breaking news
Guest Column
-
దీక్ష.. గురువు పెట్టిన పరీక్ష!
అస్మృతిః క్లేశజాతస్య దీక్షాయాః ఆది లక్షణమ్’ ఒక పని చేసేటప్పడు దీక్ష ముఖ్యం. ఎలాంటి బాధలు గుర్తుకురాకుండా ఉండటమే దీక్షకు ప్రధాన లక్షణం. ఏ పనినైనా చేసి లక్ష్యాన్ని సాధించాలని అనుకొన్నప్పుడు అందులో ఉండే కష్టనష్టాలు గుర్తుకు రాకూడదు. గుర్తొస్తే పట్టుదల పలచబడి లక్ష్యం సాధించలేరు. ఏకాగ్రత ఉన్నప్పుడే లక్ష్య సాధన సాధ్యమవుతుంది.కారు నడిపే సమయంలో డ్రైవరు మనసు పరిపరివిధాల పోకుండా ముందు రోడ్డువైపే ఏకాగ్రతతో ఉంటుంది. లేకపోతే ప్రమాదాలేర్పడతాయి. అందుకే డ్రైవరు కారు వేగం పరిమి తిని, సమయాన్ని, ట్రాఫిక్ రూల్సును, సిగ్నల్స్‌ను జాగ్రత్తగా గమనిస్తూ ముందుచూపు సడల కుండా దీక్షతో నడుపుతాడు. అప్పుడే వాహనం క్షేమంగా గమ్యం చేరుతుంది.ఒక శిల్పాచార్యుడికి ఇద్దరు శిష్యులుండేవారు. మొదటివాడు కష్టపడి చాలాసేపు శిల్పాలు చెక్కుతూనే ఉండే వాడు. రెండోవాడికెప్పుడూ ఆటల ధ్యాసే. గురువుగారు వచ్చేసరికి పని చేస్తూండటం, తర్వాత వదిలివేయటం అలవాటు. ఒకరోజు ఇద్దర్నీ పిలిచి ఫలానా కొండల్లో ఫలానా రాయి ఉంది, వెతికి తీసుకురండని పంపాడు. ఇద్దరు అలాగే వెళ్ళి శిలను గుర్తించి తెచ్చారు. మొదటివాడు పండ్లు, పూలు, మూలికలు కూడా తెచ్చాడు.‘ఇవన్నీ ఎందుకురా?’ అని గురువడిగితే ‘స్వామీ! నా తల్లికి పండ్లు, చెల్లికి పూలు, మా అమ్మమ్మ చికిత్సకు మూలికలు తెచ్చా’నన్నాడు మొదటి శిష్యుడు. రెండవవాడిని ‘ఏరా! మీ తలిదండ్రులకు సుస్తీగా ఉందికదా! మరి నీవెందుకు మూలికలు తేలేదు’ అని గురువడిగాడు. ‘స్వామీ! నేను శిలను మాత్రమే వెతికాను. ఇతర ఆలోచనలేవీ నాకు లేవు’ అన్నాడు. పనిలో ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత ఉంటే కార్యసిద్ధి కల్గుతుంది.- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
అసలు సన్యాసం అంటే 'నేను–నాది’ని వదలడమే!
'జటిలో ముణ్డీలుంచిత కేశఃకాషాయాంబర బహుకృత వేషఃపశ్యన్నపి చ న పశ్యతి మూఢఃఉదర నిమిత్తం బహుకృత వేషః'ఇది శంకర భగవత్పాదుల వారి ‘భజగోవిందం’లోని ఒక శ్లోకం. జడలు కట్టిన వెంట్రుకలతో ఒకడు, జుట్టులేక ముండనము చేయించుకున్నవాడు ఒకడు, వ్రేలా డుతూ ఉండే వెంట్రుకలు కలవాడు ఒకడు, కాషాయ రంగు బట్టలను ధరించినవాడు ఒకడు– నిజానికి వీళ్ళంతా ఉదర పోషణకు మాత్రమే వివిధ వేషములను వేస్తారు (భజగోవిందం; వ్యాఖ్య స్వామి చిన్మయానంద).శంకరాచార్యుల కాలం నాటికే సన్యాసులు అలా ఉండేవారంటే ఆశ్చర్యం కల్గుతుంది. ఒకప్పుడు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు సాధన కొరకు జీవించాలి కాబట్టి ఏదో కొంత భిక్షాన్నాన్ని, దాన్ని పవిత్రమైన ‘మధుకరి’గా భావించి యాచించేవారు. కానీ ఈనాడు ఆధ్యాత్మిక సాధన ఏదీ లేకపోయినా, కేవలం కాషాయ వస్త్రాలను ధరించి, సన్యాసులుగా అవతారమెత్తి యాచిస్తున్నారు చాలామంది.కేరళలోని ఆనందాశ్రమానికి చెందిన విశ్వమాత కృష్ణాబాయి ఏ యువకుడైనా తనకు సన్యాస దీక్షను ఇమ్మని అడిగితే, మందలిస్తూ ఇలా చెప్పేది: ‘సన్యాసం తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదు. నీవెందరో సన్నాసులను చూస్తున్నావు. వారు పొందినదేమిటి? గృహాన్ని, బంధువులను వదలటం, కాషాయ వస్త్రాలను ధరించటమే సన్యాసం కాదు. నేను, నాది అన్న భావాన్ని వదలటం. ఇంట్లో ఉన్నప్పుడు కూడా దీనిని నీవు చేయవచ్చు. నీ వైపునుండి అవసరమైన ఒకే ఒక విషయం నీ శాశ్వత స్వరూపాన్ని సాక్షాత్కరించుకొనవలెననే తీవ్రమైన ఆకాంక్ష.ఈ ఆకాంక్షతో రామనామాన్ని స్వీకరించి, నీ ఇరుగు పొరుగు వారినీ, నీ ప్రదేశంలో నున్నవారినీ రాముని రూపాలుగా సేవించు. పవిత్రమూ, సర్వశక్తిమంతమైన రామ నామాన్ని నిరంతరం నీ నాలుక మీద నాట్యం చేయ నివ్వు’ (పుటలు– 41–42; విశ్వమాత కృష్ణాబాయి– స్వామి సచ్చిదానంద – ఆనందాశ్రమము).– రాచమడుగు శ్రీనివాసులు -
ఉన్నత విద్యలో అసలు సవాలు
జూలై 27న విడుదలైన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2027 భాగస్వామ్య లేదా ప్రాతి నిధ్య నివేదిక భారత ఉన్నత విద్యకు ఒకేసారి ఆశాజనకమైన చిత్రాన్నీ, ఆందోళన కలిగించే వాస్తవాన్నీ చూపించింది. ప్రపంచంలోని 118 దేశాల నుంచి రికార్డు స్థాయిలో 2,297 విశ్వవిద్యాల యాలు ఈ ర్యాంకింగ్ ప్రక్రియలో పాల్గొనగా, 143 విశ్వవిద్యాల యాలతో భారత్ ప్రపంచంలో రెండో అత్యధిక ప్రాతినిధ్యం కలిగిన దేశంగా నిలిచింది.ఎక్కువ విశ్వవిద్యాలయాలు ర్యాంకింగ్‌లో పాల్గొ నడం ఒక విషయం అయితే, ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి స్థానాలను సాధించడం మరో విషయం. అందుకే ఈ సందర్భంలో ‘రాశి కంటే వాసి ముఖ్యం’ అనే సామెత సరిగ్గా సరిపోతుంది. ప్రాతినిధ్యం పెరగడం మాత్రమే కాదు, ప్రపంచ నాణ్యతా ప్రమాణాలను అందు కోవడమే నిజమైన విజయానికి కొలమానం.గత ఐదేళ్లుగా భారతీయ విశ్వవిద్యాలయాలు టీహెచ్ఈ ర్యాంకింగ్స్‌లో చురుకుగా పాల్గొంటున్నాయి. అయితే ఈ సంఖ్య పెరుగుతున్నా, నాణ్యతలో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఇప్పటికీ ప్రపంచ టాప్–100లో మనం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఒక్క భారతీయ విశ్వవిద్యాలయంగానీ, ఉన్నత విద్యా సంస్థగానీ స్థానం సంపాదించలేక పోవడం ఆలోచించాల్సిన విషయం. ఎక్కువ శాతం 300–500 బ్యాండ్లలో లేదా అంతకంటే దిగువనే నిలుస్తున్నాయి.ఎక్కడ వెనుకబడ్డాం?భారతీయ విశ్వవిద్యాలయాలు ముఖ్యంగా మూడు అంశాల్లో గణనీయంగా వెనుకబడి ఉన్నాయి. మొదటిది అంతర్జాతీయీ కరణ– విదేశీ విద్యార్థులు, విదేశీ అధ్యాపకుల సంఖ్య అత్యల్పంగా ఉండడం వల్ల ప్రపంచ అనుసంధానం పరిమితమవుతోంది. రెండవది ఫ్యాకల్టీ–విద్యార్థుల నిష్పత్తి. ప్రపంచ అగ్రశ్రేణి విశ్వవిద్యా లయాల్లో ఒక్కో అధ్యాపకుడికి తక్కువ మంది విద్యార్థులు ఉండగా, మన దేశంలో పరిస్థితి అందుకు విరుద్ధం. మూడవది పరిశోధన ప్రభావం– పరిశోధనా పత్రాల సంఖ్య పెరుగుతున్నా, వాటికి అంత ర్జాతీయ సైటేషన్లు రావడం, పేటెంట్లు, పరిశ్రమలతో భాగస్వా మ్యాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ వంటి అంశాల్లో ఇంకా గణనీయ మైన లోటు ఉంది. దీనికి తోడు దేశం మొత్తం పరిశోధన–అభివృద్ధి (ఆర్ అండ్ డీ)పై జీడీపీలో కేవలం 0.6–0.7 శాతం మాత్రమే వ్యయం చేస్తుండగా, అందులో ఉన్నత విద్యా సంస్థల వాటా 8–9 శాతం మాత్రమే. ఈ పరిస్థితుల్లో ప్రపంచ స్థాయి పరిశోధనా విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దడం అంత సులభం కాదు.తూర్పు ఆసియా దేశాల అనుభవం భారత్‌కు విలువైన పాఠాన్ని చెబుతోంది. చైనా తక్కువ సంఖ్యలో విశ్వవిద్యాలయాల తోనే త్సింగ్వా, పెకింగ్ యూనివర్సిటీ వంటి వాటిని ప్రపంచ అగ్రశ్రేణి స్థానాలకు చేర్చింది. సింగపూర్ వంటి చిన్న దేశం కేవలం రెండు ప్రముఖ విశ్వవిద్యాలయాలతోనే ప్రపంచ టాప్–20లో స్థిరమైన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఈ దేశాలు ప్రాతినిధ్య సంఖ్యల కంటే నాణ్యత, పరిశోధన, అంతర్జాతీయ భాగస్వా మ్యాలు, ప్రతిభావంతులైన అధ్యాపకులు, దీర్ఘకాలిక ప్రభుత్వ పెట్టు బడులకు ప్రాధాన్యం ఇచ్చాయి. అందువల్లే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో స్థిరమైన విజయాలను అందుకుంటున్నాయి.భారత్ కూడా ఇదే దిశగా మరింత దృఢమైన అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. మన జాతీయ విద్యా విధానం–2020 లక్ష్యాలు సాకారం కావాలంటే, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనకు అధిక నిధులు కేటాయించడం, అంతర్జాతీయ అధ్యాపకులను, విదేశీ విద్యార్థులను ఆకర్షించడం, పరిశ్రమ–విశ్వవిద్యాలయ భాగస్వా మ్యాలను బలోపేతం చేయడం, ప్రపంచ స్థాయి పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వడం అత్యవసరం.– ఏటూరి శేఖర్ శర్మ, రిటైర్డ్ జిల్లా విద్యాధికారి -
దైవకార్యాన్ని అర్థం చేసుకోవాలి
దాసియైన మంధర మాటలు విని, కైకేయి దశరథుడిని కోరిన రెండు వరములతో, శ్రీరాముడికి జరగవలసిన పట్టాభిషేక కార్యక్రమం అకస్మాత్తుగా ఆగిపోయింది. అదేకాక, శ్రీరాముడు పదు నాలుగేళ్ళు వనవాసం చేయవలసిన విషమ పరిస్థితి ఏర్పడింది. శ్రీరాముడికి బహిప్రాణంలా ఉండే లక్ష్మణుడు ఈ హఠాత్పరిణామానికి తట్టుకోలేక దుఃఖంలో మునిగిపోయాడు.‘చేతిలోకి వచ్చి స్వంతమయింది కదా అని భావించిన సంపద అంతలోనే పోవడం, అడవుల పాలవడం– ఇవి దైవనిర్ణయా లుగా జరుగుతాయే తప్ప మనుషుల వశంలో ఉండి జరిగేవి కావు తమ్ముడా!’ అని లక్ష్మణుడిని సమాధానపరిచాడు శ్రీరాముడు. తండ్రి మీద కూడా కోపంతో ఉన్న లక్ష్మణుడితో ఇంకా ఇలా చెప్పాడని ‘గోపీనాథ రామాయణము’ తెలిపింది.మనుషుల జీవితాలలో లాభాలాభములను, సుఖదుఃఖములను, భయక్రోధములను, భవాభవంబులను ఏది కలుగజేస్తుందో అది దైవం అనబడుతుంది. విశ్వామిత్రాది తపోధనులు– జితేంద్రియులు అయ్యుండి కూడా– దైవంచే పీడితులగుచూ శక్తిమంతాలైన వారి నియమాలను విడిచిపెట్టినవారై కామక్రోధాసక్తులగుట తెలిసినదే కదా! ఈ లోకంలో కావలసినదిగా భావించబడే కార్యాన్ని కాకుండాచేసి, ఊహించని కార్యాన్ని, సంకల్పించని పరిణామాన్ని జరిగేటట్లుగా చేయడమే దైవకార్యంగా భావించి మనిషి సమాధానపడాలి. అటువంటి వివేకం కలిగిన బుద్ధితో, క్రోధాది ఇంద్రియ భావములను అదుపులో పెట్టుకుని ఆలోచించినపుడు అకస్మాత్తుగా తప్పిపోయిననా పట్టాభిషేక కార్యం గురించిన శోకం నాలో జనించదు.తే. నాకు జూడ బ్రజాపాలనము కంటెనవ్విపినవాస మధికోదయంబు గానననఘ లక్ష్మీవిపర్యయమందు నీవుమది విషాదంబు విడువుము మమత దక్కి. పట్టాభిషేకం చేయించుకుని ప్రజాపాలనం గురించిన పనులలో పడడం కంటె, అడవికి వెళ్ళి అక్కడ జీవితాన్ని గడపడంలోనే నాకు ఎక్కువ ఆనందం లభిస్తుంది. కాబట్టి రాజ్యా ధికారం అనే లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోయిందనే శోకాన్ని విడిచిపెట్టు. ప్రశాంతంగా ఉండు – అని చెప్పి శ్రీరాముడు లక్ష్మణుడిని శాంతపరిచాడు.– భట్టు వెంకటరావు -
అబద్ధం డేగలా... నిజం నత్తలా!
ఒకప్పుడు ఒక వార్త ప్రజల ముందుకు రావాలంటే సమాచారం సేకరించడం, దాన్ని పరిశీలించడం, ధ్రువీకరించడం వంటి ప్రక్రియలు ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ ఒక ప్రచురణ వేదికగా మారింది. దీంతో సమాచారం వేగంగా చేరుతోంది. అదే సమయంలో ధ్రువీకరించని సమా చారం కూడా అంతే వేగంగా వ్యాపిస్తోంది. ఏది ఎక్కువ మందికి చేరాలనేదాన్ని ఇప్పుడు ఎడిటర్ కాదు; ఎక్కువ స్పందన వచ్చే కంటెంట్‌ను ముందుకు నెట్టే అల్గోరిథమ్లే నిర్ణయిస్తున్నాయి.ఇటీవల జరిగిన ఒక సంఘటన దీనికి మంచి ఉదాహరణ. 2026 మార్చి 16న, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే భారత సైన్యంపై అభ్యంతర కరమైన వ్యాఖ్యలు చేసినట్లు చూపే ఒక వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. నిజానికి అది మార్చి 14న పీటీఐ రికార్డ్ చేసిన అసలైన ప్రసంగం– ‘భవిష్యత్ భద్రతా సవాళ్లపై సైన్యం సంసి ద్ధత’ గురించి మాట్లాడిన వీడియో. దాని దృశ్యాలను అలాగే ఉంచి, ఏఐ సాయంతో పూర్తిగా వేరే ఆడియో జోడించారు. పీఐబీ ఫ్యాక్ట్–చెక్ యూనిట్, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఫ్యాక్ట్–చెక్ విభాగం రెండూ దీన్ని డీప్ ఫేక్‌గా ధ్రువీకరించి, పాకిస్తాన్ ఆధారిత ప్రచార ఖాతాల నుంచి ఇది వ్యాపించిందని అధికారులు గుర్తించేలోపే, వీడియో లక్షల మందికి చేరి పోయింది. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు నిజమైన వీడియో వచ్చినా ‘ఇది ఏఐతో సృష్టించిందేమో’ అనే అనుమానం కలుగుతోంది. గణాంకాలు కూడా అదే చెబుతున్నాయి.రాయిటర్స్ ఇనిస్టిట్యూట్ వారి 2025 నివేదిక ప్రకారం 48 దేశాల్లో వార్తలపై ప్రజల నమ్మకం సగటున 40 శాతమే. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు వార్తలను నమ్మడం లేదు. ఇది పదేళ్ల క్రితం కంటే చాలా తగ్గింది. ఎడెల్మన్ వారి సర్వేలో 69 శాతం మంది– ఇది ఉద్దేశపూర్వకంగా చేసే దుష్ప్రచారం అని నమ్ముతున్నారు. యునెస్కో కూడా ఇదే విషయం చెబుతోంది– ధ్రువీకరణ లేని సమాచారం భయంకరంగా వ్యాపిస్తోందని!భారత్‌లో ఇంకా పెద్ద సమస్య. మన దగ్గర అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసేవి, షార్ట్ వీడియోలు– ఇవే చాలామందికి వార్తలు. ఎప్పటివో పాత దృశ్యాలు, సంఘటనలు ఇప్పటి వార్తలుగా ప్రచారం జరగడం సాధారణ విషయం అయ్యింది. ఇందువల్ల ఎంతో నష్టం వాటిల్లుతోంది. ఏదైనా వీడియో లేదా పోస్ట్ చూడగానే ఫార్వర్డ్ బటన్ నొక్కే ముందు, ‘ఇది ఎవరు పోస్ట్ చేశారు, మూలం ఏంటి’ అని ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. అధికారిక ఫ్యాక్ట్–చెక్ వేదికలు, విశ్వసనీయ ధ్రువీకరణ సేవలను ఉపయోగించడం అలవాటు చేసు కోవచ్చు. సమాచారం విషయంలో ఏమాత్రం అస్పష్టత ఉండకూడదు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు కూడా సంచలనం కంటే నమ్మదగిన సమాచారాన్ని ప్రోత్సహించాలి. నిజం నత్తలా నడిచినా... దాని బరువు తెలిసిన వాళ్లు దాని వెనుకే ఉంటారు!– వంగవోలు రవి, ఉపాధ్యాయుడు -
జీవ ఇంధనాలే భారత భవిష్యత్ శక్తి
పెరుగుతున్న పెట్రోల్ ధరలు, నగరాల్లో క్షీణిస్తున్న గాలి నాణ్యత, పశ్చిమాసియాలో చమురు సరఫరాపై నెలకొంటున్న అనిశ్చితి– ఈ మూడు అంశాలు నేడు ప్రతి భారతీయుడి జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారమే జీవ ఇంధనాల వాడకం.ప్రపంచం ఇప్పుడు జీవ ఇంధనాలను కేవలం ప్రత్యామ్నాయ ఇంధనంగా కాకుండా, పర్యావరణ రక్షణ, ఇంధన భద్రత, రైతు ఆదాయం, గ్రామీణ ఉపాధి వంటి వాటిని కలిపే భవిష్యత్ అభివృద్ధి మార్గంగా చూస్తోంది.భారత్ ప్రస్తుతం తన ముడి చమురు అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ పరిస్థితిలో ప్రత్యా మ్నాయ ఇంధనాల విస్తరణ దేశ ఇంధన స్వావ లంబనకు కీలకం. జీవ ఇంధనాల ప్రత్యేకత ఏమిటంటే, అవి మన దేశంలోనే లభించే వ్యవసాయ, సేంద్రియ వనరుల నుంచి ఉత్పత్తి చేయగలగడం. చెరకు మొలాసిస్, మొక్కజొన్న, పాడై పోయిన ధాన్యాలు, వరి గడ్డి, పంట అవ శేషాలు ఇప్పుడు ఇంధన ముడి సరుకుగా మారు తున్నాయి. అంటే, వ్యర్థాన్ని సంపదగా మార్చే సర్క్యులర్ ఎకానమీకి జీవ ఇంధనాలు బలమైన పునాది వేస్తున్నాయి.జీవ ఇంధనాల్లో బయో–ఇథనాల్, బయో– డీజిల్, బయో–గ్యాస్, బయో– సీఎన్జీ, సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయెల్ వంటి పలు రూపాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండో తరం ఇథనాల్ సాంకేతికత వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించడం వల్ల ఆహార భద్రతకు భంగం కలగకుండా ఇంధన ఉత్పత్తి సాధ్యమవుతోంది. 2014లో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం సుమారు 1.5 శాతం మాత్రమే ఉండగా, 2024–25 నాటికి అది 19.05 శాతానికి చేరింది. 2025–26 ఆర్థిక సంవ త్సరంలో సగటు మిశ్రమం 20 శాతానికి చేరువ కావడం ఈ కార్యక్రమం విజయాన్ని సూచిస్తోంది.భారత్‌కు కొత్త అవకాశాలుఇటీవల కేంద్ర మంత్రివర్గం 23,731 కోట్ల వ్యయంతో ‘గోబర్ధన్ – నేషనల్ సర్క్యులర్ బయోఎనర్జీ పథకాన్ని’ ఆమోదించడం జీవ ఇంధన రంగంలో కీలక మలుపు. పశువుల పేడ, పంట అవశేషాలు, వంటింటి వ్యర్థాలు, మార్కెట్ వ్యర్థాలను కంప్రెస్డ్ బయోగ్యాస్, బయో–స్లర్రీగా మార్చి గ్రామీణ ప్రాంతాలను శుభ్రమైన ఇంధన ఉత్పత్తి కేంద్రాలుగా తీర్చిద్దడం ఈ పథకం లక్ష్యం. ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఈ రంగం ద్వారా రూ. 40,000 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్య ఆదా, 1.5 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు, 10 మిలియన్ మెట్రిక్ టన్నుల శిలాజ ఇంధన వినియోగానికి ప్రత్యామ్నాయం సాధ్యమవుతాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి జీవన్ యోజన’ ద్వారా 2జీ ఇథనాల్ ప్రాజెక్టులకు ప్రోత్సాహం అందుతోంది. ‘సతత్’ పథకం ద్వారా కంప్రెస్డ్ బయో గ్యాస్ ఉత్పత్తిని విస్తరిస్తున్నారు.2023లో జి–20 వేదికపై ప్రారంభమైన గ్లోబల్ జీవ ఇంధనాల కూటమి... జీవ ఇంధ నాల ఉత్పత్తి, సాంకేతిక మార్పిడి, వాణిజ్య సహకారానికి ప్రపంచ వేదికగా మారుతోంది. సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయెల్, భవిష్యత్ బయో ఎనర్జీ రంగాల్లో భారత్‌కు ఇది కొత్త అవకాశాలను తెరుస్తోంది. అయితే జీవ ఇంధనాల విస్తరణలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి.భూమి వినియోగం, నీటి అవసరాలు, ముడి సరుకు సరఫరా, సాంకేతిక వ్యయాలు వంటి అంశాలను సమతుల్యం చేయాల్సి ఉంటుంది. మొత్తానికి చమురు బావుల నుంచి మాత్రమే కాదు, మన పొలాల నుంచి కూడా దేశ భవిష్యత్ శక్తి ఉత్పత్తి కావచ్చని జీవ ఇంధనాలు మనకు గుర్తుచేస్తున్నాయి.– ఆర్ధ శ్రీనివాస్ పటేల్, మీడియా–కమ్యూనికేషన్స్ అధికారి (రేపు ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం) -
మోసపోయినా మంచితనం వదలొద్దు!
జీవితంలో మనల్ని బాధించినవాళ్లు రెండు విషయాల్లో ఒకదాన్ని తప్పకుండా తీసుకెళ్తారు. ఒకటి మన ప్రశాంతతను, రెండోది మన మంచితనాన్ని. ప్రశాంతత కొంతకాలానికి తిరిగి వస్తుంది. కానీ మంచితనం పోతే మనల్ని మనమే కోల్పోతాం. ఎందుకంటే, బాధ మనిషిని రెండు రకాలుగా మారుస్తుంది.తాను అనుభవించిన గాయాలను ఇతరులకూ పంచడం మొదలుపెట్టడం అనేది ఒక రకమైతే... తాను అనుభవించిన బాధ ఇంకెవరికీ కలగకూడదనే భావనతో జీవించడం రెండో రకం. ఈ రెండో రకమైన మనుషులే నిజంగా అరుదు. వాళ్లు కూడా మోసపోతారు. వాళ్లూ కూడా విరిగిపోతారు. వాళ్లూ కన్నీళ్లు పెడతారు. కానీ తమలోని మంచి మనిషిని మాత్రం కోల్పోరు. ఎందుకంటే, చెడ్డవాడిగా మారడానికి ఒక్క గాయం చాలు, మంచి మనిషిగా మిగిలి పోవడానికి మాత్రం గొప్ప హృదయం కావాలి.విజయవంతులైన మనుషులు చాలామంది కనిపిస్తారు. తెలివైన వాళ్లు కూడా కనిపిస్తారు. కానీ, బాధను అనుభవించిన తర్వాత కూడా ఎవరికీ బాధ కలిగించకుండా జీవించే మనుషులు మాత్రం అరుదుగా కనిపిస్తారు. వాళ్ల జీవితంలో ఎంత చెడు ఎదురైనా, వాళ్లలోని మంచిని కోల్పోకపోవడమే వాళ్ళ వ్యక్తిత్వంలోని గొప్పదనం. అందుకే, బాధ హృదయాన్ని తాకినా, హృదయంలో ద్వేషానికి స్థానం ఇవ్వకుండా జీవించగలగడమే నిజమైన విజయం.ముందుగా క్షమాపణ చెప్పేవాడు ధైర్యవంతుడు. ముందుగా క్షమించేవాడు బలవంతుడు. ముందుగా మర్చిపోయే వాడు ప్రశాంతంగా జీవించగలడు. తనను బాధించిన తర్వాత కూడా మంచి తనాన్ని ఎంచుకునే మనిషి ఈ ప్రపంచంలో అత్యంత అరుదైన వ్యక్తి.– కొత్త కృష్ణవేణి -
అనుబంధ వ్యవసాయమే జీవధార
ఈ రోజుల్లో రైతు వ్యవసాయం చేయడం ఒక్కటే సరిపోవడం లేదు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరుగుతుండగాపంటల ధరలు మాత్రం ఎప్పుడూ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. కొన్ని సంవత్సరాల్లో వర్షాభావం, మరికొన్ని సంవత్సరాల్లో అధిక వర్షాలు, తెగుళ్లు రైతును నష్టాలకు గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం రావాలంటే వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయ మార్గాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఇదే భావనతో శాస్త్రవేత్తలు, ప్రభుత్వం, వ్యవ సాయ విశ్వవిద్యాలయాలు ‘ద్వితీయ వ్యవసాయం’ (సెకండరీ అగ్రికల్చర్) అనే భావనను ప్రోత్సహిస్తున్నాయి.పంటను పండించడం ప్రాథమిక వ్యవసాయం. ఆ పంటను ప్రాసెసింగ్ చేయడం, విలువను పెంచడం, ప్యాకింగ్ చేయడం, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి కొత్త ఉత్పత్తులను తయారు చేయడం, పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను ద్వితీయ వ్యవసాయం అంటారు. ‘పంటను మాత్రమే అమ్మకుండా, పంటతో పాటు మరిన్ని ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పెంచుకోవ డమే ద్వితీయ వ్యవసాయం’.విలువ జోడించండి–ఎక్కువ ధరను పొందండిచాలా మంది రైతులు పంట కోసిన వెంటనే మార్కెట్‌కు తీసు కెళ్లి అమ్మేస్తారు; అప్పుడు ధర తక్కువగా ఉంటుంది. అదే పంటను ప్రాసెసింగ్ చేసి అమ్మితే మంచి లాభం వస్తుంది. వరిని బియ్యంగా మార్చడం, బియ్యంతో అటుకులు, మరమరాలు తయారు చేయడం, వేరుశనగతో నూనె, పీనట్ బటర్ తయారు చేయడం, మిరపతో మిరప పొడి తయారు చేయడం, పసుపును పాలిష్ చేసి పసుపు పొడిగా విక్రయించడం, మామిడితో జ్యూస్, జామ్, పల్ప్ తయారు చేయడం ఈ కోవలోకే వస్తాయి. దీనివల్ల రైతు సాధారణంగాపొందే ధర కంటే 20–100 శాతం వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. చిరుధాన్యాలకు విలువ జోడించడం ద్వితీయ వ్యవసాయంలో అత్యంత లాభదాయకమైన, స్థిరమైన మార్గం. ముడి ధాన్యాన్ని మాత్రమే విక్రయించే బదులు, పిండి, రవ్వ, రెడీ–టు–కుక్, రెడీ–టు–ఈట్, బేకరీ, ఆరోగ్య ఆహార ఉత్పత్తులుగా మార్చి బ్రాండ్ పేరుతో విక్రయిస్తే గణనీయమైన ఆదాయాన్ని పొందవచ్చు. భారతదేశంలో ప్రతి సంవత్సరం పండ్లు, కూరగాయలు, ధాన్యాలలో గణనీయమైన నష్టం కోత అనంతరం సంభవిస్తుంది. సరైన నిల్వ, గ్రేడింగ్, ప్యాకింగ్ లేకపోవడం దీనికి ప్రధాన కారణం. ఒక గ్రామంలోనే చిన్న రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, పప్పు మిల్లు లేదా మసాలా పొడి తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే రైతులకు దగ్గరలోనే మార్కెట్ లభిస్తుంది. అదనంగా గ్రామ యువతకు కూడా ఉపాధి లభిస్తుంది.అనుబంధ ఆదాయ మార్గాలురైతు ఇంట్లో రెండు ఆవులు లేదా గేదెలు ఉన్నా ప్రతి రోజు నగదు ఆదాయం వస్తుంది. పాలను నేరుగా అమ్మడం కంటే పెరుగు, నెయ్యి, పనీర్, వెన్న, చీజ్ తయారు చేసి అమ్మితే మరింత లాభం వస్తుంది. పాడి పరిశ్రమ రైతు కుటుంబానికి సంవత్సరం పొడవునా ఆదాయాన్ని అందించే అత్యుత్తమ అనుబంధ వృత్తి. అలాగే తేనెటీగల పెంపకానికి ఎక్కువ భూమి అవసరం లేదు. దీని ద్వారా తేనె, బీస్వాక్స్, రాయల్ జెల్లీ లభిస్తాయి. వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు వంటి వ్యవసాయ అవశేషా లను ఉపయోగించి పుట్టగొడుగులను పెంచవచ్చు. చిన్న గదిలోనే సాగు చేయవచ్చు. వ్యవసాయ కుంటలు, చెరువులు, ఫార్మ్పాండ్లలో చేపల పెంపకం చేపట్టవచ్చు. వరిసాగుతో పాటు చేపల పెంపకం చేపడితే ఒకే భూమి నుండి రెండు రకాల ఆదాయంపొందవచ్చు. వ్యవసాయం, పశుపోషణ ఒకదానికొకటి పరస్పర అనుబంధమైనవి. పంట అవశేషాలు పశుగ్రాసంగా ఉపయోగపడ తాయి. వర్మీ కంపోస్ట్, బయోగ్యాస్, సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి పశువుల పేడ ఉపయోగపడుతుంది. చాలా మంది రైతులు వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, చెరకు ఆకులు వంటి అవ శేషాలను కాల్చివేస్తారు. అలా చేయకుండా వాటిని ఉపయోగించి వర్మీకంపోస్ట్, బయోగ్యాస్, బయోచార్‌కు వినియోగించ వచ్చు.స్వపరాగ సంపర్క పంటల్లో వరి, శనగ, పెసర, మినుము, ఉలవలు, వేరుశనగ నాణ్యమైన విత్తన ఉత్పత్తి అనేది ద్వితీయ వ్యవసాయం కింద అత్యంత లాభదాయకమైన కార్యకలాపాలలో ఒకటి. తక్కువ విస్తీర్ణంలో సాగుచేయగలిగే మల్లె, గులాబీ, బంతి వంటి పూల సాగుతో పాటు తులసి, కలబంద, అశ్వగంధ, లెమన్ గ్రాస్ వంటి ఔషధ, సుగంధ మొక్కల సాగు ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. ఇటీవలి కాలంలో నగర ప్రజలు గ్రామీణ జీవనశైలిని అనుభ వించడానికి ఆసక్తి చూపుతున్నారు. రైతులు తమ పొలాల్లో ప్రకృతి సందర్శన, సేంద్రీయ వ్యవసాయ ప్రదర్శనలు, గ్రామీణ ఆహారం, పంటల సందర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కూడా అదనపు ఆదాయం పొందవచ్చు.పోషకాహార లోపం తొలగించేలా...పంటల సాగు నిలిచిపోతే రైతులు, గ్రామీణ కుటుంబాల ఆదాయం దెబ్బ తింటుంది. దీనిని నివారించేందుకు ప్రతి ఇంటా నాటుకోళ్లను పెంచాలి. సొంత వినియోగానికే కాకుండా... గుడ్లు, మాంసానికి సంవత్సరమంతా ఆదాయం ఉంటుంది. గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, స్వర్ణధార, శ్రీనిధి వంటి మేలురకం కోడి పిల్లలను పెంచవచ్చు.గ్రామీణ ప్రాంతాల్లో ఐదు సంవత్సరాల్లోపు పిల్లల మరణాలకు 69 శాతం కారణం పోషకాహార లోపమే.సంప్రదాయ భారతీయ ఆహారంలో ప్రొటీన్ల లోపం ఉంటుంది. వంద గ్రాముల కోడిగుడ్లలో లభించే 6.9 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్ తక్కువ ధరకే లభిస్తుంది. కోడి మాంసంలో కూడా 22 శాతం ప్రొటీన్ ఉండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్లు, కోడి మాంసంలో 75–80 శాతాన్ని పట్టణాల్లో ఉండే 25 శాతం జనాభా తింటుంటే... గ్రామీణ ప్రజలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి పెరటి కోళ్ళ పెంపకం ఎంతో దోహదపడుతుంది.ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ధి పథకం, జాతీయ తేనెటీగలు మరియు తేనె మిషన్, డెయిరీ అభివృద్ధి పథకాలు, నాబార్డ్ గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పథకాలు, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా శిక్షణ, రుణాలు, సబ్సిడీలు పొందవచ్చు. నేటి పరిస్థితుల్లో ‘పంట పండించడం మాత్రమే కాదు... పంటకు విలువ జోడించడం కూడా రైతు విజయానికి కీలకం. ‘వ్యవసాయంలో వైవిధ్యం – రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం’ అనే లక్ష్యంతో ద్వితీయ వ్యవసాయాన్ని ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రోత్సహించాలి.– డా‘‘ కె. తేజస్వర రావు, డా‘‘ బి. సహదేవ రెడ్డి-ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ సీనియర్ శాస్త్రవేత్తలు -
భారతీయతకు ప్రతీక
మగ్గం చప్పుడు వినిపిస్తే అది కేవలం నూలుపోగులు అల్లే శబ్దం కాదు... ఒక కుటుంబం జీవన గీతం. ఒక గ్రామం ఆర్థిక స్పందన. ఒక నాగరికత ఊపిరి. సింధు లోయ నాగరికత తవ్వకాల్లో లభించిన ఆధారాలు భారతీయులు వేల ఏళ్ల కిందటే నూలు నేయడంలో నైపుణ్యం సంపాదించినట్లు చెబుతున్నాయి. కాలం మారినా చేనేత తన రూపాన్ని మాత్రమే మార్చుకుంది; తన ఆత్మను కాదు. ప్రతి అల్లికలో ఒక ప్రాంతపు సంస్కృతి, ప్రతి నమూనాలో ఒక సంప్రదాయం, ప్రతి వస్త్రంలో ఒక సమాజపు సృజనాత్మకత ప్రతిఫలిస్తూనే ఉంది. భారత చేనేత వైభవం దాని వైవిధ్యంలోనే కనిపిస్తుంది. ఉత్తరాన బెనారసీ, పష్మినా; దక్షి ణాన కాంచీపురం; తెలుగునాట గద్వాల్, పోచంపల్లి, మంగళగిరి, ఉప్పాడ; తూర్పున బలుచారి, అస్సాం పట్టులు; పశ్చిమాన పటోలా... ప్రాంతం మారితే అల్లిక మారుతుంది, రంగు మారుతుంది, నమూనా మారుతుంది. కానీ ప్రతి వస్త్రంలోనూ భారతీయ సంస్కృతి సౌందర్యమే ప్రతిబింబిస్తుంది. అందుకేప్రపంచ వస్త్ర సంపదలో భారత చేనేతకు ప్రత్యేక గౌరవం దక్కింది.దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక గ్రామీణ ఉపాధిని కల్పిస్తున్న రంగాల్లో ఇది ఇప్పటికీ ఒకటి. ఈ రంగంలో మహిళల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. నూలు వడకడం నుంచి రంగులు వేయడం, అల్లిక, డిజైన్, విక్రయాల వరకు ప్రతి దశలో మహిళలే కీలక పాత్ర పోషిస్తున్నారు. వారికి చేనేతకేవలం ఉపాధి కాదు; ఆర్థిక స్వావలంబనకు, కుటుంబ నిర్ణయాల్లో భాగస్వా మ్యానికి, ఆత్మవిశ్వాసానికి బలమైన ఆధారం. అందుకే గ్రామీణ మహిళా సాధికారతకు చేనేత ఒక మౌన విప్లవంగా నిలిచింది.ఇదీ చదవండి: ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్‌గా ఘనతనేడు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణహిత ఉత్పత్తులపై ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని జాతీయ సంస్థలు సంప్రదాయం, సాంకేతికత, మార్కెట్ మధ్య వారధిగా నిలిచి నేతకార్మికులకు సాయం చేస్తున్నాయి. అయితే పవర్‌లూమ్‌ల పోటీ, చౌక దిగుమతులు, ముడి సరుకుల ధరల పెరుగుదల, మధ్యవర్తుల ఆధిపత్యం, మార్కెటింగ్ లోపాలు, డిజిటల్ వాణి జ్యంలో పరిమిత ప్రవేశం చేనేత రంగాన్ని ఇబ్బందులకు గురిచేయడం గమ నార్హం. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కని పరిస్థితుల్లో యువత ఈ వృత్తి వైపు ఆకర్షితులు కావడం లేదు. ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించి నేతను కాపాడాలి. దాన్ని కాపాడటం అంటే ఒక వృత్తిని రక్షించడం మాత్రమే కాదు; భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్నీ, లక్షలాది కుటుంబాల జీవనాధారాన్నీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థనూ పరిరక్షించడం కూడా!– వాడవల్లి శ్రీధర్ ‘ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
దొంగలున్నారు జాగ్రత్త!
దొంగలు ధనాన్ని దోచుకు వెళ్తారు. ధనమంటే నగదు మాత్రమే కాదు. ధన కనక వస్తు వాహనాల రూపంలో ఉండే విలువైన వస్తువులన్నింటికీ దొంగల వల్ల ప్రమాదమే. కొందరు ధనం లాగేస్తారు. కొందరు వాహనాలను చాకచక్యంగా దొంగిలిస్తారు. కొందరు కొత్త తరం దొంగలు బ్యాంకు ఖాతాల్లో ధనాన్ని చప్పుడు లేకుండా లాగి వేయగల బుద్ధిశాలులు! అయితే జీవితంలో విలువైనవి వస్తు రూపంలో ఉండనివి కూడా చాలా ఉన్నాయి. శీలమూ, సౌందర్యమూ, మేధస్సూ, ధర్మబుద్ధీ, సిగ్గూ, లజ్జా, వినయమూ, సహనమూ, ఆ మాటకొస్తే ప్రాణమూ– ఇవన్నీ రూకలలో వెలగట్టలేని నిధులే. వీటిని తస్కరించటంలో విశేషమైన కౌశల్యం కల దొంగలున్నారు (అంటాడు, మహాభారతంలో విదురుడు).జరా రూపం హరతి హి, ధైర్యం ఆశా. ముసలితనం అనే దొంగ, సౌందర్యం అనే ధనాన్ని, ఎంత జాగ్రత్తగా కాపాడుకొన్నా, తరలించుకు పోగలడు. అలాగే దురాశ అనే దొంగ, మనిషి ధీరత్వాన్నీ, ‘పెద్దమనిషి’తనాన్నీ నొక్కేయగలదు. ఆశలో చిక్కుకొన్నవాడు లేకితనానికీ, చవకబారుతనానికీ దిగజారి, నగుబాటు పాలవటం లోకంలో మామూలే కదా! మృత్యుః ప్రాణాన్ హరతి, ధర్మచర్యాం అసూయా. మృత్యువు, తనకు అనుకూలమైన సమయం వచ్చేదాకా వేచి ఉండి, అందరూ చూస్తుండగానే, ప్రాణాలను హరించుకుపోతుంది. ధర్మాత్ముడి ధర్మ బద్ధత అనే సంపదను, అసూయ అపహరించేస్తుంది. దుర్యోధనుడిని చూడండి.క్రోధః శ్రియం, శీలం అనార్యసేవా. క్రోధం అనే దొంగ మనసులో చొరబడితే, మనిషి వివేకం కోల్పోయి, పంతాలనీ పోట్లాటలనీ, కక్షలనీ కోర్టులనీ, తన సంపదను ఆ దొంగవాడికి సమర్పించుకొంటాడు. అలాగే దుష్టసాంగత్యం అనే చోరుడు, శీలాన్ని దోపిడీ చేసి, నిప్పులాంటి మనిషిని నికృష్టుడిగా మిగులుస్తాడు. కామం అన్న పిశాచి దొంగ, మనిషిలో సిగ్గునూ, లజ్జనూ కాజేసి, ఖాళీ చేస్తాడు. అందరికంటె ప్రమాదకరమైన పెద్ద దొంగ ‘అభిమానం’– అంటే అహంకారం. అది సర్వాన్నీ దోచుకు వెళ్ళగల దోపిడీ దొంగ. సర్వం ఏవ అభిమానః (హరతి), సందేహం లేదు. – ఎం. మారుతి శాస్త్రి -
కోర్టు ధిక్కారంపై చట్టం ఏమంటోంది?
‘హైడ్రా’ కమిషనర్‌పై అరవైకి పైగా కోర్టు ధిక్కార వ్యాజ్యాలున్నాయనీ, ఆయన్ని ఈ బాధ్యత నుంచి తప్పించాలనీ ఇటీవల తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ‘అధికార వికేంద్రీకరణ’ ముఖ్యం. శాసన, కార్యనిర్వాహక, న్యాయ అనే మూడు వ్యవస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. శాసన సభలు చట్టాలు చేస్తాయి, ‘కార్యనిర్వాహకవర్గం’ ఆ చట్టాలను అమలు చేస్తుంది. న్యాయ వ్యవస్థ చట్టాల అమలు జరగకపోతే జరిగేలా ఆదేశా లిస్తుంది.స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా న్యాయ స్థానాలు వ్యవహరించేందుకు రాజ్యాంగం ద్వారా తగు ఏర్పాటు జరిగింది. హైకోర్టు, సుప్రీం కోర్టు లకు కంటెంప్ట్ అధికారం కూడా రాజ్యాంగంలోని 215, 129 అధికరణాల ద్వారా దఖలుపడింది. దేశంలోని అన్ని న్యాయ స్థానాలు, అధికారులు సుప్రీం కోర్టుకు సహాయ సహకారాలు అందించాలని 144వ అధికరణం నిర్దేశించింది.కోర్టులు చట్టాలననుసరించి న్యాయ నిర్ణయం చేయాలి. కానీ, సంపూర్ణ న్యాయం చేయడానికి, చట్టాలను దాటి కూడా న్యాయ నిర్ణయం చేసే అధికారం ఆర్టికల్ 142 ద్వారా, సుప్రీంకోర్టుకు (విశేషాధికారాలను) కల్పించింది రాజ్యాంగం. న్యాయస్థానాల తీర్పులను గౌరవించి వాటిని అమలుపరచాలన్నది ప్రాథమిక సూత్రం. ఒక వేళ, న్యాయం జరగలేదని అనిపిస్తే, సుప్రీంకోర్టు వరకు అప్పీల్ చేసుకొనే అవకాశం ఉంది.చట్టం ఏం చెబుతోంది?న్యాయస్థానాల తీర్పులను గౌరవించకపోతే, న్యాయవ్యవస్థ ఉనికే ప్రశ్నార్థకమౌతుంది. అందుకే న్యాయస్థానాల తీర్పులను గౌరవించ డానికి, అమలుపరచడానికి కోర్టులకు ‘కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చట్టం– 1971’ ద్వారా ‘కంటెంప్ట్’ అధికారం కలుగచేసింది పార్లమెంటు. ఈ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం, న్యాయస్థానాల ఆదే శాలు ఉల్లంఘించినవారికి, ఆరు నెలల వరకు జైలు శిక్ష, రెండు వేల రూపాయల వరకు జరిమానా లేక ఈ రెండూ కూడా విధించవచ్చు. కక్షిదారులేకాక, మరెవరైనా న్యాయస్థానాల ఆదేశాల అమలులో అడ్డంకులు కలిగిస్తే, వారు కూడా శిక్షార్హులే. ‘కంటెంప్ట్’ అధికారం కేవలం హైకోర్టు, సుప్రీంకోర్టులకు మాత్రమే కలుగచేసింది ఈ చట్టం. కేవలం శిక్ష నుంచి తప్పించుకోవడానికి కాక నిజాయితీగా ‘క్షమార్పణ’ వేడితే శిక్ష వేయకుండా, లేదా తక్కువ కాలానికి శిక్ష విధించవచ్చని ఈ చట్టం స్పష్టం చేసింది. కిందిస్థాయి న్యాయ స్థానాల ఆదేశాలను పాటించనివారిపై ‘కంటెంప్ట్’ను విచారించి శిక్షించే అధికారాన్ని హైకోర్టులకే ఇచ్చింది ఈ చట్టం.కోర్టులు చాలా అరుదుగా ఈ అధికారాన్ని వినియోగించాలని సుప్రీంకోర్టు చెప్పింది. కోర్టు తీర్పులను నిజాయితీగా విమర్శించ డాన్ని ఈ చట్టం ‘కంటెంప్ట్’గా పరిగణించదు. కోర్టు తీర్పులను గుణాత్మకంగా విమర్శించవచ్చు. కానీ, తీర్పునిచ్చిన న్యాయ మూర్తిని వ్యక్తిగతంగా విమర్శిస్తే కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారవుతారు. ఇంతవరకు, కోర్టు ధిక్కరణ నేరానికి ఎక్కువ కాలానికి శిక్ష అనుభవించింది జస్టిస్ కర్ణణ్. సుప్రీంకోర్టు ఆదేశాలను ఖాతర్ చేయకపోవడమే కాకుండా, ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే సమన్లు పంపి, వారికి జైలు శిక్ష విధించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది సుప్రీంకోర్టు. మొత్తం మీద ప్రభుత్వ అధికారులే ఎక్కువగా కోర్టు ధిక్కరణ కేసులను ఎదుర్కోవడం గమనార్హం.– హరీష్ కుమార్ కొలిచాల, న్యాయవాది, అసిస్టెంట్ జనరల్ మానేజర్ (విశ్రాంత), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
జ్ఞానం పంచితేనే పెరిగే సంపద
ఓం సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహైతేజస్వినావధీతమస్తు మావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిఃతైత్తిరీయోపనిషత్తులోని శాంతి మంత్రం ఇది. పూర్వం విద్యాభ్యాసానికి ముందు ప్రతి దినం గురు శిష్యులు ముక్తకంఠంతో ఈ శ్లోకాన్ని పఠించేవారు. ‘మనం కలిసి మెలిసి ఉందాము. కలిసి మెలిసి ఫలితాలను అనుభవిద్దాము. కలిసి పనులను చేస్తూ తేజో పూర్ణుల మవుదాము. మనలో మనకు వైషమ్యాలు ఉండకుండు గాక. శాంతితో విలసిల్లుదాము’ అని చేసే ఉత్తమ ప్రార్థన ఇది.ఈ ప్రార్థన గురుశిష్యు లిరువురి మనస్సులో నిక్షిప్తమై ఉండేది. ఇరువురు కలిసి విజ్ఞాన కృషి సలపాలి. కలిసి విజ్ఞాన ఫలం పొందాలి. గురు శిష్యుల మధ్య విబేధాలు లేకుండా శాంతియుతంగా విజ్ఞానార్జన చేయాలి అనే సమభావన; గురువును శిష్యుడు, శిష్యుని గురువు పరస్పరం గౌరవించుకునే ఉన్నత భావన ప్రాచీన విద్యావిధానంలో కనిపిస్తుంది. అప్పుడు విద్య అంటే గురు శిష్యు లిద్దరు కలిసి చేసే నిత్య సత్య శోధనా యత్నం.విద్య నిరంతర ప్రవాహం. పరంపరా గతంగా విస్తరించేది. గురువు నుండి శిష్యుడు నేర్చుకున్న విద్య, సంస్కారం తర్వాత మళ్ళీ తన శిష్యులకు అందజేస్తాడు. ఆ శిష్యుల నుండి తరవాతి వారికి అలా అందుతూనే ఉంటుంది. ఇది నిరంతర జ్ఞానగంగా ప్రవాహం. ఇచ్చే కొద్దీ పెరిగే సంపద జ్ఞాన సంపద. ఆనాడు గురు శిష్య సంబంధాలు ఎంత ఆదర్శంగా ఉండేవో, జ్ఞానార్జన ఎలా సాగేదో ఈ శ్లోకం చెబుతోంది.– డా. చెంగల్వ రామలక్ష్మి -
కెమిస్ట్రీని మలుపు తిప్పిన ఆక్సీజనుడు
మనం పీల్చే గాలిలో ఏముంది? ఈ ప్రశ్న ఇప్పుడు చిన్నదిగా అనిపించవచ్చు. కానీ కొన్ని వందల ఏళ్ల క్రితం వరకు దీనికి సమాధానం ఎవరికీ తెలియదు. పురాతన గ్రీకులు చెప్పినట్టు గాలి అనేది ఒక మార్పు లేని ప్రాథమిక మూలకం అని ప్రపంచం నమ్మింది. ఈ నమ్మకాన్ని బద్దలుకొట్టి, మనం ప్రాణాలతో ఉండటానికి కారణమయ్యే ‘ఆక్సిజన్’ గుట్టు విప్పినవాడు జోసెఫ్ ప్రీస్ట్లీ. ఆయన కేవలం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు; ఒక ఉపాధ్యాయుడు, మత బోధకుడు, విప్లవ భావాలున్న సాహసి.బ్రిటన్‌లో జన్మించిన ఆయన జీవితం ఎంతో ఆసక్తికరంగా సాగింది. లీడ్స్ నగరంలో నివసిస్తున్నప్పుడు, ఆయన ఇంటి పక్కనే ఒక బీర్ తయారీ కేంద్రం ఉండేది. అక్కడ పులియబెట్టే ప్రక్రియలో వచ్చే ‘ఫిక్స్డ్ ఎయిర్’ (కార్బన్ డయాక్సైడ్)పై ఆసక్తి కలిగింది. నేటి సాఫ్ట్ డ్రింక్ పరిశ్రమకు పునాది వేసింది ఆ ఆసక్తే. నీటిలో కార్బన్ డయాక్సైడ్ను కలిపి కృత్రిమంగా ‘సోడా వాటర్’ను తయారు చేసే విధానాన్ని ఆయన కనిపెట్టారు.1774 ఆగస్టు 1న ఆయన చేసిన ప్రయోగం అతి ముఖ్యమైనది. ఒక భూతద్దం సహాయంతో సూర్యరశ్మిని మెర్క్యూరిక్ ఆక్సైడ్ పొడి మీద కేంద్రీకరించినప్పుడు దాని నుంచి ఒక రకమైన వాయువు వెలువడటం గమనించారు. అది సాధారణ గాలి కంటే ఐదారు రెట్లు స్వచ్ఛంగా ఉండటమే కాకుండా, అందులో మంటలు మరింత ప్రకాశవంతంగా కనిపించాయి. ఆ వాయువును పీల్చినప్పుడు ఊపిరితిత్తులు ఎంతో తేలికగా అనిపించాయి. ఆ గాలిలో ఒక ఎలుక సాధారణ గాలిలో కంటే నాలుగు రెట్లు ఎక్కువ సేపు ప్రాణంతో ఉండటాన్ని గమనించారు. దానికి ఆయన ‘డీఫ్లోజిస్టికేటెడ్ ఎయిర్’ అని పేరు పెట్టాడు. తర్వాత ఫ్రెంచ్ శాస్త్రవేత్త లావోయిజర్ దీనికి ‘ఆక్సిజన్’ అని నామకరణం చేశారు.ప్రకృతిలో సమతుల్యత ఎలా కాపాడబడుతుందో కూడా ప్రీస్ట్లీ మొదటగా గుర్తించారు. ఒక మూసి ఉన్న పాత్రలో మంట వెలిగించినా లేదా ఎలుకను ఉంచినా కొద్ది సేపటికి ఆ గాలి కలుషితమై మంట ఆరిపోవడం, ఎలుక చనిపోవడం జరిగేది. కానీ అదే పాత్రలో ఒక పచ్చని మొక్కను ఉంచి ఎండలో పెడితే, అది గాలిని తిరిగి ‘శుద్ధి’ చేస్తుందని ఆయన కనుగొన్నారు. ఆయన కనిపెట్టిన ఆక్సిజన్ వైద్య చికిత్సల నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇటువంటి పెద్ద ఆవిష్కరణలే కాదు... నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే చిన్న చిన్న విషయాలను కూడా ఆయన విస్మరించలేదు. మనం పెన్సిల్‌తో రాసిన తప్పులను తుడిపే ‘రబ్బర్ ఎరేజర్’ను కూడా ఆయనే కనిపెట్టారని తెలిస్తే మనకు మరింత ఆశ్చర్యం కలుగుతుంది! అందుకే అతడు గొప్పవాడయ్యాడు!అసమ్మతి స్వరంప్రీస్ట్లీ జీవితం కేవలం ప్రయోగశాలకే పరిమితం కాలేదు. ఆయన మతపరమైన ఆలోచనలు భిన్నంగా ఉండేవి. ఆ కాలంలో ‘చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్’ సిద్ధాంతాలను ఆయన వ్యతిరేకించారు. ఆయనొక ‘డిసెంటర్’ (అసమ్మతివాది) కావడంతో ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి పెద్ద విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి అనుమతి దక్కలేదు. అయినప్పటికీ పట్టుదలతో లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్ వంటి భాషలు సొంతంగా నేర్చుకున్నారు.అమెరికా, ఫ్రెంచ్ విప్లవాలకు ఆయన మద్దతు పలకడం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి నచ్చలేదు. ఆయనపై ‘ద్రోహి’ ముద్ర వేశారు. 1791లో బర్మింగ్‌హామ్‌లో ఉన్నాదులు కొందరు ఆయన ఇంటిని, ప్రయోగశాలను తగలబెట్టారు. ఆయన రాసుకున్న ఎన్నో విలువైన పరిశోధన పత్రాలు బూడిదయ్యాయి. ప్రాణభయంతో ఆయన లండన్ పారిపోయి, చివరకు 1794లో అమెరికాకు వలస వెళ్లారు. పెన్సిల్వేనియాలోని నార్తంబర్ల్యాండ్ అనే మారుమూల గ్రామంలో స్థిరపడి మళ్ళీ పరిశోధనలు ప్రారంభించారు. అక్కడ ‘కార్బన్ మోనాక్సైడ్’ వాయువును కనిపెట్టారు. ‘యూనిటేరియన్ చర్చి’ని స్థాపించారు. అమెరికా మాజీ అధ్యక్షులు థామస్ జెఫర్సన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆయనకు ఆప్తమిత్రులు. ఆక్సిజన్‌ను కనిపెట్టిన శత వార్షికోత్సవం సందర్భంగా, ఆయన గౌరవార్థం 1876లో ‘అమెరికన్ కెమికల్ సొసైటీ’ ఏర్పాటైంది. ప్రీస్ట్లీ మరణించినప్పుడు (1804 ఫిబ్రవరి 6) ‘మానవాళికి అత్యంత విలువైన కొద్దిమంది వ్యక్తుల్లో ఒకరు’ అని థామస్ జెఫర్సన్ నివాళులర్పించారు.- ఎడిటోరియల్ టీమ్ -
శాస్త్రీయ శోధనే విశ్వాసానికి పరీక్ష
ఇటీవల పార్లమెంట్లో గోమూత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు వినవచ్చాయి. ప్రవేశ పరీక్ష సంస్కరణలపై సత్వర కార్యాచరణ బృందంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మద్రాసు) డైరెక్టర్ వీళినాథన్ కామకోటిని నియమించిన సందర్భంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ‘ఫంగల్, బ్యాక్టీరియల్, ఇన్ఫ్లమేటరీలకు నిరోధకంగా’ పనిచేయగల శక్తి గోమూత్రానికి ఉందనీ, అవి ‘వైజ్ఞానికంగా కూడా ప్రదర్శితమయ్యా’యనీ గత ఏడాది జనవరిలో ఒక బహిరంగ సమావేశంలో కామకోటి పేర్కొన్నారు. గోమూత్రంపై కామకోటి అభిప్రాయాలను తోసిపుచ్చడం రాజ్యాంగంలో పేర్కొన్న శాస్త్రీయ దృక్పథాన్ని తక్కువ చేయడం అవుతుందంటూ కొందరు విద్యావేత్తలు కామకోటికి మద్దతు పలికారు. తాను నిజమని నమ్మేదానిని ‘తాత్కాలికంగా ప్రతిపాదించే, సంప్రదాయ విజ్ఞానాన్ని చర్చకు పెట్టే’ హక్కు కామకోటికి ఉందని వారు అన్నారు. కోల్‌కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కూడా కామకోటికి వత్తాసు పలికారు. అధికారిక మద్దతుగోమూత్రం, పేడపై పరిశోధన కొత్తదేమీ కాదు. గోమూత్ర గుణాల గురించి 1970లు, 1980లలో కూడా కొన్ని క్లెయిములు వినవచ్చాయి. పరిశోధనా పత్రాలు వెలువడ్డాయి. కానీ, వాటిని అల్పమైనవిగానే పరిగణిస్తూ వచ్చారు. అటువంటి పరిశోధనకు అధికారిక మద్దతు లభించడం కొత్త ధోరణి. వాటికి ఐఐటీలు, ఐఐఎంల డైరెక్టర్ల వంటి ఉన్నత స్థాయి విద్యావేత్తల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. అయితే, వారు బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ లేదా డ్రగ్ డిస్కవరీ వంటి రంగాల్లో నిపుణులై ఉండనక్కరలేదనే సంగతిని ఈ సందర్భంగా చాలామంది విస్మరిస్తున్నారు. ఒక అంశాన్ని పరిశోధనకు పెట్టేటప్పుడే దాన్ని శాస్త్రీయంగా నిరూపించాలనుకోవడం వల్ల ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాల ప్రభావం దానిపై ఉంటుంది. దేన్నో ధ్రువీకరిం చాలనే పక్షపాత వైఖరి పరిశోధనకు మేలు చేయదు. మానవ దేహం, దానికొచ్చే వ్యాధులు, వాటిని నయం చేసే మార్గాల గురించి ప్రాచీన గ్రంథాలు, సంప్రదాయ విజ్ఞానం చెప్పే అంశాలు ఎంత స్థూలంగా ఉంటాయంటే, వాటిని ఏ ఆధునిక ఆవిష్కరణ లేదా భావనకైనా వర్తింపజేయెచ్చు. దాని ఆలంబనగా ప్లాస్టిక్ సర్జరీ, మూలకణ చికిత్స, పునరుత్పత్తి సాంకేతికత, ఉపగ్రహ కమ్యూనికేషన్ వంటివన్నీ ప్రాచీన భారతదేశంలో వాడుకలో ఉన్నవే అంటూంటారు. గోమూత్రానికి కూడా అదే విధంగా విలువను ఆపాదించే వైఖరిని కనబరుస్తున్నారు. కొన్ని ఖనిజాల జాడలు, అమైనో ఆమ్లాలు, చిన్న గొలుసులతో కూడిన చిన్న ప్రొటీన్ భాగాలు గోమూత్రంలో లేదా దాని పేడలో కనిపించినంత మాత్రాన దాని వైద్య గుణగణాలకవి తగినంత రుజువు కాబోవు. ఎందుకంటే, అలాంటివి మానవ మూత్రంలోనూ, ఎద్దులు, జడలబర్రె, లేళ్ళు వంటి ఇతర క్షీరదాలలో కూడా కనిపిస్తాయి. మహా అయితే, అటువంటి పరిశోధన సూడోసైన్స్ పరిధిలోకి వస్తుంది. యూరిన్ కెమిస్ట్రీని వర్ణించేందుకు కొంత వైజ్ఞానిక పరిభాషను ఉపయోగిస్తారు కనుక అది సైన్స్‌గా కనిపిస్తుంది. నవ భారతానికి ప్రాచీన జబ్బుకీమోథెరపీ సంబంధిత తక్కువ ప్లేట్లెట్ కౌంట్ల సమస్యకు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా బొప్పాయి ఆకుల నుంచి తీసిన దానిని వినియోగించుకోవచ్చని ఒక నూతన అధ్యయనంలో తేలినట్లు ప్రభుత్వం ఇటీవల పేర్కొంది. ఆ అధ్యయన ఫలితాలను ఒక ఆంకాలజీ జర్నల్‌లో ప్రచురించారు. కానీ, స్వతంత్ర నిపుణుల అభ్యంతరాలతో ఆ పత్రిక ఆ ఫలితాలను పునః సమీక్షించుకోవాల్సి వచ్చింది. బొప్పాయి ఆకుల నుంచి తీసిన పదార్థ ప్రభావం గొప్పగా ఉందని చూపేందుకు, ఆ పదార్థాన్ని ఉపయోగించినా ఫలితం చూపని రోగుల వివరాలను ఆ అధ్యయన ఫలితాలకు జోడించలేదని స్వతంత్ర నిపుణులు అభ్యంతరం తెలిపారు. పసుపు వేరులలో లభించే రసాయన పదార్థం కర్కుమిన్ విషయంలోనూ ఇదే జరిగింది. క్యాన్సర్‌తో సహా పలు వ్యాధులకు ఆ మూలిక గొప్ప ఔషధంగా పనిచేస్తుందని ప్రచారం చేశారు. కర్కుమిన్పై భరత్ అగర్వాల్ అనే అమెరికన్ పరిశోధకుడు రాసిన 30కి పైగా పరిశోధన పత్రాలను అంతర్జాతీయ పత్రికలు వెనక్కి తీసుకున్నాయి. గుండె వ్యాధి ముదిరే ప్రక్రియపై భారత–మధ్యధరా సముద్ర తీర ప్రాంత ఆహారపు అలవాట్లు చూపగల ప్రభావంపై మొరాదాబాద్‌కు చెందిన ఆర్.బి. సింగ్ 1990లలో పరిశోధించారు. ఆయన మన ఆహార అలవాట్లను ఇజ్రాయెల్, స్లొవేకియా ప్రాంతవాసుల ఆహార అలవాట్లతో పోల్చి చూశారు. వాటిని లాన్సెట్, బ్రిటిష్ మెడికల్ జర్నల్స్‌లో ప్రచురించారు. కొద్ది ఏళ్ళ తర్వాత, ఆ అధ్యయనానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్ డేటా సాధికారతను కొందరు ఇండిపెండెంట్ సైంటిస్టులు ప్రశ్నించారు. అధ్యయనానికి చెందిన ఒరిజినల్ డేటాను కోరినప్పుడు, ఆ పత్రాలను చెద పురుగులు తినేశాయని సింగ్ జవాబిచ్చారు. ధ్రువీకరించాలనుకునే వైఖరి వల్ల సేఫ్టీ అంశాలు కూడా పక్కనపడతాయి. ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్న నేచురల్ రెమిడీల వల్ల దుష్ఫలితాలు ఏవైనా సంభవిస్తాయేమో చూడనవసరం లేదనడం కూడా తప్పుడు వాదనే అవుతుంది. ఒక మొక్క నుంచి లభ్యం కాగల జీవరసాయన పదార్థాలు కూడా ఆ మొక్క పెరిగిన భూమిపై ఆధారపడి ఉంటాయి. తిరిగి గోమూత్రం విషయానికొస్తే, దానిలో హానికరమైన బ్యాక్టీరియా ఉన్నందువల్ల , దాని సేవనం మానవులకు హానికరం కావచ్చని ఇండియన్ వెటర్నరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయంలో తేలింది. చైనా ఉదాహరణచైనాలోనూ సంప్రదాయ వైద్యానికి ఆదరణ ఉంది. కానీ, అక్కడ మతపరమైన లేదా భావజాల ఆధారిత వైఖరిని అనుసరించడానికి బదులుగా శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించి వినిమయాన్ని చేపట్టారు. ఉదాహరణకు, మలేరియాపై పనిచేసే ఆర్టిమైసినిన్ కనుగొన్నందుకు తు యుయు అనే చైనా సైంటిస్టుకు 2015లో నోబెల్ బహుమతి లభించింది. ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్నవాటిని తిరుగులేని సత్యాలుగా తీసుకునే బదులు, వాటిని ఒక ఐడియాగా తీసుకుని, ఈ ప్రాజెక్టు కింద 400లకు పైగా మొక్కలను పరీక్షించి చూశారు. ఒక మాలిక్యూల్‌ను వేరు చేసి, ఔషధంగా అభివృద్ధి చేయడానికి ముందు యాభై ఏళ్ళకు పైగా నిరంతర ప్రయోగాలు నిర్వహించారు. ఆ డిస్కవరీని కూడా ప్రాచీన గ్రంథాల గొప్పదనాన్ని నిరూపించినదిగాకాక, కాలపరీక్షకు నెగ్గిన సైంటిఫిక్ పద్ధతులకు తార్కాణంగానే పేర్కొన్నారు. భారతీయ విజ్ఞాన పద్ధతులను ప్రోత్సహించే పేరుతో సందేహాస్పద సంస్థల, పరిశోధకుల అధ్యయనాలకు సౌజన్యం వహించడాన్ని సైన్స్ ఏజన్సీలు మానుకోవాలి. ప్రభుత్వం చొరవ చూపకపోతే, అకాడమీలే కలసికట్టుగా ముందుకు వచ్చి పరిశోధనల్లో నిజాయతీకి పాటుపడే ఒక స్వతంత్ర సంస్థను, ఒక రకమైన రిసెర్చ్ అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేసుకోవాలి. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
జ్ఞానాన్ని బోధించే గురువు ఎక్కడుంటాడో ఆచూకీ చెప్పండి..
జునాయెద్ అనే వ్యక్తి ఒక సూఫీ సాధువు దగ్గరకు వచ్చాడు. ‘నాకు జ్ఞానాన్ని బోధించే గురువు ఎక్కడ ఉంటాడో ఆచూకీ చెప్పండి’ అని అడిగాడు. ‘ముందు మక్కాకు వెళ్ళు. తీర్థయాత్ర చెయ్యి. ఎవరి కళ్లయితే కాంతులు విరజిమ్ముతుంటాయో, ఎవరి దేహం నుంచి కస్తూరి పరిమళం వస్తూ ఉంటుందో అతడే నీ గురువు. వెళ్ళి వెతుకు’ అన్నాడు.జునాయెద్ తన ప్రయాణం మొదలుపెట్టాడు. 20 ఏళ్లు గడిచాయి. చివరికి ఒక చెట్టు కింద ఒకరిని చూశాడు. సూఫీ సాధువు చెప్పిన లక్షణాలు ఆయనలో కనిపిస్తున్నాయి. జునాయెద్ ఆయన పాదాలపై పడి, ‘గురుదేవా, 20 ఏళ్ళుగా మీ కోసమే వెతుకుతున్నాను’ అని ఆనందం పట్టలేక ఏడ్చేశాడు. ఆ సాధువు కూడా ‘నేనూ 20 ఏళ్ళుగా నీ కోసమే చూస్తున్నాను. నన్ను సరిగ్గా చూడు’ అన్నాడు.జునాయెద్ ఎగాదిగా చూశాడు. తీరా 20 ఏళ్ళ క్రితం తనకు గురువు ఆచూకీ చెప్పి పంపిన ఆ మనిషే ఈయన! ‘ఇదేంటి? నాతో ఆటలాడారా? నా 20 ఏళ్ల కాలం వృథా అయిపోయింది. మీరే నా గురువు అని ఆ రోజే ఎందుకు చెప్పలేదు?’ అని అడిగాడు. ‘ఆ రోజే నేను చెప్పి ఉండవచ్చు. కానీ గురువును గుర్తుపట్టే కళ్ళు ఆ రోజు నీకు లేవు. ఈ 20 ఏళ్ల వెతుకులాట నీకు ఆ కళ్ళను ఇచ్చింది. ఈ ఇరవై ఏళ్ళు నిన్ను మెరుగుపరిచాయి. ఈ కస్తూరి వాసన ఆ రోజు కూడా ఉంది. కానీ దాన్ని గుర్తించే శక్తి ఆ రోజు నీకు లేదు’ అన్నాడు.నమ్మకం లేకపోతే గురువును సమీపించలేం. ఓపికతో వేచి ఉంటే, అపారమైన సహనం ఉంటే, ఏదో ఒక రోజు మార్గ నిర్దేశకుడు కనిపిస్తాడు. సత్యాన్ని వారసత్వంగా పొందలేం. దాని కోసం ఎవరికి వారు శ్రమించాలి. ఒక శిష్యుడిగా మారాలి. కఠినమైన క్రమశిక్షణ పాటించాలి. అది వ్యక్తిగత ప్రయాణం. వెతుకులాటే పరిపక్వత తెస్తుంది. అన్వేషణ ద్వారానే సత్యాన్ని తెలుసుకోగలరు. – యామిజాల జగదీశ్ -
పర్యావరణ యోధులకు రక్షణ ఏది?
హైదరాబాద్‌లోని తెరిచి ఉన్న ఒక డ్రైన్లో పడి కొట్టుకుపోయిన 70 ఏళ్ల చెత్త ఏరుకునే కార్మికుడు బాలయ్య ఉదంతం– సమాజంలో అట్టడుగున ఉన్న ఈ కార్మికుల నిస్సహాయతకు, దుఃస్థితికి ప్రత్యక్ష నిదర్శనం. స్మార్ట్ సిటీల పర్యావరణ పరిరక్షణలో చెత్త ఏరుకునేవారి సేవలు అత్యంత కీలకమైనవి. ప్రతిరోజూ టన్నుల కొద్దీ ప్లాస్టిక్, కాగితం, లోహాల వంటి వ్యర్థాలను వేరు చేయడం ద్వారా వీరు డంపింగ్ యార్డులపై పడే భారాన్ని భారీగా తగ్గిస్తున్నారు. వాస్తవానికి, అధికారిక వ్యవస్థల కంటే వీరు తరచుగా అధిక స్థాయిలో వ్యర్థాలను వేరు చేయడం, పునర్వినియోగం చేయడంలో సఫలమవుతున్నారు.పర్యావరణానికి విశేషమైన మేలు చేస్తున్నా గుర్తింపుకు నోచుకోని ఈ ‘పర్యావరణ యోధుల’ ఆరోగ్యం మాత్రం నిత్యం గాల్లో దీపంగానే మారుతోంది. కనీస రక్షణ లేకుండానే విషపూరిత వ్యర్థాలు, పగిలిన గాజు పెంకులు, ఆసుపత్రి వ్యర్థాలు, కుళ్ళిన చెత్త మధ్య వీరు పనిచేస్తుంటారు. చేతులకు గ్లోవ్స్, ముఖానికి మాస్కులు, కాళ్లకు బూట్లు లాంటి రక్షణ పరికరాలు లేకపోవడంతో చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, విష జ్వరాలు, ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు.‘ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు– 2016’ ప్రకారం, చెత్త ఏరుకునేవారు పట్టణ స్థానిక సంస్థల నుండి గుర్తింపు కార్డులు పొందవలసి ఉన్నది. కానీ, బడ్జెట్ పరిమితులు లేదా అధికారుల అయిష్టత కారణంగా కొన్ని స్థానిక సంస్థలు వీటిని జారీ చేయడంలో విఫలమయ్యాయి.సేవకు ‘నమస్తే’!ఈ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘యాంత్రిక పారిశుధ్య పర్యావరణ వ్యవస్థ జాతీయ కార్యాచరణ (నమస్తే) పథకం’ ఒక ఆశాకిరణం. 2024–25 నుండి, చెత్త ఏరుకునేవారిని ఈ పథకంలో అధికారికంగా చేర్చడం ముఖ్యమైన మార్పు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 1.52 లక్షల మంది చెత్త ఏరుకునే వారిని గుర్తించగా, ఇందులో 48.7 శాతం మహిళలు ఉండటం గమనార్హం. వ్యర్థాల సేకరణ, పునరుద్ధరణలో వారి కృషిని గుర్తించి, అధికారిక ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలలో వారిని విలీనం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీని ద్వారా వారికి ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య బీమా, వారి పిల్లలకు ప్రీ–మెట్రిక్ స్కాలర్షిప్లు, ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు, అలాగే అవసరమైన శిక్షణ, పరికరాలు లభిస్తాయి.దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు ఇప్పటికే ‘రాష్ట్ర సఫాయి కర్మచారి కమిషన్’లను ఏర్పాటు చేసి పారిశుద్ధ్య, చెత్త ఏరుకునే కార్మికుల హక్కులను పరిరక్షిస్తున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాలలో అటువంటి సంస్థాగత వ్యవస్థ లేకపోవడం గమనార్హం. అత్యంత ప్రమాదకర వాతావరణంలో పనిచేస్తున్న ఈ అట్టడుగు వర్గాల భద్రతను పునరుద్ధరించడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి. చట్టబద్ధమైన కమిషన్లను ఏర్పాటు చేసి పూర్తిస్థాయి హక్కులు కల్పించాలి. దీనితో పాటుగా పట్టణ స్థానిక సంస్థలు గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి, ప్రతి ఒక్కరికీ గ్లోవ్స్, మాస్కులు, రెయిన్ కోట్లు, సేఫ్టీ బూట్లు కలిగిన కిట్లను అందించాలి. డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి వీరి శ్రమను వ్యవస్థీకృతం చేయాలి. పర్యావరణాన్ని, నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో వారు చేస్తున్న సేవలను గుర్తించి, గౌరవప్రదమైన స్థానం అందించడం సామాజిక బాధ్యత.– శ్రీనివాస్ మాధవ్, సమాచార హక్కు పరిశోధకుడు -
పశ్చిమాసియాలో ప్రమాదకర పాచికలాట
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ 2025 నవంబర్ 18న అమెరికా సందర్శించారు. పౌర అణు శక్తి వినియోగ సహకారంపై సంప్రదింపులు పూర్తయ్యాయని అదే రోజు సంయుక్త ప్రకటన వెలువడింది. ఆ మేరకు ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న కోట్లాది డాలర్ల పౌర అణు శక్తి భాగస్వా మ్యానికి దీనితో చట్టపరమైన పునాది ఏర్పడిందని వైట్ హౌస్ పేర్కొంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ప్రమాణాలను పకడ్బందీగా పాటిస్తూ సహకారాన్ని ఇచ్చిపుచ్చు కోనున్నట్లు ప్రకటించారు. అయినా, అణ్వస్త్ర నిర్మాణ వ్యాప్తిపై ఇది అటు ఇజ్రాయెల్, ఇటు యూఏఈలలో ఆందోళనను రేకెత్తించడంతో ఈ అంశం మరింత జటిలంగా మారింది. అబ్రహాం ఒప్పందాలతో ముడిఇపుడు అమెరికా–సౌదీ ఒప్పందాన్ని సౌదీ అరేబియా అబ్రహాం ఒప్పందాలకు కట్టుబడి ఉండే అంశంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముడిపెట్టారు. పౌర అణు ఒప్పందానికి ఆమోదం తెలుపడం చిటికెలో పని. కాకపోతే ‘చాలా మన్నన పొందిన, సఫలమైన అబ్రహాం ఒప్పందాలకు సౌదీ అరేబియా పూర్తిగా కట్టుబడి ఉండాలి’ అని ట్రంప్ జూలై 23న బాహాటంగానే వెల్లడించారు. యురేనియంను ‘శుద్ధి చేసే సామగ్రి’ ఉండబోదని కూడా ట్రంప్ తెలిపారు. కానీ, యురేనియంను శుద్ధి చేయడాన్ని నివారించే నియమ నిబంధనలు ఒప్పందం ముసాయిదాలో కొరవడ్డాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా రెండింటిని ముడిపెట్టడంతో మొత్తం పరిస్థితి మారి పోయినట్లు అయింది. ఇది ఇక ఎంతమాత్రం అణు శక్తిని పౌర అవస రాలకు వినియోగించుకునేందుకు సంబంధించినదిగానో లేదా రష్యా, చైనాలను దూరం పెట్టేందుకు కుదుర్చుకున్నదిగానో లేదు. దౌత్యం ఒక లావాదేవీగా తయారైంది. అసలే అణు శక్తి చిక్కు ముడులతో కూడుకున్న దక్షిణాసియాలో ఇది ఇంకా గుబులు రేపు తోంది. ట్రంప్ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం వెంటనే స్వాగతించింది. సౌదీ గుర్తింపు ‘మధ్య ప్రాచ్యంలో శాంతి స్థాపనకు సంబంధించి ఒక చారిత్రక ముంద డుగు’ అని అది జూలై 23న వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్ అంగీకరించినట్టేనా?తెరవెనుక పరిస్థితులను బట్టి ఈ సమన్వయం ఒక ఎత్తుగడగా కనిపిస్తోంది. తుర్కియేకు అధునాతన ఎఫ్–35 విమానాల విక్ర యాన్ని వ్యతిరేకించాలని నెతన్యాహు కోరుకుంటున్నారనీ, సౌదీ అణు ఒప్పందం ఈ ప్రాంతంలో ఆయుధ పోటీని రేకెత్తిస్తుందని ఆందోళన చెందుతున్నారనీ ఇజ్రాయెలీ అధికారులు మీడియాకు తెలిపారు. ఇటీవల ట్రంప్‌ను కలుసుకునేందుకు ముందు నెతన్యాహు తన మనసులో మాటను వెల్లడించారు. సౌదీ అరేబి యాతో అమెరికా అణు సహకారం సైనిక శక్తి విషయంలో ఇజ్రా యెల్కున్న గుణాత్మక పైచేయిపై రాజీపడేటట్లు చేయదని హామీ లభించాలని ఆయన అన్నారు. ఏదైతేనేం జెరూసలెం కోరుకున్నది సాధించింది. సౌదీ అణు ఒప్పందం ఇజ్రాయెల్‌తో ముడిపడినఅంశమని ఇపుడు తేటతెల్లమైంది. రెండవసారి అధికారానికి వచ్చినప్పటి నుంచి కూడా అబ్రహాం ఒప్పందాలను మరింత విస్తరించాలని ట్రంప్ కోరుకున్నారు. సాధా రణ పరిస్థితులు నెలకొనాలంటే ‘పాలస్తీనా ఒక ప్రత్యేక రాజ్యంగా అవతరించేందుకు స్పష్టమైన బాటలు పరవా’లని సౌదీలు స్పష్టం చేశారు. గాజాలో పరిస్థితులు క్షీణించాక సౌదీ మరింత పట్టుసడలని వైఖరిని కనబరచింది. సాధారణ పరిస్థితుల స్థాపనపై చర్చలను అది 2023 అక్టోబర్ 14న విరమించుకుంది. ‘పాలస్తీనా రాజ్య స్థాప నను వ్యతిరేకిస్తున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రస్తుత ప్రభు త్వాన్ని శాంతి స్థాపనకు చిత్తశుద్ధితో పనిచేసే భాగస్వామిగా’ చూడ లేమనే మొన్నీమధ్య జూలై 25 వరకు రియాద్ భావిస్తూ వచ్చింది. మారిన అమెరికా తీరుఅణ్వస్త్ర వ్యాప్తి నిరోధక విధానం విషయంలో అమెరికాలో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గల్ఫ్‌లో యురేనియం శుద్ధికి అనుమతించకూడదనే వైఖరినే అమెరికా 15 ఏళ్ళుగా అనుస రిస్తూ వచ్చింది. యూఏఈ కూడా 2009లోనే దాన్ని విరమించుకుంది. తాజా అమెరికా ఒప్పందం కింద సౌదీ ఆ నిబంధనను తిర స్కరించింది. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ అదే పనిగా పర్యవేక్షించడాలు, పరిశీలించడాలు చేయకూడదని కూడా సౌదీ పేర్కొంది. తెహ్రాన్ రహస్యంగా యురేనియంను శుద్ధి చేసే సదుపా యా లను నిర్వహిస్తోందనే కారణంతోనే ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడికి దిగాయి. ఈ ఒప్పందం ఏ విధంగా ఆవిష్కృత మవుతుందోనని అబుదాబి, కైరో, అమ్మాన్, అంకారా ఎదురు చూస్తున్నాయి. ఇంతవరకు యురేనియంను శుద్ధి చేసే శక్తి పశ్చిమా సియాలో ఒక్క ఇరాన్‌కే పరిమితం అనుకున్నారు. ఇపుడు యురేని యంను శుద్ధి చేయగల సామర్థ్యాన్ని ఆ ప్రాంతంలో దాదాపు ఐదు దేశాలు సంతరించుకోగలవని కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. ‘‘ఇజ్రాయెల్ వద్ద బాంబు ఉందనుకుందాం. ఇపుడు అమెరికా ఆమోదంతో సౌదీ అరేబియా కూడా యురేనియంను శుద్ధి చేయగల శక్తిని సంతరించుకుంటుంది. మరి మేం మాత్రం ఆ పని ఎందుకు చేయకూడదు?’’ అని ఇరాన్ వాదిస్తోంది. ఇరాన్‌తో అమెరికా కుదు ర్చుకోవాలని భావించిన అణు ఒప్పందం అటకెక్కింది. ఇరాన్ లోపలికి వెళ్ళి తనిఖీలు జరపడానికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు ఉన్న అవకాశం పరిమితం. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా ఆశీర్వా దంతో సౌదీ అరేబియా నిర్వహించే అణుశక్తి కార్యక్రమం పూర్తి ఆత్మవంచన, ద్వంద్వ ప్రమాణాల కిందకే వస్తుంది. ఇజ్రాయెల్ వైపు నుంచి చూస్తే ఈ ఒప్పందం దాని చాపకిందకు నీరు తేవడమే. అణ్వాయుధాలు కలిగిన దేశంగా ఇజ్రాయెల్ 50 ఏళ్ళుగా గుత్తాధిపత్యాన్నే అనుభవిస్తూ వచ్చింది. అది ఆ పనిని చాటుమాటునే నిర్వహిస్తూ వచ్చి ఉండవచ్చు. సౌదీ పౌర అణుశక్తి కార్యక్రమాన్ని అబ్రహాం ఒప్పందాలతో ముడిపెట్టడాన్ని పైకి స్వాగ తించి ఉండవచ్చు. కానీ, లోలోపల అణ్వస్త్ర నిర్మాణ సామర్థ్యం కలి గిన మరో అరబ్ దేశం అవతరిస్తోందని మథన పడుతోంది. సుస్థిరతకు అవకాశమెక్కడ? తాజా ఒప్పందంతో ఆ ప్రాంతంలో ఏ దేశానికాదేశం రక్షణకంచెలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తాయి. ఆయుధాల సమీకర ణకు పోటీపడతాయి. తప్పుడు అంచనాలు ప్రమాదకర స్థితినిసృష్టిస్తాయి. ఇంక ప్రాంతీయ సుస్థిరతకు అవకాశమెక్కడ? రష్యా అణు శక్తి సంస్థ రోసటామ్, చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్లను కట్టడి చేయడానికి సౌదీ అణు కార్యక్రమం దోహద పడుతుందనీ, అమెరికా విస్తృత వ్యూహాత్మక ప్రయోజనాలను నెరవేరుస్తుందనీ అమెరికా మొదట్లో భావించింది. ఇపుడు అబ్రహాం ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని చెప్పడం ద్వారా సౌదీ–ఇజ్రా యెల్ మధ్య కూడా రాజీ కుదిర్చినట్లు అవడం తన విదేశాంగ విధానానికి కలికితురాయిగా మారుతుందని ట్రంప్ సంబరపడు తున్నారు. అందుకు రియాద్‌కు పౌర అణు శక్తి పేరుతో తీపిని తిని పిస్తున్నారు. ఈ క్రమంలో, నియమ నిబంధనలను తుంగలో తొక్కారు. పౌర అణు శక్తి వినియోగానికి సౌదీకున్న హక్కును కాదనలేం. రష్యా–చైనాలతో పోటీ పడేందుకు అమెరికాకు ఉన్న హక్కును కూడా తోసిపుచ్చలేం. కానీ, ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న ప్రాంతంలో యురేనియం శుద్ధికి ద్వారాలు తెరవడం ఎంతవరకు సబబు? ఇజ్రాయెల్‌తో సయోధ్య కుదుర్చుకోవాలనీ, సాధారణ పరిస్థితుల స్థాపనకు తోడ్ప డాలనీ అమెరికా పెడుతున్న షరతును సౌదీ ఇప్పటికే తిరస్కరించింది. ఒకవేళ ఒప్పందం మూలపడ్డా, అది తెచ్చిన ప్రమాణం నిలిచే ఉంటుంది: అణు శక్తిని సంపాదించుకునేటట్లు చేయడంలో అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాజకీయ ప్రయోజనాలు చూసు కుంటోంది. ఒకసారి భూతాన్ని బయటకు తెస్తే, దాన్ని తిరిగి సీసాలో బంధించడం కష్టం. -వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్, న్యూఢిల్లీ-సి. ఉదయ్ భాస్కర్ -
రైతుకు ఆదాయం – ప్రకృతికి చికిత్స
వాతావరణ మార్పులు ప్రపంచ వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా కరవుప్రాంతాల్లో వ్యవసాయం అనిశ్చితితో కూడిన జీవనోపాధిగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో అగ్రోఫారెస్ట్రీ– వ్యవసాయ పంటలతో పాటు వృక్షాలను సమీకృతంగా పెంచే విధానం– పర్యావరణ పరిరక్షణతో పాటు రైతుకు అదనపు ఆదాయాన్ని అందించే మార్గంగా ఎదుగుతోంది. చెట్లు వాతావర ణంలోని కార్బన్ ను బంధించడం ద్వారా ఏర్పడే కార్బన్ క్రెడిట్లను రైతుల ఆదాయంగా మలచడ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది.భారతదేశం 2070 నాటికి నెట్– జీరో లక్ష్యాన్ని ప్రకటించిన నేపథ్యంలో వ్యవసాయం కూడా కార్బన్ ఉద్గారాల నియంత్రణలో భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది. రైతులను కేవలం ఆహార ఉత్పత్తిదారులుగా కాకుండా పర్యావరణ సేవలను అందించే భాగ స్వాములుగా గుర్తించే విధానాలు రూపొందాలి. కార్బన్ మార్కెట్లు అదే దిశగా ముందడుగు వేస్తున్నాయి.అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో యాక్షన్ ఫ్రెటర్నా–ఎకాలజీ సెంటర్ (ఏఎఫ్ ఎకాలజీ సెంటర్) ఈ భావనను ఆచరణలోకి తీసుకొస్తోంది. నెదర్లాండ్స్‌కు చెందిన రాబోబ్యాంక్ ప్రోత్సహి స్తున్న ‘అకార్న్’ కార్యక్రమానికి స్థానిక భాగస్వామిగా ఉంటూ, సంస్థ రైతులను అగ్రోఫారెస్ట్రీ వైపు మళ్లిస్తూ, కార్బన్ ఆదాయ వ్యవస్థలో చేర్చుతోంది. ఇప్పటికే సుమారు 8,300 మంది రైతులు, దాదాపు 10,000 హెక్టార్ల భూమిని ఈ కార్యక్రమంలో నమోదు చేయించింది. రైతుల భూములకు జియో–ట్యాగింగ్, ధ్రువీకరణ ప్రక్రియలు పూర్తి చేశారు. రెండు లక్షలకు పైగా మొక్కల పంపిణీ చేసి, ఏకపంట తోటలను బహుళ వృక్ష వ్యవస్థలుగా మార్చి ఈ కార్యక్ర మానికి బలమైన పునాది వేశారు. తొలి విడత కార్బన్ ఆదాయం 2027లో అందే అవకాశం రైతుల్లో విశ్వాసాన్ని పెంచుతోంది.ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ కేవలం కార్బన్ క్రెడిట్ల నమోదు వద్దే ఆగిపోలేదు. ప్రకృతి వ్యవసాయం, నీటి సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను సమ గ్రంగా అనుసంధానిస్తూ రైతుల స్థిరమైన జీవనోపాధిని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. కార్బన్ ఆదాయాన్ని రైతు సంక్షేమంతో అనుసంధానించిన ఈ నమూనా దేశవ్యాప్తంగా అధ్యయనం చేయదగినది. అయితే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. కార్బన్ ధరల్లో హెచ్చుతగ్గులు, ధ్రువీకరణ ప్రక్రియల క్లిష్టత్వం, చిన్న రైతుల సామర్థ్య పరిమితులు వంటిఅంశాలను విధానపరంగా పరిష్కరించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రో ఫారెస్ట్రీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు,సాంకేతిక సహాయం, పారదర్శక కార్బన్ మార్కెట్ వ్యవస్థను అందిస్తే ఈ కార్య క్రమం మరింత విస్తరిస్తుంది.భవిష్యత్తు వ్యవసాయం కేవలం దిగుబడుల గురించే కాదు; ప్రకృతిని పునరుద్ధరించడంపైనా ఆధారపడిఉంటుంది. రైతు పెంచే ప్రతి చెట్టు వాతావరణ మార్పులను తగ్గించడమే కాకుండా కుటుంబ ఆదాయాన్ని కూడా పెంచగలదని ఈ కార్యక్రమం నిరూపిస్తోంది. రైతు–ప్రకృతి–మార్కెట్ మధ్య సమ తుల్యతను సాధించే ఇటు వంటి ప్రయత్నాలే సుస్థిర వ్యవసా యానికి బాటలు వేస్తాయి.-వ్యాసకర్త డైరెక్టర్, ఎ.ఎఫ్. ఎకాలజీ సెంటర్, అనంతపురం-డా‘‘ వై.వి. మల్లారెడ్డి -
అది రాజ్యాంగబద్ధమేనా?
బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గేయాన్ని ‘పూర్తిగా పాడాలి’ (అంటే ఆరు చరణాలనూ పాడాలి) అంటూ ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. లోక్‌సభ, రాష్ట్రపతి ఆమోదాల తరువాత అది చట్టమవుతుంది. ఆ తరువాత, ఈ గేయాన్ని ఎక్కడైనా పూర్తిగా పాడకపోయినా, దాన్ని అవమానించినా, ఆటంకపరిచినా అలా చేసిన వాళ్లకు మూడేళ్ల జైలుశిక్ష పడుతుంది.1971లో తయారు చేసిన ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్’ను ప్రభుత్వం సవరిస్తూ ఈ బిల్లు ప్రవేశపెట్టింది. నిజానికి ఆ చట్టంలో– ‘జాతీయ జెండానిగానీ, జాతీయ గీతాన్ని గానీ, రాజ్యాంగాన్నిగానీ ఎవరైనా అవమానిస్తే వారు శిక్షార్హులవు తారు’ అని మాత్రమే వుంది. ‘వందే మాతరం’ గురించి ఏమీ లేదు. ఆ చట్ట పరిధిలోకి ఇప్పుడు దీన్ని కూడా తెస్తున్నారు.జనగణమనకూ, వందేమాతరానికీ తేడా వుంది. ఆ తేడా ఉండటం వలనే అది ‘జాతీయ గీతం’ కాలేక పోయింది. మొత్తం ‘ఆరు చరణాలు’ గా ఉండే అందులో మొదటి రెండు చరణాల్లో ప్రకృతి గురించి, భూమి గురించి, దేశభక్తి గురించి వర్ణన ఉంటుంది. ఆ తరువాత వచ్చే నాలుగు చరణాల్లో– భూమిని తల్లితో, ఆ తల్లిని కాళికతో, సరస్వతితో, లక్ష్మితో పోలుస్తూ ఉంటుంది. అంటే– హిందూ ఆధ్యాత్మికతా, దేశభక్తీ రెండూ కలగలసి ఉంటాయి.ఛటర్జీ ఈ గేయాన్ని విడిగా రాయలేదు. 1870లో రాసిన ‘ఆనంద్ మఠం’ నవలలోనిది అది. 1896 కలకత్తా కాంగ్రెస్ సమా వేశంలో ‘రవీంద్రనాథ్ టాగూర్’ దీన్ని మొదటగా ఆలపించారు. అప్పటికి ఆయన ‘జనగణమన’ రాయలేదు. అంతకుముందు సాహిత్యకారులలోనే ఆ పాటకు, టాగూర్ పాడాక, జాతీయ గుర్తింపు వచ్చింది. 1905లో ‘లార్డ్ కర్జన్’ బెంగాల్‌ను విభజించాక, అదొక ‘ఉద్యమ నినాదం’గా మారింది. బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో ‘వందే మాతరం’ నినాదాన్ని నిషేధించింది. నిషేధం కారణంగా ఇది మరింత ప్రజాదరణ పొందింది. రానురాను స్వాతంత్య్ర ఉద్యమంలో ఇది భావోద్వేగ గీతంగా కూడా నిలిచింది.1930లలో కాంగ్రెస్ వర్గాల్లో దీన్ని ‘జాతీయ గీతం’గా స్వీకరించాలనే చర్చలు జరిగాయి. కానీ ‘ముస్లిం లీగ్ నాయకులు’ అభ్యంతరం తెలిపారు. లీగ్ వాళ్ళే కాకుండా కాంగ్రెస్‌లోని ముస్లిమ్స్ కూడా తమ అభ్యంతరాల్ని బైట పెట్టడం మొదలెట్టారు. వాళ్ళల్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ (కాంగ్రెస్ అధ్యక్షుడు, తొలి విద్యాశాఖమంత్రి) ప్రథములు. ‘వందే మాతరానికి స్వాతంత్య్ర ఉద్యమంలో చారిత్రక పాత్ర ఉంది. దాన్ని ఎవ్వరమూ కాదనలేము కానీ, వాటి లోని హిందూ దేవతారాధన భావనలతో కూడిన వ్యాఖ్యలు ముస్లింలకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మొదటి రెండు శ్లోకాలు మాత్రమే దేశభక్తిని సూచిస్తాయి’ అని ఆయన తన అభిప్రాయాన్ని ప్రక టించారు. మౌలానా మహ్మద్ అలీ జౌహర్ (ఖిలాఫత్ నాయకుడు) ‘వందే మాతరాన్ని నినాదంగా వాడటానికి నేను వ్యతిరేకం కాదు; కానీ దాన్ని మతసంబంధమైన ప్రతీకగా మార్చకూడదు’ అన్నారు. ఎప్పుడైతే ముస్లిం సమూహం నించి వ్యతిరేకత వచ్చిందో, హిందూ సమూహంలోని వాళ్ళు కూడా మాట్లాడటం మొదలు పెట్టారు. రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మొదటి అడు గులు వేశారు. ‘వందే మాతరం పట్ల గౌరవం ఉండాలి. కానీ ఎవ్వరి మనస్సాక్షికీ వ్యతిరేకంగా బలవంతం చేయకూడదు’ అన్నారు.ఆ తరువాత జనగణమనను ‘జాతీయ గీతం’గా చేస్తూ, ‘వందే మాతరం’కు సమాన గౌరవం ఇస్తూ (మొదటి రెండు పద్యాలకే పరిమితం చేస్తూ) 1950 జనవరి 24న రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రక టనను చేశారు. దీని మీద గాంధీజీ కూడా మాట్లాడారు. ‘వందే మాతరం దేశభక్తి గీతం. మత భావనతో ఎవరికైనా ఇబ్బంది అయితే బలవంతం చేయరాదు. దేశభక్తి అనేది స్వచ్ఛందంగా ఉండాలి. బలవంతం చేస్తే అది హింసతో సమానం’ అన్నారు. అనేక మతాలు ఉన్న ఈ దేశంలో హిందూ మతానికి చెందిన దేవతా మూర్తుల్ని ఆరాధించే చరణాల్ని ‘తప్పనిసరిగా మొత్తం పాడాలి’ అనడం న్యాయమేనా? అది లౌకికత్వం అవుతుందా? రాజ్యాంగబద్ధం అవుతుందా?– నన్నూరి వేణుగోపాల్, పౌరహక్కుల కార్యకర్త -
నూతన యూరియా విధాన సవాళ్లు
హార్మూజ్ జలసంధి మూసుకుపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధర ఒక్కసారిగా టన్నుకు దాదాపు వెయ్యి డాలర్లకు పెరిగింది. దేశ యూరియా అవసరాల్లో నాలుగో వంతును దిగుమతి చేసుకునే భారత్‌కు ఇది దిగుమతుల మీద ఆధారపడే పాత భయాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే నూతన యూరియా పెట్టుబడి విధానం రూపంలో స్పందన వచ్చింది. దేశం ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న కోటి టన్నుల యూరియాను ఇక్కడే తయారు చేసేందుకు ఎనిమిది–తొమ్మిది కొత్త గ్యాస్ ఆధారిత కర్మాగారాలను నెలకొల్పడమే దీని లక్ష్యం.వేసిన నత్రజని పనికొచ్చేనా?తర్కంగా చూస్తే ఇది సరైన నిర్ణయమే. కానీ ఆ తర్కమే అసలు సమస్య. సరఫరా సంక్షోభం వచ్చినప్పుడు మన వ్యవసాయ విధానం చూపే ప్రతిస్పందన ఒక్కటే– ఎరువును మరింత ఎక్కు వగా ఉత్పత్తి చేయడం. కానీ ఎవరూ అడగని ప్రశ్న ఒకటుంది. పద్నాలుగు కోట్ల రైతు కుటుంబాలు, ప్రపంచంలోనే అతిపెద్ద పశు సంపద, ప్రతి శీతాకాలంలో తగలబెట్టే కోట్లాది టన్నుల పంట వ్యర్థాలు– ఇవన్నీ ఉన్న దేశం ఇంత భారీ మొత్తంలో కృత్రిమ నత్రజనిని ఎందుకు దిగుమతి చేసుకోవాలి?గత అరవై ఏళ్లుగా మన వ్యవసాయ విధానాన్ని ఒక నమ్మకం శాసిస్తోంది– ప్రతి ఉత్పాదకత సమస్యా ఎరువుల సమస్యే; దాన్ని మరిన్ని ఎరువులు ఉత్పత్తి చేయడం, దిగుమతి చేయడం, రాయితీ ఇవ్వడం ద్వారానే పరిష్కరించాలి. హరిత విప్లవం కాలంలో ఇది నిజమే. అప్పుడు నత్రజని కొరత ఒక అడ్డంకి. కానీ ఇవాళ మన అసలు సమస్య నత్రజని కొరత కాదు; పంటకు నత్రజనిని అందించే నేల ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రభుత్వ నేల ఆరోగ్య కార్డుల డేటానే చూస్తే– దేశంలో దాదాపు 64 శాతం నేలల్లో నత్రజని తక్కువ, 48.5 శాతం నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువ.మరో గణాంకం మరింత భయపెడుతుంది. హరిత విప్లవం తొలినాళ్లలో ఒక కిలో ఎరువుకు దాదాపు పదమూడు కిలోల అదనపు ధాన్యం వచ్చేది– అంటే 1:13 నిష్పత్తి. ఇవాళ అది 1:2.7కి పడి పోయింది. అంటే అదే కిలో ఎరువు ఇప్పుడు నాలుగో వంతు ధాన్యాన్ని మాత్రమే ఇస్తోంది. మనం వేసే నత్రజనిలో అరవై శాతానికి పైగా పంటకు అందకుండా గాలిలోకి, భూగర్భ జలాల్లోకి కొట్టుకుపోతోంది. నత్రజని చౌకగా దొరకడంతో రైతులు దాన్నే మోతాదు మించి వాడుతున్నారు; ఫలితంగా ఎన్ పీకే(నత్రజని, భాస్వరం, పొటాషియం) నిష్పత్తి 4:2:1 ఉండాల్సిన చోట దాదాపు 11:4:1కి చేరింది.ఒక ప్రాథమిక తేడాను మనం మరచిపోయాం. పంటకు పోషకాలు అందించడం వేరు, నేల సారాన్ని కాపాడటం వేరు. యూరియా పంటకు తక్షణ ఆహారం అందిస్తుంది. కానీ నేలలో సేంద్రియ కర్బనం, సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, వానపాములు– వీటిని అది పెంచదు. నిజానికి మోతాదు మించిన నత్రజని వీటిని దెబ్బతీస్తుంది. ఈ జీవరాశే నేలకు నీటిని పట్టి ఉంచే శక్తిని, గాలి ఆడే నిర్మాణాన్ని, పోషకాలను చక్రంలా తిప్పే సామర్థ్యాన్ని ఇస్తుంది. వీటిని రసాయనిక ఎరువులతో తిరిగి నిర్మించలేం– ఎందుకంటే ఎన్పీకే అనేది కర్బనం కాదు, జీవం అసలే కాదు.నిజంగా ఇది స్వావలంబనా?నూతన యూరియా విధానం చెప్పే స్వావలంబన కూడా చాలావరకు భ్రమే. యూరియా అమోనియా నుంచి, అమోనియా సహజ వాయువు నుంచి తయారవుతాయి. ఆ సహజ వాయువులో చాలా భాగం మనం ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) రూపంలో దిగుమతి చేసుకునేదే. యూరియా ఉత్పత్తి వ్యయంలో ఇది 70–80 శాతం. అంటే కొత్త కర్మాగారం అంటే దిగుమతి చేసుకున్న వాయువును ఇక్కడ యూరియాగా మార్చే యంత్రం మాత్రమే. మన ఆధారపడటం పోలేదు, కేవలం ఒక మెట్టు పైకి జరిగింది. భాస్వరం, పొటాష్ విషయంలో అయితే మనం దాదాపు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడతాం.అమెరికా ఉదాహరణ చూడండి: ఆ దేశం నత్రజనిలో స్వావలంబన సాధించిన మాట నిజమే, కానీ కర్మాగారాలు కట్టడం వల్ల కాదు. దానికి సొంత షేల్ గ్యాస్ ఉంది; మొక్కజొన్న–సోయాబీన్ మార్పిడి సాగులో పప్పుజాతి పంట తనకు తానే నత్రజనిని స్థిరీక రించుకుంటుంది. ఈ రెండూ మనకు లేవు. అక్కడి వాతావరణం కూడా వేరు. మన ఉష్ణోగ్రతలకు సేంద్రియ కర్బనం తొందరగా కోల్పోతాం. అక్కడ సంవత్సరానికి ఒక పంట కాలమే, రెండో కాలంలో నేల పునర్జీవనం కావటానికి అవకాశం ఉంది. కాబట్టి అమెరికా బాటలో కేవలం కర్మాగారాల స్థాపనను కాపీ చేస్తే, భారం మిగులుతుంది తప్ప భద్రత రాదు.నిజమైన స్వావలంబన అంటే మనం అదుపులో ఉంచుకోగల వనరుల నుంచి పంట అవసరాలను తీర్చుకోవడం. పప్పు ధాన్యాలు, జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు, అజొల్లా ద్వారా జీవ నత్రజని స్థిరీకరణ, పంట వ్యర్థాల పునర్వినియోగం, పశువుల ఎరువు, అన్నిటికీ ఆధారమైన నేలలో సేంద్రియ పదార్థం– ఇవి పెరిగితే వేసే ప్రతి కిలో ఎరువూ మరింత సమర్థంగా పనిచేస్తుంది.జీవసారం పెంచితే ప్రోత్సాహకాలుఇప్పుడు డబ్బుల మాట. దేశ ఎరువుల రాయితీ దాదాపు రూ.1.7 లక్షల కోట్లు; అందులో యూరియాదే రూ.1.19 లక్షల కోట్లు. తగ్గిపోతున్న రసాయనిక ఎరువుల సామర్థ్యం, వృథా అవు తున్న సగం నత్రజని– వీటిని చూస్తే ఇది తక్కువ ప్రయోజనం ఇచ్చే ఖర్చు. ఈ రాయితీలో సగాన్ని– అంటే దాదాపు 85 వేల కోట్లను– నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి మళ్లిస్తే ఏమవుతుంది?ఒక టన్ను యూరియా ఒక్క సీజన్ కే అయిపోతుంది, మళ్లీ కొనా ల్సిందే. కానీ నేలలో పెరిగిన సేంద్రియ కర్బనం ఏళ్ల తరబడి నిలు స్తుంది. ప్రతి ఏటా దిగుబడిని, నీటి నిల్వను, ఎరువుల సామర్థ్యాన్ని పెంచుతుంది. నేల బాగుపడిన కొద్దీ దానికి కావాల్సిన నత్రజని తగ్గుతుంది, దాంతోపాటే రాయితీ భారమూ తగ్గుతుంది.అందుకే ఒక జాతీయ/రాష్ట్ర స్థాయి నేల ఆరోగ్య పునరుద్ధరణ మిషన్ అవసరం. నేలలో సేంద్రియ కర్బనం, జీవసారం పెరిగిన కొద్దీ రైతుకు నేరుగా ప్రోత్సాహకం అందాలి. గ్రామ స్థాయి కంపోస్ట్, పంట వ్యర్థాల పునర్వినియోగం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో జీవ ఎరువుల యూనిట్లు– వీటిని ఉపాధి హామీ పథకం, ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానం చేయాలి.‘రసాయనిక ఎరువులు లేకుండా దేశాన్ని పోషించలేం’ అనే వాదన రావచ్చు. ఎరువులను పూర్తిగా వదిలేయాలని అనడం లేదు. మొదట్లో రసాయనికం, జీవసంబంధం రెండింటినీ కలిపి వాడే సమీ కృత పోషక యాజమాన్యమే మార్గం. భారత్ తదుపరి వ్యవసాయ విప్లవం మరిన్ని రసాయనిక ఎరువులపై కాదు– ప్రాణమున్న నేల లను తిరిగి నిర్మించడంపై ఆధారపడాలి. ఏ ఓడరేవు, గ్యాస్ పైప్‌లైన్ కోసం మనం ఎదురుచూడనక్కర్లేదు– మన అతిపెద్ద ఎరువుల కర్మాగారం ప్రతి రైతు కాళ్ల కింద, నేల జీవంలోనే ఉంది. - డా. జి.వి. రామాంజనేయులు, వ్యాసకర్త సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) కార్యనిర్వాహక సంచాలకులు -
ట్రేడింగ్ ఒక వృత్తి కాగలదా?
నేటి ఆధునిక ఆర్థిక ప్రపంచంలో ‘ఆర్థిక స్వాతంత్య్రం’ సాధించ డానికి ట్రేడింగ్ ఒక ఆకర్షణీయమైన మార్గంగా కనిపిస్తోంది. గతంలో దీనిని కేవలం ఒక జూదంగానో లేదా పార్ట్–టైమ్ ఆదాయ వనరుగానో చూసేవారు. నేడు సాంకేతిక విప్లవం, మార్కెట్లపై అవగాహన పెరగడంతో చాలామంది దీనిని పూర్తి స్థాయి వృత్తిగా ఎంచుకోవాలని భావిస్తున్నారు.భారతీయ మార్కెట్ల నియంత్రణ సంస్థ అయిన ‘సెబీ’ రిటైల్ ట్రేడర్ల శైలి, వారి లాభనష్టాలపై ఒక లోతైన అధ్యయన నివేదికను విడుదల చేసింది. ఈ గణాంకాలు ట్రేడింగ్‌ను వృత్తిగా మార్చుకోవాల నుకునే వారికి కనువిప్పు కలిగిస్తున్నాయి.భారతదేశంలో ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ చేసే వ్యక్తిగత ట్రేడర్లలో దాదాపు 90% నుండి 93% మంది నష్టపోతున్నారు. నష్టపోయే ప్రతి యాక్టివ్ ట్రేడర్ సగటున ఏడాదికి రూ. 1.25 లక్షల నుండి రూ. 1.50 లక్షల వరకు నష్టపోతున్నట్లు సెబీ గణాంకాలు చెబుతున్నాయి. కేవలం 7% నుండి 10% మంది మాత్రమే మార్కెట్లో లాభాలు గడిస్తున్నారు. వీరిలో కూడా కేవలం 1.5% మంది మాత్రమే నెలకు రూ. 1 లక్ష కంటే ఎక్కువ ఆదాయాన్ని స్థిరంగా సంపాదించగలుగుతున్నారు. ట్రేడర్లు సంపాదించే లాభాల్లో లేదా నష్టాల్లో దాదాపు 15% నుండి 25% వరకు కేవలం బ్రోకరేజ్, పన్నులు, ఇతర లావాదేవీల ఖర్చులకే సరిపోతుందని తేలింది.ట్రేడింగ్‌లో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. మార్కెట్ హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉన్నప్పుడు భయం, దురాశ వంటి భావోద్వేగా లను నియంత్రించుకోవడం అందరికీ సాధ్యం కాదు. ట్రేడింగ్‌ను విజయ వంతమైన కెరీర్‌గా మార్చుకోవాలంటే ట్రేడింగ్‌కు సంబంధించి చాలా అంశాలపై పట్టు సాధించాలి. ప్రతి ట్రేడ్‌లోనూ మీ పెట్టుబడిపై ఎంత శాతం నష్టాన్ని (స్టాప్–లాస్ విధానం) భరించగలరో ముందే నిర్ణయించుకోవాలి. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, చార్ట్ ప్యాటర్న్స్, టెక్నికల్ ఇండికేటర్లపై శాస్త్రీయ మైన పట్టు ఉండాలి.ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో (ముఖ్యంగా అమెరికా, యూరప్, సింగపూర్, దుబాయ్ వంటి ప్రాంతాల్లో) ట్రేడింగ్‌ను ఒక జూదంగానో లేదా సైడ్ హాసిల్గానో కాకుండా, గౌరవప్రదమైన, వ్యవస్థీకృతమైన ‘వైట్ కాలర్‘ వృత్తిగా చూస్తారు. విదేశాలతో పోలిస్తే భారతదేశంలో ట్రేడింగ్‌ను వృత్తిగా మార్చుకోవడానికి ఉన్న అతిపెద్ద సవాలు ఆర్థిక అక్షరాస్యత లోపించడం, సరైన గైడెన్స్ లేకపోవడం.– డా. ఎం.డి. ఖ్వాజా మొయినుద్దీన్, స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు -
మాధవుడి మందిరంలో మన్మథుడికి చోటుందా?
దేవతలు తాగే అమృతం కావాలంటే, మందర పర్వతాన్ని మోసుకొచ్చి, దాన్ని కవ్వంగా చేసి, క్షీర సాగరాన్ని చేతులు పడిపోయేలా చిలకాలి. అది మహామహులకే తప్ప, మామూలు మనుషులకు సాధ్యమయ్యే పని కాదు. అలాగని దిగులు అక్కర్లేదు. భక్త కవీంద్రుడు లీలాశుకుడు తన కవితాశక్తి అనే కవ్వంతో, నుడి కడలిని మథించి వెలికి తీసిన ‘కృష్ణ కర్ణామృతం’ ఉంది.వీనుల విందు చేసే ఈ అమృతాన్ని, అభిరుచి ఉన్నవారెవరయినా, ఉచితంగా, తనివి తీరా ఆస్వాదించవచ్చు. లీలాశుకుడు ఈ కావ్యంలో తన ఇష్టదైవమైన బాలగోపాల కృష్ణుడిని ఎన్నెన్నో శబ్దాలంకారాలతో, అర్థాలంకారాలతో, చమత్కారాలతో అలంకరించి తరించాడు. ఆ కర్ణామృత కలశంలో ఒక్క చుక్క పట్టి చూసినా, అమృతం నాణ్యత అర్థమైపోతుంది.మన్మథుడు తుంట వింటివాడే కాదు. తుంటరివాడు కూడా. ఎంతో ప్రయత్నంతో, ఎన్నో సాధనలతో కష్టపడి, శుద్ధి చేసుకొన్న మహాభక్తుడి మనసులోకి ఎలాగో చొచ్చుకుపోతాడు. మదన వికారాల మాలిన్యంతో దాన్ని మళ్లీ మైల పడేస్తాడు. అలాంటి ఆగడాలు తన దగ్గర సాగవని లీలాశుకుడు మృదుమధురంగా, సొగసుగా, గడుసుగా మంద లిస్తూ..‘మార! మా రమ మదీయ మానసే,మాధవైక నిలయే యాదృచ్ఛయా!’అంటాడు. ‘‘మదనుడా! నా మనసులో దూరి అల్లరి చేయకు. ఇది మాధవుడు ఒక్కడి కోసం అచ్చంగా ఏర్పరచిన మందిరం. ఇక్కడ స్వేచ్ఛా విహారం చేస్తూ, ‘రమించ’కు. మా రమ!’ అని. అలా రమిస్తూ, ఆగం చేస్తే ఏమౌతుంది? కొంప మునుగుతుంది.ఎందుకంటే, 'శ్రీ రమాపతిః – ఇహ – ఆగమేత్ – అసౌ’ ఇల్లుగలాయన అయిన ‘రమాధవుడు ఇప్పుడో, ఇంకాసే పట్లోనో ఇక్కడికి వస్తాడు.’ ఆయన నీ గోల చూస్తే నీ వీపు విమానం మోత మోగిస్తాడో, తాట ఒలిచేస్తాడో!కః సహేత నిజ వేశ్మ లంఘనమ్? ‘తన ఇంట్లో పరులు స్వేచ్ఛగా జొరబడితే, ఎవరు సహిస్తారు?’ అందులో ఆయన సామాన్యుడా? సకల శక్తిశాలి. ఏమయినా చేయగలడు. ‘కనుక బతుకు మీద తీపి ఉంటే, నా నుంచి దూరంగా పారిపో!’’ అని పంచశరుడిని భక్తాగ్రణి హెచ్చరిస్తున్నాడు.– ఎం. మారుతి శాస్త్రి -
ఇక ఉద్యోగాలు, ఉత్పాదకతే లక్ష్యం
1991లో చేపట్టిన సంస్కరణలను అనేకమంది భారతదేశ ఆర్థిక రంగానికి ‘లాంచ్ ప్యాడ్’ (అభివృద్ధికి పునాది)గా భావిస్తారు. 1991 జూలై 4న– సరిగ్గా 35 ఏళ్ళ క్రితం అప్పటి ఆర్థిక మంత్రి మన్మో హన్ సింగ్ తన బడ్జెట్ ప్రసంగంలో విక్టర్ హ్యూగో మాటలను ఉటంకిస్తూ, ‘సమయం ఆసన్నమైన ఆలోచనను ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదు’ అని పేర్కొన్నారు. ‘ప్రపంచంలో భారత్ ఒక ప్రధాన ఆర్థిక శక్తిగా ఆవిర్భవించడం అనేది కూడా అలాంటి ఆలోచనే’ అని ఆయన ప్రకటించారు.ముప్పై ఐదు సంవత్సరాల తరువాత, మనకు స్పష్టంగా కనిపిస్తున్నది ఏమిటంటే– ఆ రోజున పారిశ్రామిక, వాణిజ్య నియంత్రణలను తొలగించడం అనేది భారతదేశ ఆర్థిక వృద్ధి రేటునూ, అలాగే పేదరిక నిర్మూలన వేగాన్నీ పెంచడానికి ఎంతగానో తోడ్పడింది. అయితే 1991లో చేసిన వాగ్దానం పాక్షికంగా మాత్రమే నెరవేరిందని మనం అంగీకరించక తప్పదు. నిజానికి, అంత అను కూలంగా లేని అంతర్జాతీయ వాతావరణంలో, ఎటువంటి సులువైన పరిష్కారాలు లేని ఆర్థిక భద్రత, సాంకేతిక పరిపక్వత, సమ్మిళిత వృద్ధి అనే నూతన సవాళ్ళను ఎదుర్కొంటూ దేశం మరోసారి ఒక సంక్లిష్టమైన స్థితిలో నిలబడింది.అభివృద్ధి నిజమే కానీ...1990–91 నాటికి అంతకు ముందు 40 సంవత్సరాలలో, మన ఆర్థిక వ్యవస్థ ఐదు రెట్లు పెరిగింది. కానీ అదే సమయంలో జనాభా రెండున్నర రెట్లు పెరగడంతో, తలసరి ఆదాయం కేవలం రెట్టింపు మాత్రమే అయింది. దానికి భిన్నంగా, 1990–91 తర్వాత గత 35 ఏళ్లలో, ఆర్థిక వ్యవస్థ ఎనిమిది రెట్లు పెరిగింది. ఈ మధ్యకాలంలో జనాభా 70 శాతం మాత్రమే పెరగడం వల్ల, తలసరి ఆదాయం నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది.మొదటి కాలంలో భారత్ ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ పనితీరు కనబరచగా, రెండవ (ఆర్థిక సంస్కరణల తరువాతి) కాలంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే పోటీ పడగలిగేలా అద్భుతమైన వృద్ధి నమోదు చేసింది. అయితే, ఇంకా ఎంతో సాధించి ఉండవచ్చని చైనా, వియత్నాంలు నిరూపిస్తున్నాయి. భారత్‌కు సమానమైన స్థాయి నుండి ప్రయాణం ప్రారంభించిన చైనా, ఇప్పుడు ‘అధిక ఆదాయ’ దేశాల జాబితాలోకి చేరే స్థితిలో ఉంది.1991లో భారతదేశ తలసరి ఆదాయంలో సగం కంటే తక్కువ ఆదాయం ఉన్న వియత్నాం ఇప్పుడు భారత్ కంటే 80 శాతం అధిక ఆదాయాన్ని కలిగి ఉంది. భారత్ ఇప్పటికీ ‘దిగువ–మధ్య ఆదాయ’ గ్రూపులోనే ఉంది. మన తలసరి ఆదాయం ప్రపంచ సగటులో నాలుగో వంతు కంటే తక్కువగానే ఉంది. తీవ్ర పేదరికం 1991లో 37 శాతంగా ఉండగా, ఇప్పుడు 5 శాతానికి పడిపోయింది. కానీ బహుమితీయ పేదరిక సూచీ ప్రకారం, ఇప్పటికీ ఆరో వంతు జనాభా పేదరికంలోనే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచీలో భారత్ దిగువనే ఉంది. అయినప్పటికీ, వంటగ్యాస్,మంచినీటి కనెక్షన్లు, మరుగు దొడ్లు, గృహ విద్యుత్ వంటి ప్రాథమిక వస్తువుల లభ్యత గతంలో కంటే ఇప్పుడు మెరుగైంది.అయినా ప్రపంచ దృష్టి భారత్‌పైనే...కొన్ని విజయాలు పరిమి తమైనవిగా అనిపించినప్పటికీ, గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇక్కడి జనాభా పరిమాణమే. ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అనేక రకాల ఉత్ప త్తులు, సేవలకు భారత్ ప్రపంచంలోనే అత్యంత భారీ మార్కెట్లలో ఒకటిగా ఉంది. ఇది, ఖర్చు పెట్టే శక్తి ఉన్న ఒక పెద్ద మధ్యతరగతి విభాగ ఆవిర్భా వాన్ని ప్రతిబింబిస్తుంది.భారత్‌లోని 145 కోట్ల జనాభాలో 30 నుండి 40 శాతం మంది మధ్యతరగతి పరిధిలోకి వస్తారు. ఈ వర్గంలో దాదాపు 8 నుండి 10 కోట్ల కుటుంబాలు ఉన్నాయనడానికి ఏటా విక్రయించే 2 కోట్ల ద్విచక్ర వాహనాలు, 15 కోట్ల స్మార్ట్ఫోన్లు సాక్ష్యంగా ఉన్నాయి. 1991లో ఏడాది మొత్తం అమ్మిన కార్ల సంఖ్యను ఇప్పుడు కేవలం పదిహేను రోజుల్లోనే విక్రయిస్తున్నారు. ఆదాయంతో పోలిస్తే ఉత్ప త్తులు అందుబాటు ధరల్లో, మెరుగైన నాణ్యతతో లభిస్తున్నాయి. సాఫ్ట్వేర్ సేవలు, తక్కువ ఖర్చుతో కూడిన ఫార్మాస్యూటికల్స్ తయారీలో భారత్ ప్రత్యేక గుర్తింపు పొందింది. భారత్ రూపొందించిన డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్, ఆయిల్ రిఫైనింగ్, వైద్యసంరక్షణ రంగాలలో సాంకేతిక పరిణతి కూడా గుర్తింపు పొందాయి. హార్వర్డ్ గ్రోత్ ల్యాబ్ వారి ‘ఎకనామిక్ కాంప్లెక్సిటీ ఇండెక్స్’లోని 145 దేశాలలో భారత్ పైనుండి మూడో స్థానంలో ఉంది. 1991 సంస్కరణల మూల సూత్రాన్ని దేశం సరిగ్గా అనుసరించి ఉంటే ఇంకా ఎంతో సాధించి ఉండేది. ప్రైవేట్ రంగం, మార్కెట్లు అవి సాధించగలిగినవాటిని వదిలేయడం, బయటి ప్రపంచానికి తలుపులు తెరవడం, ప్రభుత్వం మాత్రమే అందించగలిగే వాటిపై శ్రద్ధను కేంద్రీకరించడం–అంటే శాంతిభద్రతలు, న్యాయం, ప్రజారోగ్యం, నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలు, పర్యావరణ పరి రక్షణ, మార్కెట్ల సరైన నియంత్రణ కలిగి ఉండటమే ఆ సూత్రం.వాస్తవ స్థితివీటిలో ప్రతి విషయంలోనూ భారత్ వెనుకబడి ఉంది. దేశంలో 22 లక్షల మంది పోలీసులు ఉంటే, దానికి నాలుగు రెట్లు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. కోర్టుల్లో ఆలస్యం అనేది సర్వసా ధారణమైపోయింది. సగానికి పైగా పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారు. 40 శాతం ఆసుపత్రి పడకలు ప్రైవేట్రంగానివే. ప్రజల ఆదాయాలు ఇంకా పరిమితంగా ఉన్న సమయంలో ఈ రెండింటికీ భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. సరిపడా పోషకాహారం లేకపోవడం వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి.కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రభుత్వ అప్పులు ఆందోళన కరమైన స్థాయికి చేరాయి. విద్య, రక్షణ రెంటిపై ప్రభుత్వం చేసే వ్యయం తగ్గుతోంది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ప్రపంచ సగటుతో పోలిస్తే చాలా తక్కువ. గత దశాబ్దపున్నర కాలంగా రక్షణాత్మక సుంకాలు, ఇతర అడ్డంకులు పెరిగిన కొద్దీ, జీడీపీలో వస్తువుల ఎగుమతుల నిష్పత్తి తీవ్రంగా తగ్గుతూ వచ్చింది. మంచి ఉద్యోగాల కల్పన కష్టంగా మారడంతో మధ్యతరగతి పరిమాణం గతంలోలాగా పెరగడం లేదు. దేశంలోని అత్యున్నత అర్హతలు కలిగినవారు పెద్ద సంఖ్యలో దేశం విడిచి వెళ్తున్నారు. స్వదేశీ ప్రైవేట్ పెట్టుబడులు ఆశించిన స్థాయిలో లేవు. అత్యంత తీవ్రంగా దెబ్బ తిన్నది మాత్రం మధ్యతరగతికి, పేదలకు మధ్యన ఉన్న ‘ఆకాంక్షల వర్గం’. అసంఘటిత రంగంలో అస్థిరమైన, తక్కువ ఆదాయాల వల్ల వీరిలో అత్యధికులు ‘నిశ్శబ్ద నైరాశ్యంతో కూడిన జీవితాలను’ గడుపుతున్నారు. ఈ వర్గానికి చెందిన కొందరు యువకులు గత నెల రోజు లుగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసన ప్రాంతంలో కనిపించారు. ఈ వయస్సు వర్గాలలో 25 శాతం నుండి 40 శాతం వరకు నిరుద్యోగం ఉంది. 1991 సంస్కరణల స్ఫూర్తిని కొనసాగిస్తూ, ప్రభుత్వం తన శ్రద్ధను ప్రాథమిక సేవలపై కేంద్రీకరించడం ద్వారా మాత్రమే ఈ స్థితిని మార్చగలదు.-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-టి.ఎన్. నైనన్ -
అమెరికా రాజనీతికి యుద్ధం కేంద్రకం
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలను, వీటిలో యూఎస్ఏ పాత్రను విస్తృత అంతర్జాతీయ జియో పొలిటికల్ క్రీడలో భాగంగా చూడాలి. 2035లో ప్రపంచ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారబోతున్నది. ఈ పరిణామంలో భాగమే ఈ యుద్ధాలు. గత 250 సంవత్సరాల అమెరికా చరిత్ర పూర్తిగా యుద్ధాలతోనే ముడిపడి ఉన్నది. గత శతాబ్దంలో ప్రతి 20 సంవత్సరాలకు కనీసం ఒక పెద్ద యుద్ధానికి తెరతీసింది. పద్దెనిమిది,పందొమ్మిది శతాబ్దాలలో దేశ విస్తరణకు బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, మెక్సికోలతో యుద్ధం చేసింది. ఇరవయ్యవ శతాబ్దంలో ఫిలిప్ఫైన్, రెండు ప్రపంచ యుద్ధాలు, కొరియా, వియత్నాం, బోస్నియా, గల్ఫ్ యుద్ధాలలో నిమగ్నమైంది. ఇరవయ్యొకటవ శతాబ్దంలో అఫ్గాని స్తాన్, ఇరాక్, లిబియా, యెమెన్, సిరియా, సోమాలియాలలో యుద్ధాలను లేవనెత్తింది. గత 250 ఏళ్లలో యూఎస్ఏ కేవలం 1865–1898 (33 సం‘‘లు), 1918–1945 (27 సం‘‘లు) మధ్య మాత్రమే యుద్ధానికి దూరంగా ఉన్నది. శాంతి కోసం యుద్ధం, సుభిక్షానికి యుద్ధం, సుస్థిరతకు యుద్ధం అనేది అమెరికా పాలనా విధానం. శక్తిని చాటి చెప్పటానికి యుద్ధాన్ని ఒక పరికరంగా పరిగణిస్తుంది. ఈ యుద్ధ తంత్రానికి ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, ఉదారవాద విధానాల ముసుగు కప్పుతుంది. కథ అడ్డం తిరిగింది!సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత ప్రపంచంపై తన ఏకచ్ఛత్రాధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి అమెరికా సర్వశక్తులు ఒడ్డింది. ప్రత్యర్థి రష్యాను పూర్తిగా అణచివేయాలని నాటోను విస్త రించింది. 2010కల్లా రష్యా ఆర్థికంగా పుంజుకొని అమెరికాకు సవా లుగా తయారైంది. ఇదే సమయంలో అనూహ్యంగా చైనా బలమైన ప్రత్యర్థిగా ఎదిగింది. 2020కల్లా భారత్, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికాలు కూడా బలమైన శక్తులుగా రూపుదిద్దుకున్నాయి. బ్రిక్స్ రూపంలో కూటమిగా చేరి, అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయాలను సంకల్పించటంతో కథ అడ్డం తిరిగింది.బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడటం ఖాయమనే విశ్లేషకుల జోస్యాన్ని తప్పుగా నిరూపించాలని కృతనిశ్చయంతో ఉన్నది. అమెరికా ముందు మూడు ప్రత్యామ్నాయాలున్నాయి. 1. ప్రత్యర్థు లను నిర్వీర్యం చేసి ఏకైక ప్రపంచ శక్తిగా కొనసాగటం. 2. ప్రత్య ర్థులతో రాజీపడి పరిమిత ధ్రువ (లిమిటెడ్ పోలార్) ప్రపంచంలో ప్రధాన శక్తిగా కొనసాగటం. 3. ప్రత్యర్థులతో రాజీపడి బహుళ ధ్రువ (మల్టీ పోలార్) ప్రపంచంలో ప్రధాన శక్తిగా కొనసాగటం.మూడింట్లో మొదటి దారిప్రస్తుతం అమెరికా ఏకైక ప్రపంచ శక్తిగా కొనసాగాలనే పట్టు దలతోనే ఉన్నట్లుగా కన్పిస్తున్నది. ఇందులో భాగంగానే ఇంధన వనరులు, ఇంధన రవాణా మార్గాలపై పెత్తనానికి సర్వశక్తులు ఒడ్డు తున్నది. రష్యాపై తీవ్రస్థాయిలో ఆంక్షలు విధించి ఉక్రెయిన్ యుద్ధపు పద్మవ్యూహంలోనికి రష్యాను లాగింది. రష్యానుండి చమురు, గ్యాస్ ఎవరూ కొనగూడదని ఐరోపా, భారత్‌లను కట్టడి చేసింది. దీర్ఘకాలిక యుద్ధంలో ఉక్రెయిన్ వెనుక నిలబడి రష్యా అలసిపోయి నిర్వీర్యమవటానికి దీర్ఘకాలిక ప్రణాళికను అమలు పరుస్తున్నది. అందుకే నెల లోపున ముగుస్తుందనుకున్న ఉక్రెయిన్ యుద్ధం నాలుగన్నర సంవత్సరాలకు కూడా కొనసాగుతున్నది. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం చైనా చేతిలో పడకుండా చూడటం ద్వారా చైనాను కట్టడి చేయాలనేది అమెరికా వ్యూహం. ‘చిప్ 4’ అలయన్స్‌లో భాగంగా అమెరికా, తైవాన్, ద.కొరియా, జపాన్‌లు చైనాకు అత్యాధునిక సెమీకండక్టర్ చిప్‌లు అందుబాటు లోనికి రాకుండా ప్రయత్నిస్తున్నాయి. ఆకస్ కూటమిలో భాగంగా ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ఏలు ఏఐ, క్వాంటమ్ మెకానిక్స్ హైపర్సోనిక్ టెక్నాలజీని చైనాకు అందకుండా చేయటానికి ప్రయ త్నిస్తున్నాయి. జీ7, యూరోపియన్ యూనియన్ల ద్వారా అత్యాధు నిక చిప్స్ తయారు చేసే యంత్రాలను ఏఎస్ఎంఎల్ (నెదర్లాండ్స్), టోక్యో ఎలక్ట్రానిక్ (జపాన్) కంపెనీలు చైనాకు ఎగుమతి చేయకుండా ఆంక్షలు పెట్టాయి. తైవాన్ను సమర్థించటం ద్వారా కూడా చైనాకు చెక్ పెట్టటానికి అమెరికా ప్రయత్నిస్తున్నది.విశేషంగా ఇంధన వనరులున్న ఇరాన్, ఇరాక్, సౌదీ, యూఏఈ, కువైట్ మొదలైన గల్ఫ్ దేశాలపై నియంత్రణకు అమెరికా దీర్ఘకాలికంగా వ్యూహాలను అమలుపరుస్తున్నది. సైనిక స్థావరాల ద్వారా గల్ఫ్ దేశాలలో అమెరికా ఇప్పటికే పాగా వేసింది. ఈ ఇంధన వనరుల నియంత్రణలో అమెరికాకు కొరకరాని కొయ్యగా మారింది ఇరాన్. అందుకే హార్మూజ్, బాబెల్ మాండెబ్ జలసంధులపై పెత్తనానికి అమెరికా ప్రయత్నిస్తున్నది.ఆసియాలో భారత్ ఆధిపత్యం?అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించే వ్యూహంలో భాగాలే ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు. అందువలన ఈ రెండు ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేవు. ఇరాన్ యుద్ధం వలన తీవ్రంగా నష్ట పోయేది భారత్, చైనాలని గుర్తించాలి. చైనా, రష్యా, భారత్‌లను ఈ రెండు యుద్ధాల ద్వారా కట్టడి చేయటం సాధ్యం కాని పక్షంలో అమె రికా పరిమిత ధ్రువ ప్రపంచానికి రాజీ పడాల్సి వస్తుంది. రష్యా, చైనా/భారత్‌లను ప్రపంచ శక్తులుగా అంగీకరించాల్సి వస్తుంది. క్రమంగా నాటోను రద్దుపరచి ఐరోపాపై రష్యా ఆధిపత్యానికి అంగీ కరించి ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలకు యూఎస్ఏ తన ఆధిప త్యాన్ని పరిమితం చేసుకోవాల్సి ఉంటుంది. దక్షిణ, తూర్పు ఆసి యాలలో చైనా ఆధిపత్యాన్ని అంగీకరించి గల్ఫ్ ప్రాంతంలో ఇజ్రా యెల్–యూఏఈ– సౌదీల ద్వారా నియంత్రణకు ప్రయత్నిస్తుంది. అయితే దక్షిణ, తూర్పు ఆసియాలలో ఆధిపత్యంతో చైనా సరిపెట్టుకోక పోవచ్చును. చైనా ప్రపంచాధిపత్యానికి ప్రయత్నించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాక్రమంగా రష్యాతో ఒప్పందం ద్వారా చైనాకు వ్యతిరేకంగా భార త్ను ఆసియాలో ఆధిపత్యానికి ప్రోత్సహించవచ్చును.2040 కల్లా చైనా ప్రపంచ శక్తిగా అమెరికా, రష్యాలనే సవాలు చేయవచ్చని విశ్లేషకుల అంచనా. ఈనాడు ప్రత్యర్థులుగా ఉన్న రష్యా, అమెరికాలు కలిసి చైనాను నిలువరించాల్సి రావచ్చును. రాజకీయాలలో శాశ్వత మిత్రత్వం కానీ శాశ్వత శతృత్వం కానీ ఉండదు. అమెరికా, రష్యాలు, ఆసియాలో భారత్ వైపే మొగ్గు చూప టానికి అవకాశం ఉన్నది. తైవాన్ను చైనా ఆక్రమించటానికి ప్రయ త్నించినప్పుడు చైనాను ఇంకొకవైపు నుండి నిలువరించటానికి భారత్ సిద్ధమవవచ్చును. ఒకవైపు హిమాలయాలలో చైనాపై దాడి చేస్తూనే భారత్ మలక్కా జలసంధిని దిగ్బంధనం చేయవచ్చు. ఆ సందర్భంలో చైనా సముద్రంలో అమెరికా, జపాన్‌లను చైనా ఎదు ర్కోవటం కష్టమవుతుంది. భారత్‌కు అమెరికా సైనిక, వ్యూహాత్మక మద్దతును అందించవచ్చును.కాకపోతే, ఈ అమెరికన్ అంతర్జాతీయ రాజకీయ వ్యూహంలో పావుగా మారటానికి భారత్ ఒప్పుకోకపోవచ్చును. ప్రాంతీయంగా ఆసియాలో చైనాను నియంత్రించటానికి భారత్ ఒప్పుకుంటుంది. కానీ అంతర్జాతీయంగా చైనాను నిరోధించే వ్యూహంలో భారత్ భాగ స్వామిగా మారాల్సిన అవసరం భారత్‌కు లేదు. ఏది ఏమయినా ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు అంతర్జాతీయ రాజకీయ యవనికను నియంత్రించే కీలక ఘట్టాలనటంలో సందేహం లేదు. భారత్ ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్); సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు- గురజాల శ్రీనివాసరావు -
వ్యవసాయ భవిష్యత్తుకు కొత్త ఊపిరి
భారత వ్యవసాయం వందల ఏళ్లుగా కరవులను, వరదలను, ధరల పతనా లను, విధాన మార్పులను తట్టుకుని నిల బడింది. అభిరుచులు, మార్కెట్లు, సాంకే తికతలు మారుతున్న కొద్దీ పంటలు వచ్చాయి, పోయాయి. కొన్ని పంటలు రైతులకు తాత్కాలిక ఊరటనిస్తే, కొన్ని వారిని అప్పుల్లో పడేశాయి. చరిత్ర చెప్పే నిజం ఏమిటంటే– సరైన విధానం, ముందుచూపు తోడైతే ఒక్క పంట కూడా ఊరు, దేశం ఆర్థిక పరిస్థితినే మార్చగలదు. ప్రపంచంలో వంట నూనెలకు డిమాండ్ పెరుగుతున్న ఈ కాలంలో, ఆ మార్పు తెచ్చే పంట ఆయిల్ పామ్. తెలంగాణకు ఆయిల్ పామ్ కేవలం ఒక కొత్త పంట కాదు– ఇది దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహం. ఒక గేమ్ ఛేంజర్ కాగల పంట.ప్రధాన ఆర్థిక వనరుతెలంగాణ ఏర్పడిన మొదటి పదేళ్లలో మిషన్ కాకతీయ లాంటి పథకాల ద్వారా సాగునీటిని వసతులని పునరుద్ధరించడం సబబే. కానీ కేవలం వరి, పత్తి పంటల పైనే ఆధారపడిన వ్యవసాయం వాంఛనీయం కాదు. రాష్ట్రం రెండో పదేళ్లలోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో, మన వ్యవసాయ భవిష్యత్తుకు ఒక కొత్త ఆధారం కని పిస్తోంది. ఆయిల్ పామ్‌ను ఒక చిన్న పంటగా చూడటం మానేసి, నర్సరీ నుంచి రిఫైనరీ దాకా పూర్తి వ్యవస్థను నిర్మించే కొత్త గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దీన్ని పునాదిగా చూడాల్సిన సమయం వచ్చింది.ఆయిల్ పామ్ ఎందుకింత ముఖ్యమో అర్థం కావాలంటే మనం మన దేశ సరిహద్దులు దాటి చూడాలి. జనాభాలో మన కంటే చాలా తక్కువగా ఉన్న ఇండోనేషియా, మలేషియా దేశాలు ఈ ఒక్క పంటతో తమ గ్రామాల రూపురేఖలనే మార్చేశాయి. సుమారు 28.3 కోట్ల జనాభా ఉన్న ఇండోనేషియా, దాదాపు 4.2 కోట్ల ఎక రాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తూ, ఏటా సుమారు 4.6 కోట్ల టన్నుల పామ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తోంది. ఆ దేశ జీడీపీలో ఆయిల్ పామ్ వాటా సుమారు 4.5 శాతం, ప్రత్యక్షంగా, పరోక్షంగా 16 లక్షలకు పైగా కుటుంబాలకు ఇది జీవనోపాధి.మలేషియా కథ కూడా ఇలాంటిదే. కేవలం 3.56 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం దాదాపు 1.4 కోట్ల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తూ, ఏటా సుమారు 2 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తోంది. 1970లు, 1980లలో రబ్బరు ధరలు పెరగకుండా, గ్రామాల్లో ఆదాయం తగ్గి నప్పుడు, మలేషియా వ్యూహాత్మకంగా ఆయిల్ పామ్ వైపు మళ్లింది. భద్రత–స్థిరత్వం 147 కోట్ల జనాభా ఉన్న మన భారత ప్రజానీక ఆశలు, తినే అలవాట్లు వేగంగా మారుతున్నాయి. మన దేశంలో పండించే వంట నూనె మన అవసరంలో సగం మాత్రమే తీరుస్తోంది. ప్రతి ఏటా సుమారు 130 లక్షల టన్నుల వంట నూనెలను బయటి నుంచి తెచ్చుకుంటున్నాం. కేవలం పామ్ ఆయిల్ కోసమే ఏటా సుమారు రూ.1 లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నాం. సూటిగా చెప్పాలంటే, మనం మన విలువైన విదేశీ మారకాన్ని బయటికి పంపి, దానికి బదులు అనిశ్చితిని తెచ్చుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా సరఫరాలో ఏ చిన్న ఆటంకమైనా, ఏ దేశాల మధ్య ఉద్రిక్తతైనా, అంతర్జాతీయ ధరలు పెరిగినా, దాని ప్రభావం నేరుగా మన వంట గదులపైనా, మన రైతులపైనా పడుతుంది.ఇలా బయటి నుంచి తెచ్చుకోవాల్సి రావడానికి కారణం మన రైతులకు సామర్థ్యం లేకపోవడం కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగును బాగా పెంచగల వాతావరణం, నేలలు ఉన్నాయి. అయినా, దేశం మొత్తం మీద కేవలం 10 లక్షల ఎకరాల్లోనే ఆయిల్ పామ్ సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, తక్కువ మొత్తంతో మొద లైనా తెలంగాణ ఇప్పటికే రెండో స్థానానికి చేరుకుంది. భద్రత, స్థిరత్వం ఇచ్చే ఈ పంటను చేపట్టడానికి తెలంగాణ రైతుల్లో ఉన్న ఆసక్తిని, సంసిద్ధతను ఇది చూపిస్తుంది.ఈ రోజు తెలంగాణలో సుమారు 2.8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది, అందులో అవిభక్త ఖమ్మం జిల్లా ఒక్కటే దాదాపు 1.35 లక్షల ఎకరాలు కలిగి ఉంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాబోయే సంవత్సరాల్లో ఈ సాగును 10 లక్షల ఎకరాలకు పెంచాలని రాష్ట్రం ఒక పెద్ద, కానీ సాధించగల లక్ష్యాన్ని పెట్టుకుంది.ఆయిల్ పామ్ తోట దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల పాటు దిగుబడి ఇస్తుంది. ఒకే పంటకోతపై, ఒకే మార్కెట్ ధరపై ఆధారపడే కాలానుగుణ పంటల్లా కాకుండా, ఏడాది పొడవునా తాజా పండ్ల గెలలు ఇస్తుంది. అంటే ఏడాదికోసారి వచ్చే పెద్ద మొత్తం కాదు, ప్రతి నెలా చేతికి డబ్బు అందుతుంది. తోటలు పూర్తి దిగుబడికి వచ్చాక, దిగుబడి, నిర్వహణను బట్టి, ఇప్పటి ధరల ప్రకారమే రైతులు ఎకరాకు ఏటా రూ.2 లక్షల వరకు సంపాదించ గలుగుతున్నారు. తాజా పండ్ల గెలల ధర టన్నుకు రూ. 22,000 నుంచి రూ.24,500 వరకు ఉంటూ, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ పామ్ (ఎన్ ఎంఈఓ–ఓపీ) లాంటి పథ కాల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి తోడ్పాటునందిస్తుండటంతో, చాలా గ్రామీణ కుటుంబాలకు ఆయిల్ పామ్ నెలనెలా జీతం లాంటిదిగా మారింది. దీనికి తోడు, మొక్కలు, ఇన్ పుట్లు, మొదట్లో అయ్యే ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు సుమారు రూ.50,000 వరకు సబ్సిడీ ఇస్తోంది. దీనితో పూర్తి దిగుబడి రాకముందు మొదటి మూడు, నాలుగేళ్లలో రైతులపై పడే భారం తగ్గుతుంది.విత్తనం నుంచి నూనె ప్యాకెట్ దాకా...ఆయిల్ పామ్‌లో ఏదీ వృథా పోదు. పండు నుంచి ముడి పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ తీస్తారు. పీచు, పెంకులను కరెంటు తయారీకి వాడొచ్చు. మిగిలిన వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా, పశుగ్రాసంగా మార్చొచ్చు. కోకో, జాజికాయ, మిరియాలు, పూలు లాంటి నీడలో పెరిగే పంటలను కలిపి వేసుకుంటే, ఆయిల్ పామ్ తోటలు ఒకే పంట తోటలుగా కాక, రకరకాల ఆదాయాలు ఇచ్చే తోటలుగా మారతాయి.పొలం గట్టు దాటి కూడా, ఆయిల్ పామ్ వల్ల ఉద్యోగాలు, వ్యాపారాలు పుడతాయి. నర్సరీలు, ఇన్ పుట్లు అమ్మేవారు, కోత సేవలు, రవాణా చేసేవారు, ఫ్రూట్ కలెక్షన్ కేంద్రాలు, క్రషింగ్ యూనిట్లు, రిఫైనరీలు, ప్యాకింగ్ యూనిట్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు, వీళ్లందరూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భాగమై ఉపాధిని పెంచుతారు.అశ్వారావుపేట, దమ్మపేట లాంటి ప్రాంతాల్లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇప్పటికే వ్యాపార కేంద్రాలుగా మారడం చూశాం. సిద్దిపేటలో కొత్త ఫ్యాక్టరీ ఇప్పటికే ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా కొణిజర్లలో గోద్రెజ్ సంస్థ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. ‘విత్తనం నుంచి నూనె ప్యాకెట్ దాకా‘ ఒకే గొలుసుగా చేయడమే తెలంగాణ వ్యూహం.ఆయిల్ పామ్ పర్యావరణానికి హానికరం అని కొందరు అంటున్నారు. ఈ అభిప్రాయం ఎక్కువగా వేరే దేశాల్లో సున్నితమైన అడవులు, తడి నేలల్లో పెద్ద ఎత్తున అడవులను కొట్టేసిన అనుభవాల నుంచి వచ్చింది. తెలంగాణ పరిస్థితి పూర్తి భిన్నం. మనం అడవు లను కొట్టేయడం గురించి మాట్లాడటం లేదు; తక్కువ దిగుబడి ఉన్న, వర్షాధార లేదా ఒకే పంట పండే భూములను సరైన నీటి వాడకంతో మంచి విలువ ఇచ్చే చెట్ల తోటలుగా మార్చడం గురించి మాట్లాడుతున్నాం. సరిగ్గా ప్రణాళిక వేసుకుంటే, ఆయిల్ పామ్ తోటలు పచ్చదనాన్ని పెంచుతాయి, గాలిలో కార్బన్‌ను ఎక్కువగా పీల్చుకుంటాయి, కొండ ప్రాంతాల్లో నేల కొట్టుకుపోకుండా చూస్తాయి, తేమను నిలుపుతాయి. సహజ అడవులను కొట్టేయకుండా కఠినంగా ఉంటూ, అంతర పంటలు, జీవవైవిధ్యానికి మేలు చేసే పద్ధతులను ప్రోత్సహిస్తూ ఉంటే, ఆయిల్ పామ్ తెలంగాణలో పర్యావరణానికి శత్రువు కాదు, స్నేహితుడు కాగలదు.- తుమ్మల నాగేశ్వర రావు, వ్యాసకర్త, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి -
చైనా ఫ్లయింగ్ పవర్ స్టేషన్
అత్యాధునిక పద్ధతులతో మౌలికరంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న చైనా, విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ వినూత్న ప్రయోగాలకు తెరలేపింది. ఇటీవల సిచువాన్ ప్రావిన్స్‌లోని యిబిన్ ప్రాంతంలో భారీ ఎయిర్ షిప్‌ను ఆకాశంలోకి ఎగురవేసింది. దీనికి ‘ఫ్లయింగ్ విండ్ పవర్షిప్ ఎస్–2000’ అని పేరు పెట్టింది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఫ్లయింగ్ పవర్ స్టేషన్‌గా గుర్తింపు పొందింది. ఇది గాలి వేగాన్ని ఉపయోగించుకుని విద్యుత్తును ఉత్పత్తి చేసే సాంకేతికత. సాధారణ విండ్ మిల్లులు భూమికి తక్కువ ఎత్తులోఉంటాయి. అక్కడ గాలి వేగం తక్కువగా ఉంటుంది. కానీ ఎస్–2000 వంటి వ్యవస్థలు సుమారు 300 నుండి 600 మీటర్ల ఎత్తుకు ఎగిరి, అక్కడ వేగంగా వీచే గాలులను ఉపయోగించుకుంటాయి. ఈ ఎత్తులో గాలి నుండి లభించే శక్తి భూమిపై కంటే 3 నుండి 4 రెట్లు ఎక్కువ.సుమారు 60 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు, 40 మీటర్ల ఎత్తు ఉండే ఈ ఎయిర్‌షిప్ హీలియం నింపిన తేలియాడే వేదిక. భూమిపై కంటే ఆకాశంలో గాలి వేగం స్థిరంగా, బలంగా ఉంటుంది, కాబట్టి ఇది ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. భారీ విండ్ టవర్లు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి, నిర్మాణానికి అయ్యే ఖర్చు, ఇనుము వాడకం తగ్గుతుంది. వీటిని అవసరమైన చోటికి సులభంగా తీసుకువెళ్లవచ్చు.ఎస్ –2000 వంటి వ్యవస్థలు ప్రధానంగా రెండు రకాలుగా విద్యుత్తును తయారు చేస్తాయి: ఆన్–బోర్డ్ జనరేషన్ ఒకటైతే, గ్రౌండ్–బేస్డ్ జనరేషన్ రెండోది. ఆన్–బోర్డ్ పద్ధతిలో షిప్ రెక్కలకు ఉండే చిన్న టర్బైన్లు ఆకాశంలో గాలి వేగానికి తిరిగి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. గ్రౌండ్–బేస్డ్ పద్ధతిలో షిప్ ఆకాశంలో ఎనిమిది అంకె ఆకారంలో తిరుగుతూ కేబుల్‌ను బలంగా లాగుతుంది. దీంతో భూమిపై ఉన్న డ్రమ్ము తిరుగుతుంది. ఆ డ్రమ్ముకు అనుసంధానించిన జనరేటర్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.ఒక సాధారణ విండ్ టవర్ నిర్మించడానికి వందల టన్నుల స్టీల్, కాంక్రీట్ అవసరం కాగా, ఎస్–2000కు అందులో 10% మెటీరియల్ ఉంటే సరిపోతుంది. కేవలం ఒక చిన్న బేస్ స్టేషన్ మాత్రమే భూమిపై ఉంటుంది, కాబట్టి మిగిలిన భూమిని వ్యవసాయానికి వాడుకోవచ్చు. ఈ షిప్ బాడీని కార్బన్ ఫైబర్‌తో తయారు చేస్తారు. ఇది ఉక్కు కంటే ఐదు రెట్లు బలంగా ఉంటుంది. అలాగే బరువు చాలా తక్కువ.భారత్ పరిస్థితిభారతదేశం పవన శక్తి ఉత్పత్తిలో ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో మారు మూల గ్రామాల్లో గ్రిడ్ కనెక్షన్ లేని చోట్ల వీటిని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా లదాఖ్ వంటి హిమాలయ ప్రాంతాల్లో సాధారణ విండ్ టవర్లు కట్టడం చాలా కష్టం. అక్కడ ఈ ‘ఫ్లయింగ్ షిప్స్’ను సులభంగా తరలించి విద్యుత్ సమస్యను తీర్చవచ్చు.అయితే, మన దేశంలో ఎయిర్ ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా ఉంటాయి. 2,000 మీటర్ల ఎత్తులో వీటిని ఎగరవేయడానికి డీజీసీఏ నుండి ప్రత్యేక అనుమతులు కావాలి. రుతుపవనాల సమయంలో వీచే భారీ గాలులు, తుఫానుల నుండి ఈ షిప్స్‌ను రక్షించడం ఒక సవాలు. ఏది ఏమైనా ఫ్లయింగ్ పవర్ స్టేషన్స్ ఆకాశంలో వీచే గాలి నుండి శక్తిని పొందే సాంకేతికతలో ఒక ముఖ్యమైన మైలురాయి.– తరిగొప్పుల వీఎల్ఎన్ మూర్తి, జర్నలిస్ట్ -
రైతు కాళ్ల కిందే కర్మాగారం
హార్మూజ్ జలసంధి మూసుకుపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధర ఒక్కసారిగా టన్నుకు దాదాపు వెయ్యి డాలర్లకు పెరిగింది.దేశ యూరియా అవసరాల్లో నాలుగోవంతును దిగుమతి చేసుకునే భారత్‌కు ఇది దిగుమతుల మీద ఆధారపడే పాత భయాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే నూతన యూరియా పెట్టుబడి విధానం రూపంలో స్పందన వచ్చింది. దేశం ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న కోటి టన్నుల యూరియాను ఇక్కడే తయారు చేసేందుకు ఎనిమిది–తొమ్మిది కొత్త గ్యాస్ ఆధారిత కర్మాగారాలను నెలకొల్పడమే దీని లక్ష్యం.వేసిన నత్రజని పనికొచ్చేనా?తర్కంగా చూస్తే ఇది సరైన నిర్ణయమే. కానీ ఆ తర్కమే అసలు సమస్య. సరఫరా సంక్షోభం వచ్చినప్పుడు మన వ్యవసాయ విధానం చూపే ప్రతిస్పందన ఒక్కటే– ఎరువును మరింత ఎక్కు వగా ఉత్పత్తి చేయడం. కానీ ఎవరూ అడగని ప్రశ్న ఒకటుంది. పద్నాలుగు కోట్ల రైతు కుటుంబాలు, ప్రపంచంలోనే అతిపెద్దపశు సంపద, ప్రతి శీతాకాలంలో తగలబెట్టే కోట్లాది టన్నుల పంట వ్యర్థాలు– ఇవన్నీ ఉన్న దేశం ఇంత భారీ మొత్తంలో కృత్రిమ నత్రజనిని ఎందుకు దిగుమతి చేసుకోవాలి?గత అరవై ఏళ్లుగా మన వ్యవసాయ విధానాన్ని ఒక నమ్మకం శాసిస్తోంది– ప్రతి ఉత్పాదకత సమస్యా ఎరువుల సమస్యే; దాన్ని మరిన్ని ఎరువులు ఉత్పత్తి చేయడం, దిగుమతి చేయడం, రాయితీ ఇవ్వడం ద్వారానే పరిష్కరించాలి. హరిత విప్లవం కాలంలో ఇది నిజమే. అప్పుడు నత్రజని కొరత ఒక అడ్డంకి. కానీ ఇవాళ మన అసలు సమస్య నత్రజని కొరత కాదు; పంటకు నత్రజనినిఅందించే నేల ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రభుత్వ నేల ఆరోగ్య కార్డుల డేటానే చూస్తే– దేశంలో దాదాపు 64 శాతం నేలల్లో నత్రజని తక్కువ, 48.5 శాతం నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువ. మరో గణాంకం మరింత భయపెడుతుంది. హరిత విప్లవం తొలినాళ్లలో ఒక కిలో ఎరువుకు దాదాపు పదమూడు కిలోల అదనపు ధాన్యం వచ్చేది– అంటే 1:13 నిష్పత్తి. ఇవాళ అది 1:2.7కి పడి పోయింది. అంటే అదే కిలో ఎరువు ఇప్పుడు నాలుగో వంతు ధాన్యాన్ని మాత్రమే ఇస్తోంది. మనం వేసే నత్రజనిలో అరవై శాతానికి పైగా పంటకు అందకుండా గాలిలోకి, భూగర్భ జలాల్లోకి కొట్టుకుపోతోంది. నత్రజని చౌకగా దొరకడంతో రైతులు దాన్నే మోతాదు మించి వాడుతున్నారు; ఫలితంగా ఎన్ పీకే(నత్రజని, భాస్వరం, పొటాషియం) నిష్పత్తి 4:2:1 ఉండాల్సిన చోట దాదాపు 11:4:1కి చేరింది. ఒక ప్రాథమిక తేడాను మనం మరచిపోయాం. పంటకు పోషకాలు అందించడం వేరు, నేల సారాన్ని కాపాడటం వేరు. యూరియా పంటకు తక్షణ ఆహారం అందిస్తుంది. కానీ నేలలోసేంద్రియ కర్బనం, సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, వానపాములు– వీటిని అది పెంచదు. నిజానికి మోతాదు మించిన నత్రజని వీటిని దెబ్బతీస్తుంది. ఈ జీవరాశే నేలకు నీటిని పట్టి ఉంచే శక్తిని, గాలి ఆడే నిర్మాణాన్ని, పోషకాలను చక్రంలా తిప్పే సామర్థ్యాన్ని ఇస్తుంది. వీటిని రసాయనిక ఎరువులతో తిరిగి నిర్మించలేం– ఎందుకంటే ఎన్పీకే అనేది కర్బనం కాదు, జీవం అసలే కాదు.నిజంగా ఇది స్వావలంబనా?నూతన యూరియా విధానం చెప్పే స్వావలంబన కూడా చాలావరకు భ్రమే. యూరియా అమోనియా నుంచి, అమోనియా సహజ వాయువు నుంచి తయారవుతాయి. ఆ సహజ వాయువులో చాలా భాగం మనం ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) రూపంలో దిగుమతి చేసుకునేదే. యూరియా ఉత్పత్తి వ్యయంలో ఇది 70–80 శాతం. అంటే కొత్త కర్మాగారం అంటే దిగుమతి చేసుకున్న వాయువును ఇక్కడ యూరియాగా మార్చే యంత్రం మాత్రమే. మన ఆధారపడటం పోలేదు, కేవలం ఒక మెట్టు పైకి జరిగింది. భాస్వరం, పొటాష్ విషయంలో అయితే మనం దాదాపు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడతాం.అమెరికా ఉదాహరణ చూడండి: ఆ దేశం నత్రజనిలో స్వావలంబన సాధించిన మాట నిజమే, కానీ కర్మాగారాలు కట్టడం వల్ల కాదు. దానికి సొంత షేల్ గ్యాస్ ఉంది; మొక్కజొన్న–సోయాబీన్ మార్పిడి సాగులో పప్పుజాతి పంట తనకు తానే నత్రజనిని స్థిరీక రించుకుంటుంది. ఈ రెండూ మనకు లేవు. అక్కడి వాతావరణం కూడా వేరు. మన ఉష్ణోగ్రతలకు సేంద్రియ కర్బనం తొందరగా కోల్పోతాం. అక్కడ సంవత్సరానికి ఒక పంట కాలమే, రెండోకాలంలో నేల పునర్జీవనం కావటానికి అవకాశం ఉంది. కాబట్టి అమెరికా బాటలో కేవలం కర్మాగారాల స్థాపనను కాపీ చేస్తే, భారం మిగులుతుంది తప్ప భద్రత రాదు.నిజమైన స్వావలంబన అంటే మనం అదుపులో ఉంచుకోగల వనరుల నుంచి పంట అవసరాలను తీర్చుకోవడం. పప్పు« దాన్యాలు, జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు, అజొల్లా ద్వారా జీవ నత్రజని స్థిరీకరణ, పంట వ్యర్థాల పునర్వినియోగం, పశువుల ఎరువు, అన్నిటికీ ఆధారమైన నేలలో సేంద్రియ పదార్థం– ఇవి పెరిగితే వేసే ప్రతి కిలో ఎరువూ మరింత సమర్థంగా పనిచేస్తుంది. జీవసారం పెంచితే ప్రోత్సాహకాలుఇప్పుడు డబ్బుల మాట. దేశ ఎరువుల రాయితీ దాదాపు రూ.1.7 లక్షల కోట్లు; అందులో యూరియాదే రూ.1.19 లక్షల కోట్లు. తగ్గిపోతున్న రసాయనిక ఎరువుల సామర్థ్యం, వృథా అవు తున్న సగం నత్రజని– వీటిని చూస్తే ఇది తక్కువ ప్రయోజనం ఇచ్చే ఖర్చు. ఈ రాయితీలో సగాన్ని– అంటే దాదాపు 85 వేల కోట్లను– నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి మళ్లిస్తే ఏమవుతుంది?ఒక టన్ను యూరియా ఒక్క సీజన్ కే అయిపోతుంది, మళ్లీ కొనా ల్సిందే. కానీ నేలలో పెరిగిన సేంద్రియ కర్బనం ఏళ్ల తరబడి నిలు స్తుంది. ప్రతి ఏటా దిగుబడిని, నీటి నిల్వను, ఎరువుల సామర్థ్యాన్ని పెంచుతుంది. నేల బాగుపడిన కొద్దీ దానికి కావాల్సిన నత్రజని తగ్గుతుంది, దాంతోపాటే రాయితీ భారమూ తగ్గుతుంది.అందుకే ఒక జాతీయ/రాష్ట్ర స్థాయి నేల ఆరోగ్య పునరుద్ధరణ మిషన్ అవసరం. నేలలో సేంద్రియ కర్బనం, జీవసారం పెరిగిన కొద్దీ రైతుకు నేరుగా ప్రోత్సాహకం అందాలి. గ్రామ స్థాయి కంపోస్ట్, పంట వ్యర్థాల పునర్వినియోగం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో జీవ ఎరువుల యూనిట్లు– వీటిని ఉపాధి హామీ పథకం, ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానం చేయాలి.‘రసాయనిక ఎరువులు లేకుండా దేశాన్ని పోషించలేం’ అనే వాదన రావచ్చు. ఎరువులను పూర్తిగా వదిలేయాలని అనడం లేదు. మొదట్లో రసాయనికం, జీవసంబంధం రెండింటినీ కలిపి వాడే సమీ కృత పోషక యాజమాన్యమే మార్గం. భారత్ తదుపరి వ్యవసాయ విప్లవం మరిన్ని రసాయనిక ఎరువులపై కాదు– ప్రాణమున్న నేల లను తిరిగి నిర్మించడంపై ఆధారపడాలి. ఏ ఓడరేవు, గ్యాస్ పైప్‌లైన్ కోసం మనం ఎదురుచూడనక్కర్లేదు– మన అతిపెద్ద ఎరువుల కర్మాగారం ప్రతి రైతు కాళ్ల కింద, నేల జీవంలోనే ఉంది. -వ్యాసకర్త సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) కార్యనిర్వాహక సంచాలకులు-డా‘‘ జి.వి.రామాంజనేయులు -
నిర్మాణాత్మక రాజకీయాలు కావాలి!
ప్రజా విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే రాజకీయాలు పక్షపాతాన్ని అధిగమించాలి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు జవాబు దారీగా ఉండటం, పారదర్శకంగా పని చేయడం, ప్రజల ప్రయోజనాలను అన్నింటికంటే ముందు ఉంచడం కూడా అంతే ముఖ్యమైన అంశాలు. ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసం అత్యంత విలువైన సంపద. ఒకసారి ఆ విశ్వాసం దెబ్బతింటే దానిని తిరిగి సంపాదించడం చాలా కష్టం.దేశంలో ఏదైనా పెద్ద ప్రజా వివాదం, అవినీతి ఆరోపణ లేదా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే సంఘటన వెలుగులోకి వచ్చిన ప్రతిసారి దాదాపు ఒకే పరిస్థితి కనిపిస్తున్నది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటాయి. పార్లమెంట్, శాసనసభల సమావేశాలు వాగ్వాదాలతో స్తంభిస్తాయి. టెలివిజన్ చర్చలు రోజంతా వేడెక్కుతాయి. సోషల్ మీడియాలో కూడా తీవ్ర వాదోపవాదాలు సాగుతాయి. ప్రజల్లో కొంతకాలం ఆగ్రహం వ్యక్తమవుతుంది. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ చర్చలు తగ్గిపోతాయి. వార్తల్లో కొత్త అంశాలు వస్తాయి. చివరకు అసలు సమస్య మాత్రం అలాగే మిగిలిపోతుంది. ఈ పరిస్థితి ప్రజల్లో వ్యవస్థపై నమ్మకాన్ని క్రమంగా తగ్గిస్తుంది.సమాజంలో ఉన్న విద్యావంతులు, నిజాయితీ గల వ్యక్తులు, నిష్పక్షపాతులు, సమర్థులు రాజకీయాలకు దూరంగా ఉండటాన్ని ఎంచుకున్నారు. ఇది సరికాదు. ప్రజాస్వామ్యం నిజమైన అర్థంలో విజయవంతం కావాలంటే ప్రజాసేవ పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తులు ప్రజా జీవితంలోకి రావాలి.పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు మన దేశంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారాయి. ఇవి యువతలో ప్రతిభపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. ప్రభుత్వ నియామక వ్యవస్థల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తాయి. దేశ భవిష్యత్తుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే ఈ సమస్యను రాజకీయ కోణంలో మాత్రమే చూడటం సరైంది కాదు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తే 2004–2014 మధ్య కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్ర సంస్థల్లో కూడా ప్రశ్నపత్రాల లీకేజీ సంఘటనలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2, అరుణాచల్ ప్రదేశ్‌లో 1, అస్సాంలో 6, బిహార్‌లో 5, ఢిల్లీ, కేంద్ర సంస్థల్లో 27, గుజరాత్లో 8, హరియాణాలో 5, హిమాచల్ ప్రదేశ్‌లో 4, జమ్మూ కశ్మీర్లో 5, జార్ఖండ్‌లో 2, కర్ణాటకలో 6, కేరళలో 2, మహారాష్ట్రలో 9, మణిపూర్‌లో 1, మధ్యప్రదేశ్‌లో 7, ఒడిశాలో 3, పంజాబ్‌లో 2, రాజస్థాన్ లో 10, తమిళనాడులో 2, తెలంగాణలో 3, త్రిపురలో 1, ఉత్తరాఖండ్‌లో 3, పశ్చిమ బెంగాల్లో 10, ఉత్తరప్రదేశ్‌లో 9 సంఘటనలు నమోదైనట్లు సమాచారం. ఈ వివరాలు చూస్తే ప్రశ్నపత్రాల లీకేజీ సమస్య ఏ ఒక్క రాష్ట్రానికి, ఏ ఒక్క ప్రభుత్వానికి లేదా ఏ ఒక్క రాజకీయ పార్టీకి మాత్రమే పరిమితం కాదని అర్థమవుతుంది.అందువల్ల ఈ అంశంపై రాజకీయ విమర్శలు చేయడం కంటే శాశ్వత పరిష్కారాలపై దృష్టి పెట్టడం అవసరం. ప్రతి ప్రభుత్వం నేరస్థులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆధునిక సాంకేతిక భద్రతా వ్యవస్థలు, డిజిటల్ రక్షణ, స్వతంత్ర పర్యవేక్షణ, కఠిన చట్టాలు, పారదర్శక నియామక విధానాలు అమలు చేయాలి. పరీక్షల నిర్వహణలో ప్రతి దశను అత్యంత భద్రతతో నిర్వహించే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలి.దేశ నిర్మాణంలో ప్రభుత్వాల పాత్ర ఎంత ముఖ్యమో, బాధ్యత గల పౌరుల పాత్ర కూడా అంతే ముఖ్యమైనది. ఉపాధ్యాయులు, మాజీ న్యాయమూర్తులు, పదవీ విరమణ పొందిన అధికారులు, పాత్రికేయులు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక సంస్థలు తమ అనుభవాన్ని దేశ ప్రయోజనాల కోసం వినియోగించాలి. సమస్యలను మాత్రమే చూపించడం కాకుండా వాటికి ఆచరణాత్మక పరిష్కారాలను కూడా సూచించాలి. సమాజం మొత్తం కలిసి పని చేసినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది.- పి. వేణుగోపాల్ రెడ్డి, వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ -
సహజమైనదే చేయాలి!
ఒక జెన్ గురువును ఓ కుటుంబం ఇంటికి ఆహ్వానించింది. ఆయన కోసం అద్భుతమైన విందు సిద్ధం చేశారు. సరిగ్గా పన్నెండు గంటలకు గురువు గారు వచ్చారు. ఇంట్లో ఉన్నవారంతా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత భోజనం వడ్డించారు. ఎంతో శ్రద్ధతో వండిన వంటకాలను గురువుగారు బాగా ఆస్వాదిస్తూ తిన్నారు. చివరగా చేయి కడుక్కునే సమయంలో, ‘అన్నీ శాకాహారమే వండారేం? చిన్న చేప ముక్క అయినా కలిపి ఉంటే బాగుండేది కదా!’ అన్నారు.ఆహ్వానించిన వారు ఆలోచనలో పడ్డారు. ‘మీరు మాంసాహారం తినరని అనుకున్నాం’ అని నమ్రతగా చెప్పారు. గురువు తల పట్టుకున్నారు. ‘మీ ముందస్తు అంచనాల్లో నన్ను పెట్టి బంధించకండి. నాకు ఊపిరి ఆడదు’ అన్నారు. ‘మాకు అర్థం కాలేదు గురుదేవా! ఇతర మనుషులకు, జంతువులకు, చివరికి చెట్టు చేమలకు కూడా హాని చేయకూడదు అని జెన్ సిద్ధాంతం చెప్తోంది కదా?’ అని అడిగారు.‘అవును, దానికి నేను ఇప్పుడు చేప తినాలి... తినకూడదు అనుకోవడానికి సంబంధం ఏమిటి? మనం మనలాగే ఉండాలి. మనకు ఏది సహజమో అదే చేయాలి. అనవసరమైన నటనలు వద్దు. వదులుకోవాలనే ఆలోచన బలంగా ఉంటే, కాలక్రమేణా అనవసరమైన విషయాల నుండి బయట పడవచ్చు. ఇది నా అనుభవం కూడా. బలవంతంగా శాకాహారం మాత్రమే తింటూ లోపల బాధ పడటం కంటే, ఆశ కలిగినప్పుడు మాంసాహారం తినేసి, ఆ క్షణంలో జీవించడమే అసలైన జెన్. వదులు కోవాలనే సంకల్పం దృఢంగా ఉంటే చాలు, మిగిలినది సహజంగా దానికదే జరుగుతుంది’ అన్నారు గురువుగారు.– యామిజాల జగదీశ్ -
పరిష్కారమా... కొత్త సవాలా?
2026 ‘నీట్’ ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా ఆందో ళనకు దారితీశాయి. ఫలితంగా పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి నీట్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ప్రశ్నాపత్రాన్ని కాగితం నుంచి కంప్యూ టర్కు మార్చడమే సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని గుర్తించాలి. అసలు సమస్య పరీక్షా విధానంలో కాదు, ప్రశ్నపత్రాల గోప్యత, భద్రత, జవాబుదారీతనం వంటి వ్యవస్థాగత లోపాల్లో ఉంది. అంతర్జాతీయ అనుభ వాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్షలలో ఒకటైన చైనా గావ్కావ్, దక్షిణ కొరియా సీఎస్ఏటీ ఇప్పటికీ పేపర్–పెన్సిల్ విధానంలోనే అత్యంత కట్టు దిట్టమైన భద్రతతో విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. దీనివల్ల పరీక్షా విధానం కంటే పటిష్టమైన భద్రతా వ్యవస్థ, పారదర్శకత, క్రమశిక్షణే విశ్వస నీయ పరీక్షలకు పునాది అని స్పష్టమవుతోంది. నీట్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహిస్తే, కోట్లాది మంది విద్యార్థులను ఒకే సమయంలో పరీక్షించడం సాధ్యం కాదు. అందువల్ల బహుళ షిఫ్టులు తప్పనిసరి అవుతాయి. జేఈఈ మెయిన్‌లో కనిపించినట్లుగా వివిధ షిఫ్టుల్లో ప్రశ్న పత్రాల క్లిష్టతలో తేడాలు రావడం, నార్మలైజేష¯Œ పై వివాదాలు తలెత్తడం వల్ల సమాన ప్రతిభ కలిగిన విద్యార్థులకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల శాట్, జీఆర్ఈ వంటి పరీక్షల్లో ఉపయోగించే ఐటమ్ రెస్పాన్స్ థియరీ వంటి శాస్త్రీయ మనో కొలమాన పద్ధతులను అధ్యయనం చేసి అమలు చేయడం మరింత సముచితం.కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో మరో ప్రధాన సవాలు డిజిటల్ అంతరం. పట్టణ విద్యార్థులతో పోలిస్తే గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు కంప్యూటర్ వినియోగం, ఆన్లైన్ పరీక్షల అనుభవం తక్కువగా ఉండే అవకాశం ఉంది. వైద్య విద్య వంటి అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షలో సాంకేతిక పరిజ్ఞాన పరిచయం విద్యార్థి ప్రతిభను ప్రభావితం చేయకూడదు. కాబట్టి ఆన్లైన్ విధానాన్ని అమలు చేయాలంటే ముందుగా దేశవ్యాప్తంగా సమాన డిజిటల్ మౌలిక సదుపాయాలు, శిక్షణ, మాక్ పరీక్షలు అందుబాటు లోకి తీసుకురావడం అత్యవసరం. పరీక్షపై నమ్మకాన్ని పునరుద్ధరించడం. ప్రశ్నాపత్రాల భద్రతను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లడం, లీకేజీలకు పాల్పడిన వారిపై వేగంగా కఠిన చర్యలు తీసుకోవడం, అత్యవసరం. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల్లో సంస్కరణలు హడా వుడిగా కాకుండా సమగ్ర ప్రణాళికతో చేపట్టాల్సిన అవసరం ఉంది.– ఏటూరి శేఖర్ శర్మ, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి -
పిల్లలకు కాదు... పాఠం పెద్దలకే!
ఒక కాలానికి సరిపోయిన ఆలోచనలు, నేడు ప్రశ్నించకుండా సత్యాలుగా మిగిలిపోతున్నాయి. ఉదాహరణకు, పిల్లవాడు ఒక సమస్యకు కొత్త పరిష్కారం చెబితే, ‘మేం ఇన్నేళ్లుగా ఇలాగే చేస్తున్నాం’ లేదా ‘అందరూ ఇలానే చేస్తున్నారు’ అనే ఒక్క వాక్యంతో ఆ ఆలోచనను పక్కన పెట్టేస్తాం. ఆ పరిష్కారం సరైందా, కాదా అని పరిశీలించే ముందే, అది కొత్తదనే కారణంతో తిరస్కరిస్తాం. అలా ఓడిపోతు న్నది కొత్త ఆలోచన కాదు; గెలుస్తున్నది పాత అలవాటు.అందుకే ప్రపంచం మారుతున్నా, మన సమాధానాలు మాత్రం అలాగే మిగిలిపోతున్నాయి. ఫలితంగా అసలు ప్రశ్న పిల్లలు ఏమి నేర్చుకోవాలనేది కాదు; పెద్దలు ముందుగా ఏమి వదిలే యాలనేదే!‘పిల్లలు నేర్చుకున్నదాన్ని వదలాలి (ఆన్లెర్న్), కొత్తగా ఆలోచించాలి’– ఈ మధ్య విద్యా చర్చల్లో బాగా వినిపిస్తున్న మాట. ఇక్కడ ‘వదలడం’ అంటే నేర్చుకున్న జ్ఞానాన్ని మర్చిపోవడం కాదు; కాలం చెల్లిన ఆలోచనా విధానాలను ప్రశ్నిస్తూ కొత్త దృక్ప థాన్ని స్వీకరించడం. కానీ ఈ ఆలోచనను మరో కోణంలో చూడాల్సిన అవసరం ఉంది.పిల్లల దగ్గర వదిలేయాల్సినంత పాత నమ్మకాలు ఏము న్నాయి? వాళ్లు మొదటిసారి ప్రపంచాన్ని చూస్తున్నారు; పాత కళ్లద్దాలు మాత్రం మన పెద్దలవే. వాటిని వాళ్లకు అందించింది మనమే. కాబట్టి ఇప్పుడు ప్రశ్న– ‘పిల్లలు ఏం నేర్చుకోవాలి?’ అని కాదు; ‘మనం ముందుగా ఏ పాత నమ్మకాలను వదిలించు కోవాలి?’ అనేది. ఒకప్పుడు ఇవి విజయానికి మార్గదర్శకాలుగా ఉండి ఉండొచ్చు. కానీ వాటిని శాశ్వత సత్యాలుగా మార్చింది మనమే.ఇది ఎందుకు అంత కష్టం?ఒక నమ్మకాన్ని వదలడం అంటే, దాన్ని పట్టుకుని జీవించిన మన సొంత గతాన్నే ప్రశ్నించడం. ‘నేను ఇలా పెరిగాను, నేను బాగానే ఉన్నాను కదా’ అనే భావన మనలో బలంగా ఉంటుంది. ఆ నమ్మకాన్ని వదిలేస్తే, మన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, రాజీలు అన్నీ వృథా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇది దురుద్దేశ్యం కాదు; తెలిసిన దానిపై ఉండే భద్రతా భావం. తల్లిదండ్రులు, ప్రతి ఉపాధ్యాయుడు ఒకప్పుడు ఒక వ్యవస్థ గుండా వచ్చినవారే. వాళ్ల మీద కూడా ఎవరో ఒక ముద్ర వేశారు. ఇప్పుడు వాళ్లు చేస్తున్నది– తమకు వేసిన అదే ముద్రను, తెలియకుండానే, తర్వాతి తరానికి బదిలీ చేస్తున్నారు. ప్రతి కాలం తన సమస్యలకు తన సమాధానాలు సృష్టించుకుంటుంది. కలంతో పాటూ సమాధా నాలూ మారాలి.ప్రపంచ ఆర్థిక వేదిక ప్రకారం, 2030 నాటికి ఉద్యోగ నైపుణ్యాల్లో 39% మారిపోతాయి. ఈ రోజు నేర్పే సగం నైపుణ్యాలు అప్పటికి పనికిరాకపోవచ్చు. అందుకోసం సిలబస్ మార్చడం సరిపోదు; దాన్ని బోధించే వారి ఆలోచనా విధానం కూడా మారాలి. వ్యవస్థ ఎంత మారినా, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేది మను షులే– ఇంట్లో తల్లిదండ్రులు, తరగతి గదిలో ఉపాధ్యాయులు. వ్యవస్థ ఒక వైపు మారుతుంటే, పెద్దల ఆలోచనలు అక్కడే నిలిచి పోతే, ఆ మార్పు అసంపూర్ణంగా మిగిలిపోతుంది. కాబట్టి పిల్లల భవిష్యత్తును మార్చేది కొత్త సిలబస్ మాత్రమే కాదు; పెద్దల మనస్తత్వంలో వచ్చే చిన్న మార్పు కూడా. పిల్లలు రేపటి తరాన్ని నిర్మించాలంటే, ఈరోజు పెద్దలు నిన్నటి కళ్లద్దాలను వదిలించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.– వంగవోలు రవి, ఉపాధ్యాయుడు -
చిద్రూపమే జగత్తు!
దీర్ఘతముడనే ఒక ముని అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతడికి ఇద్దరు కొడుకులు. తండ్రికి సపర్యలు చేయడం వారి దినచర్య. కాలం తీరి కొన్నాళ్ళకు దీర్ఘతముడు మరణించాడు. విధిగా నిర్వర్తించాల్సిన ఉత్తరకర్మలన్నిటినీ పెద్దకొడుకు భక్తితో నిర్వర్తించాడు. అంతా సజావుగా జరిగాక, తమ్ముడి కోసం చూడగా, అతడు ఆశ్రమంలో కనిపించలేదు. అడవిలో వెదికాడు. ఒక పెద్ద చెట్టు మొదట్లో కూర్చుని శోకిస్తూ కనిపించాడు తమ్ముడు. అన్న హృదయం ద్రవించింది. తమ్ముడి దగ్గరికి వెళ్ళి, ఆప్యాయంగా తల నిమిరి ఇలా చెప్పాడు:‘పూర్వం వైరోచనుడనే ఒక రాజు ఉండేవాడు. దీర్ఘకాలం వసుధను పాలించాడు. ప్రపంచంలో లభించే అన్ని సుఖాలను తృప్తి తీరా అనుభవించాడు. ఒకనాడు రాజప్రాసాదపు మేడపై నిలబడి ఆలోచిస్తూ ‘ముల్లోకాలలో అద్భుత కారణంబును, సకల భోగాలకు ఆలవాలము అయిన ఈ భూమిలో, సౌఖ్యాలు అస్థిరములైనవే! అనుభవించే పదార్థాన్నే మళ్ళీ మళ్ళీ అనుభవించి, దినదినమూ భ్రాంతుడనై తిరుగుతూ ఉండడమేగా ఇక్కడ ఎన్నాళ్ళైనా! రాత్రి, పగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఆగేవి కావు. చెప్పిందే చెప్పడం అన్నట్లుగా కాలం చర్వితచర్వణం. ఈ సుఖాలన్నీ ప్రాజ్ఞుల దృష్టిలో అల్పాలే’ అని తలచి బాల్యంలో తన తండ్రి చెప్పిన మాటలను మననం చేసుకున్నాడు.తే. కణగి యెల్ల చోట గలది చిద్రూపంబుఅదియ నీవు నేను నఖిలములునుఇదియ నిశ్చితార్థ మిది దప్ప మఱి లేదుసర్వశాస్త్రసార సంగ్రహంబు.‘ఈ విశ్వంలోని ప్రతి అణువు చిత్తమనే చేతనతో నిండి ఉంది. చేతనతో నిండినదైన చిద్రూపమే నీవు, నేను, అది, ఇది, ఇలలో అన్నీ. అదే నిశ్చయం. అది తప్ప మరొకటి లేదు. సర్వ విజ్ఞాన, వేదాంత శాస్త్రములు బోధించేది కూడా అదే! ఆ సత్యాన్ని గ్రహించిన చిత్తానికి చింత ఉండదు. అది తెలుసు కుని నీవు కూడా స్వస్థత చెందిన అంతరంగాన్ని పొందు’ అని అన్న చెప్పిన మాటలను ఆలకించాడు తమ్ముడు. శోకోపశమనం పొందాడు.– భట్టు వెంకటరావు -
ఏమైనా సరే... ఆరు ఆరే!
భారతీయ తత్త్వంలో అరిషడ్వర్గాలు, షడ్దర్శనాలు, షడ్రసాలు, షట్చక్రాలు, షడృతువులు వంటి ఎన్నో భావనలు ఆరు (6) అంకెతో నిర్వచితమయ్యాయి. బౌద్ధంలో షట్పారమితలు, జైనంలో షడ్ద్ర వ్యాలు, జొరాస్ట్రియనిజంలో అమేష స్పెంతాలు, తావోయిజంలో హెక్సాగ్రాం... ఇలా విదేశీ సంప్ర దాయాల్లోనూ ‘ఆరు’ విశిష్టంగా నిలిచింది. ఈ సంప్రదా యాలు, వేర్వేరు ప్రాంతాలలో, వేర్వేరు కాలాల్లో ఉద్భవించినా, అన్నింటిలోనూ ఆరు పరిపూర్ణతకు సూచికగా నిలవడం విశేషం.భారతీయ తత్త్వశాస్త్రం మనిషిలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు శత్రువులుగా గుర్తిస్తే; న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంతాలనే ఆరు దర్శ నాలు (షడ్దర్శనాలు) విశ్వాన్ని వివరించాయి. కణాదుని వైశేషిక దర్శనం ఈ విశ్వం సూక్ష్మమైన పరమా ణువులతో నిర్మితమైందని చెప్తూ... దాన్ని ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ మనే ఆరు పదార్థాలుగా విభజిస్తే; పతంజలి యోగం చిత్తవృత్తి నిరోధమే లక్ష్యంగా చూపింది. విష్ణుపురాణం ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యమనే ఆరు గుణాల సమాహారమే భగవంతుడని నిర్వచిస్తే; శైవ సంప్రదాయంలో షట్కోణాకారం శివ–శక్తుల సంయోగానికి సంకేతం. దీని నుంచి జన్మించిన సుబ్రహ్మణ్యుడు షణ్ముఖుడయ్యాడు.వేదాధ్యయనానికి శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛందస్, జ్యోతిషమనే షడంగాలు అవసరమైతే; ఆయుర్వేదంలో మధుర, అమ్ల, లవణ, కటు, తిక్త, కషాయమనే ఆరు రసాల సమతుల్యతే ఆరోగ్యానికి మూలమని చరక సంహిత చెప్తుంది. శరీరాన్ని కూడా శిరస్, ఉరస్, ఉదరం, పృష్ఠం, ఊర్ధ్వ, అధశ్శాఖలనే ఆరు అంగా లుగా చరక, సుశ్రుత సంహితలు విభజించాయి. హఠయోగం నేతి మొదలు త్రాటక వరకు ఆరు శుద్ధి క్రియలను, మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు ఆరు చక్రాలను నిర్దేశించింది.కాలగణనలో వసంతం మొదలు శిశిరం వరకు ఆరు ఋతు వులు, రోజుకు ఆరు భాగాలు కనిపిస్తాయి. సంగీతంలో మొదటి స్వరం షడ్జం– నారదీయ శిక్ష ప్రకారం నాసిక, కంఠం, ఉరస్సు, తాలువు, జిహ్వ, దంతాలనే ఆరు అవయ వాల నుంచి పుట్టేది కాబట్టే ఆ పేరు వచ్చింది. జ్యోతిష్యంలో రాశి, హోర, ద్రేక్కాణం వంటి ఆరు వర్గ పట్టికలను షడ్వర్గం అంటారు. ఒక్కో పట్టిక జీవితంలో ఒక్కో కోణాన్ని చూపిస్తుంది. వేదాంతంలో శోక, మోహ, జర, మృత్యు, క్షుధ, పిపాసలనే షడూర్మి మానవ అస్తిత్వపు ఆరు అలలుగా వర్ణితమయ్యాయి.బౌద్ధంలో దాన, శీల, క్షాంతి, వీర్య, ధ్యాన, ప్రజ్ఞలనే ఆరు పారమితలు మోక్షమార్గం చూపిస్తే; సంసారంలో దేవతలు, మానవులు, అసురులు, జంతువులు, ప్రేతలు, నరకభోగులనే ఆరు గతులు జీవులకు నిర్దేశించబడ్డాయి. జైనంలో జీవ, పుద్గల, ధర్మ, అధర్మ, ఆకాశ, కాలమనే ఆరు ద్రవ్యాలు విశ్వాన్ని నిర్వచి స్తాయి. శ్వేతాంబరులు సామా యికం మొదలు ప్రత్యాఖ్యానం వరకు ఆరు నిత్యకర్తవ్యాలను (షడావశ్యకాలు) పాటిస్తారు.ఆరు రోజుల సృష్టితోరా, బైబిల్ల ప్రకారం సృష్టి ఆరు రోజుల్లో పూర్తయి, ఏడవ రోజు విశ్రాంతి జరిగిందని నమ్మకం. ఖురాన్ లో ఆరు రోజుల సృష్టి ప్రస్తావన ఏడు చోట్ల వస్తుంది, అయితే విశ్రాంతి భావన అందులో లేదు. ఇస్లాంలో విశ్వాసానికి అల్లా, దూతలు, గ్రంథాలు, ప్రవక్తలు, తీర్పుదినం, దైవ నిర్ణయమనే ఆరు మూలసూత్రాలు (అర్కానుల్ ఈమాన్) పునాది. జొరాస్ట్రియనిజంలో అహురమజ్డా సృష్టించిన ఆరు అమేష స్పెంతాలు– పశువులు, అగ్ని, లోహాలు, భూమి, జలం, వృక్షాలకు అధిపతులుగా నిలిచాయి. చైనా తావో యిజంలో ఐ చింగ్ గ్రంథం ఆరు గీతల 64 హెక్సాగ్రాంలపై నిర్మిత మైంది. ప్రతి హెక్సాగ్రాం ఒక్కో జీవన పరిస్థితిని సూచిస్తుంది.గణితశాస్త్రంలో ఆరు ఒక పరిపూర్ణ అంకె (1+2+3=6, దాని భాజకాల మొత్తం దానికే సమానం), త్రిభుజ అంకె కూడా. అందుకే పురాతన గ్రీకు గణితవేత్తలు ఆరును విశేషంగా పరిగణించారు. ప్రకృతిలోనూ ఆరు భుజాల నిర్మాణం పదే పదే కనిపిస్తుంది: తేనెతుట్టెలు, మంచు పలకలు, బెంజీన్ రింగ్‌లోని కార్బన్ అణువులు, అగ్నిపర్వత లావా చల్లారి ఏర్పడే బసాల్ట్ శిలా స్తంభాలు (ఉదా: ఐర్లాండ్‌లోని జయింట్స్ కాజ్వే), అన్నీ షడ్భుజా కారాన్నే ఎంచుకుంటాయి. ఎందుకంటే తక్కువ పదార్థంతో అత్య ధిక స్థలాన్ని ఆవరించే, శక్తిని సమర్థవంతంగా పంచుకునే జ్యామి తీయ ఆకారం అదే.వేర్వేరు కాలాల్లో ఉద్భవించిన ఎన్నో వైరుధ్య సంప్రదాయా లలో ఆరు అంకెకు ఇంతటి ప్రత్యేక స్థానం ఎందుకు వచ్చిందో చెప్పలేం. తత్త్వశాస్త్రం, ఆధ్యాత్మికం, గణితం, ప్రకృతి శాస్త్రం అన్నీ ఏకగ్రీవంగా ఈ ఒక్క అంకె చుట్టూ తిరగడం యాదృచ్ఛికమా, ఏదైనా తాత్త్విక సూత్రం దాగుందా? బహుశా ఆరుకే తెలుసు!- డా. కొవ్వలి గోపాలకృష్ణ, వ్యాసకర్త అమెరికాలో ఆంకాలజీ డ్రగ్ డెవలప్మెంట్ సైంటిస్ట్ -
నాస్తికోద్యమ నిర్మాత
ప్రజల మధ్య జాతి, మతం, కులం పేరుతో విషం పెరు గుతూ ఉంది. దానితో విద్వే షాలు పెరుగుతున్నాయి. దేవుడు, కర్మ, పునర్జన్మ లాంటి భావాలు పోతే మనిషి మతస్తు డిగా కాకుండా స్వచ్ఛమైన నీతి మంతుడైన మానవుడిగా మిగు లుతాడు. ప్రజల మధ్య అడ్డు గోడలుండవు. అందరం ఒకటే అన్న భావనలోకి వచ్చి నప్పుడు సోదరభావం దానంతట అదే వెళ్లి విరుస్తుంది. ప్రేమ, అప్యాయత, ఒకరికి ఒకరం ఉన్నామన్న ధీమా పెరుగుతుంది!– అనేవి గోపరాజు రామచంద్రరావు (గోరా) అలోచనలు.ఎవరీ గోరా? ఒరిస్సాలో పుట్టి(1902 నవంబర్ 15), కృష్ణా జిల్లా విజయవాడను ప్రపంచ నాస్తిక కేంద్రంగా మలచినవాడు. భారతీయ సనాతన సంస్కృతి అయిన చార్వాకుల స్ఫూర్తిని మళ్ళీ ఈ ఆధునిక కాలానికి అందించిన ఘనుడు. గోరా ప్రత్యేకత ఏమిటంటే, వృక్ష శాస్త్ర అధ్యాపకుడిగా సమాజంలో వేళ్ళూను కుని ఉన్న మూఢ విశ్వాసాలకు చికిత్స– ఆ వేరు మూలాల నుండే ప్రారంభించాలని తీర్మానించారు. అస్పృశ్యతా నివార ణకు, ఆర్థిక సమానత్వ సాధనకు కృషి చేస్తూనే– ప్రజల్లో కుల, మతతత్వ నిర్మూలనకు నడుం బిగించిన కార్యకర్త. సమిష్టి భోజనాలను నిర్వహిస్తూ జనాన్ని మతాంతర వివాహాల వైపు నడిపించిన కార్యశీలి.గోరా అనేకచోట్ల అనేక ఉద్యోగాలు చేశారు. మధుర లోని మిషన్ కళాశాలలో తొలుత అధ్యాపకుడయ్యారు. ఆ తరువాత కోయంబత్తూర్ వ్యవసాయ కళాశాలలో పత్తి పరిశోధక సహాయకుడిగా పని చేశారు. కొంతకాలం శ్రీలంక వెళ్ళి కాలంబోలోని ఒక కళాశాలలో జీవశాస్త్ర అధ్యాపకుడ య్యారు. తిరిగి వచ్చి మళ్ళీ కాకినాడ కళాశాలలో ఆధ్యాప కుడిగా చేరారు. నాస్తిక కేంద్ర స్థాపన నాస్తికుడిగా మారుతున్న దశలో ఆయన – ఇంట్లో ఉండే సంప్రదాయాలు, ఆచారాలతో రాజీ పడేవాడు కాదు. తను నడిచే మార్గం సంప్రదాయవాదులైన తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని గ్రహించి... భార్యా పిల్ల లతో ఇల్లు వదిలి బయటికి వచ్చేశాడు. స్వతంత్ర జీవనం ప్రారంభించాడు. సమాజంలో మార్పు తేవడానికి ఏదో ఒక కేంద్రం ప్రారంభించాలని అను కున్నారు. ఆ ఆలో చనను ఆయన భార్య సరస్వతీ గోరా బలపరిచారు.సంపూర్ణ గ్రామీణాభివృద్ధి సాధించడానికి కుల మతాలకు అతీతంగా మానవవాద మూలాలపై నడిచే ఒక జీవన శైలిని ప్రవేశపెడుతూ కృష్ణా జిల్లా ముదు నూరులో ‘నాస్తిక కేంద్రం’ ఏర్పాటు చేశారు. గాంధీజీ కోరిక మేరకు 1944లో అఖిల భారత కాంగ్రెస్ ఆర్గనైజర్‌గా అలహాబాదు, ఢిల్లీలలో పని చేశారు. నాస్తిక కేంద్రం ముదునూరు నుండి పని చేస్తున్నప్పుడే, దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కేంద్రం కార్యకలాపాలు మరింత విస్తృత పరచడానికి దాన్ని విజయవాడకు మార్చారు. ప్రపంచ హేతువాద, నాస్తికోద్యమాలకు గోరా స్థాపించిన ఆ నాస్తిక కేంద్రమే కేంద్ర బిందు వయ్యింది. 1972లో తొలి ప్రపంచ నాస్తిక మహాసభలు విజయవాడలో నిర్వహించిన ఘనత ఆయనదే! అప్పు డాయన వయసు 70 సంవత్సరాలు.భారత గ్రామీణ సమాజంలో ఎలా మార్పులు తేవాలి అనే అంశంపై ఉపన్యసిస్తూనే 1975 జూలై 26న గోరా తుదిశ్వాస విడిచారు. ఊరికే ఉపన్యాసాలివ్వడం కాకుండా, గోరా కార్యాచరణలోకి దిగి చూపించారు. గ్రహణ సమయంలో గర్భిణులు బయట తిరిగితే పుట్టే పిల్లలకు ‘గ్రహణం మొర్రి’ రాదని, తన భార్య గర్భ వతిగా ఉన్నప్పుడు తప్పని సరిగా బయట తిప్పేవారు. ఆ దంపతులకు తొమ్మిదిమంది పిల్లలు పుట్టినా ఎవరికీ గ్రహణం మొర్రి రాలేదు. రాహు–కేతువులు ఎక్కడో లేరు, సమాజంలోనే ఉన్నారు. వారిని జనం అదుపు చేస్తూ ఉండాలని సరస్వతి గోరా తరచూ చెబుతూఉండేవారు.- డా. దేవరాజు మహారాజు, వ్యాసకర్త సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త(నేడు ‘గోరా’ వర్ధంతి) -
సముద్రాలకు రక్షణ సైన్యం
కోస్తా తీరప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడే మడ అడవులు, సరుగుడు చెట్లు, అరుదైప వృక్షాలు క్రమంగా అంతరించి పోతున్నాయి. చాలామందికి మడ అడవులు అంటే సముద్రం పక్కన పెరిగే కొన్ని చెట్లు మాత్రమే. కానీ అవి కేవలం చెట్లు కావు. అవి ఒక సంపూర్ణ జీవ వ్యవస్థ. సముద్రం, నదులు, నేల, చేపలు, పక్షులు, మనుషులు... ఇవన్నింటినీ ఒకే దారంతో కలిపే ప్రకృతి వలయం.సముద్రపు ఉప్పునీటిలోనూ మనగలిగే ఈ అడవులు లేకపోతే తీరప్రాంత మత్స్య సంపదలో గణనీయమైన భాగం ఉండదు. అనేక చేపలు, రొయ్యలు, పీతలు తమ జీవితాన్ని ప్రారంభించేది ఈ మడ అడవుల్లోనే. అందుకే మడ అడవులను శాస్త్రవేత్తలు ‘సముద్రా నికి నర్సరీ’ అని పిలుస్తారు. మడ అడవుల వేర్లు సముద్ర అలల వేగాన్ని తగ్గిస్తాయి. మట్టిని నిలబెడతాయి. తుఫాను ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.1977 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌ను తాకిన దివిసీమ ఉప్పెన దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర ప్రకృతి విపత్తుల్లో ఒకటి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయు లయ్యారు. సముద్రంతో యుద్ధం చేయడం కాదు... దానితో కలిసి జీవించడం నేర్చుకోవాలని ఆ రోజు ప్రకృతి ఒక కఠినమైన పాఠం నేర్పింది. మడ అడవులను కాపాడటం ద్వారా ఇటువంటి విపత్తులను కాపాడవచ్చు.‘సముద్రాన్ని ఆపేశాము’!ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తీరప్రాంతాల్లో మడ అడవుల పునరుద్ధరణ కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో మడ మొక్కలను పెంచడం, చేపల పెంప కాన్ని మడ అడవులతో అనుసంధానం చేయడం, ఉప్పునీటిలో సాగు చేయగల పంటలను ప్రోత్సహించడం వంటి చర్యలు పర్యా వరణ పరిరక్షణతో పాటు గ్రామీణ జీవనోపాధిని కూడా బలోపేతం చేస్తున్నాయి. కృష్ణా జిల్లా తీరప్రాంతంలో కొన్ని గ్రామాలను సముద్రం మింగేస్తోంది. అయితే ‘మా ఊరికి రాకుండా సముద్రాన్ని ఆపేశాము’ అంటారు కృష్ణా జిల్లా తీరప్రాంత గ్రామం బసవాని పాలెంకు చెందిన పద్మ. సముద్ర నీటి మట్టం పెరిగినపుడల్లా తీరప్రాంతం కోతకు గురయ్యేది. ఎం.ఎస్. స్వామినా«థన్ ఫౌండేషన్ సహకారంతో ఎస్జీహెచ్ మహిళలు దశాబ్దం క్రితం నాగాయి లంక, బసవవాని పాలెంలో 200 హెక్టార్లలో మడ మొక్కలను నాటారు. ఇపుడు అవి అడవిగా మారి తీర ప్రాంతానికి రక్షణ కవచంగా మారాయి.వీరి కృషి ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నది. ప్రకృతిని కాపాడితే... ప్రకృతి మనిషిని కాపాడుతుంది. అభివృద్ధి అంటే విధ్వంసం కాదు. మడ అడవులను కాపాడటం అటవీ శాఖ బాధ్యత మాత్రమే కాదు. ఇది పర్యావరణ శాఖ, మత్స్యశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మత్స్యకారులు, రైతులు కలిసి చేయాల్సిన పని.ప్రతి జిల్లాలో మడ అడవుల మ్యాపింగ్ జరగాలి. దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి పునరుద్ధరణ చేపట్టాలి. తీరప్రాంత గ్రామాల యువతను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. సముద్రాన్ని మనం ఆపలేము. తుఫాన్లను కూడా ఆపలేము. కానీ వాటి విధ్వంసాన్ని తగ్గించే సహజ రక్షణ కవచాన్ని మాత్రం కాపాడగలం.– శ్యాం మోహన్, సీనియర్ జర్నలిస్ట్ (రేపు ప్రపంచ మడ అడవుల దినోత్సవం) -
యుగానుకూల మాతృత్వ శక్తి..
ప్రకృతిలో మాతృత్వం కేవలం ఒక బంధం మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన శక్తి. ఒక దేశ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు తరతరాలకు అందాలంటే ఆ బాధ్యతను మోసేది మాతృశక్తే. మాతృత్వాన్ని కేవలం కుటుంబానికే పరిమితం చేయ కుండా, దేశ నిర్మాణ శక్తిగా గుర్తించే దిశగా ‘విశ్వ మాంగళ్య సభ’ కృషి చేస్తోంది.2010లో స్థాపితమైన విశ్వ మాంగళ్య సభ, ఒక సామాజిక ఉద్యమంగా, సాంస్కృతిక పునరు జ్జీవన వేదికగా రూపాంతరం చెందింది. సంస్కార్ (విలువలు), సామర్థ్యం (శక్తి), సదాచారం (మంచి ప్రవర్తన), సేవ అనే నాలుగు సూత్రాల ప్రాతిపది కన ఈ సంస్థ పనిచేస్తోంది. ఆధునికత పేరుతో మనం కోల్పోతున్న భారతీయ విలువలను, కుటుంబ వ్యవస్థలోని సౌందర్యాన్ని తిరిగి నిల బెట్టడం ఈ సభ ప్రధాన ఉద్దేశ్యం. ఒక వ్యక్తికి మొదటి పాఠశాల కుటుంబం అయితే, మొదటి గురువు తల్లి. ఈ భావనతోనే, మహిళలను సాంస్కృతికంగా బలోపేతం చేసి, విలువలతో కూడిన ‘నవ భారత’ నిర్మా ణంలో వారిని భాగస్వామ్యం చేస్తోంది.ఒక మహిళ కేవలం ఒక వ్యక్తి కాదు, ఆమె ఒక వ్యవస్థ. మహిళ విద్యా వంతురాలైతే ఒక కుటుంబం బాగుపడుతుంది. మహిళ ఆలోచిస్తే ఒక సమాజం బాగుపడుతుంది. అదే మహిళ నాయకత్వం వహిస్తే ప్రపంచమే బాగుపడుతుంది. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడిని అధిగమించడానికి యోగా, ధ్యానం వంటి సంప్రదాయాలు ఏ విధంగా తోడ్పడతాయో అవగాహన కల్పిస్తూ, మహిళలను శక్తిమంతం చేయడం ద్వారానే మనం ‘విశ్వమాంగ ళ్యాన్ని’ (ప్రపంచ శ్రేయస్సును) సాకారం చేయగమని ఈ సభ నమ్ముతోంది.నేటి మహిళ, విజ్ఞాన శాస్త్రాన్ని ఆయుధంగా మలుచుకుంటూనే, సంస్కారాన్ని కవచంగా ధరించాలి. భారతీయ విలువల పునాదులను పటిష్ట పరచి వాటిపై ఆధునిక ప్రగతి సౌధాన్ని నిర్మించాలి. మాతృశక్తి మేల్కొన్న సమాజానికి ఓటమి లేదు; అది ఎప్పుడూ విశ్వ శ్రేయస్సును కాంక్షిస్తుంది. ఈ యుగానుకూల మాతృత్వ శక్తితోనే ఉత్తమ వ్యక్తి నిర్మాణం, కుటుంబ నిర్మాణం ఆ పై ఉన్నత నవభారత నిర్మాణం సాధ్యమవుతాయి.– డా. సంగీతా రెడ్డి, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ (రేపు హైదరాబాద్‌లో విశ్వ మాంగళ్య సభ సమావేశం సందర్భంగా...) -
శంకరుల బాట..
ఆదిశంకరుల రచనలైన కనకధారాస్తోత్రమ్, దక్షిణామూర్తి స్తోత్రమ్, గుర్వష్టకమ్, నిర్వాణ షట్కమ్, భజగోవిందం, సౌందర్యలహరి – దేన్ని చదివినా, వినినా మనసు ఆనందంతో నిండి పోతుంది. వాటి అర్థాన్ని గ్రహించి, తదనుగుణంగా జీవిస్తే మన జీవితాలే ధన్యమవుతాయనిపిస్తుంది. శంకరులవారి అన్నపూర్ణా స్తోత్రాన్ని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పాడుతుంటే ఆనందం, ఆరోగ్యం పుష్కలంగా లభిస్తాయని పెద్దలంటారు. అందులో చివరి శ్లోకం మరీ ముఖ్యమైనది:‘‘అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే / జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ!మాతా చ పార్వతీ దేవీ పితాదేవో మహేశ్వరః / బాంధవా శ్శివ భక్తశ్చ స్వదేశో భువనత్రయమ్!!ఇందులో ఆది శంకరులవారు జ్ఞాన, వైరాగ్యాలను కాంక్షించటమేకాక తన తల్లి పార్వతీదేవి అనీ, తండ్రి మహేశ్వరుడనీ, శివ భక్తులందరు తన బంధువులనీ, మూడు లోకాలూ తనకు స్వదేశమనీ ప్రకటిస్తారు. శ్రేష్ఠులు దేన్ని ఆచరిస్తారో దాన్నే ప్రమాణంగా ఇతరులు తీసికొని ఆచరిస్తారని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతారు.మరి మనం ఆది శంకరుల అనుచరులం అని చెప్పుకొంటే సరిపోతుందా? ఆయన వలె మనమూ జ్ఞాన, వైరాగ్యాలనే కోరుకోవాలిగానీ ధన ధాన్యాలను, సంపదలను కాదు. లోకాలనన్నిటినీ, లోకులందర్నీ సృష్టించిన ప్రకృతి, పురుషులు మన తల్లి తండ్రులని, జీవులన్నీ మన బంధువులని, ముల్లోకాలూ స్వదేశమని గ్రహించి జీవిస్తే ఆధ్యాత్మిక శిఖరాన్ని ఆదిశంకరులవారు ఎలా అధిరోహించారో మనమూ అధిరోహించవచ్చు. – రాచమడుగు శ్రీనివాసులు -
గల్ఫ్‌లో మళ్లీ యుద్ధమేఘాలు
జూన్ 17, 2026న ఇరాన్–యూఎస్ఏల మధ్య అవగాహన (మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్–ఎంవోయూ) కుదర టంతో పర్షియన్ గల్ఫ్‌లో శాంతి పునః స్థాపితమవుతుందనే అందరూ భావించారు. ప్రపంచ విపణిలో చమురు ధరలు దిగిరావటంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. మూడు వారాలు తిరగక ముందే హార్మూజ్ మళ్లీ మూతపడటంతో శాంతి మూణ్నాళ్ల ముచ్చటయింది. ఈ రెండవ దశ యుద్ధం మరింత విస్తృతంగా, తీవ్రంగా కనపడుతున్నది. ప్రాంతీయ, అంతర్జా తీయ రాజకీయాలలో కీలక మలుపునకు ఈ దశ నాంది కావచ్చు.దిక్కుతోచని అమెరికా ఇరాన్–యూఎస్ అంగీకరించిన అవగాహన పత్రం 60 రోజులలో సమగ్ర ఒప్పందాన్ని తయారు చేయటానికి ఒక చట్రంగా ఉపయోగపడాలనేది ప్రధాన ఉద్దేశ్యం. ఈ రెండు నెలల వ్యవధిలో హార్మూజ్ జలసంధి ద్వారా నిరాటంకంగా ఎలాంటి రుసుములు లేకుండా వాణిజ్య నౌకల రవాణా జరగాలనీ, తత్సంబందిత ఏర్పాట్లను ఇరాన్ చేయాలనీ ఎంవోయూలోని అయిదవ ఆర్టికల్ నిర్దేశిస్తుంది. ఇదే పీటముడిగా మారింది. హార్మూజ్ జలసంధి ద్వారా రవాణా పూర్తిగా తన అజమాయిషీ, ఆధ్వర్యంలో జరగాలని ఇరాన్ నిర్దేశాలు జారీ చేసింది. ఈ నిర్దేశాల ప్రకారం హార్మూజ్ నుండి ప్రయాణించే ప్రతి నౌక ముందుగా ఇరాన్ వద్ద తమ పూర్తి వివరాలను నమోదు చేసుకుని నిర్దేశించిన మార్గంలో, నిర్దేశించిన సమయంలో ప్రయాణించాలి. యూఎస్ఏ ఈ వాదనను తిరస్క రిస్తూ హార్మూజ్ జలసంధి అంతర్జాతీయ రవాణా మార్గం, దీనిపై ఇరాన్ అజమాయిషీ కుదరదని తేల్చి చెప్పింది. ఇరాన్ తీరానికి సమీపంగా కాకుండా ఒమన్ తీరానికి సమీపంలో ఒమన్ ప్రాదేశిక జలాల గుండా నౌకల రవాణాను ప్రోత్సహించింది. ఒమన్ తీరంగుండా ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ దాడి చేయటంతో యూఎస్ఏ తన నౌకాబలంతో హార్మూజ్‌ను దిగ్బంధించింది. ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు ప్రారంభించింది.మొదటి దశ 40 రోజుల దాడులతో పోల్చితే గత పన్నెండు రోజులుగా జరుగుతున్న రెండవ దశ యుద్ధం భిన్నంగా ఉన్నది. మొదటిసారిగా అమెరికా ఇరాన్‌లోని పౌర లక్ష్యాలపై దాడి చేసింది. రహదారులు, వంతెనలు, పవర్ ప్లాంట్లు, డీసాలినేషన్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకున్నది. బుషేర్లో నిర్మాణంలో ఉన్న పౌర అణువిద్యు చ్ఛక్తి కేంద్రంపై కూడా దాడి చేసింది. ఇది అంతర్జాతీయ యుద్ధనేరం (వార్ క్రైమ్) కిందకు వస్తుంది. ఇరాన్ కూడా అవగాహన పత్రంపై అమెరికా అధ్యక్షుడి సంతకానికి విలువ లేదని చెప్పి, అదే స్థాయిలో విరుచుకుపడింది. కువైట్‌లోని అల్సుబియా డీసాలినేషన్ ప్లాంట్, విద్యుచ్ఛక్తి కేంద్రంపై దాడి చేసింది. బహ్రెయిన్‌లో అమెరికా అయిదవ నౌకాదళ ప్రధాన కార్యాలయం ఉన్న సల్మాన్ పోర్టుపై దాడి చేసింది. మొదటిసారిగా సిరియా, జోర్డాన్‌లలోని యూఎస్ వైమానిక స్థావరాలు, విమానాశ్రయాలు, రేపు పట్టణాలపై కూడా దాడి చేసింది. అవగాహన పత్రంపై ట్రంప్ తప్పనిసరి పరిస్థితులలో సంతకం పెట్టినట్లుగా కన్పడుతున్నది. ఏదోరకంగా హార్మూజ్ జలసంధిని తెరిపించి, చమురు ధరలను కిందకు తేవాలనే ఆరాటం కనపడుతుంది. కానీ ఎంవోయూలో ఎక్కడా ఇరాన్ అణుకార్యక్రమాన్ని వీడుతున్నట్లు లేదు. ఒక రకంగా ఎంవోయూ అమెరికాకు ప్రతి కూలంగా, ఇరాన్‌కు ప్రయోజనకారిగా ఉన్నదని విశ్లేషకుల అభి ప్రాయం. ఈ నేపథ్యంలో ఇరాన్ హార్మూజ్‌ను తన ఆజమాయిషీ లోకి తీసుకునే ప్రయత్నాలు చేయటంతో అమెరికా దిక్కుతోచక మళ్లీ దాడులు మొదలుపెట్టింది.ఇరు పక్షాలకూ నష్టమే!ఇరాన్‌తో యుద్ధం అమెరికాకు కొరివితో తల గోక్కున్నట్లయింది. అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ అమెరికా ప్రభుత్వం ఇప్పటికే 37.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మూడీస్ సంస్థ అంచనాల ప్రకారం ఇరాన్‌పై దాడి వలన అమెరికన్ పౌరులపై పన్నులు, అధిక ధరల రూపంలో 132 బిలియన్ డాలర్ల అదనపు భారం పడింది. పెంటగాన్, యుద్ధం కోసం అదనంగా 80 బిలియన్ డాలర్ల నిధులను కోరుతున్నది.తరిగిపోతున్న మందుగుండు సామగ్రి నిల్వలను పూర్తి చేయటానికి అమెరికా రక్షణ శాఖ 114 బిలియన్ డాలర్లను కోరుతున్నది. ఆర్థిక భారంతో పాటు, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటికి 18 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గత రెండు వారాల లోనే వందమందికి పైగా అమెరికన్ సైనికులు గాయపడ్డారు. ఇరాన్‌పై దాడితో అమెరికా సాధించిందేమిటనేది ప్రశ్నార్థకం. ఇరాన్ అణుకార్యక్రమాన్ని, అణుసామర్థ్యాన్ని నిర్మూలించే లక్ష్యం నెరవేరే సూచనలు లేవు. గల్ఫ్ దేశాలను రక్షించే సామర్థ్యం అమెరికాకు ఉన్నదా అనే సందేహాలను ఈ యుద్ధం లేవనెత్తుతున్నది. ఇక ఇరాన్ విషయానికొస్తే, ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ఇరాన్ ఆర్థిక వ్యవస్థ 6.1 శాతం క్షీణిస్తున్నది. ద్రవ్యో ల్బణం 68.9 శాతం. ఆహార ద్రవ్యోల్బణం 105 శాతం. ఇరాన్ కరెన్సీ (రియల్) దారుణంగా పతనమయింది. ఒక డాలర్‌కు 1.32 మిలియన్ల రియల్స్ పలుకుతున్నది. యుద్ధం వలన 144 బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. ఇది ఇరాన్ జీడీపీలో 40 శాతం. సుమారుగా 3,460 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉన్నతస్థాయి సైనిక, రాజ కీయ నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది. అయితే, అమెరికా, ఇజ్రాయెల్ దాడులు రాజకీయంగా ఇరాన్ నాయకత్వానికి కలిసి వచ్చాయి. ప్రజలలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత అమెరికా–ఇజ్రా యెల్ వైపు మళ్లింది. ఖమేని అంత్యక్రియలను ఇరాన్ తెలివిగా వాడుకున్నది. అన్నింటికంటే ముఖ్యంగా ఇరాన్ హార్మూజ్ జలసంధి రూపంలో ఒక కొత్త అస్త్రాన్ని కనుక్కొన్నది. ఈ యుద్ధం ద్వారా ఇరాన్–రష్యా–చైనా మైత్రీబంధం మరింత బలపడింది.కొత్త గుణపాఠాలుహార్మూజ్, బాబెల్ మాండెబ్, సూయజ్, పనామా, మలక్కా వంటి ఇరుకైన జలసంధుల (చోక్ పాయింట్ల) ద్వారా రవాణాపై పూర్తిగా ఆధారపడటం వలన వచ్చే ముప్పు అన్ని దేశాలకు అర్థమైంది. హార్మూజ్ నుండి తప్పించుకోవటానికి సౌదీ ఈస్ట్–వెస్ట్ పైప్ లైన్ ద్వారా రోజూ సుమారు 5 బిలియన్ బారల్స్ చమురును ఎర్ర సముద్రంలోని యాంబూ రేవు పట్టణం గుండా పంపిస్తున్నది.అందుకే ఇరాన్‌కు మద్దతునిచ్చే యెమెన్‌లోని హౌతీలు బాబెల్ మాండెబ్‌ను మూసివేశారు. యూఏఈ హార్మూజ్‌కు ప్రత్యామ్నాయంగా హబ్షాన్ నుండి పైప్‌లైన్ ద్వారా ఫుజేరాకు పంపించి ఒమన్ సింధుశాఖ గుండా రవాణా చేస్తున్నది. అందుకే ఇరాన్ ఫుజేరాపై దాడి చేసింది. భారత్ ప్రతిపాదించిన ‘ఐమెక్’(ఇండియా–మిడిల్ ఈస్ట్– యూరప్ ఎకనామిక్ కారిడార్) వీటన్నింటికి విరుగుడు. ఐమెక్ రూపుదిద్దుకోవాలంటే గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్‌తో ఆచరణాత్మక వైఖరిని రూపొందించుకోవాలి. అధునాతన ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్లు, స్టెల్త్ యుద్ధ విమానాలు, అణ్వస్త్రాలు, క్షిపణి రక్షణ వ్యవస్థల ద్వారా దిగ్గజ శక్తులు చిన్న రాజ్యాలను లొంగదీసుకోవటం అసాధ్యమని ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు రుజువు చేస్తున్నాయి. చౌకైన డ్రోన్లు, క్షిపణులతో కూడా ఎదురొడ్డి నిలువవచ్చని చాటి చెప్తున్నాయి. ఒకరకంగా ఈ రెండు యుద్ధాలు రెండు కూటముల మధ్య జరుగుతున్నట్టు లెక్క. అమెరికా, ఐరోపా దేశాలు ఒకవైపు; చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా ఇంకొకవైపు మోహరించి ఉన్నాయి. ఉక్రెయిన్ వెనుక అమెరికా, యూరప్ ఉన్నాయి. ఇరాన్ వెనుక చైనా, రష్యా ఉన్నాయి. గల్ఫ్ దేశాల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కగా మారింది. గల్ఫ్ దేశాల రక్షణను ఇజ్రాయెల్ పట్టకంలోంచి అమెరికా చూస్తుందనే విషయాన్ని అవి గుర్తించాలి. తమ భద్రతకై జీసీసీ దేశాలు, నాటో తరహా కూటమిని ఏర్పాటు చేసుకోవటం మేలు. ఇరాన్‌తో సత్సంబంధాలకు ప్రయత్నించాలి. భద్రత, రక్షణ, ఆర్థిక అంశాలలో వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని అనుసరించాలి. ఈ విషయంలో భారత్ విధానాల నుండి నేర్చుకోవచ్చును.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్); సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు-గురజాల శ్రీనివాసరావు -
నంబర్ వన్ నుంచి ‘పదిలో ఒకటి’కి!
పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, సంస్థలు ఒక రాష్ట్రం వైపు అడుగులు వేసేముందు మొట్టమొదట పరిశీలించేది అక్కడి ప్రభుత్వ విధానాలు తమను ప్రోత్సహించడానికి అనువుగా ఉన్నాయా అన్నదే. దానికి దేశవ్యాప్తంగా ఆమోదం పొందిన కొలబద్ద ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగులు. అయితే ఆంధ్రప్రదేశ్ తాజా ర్యాంకులను చూస్తే ఆందోళన కలగకమానదు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ ర్యాంకుల్లో ఏపీ సాధించిన ఫలితాలు ఇప్పటికీ రికార్డులుగానే నిలిచి ఉన్నాయి. 2020 సెప్టెంబర్ 5న డీపీఐఐటీ ప్రకటించిన ఫలితాల్లో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022 జూన్ 30న ప్రకటించిన బీఆర్ఏపీ–2020 ఫలితాల్లో ‘టాప్ అచీవర్స్’ హోదా పొందిన 7 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవడమే కాదు, 97.89 శాతం స్కోరుతో దేశం లోనే అత్యధిక స్కోరు సాధించి గుజరాత్(97.77 శాతం) కంటే ముందు నిలిచింది. మరో విశేషం ఏంటంటే, 2024 సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన తొలి ‘ఉద్యోగ్ సమాగమ్’ వేదికపై డీపీఐఐటీ వెల్లడించిన బీఆర్ఏపీ ఫలితాల్లో దేశం మొత్తం మీద ‘టాప్ పెర్ఫార్మర్’ హోదా దక్కింది మూడంటే మూడు రాష్ట్రాలకే. అవి కేరళ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్. ఆ మదింపు నకు ప్రాతిపదిక జగన్ ప్రభుత్వ 2022–23 నాటి సంస్కరణల అమలు.2025 నవంబర్‌లో జరిగిన రెండో ‘ఉద్యోగ్ సమాగమ్’లో డీపీఐఐటీ ప్రకటించిన బీఆర్ఏపీ–2024 ఫలితాలు కళ్లు తెరిపించేలా ఉన్నాయి. ఐదు సంస్కరణ రంగాల్లో ‘టాప్ అచీవర్’ గుర్తింపును ఉత్తరాఖండ్, పంజాబ్ దక్కించుకోగా, ఆంధ్రప్రదేశ్ నాలుగు రంగాల గుర్తింపుతో పది రాష్ట్రాల గుంపులో ఒకటిగా మిగిలిపోయింది. ‘ఫాస్ట్ మూవర్స్’ జాబితాలో ఏపీ పేరు ఒడిశా, పంజాబ్ తర్వాతే వినిపించింది. ఈ నెల 17న నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్’ ఆ దృశ్యాన్ని మరింత స్పష్టం చేసింది. పెట్టుబడులకు అనుకూలమైన దేశంలోని 17 పెద్ద రాష్ట్రాల జాబితాలో ఏపీ స్థానం ఆరు. దేశంలోని అన్ని రాష్ట్రాల లెక్కన ఎనిమిదో స్థానం.‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అంటూ ప్రస్తుత ప్రభుత్వం వినిపిస్తున్న నినాదాలు, దావోస్ వేదికలపై ప్రకటనలు, లక్షల కోట్ల ఒప్పందాల హోరు వార్తా శీర్షికలకే పరిమితమవుతున్నాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకొనే ముందు పారిశ్రామికవేత్తలు పరిశీలించేది డీపీఐఐటీ, నీతి ఆయోగ్ వంటి సంస్థల తటస్థ గణాంకాలనే తప్ప ప్రచార ఆర్భాటాలను కాదు. ర్యాంకుల భాషను పెట్టుబడిదారులు ఎప్పుడో చదివేశారు; చదవాల్సింది ఏపీ పాలకులే.– డా. కొత్తపల్లి శ్రీనివాస వర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
చెరువులెవరివి? లాభాలెవరికి?
పురాతన కాలం నుంచి ఉన్న వేలాది చెరువులు మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా మత్స్యకారుల జీవనానికి మూలస్తంభాలు. తెలంగాణలో ప్రస్తుతం సుమారు 24,189 చెరువులు, జలాశయాలు, రిజర్వాయర్లు ఉన్నాయి. రాష్ట్రంలో 5,72,167 ఎకరాలకు పైగా విస్తీ ర్ణంలో చెరువులు అందుబాటులో ఉన్నాయి. వీటిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 27 లక్షల మంది జీవనం సాగిస్తు న్నారు. అలాగే 4,500కు పైగా మత్స్యకార సహకార సంఘాలు నమోదై ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్య రంగం గణనీయంగా విస్తరించింది. 2014– 15లో సుమారు 2 లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి ప్రస్తుతం 4.5 లక్షల టన్నులకు పైగా పెరిగింది. అయినా మత్స్యకార కుటుంబాల జీవన పరిస్థితుల్లో ఆశించిన మార్పు లేదు. అప్పులు, అస్థిర ఉపాధి, మధ్యవర్తుల దోపిడీ, తక్కువ ఆదాయం వారిని వెంటాడుతున్నాయి. ప్రభుత్వ విధానం ప్రకారం చెరువుల చేపల పెంపకం హక్కులు నేరుగా మత్స్యకార సహకార సంఘాలకు ఇవ్వాలి. ఈ విధానం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం మధ్యవర్తులను తొలగించి ఉత్పత్తి ద్వారా వచ్చే లాభాలు నిజమైన మత్స్యకారులకు చేరేలా చేయడం.కానీ నేడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మత్స్యకార సంఘాల పేరుతో లీజుకు తీసుకున్న చెరువులను గోప్యంగా కాంట్రాక్టర్లకు, వ్యాపారులకు, దళా రులకు సబ్ లీజుకు ఇస్తున్నారు. ఫలితంగా అసలు మత్స్యకారులు తమ సొంత చెరువుల్లోనే కూలీలుగా మారిపోతున్నారు. చేపల మార్కెట్లో ప్రస్తుతం రోహు, కట్ల వంటి సాధారణ చేపల ధరలు అనేక పట్టణాల్లో కిలోకు రూ. 180 నుంచి రూ. 250 వరకు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక జాతుల చేపలు రూ. 300 నుంచి రూ. 500 వరకు విక్రయమవుతున్నాయి. చెరువుల వద్ద మత్స్యకారు లకు లభిస్తున్న ధరలు దీనికంటే చాలా తక్కువ. ఉత్పత్తి ధరకు, మార్కెట్ ధరకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని మధ్యవర్తులు మింగేస్తున్నారు.మత్స్యకార సహకార సంఘాలకు అనేక చోట్ల ఎన్నికలు ఏళ్ల తరబడి జర గడం లేదు. సభ్యులకు లీజు వివరాలు తెలియడం లేదు. ఆదాయం–ఖర్చుల లెక్కలు బహిర్గతం కావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో మత్స్యశాఖ అధికారులే బినామీ పేర్లతో కాంట్రాక్టు వ్యవస్థలో భాగమవుతున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల లీజులపై సమగ్ర సామాజిక తనిఖీ జరగాలి. చేపల కొనుగోలు, మార్కెటింగ్ కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యక్ష మార్కెట్ వ్యవ స్థలను ఏర్పాటు చేయాలి. శీతల గిడ్డంగులు, ప్రాసెసింగ్ కేంద్రాలు మత్స్యకార సంఘాల ఆధీనంలో ఉండాలి. లాభాలు నిజమైన మత్స్యకారునికి చేరాలి.– మామిండ్ల రమేష్ రాజా, సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ తెలంగాణ కార్యదర్శి -
మాయాబజార్లో ఓటర్ల దేవులాట
‘లాహిరి లాహిరి లాహిరిలో...’ అని పాడుకునే ‘మాయాబజార్’ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రానికి నిజానికి ‘శశిరేఖా పరిణయం’ అని ఉండాలి. కానీ ప్రపంచం మాయాబజార్ గానే గుర్తుంచుకుంది. ఎందుకంటే ఆ కథలో మాయ, వ్యూహం, వేషధారణ, భ్రమ – అన్నీ కలగలిసి ఉంటాయి. ఎవరు నిజం? ఎవరు మాయ? అనే సందేహమే కథకు ప్రాణం. నేటి ఓటరు జాబితాల ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్) ప్రక్రియను గమనిస్తే కూడా ఇటువంటి సందేహాలే తలెత్తుతున్నాయి. ప్రజాస్వా మ్యంలో ఎన్నికలు ఒక పవిత్ర ప్రక్రియ. ఆ ప్రక్రియలో పారదర్శకత కనిపించకపోతే, అది ‘మాయాబజార్’లా అనిపించడం సహజం.మాయాబజార్లో ‘సత్యపీఠం’ ఉంటుంది. దానిపై కూర్చుంటే అసత్యం బయటపడుతుందని భావిస్తారు. కానీ వాస్తవ జీవితంలో రాజ్యాంగ పదవులు చేపట్టే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు– అందరూ సత్యనిష్ఠతో పనిచేస్తామని ప్రమాణం చేస్తారు. అయినప్పటికీ, వారి నిజాయితీని నిరూపించేందుకు అటువంటి ‘సత్యపీఠం’ లేదు. భారత సుప్రీంకోర్టు కూడా ‘సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక’ (2010) కేసులో పాలీగ్రాఫ్, నార్కో అనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ వంటి పరీక్షలను వ్యక్తి సమ్మతి లేకుండా నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రశ్న ఏమిటంటే, పౌరుడి విషయంలో రాజ్యాంగం అంత జాగ్రత్తగా వ్యవహరిస్తే, ఓటరును మాత్రం మళ్లీ మళ్లీ తన ఉనికిని నిరూపించమని అడగడం ఎంత వరకు సమంజసం?ఓటరు ఎవరు?ఎన్నికల సంఘం చెబుతున్నది ఒకటే: ఫారం నింపండి, పత్రాలు ఇవ్వండి, వివరాలు సమర్పించండి. ప్రజలు అడుగుతున్న ప్రశ్న కూడా ఒక్కటే: ‘నేను ఇరవై ఏళ్లుగా ఓటు వేస్తున్నాను. నా పేరు ఇప్పటికే ఓటరు జాబితాలో ఉంది. మళ్లీ నేను ఎవరో ఎందుకు నిరూపించాలి?’ ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇప్పటివరకు ప్రజలకు అందలేదు. 2002లో జరిగిన ప్రత్యేక సవరణ తరువాత అనేక ఎన్నికలు జరిగాయి. అదే జాబితాల ఆధారంగా లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో లక్షలాది మంది ఓటు వేశారు. అప్పుడు చెల్లుబాటైన ఓటరు ఇప్పుడు అకస్మాత్తుగా సందేహా స్పదుడిగా ఏ విధంగా మారాడు?ఎన్నికల జాబితా రూపొందించడం భారత ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ బాధ్యత. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను గుర్తించడం, ఫారాలు అందించడం, సందేహాలు నివృత్తి చేయడం బూత్ లెవల్ అధికారుల విధి. కానీ అనేక ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా కనిపి స్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి వంటి పట్టణ ప్రాంతాల్లో వేలాది మందికి ఫారాలు అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్నిచోట్ల బీఎల్వోలు కాలనీల్లో కూర్చొని వచ్చిన వారికి మాత్రమే ఫారాలు ఇస్తున్నారు. అలాంటి పరిస్థితిలో, ఫారం అందకపోయినా బాధ్యత ఓటరుపైనే వేయడం న్యాయమా?జూలై మధ్య నాటికి సుమారు 1.66 కోట్ల తెలంగాణ ఓటర్లలో సగానికి కూడా తక్కువ మంది మాత్రమే ఫారాలు సమర్పించారని అధికారిక సమాచారం చెబుతోంది. అంటే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? ఫారం అందలేదా? సమయం సరిపోలేదా? లేక ప్రక్రియపై సరైన అవగాహన కల్పించలేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకుండా గడువులు పొడిగించడం ప్రజల సందేహాలను తగ్గించదు.డిజిటలైజేషన్ ఎందుకు?డిజిటల్ ఇండియా గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆధార్, ఓటర్ ఐడీ, జనన–మరణ నమోదు, చిరునామా రికార్డులు, ప్రభుత్వం వద్ద ఇప్పటికే విస్తృత సమాచారం ఉంది. ఈ సమాచారాన్ని సమన్వయం చేయకుండా, ప్రతి ఓటరునూ మళ్లీ పత్రాలతో రావాలని అడగడం పరిపాలనా సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. డిజిటల్ వ్యవస్థ పౌరుడికి సౌలభ్యం కలిగించాలా? లేక అతనిపై కొత్త భారం మోపాలా?ప్రత్యేకంగా హైదరాబాద్ మహానగర పరిధిలోనే లక్షలాది నమోదులు పరిశీలనకు వస్తే, ఎన్నికల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తడం సహజం. ఇటువంటి సందర్భాల్లో ఎన్నికల సంఘం మరింత పారదర్శకంగా వివరాలు వెల్లడించడం అత్యవసరం. ఎన్నికల సంఘం ఒక సాధారణ ప్రభుత్వ శాఖ కాదు. అది రాజ్యాంగం సృష్టించిన స్వతంత్ర సంస్థ. దాని నిర్ణయాలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలి, అనుమానాలను కాదు. పౌరుడు ఎన్నికల సంఘాన్ని నమ్మాలి, ఎన్నికల సంఘం కూడా పౌరుడిని నమ్మాలి. ఈ పరస్పర విశ్వాసమే ప్రజాస్వామ్యానికి మూలాధారం.మాయాబజార్ సినిమాలో చివరికి మాయ తొలగిపోతుంది. నిజం బయటపడుతుంది. అందుకే ఆ కథ సుఖాంతమవుతుంది. ప్రజాస్వామ్యంలో కూడా అదే జరగాలి. ఎన్నికల ప్రక్రియలో మాయకు, సందేహాలకు, అపార్థాలకు చోటు ఉండకూడదు. ‘నీవు ఓటరువని నిరూపించు’ అనే ధోరణి కంటే, ‘నీ ఓటు హక్కు రక్షించడం మా రాజ్యాంగబద్ధ బాధ్యత’ అనే ధోరణి ఎన్నికల సంఘానికి మరింత గౌరవాన్ని తీసుకొస్తుంది.సర్ అనేది కేవలం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మాత్రమే కాదు. అది ఎన్నికల సంఘం విశ్వసనీయతకు కూడా పరీక్ష. ఆ పరీక్షలో విజయం సాధించేది గణాంకాలు కాదు; పారదర్శకత, నిష్పాక్షికత, ప్రజల విశ్వాసం. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన ‘సత్యపీఠం’.- మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్ -
మహాత్ముల చేష్టలు..
బాలోన్మత్త పిశాచవత్ సిద్ధానాం రీతిః మహాత్ములయిన సిద్ధపురుషుల పద్ధతంతా విపరీ తంగా ఉంటుంది. పిల్ల చేష్టలు చేస్తారు. పిశాచం పట్టిన వాళ్ళలాగా వింతగా ప్రవర్తిస్తారు. పిచ్చివాళ్ళలాగా సంచరిస్తారు. వాళ్ళ చూపులు, పనులు వంటివన్నీ పైకి అలాగే కనిపిస్తాయి. అలాంటి మహనీయుల గొప్పతనాన్ని మహాత్ములే గుర్తిస్తారు. సామాన్యులకు తెలియదు.గౌతమ మహర్షి మహామహితాత్ముడు. గొప్ప సిద్ధుడు. శ్రీవిద్యోపసనా దురంధరుడు. ముద్రోపాసనను, శైవ సిద్ధాంతాన్ని మనకందించిన పుణ్యమూర్తి. పెద్ద పెద్ద పండితులు, చక్రవర్తులు ఆయన ఆశ్రమానికి వెళ్ళి వారి దర్శనం చేసుకొని వెళ్ళేవారు. నిత్యం వేదపారా యణం, ఉపాసన, యజ్ఞయాగాది క్రతువులు, పూజలు, సంద్గ్రంథ పారాయణాలు జరిగేవి.ఒక ఉన్మత్తుడు ఆశ్రమంలోనే ఉంటూ అందరికీ తపో, ధ్యాన భంగం చేస్తూ ఉండేవాడు. గౌతముడు మాత్రం ఆ పిచ్చివాణ్ణి దగ్గరకు పిలిచి ఆదరించేవాడు. ఆశ్రమవాసులందరూ ఆ పిచ్చివాణ్ణి తిట్టేవారు. ఇలా ఉండగా ఒక రోజున పండితులు, రాజు గౌతముని సన్మానించటానికి, పూజా సామగ్రిని, కానుకలను తీసుకొనివస్తే ఆ పిచ్చివాడు ఆ సామగ్రినంతటినీ చిందరవందర చేసి అందరిచేత తన్నులు తిన్నాడు. అందుకు గౌతముడు చాలా బాధపడ్డాడు. పాపం పిచ్చివాడిలాగా తిరిగే అవధూత మరణించాడు. ఇది చూచి గౌతముడు కూడా ప్రాణం వదిలేశాడు. అది తెలిసి శుక్రాచార్యులు కూడా ప్రాణత్యాగం చేశారు.ఆ విషాదం చూచి భరించలేక దేవతలందరూ జగన్మాతను ప్రార్థించారు. శ్రీమాత వాళ్ళ ప్రార్థన విని గౌతముని బ్రతికించింది. గౌతముడు మంత్రజలం చల్లి అవధూతను బ్రతికించాడు. శుక్రాచార్యుని సైతం బ్రతికించాడు. అక్కడి వాళ్ళతో గౌతముడు ‘ఈయనను పిచ్చివాడనుకొంటున్నారు మీరు. ఇది భ్రమ తప్ప నిజం కాదు. ఈయనొక మహాయోగి. అవధూత! నా పూర్వజన్మలో నా గురుదేవుడు. ఈయన ఇంతవరకు మీ విషయంలో చేసిన వింతచేష్టలు మిమ్మల్ని అనుగ్రహించటానికే. కానీ ఈ యధార్థం మీకు తెలియదు’ అని చెప్పాడు.- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
మన్యం నుంచి పార్లమెంటు దాకా...
అల్లూరి సీతారామరాజు ఆధ్వర్యంలో జరిగిన మన్యం పితూరీలో ఆయనకు ప్రధాన అనుచరులుగా గాం గంటందొర, గాం మల్లుదొర పేరెన్నిక గన్నారు. వీరు గిరిజనులలో భగత తెగకు చెందినవారు. ఇందులో మల్లు దొర స్వాతంత్య్రానంతరం పార్లమెంటుకూ ఎన్నిక య్యాడు. విశాఖపట్నం జిల్లా చింతపల్లి తాలూకాలోని కొయ్యూరు మండలం ‘బట్టపనుకులు’ గ్రామంలో 1900లో జన్మించాడు.గంటందొర చిన్న తమ్ముడు మల్లుదొర. బ్రిటిష్ తాబేదారుల అక్రమ చర్యలను గాం సోదరులు ప్రతిఘటించారు. ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నాడనే నేపంతో చింతపల్లి తాసిల్దార్ సెబాస్టియన్ గంటందొరను మునసబు పదవి నుంచి తొలగించాడు. అంతేగాదు, గంటందొర భూమితో పాటు మరికొందరి ఆదివాసుల భూములను ప్రభుత్వపరం చేశాడు. గాం సోదరులకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించడానికి మన్యం ప్రజలు అల్లూరి సీతారామరాజుకు తెలియుజేశారు.సీతారామరాజు 1922లో మన్యం పోరాటాన్ని ప్రారంభించాడు. బ్రిటిష్ వారి ఆగడాలను అంత మొందించడానికి 150 మంది సైనికులను సేకరించ డంలో గాం సోదరుల కృషి చెప్పుకోదగినది. వీరికి భగత తెగ గిరిజనులైన సింగన్న, పడాలు, గోవిందు, వీరయ్య దొర, గోకేరు ఎర్రేసు, అగ్గిదొర వంటి వారి సహకారం తోడైంది. సీతారామరాజు నాయకత్వంలో చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల పోలీస్ స్టేషన్లపై దాడిచేసి ఆయుధాలను సేకరించారు. బ్రిటిష్ ప్రభుత్వం అల్లూరిని పట్టిచ్చిన వారికి 10 వేలు, గంటందొర, మల్లుదొరలను పట్టిచ్చిన వారికి ఒక్కొక్కరికి వెయ్యేసి రూపాయల పారితోషికం ప్రకటించింది.ఉద్యమంలో కాస్త చురుకుదనం కోల్పోయిన సందర్భంలో ఆయుధాలను అల్లూరి సైన్యానికి అప్పగించి మల్లుదొర దళాన్ని విడిచి వెళ్లాడు. 1923 సెప్టెంబర్ 17న గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నడింపాలెం చేరుకున్నాడు. ఒక రహస్య ప్రదేశంలో బ్రిటిష్ వారికి పట్టుబడ్డాడు. అల్లూరి ఆచూకీ తెలుప మని మల్లుదొరను చిత్రహింసలు పెట్టినా ఏమీ చెప్పలేదు. 1924 మే 7న పట్టు బడిన అల్లూరి వీరమరణం పొందాడు. వాల్తేరు ఏజెన్సీ న్యాయమూర్తి మల్లు దొరకు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పాడు. మల్లుదొర అప్పీలు చేయగా మరణ శిక్షణను ద్వీపాంతరవాస శిక్షగా మార్చారు. 1937లో అండమాన్ జైలు నుంచి విడుదౖలñ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1952లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో విశాఖపట్నం ఏజెన్సీ నుంచి గెలుపొంది ఆదివాసీలలో తొలి పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరించారు. 1969 జూలై 21న తుదిశ్వాస విడిచారు.– గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపకుడు -
సంపద... సామాజిక బాధ్యత!
కంపెనీల రూపంలో వ్యాపారం నిర్వహించడం 1600 సంవత్సరంలో ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’తో ప్రారంభమైనదని చెప్పవచ్చు. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు సాధారణంగా సొంత యాజమాన్యంలో లేక భాగస్వామ్యంలో వ్యాపారాలు నిర్వ హిస్తుంటారు. పెద్ద ఎత్తులో వ్యాపారాలు నిర్వ హించాలంటే, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ‘కంపెనీ’ రూపంలో వ్యాపారం నిర్వహించాల్సి ఉంటుంది. 19వ శతాబ్దం మధ్య నుంచి కంపెనీల రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం మన దేశంలో రిజిస్టర్ అయిన కంపెనీల సంఖ్య దాదాపు 28 లక్షలు.ఎప్పుడైతే కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థలను శాసించడం మొదలైందో, అప్పుడే వాటి సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబి లిటీ–సీఎస్ఆర్) గురించి కూడా చర్చమొదలైంది. హోవార్డ్ బోవెన్ 1953లో మొదటిసారిగా, ‘కార్పొ రేట్ల సామాజిక బాధ్యత’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సామాజిక విలువలకు అనుగుణంగా కంపె నీల నిర్ణయాలు, పాలసీలు ఉండాలనీ, సమాజ అభివృద్ధికి ఆర్థికంగా సహాయపడాలనీ ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ గ్రహీత మిల్టన్ ఫ్రైడ్‌మ్యాన్ మాత్రం చట్టబద్ధంగా వ్యాపారం నిర్వహించి, కంపెనీలను లాభాల బాట పట్టించడం, కంపెనీ వాటాదారుల సంపద పెంచడం మాత్రమే ‘కార్పొరేట్ల సామాజిక బాధ్యత’ అని వాదించారు.కంపెనీలు సామాజిక బాధ్యతలను కూడా నిర్వహిస్తే, ఆదాయపు పన్ను రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలను అందిస్తామని ప్రపంచ దేశాలు వాటిని ప్రోత్సహిస్తున్నాయి. భారత ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి, కంపెనీ చట్టం–2013 లోని సెక్షన్ 135 ద్వారా సామాజిక బాధ్యతలను నిర్వర్తించడం కంపెనీలకు తప్పనిసరి చేసింది. చట్టంలో పొందుపరచిన సామాజిక బాధ్యతలను నిర్వర్తించకుంటే, అందుకు బాధ్యులైన కంపెనీ అధికారులకు మూడేళ్ల వరకు జైలుశిక్షను కూడా నిర్దేశించింది. ఆ విధంగా, ప్రపంచం మొత్తం మీద, శాసనం ద్వారా సామాజిక బాధ్యతలను నిర్వర్తించడం తప్పనిసరి చేసిన మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచింది. తరవాత, 2020లో జైలు శిక్ష స్థానంలో జరి మానాను విధించాలని పార్లమెంటు చట్టాన్ని సవ రించి కంపెనీలకు ఊరట కలిగించింది. సవరించిన చట్టం ప్రకారం, సామాజిక బాధ్యతలకై నిర్దే శించిన ఖర్చు చేయని డబ్బుపై రెండింతల జరి మానా ప్రభుత్వానికి కంపెనీ చెల్లించాలి. అందుకు బాధ్యులైన కంపెనీ అధికారులకు రెండు లక్షల వరకు జరిమానా విధించవచ్చు. ఇంకా, తన సామాజిక బాధ్య తను ఏ పరిస్థితుల్లో నిర్వర్తించ లేకపోయిందో వివరణ ఇవ్వాలి.లక్ష్యం నెరవేరినట్టే!గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఐదు కోట్ల రూపాయల లాభం, వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం, 500 కోట్ల రూపాయల నెట్‌వర్త్‌ను కంపెనీలు కలిగి ఉంటే... అవి తమ లాభాల్లో కనీసం 2 శాతం సీఎస్ఆర్ కార్యకలాపాలపై ఖర్చు చేయాలి. అది కూడా చట్టం నిర్దేశించిన 12 విభాగాలలో నుంచి ఒక దాన్ని ఎంచుకోవాలి. విద్య, వైద్యం, పర్యావరణం, గ్రామీణాభివృద్ధి, విపత్తు నిర్వహణ వంటివి ఇందులో ఉన్నాయి. సీఎస్‌ఆర్‌పై చేసిన ఖర్చుపై ‘బిజినెస్ ఎక్స్పెండి చర్’ కింద ఆదాయపు పన్ను మినహాయింపు లేదు.అయితే, ఈ చట్టం చేయకముందే ఎన్నో ఏళ్లుగా, టాటాలు, బిర్లాలు, మరెన్నో కార్పొరేట్ సంస్థలు విద్య, వైద్యం లాంటి ఎన్నో సామాజిక విషయాలపై స్వచ్ఛందంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాయి. కానీ చట్టం చేసిన తరువాత, గత పదేళ్ళలో కార్పొరేట్ సంస్థలన్నీ కలిసి 2 లక్షల కోట్ల రూపాయలకు పైన తమ సామాజిక బాధ్య తను నిర్వర్తించడానికి ఖర్చు చేశాయి. ఇది గర్వించదగ్గ విషయం. న్యాయవ్యవస్థలో, మౌలిక సదుపాయాల కొరత వల్ల కూడా, కేసులు విపరీ తంగా పెండింగ్‌లో ఉన్నాయి. కాబట్టి, న్యాయ వ్యవస్థను కూడా సీఎస్ఆర్లో 13వ విభాగంగా చేర్చుతూ చట్టాన్ని సవరించాలి.– హరీష్ కుమార్ కొలిచాల, న్యాయవాది, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
గురువే దేవుడి కన్నా ఉన్నతుడు..
భారతీయ సంస్కృతిలో గురువుకు ఉన్న స్థానం అద్వితీయం. అందుకు ఈ కథ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు: ఒక రోజు గురువు, దేవుడు ఇరువురూ కలిసి ఓ వ్యక్తి దగ్గరకు వచ్చారు. వెంటనే అతడు భగవంతుని పాదాలను తాకి నమస్కరించబోయాడు. భగవంతుడు అతణ్ణి ఆపి, ‘ముందు నీ గురువును పూజించు’ అన్నాడు. సరే అని, అతడు గురువును పూజించడం ప్రారంభించాడు. కానీ గురువు ‘శిష్యా, నేను భగవంతుడిని నీ ఇంటికి తీసుకువచ్చాను, కాబట్టి నువ్వు ముందు భగవంతుడిని పూజించాలి’ అన్నారు.గురువు సలహా విని, శిష్యుడు భగవంతునివైపు తిరిగాడు. ‘నీ జీవితంలోకి భగవంతుడిని తీసుకువచ్చింది నీ గురువే. నన్ను చేరుకోవడానికి సరైన మార్గాన్ని నీకు చూపింది ఆయనే, కాబట్టి నువ్వు ముందు ఆయనను పూజించాలి’ అన్నాడు భగవంతుడు. ‘నేను భగవంతుని వద్దకు మార్గం చూపినప్పటికీ, ప్రతిదానికీ ఆయనే బాధ్యుడు, కాబట్టి నువ్వు ముందు భగవంతుని ఆశీర్వాదం పొందడం మంచిది’ అన్నారు ఈసారి గురువు. దీంతో శిష్యుడు దేవుని ఉద్దేశించి ‘తండ్రీ, గురువుగారు చెప్పేదంతా నిజమే కదా’ అన్నాడు. అందుకు భగవంతుడు ‘కర్మఫలాలను బట్టి, నేను ఎలాంటి భేదం లేకుండా జనులకు సుఖదుఃఖాలను ఇస్తాను. నేను ఎవరికీ కీడుగానీ, మేలుగానీ చేయను. ప్రతి వ్యక్తికీ వారి కర్మఫలాన్నే ఇస్తాను. కానీ గురువు అలాంటివాడు కాదు. ఆయన పవిత్రుడు. నిరాడంబరుడు. ప్రేమమయుడు. గురువు మార్గదర్శకత్వం కోరిన శిష్యుడిని, అతను ఎలా ఉన్నాడో అలాగే స్వీకరిస్తాడు. నన్ను చేరే మార్గాన్ని అతనికి చూపించి ఆశీర్వదిస్తాడు. అతను ఎలా ఉన్నా సరే సరిదిద్దుతాడు. శిష్యుడి కర్మఫలాల నుండి అతడిని కాపాడుతాడు. అతనితో ఉండి మార్గనిర్దేశం చేస్తాడు. కానీ నేను అలా చేయను. అందువల్ల, గురువే దేవుడి కన్నా ఉన్నతుడు’ అన్నాడు.– యామిజాల జగదీశ్ -
రేపటిని సొంతం చేసుకోవడానికి...
‘విద్య సమాజ భవిష్యత్తుకు పాస్‌పోర్ట్ లాంటిది. రేపు అనేది, ఈ రోజే దానికోసం సిద్ధపడే వాళ్లకే సొంతం’ అంటాడు అమెరికన్ పౌర హక్కుల ఉద్యమకారుడు మాల్కం ఎక్స్. ప్రపంచంలో మున్ముందు సంభవించగల సాంకేతిక మార్పులకు, ఉద్యోగ మార్కెట్ అవలంబించే కొత్త రిక్రూట్మెంట్ విధానాలకు అనుగుణంగా విద్యా నిపుణులు రూపొందించిన ‘ఫ్యూచర్ రెడీ కోర్సులు’ విద్యార్థులను రేపటిని సొంతం చేసుకోవడానికి సిద్ధం చేస్తాయి.మెరుగైన ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు డేటా సైన్స్, కృత్రిమ మేధ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ వంటి ఫ్యూచర్ రెడీ కోర్సులు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ అందుబాటులో ఉండటం గమనించాల్సిన సంగతి. ‘ఇరవై ఒకటో శతాబ్దంలో నిరక్షరాస్యులు అంటే చదవడం, రాయడం రానివారు కాదు; నేర్చుకోవడం, నేర్చు కున్నదాన్ని వదిలేయడం, మళ్లీ కొత్తగా నేర్చుకోవడం తెలియని వారే’ అంటాడు అమెరికన్ రచయిత, ఫ్యూచరిస్ట్ ఆల్విన్ టాఫ్లర్. ప్రస్తుతం డేటా సైన్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఇత్యాది కోర్సులు, టాఫ్లర్ చెప్పినట్టుగా విద్యార్థుల వ్యక్తిగత ప్రతిభకు తగిన గుర్తింపునూ, సరిపడా ఆదాయాన్నీ తెచ్చిపెడతాయి. అందుకే ఈ కోర్సు లకే యువకులు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మునుపటితో పోల్చితే పూర్తి అధునాతనమైన ఈ కోర్సుల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత. కోట్ల కొద్దీ ఉన్న పాత సమాచారాన్ని అర్థంచేసుకొని, భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే ఊహించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. మనం యూట్యూబ్ లేదా నెట్‌ఫ్లిక్స్‌లో ఒక వీడియో చూడగానే ‘మీకు ఇది కూడా నచ్చుతుంది’ అంటూ కింద కొన్ని ఆప్షన్స్ వస్తుంటాయి. ఇది డేటా సైన్స్ మహిమే. మనుషుల్లాగే సొంతంగా ఆలోచించి నిర్ణ యాలు తీసుకునే తెలివితేటలు యంత్రాలకు వచ్చేశాయి. డ్రైవర్ లేకుండా దానంతటదే రోడ్లపై నడిచే ‘టెస్లా’ కార్లు, మనతో మనిషిలా మాట్లాడే ‘చాట్‌జీపీటీ’... కంప్యూటర్లకు కళ్ళు, చెవులు, మెదడు వచ్చేశాయి. ఇది ఏఐ పుణ్యమే!మారిన మార్కెట్ స్వరూపం మన డబ్బును, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే ఒక అదృశ్య సైన్యం మనకు అందుబాటులో ఉంది. మన బ్యాంక్ అకౌంట్ హ్యాక్ కాకుండా వచ్చే ఓటీపీలు, ఫోన్ లాక్ చేసే బయోమెట్రిక్ సిస్టమ్స్ ఇలా చాలా విషయాల్లో ఈ అదృశ్య సైన్యం పర్యవేక్షిస్తూ అభయ హస్తం చూపుతుంది. ఇదే సైబర్ సెక్యూరిటీ. ఇట్లాంటి ఫ్యూచర్– ప్రూఫ్ కోర్సుల ఫలితంగానే కాలేజీలు కేవలం డిగ్రీలు ఇచ్చే ఫ్యాక్టరీ లుగా కాకుండా, విద్యార్థులను ఆధునిక సవాళ్లను ఎదుర్కొనే సమ ర్థులుగా రూపొందించే నైపుణ్య కేంద్రాలుగా నిలబడుతున్నాయి.ఈ కోర్సులను పూర్తి చేసి ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఎంపికైతే, ఫ్రెషర్ స్థాయిలోనే నెలకు 1.5 లక్షల నుండి 2 లక్షల పైనే ప్రారంభ వేతనం లభిస్తోంది. ఈ ‘ఫాంగ్’ సంస్థలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని ఉపయోగించి, సంప్రదాయ వస్తుసేవల రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేశాయి. వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసే విధానం నుండి సేవలను పొందే విధానం వరకు ఈ సంస్థలు సృష్టించిన డిజిటల్ ఎకోసిస్టమ్ మార్కెట్ స్వరూపాన్నే మార్చేసింది. ఒక్కమాటలో, ఈ ఫ్యూచర్ రెడీ కోర్సులు ‘నేర్చుకోండి, సంపాదించండి, ఎదగండి’ నినాదానికి ఆచరణాత్మక రూపాలు. – ప్రొ. బెల్లి యాదయ్య, ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నకిరేకల్ -
Sushila Nayyar: గ్రామీణ భారత ఆరోగ్యం కోసం...
స్వాతంత్య్ర సమరయోధగా, రాజకీయ నాయకురాలిగా, త్యాగ శీలిగా ప్రఖ్యాతురాలైన సుశీలా నయ్యర్ గొప్ప వైద్యులు కూడా. ప్రస్తుతం పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న కుంజాలో 1914 డిసెంబర్ 26న ఆమె జన్మించారు. న్యూఢిల్లీలోని లేడీ హార్డింజ్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన సుశీల 1939లో గాంధీజీ కార్య దర్శిగా పనిచేసే తన అన్న ప్యారేలాల్ను కలవడానికి వార్ధా వెళ్లారు. అక్కడ కలరా సోకినప్పుడు సుశీల ఒక్కరే ఆ మహమ్మారిని లొంగ దీయగలిగారు. ఈ విజయాన్ని గాంధీజీ ఎంతో కొనియాడారు. పిమ్మట బి.సి. రాయ్ ఆమెను గాంధీ దంపతుల వ్యక్తిగత వైద్యు లుగా నియమించారు.క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీ, కస్తూర్బా దంపతులతో పాటు ఆమె కూడా ఆగాఖాన్ భవనంలో బందీగా ఉన్నారు. కస్తూర్బా మరణించిన తర్వాత, 1945లో సేవాగ్రామ్‌లో ‘కస్తూర్బా హాస్పిటల్’ను ప్రారంభించారు. అదే ఇప్పుడు ‘మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’గా అభివృద్ధి చెందింది.సుశీల ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి 1950లో భారతదేశం తిరిగి వచ్చి ఫరీదాబాద్‌లో ‘ట్యూబర్ కులోసిస్ శానిటోరియం’ ప్రారంభించారు. ‘గాంధీ మెమోరియల్ లెప్రసీ ఫౌండేషన్’కు సారథ్యం వహించారు. 1952లో రాజకీయాలలో ప్రవేశించారు. జవహర్లాల్ నెహ్రూ మంత్రి వర్గంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. ఈ హోదాలో ఢిల్లీలో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్‌ను ప్రారంభించడంతోపాటు, పలు రోగాల నిర్మూలనకు మౌలికమైన ఆరోగ్య పథకాలు ప్రారంభించారు. 1955లో ఢిల్లీ విధాన సభకు స్పీకర్‌గా ఎంపికయ్యారు.1962లో రెండవసారి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించి 1967 దాకా గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ నియంత్రణ, స్త్రీల, పిల్లల ఆరోగ్యం సంరక్షణా కార్యక్రమాలతో పాటు మలేరియా, సుఖరోగాలు, క్షయ, కుష్టు వంటి వ్యాధుల నిర్మూలనకు పలు పథకాలు చేపట్టారు. సమాజం పట్ల ఎంతో ఆర్తి ఉన్న సుశీల అవివాహితగానే ఉండిపోయారు. కుటుంబ నియంత్రణ, మద్యపాన నిషేధంలో స్త్రీల పాత్ర గురించి రెండు పుస్తకాలు వెలువరించారు. గాంధీజీ, కస్తూర్బాలకు సంబంధించి మరో ఎనిమిది పుస్తకా లను రచించిన డా‘‘ సుశీలా నయ్యర్ 2001 జనవరి 3న సేవాగ్రామ్‌లో గుండెపోటుతో 86 ఏళ్ల వయసులో కనుమూశారు.– డా. నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి విశ్రాంత ఉన్నతాధికారి -
అశాశ్వతత్వం..
ఒక పల్లెటూరి శివారులో ఒక వృద్ధుడు నివసించేవాడు. కొన్ని నెలల క్రితం అతడి భార్య చని పోయింది. భార్య చనిపోయి నెలలు గడిచినా, ఆమె జ్ఞాపకాలు అతడి హృదయాన్ని విడిచిపెట్టేవి కాదు. ఒకరోజు, భారమైన మనసుతో దేవాలయానికి వెళ్లాడు. పూజారి ‘ప్రాణులన్నీ అశాశ్వతములే.ఈ ధర్మాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే దుఃఖం తగ్గుతుంది. మనసు ఉపశమిస్తుంది!’ అన్నాడు. ఆ మాటలు అతని హృదయంలో ఆలోచనను రేకెత్తించాయి. ఇంటికి తిరిగి వచ్చి, భార్య ఇష్టపడే తోటలో కూర్చున్నాడు. అక్కడ ఒక వాడిపోయిన పువ్వు అతడి కనుల ముందే రాలి నేలపై పడింది. అతడు దాన్ని చేతిలోకి తీసుకుని మృదువుగా పలికాడు: ‘నువ్వు వచ్చావు, వెళ్లిపోయావు. కానీ నీ సువాసన మాత్రం మిగిలింది.’ఆ తరువాత అతడు ప్రతిరోజూ అశాశ్వత ధర్మం గురించి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే అతని హృదయం తేలికైంది. భార్యను కోల్పోయిన బాధ తగ్గలేదు కానీ ఆమెను ప్రేమించిన శాంతి పెరిగింది. ‘అశాశ్వతత్వాన్ని అంగీకరించడం అంటే విడిచిపెట్టడం కాదు, మనసును విముక్తి చేయడం! అనుకున్నాడు. మహా భారతం, శాంతిపర్వంలోని ఈ పద్యం అతడికి జ్ఞాపకానికి వచ్చింది.'కం. భూతము లనిత్యములు, నీవీ తెరువెప్పుడును విం దహీన ధృతిన్ నీచేతోగతి నలవఱపుముభూతానిత్యత్వ మదియ పుచ్చును వగలన్'‘ప్రాణులన్నీ అశాశ్వతములే. ఈ ధర్మాన్ని గురించి ఎప్పుడూ వింటూనే ఉన్నావు. కనుక, ధైర్యం నిండిన మనస్సుతో, ప్రాణములు అశాశ్వతాలనే ధర్మాన్ని అభ్యసించడం మొదలుపెట్టు.ఆ జ్ఞానమే అన్ని దుఃఖాలను పోగొట్టి మనసుకు ఉపశమనాన్ని కలిగిస్తుంది!’ అని తనవంటి వారి గురించే చెప్పినట్లున్న పై పద్యం భావాన్ని స్ఫురణకు తెచ్చుకున్నపుడు అతడిలోని దుఃఖం పూర్తిగా ఉపశమించి, మనసుశాంతిని పొందింది.– భట్టు వెంకటరావు -
మల్లికార్జున్ ఖర్గే (కాంగ్రెస్ అధ్యక్షుడు) రాయని డైరీ
చెట్లను రాల్చుకుని గంపలకు ఎత్తుకునేవి కావు ‘నినాదాలు’! నిరసనకారులే ‘నినాదాలకు’ గుత్తులు గుత్తులుగా ప్లకార్డులై కాస్తారు. రేపటి నుండి వర్షాకాల సమావేశాలు. పార్లమెంట్ ప్రాంగణంలో ఎంపీలు ఎలాంటి నిరసనలు, ధర్నాలు, సమ్మెలు, దీక్షలు చేయకూడదని లోక్‌సభ స్పీకర్ ఆదేశాలు!వర్షం కురవకూడదని పార్లమెంటు భవనం పైకెక్కి నిబంధనలు విధిస్తే ఆకాశం ఆలకిస్తుందా? మబ్బులు ఎక్కడివక్కడ తేలిపోతాయా? ఉరుములు వెళ్లి దిక్కుల్లో దాక్కుంటాయా? పిడుగులు మౌనంగా గొడుగుల కిందకు చేరతాయా? ఏం జరగబోతున్నాయి లోపల? పార్లమెంట్ సమావేశాలే కదా! ఎవరు వెళ్లబోతున్నారు లోపలికి? పార్లమెంటు సభ్యులే కదా! సభ్యుల్లో ఒక్కరైనా ఒక్క నినాదమైనా ఇవ్వకుండానే, నిరసన గళం వినిపించకుండానే పార్లమెంటుకు ఎన్నికై వచ్చి ఉంటారా?! దీక్షలు, ధర్నాలు చేయకుండానే విద్యార్థి సంఘాలను, కార్మిక ఉద్యమాలను నడిపి ఉంటారా?!నినాదం నిన్ను స్కూల్లోనో, కాలేజ్‌లోనో పట్టుకుంటుంది. అక్కడ వదిలేసినా, నువ్వు పని చేసే ఫ్యాక్టరీలో చిమ్నీ పొగలోంచి వచ్చి నిన్ను కమ్మేస్తుంది. నిన్ను నిరసనకారుడిని చేస్తుంది. నినాదాలను నిషేధిస్తూ స్పీకర్ తన సెక్రెటేరియట్ జనరల్ చేత ‘ప్రకటన లాంటి చట్టం’ చేయించినప్పుడు, నా తండ్రి మాపన్న నన్ను మందలించటం గుర్తొచ్చింది.‘‘పొద్దున్నే లేస్తావు. సమ్మెలు, నిరసనలు అని వెళ్తావు. చట్టం అంటే నీకు గౌరవం లేదా, కనీసం భయం లేదా...’’ అని ఆందోళనచెందేవారు ఆయన. చట్టానికి కదా పౌరులంటే గౌరవం ఉండాలి! చట్టానికి కదా పౌరులంటే భయం ఉండాలి! నాన్నకు తెలియక కాదు. తన కొడుకు చేతిని ‘నినాదపు పిడికిలి’ నుంచి విడిపించాలని ఆయన ప్రయత్నం. నినాదం నన్ను ఈ జన్మకూ, ఏ జన్మకూ వదిలేది కాదు.రజాకార్లు ఇంటికి నిప్పు పెట్టినప్పుడు ఆ చీకటి మధ్యాహ్నం ఆరేళ్ల వయసులో నాకు అంటుకున్న నినాదం; ఆ మంటల్లో అమ్మ, చెల్లి, మామయ్య కాలి పోయినప్పుడు నా చేత పెడబొబ్బలు పెట్టించిన నినాదం; నాన్న నన్ను నెలరోజులు అడవిలో దాచి, నాకోసం ఊళ్లో బంధువుల ఇళ్లకు భిక్షాటనకు వెళ్లినప్పుడు నన్ను జోలె పట్టిన నినాదం;కూలీగా నాన్న పని చేస్తున్న మిల్లులో, ఆ మిల్లు నడిపే బడి... పేద పిల్లలకు ట్రైనింగ్ లేని టీచర్లతో, పెద్దవాళ్ల పిల్లలకు పేరున్న టీచర్లతో పాఠాలు చెప్పిస్తున్నప్పుడు నన్ను పలకపై దిద్దిన నినాదం... ఇప్పుడీ సమావేశా లలో నా నిరసనను తెలియజేయకుండా నన్ను ఆపుతుందా? నీట్ అవకతవకలు, డీలిమిటేషన్ దురుద్దేశాలు, ఫిరాయింపు ఆపరేషన్లు, ఓటర్ల జాబితా అక్రమ సవరణల మీద నన్ను మౌనం వహించనిస్తుందా?పార్లమెంటు సమావేశాలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై 10 జన్‌పథ్‌లోని సోనియాజీ నివాసంలో జరిగిన సమావేశం ముగిశాక, బయటికి వస్తున్నప్పుడు రాహుల్ గాంధీ నన్ను ఒక్క చిరునవ్వుతో ఆపారు.‘‘ఖర్గేజీ, ప్రతి మాన్సూన్ సెష¯Œ ్స ప్రారంభా నికీ కాస్త అటూ ఇటుగా ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమిటో చెప్పండి’’ అన్నారు రాహుల్. ఆయన దేని గురించి మాట్లాడుతున్నారో నేను వెంటనే గ్రహించలేకపోయాను. ‘‘సరే, జూలై 21కి మీకేం గిఫ్టు కావాలో చెప్పండి ఖర్గేజీ...’’ అని మళ్లీ అడిగారు రాహుల్. అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది! ఈ 85 ఏళ్ల వయసులోనూ ప్రజల కోసం పాటు పడవలసిన పని ఒకటి ఉండటం, ప్రజల తరఫున ప్రదర్శన జరపటానికి చేతిలో ఒక నినాదం ఉండటం... వీటిని మించిన బర్త్ డే గిఫ్ట్ ఏముంటుంది?!- మాధవ్ శింగరాజు -
కర్బన క్రెడిట్లతో రైతులకు ఆదాయం
వరి సాగు ప్రపంచవ్యాప్తంగా హరిత గృహ వాయువుల (గ్రీన్ హౌస్ గ్యాసెస్) ఉద్గారాలకు ముఖ్యమైన వ్యవసాయ కార్యకలాపాలలో ఒకటిగా నిలిచింది. ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం, దశాబ్ద కాలంలో కార్బన్ డయాక్సైడ్ 11.4 శాతం పెరిగింది. వాతావరణ మార్పులకు కారణమవుతున్న కార్బన్ ఉద్గారా లలో 30 శాతం వ్యవసాయం ద్వారా విడుదలవుతున్నాయి. కొద్దిపాటి మార్పులు చేస్తే వ్యవసాయ రంగం నుండి వెలువడే ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చు.కర్బన ఉద్గారాలు, ముఖ్యంగా మీథేన్ వెలువడే పంటపొలాల్లో అనేక పర్యావరణహిత సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా అతి తక్కువ స్థాయికి తగ్గించడం మాత్రమే కాకుండా అంతకన్నా ఎక్కువ కర్బనాన్ని వాతావరణంనుంచి సంగ్రహించి భూమిలో స్థిరీకరించే దిశగా యాజమాన్య పద్ధతులుపాటించవచ్చు.నీటినిల్వ వరి సాగుతో పోలిస్తే అడపా దడపా నీటి పారుదల ద్వారా సాగు చేసే వరి కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది. ఇంకా వరుసల మధ్యలో మురుగునీటిని తీసివేయడం వలన దిగుబడిలో వ్యత్యాసం లేకుండా 50 శాతం వరకు ఉద్గారాలను తగ్గించుకోవచ్చు. దీని వలన కార్బన్ క్రెడిట్లు ఎకరాకు 1–2 చొప్పున పొంద వచ్చు. నేరుగా దమ్ములో వరి విత్తడం ద్వారా, వరి నాటు పద్ధతితో పోల్చుకుంటే 16–54% మీథేన్ వాయువు విడుదల తగ్గుతుంది. దమ్ము చేసి వరి నాటే పద్ధతి నుంచి నేరుగా వరి విత్తే పద్ధతిని అవలంబించి, కలుపు రసాయనాల ద్వారా కలుపు నివారించి, నీటి యాజమాన్యం చేపట్టి, యాంత్రీకరణ ద్వారా కొంత మేర మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించుకోవచ్చు. వరిలో అధిక మోతాదులో నత్రజని వాడటం వలన మిథనోజెనిక్ బ్యాక్టీరియా చర్యను తగ్గించి 30–50 శాతం మిథేన్ ఉద్గారాలు తగ్గించవచ్చు. వేపచెక్క, వేపనూనె, వేప పూసిన యూరియా వాడటం వల్ల కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించుకోవచ్చు. సమగ్ర పోషక యాజమాన్య పద్ధతుల ద్వారా నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులతో పాటుగా పశువుల ఎరువు వర్మీ కంపోస్ట్, కోళ్ల ఎరువును జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే సేంద్రియ ఎరువులు రసాయన ఎరువులు కంటే ఎక్కువ మిథేన్, నైట్రస్ ఆక్సైడ్, బొగ్గు పులుసు వాయువు లాంటి ఉద్గారాలను ఉత్పత్తి చేస్తాయి. వరి గడ్డి కాల్చడం వల్ల కాలుష్యం, కర్బన ఉద్గారాలు విడుదలై జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. వరిగడ్డిని కంపోస్ట్ చేసి కానీ లేదా భూమిలో కలియ దున్నటం వలన నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. ఖరీఫ్‌లో వరి కోసిన తర్వాత వరి గడ్డి మల్చింగ్ చేయడం వలన నైట్రస్ ఆక్సైడ్ 10% తగ్గింది కానీ మీథేన్ 8% పెరిగినది. దీని వలన నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతున్నందువలన ఈ పద్ధతిని ప్రోత్సహించాలి. సహజ వ్యవసాయం, సమీకృత సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించాలి. ఈ సమీకృత వ్యవసాయ విధానంలో వరినాట్లు వేసిన తరువాత, వరి పంట చుట్టూ కందకంలా చేసుకొని అందులో చేపల పెంపకం, అలాగే కందకం గట్టుపై కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల మొక్కలు, పూలు మొక్కలు, ఇతర ధాన్యపు పంటలు సాగుచేయాలి. ఈ పంటలతో పాటుగా పాడి, కోళ్ళ పెంపకం చేపట్టినట్లైతే కర్బన ఉద్గారాలను తగ్గించుకోవచ్చు.కర్బన క్రెడిట్–కర్బన మార్కెట్లు కర్బన క్రెడిట్ అనేది వాతావరణంలోకి విడుద లయ్యే హరిత గృహ వాయువుల ఉద్గారాలను తగ్గించడం లేదా తొలగించడం ద్వారా సంపాదించే వ్యాపారయోగ్యమైన ధ్రువీకృత యూనిట్. సాధారణంగా ఒక కర్బన క్రెడిట్ = ఒక మెట్రిక్ టన్ను (1000 కిలోగ్రాములు) కార్బన్ డై ఆక్సైడ్ లేదా దానికి సమానమైన ఇతర హరిత గృహ వాయువుల ఉద్గారాల తగ్గింపును సూచిస్తుంది.పరిశ్రమలు, సంస్థలు లేదా వ్యక్తులు తమ ఉద్గారాలను పూర్తిగా తగ్గించలేని పరిస్థితిలో, ఇతరులు సాధించిన ఉద్గారాల తగ్గింపుకు సంబంధించిన కర్బన క్రెడిట్లను కొనుగోలు చేసి తమ ఉద్గారాలను సమ తుల్యం చేసుకోవచ్చు.వరి సాగులో నీటి నిర్వహణ, ఎరువుల సమర్థ వినియోగం, మీథేన్ ఉద్గారాల తగ్గింపు వంటి పద్ధతుల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే హరిత గృహ వాయువులను తగ్గిస్తే, ఆ తగ్గింపును కొలిచి ధ్రువీకరించిన తర్వాత రైతులకు లేదా రైతు సమూహాలకు కార్బన్ క్రెడిట్లు జారీ చేస్తారు. దీనివల్ల అదనపు ఆదాయం, నీటి వినియోగంలో గణనీయమైన ఆదా, సాగు ఖర్చుల తగ్గింపు, నేల ఆరోగ్యం మెరుగుదల, వాతావరణ మార్పులకు అనుకూలమైన వ్యవసాయం, అంతర్జాతీయ కార్బన్ మార్కెట్లలో భాగస్వామ్యం రైతులకు చేకూరతాయి. – డా‘‘ బి. సహదేవ రెడ్డి, డా‘‘ కె. తేజస్వరరావు ,ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు -
ఆయన ప్రాణం కాపాడండి!
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28 నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ‘నిరవధిక నిరాహార దీక్ష’లో ఉన్నాడు. బరువు తగ్గాడు. బలహీనపడ్డాడు. అయినా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. వాంగ్‌చుక్ లద్ధాఖ్లోని ఉలేటోక్ఫో గ్రామ నివాసి. పర్యావరణ కార్యకర్త. విద్యా సంస్కర్త. హిమాలయ ప్రాంతానికి అనువైన ‘ఐస్ స్థూప’ అనే కృత్రిమ మంచు నిల్వ వ్యవస్థను అభివృద్ధి చేసి, అంతర్జాతీయ గుర్తింపును పొందారు. విద్యార్థులకు ‘ప్రత్యామ్నాయ విద్య’ను అందించాలనే లక్ష్యంతో ‘సెక్మోల్’ విద్యా సంస్థను స్థాపించారు. 2018లో ‘రామన్ మెగసెసే’ అవార్డును అందుకున్నారు.ఆయనకు దీక్షలు చేయడం కొత్తేమీ కాదు. ‘లద్ధాఖ్‌ను భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ పరిధిలోకి తేవాలి’ అంటూ, 2024లో 21 రోజుల పాటు ‘నిరాహార దీక్ష’ చేశారు. ప్రస్తుత దీక్ష సంగతికి వస్తే: ఈ ఏడాది మే నెలలో జరిగిన ‘నీట్’ పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. పరీక్ష నిర్వహణలో కొన్ని అవకతవకలు జరిగాయి. ఇది విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలో ‘కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, పరీక్షల నిర్వహణలో జవాబుదారీతనం తీసుకు రావాలి’ అంటూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఉద్యమం ప్రారంభించింది. దానికి సంఘీ భావంగా సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను మొదలెట్టారు.‘పరీక్షల నిర్వహణలో సంస్కరణలు చేపడతామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని’ జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) తెలిపింది. కానీ ఇలాంటి హామీలను నమ్మే స్థితిలో విద్యార్థులూ, ఉద్యమకారులూ లేరు. ఎందుకంటే 2024లో బిహార్‌లో ఇలాగే జరిగింది. అప్పుడు కూడా ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించింది. బిహార్‌లోని పట్నా, జార్ఖండ్‌లోని హజారీబాగ్ ప్రాంతాల్లో ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించింది. ‘155 మంది విద్యార్థులు ఈ మోసంతో ప్రయోజనం పొందినట్లు’ సుప్రీమ్ కోర్టుకు సీబీఐ తెలియజేసింది.2019లో తమిళనాడులోనూ ఇలాగే జరిగింది. అయితే అది లీకేజీ కాదు. అది ఇంపర్సనేషన్ రాకెట్! పరీక్షలు రాయవలసిన వారి స్థానంలోకి వేరేవాళ్లు వెళ్లి పరీక్షలు రాయడమన్నమాట! 2021, 2023లో కూడా ఇలాంటి స్కాములు కొన్ని చోట్ల జరిగాయి. కాబట్టి, ‘భవిష్యత్‌లో జరగకుండా చూసుకొంటాము’ అనే మాట నీటిమూట. 2018కి 2019 ఒక భవిష్యత్తు. 2024కు 2026 ఇంకో భవిష్యత్తు. కాబట్టి ఈ ‘భవిష్యత్తు హామీ’ అనేది ‘విద్యార్థుల భవిష్యత్తు’ నాశనం చేయడానికి తప్ప ఎందుకూ పనికిరాదు. ఆ విషయం తెలిసే వాంగ్‌చుక్ దీక్షకు కూర్చున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ‘ప్రతి పౌరుడి ప్రాణం అమూల్యమైనదే. అతడి ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేయాలి’ అంటూ కీలకమైన ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.– నన్నూరి వేణుగోపాల్, పౌర హక్కుల కార్యకర్త -
ప్రతిభకు పట్టం
భారతీయ ఇతిహాసాలలో శ్రీరాముడు కేవలం ధర్మప్రభువు మాత్రమే కాదు; ఆయన ఒక దూరదృష్టి గల నాయకుడు, ప్రతిభను గుర్తించే వ్యక్తి, మనుషులను తీర్చిదిద్దే సమర్థ నిర్వాహకుడు. ఆయన ఎవరినీ వారి జన్మ, హోదా, వయస్సు ఆధారంగా అంచనా వేయలేదు. ఒక వ్యక్తి పనితనం, సమర్థత, లక్ష్యానికి ఎంతగా ఉపయోగపడగలడనే ఒక్క ప్రమాణమే ఆయన ముందుండేది.వానర సేనలో హనుమంతుడు మొదట ఒక సాధారణ యోధుడిలా కనిపించవచ్చు. కానీ అతని వాక్చాతుర్యం, బుద్ధిశక్తి, సమస్య పరిష్కరణ సామర్థ్యాన్ని గమనించిన రాముడు, లంకా ప్రయాణం వంటి అత్యంత కీలకమైన బాధ్యతను హనుమకే అప్పగించాడు. చివరికి జాంబవంతుడు వంటి అనుభవజ్ఞులు కూడా హనుమంతుడిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాటలకంటే ఆచరణను గమనించే మేనేజర్‌గా శ్రీరాముడిని చూడవచ్చు. ఎవరు ఎంత చెప్పారు అనేదానికంటే, సంక్షోభ సమయంలో ఎవరు ముందుకు వచ్చారనే విషయానికే ప్రాధాన్యం ఇచ్చాడు. అందుకే విభీషణుడు రావణుని సోదరుడైనప్పటికీ, అధికారబలం లేకపోయినా, నిజాయితీగా సరైన సలహా చెప్పగల ధైర్యం ఉందని గుర్తించి, అనేక మంది వ్యతిరేకించినా లంకకు రాజుగా నియమించాడు.చాలామంది ప్రతిభను గుర్తించిన తర్వాత అవకాశం మాత్రమే ఇస్తారు. కానీ శ్రీరాముడు నమ్మిన వారికి అధికారాన్ని కూడా అప్పగిస్తాడు. దీనికి ఉత్తమ ఉదాహరణ సుగ్రీవుడు. ఆయనను కేవలం మిత్రుడిగా కాకుండా, వానర సేనాధిపతిగా పూర్తి నిర్ణయాధికారంతో నియమించాడు. విద్య, అధికారమేమీ లేని గిరిజన మహిళ శబరి భక్తి, అంకితభావం, సేవాభావాన్ని గుర్తించి ఆమెను అనుగ్రహించడం ఆయన విశాల హృదయానికి నిదర్శనం. శ్రీరాముడి ప్రతిభా నిర్వహణ నమూనా మనకు చెప్పే సందేశం ఏమిటంటే, ప్రతిభే ప్రధాన అర్హత. బాధ్యతను స్వీకరించే ధైర్యం, బృందాన్ని ముందుకు నడిపించే నైతికతే నిజమైన నాయకత్వ లక్షణాలు. రాముడు చూపిన ప్రతిభా నిర్వహణ నమూనా నేటి సీఈవోలు, హెచ్ఆర్ నాయకులు, ప్రాజెక్ట్ మేనేజర్లకు విలువైన పాఠం.– డా. బాలాజీ దీక్షితులు పి.వి. -
విడుదలలో జాప్యం తగదు!
ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ పొందిన తరువాత ఆర్థిక భరోసా కల్పించేది పెన్షన్. అయితే ద్రవ్యోల్బణం పెరుగు తున్నకొద్దీ పెన్షన్ విలువ తగ్గిపోకుండా రక్షించేందుకు డియర్నెస్ రిలీఫ్ (డి.ఆర్.) పొందే హక్కు పెన్షనర్లకు ఉంది. దీని చెల్లింపును ఆలస్యం చేయడం అంటే పెన్షనర్ల జీవన భద్రతను బలహీన పరచడమే. భారత సుప్రీంకోర్టు డి.ఎస్. నకారా వర్సెస్ యూని యన్ ఆఫ్ ఇండియా (1983) కేసులో పెన్షన్ అనేది ప్రభుత్వం దయాదాక్షిణ్యంతో ఇచ్చే సాయం కాదనీ, ఉద్యోగి తన సేవల ద్వారా సంపాదించిన ఆస్తి హక్కు అనీస్పష్టంగా పేర్కొంది. పెన్షన్‌కు అను బంధమైన డియర్నెస్ రిలీఫ్ కూడా అదే సూత్రానికి లోబడి ఉంటుంది.ఆర్టికల్ 41 ప్రకారం వృద్ధాప్యంలో ప్రజలకు సామాజిక భద్రత కల్పించడం రాజ్య విధాన నిర్దేశక సూత్రాలలో ఒకటి. కాబట్టి డి.ఆర్.ను సకాలంలో చెల్లించడం సంక్షేమరాష్ట్ర బాధ్యత. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు 37.31 శాతం డి.ఆర్. మాత్రమే అమలులో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ద్రవ్యోల్బణ సూచికల ప్రకారం 1.7.2024 నుండి 2.73 శాతం, 1.1.2025 నుండి 1.82 శాతం, 1.7.2025 నుండి మరో 2.73 శాతం, 1.1.2026 నుండి మరో 1.82 శాతం పెంపుదల రావలసి ఉంది. ఈ పెండింగ్ శాతం కేవలం గణాంకం కాదు; 3.60 లక్షల మంది పెన్షనర్ల కుటుంబాల ఆర్థిక ఇబ్బందులకు కారణం కూడా. ధరల పెరుగుదల, వైద్య వ్యయాలు, మందుల ఖర్చులు, విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బకాయిలు వారి జీవనా«న్ని దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నదనీ, అందుకే డి.ఆర్. చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతోందనీ అనవచ్చు. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించవలసిన చట్టబద్ధమైన బకాయిలను నిరవధికంగా వాయిదా వేయడం సరైన పరిపాలనా విధానం కాదు. ఈ చెల్లింపు ఆలస్యం చేయరాని బాధ్యత; అమలు చేయవలసిన న్యాయం.– టి.ఎం.బి. బుచ్చిరాజు, ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇంజినీరింగ్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
బకాయిలకు వడ్డీ చెల్లించండి!
‘పెన్షన్ ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదు– అది ఉద్యోగుల హక్కు’ అని సుప్రీంకోర్టు 1982 డిసెంబర్ 17న డి.ఎస్. నకారా కేసులో తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం 2024 మార్చి నుండి ఇప్పటివరకు రిటైర్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు హక్కుగా చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలు రెండేళ్లయినా ప్రభుత్వం చెల్లించడం లేదంటూ కొంతమంది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రారంభంలో కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం చెల్లింపులు చేసింది కానీ తర్వాత ఆపింది. దీంతో కోర్టు ధిక్కారం కింద హైకోర్టులో కేసులు నమోదయ్యాయి.రిటైర్మెంట్ బకాయిలు 10% వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని కోర్టు ఆదేశించినప్పటికీ కొంతమందికి మాత్రమే పూర్తి స్థాయిలో చెల్లించి, మరికొంత మందికి కొన్ని బిల్లులు మాత్రమే పాక్షికంగా చెల్లించి, పూర్తిగా చెల్లించామని కోర్టు ధిక్కరణకు మళ్లీ ప్రభుత్వం పాల్పడు తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయులు సర్వీసులో ఉన్నప్పుడు కొంత మంది హోమ్ లోన్, పర్సనల్ లోన్, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తీసుకొన్న వారు ఇప్పటికీ వడ్డీలు భారీగా కడుతున్నారు. కాబట్టి గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయి లపై10 శాతం వడ్డీ చెల్లించాలి.2024 మార్చి నుండి 2026 జూన్ వరకు దాదాపు 26,000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందారు. ఎనిమిది నెలలుగా వివిధ పెన్షనర్ సంఘాలు ఉద్యమాలు చేస్తే వంద రోజులలో ఆరువేల కోట్లు చెల్లిస్తామని – వాటిలో మే నెలలో 2,000 కోట్లు, జూన్‌లో 2,000 కోట్లు, సెప్టెంబర్ 2025 వరకు కమ్యుటేషన్, జీపీఎఫ్ 100 శాతం చెల్లించామని ప్రకటించుకొంది ప్రభుత్వం. కానీ సెప్టెంబర్ 2025 వరకు ఎస్టీఓలో కమ్యుటేషన్ బిల్లు సబ్మిట్ చేసినప్పటికీ కొంతమందికి రాలేదు.కొంతమందికి జీపీఎఫ్ కూడా రాలేదు. కొంతమంది బిడ్డల పెళ్లిళ్లు ఉన్నాయని పెండ్లి కార్డులు పెట్టినప్పటికీ వారికి జీపీఎఫ్ డబ్బులు అందకపోవడం దారుణం. కాబట్టి వారి టోకెన్ నంబర్లు పరిశీలించి, వారికి ఈ జూలై నెలలో చెల్లించాలి. రిటైర్ అయిన ఉద్యోగులందరికీ రిటైర్మెంట్ బకాయిలన్నింటినీ దశలవారీగా కాకుండా ఏక మొత్తంగా ఈ జూలై నెలలోనే చెల్లించాలి.– కందుకూరి దేవదాసు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (తెలంగాణ) అసోసియేట్ అధ్యక్షుడు -
మానవీయతే ఇస్లాం హృదయం
ఇస్లాం ధర్మం కేవలం కొన్ని ఆరాధనల సమాహారం కాదు; అది పరస్పర ప్రేమ, కరుణ, మాన వీయ విలువలతో కూడిన సంపూర్ణ జీవన విధానం. ‘భూమిపై ఉన్నవారి పట్ల మీరు దయ చూపండి, ఆకాశంలో ఉన్నవాడు (సృష్టికర్త) మీ పట్ల దయ చూపుతాడు’ అనే ప్రవక్త (స) వారి బోధన ఇస్లామీయ మానవీయ దృక్పథానికి అద్దం పడుతుంది.ఒకరి కష్టాన్ని చూసి చలించి పోవడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అనాథలను ఆదరించడం, తోటి మనిషిని చిరునవ్వుతో పలకరించడం కూడా ఇస్లాంలో పుణ్యకార్యం (సదఖా)గా పరిగణించబడుతుంది. నిజమైన విశ్వాసం అనేది తోటి మనుషులకు మేలు చేయడంలోనే దాగి ఉందనేది ఇస్లాం అంతరార్థం. తన పొరుగువాడు ఆకలితో అలమటిస్తుంటే, తాను మాత్రం తృప్తిగా భుజించేవాడు నిజమైన విశ్వాసి కాదనే హెచ్చరిక సమాజం పట్ల మనకున్న బాధ్యతను గుర్తు చేస్తుంది.హృదయాలను ముక్కలు చేయడం కాదు, గాయపడిన హృద యాలను ఆప్యాయతతో కలపడమే ఇస్లాం నేర్పిన జీవన విధానం. మనుషుల మధ్య ద్వేషాన్ని తుడిచేసి, క్షమా గుణాన్ని, సహనాన్ని అలవర్చుకున్నప్పుడే ఒక మనిషి సృష్టికర్తకు అత్యంత ప్రియమైనవాడిగా మారతాడు. సృష్టిలోని ప్రాణులన్నిటినీ ప్రేమిస్తేనే దైవాన్ని ప్రేమించినవారమవుతామనే ఉదాత్త సందేశం ఇస్లామీయ జీవన విధానంలో ప్రతిధ్వనిస్తుంది.– ఎం.డి. ఉస్మాన్ ఖాన్ -
విద్యుత్తు ప్రమాదాలు నివారించగలిగినవే!
భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలు ఆధునికీకరణ దిశగా వేగంగా పయనిస్తున్నప్పటికీ, విద్యుత్ భద్రత అదే వేగంతో ముందుకు సాగడం లేదు. ఫలితంగా ప్రతి సంవ త్సరం వందలాది మంది ఉద్యోగులు, రైతులు, సాధారణ ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు బలవుతున్నారు. వరుసగా చోటుచేసుకున్న విద్యుత్ ప్రమాదాలు యాదృచ్ఛికాలు కావు; విద్యుత్ భద్రతా వ్యవస్థలో ఎక్కడో తీవ్రమైన లోపం ఉందని సూచిస్తున్నాయి.విద్యుత్ రంగంలో నాలుగు దశాబ్దాలుగా పనిచేసిన ఒక ఇంజినీర్‌గా నా అనుభవం చెబుతున్నది ఒక్కటే– విద్యుత్ ప్రమాదాల్లో ఎక్కువ శాతం నివారించగలిగేవే. ప్రతి ప్రమాదం వెనుక డిజైన్, నిర్వహణ, రక్షణ వ్యవస్థ, పర్యవేక్షణ, శిక్షణ, భద్రతా సంస్కృతి, జవాబుదారీతనం వంటి అనేక అంశాలు పరస్పరం ముడిపడి ఉంటాయి. కాబట్టి ప్రతి ప్రమాదాన్ని రూట్ కాజ్ ఎనాలిసిస్ (మూల హేతువు విశ్లేషణ) పద్ధతిలో విచారించి, అసలు కారణాలను గుర్తించడం తప్పనిసరి.భారతదేశంలో విద్యుత్ భద్రతకు సంబంధించిన చట్టపరమైన వ్యవస్థ స్పష్టంగానే ఉంది. ఎలక్ట్రిసిటీ యాక్ట్– 2003, అలాగే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (మెజర్స్ రిలేటింగ్ టు సేఫ్టీ అండ్ ఎలెక్ట్రిక్ సప్లై) రెగ్యులేషన్స్... విద్యుత్ సంస్థలు, కాంట్రాక్టర్లు, ఉద్యోగులు పాటించాల్సిన భద్రతా ప్రమాణాలను నిర్దేశించాయి. అయినప్పటికీ ప్రమాదాలు ఎందుకు తగ్గడం లేదు? దానికి సమాధానం ‘వ్యవస్థాపరమైన భద్రతా సంస్కృతి’ లోపించడంలో ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత విచారణ కమిటీలు వేయడం, పరిహారం ప్రకటించడం, సంతాపం తెలియ జేయడం అవసరమే. కానీ ప్రమాదం జరగకముందే దానిని నివా రించే వ్యవస్థను నిర్మించడం ఇంకా ముఖ్యమైన బాధ్యత. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యుత్ రంగం ‘జీరో ఫెటాలిటీ విజన్’ అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తోంది. అంటే, విద్యుత్ ప్రమాదాల వల్ల ఒక్క మరణం కూడా సంభవించకూడదనే లక్ష్యంతో వ్యవస్థలు రూపు దిద్దుకుంటున్నాయి. మన దేశంలో కూడా ఇదే లక్ష్యం కావాలి.తీసుకోవలసిన భద్రతా చర్యలుప్రతి విద్యుత్ ప్రమాదాన్ని ‘అనివార్యమైన ప్రమాదం’గా కాకుండా, ‘నివారించగలిగిన వ్యవస్థ వైఫల్యం’గా పరిగణించే దృక్పథం ఏర్పడాలి. తెగిపోయిన 11 కేవీ లేదా 33 కేవీ విద్యుత్ లైన్ నేలపై పడిన క్షణంలోనే సంబంధిత రక్షణ వ్యవస్థ స్పందించి ఫీడర్‌ను ట్రిప్ చేయాలి. అది జరగకపోతే ఆ రక్షణ వ్యవస్థ ఎందుకు పనిచేయలేదో విచారణ జరగాలి. రక్షణ పరికరాల లోపమా? నిర్వ హణ నిర్లక్ష్యమా? పరీక్షలు సకాలంలో జరగలేదా? లేక పర్యవేక్షణలో వైఫల్యమా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడే తదుపరి ప్రమాదాన్ని నివారించగలం.ఇక మరో ముఖ్యమైన అంశం – విద్యుత్ ప్రమాదాలను కేవలం ఉద్యోగుల సమస్యగా చూడరాదు. వీటిలో పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలు, రైతులు, చిన్నారులు కూడా బలవుతున్నారు. తెగిపడిన తీగలను తాకడం, ట్రా¯Œ ్సఫార్మర్ల సమీపంలో నిర్లక్ష్యంగా తిరగడం, చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు తగిలినా పట్టించుకోకపోవడం, అక్రమ విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడం వంటి కారణాలు కూడా ప్రమాదాలకు దారితీస్తున్నాయి.ఒక ఆధునిక విద్యుత్ వ్యవస్థలో మూడు రక్షణ వలయాలు ఉండాలి – నాణ్యమైన ఇంజినీరింగ్ రూపకల్పన, సమర్థవంతమైన రక్షణ వ్యవస్థలు, కఠినమైన భద్రతా సంస్కృతి. ఈ మూడూ బలంగా ఉన్నప్పుడే విద్యుత్ ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి. వీటిలో ఏ ఒక్కటి బలహీనపడినా, దాని మూల్యం ఒక అమాయ కుడి ప్రాణంగా మారుతుంది.ప్రతి విద్యుత్ ప్రమాదం తర్వాత ఒకే ప్రశ్న మనకు మనం వేసుకోవాలి – ‘ఈ ప్రమాదం నిజంగా తప్పించలేనిదేనా?’ నిజా యితీగా సమాధానం వెతికితే, చాలా సందర్భాల్లో జవాబు ‘కాదు’ అనే వస్తుంది. అప్పుడు మనం అంగీకరించాల్సిన సత్యం ఒక్కటే– ప్రాణాలను కోల్పోయిన వారు విద్యుత్ వల్ల కాదు; భద్రతా వ్యవస్థ లోని లోపాల వల్ల మరణించారు అని. ఈ సత్యాన్ని అంగీకరించిన రోజే విద్యుత్ రంగంలో నిజమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టి నట్లవుతుంది.– తుల్జారాంసింగ్ ఠాకూర్, రిటైర్డ్ విద్యుత్ ఇంజినీర్ -
అతడో అస్తిత్వ స్వరం!
తెలుగు దళిత సాహిత్యంలో మాదిగ అస్తిత్వాన్ని స్వతంత్ర సాహిత్య వాదంగా ముందుకు తీసుకొచ్చిన రచయిత నాగప్పగారి సుంద ర్రాజు. దళిత, బహుజన ఉద్యమాల ధిక్కార స్వరాన్ని మాదిగ సాహిత్యం ద్వారా కొత్త ఎత్తుకు తీసుకెళ్లాడు. 1968 మే 31న కర్నూలు జిల్లా మొలగవెల్లి కొట్టాలలో జన్మించాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పులికంటి కృష్ణారెడ్డి దళిత కథలు, రాయలసీమ కథలపై పరిశోధన చేశాడు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. కేవలం 32 ఏళ్లకే 2000 జూలై 17న కన్ను మూశాడు. ఆ స్వల్ప జీవితకాలంలోనే తెలుగు దళిత సాహిత్యంపై చెరగని ముద్ర వేశాడు.సుందర్రాజు రచనలు మాదిగ సమాజ జీవన వాస్తవాలను, కులవివక్షను, భూస్వామ్య దోపిడీని, జోగిని వ్యవస్థ వంటి అమానవీయ ఆచారాలను వాస్తవిక దృక్పథంతో చిత్రించాయి. ఛండాల చాటింపు, మాదిగోడు, మాదిగ చైతన్యం, మా ఊరి మైసమ్మ వంటి రచనలు మాదిగల ఆత్మగౌరవ పోరాటానికి సాహిత్య రూపాలుగా నిలిచాయి. తెలుగులో తొలి మాదిగ కవుల సంకలనం ‘మాదిగ చెతన్యం’. సెంట్రల్ యూనివర్సిటీలో ‘మాదిగ సాహిత్య వేదిక’ను స్థాపించి, మాదిగ సాహిత్యానికి ప్రత్యేక అస్తిత్వాన్ని కల్పించేందుకు ఆయన చేసిన కృషి తెలుగు దళిత సాహిత్య చరిత్రలో ఒక సంచలనానికి కారణమయ్యింది.మాండలికం ద్వారా కూడా ఒక సామాజిక చరిత్రను అస్తిత్వ వ్యక్తీకరణగా మలచడం ఎలాగో ఆయన కథా శిల్పంలోని ప్రధాన విశిష్టత. ఈ కారణంగానే ఆయన రచనలు రాయలసీమ మాండలిక సాహిత్యానికి కొత్త దిశను నిర్దేశించి నవిగా గుర్తింపుపొందాయి. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, బండి నారాయణస్వామి వంటి సాహితీవేత్తల ప్రశంసలు పొందాయి.నాగప్పగారి సుందర్రాజు సాహిత్యం కేవలం సృజనాత్మక రచన మాత్రమే కాదు; అది అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతిధ్వనిగా, సామాజిక న్యాయానికి సాహిత్య ప్రకటనగా, అన్యాయంపై ధిక్కార స్వరంగా వినిపిస్తుంది. అర్ధశతాబ్దం కూడా భౌతికంగా జీవించలేకపోయినా అనేక శతాబ్దాల దళిత జీవితాల బాధలను, గాథలను సాహిత్యీకరించి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆయన రచనలు దళిత సాహిత్య అధ్యయనానికి, సామాజిక చైతన్యానికి స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకాలుగా నిలిచాయి.– డా. దార్ల వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్, తెలుగు శాఖ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (రేపు నాగప్పగారి సుందర్రాజు వర్ధంతి) -
సమాజంలో ఏ గొడవలతోనూ పని లేకుండా..
సమాజంలో ఏ గొడవలతోనూ పని లేకుండా మంచి ప్రవర్తనతో, దైవచింతనతో జీవితం గడపాలనుకొనేవారు శుద్ధమైన ఆహారమే తీసుకోవాలి. ప్రేమ, దయ, దాక్షిణ్యం, కోపం లేకుండటం, ఉపకార బుద్ధి, ఇతరుల సుఖదుఃఖాలను తనవిగా భావించే గుణం వంటి గుణాలన్నీ సాత్త్విక గుణాలు. ఇవి శుద్ధమైన ఆహారం తీసుకోవటం వల్లనే కలుగుతాయి. దేశ కాల ప్రాంతాలకు అనుకూలంగా భోజనం చేయాలని శాస్త్ర వచనం.భీష్మాచార్యులవారు అస్త్ర సన్యాసం చేసి అంపశయ్యమీద పడుకొన్నాడు. వైకుంఠ గమనానికి వేచి ఉన్నాడు. ఆయన చేసిన బోధలను పాండవులందరూ శ్రద్ధగా విన్నారు. ఆ సమయంలో దూరం నుండి వింటున్న ద్రౌపదీ దేవి నవ్వింది. తన మాటలు విని నవ్వినందుకు భీష్ముని మనస్సు బాధపడింది. కారణం తెలియగోరాడు. ద్రౌపది వినయంగా విన్నవించింది. ‘అయ్యా! మీరు మాకెప్పడూ ధర్మ ప్రబోధం చేయవలసినవారే. ఇప్పుడు నా నవ్వుకు కారణం మాత్రం వేరే ఉంది. మరేమీ లేదు. ఆనాడు నిండు కౌరవసభలో అందరూ చూస్తుండగా దుశ్శాసనుడు నాకు వస్త్రాపహరణం చేశాడు. అప్పుడా సభలో మీరు కూడా ఉన్నారు. కాని ఇది అకృత్యమని మీరెవరికీ బుద్ధి చెప్పలేదు. పోనీ ఆ దుష్కృత్యాన్ని చూడలేక అక్కడ నుండి లేచి బయటకు వెళ్ళనూ లేదు. అదీ కాకపోతే రెండు కళ్ళు మూసుకొనవచ్చు కదా! అదీ చేయలేదు మీరు. అలాంటి మీకిప్పుడు ఈ ధర్మప్రబోధం చేయాలనే బుద్ధి యెలా పొడమింది? అని సందేహం కలిగి నవ్వాను’.‘అమ్మా! ద్రౌపదీదేవీ! నీకు సందేహం రావలసినదే తల్లీ! నిన్న మొన్నటివరకు నేను కౌరవుల పక్షంలోనే ఉన్నాను కదా! వారి ఉప్పు తిన్నవాడనయ్యాను. వారి ఆహార ప్రభావం వల్ల వాళ్ళ మాటలే చెవికెక్కాయి. నేను గాంగేయుడను. తిరిగి నా తల్లి గంగతోనే పవిత్రుడను కావాలి. అందుకని ఇప్పుడు అర్జునుడు తన బాణంతో పాతాళం నుంచి పరమ పవిత్రమైన గంగాజలాన్ని పైకి తెప్పించాడు. దాని ప్రభావంతో లోగడ కోల్పోయిన సాత్త్విక భావన తిరిగి వచ్చింది తల్లీ!’ అని చెప్పాడు. ‘ఆహార శుద్ధౌ సత్త్వ శుద్ధిః సత్త్వ శుద్ధౌ ధ్రువామతిః’- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
చెరువు గట్టుకు చేరనున్న భరోసా
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరాన్ని దేశ ఆక్వా రాజధానిగా నిలబెట్టాడు రైతు. ఆ ‘తెల్లబంగారం’ డాలర్ల వర్షం కురిపించిన రోజులూ ఉన్నాయిగానీ నేడు అదే చెరువు గట్లపై నిలబడి రైతు ఏంచేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మే నెలలో పాలకొల్లు–భీమవరం రహదారిపై, రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన రొయ్యలను కుప్పలుగా పారబోసి రైతులు ఆక్రోశించిన దృశ్యం, ఈ రంగం ఎంతటి సంక్షోభంలో కూరుకుపోయిందో ప్రపంచానికి చెప్పకనే చెప్పింది.ఇది ఏదో ఒక జిల్లాకు పరిమితమైన కథ కాదు. రాష్ట్రవ్యాప్తంగా 5.74 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. లక్షలాది కుటుంబాలు ఆక్వా రంగంపై బతుకుతున్నాయి. కేవలం పదిహేను రోజుల వ్యవధిలో 100 కౌంట్ రొయ్య ధర రూ. 270 నుంచి రూ. 215కు కుప్పకూలింది. 100 కౌంట్ రొయ్య పండించేందుకు రూ. 270 వరకు ఖర్చవుతుండగా, మార్కెట్లో దక్కుతున్నది రూ. 220–240 మాత్రమే. యాభై దాకా ఉన్న ఎగుమతి కంపెనీలు ఏకపక్షంగా ధరలు నిర్ణయించి, ‘100 కౌంట్‌కు రూ. 230, 40 కౌంట్‌కు రూ. 330, 30 కౌంట్‌కు రూ. 430, నెలాఖరు వరకు ఇవే రేట్లు’ అని ప్రక టించే స్థాయికి పరిస్థితి దిగజారిందంటే, మార్కెట్లో రైతుకు మిగిలే మాటే లేదని అర్థం.మేత, సీడ్, ప్రాసెసింగ్ సంస్థలన్నీ ఒక్కటై సిండికేట్‌గా వ్యవహ రిస్తూ పంట చేతికొచ్చే వేళకే కొనుగోలు ధర దించుతున్నాయనీ, వాటిలో అధిక భాగం అధికార పెద్దల అనుకూలుర చేతుల్లోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పంటను కాపాడుకునేందుకు రైతు అధిక వడ్డీ అప్పుల ఊబిలో దిగబడుతున్నాడు.నీటిమూటలైన హామీలు ఎన్నికల ముందు ‘ఆక్వా జోన్ తో నిమిత్తం లేకుండా రైతులందరికీ యూనిట్ రూ. 1.50కే విద్యుత్’ అని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఆ దిశగా పైసా విడుదల చేయలేదు. ‘హామీని అమలుపర్చలేదు సరికదా సబ్సిడీపై ఇస్తామన్న ట్రాన్ ్సఫార్మర్లు, పరికరాలు కూడా ఇవ్వలేదు’ అని రైతులు వాపోతున్నారు. జీవో 169లోని పవర్ ఫ్యాక్టర్ నిబంధన (క్లాజ్ 4) పారిశ్రామిక ప్రమాణాలు పాటించలేని వేలాది సన్న, చిన్నకారు ఆక్వా రైతులకు గుదిబండగా మారింది. హేచరీలకు నాణ్యమైన విద్యుత్ కావాలంటూ 2024 నవంబర్లోనే భీమవరం వేదికగా విద్యుత్ శాఖ మంత్రి ఎదుట రైతులు మొరపెట్టుకున్నారు. ‘త్వరలోనే కచ్చితమైన నిర్ణయం’ అని మంత్రి హామీ ఇచ్చి పంతొ మ్మిది నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో మారిందేమీ లేదు.ఈ నేపథ్యంలోనే గత నెల 16న ‘ఏపీ ప్రాన్ ఫెడరేషన్’ ప్రతినిధులు, మాజీ అగ్రికల్చర్ కమిషన్ వైస్ చైర్మన్, ఆక్వా రైతులు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. పెరిగిన మేత ధరలు, పడిపోయిన రొయ్య ధరలు, పెరిగిన పెట్టుబడి వ్యయం, నిలిచిపోయిన రాయి తీల వ్యథను ఆయనకు వివరించారు. ఫలితంగా జూలై 15న జగన్ ఆక్వా రైతులకు అండగా భీమవరం బాట పడుతున్నారు. ఇది మామూలు రాజకీయ పర్యటన కాదు. చెరువు గట్ల మీదకే వెళ్లి రైతు కష్టాన్ని కళ్లారా చూడటం, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీయడం, కుంగిన గుండెల్లో భరోసా నింపడం: ఈ మూడూ ఆ పర్యటన లక్ష్యాలు. ప్రజా సంకల్ప పాదయాత్రలో పశ్చిమ గోదావరి గడ్డపైనే ఆక్వా రైతుకు రూ. 1.50 విద్యుత్ మాట ఇచ్చి, అధికారంలోకి రాగానే అక్షరాలా అమలు చేసి చూపిన నేత ఆయన. అందుకే ఆయన రాక అంటే ఆక్వా సీమకు అది కేవలం సానుభూతి పలకరింపు కాదు, అనుభవం రుజువు చేసిన భరోసా.– డా. కొత్తపల్లి శ్రీనివాస వర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
వైద్యుల భద్రతే ఆరోగ్య భద్రత
మహారాష్ట్రలోని ఒక ఆసుపత్రిలో వైద్యులు, నర్సులపై స్థానిక కార్పొరేటర్ దాడి చేశాడనే వార్తలొచ్చాయి. అరెస్టు చేయబోతున్నారని తెలియగానే, ఆ కార్పొరేటర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడని సమాచారం. తాను దాడి చేసిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నుంచే తనకు వైద్యం అందాలని ఆయన ఏ సంకోచం లేకుండా ఆశించడం హాస్యాస్పద విషాదం.ఇదే సంఘటన సింగపూర్‌లో జరిగితే పరిస్థితి వేరేలా ఉండేది. ‘ఆరోగ్య సంరక్షణ రంగంలో దాడులు, వేధింపుల నివారణకు త్రైపాక్షిక విధానం’ అక్కడ అమలవుతోంది. దాడి చేసిన వ్యక్తికి (అత్యవసరం కాని) చికిత్సను నిరాకరించడంతో పాటు, మెడికల్ రికార్డులలో ‘దురుసుగా ప్రవర్తించే వ్యక్తి’గా శాశ్వతంగా ముద్రించే అవకాశం ఉంది. వైద్యులపై హింసకు అక్కడ జీవితకాల పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.భారతదేశంలో ఆరోగ్య సంరక్షకులపై హింస సాధారణమై పోయింది. వైద్యులు, నర్సులు ఇప్పటికే సుదీర్ఘ పనివేళలు, మాన సిక ఒత్తిడి, వసతుల కొరతతో సతమత మవు తుండగా... ఇప్పుడు బెదిరింపులు, భౌతిక దాడుల భయం పెరుగుతున్నాయి. ‘ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్’లో ప్రచురి తమైన ఉత్తరాఖండ్ అధ్యయనం వివరాల ప్రకారం, 75% మంది వైద్యులు ప్రతీకార దాడులు ఎదుర్కొన్నారు. ఇందులో 68% దాడులు రోగుల బంధు వులు చేస్తే, కేవలం 18% కేసులు మాత్రమే పోలీసుల దృష్టికి వెళ్లాయి. సఫ్దర్ జంగ్ వంటి ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల నెట్‌వర్క్‌లలో జరిగిన ఆడిట్ ప్రకారం అధిక ఒత్తిడి షిఫ్ట్‌లలో హింస రేటు 63.6%గా ఉంది. పరిస్థితి ఇలాగే కొనసా గితే వైద్య శాస్త్రాన్ని అభ్యసించడానికి ప్రతిభావంతులైన విద్యార్థులు ముందు కురారు. ఫలితంగా దేశంలో వైద్య నిపుణుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై హింసను, ఆసుపత్రులకు నష్టం కలిగించ డాన్ని నిషేధిస్తూ అనేక రాష్ట్రాలు చట్టాలను రూపొందించాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ‘హెల్త్‌కేర్ సర్వీసెస్ పర్సనల్ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ వయొలెన్స్ అండ్ డామేజ్ టు ప్రాపర్టీ) బిల్లు’ ముసాయిదాను 2019లో రూపొందించింది. అయితే అది చట్టంగా మారలేదు. కోవిడ్–19 మహమ్మారి సమయంలో, ‘అంటు (ఎపిడమిక్) వ్యాధుల చట్టాన్ని’ సవరించి, వైద్య సిబ్బందిపై హింసకు పాల్పడటాన్ని నాన్– బెయిలబుల్ నేరంగా పరిగణించి, ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా 2020లో చట్టం తీసుకువచ్చినా ఆశించిన స్థాయిలో ప్రభావం కనిపించడం లేదు. వైద్యుల భద్రత – జాతీయ ఆరోగ్య భద్రతకు కీలకం. వైద్యులను గౌరవించడం అంటే – ఆరోగ్య సంరక్షణ పొందే పౌరుల రాజ్యాంగ హక్కును కాపాడటమే.– శ్రీనివాస్ మాధవ్, సామాజిక కార్యకర్త -
నాటి వైభవం ఎందుకు సాధ్యం కాదు?
ఆమధ్య ఓ సాయంత్రం పురానాపూల్ మీద నిలబడినప్పుడు కింద మురికి నీటిలో ప్లాస్టిక్ కవర్లు, జంతు కళేబరాలు తేలుతూ కనిపించాయి. దుర్గంధం వెదజల్లుతోంది. నాలుగు శతాబ్దాల క్రితం ఇదే బ్రిడ్జి మీద నుండి కుతుబ్ షాహీలు నది అందాలను చూసి మైమరచి పోయారన్న చరిత్ర గుర్తుకు వస్తే మనసు వికలమవుతుంది.1578లో కుతుబ్ షాహీల కాలంలో ఈ పురానాపూల్ నిర్మాణం జరిగింది. గోల్కొండ కోటకు, మూసీకి ఆవల ఉన్న ప్రాంతానికి మధ్య రాకపోకలు సాగించే ఆలోచనతో పురుడుపోసుకుంది. ఇరవై ఆరు రాతి కమానులతో నిర్మితమైన ఈ వంతెనను ‘బ్రిడ్జ్ ఆఫ్ లవ్’గా ఫ్రెంచ్ యాత్రికుడు టావెర్నియర్ వర్ణించాడని ప్రతీతి. 17వ శతాబ్దంలో హైదరాబాద్‌ను సందర్శించిన విదేశీ యాత్రికులు మూసీ నది ఒడ్డున ఉన్న తోటలు, భవనాలు చూపరులను కట్టిపడేస్తాయని వర్ణించారు. ప్రజలు ఈ నీటినే మంచినీరుగా వాడుకునేవారు.కానీ ఇదే మూసీ 1908లో భారీ వరదలతో విలయాన్ని చూపించింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. నదిని నిర్లక్ష్యం చేస్తే అది తన ప్రకోపాన్ని చూపిస్తుందని అది హెచ్చరించిన గుణపాఠాన్ని పట్టించుకోకపోతే ఎలా? స్థానికుల కథనం–శాటిలైట్ చిత్రాల విశ్లేషణ వల్ల తేలిందేమంటే... గత మూడు దశాబ్దాల్లో పురానాపూల్ దగ్గర మూసీ నది సహజంగా ఉన్న వెడల్పు చాలా వరకు తగ్గిపోయిందని! అంటే నదిని మనం మింగేశామన్న మాట! హైదరాబాద్‌లో ఉత్పత్తి అయ్యే మురుగునీటి మొత్తంలో ఎక్కువ శాతం శుద్ధి కాకుండానే నేరుగా మూసీలో కలుస్తోంది. వర్షం పడగానే వ్యర్థాలన్నీ బ్రిడ్జి పిల్లర్లకు తట్టు కుని ప్రవాహం ఆగిపోయేలా చేస్తున్నాయి. ఫలితంగా దిగువన ఉన్న చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ లాంటి లోతట్టు ప్రాంతాలు కూడా చిన్న వర్షానికే నీట మునిగిపోతున్నాయి.ప్రస్తుతం మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నదికి ఇరువైపులా ఫెన్సింగ్ వేస్తోంది. ఆక్రమణలు ఆపడం, చెత్త వేయకుండా చూడటం దీని ఉద్దేశ్యం కావచ్చు. కానీ నదిని ప్రజలకు దూరం చేసినట్లు అవుతుంది. 1950ల్లో లండన్‌లో థేమ్స్ నదిని ‘జీవ శాస్త్రపరంగా మృత నది’గా ప్రకటించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో దాన్ని పునరుజ్జీవింపచేసింది. ఫలితంగా ఇటీవల కాలంలో థేమ్స్ నదిలో సీల్స్, డాల్ఫిన్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నది ఒడ్డున రెస్టారెంట్లు, వాకింగ్ ట్రాక్‌లు, టూరిస్ట్ బోట్ లతో బిలియన్ల పౌండ్ల ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. అహ్మదాబాద్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్ కూడా ఇదే మోడల్. మరి చరిత్ర నేర్పిన పాఠాల నుండి మనమేం నేర్చుకుంటున్నాం?స్మార్ట్‌గా ఆలోచించాలి!మూసీని బతికించాలంటే మనకు కావాల్సింది కేవలం కాంక్రీట్ కాదు, ‘స్మార్ట్ సైన్స్’. ముందుగా డ్రోన్లు, ఉపగ్రహాలతో మూసీ నదికి 1:1000 స్కేల్లో త్రీ డీ మ్యాప్ తయారు చేయాలి. ఎక్కడ ఆక్రమణ ఉంది, ఎక్కడ నాలా కలుస్తుంది, ఎక్కడ నీరు నిల్వ ఉంది అనేది ప్రతి మీటర్ లెక్క తేలాలి. పురానాపూల్, చాదర్‌ఘాట్, నాగోల్ వంటి కీలక పాయింట్ల దగ్గర నీటి నాణ్యతను, నీటి మట్టాన్ని 24 గంటలూ కొలిచే ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) సెన్సార్లు పెట్టాలి. ఏ నాలా నుండి కాలుష్యం వస్తోందో వెంటనే తెలిసిపోతుంది. పర్యాటక అవకాశం, జనసాంద్రత, కాలుష్య స్థాయి, వరద ముప్పు వంటి అంశాలను తీసుకుని, ప్రాధాన్యతా పట్టిక ప్రకారం నిధులు ఖర్చు పెడితే ప్రతి రూపాయి సద్వినియోగం అవుతుంది. పురానాపూల్‌ను కేవలం బ్రిడ్జిలా కాకుండా ‘సాంస్కృతిక వ్యాఖ్యాన కేంద్రం’గా మార్చాలి. నాలుగు శతాబ్దాల క్రితం కుతుబ్ షాహీలు చూసిన అందమైన మూసీని మన పిల్లలకు చూపించే బాధ్యత మనదే! – డా. రామకృష్ణ మనిమద్దె, ఎర్త్ సైంటిస్ట్, నదీ వ్యవస్థల పరిశోధకులు -
అనుగ్రహం అవసరం!
సురాసురులు కలిసి కష్టించి, ఎన్నెన్నో మహత్తరమైన అవరోధాలనూ, విఘ్నాలనూ అధిగమించి, ఎట్టకేలకు అమృతం సాధించారు. ధన్వంతరి అందించిన అమృత కలశాన్ని తటాలున అందుకొని, అసురులు అన్యాయంగా స్వాధీనం చేసుకొన్నారు. అప్పటికప్పుడు శ్రీహరి మోహినీ అవతారాన్ని ఎత్తి, వాళ్ళను కామ మోహితులను చేశాడు. ఆ మోహంతో వాళ్ళు అందరికీ అమృతం పంచే బాధ్యతను ఆమెకు అప్పగించారు. ఆమె దాన్ని ఎలా పంచినా, తాము అడ్డుపడమని ఒప్పందం చేసుకొన్నారు.మోహిని అమృతాన్ని మొదట దేవతల పంక్తికి పంచటం పూర్తయేసరికి, పాత్ర ఖాళీ అయిపోయింది. ఆమె అంతర్ధానమై పోయింది. రాక్షసులకు ఏమీ మిగలలేదు. రాహువు అనే రాక్షసుడు మాత్రం, మారువేషంలో దేవతల పంక్తిలో చేరి, అమృతం పుచ్చుకొన్నాడు. సూర్యచంద్రులు ఇది గమనించి చెప్పగానే, సుదర్శన చక్రం రివ్వున వచ్చి, పుచ్చుకొన్న అమృతం నాలుక దాటకుండానే, రాహువు తలను నరికి వేసింది. అమృత ప్రభావం వల్ల అతడి తల సజీవంగా మిగిలిపోయింది. అమృత స్పర్శ లేని మొండెం పతనమై నశించింది. (అప్పటి నుంచి ‘రాహువు తల’ అనేది ప్రత్యేకంగా లేదు. రాహువు అంటేనే రాహువు తల. కాబట్టి ‘రాహు మస్తకం’ అని చెప్పనక్కర్లేదు. చెప్తే అది, ‘సీతా ఫలం పండు’, ‘పేపరు కాగితం’ అన్నట్టు పునరుక్తి అవుతుంది!)దేవాసురులు ఒకే పరిస్థితులలో, ఒకే ప్రదేశంలో, ఒకే సమయంలో, ఒకే సాధన సామగ్రితో, ఒకే విధమైన శ్రమను, ఒకే సంకల్పంతో చేశారు. కానీ వాళ్ళకు లభించిన ఫలంలో మాత్రం తేడాలు వచ్చాయి. ఏవం సురాసుర గణాః సమ దేశ, కాల,/ హేతు–అర్థ, కర్మ, మతయః–అపి, ఫలే వికల్పాః. ఎలాంటి తేడాలు? తత్ర అమృతం సురగణాః ఫలం–అంజనా–ఆపుః, నదైత్యాః – అక్కడ సురగణాలు అమృతం అనే ఫలాన్ని సులభంగా పొందారు, దైత్యులు పొందలేదు. కారణమేమిటి? పాద పంకజ రజ–ఆశ్రయాత్– శ్రీహరి పదకమలాల ధూళిని (దేవతలు) ఆశ్ర యించి, సేవించటం వల్ల. హరి విముఖులు కనక అసురుల శ్రమ నిష్ఫలమైంది. శ్రమకు దైవానుగ్రహం తోడయి తేనే ఫల ప్రాప్తి ఉంటుంది, అంటుంది భాగవతం.– ఎం.మారుతి శాస్త్రి -
ఆచార్యులలో మేటి!
తెలుగు భాషా సాహిత్యాలతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు ఆచార్య జి.ఎన్. రెడ్డి. ఆయన చిత్తూరు జిల్లాలోని ‘మహా సముద్రం’లో పుట్టారు. తెలుగు ఆచార్యులకు ఏనాడూ రాని వైస్– ఛాన్స్లర్ పదవి ఆయనతో 1984లో మొదలయ్యింది. శ్రీ వేంకటే శ్వర విశ్వ విద్యాలయానికి వైస్–ఛాన్స్‌లర్‌గా బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించి అందరి మన్ననలను అందుకొన్నారు.ఆయన గొప్ప నిఘంటుకారుడు. నిఘంటు నిర్మాణంతో పాటు నామ విజ్ఞానం, భాషా సాహి త్యాలలో అందెవేసిన చేయి. తెలుగు–తెలుగు నిఘంటువులు, ఇంగ్లీష్–తెలుగు ద్విభాషా నిఘంటువు, కుమ్మరం, వడ్రంగం మాండలిక వృత్తి పద కోశాలు, తెలుగు పర్యాయ పద నిఘంటువులు ఆయనకు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి. మహాభారతం శల్య సౌప్తిక స్త్రీ పర్వాలకు రచించిన పీఠిక, భగవద్గీతకు రాసిన పీఠిక, బ్రౌన్ గ్రంథాలకు రచించిన పీఠికలు ఎంతో విశ్లేషణాత్మకమైనవి.వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బంగోరె సహకారంతో సి.పి.బ్రౌన్ ప్రాజెక్టును చేపట్టారు. తద్వారా బ్రౌనుకు సంబంధించిన స్వీయ సాహితీ జీవిత చరిత్రల మీద అనేక పుస్తకాలను వెలుగులోకి తెచ్చారు. వాటిలో బ్రౌన్ లేఖలు, బ్రౌన్ కడప జాబులు, ఆంధ్ర గీర్వాణ ఛందము వంటి అమూల్యమైన గ్రంథాలు ఉన్నాయి. అలాగే జి.ఎన్. రెడ్డి భాషా విజ్ఞాన పరిచయం, ద్రావిడ భాషా విజ్ఞా్ఞనం, తన జీవిత చరిత్ర అయిన ‘జి.ఎన్. రెడ్డి జీవితరేఖలు’ కూడా రాశారు. జానపదులు చెప్పుకొనే పొడుపు కథలను సేకరించి ‘పొదుపు కథలు’ అనే గ్రంథాన్ని కూడా ప్రచురించారు.1962–64 మధ్య అమెరికాలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో లెక్చ రర్‌గా పని చేసి అక్కడి విద్యార్థుల కోసం కూడా వాచకాలను రాశారు. చికాగో యూనివర్సిటీలో కూడా లింగ్విస్టిక్స్ పాఠాలు బోధించారు. కల్చరల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రావ్‌ు కింద 1974లో బల్గేరియా, 1981లో మలేషియా, 1983లో బ్రిటన్ వంటి ఎన్నో దేశాల్లో పర్యటించారు. బ్రిటన్ గ్రంథాలయంలోని అరుదైన పుస్త కాలను మెక్రో ఫిల్మ్‌ల ద్వారా ఎస్వీయూ తెలుగు అధ్యయన శాఖకు అందించారు. ఆయన విస్కాన్సిన్ యూనివర్సిటీలో పని చేసేటప్పుడు చేకూరి రామా రావు, భద్రిరాజు కృష్ణమూర్తి లాంటి ఉద్దండ భాషావేత్తలతో కలిసి ఒకే ఇంటిలో ఉండేవారు. ప్రసిద్ధ భాషావేత్త గెరాల్డ్ కెల్లీతో కూడా స్నేహం చేశారు. తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన ఆయన సాహితీ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారు.– ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి, ఫౌండర్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ (నేడు ఆచార్య జి.ఎన్. రెడ్డి వర్ధంతి) -
సజ్జనుడు – దుర్జనుడు
జీవశాస్త్రం ఆధారంగా ఒక ఆసక్తికరమైన పోలికతో ఆరిషడ్వర్గాలను వ్యాఖ్యానించవచ్చు. అరిషడ్వర్గాలు దుష్టుడికి ‘ప్రొటో– ఆంకోజీన్స్’ లాంటివి. మొదట సాహచర్యం చేస్తాయి, తర్వాత మార్పుచెంది అజమాయిషీ చేయడం మొదలుపెడతాయి. చివరకు ప్రాణాధారంగా మారతాయి.ఆరోగ్యకరమైన కణంలో ‘ప్రొటో–ఆంకోజీన్స్’ అనేవి కణ విభజనను నియంత్రించే ప్రొటీన్లను తయారుచేసే జన్యువులు. కొన్ని సంకేతాలు అందుకున్నప్పుడు ఈ జన్యువులు క్రియాశీలమై, ఆ ప్రొటీన్లను ఉత్పత్తి చేసి కణాన్ని విభజనకు ప్రేరేపిస్తాయి. పని పూర్తయ్యాక మళ్ళీ నిష్క్రియగా మారతాయి. ఈ జన్యువులు ప్రతి కణంలోనూ ఉంటాయి.కామ–క్రోధ–లోభాది ఆరు మనిషి సహజ ప్రవృత్తులు (షడ్వర్గాలు) కూడా అంతే. ఇవి సజ్జనులలోనూ, దుర్జనులలోనూ ఉంటాయి. అవి శ్రుతిమించినప్పుడే సమస్య. ఆరోగ్యకరమైనకణంలో ప్రొటో– ఆంకోజీన్ ఎలా అవసరమైనప్పుడు నియంత్రణ మేరకు పనిచేసి, ఆ తర్వాత మౌనం వహిస్తుందో... అలాగే సజ్జను లలో షడ్వర్గాలు నియంత్రణకు లోబడి ఉంటాయి. నియంత్రణ తప్పినప్పుడు మాత్రమే చెడు మార్పు మొదలవుతుంది.నియంత్రణ తప్పడమే మ్యుటేషన్ ఈ నియంత్రణ తప్పడాన్నే జీవశాస్త్రంలో మ్యుటేషన్‌గా వ్యవహరిస్తారు. ప్రొటో–ఆంకోజీన్ మ్యుటేషన్ చెందినప్పుడు రూపాంతరం చెంది ఆంకోజీన్గా మారుతుంది. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు, జన్యువు పనిచేసే స్థితిలో (ఫంక్షనల్ స్టేటస్)లో కలిగే నిజమైన మార్పు కూడా. దాని పర్యవసానంగా కణం మొత్తం గుర్తింపు (ఐడెంటిటీ) మారిపోతుంది. అంటే ఆరోగ్య కరమైన కణం, క్యాన్సర్ కణంగా మారుతుంది.షడ్వర్గాల విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. నియంత్రణ తప్పిన మనిషిలో, గుణాలు అరిషడ్వర్గాలుగా పరిణమిస్తాయి: షడ్వర్గ సహిత మనిషి సజ్జనుడు, అరిషడ్వర్గ సహిత మనిషి దుర్జనుడు! దుర్జనుడు ఈ అరిషడ్వర్గాల నియంత్రణలోనే నడుస్తాడు. వీటి ప్రేరణతోనే నిర్ణయాలు తీసుకుంటాడు. అవే అతనికి శక్తినిచ్చే ప్రేరకాలు. అంటే ఇప్పుడు అరిషడ్వర్గాలు యజమానులుగా మారా యన్నమాట!ఈ యజమానిత్వం కూడా ఒక మజిలీయే, గమ్యం కాదు. జీవశాస్త్రంలో దీనికి ‘ఆంకోజీన్ ఎడిక్షన్’ అనే పేరుంది. కణంలో అనేక ఇతర జన్యుపరమైన లోపాలు పోగుపడినా, ఆ కణం తన మనుగడ మొత్తాన్నీ ఒక్క మార్పు చెందిన (మ్యుటేటెడ్) ఆంకోజీన్ మీదే ఆధారపడేలా చేసుకుంటుంది. ఆ ఒక్క జన్యువుని నిరోధిస్తే చాలు, కణం మొత్తం నశిస్తుంది. దుష్టుడి స్థితి కూడా ఇదే. అరిషడ్వర్గాలే వాడికి శక్తినిచ్చి నడిపే జీవాధారాలుగా నిలుస్తాయి. వాటిని అదుపుచేస్తే సహజ స్థితిని పొంది సజ్జనుడు కాగలడు.ఆసక్తికరమైన విషయం ఏమంటే గుణాల మూలతత్త్వం ఒక్కటే. గుణం ఎప్పటికీ మారదు, దాని స్వరూపం స్థిరంగానే ఉంటుంది. మారేది దాని నియంత్రణ స్థితి మాత్రమే. ఈ స్థితి మారడం వల్లే మనిషి స్వరూపం మారిపోతుంది. ప్రోటో–ఆంకోజీన్... ఆంకోజీన్గా మారి కణాన్ని క్యాన్సర్ కణంగా మార్చి నట్టే, షడ్వర్గాలు అరిషడ్వర్గాలుగా మారి సజ్జనుడిని దుర్జనుడిగా మారుస్తాయి. మనిషి స్వభావాన్ని నియంత్రించే శక్తి ఏది అనేది ఒక తాత్త్విక ప్రశ్న. పురాణాలు, ఉపనిషత్తులలో చెప్పిన ఎన్నో విషయా లను ఆధ్యా త్మిక ధోరణిలోనే కాకుండా సామాజిక కోణంలోనూ, శాస్త్రీయ దృక్పథంతోనూ వ్యక్తిగత ఉన్నతికి ఉత్ప్రేరకాలుగానూ విశ్లేషించి ఆచరించే ప్రయత్నం చేస్తే వ్యక్తులు, సమాజం అభివృద్ధిపథంలో పయనించగలరు.- డా. కొవ్వలి గోపాలకృష్ణ, వ్యాసకర్త అమెరికాలో ఆంకాలజీ డ్రగ్ డెవలప్మెంట్ సైంటిస్ట్ -
సామాజిక ఇతిహాసం..
ఆధునిక తెలుగు పద్యకవిత్వంలో మల్లవరపు జాన్ విశిష్టమైన కవి. ధారాళమైన పద్య రచనా ప్రజ్ఞతో, సామా జిక చైతన్యంతో ఆయన ప్రజారంజకమైన ఖండ కావ్యా లను రచించి విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ‘దురాచార మెంతేని ఖండింప కలమునాయుధముగా మలుచు కొని’ సాంస్కృతిక సమరం చేశాడు. తెలుగుదేశ చారిత్రక, సాంస్కృతిక వైభవ, ప్రాభవాలను రమణీయంగా తన కవిత్వంలో చిత్రించడమే కాకుండా, తనకాలం నాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక అసమానతలను ధిక్కరించి, సమానత్వాన్ని ప్రబోధించిన మల్లవరపు జాన్ పద్యకవుల్లో ప్రజాకవి. జాన్ కవిత్వం మాధుర్యగుణ భరితమైనదని, శ్రీనాథుడు చెప్పిన హర చూడాహరిణాంక వక్రతలోని సౌందర్యం ఆయన పద్యాల్లో ఉందని (అతుకుల బ్రతు కులు – పీఠిక) దాశరథి విశ్లేషించాడు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని చీమ కుర్తి గ్రామంలో మల్లవరపు దావీదు – రత్నమ్మ దంపతులకు 1927 జనవరి 22న ఆయన జన్మించాడు. పేదరికం అనే కత్తుల వంతెన మీదనడిచి, కుల, మత వివక్షల నిప్పుల వానలో తడిసి, మొక్క వోని సంకల్పంతో కఠోర శ్రమతో ‘మధుర కవి’గా, దేశికోత్తముడిగా ప్రసిద్ధిగాంచాడు. ‘చెప్పులు కుట్టి జీవనము సేయు కుటుంబము నందు బుట్టి చిన్నప్పటినుండి శారద పదార్చన జేసితి’ అని ఆయన, తన నేపథ్యాన్ని చెప్పుకున్నాడు. విద్యాభ్యాసం అనంతరం ఉపాధ్యాయు డిగా స్థిరపడినా, ఆయనలో జ్ఞానతృష్ణ చల్లార లేదు.ఒంగోలులోని శఠగోపనాచార్యుని శిష్యరికంలో సంస్కృ తాంధ్ర భాషా సాహిత్యాలను, పంచకావ్యాలను అధ్య యనం చేశాడు. జాషువానంతర తెలుగు కవిత్వంలో ప్రామాణికమైన పద్య కవిగా ప్రఖ్యాతిగాంచిన జాన్ 2006 ఆVýæస్టు 12న కన్నుమూశాడు.సజ్జనాను రక్తి జాను సూక్తి వామపక్ష, విప్లవ పోరాటాల నుండి అస్తిత్వ ఉద్య మాల వరకు సాగిన సామాజిక, సాహిత్య ఉద్యమాల ప్రభావం జాన్ కవిత్వంలో స్పష్టంగా కనబడుతుంది. 1967లోనే తన స్వీయానుభవాలను అక్షరబద్ధం చేసి, ‘కొండడు’ శీర్షికతో లఘు కావ్యం వెలువరించాడు. క్రైస్తవ కథాంశ నేపథ్యంలో రాసిన ‘సాంసన్–డెలీల’ పద్య నాటకం ఎంతగానో పేరు తెచ్చింది. విశ్వప్రకాశం, కాంతి రేఖలు, భావ విపంచి, చిరస్మరణీయులు, సరసవినోదిని, పుణ్యపురుషుడు వంటి ఖండ కావ్యాలతో తెలుగు సాహి త్యంలో పద్యకవిగా సుస్థిర స్థానాన్ని సంపాదించు కున్నాడు. ‘సజ్జనానురక్తి జాను సూక్తి’ అనే మకుటంతో సూక్తి శతకం,‘భవ్యగుణవిచార బాలవీర!’ మకుటంతో రాసిన పద్యాల ద్వారా జీవనతాత్త్విక ఎరుకను, మూర్తి మత్వ స్ఫూర్తిని చాటి చెప్పాడు. ఆయన రాసిన చైతన్య గేయాలు, న్యాయం కావాలి, పంచముడు వంటి అముద్రితా లుగానే మిగిలిపోయాయి. అవిద్య, పేద రికం, మద్యపానం, అధిక జనాభా, కుటుంబ నియంత్రణ, అవినీతి, లంచ గొండితనం, దళిత జనోద్ధరణ, కుల నిర్మూలన, దేశభక్తి, విశ్వశాంతి లాంటి అంశాలపట్ల ప్రజల్లో సదావగా హన కల్పించడానికి జాన్ కృషి చేశాడు.మనుషులకు ‘చితులను పేర్చినది మతమా? రెటమతమా? కపటమతుల రచితమా’ అని మతోన్మాదాన్ని నిరసించాడు. ద్వేషజ్వాలలతో ‘కలుష వ్యాపార పారీణులై త్రోవల్ దప్పి’ మతకల్లోలాలు కల్పించే దురాత్ముల’ను దేశద్రోహులుగా దుయ్యబట్టాడు. చాలామంది పద్య కవుల్లో మృగ్యమైన మహిళాభ్యుదయ చింతన జాన్ పద్యాల్లో కనిపిస్తుంది.వివిధ విశ్వవిద్యాలయాల్లో జాన్ సాహిత్యంపై పరి శోధనలు జరిగాయి. జాన్ కావ్యాలు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ‘అభినవ బాణ’, ‘కవిభూషణ’ వంటి అరుదైన బిరుదులను కూడా ఆయన అందు కున్నాడు. అటువంటి జాన్ శత జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి.– ఆచార్య కోయి కోటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు, ప్రభుత్వ సిటీ కళాశాల, హైదరాబాద్ (మల్లవరపు జాన్ శతజయంతి సదస్సు నేడు ఒంగోలులో) -
ఇది చైనాకు సవాలా? భారత్‌కు అవకాశమా?
21వ శతాబ్దంలో ప్రపంచ రాజకీయాలను భూభాగాల కంటే సముద్రాలు, సరఫరా గొలుసులు (సప్లై చెయిన్స్), సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు, అరుదైన ఖనిజాలు వంటి వ్యూహాత్మక వనరులే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిందూ మహా సముద్రం ప్రపంచ భౌగోళిక–రాజకీయాల్లో కేంద్ర స్థానాన్ని సంపాదించింది. ప్రపంచ చమురు రవాణాలో అధిక భాగం, ఆసియా–యూరప్ వాణిజ్యంలో కీలక సముద్ర మార్గాలు ఈ ప్రాంతం గుండా సాగుతాయి. అందుకే అమెరికా, చైనా, భారత్, జపాన్ వంటి దేశాలు ఈ ప్రాంతంలో తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.భారత్‌కు హిందూ మహాసముద్రంలో సహజమైన వ్యూహాత్మక ఆధిక్యం ఉంది. అయితే గత రెండు దశాబ్దాలుగా చైనా ‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’ వ్యూహం ద్వారా పాకిస్తా¯Œ లో గ్వాదర్, శ్రీలంకలో హంబ¯Œ టోటా; జిబూతి, మయన్మార్ వంటి ప్రాంతాల్లో నౌకాశ్రయాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ తన ప్రభా వాన్ని విస్తరించింది. ఈ పరిస్థితుల్లో భారతదేశం, హిందూ మహా సముద్రంలోని సెషెల్స్, మారిషస్, మాల్దీవులు వంటి చిన్న ద్వీప దేశాలతో సముద్ర భద్రత, తీరరక్షణ, బ్లూ ఎకానమీ రంగాల్లో సహ కారాన్ని విస్తరిస్తోంది. ఇటీవల సెషెల్స్‌తో కుదిరిన ఒప్పందాలు కూడా ఈ వ్యూహంలో భాగమే. అదే సమయంలో జపాన్‌తో వ్యూహా త్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఆసియాలో కొత్త శక్తి సమీకరణాలకు దారితీస్తోంది.మనవైపు ఎందుకు చూస్తున్నట్లు?మారుతున్న భద్రతా పరిస్థితులు జపాన్నే రక్షణ వ్యయాన్ని పెంచుకునేలా చేశాయి. ఈ నేపథ్యంలో భారత్ సహజమైన ప్రజాస్వామ్య భాగస్వామిగా జపాన్‌కు కనిపిస్తోంది. ఇరుదేశాల భాగ స్వామ్య అసలు బలం పెట్టుబడుల్లో కాదు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీలో ఉంది. సెమీకండక్టర్లు, రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు, రక్షణ తయారీ, పరిశోధన, ఆవిష్కరణలలో భారత్–జపాన్‌లు కలిసి పనిచేస్తే ప్రపంచ సరఫరా గొలుసుల్లో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. ఇదే అంశం చైనాను ఆందోళనకు గురిచేస్తోంది. భారత్‌ను ఇప్పటివరకు పెద్ద వినియోగ మార్కెట్‌గా చూసిన చైనా, ఇప్పుడు అది ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా ఎదిగే అవకాశాన్ని గమని స్తోంది. అందుకే సరిహద్దుల్లో ఒత్తిడిని కొనసాగిస్తూనే, భారత్ పూర్తిగా అమెరికా వ్యూహాత్మక వలయంలోకి వెళ్లకుండా నిరోధించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు అమెరికా కూడా భారత్‌ను ఇండో–పసిఫిక్ వ్యూహంలో కీలక భాగస్వామిగా చూస్తోంది. అయితే అమెరికా తన జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అలీన విధానాన్ని అనుసరించిన భారత్, నేడు ‘మల్టీ–అలైన్మెంట్’ విధానంతో అమెరికా, జపాన్, యూరప్, రష్యా, గ్లోబల్ సౌత్ దేశాలతో సమతుల్య సంబంధాలను కొన సాగిస్తోంది. ఇదే భారత విదేశాంగ విధానం బలం. అయితే విదేశాంగ విధానానికి ఆర్థిక బలం కూడా తోడవ్వాలి. నీతి ఆయోగ్ సూచిస్తున్నట్లుగా, భారత్ కేవలం అసెంబ్లింగ్ కేంద్రంగా కాకుండా, పరిశోధన, ఆవిష్కరణ, అధునాతన తయారీ కేంద్రంగా ఎదగాలి. ఈ ప్రయాణంలో జపాన్ అత్యంత విశ్వసనీయ భాగస్వామి కావా లని ఆశించడంలో తప్పు లేదు.భారత్–జపాన్‌లను చైనా వ్యతిరేక కూటమిగా మాత్రమే చూడటం సబబు కాదు. ఇది ప్రజాస్వామ్య విలువలు, నియమాధా రిత అంతర్జాతీయ వ్యవస్థ, స్వేచ్ఛాయుత నౌకాయానం, సాంకేతిక సహకారం, ఆర్థిక భద్రతపై ఆధారపడిన వ్యూహాత్మక భాగస్వామ్యం. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ లక్ష్యాన్ని సాధించాలంటే విదేశీ పెట్టుబడులు మాత్రమే సరిపోవు. సాంకేతిక పరిజ్ఞానం, సంయుక్త పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, రక్షణ తయారీ, సముద్ర భద్రత, ప్రపంచ సరఫరా గొలుసుల్లో నాయకత్వం అవ సరం. ఈ లక్ష్యాలను సాధించడంలో జపాన్‌తో భాగస్వామ్యం భారతదేశానికి ఒక చారిత్రక అవకాశం.భారత్ ముందున్న అసలు సవాలు చైనా లేదా అమెరికా కాదు; తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూ, వ్యూహాత్మక స్వతంత్రతను నిలబెట్టుకొని, ఆర్థిక–సాంకేతిక శక్తిగా ఎదగడం. అదే జరి గితే హిందూ మహాసముద్రంలో భారత్ ఒక ప్రాంతీయ శక్తిగానే కాదు, ప్రపంచస్థాయి ‘సంతులన శక్తి’గా అవతరిస్తుంది. అదే భారత్ – జపాన్ భాగస్వామ్యానికి నిజమైన విజయంగా చరిత్రలో నిలిచి పోతుంది.- సీహెచ్.వి. ప్రభాకర్ రావు, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నిష్కళంక నాయకుడు..
తన సొంత గ్రామం బ్రాహ్మణపల్లి సర్పంచిగా, భువనగిరి పంచాయతి సమితి అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా అట్టడుగునుంచి ఎదిగిన కొమ్మిడి నర్సింహారెడ్డి ఇవ్వాళ లేడు. కొంత కాలంగా అనారోగ్యంతో సతమతమవుతూ తన 83వ ఏట జూలై 7న ‘నిమ్స్’ ఆసుపత్రిలో కన్నుమూశారు. సొంత ఇల్లు కూడా లేని నర్సింహారెడ్డి దంపతులకు నిమ్సే ఒక ఇల్లయింది. స్నానానికని బాత్రూమ్లోకెళ్లి చన్నీళ్ల నల్లా ఇప్పు తున్నాననుకొని వేడినీళ్ల నల్లా ఇప్పితే... కాళ్ళు బొబ్బలెక్కి చివరి రోజుల్లో అవస్థపడ్డారు. ఊళ్ళో ఉన్న ఇల్లు (పెద్దల ద్వారా సంక్రమించింది) శిథిలం కాగా, హైదరాబాదు పెద్దకూతురు ఇంట్లో ఉండేవారు.ఒక చారిత్రక కుటుంబం నుంచి వచ్చినవారు నర్సింహా రెడ్డి. వారి అన్న కోదండ రాంరెడ్డి, తెలంగాణ సాయుధ పోరాటంలో భాగస్వామి. పోలీస్ స్టేషన్లో చంపబడ్డారు. కాంగ్రెస్ రాజకీయాలకు కొంతకాలంగా నర్సింహారెడ్డి దూరంగా ఉన్నా విద్యుచ్ఛక్తి సమస్యలపై భువనగిరిలో నిరాహారదీక్ష చేశారు. గోదావరి నీళ్ళు రప్పించడం గురించి, మూసీ నది కాలుష్యం గురించి, పోచంపల్లిలోని రామానంద తీర్థ ఇనిస్టిట్యూట్ గురించి తపన పడేవారు. నిఖిలేశ్వర్ రాసినట్టు ‘వ్యక్తిగతంగా జీవితంలో – సామాజికంగా ప్రజాస్వామిక విలువలను కాపాడాలని ఆలోచించేవారు’. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉండేవారు. ‘ప్రజా చైతన్య వేదిక’ స్థాపించి సదస్సులు నిర్వహించేవారు. ఉపన్యాసాలు ఇప్పించేవారు. నిజాం కాలం నాటి చరిత్రను అధ్యయనం చేసి, చిన్న చిన్న పుస్తకాలు ప్రచురించి పంచారు.మా ఇద్దరిది 56 ఏళ్ల అనుబంధం. 1969లో మా మొదటి పరిచయం, తెలంగాణ ఉద్యమ సందర్భంగా. హెచ్ఎస్సీ పాస్ కాగానే సర్పంచిగా పోటీ చేసి గెలిచారు. భువనగిరిలో తెలంగాణ ఉద్యమం జోరందుకున్న రోజులవి. ‘తెలంగాణ ప్రజాసమితి’ అధ్యక్షుడిగా పులుమామిడి బాలక్రిష్ణారెడ్డి, నేను ‘విద్యార్థి కార్యాచరణ సమితి’ కన్వీనర్‌గా, ఇంకా అనేక మంది ఉద్యమం నడుపుతున్న రోజులు. కాంగ్రెస్‌లో గ్రూపులు ఉండేవి. ఒక గ్రూపు ప్రత్యేక తెలంగాణకు అనుకూలం. ఆ గ్రూపులో కొమ్మిడి ఉండేవారు. ఒకరోజు బాలక్రిష్ణారెడ్డి ఇంటికి వచ్చి, ‘తెలంగాణ గురించి ఏం జేయమంటవన్నా’ అని అడిగారు. అప్పుడు బాలక్రిష్ణారెడ్డి ‘మీ సర్పంచులను కొందరిని కలుపుకొని సమితి ఆఫీసు ముందు డేరా వేసి రిలే నిరాహారదీక్షలు చేపట్టండి’ అని సలహా ఇస్తే పాటించారు.ఒక విషయంలో నాకు నర్సింహారెడ్డి స్ఫూర్తి. ‘అరవై తొమ్మిది’ ఉద్యమం ముగిసింది. ఒకరోజు భువనగిరి తహసిల్ ఆఫీసులో తారసపడ్డాం. ‘ఓరేయ్ ముత్యం, మీ మామలెక్క నువు కూడా పైరవికారువైతవురా’ అన్నాడు. అప్పుడనిపించింది పైరవికారు అవడం మంచిది కాదూ అని! అది మనసులో ఉండిపోయింది. ఏ నాయకుడి దగ్గరికీ వెళ్లేవాడిని కాదు. తను నన్ను ముత్యం అని పిలిస్తే, నేను అన్నా అని పలికేవాణ్ణి. అన్నా! నర్సన్నా! మసి అంటని నాయకుడా... నీకివే జోహార్లు!– ఆచార్య కట్టా ముత్యంరెడ్డి -
మనిషి పతన దశలు
స్వయంకృత అపరాధం మనిషి జీవితంలో జరిగే అనేక మార్పులకు హేతువు. ఒక మనిషి పతనం కావడానికి ఇదే మూలమవుతుంది. ఆ పతనం నాలుగు దశల్లో కొనసాగుతుంది.నైతిక పతనం..మనిషి ప్రవర్తన కృతజ్ఞతాహీనంగా మారుతుంది. సాయం చేసినవారికి ద్రోహం తలపెట్టడం, తిన్న ఇంటి వాసాలు లెక్కించడం జరుగుతుంది.విలువల పతనం..దురాశ, దురలవాట్లు ఎక్కువవుతాయి. ఎలానైనా తాము కోరు కున్నది పొందడానికి అడ్డదారులు వెతుకుతారు.సామాజిక పతనం..మనిషి సామాజిక ప్రాణి అనే విషయం మర్చిపోవడం జరుగుతుంది. తన గురించి ఈ లోకం ఏమి అనుకుంటుందనే భయం ఉండదు. వావి వరసలు చూడరు. స్వార్థం తలకెక్కుతుంది. తను చేసిందే సరైనది అనే భావనతో దుశ్చర్యలకు పాల్పడుతుంటారు.ఆర్థిక పతనం..తనువెల్లా అహంతో నిండిన మనుషులకు ఆర్థిక పతనమే ఆఖరి దశ. ఆర్థిక పతనం మొదలైన తర్వాత క్రమంగా పశ్చాత్తాప లక్షణాలు అంకురిస్తాయి. అందులో అతి కొద్ది మంది మాత్రమే చేసిన తప్పులను సరిదిద్దుకుని కొత్త జీవితాలను మొదలెడతారు. ఎక్కువ శాతం మంది అహం మత్తు నుండి బయటపడకుండా జీవితాలనే బలి చేసుకుంటారు.అందుకే మనుషులు ముందుగా నైతికంగా పతనం చెందకూడదు. విచక్షణా జ్ఞానం కోల్పోకూడదు. ఏది మంచో, ఏది చెడో తెలుసుకుని అడుగులు వేయాలి. కష్టపడకుండా వచ్చేది ఎప్పటికైనా మన దగ్గర ఎక్కువ రోజులు ఉండదు అనే సత్యాన్ని విస్మరించకూడదు.– దుర్గమ్ భైతి -
పరిష్కారమే సమస్యగా నిలిచేనా?
భారత్ ప్రభుత్వం 2025–26 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం (ఇ20) లక్ష్యాన్ని సాధించే దిశగా గణనీయ మైన పురోగతి సాధించింది. ఇందుకోసం ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు చమురు మార్కెటింగ్ సంస్థల ద్వారా ఇథనాల్ కొనుగోలును కూడా విస్తరించింది. అయితే ఈ కార్యక్రమానికి అనేక సవాళ్లు ఉన్నాయి: అధిక నీటి అవసరం; 2023కు ముందు కొన్న లక్షల వాహనాలు ఇ20కి పూర్తిగా అనుకూలంగాలేకపోవడం; ఆహారానికీ, ఇంధనానికీ మధ్య సమతుల్యతను కాపాడటం.‘నీళ్లు’ కలుపుతున్నారా?అనేక ప్రాంతాలలో ఇ20తో కూడిన పెట్రోల్ వేసుకున్నాక వాహనాలు ఆగిపోవడం, ఇంజిన్ చెడిపోవడం వంటి అనుభవాలు పెరిగినాయి. అనేక పెట్రోల్ బంక్‌లలో పెట్రోల్‌తో పాటు నీళ్ళు పోస్తున్నారని వాహనదారులు ఆందోళనకు దిగుతున్నారు. ఆమధ్య మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మొత్తం వాహనశ్రేణికి ఇదే సమస్య ఉత్పన్నమయ్యింది. మధ్యప్రదేశ్ పెట్రోల్ బంక్‌ల సంఘం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ప్రతిస్పందన లేదు. నిత్యావసర వస్తువు లలో ఒకటైన పెట్రోల్, డిజిల్ గురించిన నియంత్రణ జిల్లా కలెక్టర్లు చేస్తారు. వారి అభిప్రాయానికి కూడా ప్రభుత్వం విలువ ఇవ్వడం లేదు. పెట్రోల్‌లో ఇథనాల్ కలిపితే నీళ్ళు రావడం సాధారణం అని ఒప్పుకొన్నా చమురు కంపెనీలు సాంకేతిక అవసరాలకు అనుగుణంగా కలపడం లేదని పెట్రోల్ బంక్‌ల ఆరోపణ. దాదాపు 30 కోట్ల వాహనాలు ఇ20 వల్ల పాడయితే దేశ ఆర్థిక స్థితి, వ్యక్తిగత వాహనదారుల మీద పడే ఆర్థిక భారం గురించి ఆలో చన చేయవలసి ఉన్నది. సరుకు రవాణా వాహనాలు మొరాయిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆటోలు, టాక్సీ తదితర రవాణా సదుపాయాలు కుంటుపడితే ఆ యా కుటుంబాల మీద భారంతో పాటు నిత్య రవాణా మీద దుష్ప్రభావం ఉంటుంది.పర్యావరణ హితమేగానీ...భారత్‌లో ఇథనాల్ కార్యక్రమం (ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్–ఈబీపీ) దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం, పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం అనే ముఖ్య ఉద్దేశాలతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇది 2003లో ప్రారంభమైంది. ప్రపంచ వాతావరణ సదస్సులలో కర్బన ఉద్గారాలు తగ్గిస్తామని భారత్ చేసిన లిఖితపూర్వక వాగ్దానంలో ఇది ఒక భాగమైంది. చెరకు రసం, మొలాసెస్, మొక్కజొన్న, బియ్యం వంటి వ్యవ సాయ పంటలు, వాటి ఉప ఉత్పత్తుల నుంచి తయారయ్యే జీవఇంధనం (బయో ఫ్యూయల్) ఇథనాల్. ఇది పునరుత్పాదకఇంధనం కావడంతో పెట్రోల్ తరహ వాయు కాలుష్యం ఉండదు గానీ పూర్తిగా సున్నా కాదు. ఇంకొక కొత్త రకం కాలుష్యం ఏర్పడు తున్నది. కొన్ని పరిస్థితుల్లో నైట్రోజన్ ఆక్సైడ్లు లేదా ఆల్డిహైడ్లు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల అన్ని రకాల ఉద్గారాలు సమానంగా తగ్గుతాయని చెప్పలేము. టెయిల్‌పైప్ ఉద్గారాలు సాధారణంగా తగ్గుతాయి. అయితే ఏ ఉద్గారాలు ఎంత తగ్గుతాయనేది ఇంజిన్ రకం, ఇథనాల్ మిశ్రమ శాతంపై ఆధారపడి ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్లు, పార్టిక్యులేట్ మ్యాటర్ తగ్గు తాయి. వివిధ ఇంధనాల ఉత్పత్తి నుంచి వినియోగం పోల్చితే కార్బన్ డయాక్సైడ్ నికర ప్రభావం కూడా తగ్గుతుంది. అయితే, కార్బన్ డయాక్సైడ్ తగ్గుదల కూడా ఇథనాల్ తయారు చేసే విధా నాన్ని బట్టి ఉంటుంది. చెరుకు, మక్కలు, వడ్ల నుంచి తయారు చేసే క్రమంలో వివిధ రకాల ప్రభావం ఉంటుంది. ఇథనాల్‌ను పెట్రో ల్లోనే కలుపుతున్నారు; డీజిల్ వాడకం వల్ల వచ్చే వాయు కాలుష్యం గురించి ఎటువంటి అడుగులు వేయడం లేదు. రైతులకు ఎంత మేలు?భారత్‌లో ఇథనాల్‌ను చెరకు రసం, మొలాసెస్, మొక్కజొన్న, బియ్యం, గోధుమలు, జొన్నలు, సజ్జల నుంచి తయారు చేస్తారు. ఆయా పంటలకు డిమాండ్ పెరిగి తద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందనేది ఆలోచన. ఇది ఒక నినాదంగా, ఆకర్షణీయ ప్రకటన లాగానే ఉన్నది. ఆహార పంటలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. రైతుకు గిట్టుబాటు ధర రాకపోవడానికి కారణం ఆ యా పంటలకు డిమాండ్ లేక కాదు – మార్కెట్లో వ్యవస్థీ కృతమైన దోపిడీ వల్ల. మార్కెట్ల దోపిడీ ఈ పంటలను ఇథనాల్ ఉత్పత్తికి మళ్ళించడం వల్ల తగ్గదు. ప్రస్తుతం దేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగింది. 2014లో సుమారు 421 కోట్ల లీటర్ల సామర్థ్యం ఉండగా, 2026 నాటికి అది సుమారు 2,000 కోట్ల లీటర్ల వార్షిక సామర్థ్యానికి పెరిగింది. ప్రభుత్వం కొత్తగా అనేక ధాన్యాధారిత, చెరకు ఆధారిత డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది. పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలప డానికి సంవత్సరానికి సుమారు 1,016 కోట్ల లీటర్ల ఇథనాల్ అవస రమని ప్రభుత్వం, నీతి ఆయోగ్ అంచనా.ఇంధనం కాకుండా పరి శ్రమలు, రసాయనాలు, మద్యం తదితర ఇతర అవసరాలను కలి పితే మొత్తం సుమారు 1,350 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం. సుమారు 2,000 కోట్ల లీటర్ల వార్షిక ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా ధాన్యాలపై ఆధారపడి నడపాలంటే దాదాపు 5 కోట్ల టన్నుల ధాన్యం అవసరం అవుతుంది. మొత్తం ధాన్య ఉత్పత్తి దాదాపు 37.66 కోట్ల టన్నులు. అంటే, అది దేశ మొత్తం ఆహార ధాన్య ఉత్పత్తిలో సుమారు 13% అవుతుంది. అమెరికా నుంచి డీడీజీఎస్ (డిస్టిల్లర్స్ డ్రైడ్ గ్రెయిన్స్ విత్ సొల్యూబుల్స్) దిగుమతులు, భారత ఇథనాల్ కార్యక్రమంతో ముడిపడి ఉన్న నేపథ్యంలో అది ఇంకొన్ని సమస్యలను సృష్టిస్తుంది. ఇథనాల్ తయారీ తర్వాత మిగిలే అధిక ప్రోటీన్ కలిగిన ఉప ఉత్పత్తిని డీడీజీఎస్ అంటారు. దీనిని పశువులు, కోళ్లు, చేపలకు దాణాగా ఉపయోగిస్తారు. అమెరికా నుంచి చౌకగా డీడీజీఎస్వస్తే దేశీయ డీడీజీఎస్ ధరలు పడిపోవచ్చు. దీంతో భారతఇథనాల్ డిస్టిలరీల ఆదాయం తగ్గుతుంది. మొక్కజొన్న రైతులపై కూడా ప్రభావం ఉంటుంది. అమెరికా దిగుమతులతో జీఎం (జన్యు మార్పిడి) వివాదం కూడా ఉన్నది. జీఎం మొక్కజొన్ననుంచి అమెరికా డీడీజీఎస్ వస్తుంది కాబట్టి, జన్యుమార్పిడిదాణా వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యలు అదనం. అందుకే ఈఅన్ని సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వివరంగా స్పందించాల్సిన అవసరం ఉంది.-వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు-దొంతినరసింహారెడ్డి -
చేప పిల్లల రాజధానికి సవాళ్లెన్నో!
భారతదేశ ఆక్వా రాజధానిగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ దేశీయ మంచినీటి చేపల పెంపకంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. చేపల పెంపకంలో పెట్టుబడి వ్యయం తక్కువే అయినప్పటికీ, నాణ్యమైన చేప పిల్లలే సాగు లాభా లను నిర్ణయిస్తాయి. కృత్రిమ ప్రేరిత ప్రజనన(ఇండ్యూస్డ్ బ్రీడింగ్) సాంకేతికత, చైనీస్ సర్క్యులర్ హేచరీల ప్రవేశంతో చేప పిల్లల ఉత్పత్తి రంగంలో విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది.నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వ సంస్థలు, పరి శోధనా సంస్థలు, ప్రైవేట్ పారిశ్రామికవేత్తల సమష్టి కృషితో గోదావరి, కృష్ణా, పెన్నా నదీ పరివాహక ప్రాంతాల్లో వందలాది హేచరీలు, నర్సరీలు ఏర్పడటంతో చేప పిల్లల ఉత్పత్తి గణనీయంగా విస్తరించింది. గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో విస్తరించి ఉన్న బ్రూడ్‌స్టాక్ ఫారాలు, హేచరీలు, నర్సరీల నెట్వర్క్ ద్వారా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిషా వంటి అనేక రాష్ట్రాలకు నాణ్యమైన చేప పిల్లలు సరఫరా అవుతున్నాయి. చేపల పెంపకం రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, ఉపాధికి పెద్ద పీట వేస్తోంది.ఏపీ చేపల పెంపక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లలో జన్యు నాణ్యత క్షీణించటం ముఖ్యమైనది. అవే తల్లి చేపలను పదే పదే విత్తనోత్పత్తికి వాడటం వల్ల ఇన్–బ్రీడింగ్ జరిగి చేప పిల్లల ఎదుగుదల మందగిస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్థిర వర్షాలు హేచరీల ఉత్పాదకతను దెబ్బతీస్తున్నాయి. బ్యాక్టీరియా, పరాన్నజీవులు, శిలీంధ్రాల ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. జాతుల వైవిధ్యీకరణ కొరవడటం మరో పెద్ద సవాలు. మార్కెట్లో ఫంగాసియస్, గిఫ్ట్ తిలాపియా, కొర్రమీను వంటి కొత్త జాతులకు డిమాండ్ పెరుగుతున్నా, ఇప్పటికీ మేజర్ కార్ప్ చేపలదే పైచేయిగా ఉంది.జన్యుపరంగా మెరుగైన మంచినీటి చేపల రకాలను జన్యుపరంగా అభివృద్ధి చేయ డానికి రాష్ట్రస్థాయిలో ప్రత్యేక చేపల జన్యు మిషన్‌ను ఏర్పాటు చేయాలి. హేచరీల గుర్తింపు, నాణ్యత హామీ కోసం చేపల విత్తన ధ్రువీకరణ సంస్థ వంటి ప్రత్యేక అథా రిటీని నెలకొల్పాలి. క్యూఆర్ కోడ్ ద్వారా చేప పిల్లల సరఫరా గొలుసును, రవాణాను ట్రాక్ చేయాలి. సౌరవిద్యుత్‌తో నడిచే హేచరీలు, రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ (ఆర్ఏఎస్) వంటి మౌలిక వసతుల్లో పర్యావరణ అనుకూల ఆధునిక సాంకేతికతలను ప్రోత్సహించాలి.చేపల సాగు విస్తీర్ణాన్ని పెంచటం కంటే నాణ్యతను మెరుగుపరచటంపైనే భవి ష్యత్తు పోటీతత్వం ఆధారపడి ఉంటుంది. వికసిత్ భారత్–2047 లక్ష్యాలకు అనుగుణంగా.. డిజిటల్ ట్రేసబిలిటీ, జీవ భద్రతా ప్రమాణాలతో దేశంలోనే ధ్రువీకరించబడిన చేప పిల్లల ఉత్పత్తికి జాతీయ కేంద్రంగా ఏపీ ఎదగాలి. అప్పుడే రాష్ట్రం భారతదేశ ‘బ్లూ ఎకానమీ’కి వెన్నెముకగా నిలిచి ‘ఫిష్ సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తన స్థానాన్ని బలోపేతం చేసుకోగలుగుతుంది.- డా. పి. రామమోహనరావు, వ్యాసకర్త విశ్రాంత మత్స్యశాఖ ఉప సంచాలకులు, కాకినాడ (జూలై 10న జాతీయ చేపల రైతుల దినోత్సవం) -
తరతరాల కళా నిబద్ధత
ఐదు దశాబ్దాలుగా ‘కడ్డి తంత్రి’ అనే అపురూప జానపద సంగీత కళారూపాన్ని సంరక్షిస్తున్న దురిశెట్టి రామయ్యకు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. ఇది తెలంగాణ జానపద కళా ప్రపంచానికే గర్వకారణం. పెద్దపల్లి జిల్లా (ఉమ్మడి కరీంనగర్ జిల్లా) సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన ఆయన అరుదైన కళాసాధకుడు. ఎస్సీ మాల సామాజిక వర్గంలోని ‘మిత్తుల అయ్య వార్లు’ లేదా ‘నిత్యులు’ అనే ఉపకులానికి చెందిన రామయ్య, చిన్నతనంలోనే తన తండ్రి రామానుజం వద్ద ఈ కడ్డి తంత్రి కళను అభ్యసించారు. రామానుజం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం విశేషం.కడ్డి తంత్రి వాయిద్యం తెలంగాణలోని అత్యంత ప్రాచీన జానపద సంగీత వాయిద్యాల్లో ఒకటి. అడ విలో లభించే టేకు చెట్టు మొద్దును లోపల ఖాళీగా తొలిచి ఈ వాయిద్యాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. రామయ్య వద్ద ఉన్న వాయిద్యానికి దాదాపు ఆరు నుంచి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. కశ్మీర్‌కు చెందిన సంతూర్, పాశ్చాత్య దేశాల డల్పీమర్, సింబలోన్ వంటి వాటిలో అనేక తంత్రులు (తీగలు) ఉంటాయి. కానీ, కడ్డి తంత్రి లేదా కడ్డి వీణలో కేవలం మూడు లేదా నాలుగు తంత్రులే ఉంటాయి. వీటితోనే 32 స్వరాలను పలికించడం గమనార్హం. చిన్న వెదురు బద్ద చివర కొన్ని గజ్జెలు కట్టి వాటితో తీగలను కొడతారు. బద్దతో వాయించినప్పుడు వచ్చే రాగతాళాలకు అనుగుణంగా గజ్జెల శబ్దం మేళవించి శ్రోతలకు వీనులవిందు కలిగిస్తుంది.ఈ వాయిద్యం కథాగానం, పురాణ ప్రవచనాలకు మాధ్యమంగా రూపుదిద్దుకుంది. రామయ్య తన బృందంతో కలిసి భాగవతం, భారతం వంటి ఇతిహాస గాథలను విని పిస్తారు. ముఖ్యంగా గజేంద్ర మోక్షం, కీచక వధ, సతీ సావిత్రి, భక్త ప్రహ్లాద, రామదాసు చరిత్ర, విరాట పర్వం, సుందరకాండ వంటి ఘట్టాలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. కడ్డి తంత్రి వాయిద్యంతో నిర్వహించే సాధారణ ప్రదర్శనల్లో ఆరు గురు కళాకారులు పాల్గొంటారు. అదే వేషధారణతో కూడిన నాటక రూప ప్రదర్శనలైతే 12 మంది కళాకారులు భాగస్వాములవుతారు. సాయంత్రం ప్రారంభమయ్యే ఈ ప్రద ర్శనలు తెల్లవారుజాము వరకు సాగుతుంటాయి. ఐదు దశాబ్దాలుగా ఎన్నో కష్టనష్టాల కోర్చి ‘కడ్డి తంత్రి’ కళను కాపాడుకుంటూ వస్తున్న దురిశెట్టి రామయ్య జీవితం... జానపద వారసత్వ పరిరక్షణకు అంకితమైన ఒక మహోన్నత ప్రస్థానం!– జంపాల ప్రవీణ్, ఔత్సాహిక పరిశోధకుడు -
ఒక యువకుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ‘ప్రభో!
ఒకరోజు ద్వారకలో, ఒక యువకుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ‘ప్రభో! మంచి పనులు చేసిన వారు ధన్యులు అని అందరూ అంటారు. కానీ మంచి పనులు చేసిన వారు ఎవరు? ఎక్కువ దానధర్మాలు చేసేవారా? గొప్ప యజ్ఞాలు చేసేవారా?’ అని అడిగాడు. కృష్ణుడు ఆ యువకుడిని ఒక దేవాలయం దగ్గరకు తీసుకెళ్లాడు. ఒక వృద్ధుడు మౌనంగా ఆలయ ప్రాంగణం శుభ్రం చేసుకుంటున్నాడు.కృష్ణుడు ఆ యువకుడితో ‘రా! అతనికి తెలియకుండా రోజంతా మనం ఇతనిని అను సరిద్దాం’ అన్నాడు. వృద్ధుడు తన ఆహారంలో కొంత భాగాన్ని ఆకలితో ఉన్న కుక్కకు ఇచ్చాడు. దేవాలయా నికి వచ్చిన ఒక పేద వృద్ధురాలికి నీళ్ళు ఇచ్చి, తన చేతిలో ఉన్న కొన్ని నాణేలను కూడా ఇచ్చాడు. ఆలయ మార్గంలోని ముళ్ళను, రాళ్లను తొలగించాడు. సాయంత్రం ఇంటికి వెళ్లేముందు, ఇలా ప్రార్థించాడు: ‘కృష్ణా! ఈ రోజు నేను ఏదైనా మంచి పని చేసి ఉంటే, దానిని నీ పాదాల చెంత సమర్పిస్తున్నాను.’ఇది చూసి ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు. ‘ప్రభో! ఇదేనా పుణ్యం? పెద్ద దానాలు లేవు, యజ్ఞాలు లేవు.’ కృష్ణుడు నవ్వి ఇలా అన్నాడు: ‘విజయం అనేది చేసిన పని వల్ల వచ్చే కీర్తిలో లేదు; అది ఆ పని చేసే హృదయపు నిర్మలత్వంలో ఉంది. ఎవరూ చూడనప్పుడు కూడా ధర్మాన్ని నిలబెట్టేవాడు పుణ్యపురుషుడు’.అప్పుడు ఆ యువకుడు మళ్ళీ అడిగాడు: ‘అయితే, ప్రభూ, సద్గుణ ఫలం ఏమిటి?’ అందుకు కృష్ణుడు ‘సద్గుణానికి గొప్ప ఫలం సంపదగానీ, కీర్తిగానీ కాదు. ప్రపంచమంతా అతణ్ణి విడిచి పెట్టినా, నన్ను చేరే మార్గం అతని హృదయంలో ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. అదే సద్గుణానికి నిజమైన ఫలం’ అన్నాడు. సద్గుణం స్వర్గానికి మార్గం కాదు; అది భగవంతుని హృదయాన్ని చేరే మార్గం!– యామిజాల జగదీశ్ -
జాతీయ పునర్నిర్మాణ శక్తిగా...
ఒక దేశ అభివృద్ధి కేవలం ప్రభుత్వాల నిర్ణయాలతోనే సాధ్యం కాదు. సమాజంలోని ప్రతి వర్గం, ముఖ్యంగా యువత తమ బాధ్యతను గుర్తించి దేశ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయినప్పుడే సంపూర్ణమైన ప్రగతి సాధ్యమవుతుంది. ఈ ఆలోచనకు కార్య రూపమే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ). 1948 జూన్‌లో ప్రారంభమైన ఈ సంస్థ 1949 జూలై 9న అధికారికంగా నమోదు అయ్యింది. ఏబీవీపీ మొదటి రోజు నుంచే జాతీయ పునర్నిర్మాణం తన లక్ష్యం అని స్పష్టంగా ప్రకటించింది.విద్యార్థులు కేవలం విద్యను పొందే వ్యక్తులు కాకుండా, సమాజ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కార మార్గాలను అన్వేషించే బాధ్యత గల పౌరులుగా ఎదగా లని పరిషత్ భావించింది. ఈ లక్ష్య సాధన కోసం నిర్మాణా త్మక కార్యక్రమాలు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలు, విద్యార్థి వ్యవస్థల్లో భాగస్వామ్యం అనే మూడు ప్రధాన మార్గాలను అనుసరించింది.భారతదేశ వైవిధ్యంలో ఏకత్వాన్ని బలపరిచే లక్ష్యంతో ఏబీవీపీ చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో సేయిల్ (స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్ స్టేట్ లివింగ్ ) ఒకటి. దీని ద్వారా ఈశాన్య భారత రాష్ట్రాల విద్యార్థులు దేశంలోని ఇతర ప్రాంతాల కుటుంబాలతో కలిసి నివసిస్తూ భిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలను ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం పొందారు. ఇది కేవలం పరిచయ కార్యక్రమం కాకుండా భావోద్వేగపూర్వక జాతీయ ఐక్యతకు ఒక వేదికగా నిలిచింది. ప్రత్యేక తెలంగాణ అంశంపై 1998లో తీర్మానం చేయడం, 2001లో ‘తెలంగాణ సస్యశ్యామల యాత్ర’ నిర్వహించడం, మలిదశ ఉద్యమ సమయంలో విద్యార్థులను సంఘటితం చేయడం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టింది.కాలం మారుతున్న కొద్దీ విద్యార్థి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు మారుతున్నాయి. ప్రపంచీకరణ, సాంకేతిక విప్లవం, కృత్రిమ మేధస్సు, పర్యావరణ మార్పులు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఏబీవీపీ తన కార్యక్రమాలను విస్తరించింది. అలాగే ‘ఖేలో భారత్’ ద్వారా క్రీడాస్ఫూర్తిని, ‘రాష్ట్రీయ కళా మంచ్’ ద్వారా భారతీయ కళా సంస్కృతిని, ‘స్టూడెంట్స్ ఫర్ డెవలప్మెంట్’ ద్వారా పర్యావరణ బాధ్యతను, ‘స్టూడెంట్స్ ఫర్ సేవ’ ద్వారా సేవా భావాన్ని ప్రోత్సహిస్తోంది. మెడివిజన్, అగ్రివిజన్, టెక్నికల్ సెల్, లా సెల్, పరిశోధన, విద్యా విధానాలపై చర్చలు, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది. యువ శక్తిని జాతీయ పునర్నిర్మాణ దిశగా నడిపించే ఈ ప్రయాణాన్ని ఏబీవీపీ నిరంతరం కొనసాగిస్తోంది.– రావుల కృష్ణ, ఏబీవీపీ తెలంగాణ అధ్యక్షుడు, (నేడు ఏబీవీపీ ఆవిర్భవించిన రోజు) -
శిక్షణ లేని శిశు సంరక్షణ కేంద్రాలు
మన దేశంలో డే కేర్ సెంటర్స్ పేరుతో శిశు సంరక్షణ కేంద్రాలను నడుపుతారు. వీటిలో కొన్ని ప్రైవేటు సంస్థల గొలుసు కేంద్రాలు, కొన్ని స్థానిక మైనవి. వీటిలో రోజుకు గంట చొప్పున నెల రుసుం రూ. 3,000 నుండి రూ. 15,000 వరకు ఉంటుంది. ఇటీవల బెంగళూరు బ్రూక్ (వైట్) ఫీల్డ్‌లో క్యాప్‌జెమిని సాంకేతిక సేవల కంపెనీ ప్రాంగణంలోని డే కేర్ సెంటర్లో పిల్లలను వాష్‌రూమ్‌లు, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లలో ఉంచడం, టాయిలెట్ గొట్టాలతో నోటిలో నీళ్ళు కొట్టడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డ దృశ్యాలు బహిర్గత మయ్యాయి. అరిస్తే, ఏడిస్తే కొడతామనీ, చంపు తామనీ బెదిరింపులు ఉన్న వీడియో బయటికి వచ్చింది.ఇవ్వాళ పిల్లల చదువు, వైద్యం, ఇతర సౌక ర్యాలకోసం ఒకరి సంపాదన సరిపోవడం లేదు. దంపతులిద్దరూ కష్టపడితే కాని ఇల్లు గడవదు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఒకసారి ఉద్యోగం వదిలితే తిరిగిరాదు. అందుకే ఇంట్లో ఆలనా, పాలనా చూసే పెద్దలు ఎవరూ లేని యువ దంపతులు తమ పిల్లలను శిశుసంరక్షణ కేంద్రాలలో చేర్చవలసి వస్తోంది. మానసిక శాస్త్ర సూత్రాలు తెలియవు!డే కేర్ సెంటర్లలో పసిపిల్లల పట్ల యాజ మాన్యాలు, అక్కడ పనిచేసేవారూ ఎందుకింత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారో కారణాలను వేతకాలి. ఈ కేంద్రాలను నిర్వాహకులు లాభా లకు నడుపుతారు. వారికిగానీ, అందులో ఉద్యో గులకుగానీ ఏ మాత్రం సేవాదృక్పథం ఉండటం లేదు. పిల్లల కోసం ఇచ్చిన తిండి, తీర్థాలను తిని పిల్లలను మాడ్చే ఆయాలున్నారు (తిండిలేని వారి పేదరికం కారణమేమో).యాజమాన్యం, సిబ్బందికి శిశు సంరక్షణలో శిక్షణ ఉండదు. వీరికి పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు. ఏడుపు మాన్పడం, బుజ్జగించడం, ఆడించడం రాదు. శిశుకేంద్రాలలో ఆట వస్తువులు ఉండవు. ఉన్నా పనిచేయవు. ఎదుటి వారితో సరిగ్గా వ్యవ హరించడానికీ, జీవితంలో అతి చిన్న సమస్యలను ఎదుర్కోవడానికీ మాన సిక శాస్త్ర సాధారణ సూత్రాలు తెలియాలి. ఇవి తెలియకనే పిల్లలు, విద్యార్థులు, పెద్దలు, రైతులు చిన్నపాటి ఇబ్బందులకే ఆత్మహత్యలకు ఒడి గడుతున్నారు.పసిపిల్లల సంరక్షణకు శిశు మనస్తత్వాన్ని తెలుసుకోవాలి. దాన్ని అధ్యయనం చేయాలి. అనుదిన అనువర్తిత చర్యలను అమలుచేయాలి. పిల్లలందరూ ఒకేలా ప్రవర్తించరు. ఒకే సమస్యకు ఒకేలా స్పందించరు. ఇండియాలో అధిక శాతం ప్రజలకు శిశు సంరక్షణపై అంతగా అవగాహన లేదు. పిల్లల సంరక్షణలో వాళ్ళకు తెలిసినవి మామూలు మొద్దు మార్గాలే.స్వీడన్ లాంటి దేశంలో విద్య, వైద్యం ఉచితం. ప్రభుత్వం పిల్లలను దేశ సంపదగా పరిగణిస్తుంది. శారీరక, మానసిక ప్రత్యేకతలు ఉన్న పసిపిల్లలకు నిద్ర, సంగీతం, మేధో ప్రేరణ, మానసిక ఉల్లాసం, మాట, ఆటల కోసం అత్యంత ఆధునిక యంత్ర సౌకర్యాలతో ప్రత్యేక పాఠశా లలు ఉంటాయి. నలుగురు పిల్లలకు ఐదుగురు శిక్షణపొందిన మానసిక నైపుణ్య ఉపాధ్యాయులు ఉంటారు. వీరు వృత్తి రీత్యానేగాక, ప్రవృత్తి పరంగానూ మానవత్వంతో పసిపిల్లలను తల్లిదండ్రుల కంటే బాగా చూడగలరు.మానసిక ఆరోగ్యం, శిశురక్షణ, పిల్లల భద్రత, పాలన, పోషణ వంటి సున్నిత విషయాలను పౌర సమాజం ప్రచారం చేయాలి. ప్రజాపక్ష రాజకీయ పక్షాలు వీటిని తమ పాలనా విధానాలుగా ప్రకటించాలి. - సంగిరెడ్డి హనుమంత రెడ్డి, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
కంచంలో ఉన్నది అమృతమేనా?
