తరహా అడవిపిల్లి/ఏప్ జాతులు గురించి ప్రభుత్వ జూ వెబ్‌సైట్ ప్రకారం స్పష్టమైన ప్రస్తావన లేదు. పంచ్ కథ, ఈ డిజిటల్ యుగంలో మానవీయ కోణానికి నిదర్శనంగా నిలుస్తోంది.
లైఫ్‌స్టైల్ మార్కెట్‌పై ప్రభావం..
పంచ్ పట్టుకున్న ఆ ప్లష్ టాయ్ సాఫ్ట్ ఒరంగుటాన్ బొమ్మ వీడియోలు వైరల్ అనంతరం జపాన్, అమెరికా, దక్షిణ కొరియాతో పాటు భారత్ వంటి దేశాల్లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కొన్ని దేశాల్లో ఇది స్టాక్ అవుట్ అయినట్టు సోషల్ మీడియాలో వినియోగదారులు పేర్కొన్నారు.
సోషల్ మీడియా వైరల్ ట్రెండ్‌లు ఎలా నేరుగా లైఫ్‌స్టైల్ కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నాయో చెప్పే తాజా ఉదాహరణ. ఒక భావోద్వేగ కథ, ఒక సాధారణ ఉత్పత్తిని గ్లోబల్ ట్రెండ్‌గా మార్చగలదన్న విషయం దీని ద్వారా మరోసారి స్పష్టమవుతోంది.


