హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మేయర్ ఎన్నికల వ్యవహారం మరింత హీట్ పుట్టిస్తున్న సమయంలో బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు ప్రధాన పార్టీలు కుట్రలు చేసి కరీంనగర్‌లో బీజేపీకి మేయర్ పదవి రాకుండా కుట్రలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. ప్రజా తీర్పును కాలరాసి ఏమైనా కుట్రలు చేస్తే ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచి యుద్ధం. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కరీంనగర్ మేయర్ ఎలా దక్కించుకుంటాయి?, బీజేపీకి మేయర్ పదవి రాకుండా మూడు పార్టీలు కుట్రలకు పాల్పడుతున్నాయి. కరీంనగర్ వేదికగా మూడు పార్టీల బండారం బయటపడుతోంది. బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రజాతీర్పును కాలరాస్తే.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను తిరగనివ్వను’ అని తీవ్రంగా హెచ్చరించారు.
కాగా, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 66 డివిజన్లకు గాను బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. BJP 30 డివిజన్లలో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాలేదు. కాంగ్రెస్ 14, బీఆర్‌ఎస్ 9, ఎంఐఎం 3 డివిజన్ల చొప్పున గెలిచాయి. ఇండిపెండెంట్లు 8 సీట్లు గెలవగా, ఫార్వర్డ్ బ్లాక్ రెండు డివిజన్లలో గెలిచింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉన్నందున, ఇండిపెండెంట్లు మరియు చిన్న పార్టీల మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉంది.


