అజిత్ ఎక్కడ.. ఏటీఎం దొంగ వేటలో పోలీసులు! | Cash van driver escapes with Rs 60 lakh in Hyderabad | Sakshi
Sakshi News home page

అజిత్ ఎక్కడ.. ఏటీఎం దొంగ వేటలో పోలీసులు!

Feb 14 2026 10:52 AM | Updated on Feb 14 2026 10:56 AM

Cash van driver escapes with Rs 60 lakh in Hyderabad

గచ్చిబౌలి: రూ.60 లక్షలతో ఉడాయించిన సీఎంసీ వాహన డ్రైవర్‌ అజిత్‌ కుమార్‌ అలియాస్‌ శివ కోసం ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. భారీ నగదుతో పరారైన నిందితుడు ఎక్కడికి వెళ్లాడనే క్లూ ఇంకా లభించలేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఎస్‌ఓటీ, సీసీఎస్‌ పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్నాయి.

గురువారం సాయంత్రం 4.45 గంటల సమయంలో గోపన్‌పల్లిలో యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎం నుంచి భారీ నగదుతో అజిత్‌ పరారైన విషయం తెలిసిందే. తెల్లాపూర్‌లో గద్దర్‌ చౌరస్తాలో వాహనం వదిలి వెళ్లిన అజిత్‌ ఓ ఆటోలో బీహెచ్‌ఈఎల్‌ క్రాస్‌ రోడ్డుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అశోక్‌నగర్‌లో ఓ లాడ్జీకి వెళ్లిన నిందితుడు.. పెట్టె పగుల గొట్టి అందులోని నగదును బ్యాగ్‌లోకి సర్దుకొని బస్సులో వెళ్లి మియాపూర్‌లో దిగి ఐడీఏ బొల్లారం వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బొల్లారం, బాచుపల్లి పరిసర ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు.  

కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు 
అజిత్‌ ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా మరో బృందం దర్యాప్తు చేస్తోంది. భారీ నగదుతో ఎక్కువ దూరం వెళ్లే అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు. గత ఏడేళ్లుగా తిరుమలగిరిలోనే ఉంటున్న అజిత్‌ ఆధార్‌ కార్డు మాత్రం బెంగళూర్‌లో తీసుకున్నట్లు పోలీసులు సమాచారం రాబట్టారు. ఆరు నెలల క్రితమే సీఎంసీ వాహనంలో డ్రైవర్‌ డ్యూటీలో చేరిన అజిత్‌ పక్కా ప్లాన్‌ తోనే రూ.60 లక్షల నగదు ఉన్న వాహనంతో పరారైనట్లు తెలుస్తోంది.పెట్టెలో ఉన్న నగదును తీసుకు వెళ్లేందుకు తన వద్ద బ్యాగ్‌ను ముందే సమకూర్చుకున్నట్లు సమాచారం.దాదాపు 7 ఏటీఎంలలో క్యాష్‌ లోడ్‌ చేశారు.

కస్టమర్లు ఏటీఎంలో డిపాజిట్‌ చేసిన నగదును తీసి వాహనంలోని బాక్స్‌లో భద్రపరుస్తారు. చివరి ఏటీఎంకు వచ్చే సరికి డిపాజిట్‌ మొత్తం భారీగా ఉందని నిర్ధారించుకున్న తరువాతే అదును చూసి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement