కాకి లెక్కలు.. పచ్చి అబద్ధాలు | Buggana Rajendranath Comments On AP Budget For The Financial Year 2026–27, Calls Figures And Claims False | Sakshi
Sakshi News home page

కాకి లెక్కలు.. పచ్చి అబద్ధాలు

Feb 14 2026 4:34 PM | Updated on Feb 15 2026 3:38 AM

buggana rajendranath comments on Budget for the financial year 2026–27

వాస్తవాలకు దూరంగా ఊహాజనిత సిద్ధాంతాలు   

అప్పులెంతో చెప్పలేని అపార అనుభవజ్ఞులు  

విశ్లేషణ లేని బడ్జెట్‌ బుక్‌లు 

పెరిగిన ఆదాయం 3.4 శాతం 

లెక్కల్లో చూపింది మాత్రం 45 శాతం 

సూపర్‌ సిక్స్‌ హామీలకు మంగళం 

ఉద్యోగులు, రైతులకు అంతులేని వంచన 

బడ్జెట్‌లో అడుగడుగునా అసత్యాలు 

మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన ధ్వజం 

మీది ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కాదు.. మీ ఇంటెలిజెన్సే ఆర్టిఫీషియల్‌ అంటూ చంద్రబాబుపై వ్యంగ్యోక్తులు

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్‌ పచ్చి అబద్ధాలు, కాకిలెక్కలు, ఊహాజనిత సిద్ధాంతాలతో నిండి ఉందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆక్షేపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత పదేళ్ల ఆదాయ, వ్యయాల విశ్లేషణ లేకుండా దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి బడ్జెట్‌ రూపొందించలేదంటూ తూర్పారబట్టారు. అధికారంలోకి రాకముందు రూ.10 లక్షల కోట్ల అప్పు అని మట్కా నంబర్లు చెప్పిన వారు, ఇప్పుడు వాస్తవాలు రాస్తే తమ బండారం బయటపడుతుందని అసలు అప్పు ఎంతో బడ్జెట్‌లో పేర్కొనలేదంటూ దెప్పిపొడిచారు. 

ప్రభుత్వ ఆదాయ లెక్కలు చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా అవార్డులు ఇవ్వాలని బుగ్గన ఎద్దేవా చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో కేవలం రూ.67,459 కోట్ల ఆదాయం వస్తే, మిగిలిన మూడు నెలల్లో ఏకంగా రూ.44,407 కోట్లు వస్తుందని చూపడం నమ్మశక్యమా? అంటూ నిలదీశారు. వాస్తవానికి ఆదాయ వృద్ధి రేటు కేవలం 3.4 శాతమే ఉన్నా.. వచ్చే ఏడాదికి 45 శాతం పెరుగుదల చూపడం ప్రజలను మోసం చేయడమే అని తేల్చిచెప్పారు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్‌ ఉన్నా తొమ్మిది శాతం వృద్ధి రేటు సాధించామని గుర్తు చేశారు. 

మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఇంకా గత ప్రభుత్వంపై నిందలు వేయడం సిగ్గుచేటని బుగ్గన మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.30 లక్షల ఉద్యోగాలివ్వడం, 10 వేల విలేజ్‌ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు, 17 కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు నిర్మించడం విధ్వంసమా? అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా ద్వారా పేదలకు నేరుగా నగదు అందించడం మీకు గాయాలు కలిగించిందా?‘ అని నిలదీశారు. 

