ఏపీ బడ్జెట్‌ అభూత కల్పన: వైఎస్సార్‌సీపీ | Ysrcp Leaders Reaction To Chandrababu Govt Budget | Sakshi
Sakshi News home page

ఏపీ బడ్జెట్‌ అభూత కల్పన: వైఎస్సార్‌సీపీ

Feb 14 2026 3:00 PM | Updated on Feb 14 2026 3:49 PM

Ysrcp Leaders Reaction To Chandrababu Govt Budget

సాక్షి, అమరావతి: ఏపీ బడ్జెట్ అంతా అంకెల గారడీ.. అప్పుల కుప్పలా ఉందని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. నమ్మి ఓట్లేసిన ప్రజల్ని నమ్మించి మోసం చేసిన బడ్జెట్ ఇది అంటూ దుయ్యబట్టారు. నిరుద్యోగులను, మహిళల్ని, రైతుల్ని మోసం చేసిన బడ్జెట్. ఇది డబల్ ఇంజన్ సర్కార్ కాదు.. డబుల్ చీటింగ్ సర్కార్.. ఇచ్చిన ఒక్క హామికి కూడా సరైన నిధులు కేటాయించకుండా.. వచ్చే ఏడాదికి మరో లక్ష కోట్ల అప్పుకు రెడీ అయిపోతున్నారు. కేవలం 20 నెలల్లో లక్షల కోట్లు అప్పులు చేశారు. సంపద సృష్టి అసలే లేదు అంటూ అసెంబ్లీ ప్రాంగణంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ బడ్జెట్‌లోనూ అదే తీరు: వరుదు కల్యాణి
ఎన్నికల టైంలో ఊరూరా బాండ్‌లు పంచారు. వాటికీ ఈ బడ్జెట్‌కు సంబంధం ఉందా?. మోదీ, పవన్‌ను పక్కన పెట్టుకొని 164 సీట్లు తెచ్చుకొని ఒక్క హామీ కూడా సరిగా నెరవేర్చలేదు. తల్లికి వందనంలో కోతలు పెట్టారు. ఈ బడ్జెట్‌లో కూడా అదే తీరు. ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తామని నమ్మించి.. దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.

నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి ఇపుడు బడ్జెట్‌లో ఆ ఊసే లేదు. 50 ఏళ్లు దాటితే పింఛన్‌ ఇస్తామన్నారు.. దాని ఊసు లేదు. రెండు సెంట్ల స్థలం ఇస్తామన్నారు..దానికి ఒక్క రూపాయి కేటాయించలేదు. మహిళలకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామన్నారు.. ఈ మూడు బడ్జెట్‌లలో కేటాయింపులు లేవు. ఉద్యోగులకు ఇచ్చిన హామీల గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. వీటన్నిమీద కౌన్సిల్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము..

మాయాబజార్‌ను తలపించింది: పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
ఈ బడ్జెట్ అంతా ఊహాగానాలే.. నాలుగో తరగతి పిల్లాడు హిస్టరీ రాసినట్లు బడ్జెట్ రాసుకొచ్చారు. బడ్జెట్ ప్రసంగమంతా మాయాబజార్‌ను తలపించింది. ఎన్నికల ముందు 10 లక్షల కోట్లకు పైబడి అప్పులున్నాయని బురదజల్లారు. కూటమి వచ్చిన 20 నెలల్లో చేసిన అప్పు 3.10 లక్షల కోట్ల అప్పులు చేశారు. మరో లక్ష కోట్లు అప్పు చేస్తామని ముందే చెబుతున్నారు. నిరుద్యోగ భృతికి గత రెండు బడ్జెట్‌లలో కేటాయింపులు సున్నా. మూడో సంవత్సరం కూడా నిరుద్యోగ భృతి కేటాయింపులు సున్నా. ఆడబిడ్డ నిధికి మూడు బడ్జెట్‌లలో కేటాయింపులు సున్నా. 8500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలుంటే.. కేవలం 3500 కోట్లను ఫీజు రీయింబర్స్‌మెంట్ కు కేటాయించారు.

30 లక్షల మంది విద్యార్థులను రోడ్డున పడేస్తున్నారు. వైఎస్‌ జగన్ హయాంలో ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. నాడు-నేడు ద్వారా వైఎస్‌ జగన్‌ స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు శ్రీకారం చుట్టారు. కానీ ఈ ప్రభుత్వం నాడు-నేడుకి రెండేళ్లలో చేసిన కేటాయింపులు సున్నా. ఇప్పుడు కేవలం 1500 కోట్లను నాడు నేడుకి ఇస్తామంటున్నారు...అది కూడా ఇస్తారో లేదో అనుమానమే. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ఉద్యోగులు తమ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు. పీఆర్సీ కమిషన్ ఛైర్మన్‌ను కూడా నియమించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం అసలు కొనసాగుతుందా అనే అనుమానం కలుగుతోంది

ఈ బడ్జెట్ పబ్లిసిటీ ఫుల్.. పనితనం నిల్‌: కల్పలతా రెడ్డి
బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ప్రజల ఆశలను వమ్ము చేశారు. ఆడబిడ్డ నిధి పేరుతో మోసం చేశారు. మహిళలను నిలువునా ముంచేసి.. బడ్జెట్‌లో మహిళా సాధికారత గురించి గొప్పగా చెబుతున్నారు. నిరుద్యోగ భృతి ఊసే ఎత్తలేదు. బడ్జెట్‌ను తయారు చేసిన ఉద్యోగులకు కూడా ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. పీఆర్సీ, ఐఆర్ గురించి కనీస ప్రస్తావన కూడా లేదు. హోంమంత్రి బడ్జెట్ పెట్టడంతో పోలీసులంతా ఎంతో ఆశగా ఎదురుచూశారు. పోలీసులకు వెహికల్స్ పెట్టాం.. డ్రోన్లు పెట్టామని హోం మంత్రి చెప్పారు. హోంమంత్రి తమ బకాయిల గురించి మాట్లాడతారని పోలీసులు భావించి భంగపడ్డారు.

ఈ బడ్జెట్  పనికిరాని బడ్జెట్‌: కుంభా రవిబాబు
బడ్జెట్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ఈ బడ్జెట్‌ పనికిరాని బడ్జెట్. ప్రభుత్వం సంపద సృష్టికి బదులు అప్పులు సృష్టిస్తోంది. అభూత కల్పనగా బడ్జెట్ ఉంది. బడ్జెట్ అంతా అబద్ధాలతో నిండిపోయింది. ఎన్నికల సమయంలో ఏపీ అప్పులపై ఇష్టానుసారంగా మాట్లాడారు. ఈ రోజు ఏపీ అప్పు 9.47 లక్షల కోట్లని బడ్జెట్‌లో చెబుతున్నారు. చంద్రబాబు ఎందుకు అప్పులపై తప్పుడు ప్రచారం చేశారో సమాధానం చెప్పాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement