అసంతృప్తులకు రేవంత్‌ వార్నింగ్‌! | KSR Comments On Telangana Municipal Elections And Revanth Reddy | Sakshi
Sakshi News home page

అసంతృప్తులకు రేవంత్‌ వార్నింగ్‌!

Feb 14 2026 10:36 AM | Updated on Feb 14 2026 10:53 AM

KSR Comments On Telangana Municipal Elections And Revanth Reddy

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలకు ఒక్క రోజు ముందు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఓ ప్రకటన చేశారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని ప్రకటించి తెలంగాణ కాంగ్రెస్‌లో తనకు ఎదురు లేదన్న సంకేతం ఇచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు కూడా రేవంత్‌ ధీమాకు తగ్గట్టుగానే ఉన్నా.. బీఆర్‌ఎస్‌ కూడా ఈ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలే కైవసం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.

రెండు కార్పొరేషన్‌ స్థానాలు సాధించగలిగిన బీజేపీ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా పెద్దగా ముందంజ వేయలేదు. మిగిలిన పార్టీల మాటెలా ఉన్నా.. కాంగ్రెస్‌లో మాత్రం తనకు ఎవరూ సాటిరారన్న సంకేతం రేవంత్‌ రెడ్డి ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేయగలిగారు. సీనియర్లు కొందరు అసంతృప్తితో ఉన్నప్పటికీ చెప్పుకోలేని పరిస్థితి కల్పించారు. ఢిల్లీ వెళ్లి తనపై ఫిర్యాదులు చెప్పే కొంతమంది నేతలకు కూడా రేవంత్‌ మీ పప్పులు ఉడకవు అని చెప్పకనే చెప్పారనుకోవచ్చు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు సంగతి, ప్రజాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ, పార్టీపై పట్టు ఉందన్న భావన ఉంటే, తనకు తిరుగు ఉండదని అనుకుంటున్నారు. దీనికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా ఆయన నాయకత్వాన్ని కొంతమేర బలోపేతం చేస్తాయి. అయితే 36 చోట్ల హంగ్ రావడం, బీఆర్ఎస్ 13 మున్సిపాల్టీలు గెలుచుకోవడం కాంగ్రెస్‌కు ప్రమాదకర సంకేతమన్న విశ్లేషణలు ఉన్నాయి. కాకపోతే ఆ విషయాన్ని కాంగ్రెస్‌లోని ఇతర వర్గాలు ఇప్పటికిప్పుడు రచ్చ చేయకపోవచ్చు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి సీనియారిటీ సంపాదించిన నేతలు కొందరైతే, ఇతర పార్టీలు ముఖ్యంగా టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి పార్టీపై ఆధిపత్యాన్ని సంపాదించుకున్న నేతలు మరికొందరు కనిపిస్తారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీఆర్‌ఎస్‌ రెండో టర్మ్‌లో అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేతగా పని చేశారు. అలాగే పాదయాత్ర కూడా చేశారు. ఈలోగా టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ పక్షాన ఎంపీ అయిన రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానంలో పలుకుబడి పెంచుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. దానికి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ద్వారా పరోక్ష సహకారం పొందారని చెబుతారు. ఇతరత్రా సామాజిక అంశాలు కూడా కలిసి వచ్చి కాంగ్రెస్ గెలవగానే సీఎం రేసులో ముందంజలో నిలబడ్డారు. ఫలితంగా మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరో మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి మంత్రిగా, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు పార్టీలో సీనియర్లయినా రేవంత్ రాజకీయ వ్యూహం ముందు నిలబడలేకపోయారు. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు  బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చినా, మూలాలు టీడీపీలోనే ఉన్నాయి. మరో నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చినా అంతకుముందు కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీలో ఉండేవారు. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వంలో మంత్రులపై తన పట్టు పెంచుకోవడానికి పలు వ్యూహాలు అమలు చేశారని చెబుతారు.

ఉదాహరణకు కొంతకాలం క్రితం వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న మల్లు భట్టి కొంత స్వతంత్రంగా బిల్లులు మంజూరు చేయడానికి చొరవ తీసుకునేవారట. కానీ, ఇటీవలి కాలంలో సీఎంకు తెలియకుండా బిల్లులకు నిధులు విడుదల చేసే పరిస్థితి లేదట. ఢిల్లీ వెళ్లి కొందరు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అధిష్టానంతో తమ గోడు మొరబెట్టుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ, అధిష్టానం పరిస్థితే అగమ్యగోచరంగా ఉంది. పార్టీ నిర్వహణకు అవసరమైన  నిధుల కోసం తాము పవర్‌లో ఉన్న మూడు రాష్ట్రాలపైనే ఎక్కువగా ఆధారపడే పరిస్థితి ఉంది. ఆ విషయంలో రేవంత్ బాగానే ఉపకరిస్తుండవచ్చన్న అభిప్రాయం పార్టీలో ఉంది. ఆ ధైర్యంతోనే రేవంత్ నేనే రాజు, నేనే మంత్రి అన్న డైలాగును వాడి కాంగ్రెస్ లోని ఇతర ముఖ్య నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చారనుకోవచ్చు. అయితే, ఇది అహంకార పూరితమైందా? అన్న చర్చ వస్తుంది. కొందరు అలా చూడవచ్చు. మరికొందరు రేవంత్ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు.

ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగా కుంపట్లు పెట్టే సీన్ లేకుండా చేసుకోవడానికి కూడా ఈ డైలాగు ఉపయోగపడవచ్చు. బీజేపీ వారే గట్టిగా నిర్ధారించలేకపోతున్నప్పటికీ, జమిలి ఎన్నికల గురించి రేవంత్ మాట్లాడడం, ఈ టర్మ్‌లో ఆరు నెలల అదనపు పదవీకాలం, తదుపరి మరో టర్మ్‌లోనూ తానే సీఎం అని అంటున్నారు. ఇది కేడర్‌లో ఒక నమ్మకం కలిగించే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. తాను ఎవరితోనూ పోల్చుకోనని, తనకు తానే పోటీ అని కూడా ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ఇలానే మాట్లాడుతుండేవారు. రాజకీయాలలో ఎవరు పొగిడినా, పొగడకపోయినా, తన గురించి తాను బాగా చెప్పుకోవాలి. అదంతా మీడియాలో ప్రముఖంగా ప్రచారం జరగాలి. ఈ స్ట్రాటజీలో చంద్రబాబు మొనగాడు. ఇప్పుడు రేవంత్ కూడా ఆ బాటలో ఉన్నారనపిస్తుంది.

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చాక రేవంత్‌కు మద్దతు ఇస్తున్న ఎల్లో మీడియా నువ్వే రాజు, నువ్వే మంత్రి అని కీర్తించడం కూడా గమనార్హమే.  ఇది రేవంత్‌కు ఎంత ప్రయోజనమో తెలియదు కాని, ఆ మీడియాకు బాగానే గిట్టుబాటు అవుతుందన్న భావన కలుగుతుంది. ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని కోరడం వెనుక కూడా ఒక ఉద్దేశం ఉన్నట్లు అనిపిస్తుంది. తెలంగాణలో ఉన్న టీడీపీ అభిమానులు, ఒక సామాజికవర్గ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయన ఈ మాటలు చెబుతుండవచ్చు. ఈ రకంగా పలు వ్యూహాలు అమలు చేస్తున్న రేవంత్ మున్సిపల్ ఎన్నికలలో విజయం అంతటిని తన ఖాతాలోనే వేసుకుంటారు. రాష్ట్రం అంతటా తిరిగి ప్రచారం చేసింది ఆయన ఒక్కరే కనుక ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఈ వెసులుబాటు తక్కువగా ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే జాతీయ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీ తరహాలో రేవంత్ నడుపుతున్నట్లుగా అనిపిస్తుంది. పీసీసీ అధ్యక్షుడుగా మరీ అంత బలమైన నేత లేకుండా చూసుకోవడం కూడా ప్లస్ పాయింటే అని చెప్పాలి.

ఇక మున్సిపల్ ఎన్నికలలో విజయాలే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్‌ను మరోసారి గెలిపిస్తాయన్న భావన రేవంత్ తదితర కాంగ్రెస్ నేతలలో ఉండవచ్చు. కానీ, ఈ స్థానిక ఎన్నికలే కొలమానంగా తీసుకోలేం. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ నాయకత్వానికి ఒక విశ్వాసం ఏర్పడుతుంది. బీఆర్‌ఎస్‌, బీజేపీలను నైతికంగా దెబ్బతీయడానికి ఉపయోగపడతాయి. కేసీఆర్‌ రెండో టర్మ్‌లో బీఆర్‌ఎస్‌ అన్ని జెడ్పీలను, 90 శాతం మున్సిపాల్టీలను కైవసం చేసుకుంది. కానీ, ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైంది. లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా తెచ్చుకోలేకపోయింది. బీజేపీ సడన్‌గా ఎనిమిది సీట్లలో విజయం సాధించింది. కానీ, స్థానిక ఎన్నికలలో బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందలేకపోయింది. బీఆర్‌ఎస్‌కు కాస్త మెరుగైన ఫలితాలే వచ్చినా అవి కొంత ధైర్యాన్ని ఇవ్వవచ్చు కానీ, పూర్తి విశ్వాసాన్ని ఇవ్వలేకపోవచ్చు.

ఒకప్పుడు స్థానిక ఎన్నికలు కూడా ప్రజాభిప్రాయానికి ఒక ప్రాతిపదికగా ఉండేవి. ఉదాహరణకు 2001లో ఉమ్మడి ఏపీలో జరిగిన జెడ్పీ ఎన్నికలలో 11 చోట్ల టీడీపీ, 10 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. మున్సిపాల్టీలలో కూడా హోరాహోరీగా ఎన్నికలు సాగేవి. కానీ, విభజన తర్వాత స్థానిక ఎన్నికలలో 70 నుంచి 90 శాతం వరకు అధికారంలో ఉన్న పార్టీలే గెలుచుకుంటున్నాయి. ఈ ఎన్నికలతోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిపోతామని అనుకుంటే అది ఒక్కోసారి భ్రమ అవుతుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒక రీతిలో ఉండవు. ఈ మున్సిపల్ ఎన్నికలతోనూ, పార్టీ హైకమాండ్ లోను, అలాగే పార్టీ ఇతర సీనియర్ నేతలపైన పట్టు సాధించినంత వరకు రేవంత్‌కు  సంతోషమే. అసెంబ్లీ ఎన్నికలలో విజయానికి ఇవి సరిపోతాయని అనుకోజాలం. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తిస్తే ఆయనకే మంచిది. రాజకీయాలలో ఎప్పుడు ఎవరు రాజు అవుతారో, ఎప్పుడు ఎవరు మంత్రి అవుతారో, ఎప్పుడు అడ్రస్ లేకుండా పోతారో చెప్పజాలం. ఆ విషయాన్ని రాజకీయ నేతలు విస్మరించరాదని చెప్పక తప్పదు.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement