విజయవాడ: ఏపీలో వైద్యాన్ని వ్యాపారంగా మార్చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ విమర్శించారు. 100 పడకల ఆసుపత్రులను ప్రైవేట్‌పరం చేసే ఆలోచన లేదని మంత్రి చెబుతుంటే, చంద్రబాబేమో 100 పడకల ఆసుపత్రులను పీపీపీ కింద ప్రైవేటీకరణ చేస్తామని చెబుతున్నారన్నారుఉ. పీపీపీ విధానానికి ప్రపోజల్స్ కూడా సిద్ధం చేసేశామంటున్నారని, పేషెంట్ల వద్ద రుసుము వసూలు చేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు.
‘వంద పడకల ఆసుపత్రుల నిర్వహణను పిపిపికి ఇచ్చేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ఆసుపత్రులను కూడా ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారు. ఆసుపత్రులను కూడా ప్రైవేట్ పరం చేసే నీచ సంస్కృతికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ పోరాటం కొనసాగిస్తాం’ అని హెచ్చరించారు.
ఇక ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘ ఈ బడ్జెట్‌ను చూస్తుంటే అసలు ఈ ప్రభుత్వానికి ఏమైందోనన్న ఆందోళన కనిపిస్తుంది. గత ప్రశ్నోత్తరాల సమయంలో గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు 3.42 లక్షల కోట్లు అని లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఇప్పుడు ప్రసంగంలో 9.70 లక్షల కోట్లు అప్పులు చేశారని అబద్ధాలు చెప్తున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధరలు లేవు. కనీస మద్దతు ధరలు ఇవ్వటం లేదని రైతులు రోడ్డెక్కుతున్నారు.
రాష్ట్రంలో ఒక్క గంజాయికి తప్ప మరో పంటకు మద్దతు ధర లేదు. ఉద్యోగుల ప్రస్తావనే లేకుండా మొండిచేయి చూపించారు. ఆడబిడ్డ నిధి అన్నారు.. ఒక్క రూపాయి ఇవ్వలేదు. అమరావతి సెల్ఫ్ సస్టైన్ రాజధాని అని చెబుతున్నారు. అమరావతి పేరు మీద తెచ్చిన అప్పులు ఎన్ని.. తెచ్చిన బకాయిలు ఎలా తీరుస్తారనేది చెప్పలేదు. అన్నీ వర్గాలను విస్మరించి మీరు తెచ్చిన బడ్జెట్ మీ డొల్లతనాన్ని బయటపెట్టింది. బడ్జెట్ పై ప్రభుత్వాన్ని మండలిలో కడిగేస్తాం’ అని స్పష్టం చేశారు.
శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మరో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఏపీ బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు. ఇది నారా వారి నకిలీ బడ్జెట్ అంటూ ధ్వజమెత్తారు.
‘నారా వారి నకిలీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కూటమి నేతల కమిషన్ కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఉంది. అప్పుల్లో ఏపీని నెంబర్‌వన్‌కు తీసుకెళ్లింది ఏపీ ప్రభుత్వం. సూపర్ సిక్స్ హామీల్లో ఉన్న నిరుద్యోగ భృతి గురించి ఊసే లేదు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1500 ఇస్తామని చెప్పి ఈ బడ్జెట్‌లో మొండిచేయి చూపించారు. ఏ వర్గాన్ని ఈ బడ్జెట్ సంతృప్తి పరచలేదు. పేదల కోసం ఏమి చేస్తారో కూడా చెప్పలేకపోయారు’ అని విమర్శించారు.