సూపర్‌ సిక్స్‌ హామీల అమలులో చంద్రబాబు కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆయన  గణాంకాలతో సహా నిలదీశారు. రాష్ట్రంలో అవినీతి పరాకాష్టకు చేరిందని, ఇసుక, భూములే కాకుండా చివరకు కోడి వ్యర్థాల నుంచి కూడా అధికార పార్టీ నేతలు దండుకుంటున్నారని బుగ్గన ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వంలో పబ్లిసిటీ పీక్స్‌ తప్ప.. పెర్ఫార్మెన్స్‌ మాత్రం పూర్‌ అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అబద్ధపు లెక్కలు మానేసి ప్రజలకు వాస్తవాలు చెప్పా­లని, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మీది ఆరి్టఫిషి­యల్‌ ఇంటెలిజెన్స్‌ కాదు.. మీ ఇంటెలిజెన్సే ఆరి్టఫిషియల్‌ అంటూ చంద్రబాబుపై వ్యంగ్యోక్తులు విసిరారు. బుగ్గన ఇంకా ఏమన్నారంటే.. 

బాధ్యత లేని బడ్జెట్‌ 
కూటమి ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌లో రెవెన్యూ రశీదులు రూ.2,34,140 కోట్లు కాగా అప్పు రూ.98,065 కోట్లు, రెండూ కలిపి రూ.3,32,205 కోట్లుగా ఉంది. ఖర్చూ అంతే ఉంది. ప్రజాస్వామ్యంలో పాలకులకు ఉన్న అత్యంత బాధ్యత బడ్జెట్‌ రూపకల్పన. కానీ ఏపీ బడ్జెట్‌ చూస్తే గతేడాది ఏం ఉందో ఇప్పుడూ అదే ఉంది. అన్నీ బొమ్మలు, సూత్రాలు, ఆలోచనలు, దీనికి ఇంత ఖర్చు పెట్టబోతున్నామన్న ఊహాజనిత థియరీ తప్ప.. విశ్లేషణాత్మక వాస్తవాలెక్కడా ఈ బడ్జెట్‌లో కనిపించలేదు. 

చివరకు అప్పు ఎంత ఉందన్నదీ ఎక్కడా చెప్పలేదు. కారణం అధికారంలోకి రాకముందు నుంచే రూ.12 లక్షలు, రూ.11 లక్షలు, రూ.10 లక్షల కోట్లు అప్పు అని మట్కా నంబర్లు మాదిరిగా పదే, పదే చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు వాస్తవాలు రాస్తే తాము చెప్పింది తప్పు అవుతుంది కాబట్టి అప్పు ఎంత ఉందన్నది కూడా చెప్పలేదు. 

మూలధన వ్యయంపైనా అసత్యాలే 
2025–26లో మొదటి తొమ్మిది నెలల్లో ప్రభుత్వం చేసిన అప్పులు తీసుకుంటే రూ.81,597 కోట్లు. ఇంకా మూడు నెలలు మిగిలి ఉంది. కానీ మీరు మాత్రం రూ.80,500 కోట్లు అప్పులు చూపిస్తున్నారు. రెండేళ్లలో మీరు చేసిన మొత్తం అప్పు రూ.3.20 లక్షల కోట్లు. చేసిన ఆ అప్పు కూడా చూపించడం లేదు. 2025–26లో మూలధన వ్యయం కింద బడ్జెట్‌లో పెట్టిన అమౌంట్‌ రూ. 40,635 కోట్లు కాగా.. సవరించిన అంచనాల ప్రకారం రూ.33,134 కోట్లు చూపిస్తున్నారు. కానీ ఇంతవరకు తొమ్మిది నెలలుగా మీరు పెట్టిన ఖర్చు మాత్రం కేవలం రూ.19,224 కోట్లు మాత్రమే. అంటే బ్యాలెన్స్‌ దాదాపు రూ.14 వేల కోట్లు. 

ఇప్పుడు కేవలం మూడు నెలల్లో ఖర్చుపెట్టడం సాధ్యమవుతుందా? పైగా రూ.48,075 కోట్లు రానున్న ఏడాది ఖర్చుపెట్టబోతున్నామని చెబుతున్నారు. ఎక్కడ రూ.19వేల కోట్లు, ఎక్కడ రూ.48 వేల కోట్లు ? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? 2024 జూన్‌ నుంచి నేటి వరకూ విధ్వంసం నుంచి వికాసం దిశగా.. అంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఇప్పటివరకు మీరు చేసిన అప్పులు రూ.3,20,450 కోట్లు. 2024–25లో రూ.81,622 కోట్లు అప్పు చేశారు. 

ఇది కాకుండా ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్‌ ఆర్బీఐ ద్వారా స్టేట్‌ డెవలప్‌మెంట్‌ లోన్‌ కింద జనవరి నుంచి ఫిబ్రవరి వరకు రూ.12,300 కోట్లు అప్పు చేశారు. పౌరసరఫరాల కింద రూ.7,000 కోట్లు, మార్క్‌ఫెడ్‌ కింద రూ.19,900 కోట్లు అప్పు చేసి.. రైతుల వద్ద నుంచి ఏ పంటలూ కొనలేదు. ఏపీఎండీసీ రూ.9వేల కోట్లు, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రూ.9,600 కోట్లు, డిస్కమ్స్‌ రూ.12,110 కోట్లు, ఎయిర్‌ పోర్టు డెవలప్‌మెంట్‌ సంస్థ ద్వారా రూ.1,000 కోట్లు తెచ్చారు, జలజీవన్‌ మిషన్‌ కింద రూ.10 వేల కోట్లు అప్పు చేసి.. అవి దేనికి వాడారో తెలియదు. కేంద్ర బడ్జెట్‌లో గతేడాది దేశవ్యాప్తంగా రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెబితే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రూ.10 వేల కోట్లు ఎలా ఖర్చు పెట్టారు? ఎక్కడ ఈ డబ్బులు వాడారు? ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది. 

దీనిపై మీరు శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏపీఐఐసీ రూ.8,500 కోట్లు, టిడ్కో రూ.4451 కోట్లు, అమరావతి కోసం రూ.47,900 కోట్లు అప్పు చేశారు. ఇది కాకుండా జీఎస్‌డీపీ లెక్కలు చూస్తే.. మీరు 11.7 శాతం పెరిగిందని చెబుతుంటే కేంద్రం మాత్రం 10 శాతం లోపే అని చెబుతారు. అలాంటప్పుడు కేంద్రానికి తొమ్మిది శాతం ఆదాయం వస్తుంటే మీకు మాత్రం రెండు శాతం కూడా రావడం లేదు. ఇదెక్కడి లెక్క?  

అవినీతి, కక్ష, మోసం, రెడ్‌బుక్‌ సహా మీది పది సూత్రాల ప్రణాళిక 
తాను నాటిన చెట్ల నీడలో తాను ఎప్పుడూ కూర్చోలేనని తెలిసినా మొక్కలు నాటారంటూ ఆర్థికమంత్రి సీఎం గురించి చెబుతున్నది నిజమే. చంద్రబాబు ఎప్పుడూ వేరొకరు నాటిన చెట్ల నీడనే కూర్చొంటారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు నియంత పాలన సాగించారు.  అవినీతి, పక్షపాతం, కక్ష, అబద్ధాలు, మోసం, పారదర్శకత లేకపోవడం, శాంతిభద్రతలు విఫలం, రెడ్‌ బుక్‌ రాజ్యాంగం, డైవర్షన్‌ పాలిటిక్స్, క్రెడిట్‌ చోరీ అనే ఈ పది సూత్రాల ప్రాతిపదికన దుర్మార్గ పాలన సాగిస్తున్నారు.    

కూటమి పాలనలో ఉద్యోగులకూ టోకరా 
ఉద్యోగులను కూడా చంద్రబాబు మోసం చేశారు. 2024 జూలై నుంచి నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పీఆర్సీ, ఐఆర్‌ ఊసే ఎత్తలేదు. 2024 జూన్‌ నుంచి రిటైర్డ్‌ ఉద్యోగులకు గ్రాట్యుటీ లేదు. ఈఎల్‌ ఎన్‌క్యాష్మెంట్‌ 2024 నుంచి లేదు. పోలీసులకు 2024  నుంచి 5 ఏఎస్‌ఎల్, ఎస్‌ఎల్‌ పెండింగ్‌లో ఉన్నాయి. 16 నెలల నుంచి టీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం అటకెక్కింది. ఒకటో తారీఖున జీతాలు లేవు. ఇష్టమొచ్చినట్లు బకాయిలు పెట్టారు. 30–07–2024న ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు అని చెప్పారు. ఏ ఒక్క ఇంటికీ ఇవ్వలేదు. 

వైఎస్సార్‌సీపీ హయాంలో ఇచ్చిన 3 లక్షల ఇళ్లు తప్ప ఒక్కటీ లేదు. ఇవన్నీ అడిగితే మీకు కోపం వస్తుంది. ప్రజల తరఫున మేం ప్రశి్నస్తాం. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్న పెద్ద మనిషి కనిపించడు, పార్టీ పెట్టి ఆయనకు గ్యారంటీ ఇచ్చిన వ్యక్తీ కనిపించడు.20 నెలల్లో 60 విజయాలంటూ తప్పుడు ప్రచారం  20 నెలల్లో 60 విజయాలు సాధించామని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వ పెద్దలు సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ లాంటి ఓ ఆరేడు  కూడా సాధించలేదు. 20 లక్షల మంది  నిరుద్యోగులకు 2026–27 ఆర్థిక సంవత్సరంతో కలిపి రూ.21,600 కోట్లు ఎగ్గొట్టారు.  ఆడబిడ్డ నిధి కింద అక్కచెల్లెమ్మలకు రూ.97,200 కోట్లు బాకీ ఉన్నారు. 

20 లక్షల మంది  50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.28,800 కోట్లు పింఛన్‌ బాకీ పడ్డారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ. 20.865 కోట్లు ఎగ్గొట్టారు. సుమారు 6 లక్షలపైచిలుకు ఉన్న కౌలు రైతులకు అన్నదాతా సుఖీభవ ఎగ్గొట్టారు. దీపం పథకం కింద రూ.6,183 కోట్లు ఎగ్గొట్టారు. తల్లికి వందనం పథకం కింద 24,504.39 కోట్లు ఎగ్గొట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు దాదాపు రూ.8వేల కోట్లు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదు.

అప్పులపై మీరిచ్చిన వాస్తవాలివిగో.. 
మా ప్రభుత్వ హయాం పూర్తయ్యేసరికి రూ.9.74 లక్షల కోట్లు అప్పు మిగిల్చామని అబద్ధాలు చెబుతున్నారు. సీఏజీ రిపోర్టు, ఆర్బీఐ లెక్కలు, లెజిస్లేచర్‌ లెక్కలు అన్నీ తప్పు చెబుతాయి, మీరు చెప్పింది మాత్రమే నిజమని నమ్మించే యత్నం చేస్తున్నారు. అసెంబ్లీలో బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్, మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రశ్నకు బదులిచ్చినదాని ప్రకారం మీరు 02–06–2014  నాడు పునర్‌ వ్యవస్థీకరణ జరిగినప్పుడు రాష్ట్ర అప్పు రూ.1,07,852 కోట్లు, మీ ప్రభుత్వం దిగిపోయి, వైఎస్సార్‌సీపీ  ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చేటప్పటికి అప్పు రూ.3,06,952 కోట్లకు చేరింది. 

మరలా 2024లో మా ప్రభుత్వం దిగిపోయినప్పటికీ మీరిచ్చిన లెక్కల ప్రకారమే రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లు. అంటే మా హయాంలో కేవలం రూ.3.39 లక్షల కోట్లు అప్పు మాత్రమే జరిగింది. మీ హయాంలో 2014–19 వరకు 22 శాతం అప్పు పెంచితే మా హయాంలో కేవలం 13 శాతం మాత్రమే అప్పు పెరిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement