ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన 2026 –27 బడ్జెట్‌లో రెవెన్యూ – వ్యయం మధ్య అధిక వ్యత్యాసం, మూలధన కల్పన తక్కువగా ఉండటం; ఆరోగ్యం, సామాజిక సేవలకు వనరుల కేటా యింపు తక్కువగా ఉండటం; రుణాలు, కేంద్ర సహాయంపై అధి కంగా ఆధారపడటం; సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధనకు అవసరమయిన చర్యలు లోపించడం కారణంగా సంతులనం లోపించింది.
రాష్ట్ర సొంత రెవెన్యూ రాబడిలో వృద్ధి ఆశించినంతగా లేకపోవడం, మరోవైపు రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు కారణంగా ప్రాధాన్యతా రంగా లపై పెట్టుబడి తగ్గుతుంది. తద్వారా స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధి క్షీణించడంతో పాటు ప్రభుత్వానికి రుణ భారం పెరిగి అభివృద్ధి ప్రాజెక్టులపై వ్యయం తగ్గుతుంది.
కొరవడిన ఆర్థిక క్రమశిక్షణ
2024 జూన్ తర్వాతి కాలంలో ప్రభుత్వం రుణాలపై అధికంగా ఆధార పడటం, రెవెన్యూ సమీకరణలో నిర్మాణా త్మక బలహీనతలు, వ్యయ యాజమాన్యంలో విఫలమవ డాన్ని సూచిస్తున్నది. పన్నేతర రాబడిలో తగ్గుదల, మూలధన వ్యయం తగ్గుదల, కమిటెడ్ వ్యయం (వేతనాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు)లో పెరుగుదలను ఇటీవలి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టపరుస్తున్నది. కాగ్ గణాంకాల ప్రకారం, 2025 –26 ఆర్థిక సంవత్సరంలో 2025 నవంబర్ నాటికి రెవెన్యూ లోటు రూ. 54,355 కోట్లకు చేరు కుంది. 2026–27 బడ్జెట్‌లో మొత్తం వ్యయం రూ. 3,32,205 కోట్లుగా ప్రతిపాదించగా, ఈ మొత్తంలో రెవెన్యూ వ్యయం 77.1 శాతం కాగా, మూలధన వ్యయం 16.2 శాతం.
మూలధన వ్యయాన్ని 2025–26 బడ్జెట్‌లో రూ. 40,636 కోట్లుగా అంచనా వేయగా, ప్రస్తుత 2026–27 బడ్జె ట్‌లో రూ. 53,915 కోట్లుగా ప్రతిపాదించారు. మూలధన వ్యయం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికంగా రుణా లపై ఆధారపడినట్లయితే భవిష్యత్తు బడ్జెట్‌లలో అధిక మొత్తాన్ని వడ్డీ చెల్లింపులపై వెచ్చించవలసి ఉంటుంది. తద్వారా నూతన మూలధన ప్రాజెక్టులు, సంక్షేమంపై వ్యయం తగ్గుతుంది.
రాష్ట్ర మొత్తం రుణం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019–24 మధ్య కాలంలో రూ. 2,61,302 కోట్ల నుండి రూ. 4,85,491 కోట్లకు చేరు కోగా, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి పది నెలల కాలం నాటికి (మార్చి 2025) ఈ మొత్తం రూ. 6,62,557 కోట్లకు చేరుకుందని ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాలు పార్ల మెంటులో ప్రస్తావనకు రావడం జరిగింది. 2019–24 మధ్య అధికారంలో ఉన్న జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతలుగా ప్రతి ఆర్థిక సంవత్సరంలో సగటున రూ. 31,000 కోట్లను మూల ధన వ్యయానికి కేటాయించింది.
కోవిడ్–19 సమయంలో రెవెన్యూ రాబడి తగ్గినప్పటికి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచు కొని ఒకవైపు సంక్షేమంపై వ్యయాన్ని పెంచుతూ మరోవైపు దీర్ఘకాల ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకొని మూలధన పెట్టు బడులను పెంచగలిగి, ఆర్థిక క్రమశిక్షణను పాటించడాన్ని గమనించాలి. మానవాభివృద్ధి, రైతుల సంక్షేమం, హౌసింగ్, ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు, గ్రామీణ మరియు పట్టణాభివృద్ధి రంగాలకు 2019–24లో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిన క్రమంలో జీఎస్ డీపీ వృద్ధిలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది.
మరోవైపు రుణాలవృద్ధిలోనూ తగ్గుదలను గమనించవచ్చు. వివిధ అంశాలకు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యతల క్రమంలో పేదరిక స్థాయి 2015–16లో 11.77 శాతం నుండి 2023 నాటికి 4.2 శాతానికి తగ్గింది. 2025–26 ఆర్థిక సంవ త్సరంతో పోల్చినప్పుడు 2026 –27లో రెవెన్యూ లోటు, ఆర్థిక లోటులో తగ్గుదలను ప్రతిపాదించినప్పటికీ రెవెన్యూ రాబడిలో తగ్గుదల కారణంగా తిరిగి బడ్జెట్ లోటులు పెరిగే అవకాశం ఉంది. రుణాలపై, కేంద్ర గ్రాంట్లపై అధికంగా ఆధారపడటం వలన స్వయం నిరంతర ఆదాయ వృద్ధి ప్రశార్థకంగా కన్పిస్తున్నది.
ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమం, వివిధ ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తూ, ‘ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం’ నియమావళిని పాటిస్తూ, పన్నేతర రాబడిని పెంచుకునే మార్గాలను అన్వేషించాలి. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సంక్షేమ పథకాల అమలు లక్ష్యాన్ని సాధించడం, తప్పనిసరి వ్యయానికి సంబంధించి కాలానుగుణంగా సమీక్ష, అధిక వడ్డీతో కూడిన స్వల్పకాల రుణాల తగ్గింపు ద్వారా ఆర్థిక క్రమశిక్షణ సాధనకు కృషి చేయాలి.
-వ్యాసకర్త వైస్ ఛాన్స్‌లర్ (ఇన్‌ఛార్జి), ఇక్ఫాయ్
-ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్


