ఎలక్షన్ డ్యూటీలో పోలీసు దంపతులు
పెద్దపల్లి: భార్యాభర్తలిద్దరూ పోలీసు అధికారులే. ఇద్దరికీ ఒకేచోట ఎలక్షన్ డ్యూటీ. అయితే, ఇద్దరం కలిసి ఎన్నికల విధులు నిర్వర్తించడం మరిచిపోలేని అనుభూతి అని వారిద్దరూ సరదాగా చెప్పారు. పెద్దపల్లి రూరల్ ఎస్సైగా మల్లేశ్, మహిళా ఠాణా ఎస్సైగా రాజమణికి పెద్దపల్లి మున్సిపల్ కౌంటింగ్ విధులు కేటాయించారు. పోలీస్‌కపుల్స్ కావడంతో పోలీసు అధికారులు అందరూ విధుల్లో ఉన్న దంపతులను చూసి స్వీట్ మెమోరీ అని అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

ఆకాశాన్నంటిన ఆనంద భాష్పాలు
నా భర్త గెలుపు కోసం వెన్నంటే ఉండి పోరాటం చేశానని, ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా వాడజనం మా ఆయనను గెలిపించారని.. భర్త విజయం సాధించిన వార్త విని పరుగులతో వచ్చింది భార్య. ఆ క్షణం భర్త గుండెపై వాలి ఆనందంతో ఏడ్వసాగింది. తల్లి సైతం గారాల కొడుకును చూసి ముద్దులు òపెడుతూ కన్నీరుతెచ్చుకుంది. ఈసన్నివేశం చూస్తూ గెలిచిన అభ్యర్థులంతా ఒక్కసారిగా వారి ప్రేమను చూస్తూ ఉండిపోయారు. పెద్దపల్లి మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్‌గా కాంగ్రెస్ అభ్యర్థి పాగాల శ్రీకాంత్ గెలుపుతో తల్లి, భార్య, కూతురు, బంధువులు, కాలనీవాసుల ఆనందం ఆకాశాన్నంటింది. కౌంటింగ్ కేంద్రం బయట ఒకరికొకరు తమ మద్దతుదారులు గెలిచారంటూ సంబురాల్లో మునిగిపోయారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


