రూ.53వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ | Minister Atchannaidu presents the agriculture budget | Sakshi
Sakshi News home page

రూ.53వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌

Feb 15 2026 3:07 AM | Updated on Feb 15 2026 3:07 AM

Minister Atchannaidu presents the agriculture budget

వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.53,752.12 కోట్లు కేటాయింపు 

‘అన్నదాత సుఖీభవ’కు రూ.6,600 కోట్లు  

వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు  

సాక్షి, అమరావతి: స్వర్ణాంధ్ర–2047 లక్ష్య సాధనలో భాగంగా నీటి భద్రత, డిమాండ్‌ ఆధారిత పంటలు, అగ్రీ టెక్, ఫుడ్‌ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అనే పంచ సూత్రాల అమలుతో వ్యవసాయ రంగానికి ఊపిరి పోస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. శనివారం అసెంబ్లీలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.53,752.12 కోట్లతో ప్రతిపాదించిన వ్యవసాయ బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.17.62 లక్షల కోట్లుగా నమోదు కాగా, అందులో వ్యవసాయ రంగం వాటా 33.2 శాతం (రూ.5.39 లక్షల కోట్లు)గా ఉందన్నారు. దేశ వ్యవసాయ రంగం వృద్ధిరేటు 0.80 శాతం కాగా, ఏపీలో 7.83 శాతంగా నమోదైందన్నారు. దేశ వ్యవసాయ ఉత్పత్తిలో ఏపీ వాటా 10 శాతంగా ఉందన్నారు. ఈ రంగం వృద్ధిరేటు పరంగా 3.91 శాతంగా నమోదైందని, 15 శాతం వార్షిక వృద్ధిరేటు సాధించే లక్ష్యంతో 11 పంటలను గ్రోత్‌ ఇంజన్లుగా గుర్తించామన్నారు. 

‘అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,600 కోట్లు, విత్తన రాయితీకి రూ.240 కోట్లు, ప్రకృతి సాగుకు రూ.208 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.139.65 కోట్లు, వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ.250 కోట్లు, స్వచ్ఛంద పంటల బీమాకు రూ.250 కోట్లు, ఎన్‌ఎంఈఓ–ఓపీ(ఆయిల్‌పామ్‌)కు రూ.204 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లు, ఎన్‌పీడీడీ (డెయిరీ డెవలప్‌మెంట్‌)కి రూ.202.62 కోట్లు, వేట నిషేధ భృతికి రూ.260 కోట్లు, పీఎంఎంఎస్‌వైకి రూ.398 కోట్లు, వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం కోసం రూ.500 కోట్లు, వ్యవసాయ.. ఉద్యాన, పశువైద్య, మత్స్య వర్సిటీలకు రూ.804.31 కోట్లు కేటాయించాం’అని తెలిపారు. 

రంగాల వారీగా తీసుకుంటే వ్యవసాయ రంగానికి రూ.12,152.32 కోట్లు, ఉద్యాన రంగానికి రూ.1,123.86 కోట్లు, పట్టు పరిశ్రమ రంగానికి రూ.95.87 కోట్లు, మార్కెటింగ్‌ శాఖకు రూ.515.39 కోట్లు, సహకార శాఖకు రూ.209.30 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ.1,121.26 కోట్లు, మత్స్య శాఖకు రూ.523.52 కోట్లు, ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకానికి రూ.13,722 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.14,276.89 కోట్లు కేటాయించామని వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement