- కుదేలవుతున్న గ్రామీణ ఆర్దిక వ్యవస్థ
- అయినా బడ్జెట్లో మళ్లీ కాకిలెక్కలు
- తగ్గిపోతున్న పన్నువసూళ్లు
- పడిపోతున్న గ్రామీణ ఆదాయం
- వ్యవసాయ సంక్షోభమే కారణం
- అన్నదాతల ఆక్రందన పట్టదా?
- వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి ధ్వజం
తాడేపల్లి: రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోందని, దీని వల్ల గ్రామీణ ఆర్దిక వ్యవస్థ కుదేలవుతోందని, బడ్జెట్ లో ప్రభుత్వం పెట్టిన లెక్కలు చూస్తేనే ఇది అర్దమవుతోందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి ఆక్షేపించారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ మీద ఆధారపడిన రాష్ట్రం ఇప్పుడు వ్యవసాయ సంక్షోభంతో పూర్తిగా తిరోగమనంలో వెళ్తోందన్నారు. తగ్గిపోయిన పన్ను వసూళ్లే ఇందుకు నిదర్శమని తెలిపారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా చేస్తానని ఇప్పుడు ప్రభుత్వం చెప్తోందని, కానీ అప్పట్లో వైఎస్సార్, జగన్మోహన్ రెడ్డి రుణ బకాయిల రద్దు, ఉచిత విద్యుత్ తో ఎప్పుడో చేశారని ఎంవీఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు.
తిరోగమనంలో రాష్ట్రం
రెండు రోజుల క్రితం బడ్టెట్ లో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు ఎలా ఉందనే అంశంపై ప్రెస్ మీట్ పెట్టారు. ప్రతీ హామీ ఎంత మందికి అమలు చేస్తున్నారు, ఎంత మందికి ఎగ్గొట్టారనే అంశాలపై మాట్లాడారు. ఇందులో ఆయన మాట్లాడిన వ్యవసాయం సహా ఏ అంశంపైన అయినా ప్రభుత్వం స్పందిస్తుందేమో అని చూశాం కానీ సమాధానం రాలేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన అంశాలన్నీ నిజమేనని తేలిపోయింది. 2025-26 బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ వసూళ్లు 2 కోట్ల 17 లక్షల 976.53 కోట్లు చూపిస్తే, సవరించిన లెక్క లక్షా 96 వేల 903.53 కోట్లకు చేరింది. అంటే 9 నెలల్లో 21,073 వేల కోట్ల ఆదాయం తగ్గిపోయింది. అంటే మైనస్ ఆరు శాతం అన్నమాట. ఈ సంవత్సరం మళ్లీ రెవెన్యూ వసూళ్లు 2,34, 140.14 కోట్లకు పెరుగుతాయని చూపించారు.
రూ. 21 వేల కోట్ల మైనస్ కు వెళ్లిన తర్వాత ఒక్కసారిగా 37 వేల కోట్లకు పెరుగుతుందని ఎలా చూపిస్తారు. అదే 2025-26 సంవత్సరానికి పన్ను వసూళ్లు బడ్జెట్ అంచనాల్లో 1,28,126 కోట్లు పెట్టారు. సవరించిన లెక్క చూస్తే 1, 11,865 కోట్లకు అంటే 16,261 కోట్లు తగ్గిపోయింది. అంటే 9 నెలల్లోనే 12.69 శాతం తగ్గిపోయింది. ఈసారి మళ్లీ బడ్జెట్ లో పన్ను వసూళ్ల అంచనా 1,37,320 కోట్లకు పెరుగుతుందని చూపించారు. అంటే 22.75 శాతం పెరుగుతుందని చూపించారు. రాష్ట్రం ఎంత సంక్షోభంలో ఉందో దీన్ని బట్టి అర్దమవుతోంది. వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం ఈ రంగంలో తిరోగమనంలో ఉందని తెలుస్తోంది.
