వర్జిన్‌ కోకోనట్‌తో వండర్స్‌..! | Rohan Nazareths Mulgao Verde produces virgin coconut oil | Sakshi
Sakshi News home page

వర్జిన్‌ కోకోనట్‌తో వండర్స్‌..!

Feb 27 2026 11:21 AM | Updated on Feb 27 2026 11:26 AM

Rohan Nazareths Mulgao Verde produces virgin coconut oil

సాధారణ కొబ్బరి తోటను ఒక అద్భుతమైన ‘సూపర్‌ ఫుడ్‌’ ఉత్పత్తి కేంద్రంగా, వ్యవసాయ పర్యాటక స్థలంగా మార్చవచ్చా? నిస్సందేహంగా అంటున్నాడు గోవాకు చెందిన యువ రైతు పారిశ్రామికవేత్త రోహన్‌. తన తండ్రి నాటిన తోట అది. కొబ్బరి కాయలను మాత్రమే అమ్మేవారు. కరోనా తర్వాత ఈ ఫామ్‌పై దృష్టి సారించిన రోహన్‌ ఈ తోట రూపు రేఖలు మార్చేశారు. ఐదేళ్లలో తన కలను సాకారం చేసుకున్నారు. 

కొబ్బరి కాయలు, బోండాలు అమ్మే చోట.. కొబ్బరి పాల నుంచి ప్రత్యేక పద్ధతిలో ‘వర్జిన్‌ కోకోనట్‌ ఆయిల్‌’ను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. చెట్టుకు కాసే కాయ నుంచి వర్జిన్‌ కొబ్బరి నూనె తయారీ వరకు చేసే పనులను స్వయంగా చూడాలనుకునే వారికి ఫామ్‌ విజిట్‌కు ఆహ్వానిస్తున్నారు. పనిలో పనిగా సంప్రదాయ గోవా గ్రామీణ వంటకాలను రుచిచూపిస్తున్నారు. ఇటు వ్యవసాయ పర్యాటకం, అటు ఆరోగ్యదాయకమైన నూనె ఉత్పత్తితో మంచి ఆదాయం గడిస్తున్న రోహన్‌ యువ కొబ్బరి ‘రైతు పారిశ్రామిక వేత్త’గా ఆదర్శప్రాయుడయ్యారు. 

కొబ్బరైనా మరొకటైనా కేవలం పండించి ముడిసరుకుగా అమ్మజూపితే రైతుకు దక్కేది మార్కెట్‌ ధరలో కొంచమే. రూపం మార్చి, కొంచెం వ్యాపార దృష్టిని కలిపి అమ్మటం నేర్చుకుంటేనే రైతుకు ఆర్థిక భద్రత, సుస్థిరత చేకూరుతుంది. రైతులు ఆర్ధికంగా నిలబెట్టే మెలకువలు బోధించే నిపుణులు చెబుతుండే ఈ సూత్రాన్ని తు.చ. తప్పకుండా పాటించారు రోహన్‌. మైక్రోబయాలజిస్ట్‌గా శిక్షణ పొందిన రోహన్‌ ఎంబీఏ పూర్తిచేసి 2021 వరకు బెంగళూరులో వివిధ సంస్థల్లో దశాబ్దానికి పైగా పనిచేశాడు. 

కరోనా తర్వాత కుటుంబానికి చెందిన సంప్రదాయ కొబ్బరి తోటపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి గుణాత్మకమైన మార్పు సాధించారు. ఉత్తర గోవాలోని ముల్గావ్‌ అనే గ్రామంలోని ఒక చిన్న కొబ్బరి తోట వారిది. ఆరోగ్య స్పృహతో కూడిన వర్జిన్‌ కొబ్బరి నూనె బ్రాండ్‌ను నిర్మించాడు. శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెస్‌ చేసి వర్జిన్‌ కొబ్బరి నూనెను ఉత్పత్తి చేస్తున్నారు. స్థానికులకు జీవనోపాధిని కల్పిస్తున్నారు. 

సాధారణ కొబ్బరి కాయలను ఉత్పత్తి చెయ్యటానికి బదులు సమాజానికి ఔషధగుణాలు కలిగి ఉండే వర్జిన కొబ్బరి నూనెను గౌరవప్రదంగా ఎలా ఉత్పత్తి చేసి లాభదాయకంగా ఎలా అమ్మొచ్చో తెలియజెబుతున్నారు. ‘నిదానంగా తయారు చేసిన నిజమైన ఆహారం’ గురించి తెలుసుకోవాలనుకునే వారికి చక్కటి వ్యవసాయాధారిత పరిశ్రమను కళ్ల ముందుంచుతున్నారు.  

నూనె ఉత్పత్తికి ఆరు గంటలు.. 
ఆ తోటలో రోహన్‌ తండ్రి చాన్నాళ్ల క్రితం నాటిన దాదాపు 200 ఎత్తుగా ఎదిగిన కొబ్బరి చెట్లు ఉన్నాయి. 150కి పైగా లేత మొక్కలున్నాయి. సాధారణ కొబ్బరి నూనె తలకు రాసుకునే నూనెగా, కొన్ని సార్లు వంట నూనెగా ఉపయోగించడానికి మించి ప్రజలకు మేలైన ఆరోగ్యాన్నందించే సూపర్‌ఫుడ్‌గా అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని అతను నమ్మాడు. 

కొబ్బరి పాలతో తయారు చేసే వర్జిన్‌ కొబ్బరి నూనె రూపంలోకి మార్చటానికి రోహన్‌ వ్యక్తిగత శ్రద్ధతో కృషి చేశారు. పచ్చి కొబ్బరి నుంచి పాలు తీసిన తర్వాత, ఆ పాల నుంచి ట్రేడ్‌మార్క్‌ చేసిన ‘హాట్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ యాంటీఆక్సిడెంట్‌ లాడెన్‌’ పద్ధతిలో పోషకాలు పోకుండా నెమ్మదిగా నూనెను వెలికి తీస్తారు. ఈ ప్రక్రియకు 6 గంటల సమయం పడుతుంది. ఫలితంగా నూనె సహజంగా యాంటీఆక్సిడెంట్లు, లారిక్‌ ఆమ్లంతో సమృద్ధిగా ఉంటుంది. తల్లి పాలలో ఉండే ముఖ్యమైన కొవ్వు ఆమ్లం, దాని యాంటీమైక్రోబియల్‌ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది.

మోస్తరు వేడితో నష్టం లేదు
‘ఈ ప్రక్రియలో మోస్తరు వేడిని ఉపయోగించటం వల్ల నష్టమేమీ లేదు. విపరీతమైన వేడిని వాడితే నష్టం. స్వచ్ఛతను, విశిష్టతను కాపాడుతూ సూపర్‌ ఫుడ్‌ని ఉత్పత్తి చేస్తున్నాం’ అని రోహన్‌ వివరించాడు. 

ఈ తోటలో దేన్నీ వృథాగా పారెయ్యటం లేదు. కొబ్బరి పొట్టును చెట్ల కింద ఆచ్ఛాదనగా వేస్తున్నారు. ఈ పంట వ్యర్థం తిరిగి మట్టిలోకి చేరుతోంది. కొబ్బరి పెంకులను యాక్టివేటెడ్‌ కార్బన్‌గా మార్చి తిరిగి వినియోగిస్తున్నారు. నూనె ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే పిప్పితో వర్మీకం΄ోస్టు తయారు చేస్తున్నారు. కొబ్బరిలోని ప్రతి భాగం పర్యావరణ వ్యవస్థలో పాత్ర పోషించేలా చూసుకోవడమే లక్ష్యమని రోహన్‌ చెప్పారు.

రోజూ ఒక చెంచా..  
‘వర్జిన్‌ కొబ్బరి నూనె పొట్ట ఆరోగ్యం, జీవక్రియ, కొలెస్ట్రాల్‌ నిర్వహణకు తోడ్పడుతుంది. దానిలోని యాంటీఆక్సిడెంట్లు, ప్రయోజనకరమైన మీడియం–చైన్‌ ఫ్యాటీ యాసిడ్‌ అయిన లారిక్‌ యాసిడ్‌ ఇందుకు ప్రధాన కారణం. 

అందుకే ప్రతి రోజూ ఒక చెంచా వర్జిన్‌ కొబ్బరి నూనెను తీసుకుంటే ఆరోగ్యం..’ అంటారు రోహన్‌. ‘నేను వర్జిన్‌ కొబ్బరి నూనె తీసే పని చేస్తాను. కొబ్బరి కాయల నుంచి కొబ్బరి తీసి ముక్కలు చేసి రుబ్బుతాం. అందులో నుంచి తర్వాత ΄ాలు తీస్తాం. ఇది దాదాపు ఆరు గంటల పాటు నెమ్మదిగా జరిగే ప్రక్రియ’ అని ఒక కార్మికుడు చె΄్పారు.

వ్యవసాయ పర్యాటకం
విలువలకు నిలబడుతూ శ్రద్ధగా ఆరోగ్యదాయకమైన, ΄ోషకవంతమైన వ్యవసాయోత్పత్తులను ఉత్పత్తి చేసే వ్యవసాయ క్షేత్రం పర్యాటక కేంద్రంగా కూడా పేరుగాంచుతుందనటానికి రోహన్‌ క్షేత్రమే ఉదాహరణ. ఆసక్తి గల వారు బుక్‌ చేసుకొని 2.5 గంటల వ్యవసాయ ఆధారిత అనుభవాలను చవిచూస్తున్నారు. అతిథులు కొబ్బరి తోటల గుండా నడుస్తూ విషయాలు తెలుసుకుంటారు. చెట్టు నుంచి కాయలు కోయటం దగ్గరి నుంచి నూనె తయారీ వరకు జరిగే పనులన్నిటినీ చూస్తారు. స్థానిక పదార్థాలను ఉపయోగించి గ్రామీణ మహిళలు వండిన సాంప్రదాయ గోవా భోజనంతో ఈ అనుభవం ముగుస్తుంది.

‘ఇది ఎక్కువ మందిని ఆకర్షించే పర్యాటకం కాదు. జీరో వేస్ట్‌ క్షేత్ర నిర్వహణ, ఆరోగ్యదాయకమైన ఆహారంపై సంభాషించడానికి మేం ఒక బ్యాచ్‌లో కొద్ది మందికి మాత్రమే ఆతిథ్యం ఇస్తామ’ని రోహన్‌ స్పష్టం చేశారు. త్వరలో కొబ్బరితో చిరుతిండ్లను ఉత్పత్తి చెయ్యనున్నామన్నారు. టోక్యోకి చెందిన అంతర్జాతీయ పర్యాటక సంస్థ స్కాల్‌ ఇంటర్నేషనల్‌ నుంచి గుర్తింపు దక్కటం ఆనందదాయకమని ఆయన సంబరపడుతున్నారు.                                   

Advertisement
 
Advertisement
Advertisement