వ్యవసాయ రంగంలో 10.4 శాతం వృద్ధి  | India agriculture GVA recorded 10. 4 per cent growth in 2024-25 | Sakshi
Sakshi News home page

వ్యవసాయ రంగంలో 10.4 శాతం వృద్ధి 

Feb 17 2026 4:37 AM | Updated on Feb 17 2026 4:37 AM

India agriculture GVA recorded 10. 4 per cent growth in 2024-25

రికార్డు స్థాయికి చేరిన ఆహార ధాన్యాల ఉత్పత్తి  

2024–25లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 3577 లక్ష మెట్రిక్‌ టన్నులు 

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: 2024–25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగ స్థూల విలువ జోడింపు(జీవీఏ) 10.4 శాతం వృద్ధి సాధించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత ధరల ప్రకారం గత ఐదేళ్లలో వ్యవసాయ, అనుబంధ రంగాలు (పంటలు, పశుసంవర్ధక, మత్స్య, ఉద్యానవనం) వృద్ధిరేటు గణనీయంగా పెరిగినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్‌ ఠాకూర్‌ తెలిపారు. 

2020–21లో 10.0 శాతం, 2021–22లో 10.6శాతం, 2022–23లో 8.5 శాతం, 2023–24లో 9.6 శాతం కాగా 2024–25లో 10.4శాతం నమోదుతో రికార్డు నెలకొలి్పనట్లు ఠాకూర్‌ చెప్పారు. 2024–25లో దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 3577.32 లక్ష మెట్రిక్‌ టన్నులు అని మంత్రి ప్రకటించారు. ఇది 2023–24లో నమోదైన 3322 లక్ష మెట్రిక్‌ టన్నులతో పోలిస్తే 254 లక్ష మెట్రిక్‌ టన్నుల (7.65 శాతం) కంటే ఎక్కువ అని ఇటీవల లోక్‌సభలో మంత్రి పేర్కొన్నారు.  

ఫీల్డ్‌స్థాయి పర్యటనలు నిర్వహిస్తున్నాం 
‘‘వ్యవసాయ వృద్ధిని ప్రభావితం చేసే కీలక అంశాలైన రైతుల ఆదాయం, ఇన్‌పుట్‌ ఖర్చులు, వాతావరణ మార్పులు, సాగునీటి విస్తరణ, రుణ సౌకర్యం, మార్కెట్‌ అనుసంధానంపై ప్రభుత్వం నిరంతర సమీక్షలు, అధ్యయనాలు, ఫీల్డ్‌ స్థాయి పర్యటనలు నిర్వహిస్తోంది. రైతుల ఆదాయం పెంపు, వ్యవసాయ రంగ సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తోంది. 

పంటల ఉత్పత్తి పెంపు, ఉత్పత్తి ఖర్చుల తగ్గింపు, మెరుగైన ధరల సాధన, పంటల వైవిధ్యీకరణ, కోత అనంతర విలువ ఆధారం, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం వంటి అంశాలపై దృష్టి సారించాం’’అని మంత్రి తెలిపారు. 

ఇందుకోసం 2013–14లో రూ.21,933 కోట్లు కేటాయించగా, 2025–26 తాజా బడ్జెట్‌లో రూ.1,27,290 కోట్లు కేటాయించాం. 2018–19 నుంచి ఖరీఫ్, రబీ, వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధరలు ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం లాభం వచ్చేలా నిర్ణయించాం. రైతుల సంక్షేమం, ఆదాయం పెంపు, ఉత్పత్తి విస్తరణ కోసం పలు కేంద్ర రంగ, కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలులో ఉన్నాయి’’అని మంత్రి పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement