వ్యవసాయంలో గుదిబండగా మారిన పాత పద్ధతులను వదిలించుకొని, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే చిన్న సన్నకారు రైతులు, ముందడుగు వెయ్యటం అంత తేలిక కాదు. కానీ, ఒక ఉత్తరప్రదేశ్ గ్రామానికి చెందిన మహిళా రైతులు సాగు నీరు తోడటానికి డీజిల్ ఇంజన్లకు బదులుగా సమష్ఠిగా సోలార్ పంపు వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. అధికాదాయం వచ్చే పంటలపై దృష్టి సారించటంతోపాటు నీటిపారుదల ఖర్చును సగానికి తగ్గించుకుంటున్నారు.
డీజిల్ ఇంజన్లతో పంటలకు నీరు పెట్టటం రైతులకు చాలా ఖరీదైన, నిర్వహణ కష్టతరమైన, కాలుష్యకారకమైన పని. ఇది గుర్తించిన ఉత్తరప్రదేశ్ మహిళా రైతులు నీటిపారుదల కోసం డీజిల్ ఇంజన్లకు స్వస్తి చెప్పి సౌరశక్తితో నడిచే పంపు హౌస్‌ను ఏర్పాటు చేసుకున్నారు. పనిలో పనిగా అధిక విలువ కలిగిన పంటలను పండిస్తూ అధికాదాయం ΄పొందుతున్నారు. పనిలో పనిగా నీటిపారుదల ఖర్చును సగానికి సగం తగ్గించుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలోని రాంవాపూర్ గ్రామంలో మహిళా రైతుల బృందం ఎండను ఉపయోగించుకొని సాగు నీటి సమస్యకు పర్యావరణహితమైన మార్గం కనుగొంది. ఉమ్మడి సౌరశక్తి నీటి΄ారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సోలార్ పంపు ప్రయోజనాలు చాలా ఉన్నాయి. సాగు నీటిపారుదల ఖర్చు తగ్గటం, వ్యవసాయంలో సౌలభ్యం పెరగటం, వాయు కాలుష్యాన్ని తగ్గించటం వంటి ప్రయోజనాలు సాధించారు.
సౌర విద్యుత్‌తో నడిచే నీటి పంపు వ్యవస్థను ఈ మహిళా రైతుల బృందం కోసం 2023 డిసెంబర్‌లో ఇండస్లాండ్ బ్యాంక్ మద్దతుతో ఆగా ఖాన్ ఫౌండేషన్ ద్వారా ఫ్లాగ్‌షిప్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ్ర΄ోగ్రామ్ కింద ఏర్పాటు చేశారు. మహిళా రైతులు ‘గంగా సించాయ్ వికాస్ సమితి’ బ్యానర్ కింద దీన్ని నిర్వహిస్తున్నారు.
సౌర నీటిపారుదల వ్యవస్థ 20.6 ఎకరాల విస్తీర్ణంలో పంటలకు నిరంతరాయంగా సాగు నీటిని అందిస్తోంది. దీని వల్ల 19 చిన్నకారు రైతుల కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి. వారు ఇప్పుడు సాంప్రదాయ మొక్కజొన్న, గోధుమ పంటలతోపాటు పుదీనా, కాకర, అరటి, ముల్లంగి, బెండ వంటి అధిక విలువ కలిగిన కూరగాయ పంటలు పండించగలుగుతున్నారు.
ఈ ప్రాజెక్ట్ నీటిపారుదల ఖర్చులను 50 శాతానికి పైగా తగ్గించింది. సాగు నీటి మీటర్ ఏర్పాటైంది. ప్రతి రైతు తమ పొలానికి ఎంత నీరు వాడుతున్నదీ ఇది నమోదు చేస్తుంది. ఒక యూనిట్ లేదా 1,000 లీటర్ల నీటిని రూ. 2 ఖర్చుతో అందిస్తారు. అక్కడి స్థానిక పరిస్థితుల్లో ఒక ఎకరానికి 2,50,000–3,00,000 లీటర్ల నీరు అవసరం. దీని మొత్తం ఖర్చు రూ. 500–600 అవుతుంది. ‘గతంలో, డీజిల్‌తో నడిచే పంపులు నడపడానికి రూ. 1,000–1,250 వరకు ఖర్చయ్యేద’ని ఒక మహిళా రైతు దేవి (60) అన్నారు సంతోషంగా. ఆమె కుటుంబం జీవనో΄ాధి కోసం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడింది.
గంగా సించాయ్ వికాస్ సమితి కమిటీ అధ్యక్షురాలుగా ప్రేమ్‌నందిని దేవి (45) వ్యవహరిస్తున్నారు. సోలార్ పంపు ఆపరేటర్ గదిలో నిలబడి ఆమె ఇలా వివరించారు: ‘మా బృందంలో ఇద్దరు మహిళలు నీటి వినియోగ ఛార్జీలను సేకరించి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ నిధులను సోలార్ పంపుసెట్ నిర్వహణ, ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిన భూమి అద్దె, అలాగే పంప్ ఆపరేటర్ జీతం కోసం మేం ఉపయోగిస్తాం’. ఈ సోలార్ పంపు నిర్వహణ ఖర్చుల కోసం మహిళా రైతులు ఎవరి సహాయమూ అడగటం లేదు.
ఈ ప్రాజెక్ట్ పనితీరుకు సంబంధించిన సమస్యలను చర్చించడానికి కమిటీ క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తుంది. వ్యవసాయ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మార్గాలు, పంట దిగుబడి, నష్టాలు, యూనిట్ నిర్వహణ ఖర్చు అవసరాల గురించి వారు చర్చిస్తారు. కుటుంబాల సంక్షేమం, విద్య, జీవనోపాధి సమస్యలపై కూడా మాట్లాడుకొని ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటారు. వారి కుటుంబాల్లోని పురుషులు ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవట్లేదు. గేటు బయట నిలబడి చూస్తారంతే.
అయితే, ఈ మార్పు అంత సులభం కాదు. సాంప్రదాయ డీజిల్‌తో నడిచే పంపు సెట్లను తొలగించడంలో మహిళలే కీలకపాత్ర వహించారు. డీజిల్ పంపులతో నీరు తోడటానికి కుటుంబంలో కనీసం ఒకరు లేదా ఇద్దరు మగ వాళ్లు పనిచేయటం అవసరం. ఇంజిన్‌ను క్రాంక్ చేయడంతోపాటు డీజిల్‌ను సేకరించడం కూడా పురుషుల బాధ్యత.
సాంప్రదాయ పంపు సెట్ల నిర్వహణ ఖర్చులూ ఎక్కువే. 20 ఎకరాలకు నీరు తోడితే దాదాపు 1,372 కిలోల వరకు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు విడుదలవుతాయి. రాంవాపూర్‌లో ఇప్పుడు మూలనపడి ఉన్న ఆయిల్ ఇంజన్లను చూస్తే.. ఒకప్పుడు ఆ గ్రామంలో స్వాతంత్య్రం లేక నిద్రాణంగా మిగిలిన మహిళలు గుర్తుకొస్తారు. ఇప్పుడు వారే క్రియాశీలంగా ఉన్నారు.
సౌర నీటిపారుదల పథకం విషయంలో తమ కుటుంబ సభ్యుల నుంచి మొదట్లో వ్యతిరేకత వచ్చిందని, ఇది అయ్యేపనేనా అనే సందేహాలను ఎదుర్కొన్నామని కమిటీ సభ్యులు అంటున్నారు. కొంతమంది పురుషులు ఇది ఎక్కువ కాలం నిలవదని నమ్మారు. మరికొందరు మహిళలతో సమావేశాలు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ‘ఈ ప్రయత్నం విజయవంతమైన తర్వాత, ప్రతి ఒక్కరూ ఇది తాము ఊహించినదేన’ని అంటున్నారని రైతు దేవి (65) అన్నారు. ‘ఇప్పుడు మా వ్యవసాయానికి డీజిలే కాదు, పురుషుల సహాయమూ అవసరం లేదు’ అన్నారామె.
గంగా సించాయ్ సౌర నీటిపారుదల ప్రాజెక్ట్ సభ్యులైన మహిళా రైతులకు మిగులు ఆదాయం రావటంతో వేరే పనుల్లో పెట్టుబడి పెడుతున్నారు. కుష్మా దేవి (54) సోలార్ పంపు నీటితోనే తన సొంత నర్సరీని ప్రారంభించింది. టమోటా, మిరప, పొట్ల, దోస మొదలైన మొక్కల నారును కొబ్బరిపొట్టులో పెంచుతున్నారు. ఒక్కో మొక్క రూ. 5–10కి ఇతర రైతులకు విక్రయిస్తున్నారు.
‘ఏదీ అసాధ్యం కాద’ని ప్రేమ్‌నందిని దేవి అనే మరో రైతు అన్నారు. ‘మా సమష్టి యాజమాన్యంలో నడిచే సోలార్ నీటి పంపే దీన్ని నిరూపించింది. ‘కమిటీలోని ప్రతి ఒక్క మహిళా రైతు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. సమావేశాల్లో మాట్లాడే ఉత్సాహం ఒకప్పుడు ఉండేది కాదు. ఇప్పుడు మాట్లాడేటప్పుడు తమ భర్త పేర్లను సైతం స్వేచ్ఛగా ప్రస్తావించటం వరకు ఎదిగారు. గంగా సించాయ్ వికాస్ సమితి మహిళలు భవిష్యత్ తరాలకు ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు. తమ కుటుంబాల సంక్షేమం తాము ఆధారపడిన సహజ వనరుల రక్షణతో ముడిపడి ఉందని వారు గట్టిగా నమ్ముతున్నారు. ఇదే కదూ.. నిజమైన అర్ధంలో సాధికారత అంటే?
– నిర్వహణ:
పంతంగి రాంబాబు
సాక్షి సాగుబడి డెస్క్
(చదవండి: వర్జిన్ కోకోనట్‌తో వండర్స్..!)