పడిపోతున్న పన్ను వసూళ్లు
రైతు కానీ, కౌలు రైతు కానీ, వ్యవసాయ కార్మికుడు కానీ తన ఆదాయం పెరిగి నిత్యావసరాలు కొనుక్కుంటే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. కానీ మద్దతు ధరలు లేక అమ్ముకునే పరిస్ధితుల్లోకి వెళ్లడం, ఉత్పత్తి తగ్గిపోవడం వంటి కారణాలతో వ్యవసాయం సంక్షోభంలోకి వెళుతోంది. ఇలాంటి ప్రధాన కారణాలను పక్కనబెట్టి బడ్జెట్ అంచనాలు పెంచుకుంటూ పోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మూలధన వసూళ్లు మాత్రం తగ్గలేదు. అప్పులు 78205 కోట్లు తీసుకుంటామని బడ్జెట్ లో చెప్పి 79456 కోట్లు 9 నెలల్లోనే తీసుకున్నారు. ఇతర రుణాలు 1500 కోట్లు చూపించి 2496 కోట్లు తీసుకున్నారు. ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది అనేది ప్రత్యక్ష పన్ను వసూళ్లలోనే కనిపిస్తోంది.
రాష్ట్రంలో 2024-25లో వరి సాగు 13.97 లక్షల హెక్టార్లలో జరిగింది. 78.28 లక్షల టన్నులు ఉత్పత్తి జరిగింది. 2025-26 ఖరీఫ్ లో 15.59 లక్షల హెక్టార్లలో సాగు జరిగింది. అంటే గత సంవత్సరం కంటే లక్షా 65 వేల హెక్టార్లలో సాగు పెరిగింది. ఉత్పత్తి చూసుకుంటే మాత్రం 78.05 లక్షల టన్నులు మాత్రమే జరిగింది. ఇవి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ పరిధిలోని యూనిఫైడ్ పోర్టల్ ఫర్ స్టాటిస్టిక్స్ డేటా ఇది. పెరిగిన సాగు ప్రకారం చూస్తే 9 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి పెరగాలి. కానీ లక్ష టన్ను ధాన్యం కూడా పెరగలేదు. కానీ రైతులకు ఎరువుల ధరలు పెరిగాయి, యూరియా బ్లాక్ మార్కెట్లో కొనుక్కున్నారు. రైతుకు ఖర్చు పెరిగింది కానీ దిగుబడి పెరగలేదు’ అని ధ్వజమెత్తారు.
గణనీయంగా పడిపోయిన సాగు
జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతు భరోసా కేంద్రం దగ్గర ట్రక్ షీట్ జనరేట్ అయితేనే ధాన్యం వెళ్లేవి. ట్రక్ షీట్ జనరేట్ అయిన దగ్గరి నుంచి ధాన్యం వచ్చే తేదీ లెక్కించేవాళ్లు. ఈ సంవత్సరం రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసి మధ్యవర్తుల ద్వారా మిల్లర్లకు చేరిపోయింది. మిల్లర్లు చెప్పిన తేదీకి రైతు భరోసా కేంద్రంలో లోడ్ చేశారు. అంటే వాళ్లకు అనుకూలమైన తేదీల్లో లోడ్ చేయించారు. రవాణా, కాటా కూలీ కానీ గతంలో ఇచ్చేవారు కాదు. గత ప్రభుత్వంలో వాళ్ల ఖాతాలకే డబ్బులు వేయడం మొదలుపెట్టారు. ఈసారి ఈ డబ్బులు కూడా వాళ్లకు అందలేదు. ప్రత్తి విషయానికొస్తే.. ఈ ఏడాది 3.99 లక్షల హెక్టార్లలో సాగు జరిగింది. మొంథా తుపాన్ దెబ్బకు 4 నుంచి 5 క్వింటాల్స్ మాత్రమే ఉత్పత్తి వచ్చింది. దీనికి తోడు రూ.8,110 మద్దతు ధర అయితే క్వాలిటీ లేదని 5 వేల నుంచి 6 వేలకు కూడా కొనుగోలు చేయని పరిస్ధితి. అంటే వేల కోట్లు రైతులు నష్టపోయారు.
వేరుసెనగ చూస్తే 5.72 లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉంటే ఈ ఏడాది 2.08 లక్షల హెక్టార్లలో మాత్రమే. అంటే కేవలం 42 శాతం మాత్రమే సాగు జరిగింది. గణనీయంగా సాగు పడిపోవడం వల్ల వ్యవసాయ కార్మికులకు పని లేకపోవడం, రైతుకు ఆదాయం పడిపోతాయి. ఆగస్టు వరకూ ఉన్న డ్రై స్పెల్ మూలంగా అనంతపురం, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో సాగు 40 శాతానికి పడిపోయింది. కనీస మద్దతు ధరలు లేక తక్కువకు అమ్ముకున్న పరిస్ధితి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కటాఫ్ డేట్ అయిపోయాక కంది సాగు చేశారు. సరాసరి దిగుబడి తగ్గిపోయిందని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. అందుకే కర్నాటక నుంచి ప్రభుత్వం సేకరించాల్సి వచ్చింది. మొత్తం రూ.2400 మద్దతు ధర అయితే రైతులు గరిష్టంగా రూ.1800కు అమ్ముకున్నారు. మినుములు, పెసలదీ అదే పరిస్ధితి. రబీలో వర్షాల కారణంగా మళ్లీ సాగు పెరిగింది.
సీమను హార్టీకల్చర్ హబ్ చేసింది వైఎస్సార్, జగన్
ప్రభుత్వం ఇచ్చిన వీక్లీ రిపోర్ట్ లో 2024-25లో హెక్టార్ కు కేజీ 19 కిలోల ఉత్పత్తి జరిగింది. ఈ సంవత్సరం ఉత్పత్తి పెరుగుతుందన వ్యవసాయ మంత్రి చెప్పారు. ఆయన లెక్క ప్రకారం సాగు చూస్తే 4 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుంది. కానీ క్షేత్రస్థాయి పరిస్ధితుల్లో తీసుకుంటే రబీలో శెనగపంట దిగుబడి పెరిగింది. 5 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి వచ్చే అవకాశం ఉంది. ఇందులో 91 వేల టన్నులు మాత్రమే ప్రొక్యూర్ మెంట్ చేస్తున్నారంటే మెట్ట జిల్లాల్లో రైతులు నష్టపోయే అవకాశం ఉంది. దీని మీద తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టిసారించాలి. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వైఎస్సార్ హయాంలో విద్యుత్ బకాయిల రద్దు, ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం పెట్టినప్పుడే ఇది హార్టికల్చర్ హబ్ అయింది. గతేడాది సంక్షోభం మొదలైందే హార్టికల్చర్ పంటల నుంచి. ఇదంతా రాయలసీమ ప్రాంతంలోనే జరిగింది.
మార్కెటింగ్ మీద దృష్టిపెట్టకపోవడమే ఇందుకు కారణం. గతంలో వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తే, తిరిగి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే పగలు 9 గంటల విద్యుత్ ఇచ్చారు. అంటే రాయలసీమను హార్డికల్చర్ హబ్ గా మార్చింది వైఎస్సార్, జగన్మోహన్ రెడ్డి మాత్రమే. పంటల ఉత్పత్తి లేక సంక్షోభం రావట్లేదు, కేవలం మార్కెటింగ్ లేకే సంక్షోభం వస్తోంది.
రూరల్ ఎకానమీ బలహీనంగా ఉంది. రైతులు, వ్యవసాయ కార్మికుల దగ్గర డబ్బులు ఉంటేనే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వ్యాపారులు బాగుంటారు. ఈ 20 నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా ఎకరం భూమి ధర పెరగలేదు. దీనికి కారణం వ్యవసాయ సంక్షోభమే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వ్యవసాయ సంక్షోభంపై దృష్టిసారించాలని కోరుతున్నాం’ అని స్పష్టం చేశారు.