‘మనిషి తినే ఆహారం ఔషధంలా ఉండాలి... ఔషధమే ఆహారంలా మారే పరిస్థితి రాకూడదు’ అని హిప్పోక్రటీస్ ఏనాడో చెప్పాడు. కానీ నేడు పరిస్థితి ఏమిటి? మనం తినేది ఆహారమో, విషమో తెలియని దుఃస్థితి. కల్తీ ఆహారం అనేది ‘స్లో పాయిజన్’. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా 86 కోట్లకు పైగా ఆహార సంబంధిత అనారోగ్య కేసులు నమోదయ్యాయి. 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం రికార్డుల్లోకెక్కిన లెక్క మాత్రమే!అవే లెక్కల ప్రకారం, మన దేశంలోని మొత్తం మరణాల్లో 63 శాతం అంటురోగాలు కానివాటివల్లే కలుగుతున్నాయి. అందులో 27 శాతం మంది గుండె జబ్బుల వల్లే కన్నుమూస్తున్నారు. క్యాన్సర్ల గురించైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఐసీఎమ్ఆర్ అంచనా ప్రకారం ఒక్క 2022లోనే భారత్‌లో 14.6 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ప్రతి 9 మంది భారతీయుల్లో ఒకరికి తమ జీవితకాలంలో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందట! మరోవైపు, దాదాపు 13.8 కోట్ల మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతో మగ్గి పోతున్నారు.ఎందుకిలా జరుగుతోంది? కూర గాయల నుంచి పండ్ల దాకా కొడుతున్న రసాయనాలు... హోటళ్లలో వాడిన నూనెనే పదే పదే వాడటం, ప్రాసెస్డ్ ఫుడ్‌లో ఉండే విషపూరిత ప్రిజర్వేటివ్స్, అల్లం పేస్ట్ నుంచి కారం వరకు అన్నింటిలో జరుగుతున్న కల్తీ– ఇవన్నీ మనిషిని బతకనిస్తాయా? అందుకే అభివృద్ధిచెందిన దేశాలు ఆహార భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.మన తెలంగాణ విషయానికి వస్తే... గతంలో జరిగిన తప్పులను సరిదిద్దు కుంటూ... ‘కల్తీ లేని తెలంగాణ’ లక్ష్యంగా 2024 జనవరి నుండి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే హెచ్‌ఫాస్ట్, ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దించి కఠిన చర్యలు తీసుకుంటోంది.2024 నుండి 5,500కి పైగా ముమ్మర తనిఖీలు చేసి, నాణ్యత లేని 2,000కి పైగా సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన 150కి పైగా హోటళ్లు, తయారీ కేంద్రాలను సీజ్ చేయడమే కాకుండా, రూ. 2 కోట్లకు పైగా జరిమానాలు విధించారు. 100కి పైగా క్రిమినల్ కేసులు నమోదు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజల కంచంలో పడే అన్నం సురక్షితంగా ఉండేలా ప్రభుత్వాలు చూడాలి. మన కంచంలోని ఆహారం సురక్షితం కాకపోతే... అభివృద్ధి కథనాలన్నీ చివరకు ఆసుపత్రి కారిడార్లలో ముగిసి పోతాయి. – నవీన్ కుమార్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ -
ఆ విధంగా నా త్రివిధ సాధన..
కృష్ణాబాయికి స్వామి రామదాసు ‘ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ’ అనే మంత్రాన్ని ఉపదేశించారు. రామనామం సుధామధురం. ఎందరెందరినో మహనీయులుగా తీర్చిదిద్దిన మంత్రం అది. కృష్ణాబాయి కూడా ఎంతో శ్రద్ధగా ఆ మహత్తర నామాన్ని జపించటం ప్రారంభించింది. కానీ ‘చంచలం హి మనః కృష్ణా!’ అని అర్జునుడు చెప్పాడు కదా, కృష్ణాబాయి మనసు ఎక్కడెక్కడికో పరుగులు తీసింది. సమస్యను గుర్తించిన కృష్ణాబాయి స్వామి రామదాసున్న ఆశ్రమానికి పరుగెత్తింది.అప్పుడాయన ఆమెతో, ‘ఇందులో విచారించవలసినది ఏముంది? పరిభ్రమించుటే మనసు పని. దానికిష్ట మొచ్చినచోట దాన్ని పోనిమ్ము. అదంతా స్వయంగా రాముడే అని భావించు. రాముడు అనంతుడు. సమస్తమైన ప్రాణులూ, వస్తువులూ రాముని నుండి వచ్చి, రామునిలో చరించి, రామునిలో లీనమవుతాయి. అందువల్ల మనస్సు ఎక్కడికి పోయినా, సర్వమూ రాముడే అని భావించు. నీవు ఎవ్వరికి సేవ చేసినా అది రాముని సేవయనీ, రాముని పూజయనీ భావించు. ఈ అభ్యాసం విశ్వరూపుడయిన రామునితో నీ ఏకత్వాన్ని అనుభవించటానికి తేలికగా వీలు కలుగచేస్తుంది’ అని బోధించారు.గురువుగారి సలహాను కృష్ణాబాయి ఆ క్షణం నుండే పాటించింది. దాని వల్ల సాధారణ మనిషియైన కృష్ణా బాయి విశ్వమాత కృష్ణాబాయిగా ఎదిగింది. ఆమె తన అనుభవాన్ని ఇలా చెప్పింది: ‘ఆ విధంగా నా త్రివిధ సాధన – నోటితో రామమంత్రాన్ని ఉచ్చరించటం; ప్రతి ప్రాణినీ, ప్రతి వస్తువునూ సాక్షాత్ రామునిగానే భావించటం; చేతులతో చేసిన పని అంతా రాముని పనిగానూ, రాముని సేవగానూ భావించటం – ఏక కాలంలో మొదలైంది. నా దృష్టిలో పప్పా (రామదాసు), రాముడు అభిన్నం. ఈ అభ్యాసంతో నా మనస్సు నిశ్చలమైనాకు తెలియకుండగనే నా హృదయం ప్రశాంత మయమైంది’ (పుటలు 10–11; విశ్వమాత కృష్ణాబాయి, ఆనందా శ్రమము, కేరళ). – రాచమడుగు శ్రీనివాసులు -
సంశయాత్ములు
జ్ఞానం, శ్రద్ధ లేని సంశయాత్ముడు నశించిపోతాడని భగవద్గీత చెబుతుంది. సంశయాలతో సతమతమయ్యేవారు ఏ పనిలోనూ విజయం సాధించలేరు. అదేపనిగా అనేక సందేహాలతో మనసు నింపుకున్నవారు మనోదౌర్బల్యం కలిగి కర్తవ్య హీనులవుతారు.భయం, నిరాశ, నిష్క్రి యత్వం, ప్రతికూల ఆలోచనలు పెరిగిపోతుంటే మనిషిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. జీవితానందం సన్నగిల్లుతుంది. ఇటువంటి వారు ఎప్పుడూ ఏదో అపజయం, ఉపద్రవం జరగబోతోందేమోనన్న చెడు భావనలతో భయపడిపోతుంటారు. రేపు ఏం జరుగుతుందోనని నేటి ఆనంద క్షణాలను అనుభవించలేరు.ఏ పనైనా పూర్తి చేయలేమేమోననే సందేహంతోనే వీరు మొదలుపెడతారు. విద్యార్థులుగానీ, ఉద్యోగా ర్థులుగానీ తమ మీద తమకు స్థిర నమ్మకం లేకపోతే గెలుపు సాధించలేరు. ఏదైనా చేయగలము అనే విశ్వాసం ఉంటే సగం విజయం సాధించినట్లే! యుద్ధానికి వెళుతున్న సైన్యం విజయం తమదే అనే నమ్మకంతో వెళితే విజయం వరిస్తుంది.భగవద్గీత మానవులకు జీవన సమరంలో ఆత్మ విశ్వాసాన్ని కలుగజేసి ఆనందంగా జీవించటానికి మార్గం చూపిస్తుంది. హృదయ దౌర్బల్యం ప్రతివారికీ ఏదో ఒక సందర్భంలో కలుగక మానదు. శ్రీరాముడు, సీతాదేవి, ఆంజనేయుడు, అర్జునుడు ఏదో ఒక సందర్భంలో హృదయ దౌర్బల్యం అనుభవించినవారే. కానీ, దానినుండి బైట పడి ఘనులైన విధం మనకు పాఠం లాంటిది. – డా. చెంగల్వ రామలక్ష్మి -
పోపుల డబ్బా ఆర్థిక వ్యవస్థ
భారతీయ గ్రామీణ సమాజ చరిత్రలో ‘పోపుల డబ్బా’ అనేది కేవలం ఒక చిన్న డబ్బా కాదు. అది ఒక కుటుంబ ఆర్థిక క్రమశిక్షణకు, మహిళల దూరదృష్టికి, భవిష్యత్ భద్రతకు, స్వయం ఆధారిత జీవన విధానానికి ప్రతీక. ఇటీవలివరకూ గ్రామీణ ప్రాంతాలలో లక్షలాది కుటుంబాలు తమ దైనందిన జీవితంలో ఈ చిన్న డబ్బాను ఒక సూక్ష్మ బ్యాంకుగా ఉపయోగించేవి. ప్రజల జీవన అనుభవం, అవసరం, కష్టకాలాల నుంచి నేర్చుకున్న జ్ఞానం కలగలిపి ఏర్పడిన ఒక సహజమైన ఆర్థిక విధానం ఇది.గ్రామీణ కుటుంబాల్లో సంపాదన ప్రధానంగా వ్యవసాయం, కూలి, పశుపోషణ, చిన్న వ్యాపారాలు, చేతివృత్తులు వంటి రంగా లపై ఆధారపడి ఉంటుంది. ఈ ఆదాయం కూడా నెలనెలా స్థిరంగా కాకుండా కాలానుగుణంగా లభించేది. పంట అమ్మినప్పుడు మాత్రమే ఎక్కువ డబ్బు చేతికి వచ్చేది. మిగిలిన కాలంలో చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాల్సి వచ్చేది. అందుకే గ్రామీణ మహిళలు ఇంటి ఖర్చులలో మిగిలిన చిల్లరను వృథా చేయకుండా పోపుల డబ్బాలో వేయడం అలవాటు చేసుకున్నారు. ఏడాది చివరికి అది కుటుంబానికి ఒక అత్యవసర నిధిగా మారేది.ఇంటికి వచ్చిన ప్రతి రూపాయి ఎలా ఖర్చు చేయాలి, ఏ అవసరానికి ఎంత కేటాయించాలి, ఎంత పొదుపు చేయాలి అనే విషయాల్లో మహిళలు అసాధారణమైన లెక్కలు వేసేవారు. కుటుంబంలో ఇతరులకు తెలియకుండా కాదు, కుటుంబ ప్రయోజనాల కోసమే ఈ పొదుపు నిర్వహించబడేది. అనారోగ్యం వచ్చినప్పుడు, పిల్లల పాఠశాల ఫీజు చెల్లించాల్సి వచ్చినప్పుడు, పంట విత్తనాలు కొనాల్సినప్పుడు, పండుగలు వచ్చినప్పుడు లేదా ఆకస్మిక ఖర్చులు ఎదురైనప్పుడు ముందుగా తెరవబడేది ఈ పోపుల డబ్బానే.నేటి భాషలో దీనిని ‘మైక్రో ఎమర్జెన్సీ ఫండ్’ అని పిలిచినా, మన గ్రామీణ సమాజం దానిని దశాబ్దాల క్రితమే ఆచరణలో పెట్టింది. సామాజిక కోణంలో పరిశీలిస్తే పోపుల డబ్బా మహిళల నాయకత్వాన్ని కూడా బలపరిచింది. కుటుంబంలో ఖర్చుపై నియంత్రణ, అవసరాల ప్రాధాన్యత నిర్ణయించడం, అనవసర వ్యయా లను తగ్గించడం, పిల్లల్లో పొదుపు అలవాటు పెంపొందించడం వంటి బాధ్యతలను మహిళలు సమర్థవంతంగా నిర్వహించేవారు. చిన్న పిల్లలకు కూడా మిగిలిన నాణేలను పోపుల డబ్బాలో వేయమని చెప్పడం ద్వారా చిన్నప్పటి నుంచే ఆర్థిక క్రమశిక్షణను నేర్పించేవారు. ఈ ప్రక్రియ వల్ల కుటుంబంలో ప్రతి రూపాయి విలువ తెలిసే సంస్కృతి ఏర్పడింది.నేటి ప్రవర్తనా ఆర్థిక శాస్త్రం చెప్పే ‘చిన్న అలవాట్లు పెద్ద ఆర్థిక విజయాలకు దారి తీస్తాయి’ అనే సిద్ధాంతాన్ని మన గ్రామీణ సమాజం ఎంతో కాలం క్రితమే జీవన విధానంగా స్వీకరించింది. పోపుల డబ్బా కేవలం గత తరాల జ్ఞాపకం కాదు; ఒక విలువైన సామాజిక సంపద. నేటి డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సేవలు విస్తరించినా, పోపుల డబ్బా వెనుక ఉన్న విలువలు – పొదుపు, మితవ్యయం, భవిష్యత్ ప్రణాళిక, కుటుంబ బాధ్యత, ఆర్థిక స్వయం సమృద్ధి– ఎప్పటికీ ప్రాసంగికమే. – డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి, పౌర సంబంధాల అధికారి, ఆర్ట్స్ కళాశాల, కేయూ -
ఉత్తర–దక్షిణ వారధి
ఎనిమిదేళ్ల వయసులోనే విజయవాడలో త్యాగరాజ ఆరాధనలో ఓ బాలుడు తొలి కచేరీ ఇచ్చాడు. కేటాయించింది ముప్పై నిమిషాలే అయినా, శ్రోతలు కాలగమనాన్నే మరిచిపోయేలా ఆ కచేరీ మూడు గంటలపాటు సాగిందని చెబుతారు. ఆ గానం విన్న హరికథా విద్వాంసుడు ముసునూరి సత్యనారాయణ మూర్తి భాగవతార్, ఆ ‘మురళీకృష్ణ’ అన్న అతడి పేరుకు ‘బాల’ను జోడించారు. అప్పటి నుంచి ఆయన బాలమురళీకృష్ణ అయ్యారు.1930 జూలై 6న తూర్పు గోదావరి జిల్లా శంకర గుప్తం అనే చిన్న గ్రామంలో జన్మించిన ఆ చిన్నారి, మున్ముందు భారతీయ శాస్త్రీయ సంగీతంలో శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటారని ఎవరూ ఊహించి ఉండరు. కేవలం పదిహేనేళ్ల వయసులో 72 మేళకర్త రాగాలన్నింటినీ సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని, ప్రతి రాగంలోనూ కృతులు రచించారు. ఆ కృతుల సంకలనమే ‘జనక రాగ కృతి మంజరి’. వర్ణాలు, కృతులు, థిల్లా నాలు, భావగీతాలతో కలిపి 400కు పైగా రచనలు చేసిన ఆయన, తెలుగుతో పాటు సంస్కృతం, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, పంజాబీ భాష ల్లోనూ సమానమైన సౌందర్యంతో స్వరపరిచారు.కొత్త రాగాలు–తాళాలు‘సంప్రదాయం అంటే స్తబ్ధత కాదు, అది సజీవ ప్రవాహం’ అన్నదే బాలమురళి దృక్పథం. ప్రాచీన సంప్రదాయపు మూలాలను చెక్కుచెదరనివ్వకుండానే ఆయన కొత్త సరిహద్దులను తాకారు. మహతి, లవంగి, గణపతి, సర్వశ్రీ, సుముఖం, సిద్ధి, ఓంకారి వంటి సరికొత్త రాగాలను సృష్టించారు. వీటిలో కొన్ని కేవలం మూడు లేదా నాలుగు స్వరాలతోనే రూపొందినవి. అంతేకాదు, త్రిముఖి, పంచముఖి, సప్తముఖి, నవముఖి వంటి సరికొత్త తాళ పద్ధతులకు ఆయన ప్రాణం పోశారు.మూడు అష్టకాల విస్తృతి, అపార గాంభీర్యం, స్ఫటికంలాంటి స్పష్టమైన ఉచ్చారణ, గమకాల్లో అసాధారణ నైపుణ్యం ఆయనది. ప్రపంచవ్యాప్తంగా వేలాది కచేరీలు ఇచ్చిన ఆయన, పండిట్ భీమ్సేన్ జోషి, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, కిశోరీ అమోన్కర్ వంటి హిందు స్థానీ దిగ్గజాలతో జుగల్బందీలు నిర్వహించి, ఉత్తరాది–దక్షిణాది సంగీతాలకు వారధిగా నిలిచారు. గాత్రంతో పాటు వయోలిన్, వీణ, మృదంగం, కంజీరా, వయోలాలను అద్భుతంగా వాయించారు. ఆకాశవాణిలో ఏడు వేర్వేరు ప్రదర్శన విభాగాల్లో ‘టాప్ గ్రేడ్’’ సాధించిన ఏకైక సంగీతకారుడిగా చరిత్ర సృష్టించారు. రవీంద్రుని ‘గీతాంజలి’ని విదేశీ గాయక బృందంతో కలిసి ఆలపించడం, రవీంద్ర సంగీతాన్ని బెంగాలీలో రికార్డు చేయడం, జాజ్ ఫ్యూజన్ ప్రయో గాలు చేయడం, ఆయన సంగీత పరిధికి హద్దులే లేవని చాటిచెప్పాయి. వెండితెరపైనా బాలమురళి తనదైన ముద్ర వేశారు. 1967లో ‘భక్త ప్రహ్లాద’ చిత్రంలో నారదుడి పాత్రలో నటిస్తూ, ‘ఆది అనాదియు నీవే దేవా’ వంటి అమర గీతాలు ఆలపించారు.పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు మూడింటినీ అందుకున్న అరుదైన కర్ణాటక సంగీత మహనీయుడు ఆయన. ఫ్రా¯Œ్స ప్రభుత్వపు ‘షెవాలియర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్’ వంటివి ఎన్నో అందుకున్న ఆయన 2016 నవంబర్ 22న చెన్నైలో కన్ను మూశారు. కానీ ఆయన స్వరం, కృతులు, రాగాలు సజీవంగా మారుమోగుతూనే ఉన్నాయి. – డా కొత్తపల్లి శ్రీనివాస వర్మ, సీనియర్ జర్నలిస్ట్ (జూలై 6న మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి) -
ఏం పండించాలో ప్రభుత్వమే చెప్పాలా?
ఇటీవల ఏడు సన్నరకాల వరి రకాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం క్వింటాలుకు రూ. 500 బోనస్ ప్రకటించింది. గతంలో 33 నోటిఫైడ్ రకాల వరికి ఈ ప్రోత్సాహకం ఉండగా, ఇప్పుడు బీపీటీ–5204, తెలంగాణ సోనా (ఆర్ఎన్ ఆర్–15048), కునారం సన్నాలు (కేఎన్ ఎం–1638), జైశ్రీరామ్, హెచ్ఎంటీ సోనా, డబ్ల్యూజీఎల్–44 (సిద్ధి), కేఎన్ ఎం–7715 అనే ఏడు రకాలకే పరిమితం చేశారు. ఇందుకు ప్రభుత్వం చెప్పే కారణం ఏమిటంటే... ఈ రకాలకే మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. మిల్లింగ్ సులభంగా ఉంటుంది. ప్రభుత్వ సేకరణ ప్రక్రియ, వ్యయం కూడా తగ్గుతుంది. ఈ కారణాలు పరిపాలనా పరంగా సరైనవే కావచ్చు. కానీ ఈ నిర్ణయం వ్యవసాయ భవిష్యత్తుపై కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అభివృద్ధి సంస్థలు రైతులకు పంటల వైవిధ్యం, రకాల వైవిధ్యం, తక్కువ నీరు వినియోగించే పంటలు, వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయం గురించి చెబుతున్నాయి. సంప్రదాయ విత్తనాలను కాపాడాలని కూడా ప్రోత్సహిస్తున్నాయి. అయితే మరోవైపు కేవలం ఏడు సన్న వరి రకాలకే బోనస్ ఇవ్వడం ద్వారా రైతులకు భిన్నమైన సంకేతం వెళుతోంది. రూ. 500 బోనస్ చిన్న మొత్తం కాదు. ఏ రకం విత్తనం వేయాలనే నిర్ణయాన్ని ఇది ప్రభా వితం చేస్తుంది. క్రమంగా రైతులు ఇతర రకాలను వదిలి బోనస్ ఉన్న రకాలవైపు వెళ్లే అవకాశం ఉంది.రైతులు ఒక వరి రకాన్ని కేవలం మార్కెట్ ధర చూసి మాత్రమే ఎన్నుకోరు. నేల స్వభావం, నీటి లభ్యత, పంట కాలం, చీడపీడల నిరోధకత, గింజ నాణ్యత, గడ్డి దిగుబడి, ఇంటి అవసరాలు, స్థానిక వాతావరణ పరిస్థితులు– ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక మండ లంలో బాగా పండే రకం, మరో మండలంలో అదే స్థాయిలో ఫలితం ఇవ్వకపోవచ్చు.తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే రకం ఎంటీయూ–1010. మంచి దిగుబడి, స్థిరమైన పనితీరు, వివిధ నేలల్లో అనుకూలత, తక్కువ ప్రమాదం కారణంగా వేలాది మంది రైతులు ఈ రకాన్ని ఇష్టపడి సాగుచేస్తున్నారు. కానీ ఈ రకం బోనస్ జాబితాలో లేదు. మరోవైపు బీపీటీ–5204 వంటి రకం మంచి నాణ్యత కలిగిన బియ్యాన్ని ఇస్తుంది. కానీ ఎక్కువ కాలం, ఎక్కువ నీరు అవసరం. అగ్గితెగులు, దోమ పోటు వంటి చీడపీడలకు ఎక్కువగా గురవుతుంది.ప్రతి రకానికి దాని బలాలు, బలహీనతలు, ప్రాముఖ్యం ఉంటాయి. రాష్ట్రమంతా ఈ ఏడు రకాలపైనే ఆధారపడితే, విత్తనాలకు డిమాండ్ అకస్మాత్తుగా పెరిగి, కృత్రిమ కొరత ఏర్పడుతుంది. ఇది విత్తన ధరలను పెంచి, రైతులను ప్రైవేట్ విత్తన కంపెనీలపై మరింతగా ఆధారపడేలా చేస్తుంది. పరిమిత రకాల వల్ల మిల్లు యజమానులకు కొనుగోలు, మిల్లింగ్ ప్రక్రియ సులువు కావచ్చు; కానీ ప్రభుత్వ విధానాల వల్ల రైతులకూ, జీవ వైవిధ్యానికీ కలిగే ప్రయోజనాలు ఏమిటి?వైవిధ్యమే రైతుకు రక్షణవికారాబాద్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రైతులతో చేసిన చర్చల్లో మరో వాస్తవం బయటపడింది. కొంతమంది రైతులు మార్కెట్ లేకపోవడంతో మంచి దిగుబడి ఇచ్చే రకాలను వదిలేశారు. మరికొందరు స్థానిక పరిస్థితులకు అనుకూలంగా ఉండే గోదావరి ఇసుకలు, సిద్ధ సన్నాలు, కుళ్లకర్వంటి సాంప్రదాయ రకాలను ఇప్పటికీ సాగు చేస్తున్నారు. అవి తక్కువ నీటితో పండుతాయి. ఇంటి వినియోగానికి అనుకూలం. కొన్ని రకాలు ఎండలను, మరికొన్ని అధిక వర్షా లను తట్టు కుంటాయి.ఇప్పుడు వాతావరణ మార్పులు మరింత తీవ్రమవుతున్నాయి. వర్షపాతం అనిశ్చితంగా మారుతోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చీడపీడల సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైవిధ్యమే రైతుకు రక్షణ. ఒకే రకాన్ని పెద్ద ఎత్తున సాగుచేస్తే ఒక చీడపీడ లేదా వ్యాధి వచ్చినప్పుడు భారీ నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. కానీ వివిధ రకాలు సాగు చేస్తే ప్రమాదం తగ్గుతుంది. ఇదే వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయానికి పునాది. సంప్రదాయ రకాలు మన వ్యవసాయ వారసత్వం. అవి కేవలం గతానికి చెందినవి కావు. భవిష్యత్తుకు కూడా అవసరమైన జన్యు సంపద. ఇవి కనుమరుగైతే తిరిగి రైతుల పొలాల్లోకి తీసుకురావడం చాలా కష్టం.ఇక్కడ అసలు ప్రశ్న ఏడు రకాలు మంచివా? కాదా? అనేది కాదు. రైతుల ఎంపికను ప్రభుత్వ ప్రోత్సాహకాల ద్వారా కుదించడం సరైన విధానమా? అనేదే అసలు ప్రశ్న. కొన్ని రకాలకే బోనస్ ఇవ్వడం కాకుండా, స్థానిక పరిస్థితులకు అనువైన రకాలను సాగు చేసే రైతులను ప్రోత్సహించవచ్చు. నీటి వనరులను వర్షాధార పంటల రక్షణకు సంధానించే వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే రైతు సమూహాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. వాతావరణ మార్పులు పెరుగుతున్న ఈ కాలంలో... రైతులు ఎంచుకుంటున్న రకాలు, పంటలను మన విధానాలు తగ్గించకూడదు. మరింత విస్తరించేలా ఉండాలి.- భాగ్యలక్ష్మి, వ్యాసకర్త, వాటర్‌షెడ్ సపోర్ట్ సర్విసెస్ అండ్ యాక్టివిటీస్ నెట్వర్క్ (వాసన్) అసోసియేట్ డైరెక్టర్ -
'ప్రమాదపుటంచున' సోషలిస్ట్ క్యూబా
1823లో అమెరికా 5వ అధ్యక్షుడు మన్రో సిద్ధాంతం ప్రకారం లాటిన్ అమెరికా అంతా అమెరికాకు చెందుతుంది; పశ్చిమ భూగోళంలోకి యూరపు దేశాలు వలస రాకూడదు; తూర్పు భూగోళంలో అమెరికా జోక్యం చేసుకోదు. దక్షిణ అమెరికా దేశాలు అమెరికాకు చెందినవని (బ్యాక్ యార్డ్) అర్థం. ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ ఈ సిద్ధాంతాన్ని నిస్సిగ్గుగా అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నారు.స్పానిష్–అమెరికన్ యుద్ధం ముగిసిన తర్వాత 1902 మే 20న క్యూబన్ రిపబ్లిక్ ఏర్పడింది. ఈ యుద్ధంలో స్పానిష్ వలస ప్రాంతా లైన క్యూబా, ప్యూర్టోరికో, గ్వామ్, ఫిలిప్పైన్స్లను అమెరికా స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత 1917 నుండి 1923 వరకూ అమె రికా మెరైన్లు క్యూబా ద్వీపాన్ని ఆక్రమించి సమ్మెలను అణిచివేస్తూ అమెరికా కార్పొరేట్ ప్రయోజనాల భుజం కాశారు. అమెరికా సైనిక ఆక్రమణ అధికారికంగా ముగిసినప్పటికీ, క్యూబాపై అజమాయిషీ కోసం ‘ప్లాట్’ సవరణను విధించింది. 1917లో పాలస్తీనా ఏర్పాటు చేసి 1948 వరకూ బ్రిటిష్‌వాళ్ళు కంట్రోల్ కోసం తీసుకొన్న మాండేట్ (అజమాయిషీ) లాంటిది ఇది. దీనితో వాషింగ్టన్కు సము చితమని భావించినప్పుడల్లా క్యూబా వ్యవహారాల్లో సైనిక జోక్యం చేసుకునే ‘అనియంత్రిత’ హక్కును పొందింది. కానీ సోషలిస్టు క్యూబా దీన్ని తిరస్కరించింది. ప్రపంచ మద్దతు అవసరం!క్యూబాపై గత 66 ఏళ్లుగా అమెరికా సాగించిన భయోత్పాతం, అలాగే ప్రస్తుతం తీవ్రతరమవుతున్న పాలన మార్పు ప్రయత్నాలన్నీ 1959 విప్లవానికి ముందు ఉన్న ప్లాట్ సవరణకూ, పుల్జెన్సియో బాటిస్టా ప్రభుత్వ నియంతృత్వంలోని సంబంధాలను పునరుద్ధరించటానికి ఉన్న అడ్డంకులను తొలగించటానికీ ఉద్దేశించినవి. సోష లిస్టు ప్రణాళిక ఆర్థిక విధానానికి బదులుగా... స్వేచ్ఛా విపణి పెట్టు బడిదారీ విధానం వైపు, సాంఘిక కోతల వైపు క్యూబా ప్రస్తుతం నడవబోతున్నది. ఫలితంగా క్యూబాలో ప్రభుత్వ ఆధీనంలోని నియంత్రిత ఆర్థిక వ్యవస్థ కూలిపోనుంది. ‘యుద్ధ ఆర్థిక వ్యవస్థ’ పేరిట ప్రవేశపెట్టనున్న ప్రభుత్వ పొదుపు చర్యలు, సాంఘిక కోతల ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పడిపోయే ప్రమాదం ఉంది.సామ్రాజ్యవాద ఆంక్షలను క్యూబా ఎదుర్కోలేకపోయింది. చైనా, రష్యాల సహాయం అంతంతమాత్రంగా ఉంది. ట్రంప్ జన వరి నెలలో క్యూబాకు ఇంధన దిగుమతుల్ని నిషేధించాడు. ముడి చమురు ఎగుమతి దేశాలపై తీవ్ర ఆంక్షలుంటాయని హెచ్చరించారు. వెనెజులా, అమెరికా కబంధహస్తాల్లోకి వెళ్లిపోయింది. మెక్సికో వంటి దేశాలు సహాయాన్ని ఆపాయి. ఇంధన కొరతతో గంటలకొద్దీ క్యూబా అంధకారంలోకి వెళ్లాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. క్యూబాలో 1959 విప్లవ సమానత్వ లక్ష్యాలు దూరం కాబోతు న్నాయి. ఒకప్పటి సోవియట్ యూనియన్ 1990వ దశకంలో కుప్ప కూలిన తర్వాత క్యూబాకు సంపూర్ణంగా ఆపన్నహస్తం అందించే వారే లేకపోయారు.క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న ఆంక్షల దాడి... ప్రపంచ ఆధిపత్యానికి ఎదురయ్యే ప్రతీ సవాలునూ నాశనం చేయాలనే దాని ప్రయత్నానికి ఒక కేంద్రీకృత రూపం మాత్రమే. ఇటువంటి ప్రయత్నాలు ఇరాక్, అఫ్గా నిస్తాన్, లిబియా, సిరియాల విధ్వంసానికి, గాజాలో మారణ హోమానికి, ఇరాన్ పై యుద్ధానికి, వెనెజులా అధ్యక్షుడు మధురోను అపహరించి, ముడిచమురు స్వాధీనం చేసుకోవటానికి కారణ మయ్యాయి. మే 14న సి.ఐ.ఎ. డైరెక్టరు జాన్ రాట్ క్లిఫ్ హవానాకు వచ్చి పెట్టుబడిదారీ ఆర్థిక విధాన దిశగా సంస్కరించకపోతే క్యూబాను సర్వనాశనం చేస్తామని ఒత్తిడి ప్రకటించాడు. పెట్టుబడీ దారీ ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా వచ్చిన సోషలిస్టు విప్లవాలు మనుగడ సాధించాలంటే ప్రపంచ కార్మికుల సంఘీభావం, మద్దతు అవసరం.సోషలిస్టు ప్రణాళిక ఆర్థిక విధానానికి బదులుగా... స్వేచ్ఛా విపణి పెట్టుబడిదారీ విధానం వైపు, సాంఘిక కోతల వైపు క్యూబా ప్రస్తుతం నడవబోతున్నది. - బుడ్డిగ జమిందార్, వ్యాసకర్త, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యవర్గ సభ్యులు -
ఆత్మహత్య వ్యక్తిగత వైఫల్యమా?
దేశంలో ప్రతి విద్యార్థి ఆత్మహత్య అనంతరం దాదాపు ఒకే విధమైన చర్చ కొనసాగుతుంది. పరీక్షల్లో విఫలమయ్యాడా? చదువు ఒత్తిడిని తట్టుకోలేకపోయాడా? మానసిక సమస్యలతో బాధపడుతున్నాడా? అంటే సమస్యను పూర్తిగా వ్యక్తి చుట్టూనే కేంద్రీకరిస్తున్నాం. అయితే సుప్రీంకోర్టు నియమించిన జాతీయ టాస్క్ ఫోర్స్ (ఎన్టీఎఫ్) మధ్యంతర నివేదిక ఈ దృక్పథాన్ని సవాలు చేస్తోంది. విద్యార్థి ఆత్మహత్యలను కేవలం వ్యక్తిగత కార ణాల ఫలితంగా చూడటం వాస్తవాన్ని అసంపూర్ణంగా అర్థం చేసుకోవడమే నని ఇది స్పష్టం చేస్తోంది.ఐఐటీ ఢిల్లీ విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు 2025లో ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ ఫోర్స్(ఎన్టీఎఫ్) మధ్యంతర నివేదిక విద్యార్థుల ‘ఆత్మహత్యలు అసలు సమస్య కాదు; అవి విద్యార్థి సంక్షో భానికి కనిపించే చివరి సూచన మాత్రమే’ అని పేర్కొంది. ఈ నివేదికలో అత్యంత ఆందోళనకరమైన గణాంకాల్లో ఒకటి, సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఒకరు తమను క్యాంపస్‌లో ‘బయటి వ్యక్తులు’గా భావిస్తున్నట్లు వెల్లడైంది. భాషా సమస్యలు, సామాజిక–ఆర్థిక అసమానతలు, కుల/వర్గ వివక్ష ఈ దూరాన్ని మరింత పెంచుతున్నాయి.మరోవైపు కేవలం 56 శాతం మంది మాత్రమే తమ విద్యాసంస్థ... సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్క రిస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ గణాంకాలు విద్యార్థి సంక్షోభం వ్యక్తిగతం మాత్రమే కాక, సంస్థాగత స్వభావం కూడా కలిగి ఉందని సూచిస్తున్నాయి. ఎన్టీఎఫ్ క్షేత్రస్థాయి అధ్యయనాలు కూడా ఇదే స్పష్టం చేశాయి. అందువల్ల ప్రతి విద్యార్థి ఆత్మహత్య అనంతరం ‘అతను ఎందుకు తట్టుకోలేకపోయాడు?’ అనే ప్రశ్నతో పాటు ‘అతను సంక్షోభంలో ఉన్న ప్పుడు వ్యవస్థ ఏ విధంగా స్పందించింది?’ అనే ప్రశ్నను కూడా పరిశీలించాలి.ఎన్టీఎఫ్ ప్రకారం... విద్యార్థి ఆత్మహత్యలను కేవలం వ్యక్తిగత మానసిక ఆరోగ్య సమస్యగా కాకుండా, విద్యాసంస్థల జవాబుదారీతనం, క్యాంపస్ సంస్కృతి, మద్దతు వ్యవస్థల నాణ్యతకు సంబంధించిన అంశంగా కూడా చూడాలి. విద్యార్థి మనసులో ‘నేను ఒంటరిని’ అనే భావన కన్నా ‘ఇక్కడ నాకో మద్దతు ఉంది’ అనే విశ్వాసాన్ని పెంపొందించగలిగితేనే ఈ విషాద ఘటనల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. ఆ విశ్వాసాన్ని నిల బెట్టడమే నేటి విద్యావ్యవస్థ మొదటి ధర్మం. – వంగవోలు రవి, ఉపాధ్యాయుడు -
మాకు చిన్నతనం నుంచి అబ్బిన అలవాటు..
కొద్ది రోజుల క్రితం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హాలండ్ – జపాన్ మధ్య ‘ఫుట్‌బాల్ మ్యాచ్’ జరిగింది. వందలాది జపానీయ అభిమానులు, జపాన్ నుంచి ప్రత్యేకంగా వెళ్ళి ఆ ఆటను చూచి, అనందించి, తిరిగి వెళ్ళారు. ఆట 2–2 స్కోరుతో ‘డ్రా’గా ముగిసింది. అసలు విశేషం ఆట ముగిసిన తరవాత జరిగింది.జపాన్ నుంచి వచ్చిన అభిమానులందరూ కలిసి, స్టేడియంలో వాళ్ళు కూర్చొన్న భాగాన్ని ఊడ్చి, తుడిచి, అద్దంలా శుభ్రం చేసి, పోగయిన చెత్తను సంచీలలో తీసుకువెళ్ళి కుప్పతొట్లలో పోసి వెళ్ళారు. ‘ఎక్కడికయినా వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు, అక్కడ మా వల్ల పోగయిన చెత్తను మేమే శుభ్రం చేసివెళ్ళటం మాకు చిన్నతనం నుంచి అబ్బిన అలవాటు’ అన్నారట.ఈ చర్యతో వాళ్ళు మనకు మన సనాతన సంప్రదాయం బోధించే రెండు ముఖ్య ధర్మాలను ఆచరించి చూపిన ట్టయింది. మొదటిది ‘ఆత్మవత్ సర్వభూతాని’ – అన్ని ప్రాణులూ మన లాంటివే అన్న ధర్మం. కనక, మన వలన ఇతరులకు కష్టం కలగకూడదు. రెండు, అశుభ్రమైన పరిసరాలలో ఏ పనీ సమర్థంగా, తృప్తికరంగా జరపలేం, కార్యసాధనకు ఏకాగ్రత అవసరం. ఏకాగ్రతకు శుచి శుభ్రతలు దోహదం చేస్తాయి. లౌకికమైన పనుల విషయంలోనూ, ఆధ్యాత్మిక సాధనల విషయాల్లోనూ అన్ని చోట్లా ఇది వర్తిస్తుంది.యోగ శాస్త్రం చెప్పే యమ, నియమాలలో ప్రప్రథమ నియమం ‘శౌచం’. ‘శౌచం దైవీ గుణం, దాన్ని ఆచరించు; అశౌచం ఆసురీ గుణం, దాన్ని ఆచరించకు’ అని భగవద్గీత బోధిస్తుంది. ముఖ్యంగా పూజా, ధ్యానాది సాధనలలో పరిసరశుద్ధీ, ద్రవ్యశుద్ద్ధీ, శరీరశుద్ధీ మొదలైనవి చిత్తశుద్ధికీ, చిత్త ఏకాగ్రతకూ తోడ్పడతాయి అని పెద్దలు పదే పదే సూచిస్తూ ఉంటారు. జపాను అభిమానులు క్రీడాంగణ శుభ్రత పట్ల చూపిన నిబద్ధతను, ఆస్తిక గణాలు విద్యాలయాలూ, వీధులూ ఇత్యాది బహిరంగ ప్రదేశాలలోనూ, పుణ్యక్షేత్రాలూ, తీర్థాల లాంటి పవిత్ర ప్రదేశాలలోనూ చూపగలిగితే ఫలితాలు మహత్తరంగా ఉంటాయి. – ఎం. మారుతి శాస్త్రి -
అగ్రస్థానం నుండి అప్రస్తుతానికి?
అమెరికా సంయుక్త రాష్ట్రాలు స్వాతంత్య్రం ప్రకటించుకొని 250 సంవత్సరాలు పూర్తవబోతున్నది. 1776 జూలై 4న 13 కాలనీలు స్వాతంత్య్రం ప్రకటించుకోవటంతో యూఎస్ఏ దేశానికి పునాదిపడింది. క్రమంగా స్పానిష్, మెక్సికన్లతో యుద్ధాలు, కొనుగోళ్లతో అది విస్తరించింది. 1941లో జపాన్ పెరల్ హార్బర్‌పై దాడితో రెండవ ప్రపంచ యుద్ధంలో క్రియాశీలకమైంది. 1945లో ప్రపంచ జీడీపీలో 50 శాతం వాటాతో బలమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 1969లో చంద్రుడిపై కాలుమోపి, 1970 దశకంలో అర్పా నెట్, తదుపరి ఇంటర్నెట్ ద్వారా 1980లలో సిలికాన్ వ్యాలీ గుండా ఐటీ రంగాన్ని శాసించింది. 1991లో సోవియట్ విచ్ఛిన్నంతో ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యంగా అవతరించింది.అగ్ర లక్షణాలుఒక దేశం అగ్రరాజ్యంగా లేదా ప్రపంచ శక్తిగా ఎదగాలంటే నాలుగు అంశాలు కీలకం. 1. మాతృదేశం నుండి సుదూర ప్రాంతా లలో శత్రువులను నిలువరించగలగాలి. 2. ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలు, రవాణా మార్గాలను నియంత్రించగలగాలి. 3. ప్రపంచ స్థాయి వ్యవస్థలను సృష్టించి, ఆదర్శప్రాయమైన చట్టాలు, నిబంధన లను ఏర్పరచాలి. 4. ఆ దేశపు విలువలు, సంప్రదాయాలు, భాష లను ప్రపంచం అనుసరించాలి.ప్రపంచవ్యాప్తంగా 750కి పైగా సైనిక స్థావరాలతో యూఎస్ఏ ఏ ప్రాంతంలోని శత్రువునైనా నిలువరించగలుగు తుంది. ప్రపంచ జీడీపీలో 25 శాతం వాటా కలిగి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్వంటి సంస్థల ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నది.హాలీవుడ్, పాప్/జాజ్ సంగీతం, ప్రజాస్వామ్య వ్యవస్థల ద్వారా ప్రపంచ సంస్కృతులను ప్రభావితం చేస్తున్నది. సాలీనా 700 బిలి యన్ డాలర్ల ప్రైవేట్ ఆర్ అండ్ డీ వ్యయం, 500 బిలియన్ డాలర్ల దాతృత్వ విరాళాల ద్వారా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నది.తిరోగమన రాజ్యం2000 సంవత్సరంకల్లా యూఎస్ఏ తిరుగులేని ఏకైక అగ్ర రాజ్యంగా అభివృద్ధి చెందిందనటంలో సందేహం లేదు. కానీ 2025 కల్లా ఇంటా, బయటా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. ‘అమె రికా నాయకత్వపు ప్రపంచం నుండి క్రమంగా అమెరికాతో కూడిన ప్రపంచ రాజకీయ వ్యవస్థ’ దిశగా ప్రపంచం ప్రయాణిస్తున్నట్లుగా జియో పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరి కాను ఒక తిరోగమన అగ్రరాజ్యంగా అభివర్ణిస్తున్నారు. చరిత్ర కారుడు ఆర్థర్ షెల్లింగర్ అభిప్రాయపడినట్లు ‘అమెరికా ఒక ప్రయోగం మాత్రమే, తయారీ పూర్తయిన ఉత్పత్తి కాదు’.అమెరికన్ ప్రభుత్వం క్రమంగా అప్పుల ఊబిలో చిక్కుకుంటు న్నది. ప్రభుత్వ అప్పు జీడీపీ కంటే 120 శాతం ఎక్కువగా ఉన్నది. ఇది 200 శాతానికి చేరితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది.ప్రపంచ రిజర్వ్ కరెన్సీలో యూఎస్ వాటా 71 నుండి 59 శాతానికి పడిపోయింది. లావాదేవీలకు అమెరికన్ డాలర్‌కు ప్రత్యామ్నాయంగా చైనీస్ యువాన్ కుదురుకుంటున్నది. బ్రిక్స్ దేశాలు డాలర్ ఆధిపత్యానికే సవాలు విసురుతున్నాయి. చైనా, రష్యా, ఈయూ,ఇండియా ప్రత్యా మ్నాయ రాజకీయ శక్తులుగా బలపడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యూజన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, అంత రిక్ష పరిశోధనలలో చైనా గట్టి పోటీనిస్తున్నది. మాదకద్రవ్యాలు, గన్‌కల్చర్ అమెరికన్ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.కుప్పకూలకపోయినా...యూకే (ఇంగ్లండ్) తన రవి అస్తమించని సామ్రాజ్యంతో ప్రపంచాన్ని సుమారు వంద సంవత్సరాలు (1850–1950) పాలించిందనే చెప్పాలి. ప్రపంచ జీడీపీలో అప్పటి బ్రిటన్ వాటా 25శాతం. అప్రతిహతమయిన నౌకాబలం, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన వలసలు, సముద్ర మార్గాల మీద ఆధిపత్యంతో బ్రిటన్ ప్రపంచాన్ని శాసించింది. బ్రిటన్‌తో పోలిస్తే అమెరికన్ ఆధిపత్యం భిన్నంగా ఉంటుంది. అమెరికా ఇతర దేశాలను ఆక్రమించి వలసలు స్థాపించలేదు. ఆధునిక నౌకా, వైమానిక సైనిక బలాలతో పాటుగా, టెక్నాలజీ రంగంలో ఆధిపత్యం, వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్‌లపై గుత్తాధిపత్యం, డాలర్ ద్వారా ప్రపంచ వాణిజ్యంపై ఉడుంపట్టు పట్టి, నాటో మిత్రదేశాల సహకారం దన్నుగా యూఎస్ఏ అగ్ర రాజ్యంగా ఏర్పడింది. యూఎస్ఏ, యూకే రెండూ మాతృ దేశాన్ని సురక్షితంగా ఉంచుకొని, శత్రువులను కొల్లగొట్టడమనే ప్రాథమిక సూత్రాన్ని అమలుపరచాయి. రెండువైపులా శత్రుదుర్భేద్యంగా విశా లమైన అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలు ఉండటం, అపార మైన సహజవనరులు యూఎస్ఏకు భౌగోళికంగా కలిసి వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, యూకే బలహీనపడటం యూఎస్ఏకు అనుకోని వరంగా పరిణమించింది.యుద్ధాలు, ఆక్రమణల వలన సామ్రాజ్యాలు కూలిపోవు. సామ్రాజ్యాలు అంతర్గతంగా బలహీనపడి విచ్ఛిన్నమవుతాయని చరిత్ర చెబుతున్నది. 1950 కల్లా బ్రిటిష్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. వలస సామ్రాజ్యాన్ని నిర్వహించటానికి అయ్యే ఖర్చు 1950లో యూకే జీడీపీలో 10 శాతం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూకే ఆర్థికంగా బలహీనపడి వలస పాలన ఖర్చులను భరించే స్థితిలో లేక వలస ప్రాంతాలకు తప్పనిసరి పరిస్థితుల్లో స్వాతంత్య్రం ప్రకటించింది. 1991 కల్లా ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్న మవటంతో సోవియట్ యూనియన్ కూలి పోయింది. 1945లో యూకే, 1991లో సోవియట్ మాదిరిగా యూఎస్ఏ ఇప్పుడు అకస్మాత్తుగా కూలిపోయే అవకాశం లేదు. కానీ క్రమంగా బలహీన పడి అగ్రరాజ్య స్థాయిని కోల్పోయే సూచనలు పుష్కలం.ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి మానవ వనరులను యూఎస్ఏ ఆకర్షించింది. 1820–1860 కాలంలో వలస వచ్చిన ఐరిష్, జర్మన్లు మధ్య యూఎస్ఏ వ్యవసాయాభివృద్ధికి పునాది వేశారు. 1880–1924 మధ్యకాలంలో వచ్చిన యూదులు, ఇటాలి యన్లు తూర్పు, ఈశాన్య యూఎస్ఏలో పారిశ్రామిక విప్లవానికి ఆద్యులు. 1925–1965 మధ్యకాలంలో జర్మనీ, రష్యా, తూర్పు ఐరోపాల నుండి శరణార్థులుగా వచ్చిన శాస్త్రవేత్తలు యూఎస్ఏ అణ్వస్త్ర పరిజ్ఞానానికి, కంప్యూటర్ విప్లవానికి దోహదపడ్డారు. వీరిని యూఎస్ఏ ఆహ్వానించకపోతే సోవియట్ ఏకైక అణ్వస్త్ర దేశంగా ఏర్పడేది. 1965–2000 మధ్యకాలంలో భారత్, తైవాన్‌ల నుండి వచ్చిన టెక్ నిపుణులు సిలికాన్ వ్యాలీ విజయానికి కారణం. వీరు లేకపోతే జపాన్ ప్రపంచ సెమీకండక్టర్, ఐటీ శక్తిగా ఆవిర్భవించేది. ఇటీవలి వలసదారుల వ్యతిరేక ఉద్యమం కేవలం అమెరికన్ ఐడెంటిటీ రాజకీయాలలో భాగమే. జపాన్ నిపుణులైన వలసదారు లను ప్రోత్సహించక పోవటంతో ధనిక దేశమైనా ప్రపంచ రాజకీ యాలలో ప్రాధాన్యత సాధించలేక పోయింది. సోవియట్ వలస లను నిషేధించి కూలిపోయింది. యూఎస్ఏ ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక వ్యవస్థలను నిర్వహించటానికి సాలీనా కనీసం 2 మిలియన్ల వలస నిపుణులను ఆహ్వానించాల్సి ఉంటుంది. లేకపోతే ఈ నైపుణ్య కార్మి కులను యూరోపియన్ యూనియన్, చైనా ఎగరేసుకుపోతాయి. రాబోయే అర్ధ శతాబ్దంలో ప్రపంచ అగ్రరాజ్యం ఎవరనేదిముందుతరం సాంకేతిక పరిజ్ఞానాలను ఎవరు గుప్పిట్లో పెట్టుకుంటా రనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. 2076 ప్రపంచాధిపత్యం రేసులో కూటములు, పొత్తులు కీలకం. ఈ రెండు అంశాలలో యూఎస్ఏకు దుశ్శకునాలు కన్పడుతున్నాయి. కెనడా, యూరోపియన్ యూనియన్, యూకేలతో మొదలుపెట్టి, భారత్ వరకు అందరు మిత్రులను దూరం చేసుకోవటం యూఎస్ఏకు దురదృష్టకరం. 2050 కల్లా ప్రపంచ జీడీపీలో వాటా 15 శాతానికి పడి పోయి, ప్రభుత్వ రుణం జీడీపీలో 200 శాతానికి చేరి వలసలు పూర్తిగా ఆపివేస్తే యూఎస్ఏ అగ్రరాజ్య స్థానం కోల్పోతుంది. ధనిక దేశంగా కొనసాగినా, 2075కల్లా ప్రస్తుత జపాన్, యూకేల వలే అప్రస్తుతపు, అసందర్భపు, అప్రాముఖ్యతపు శక్తిగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్); సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు-గురజాల శ్రీనివాసరావు -
సాయుధ పోరాటంలో తొలి అమరుడు
తెలంగాణ సాయుధ పోరాటం దొడ్డి కొమరయ్య ప్రాణత్యాగంతోనే మొదలయ్యిందనడం అతిశయోక్తి కాదు. అప్పటి గ్రామీణ తెలంగాణలో జీవితం అంటేనే వెట్టిచాకిరి. భూమి మీద హక్కు దొరలది, శ్రమ మాత్రం రైతులది. కడవెండిలో దేశ్‌ముఖ్ రాపాక రాంచంద్రా రెడ్డి, అతని తల్లి జానమ్మ ఆధిపత్యం ప్రజల జీవితాలను కట్టుబానిసత్వంలోకి నెట్టాయి. ఈ అన్యాయాలపై గళమెత్తినవాడు కొమురయ్య అన్న దొడ్డి మల్లయ్య. ఆ గళం చుట్టూ ప్రజలు కూడబలుక్కునేసరికి, అది ఉద్యమంగా మారింది.ఆంధ్రమహాసభ ప్రభావంతో కడవెండి గ్రామం ఒక చిన్న విప్లవ కేంద్రంగా మారింది. ‘భూమి, భుక్తి, వెట్టి విముక్తి’ అనే నినాదం మార్మోగింది. యువతరం చైతన్యవంతమైంది. దేశ్‌ముఖ్ వర్గం ఉద్య మాన్ని అణిచివేయడానికి అరెస్టులు, దాడులు ప్రారంభించింది. 1946 జూలై 4న జరిగిన ఘటన తెలంగాణ చరిత్రను శాశ్వతంగా మార్చింది. ఆ రోజు గడ్డం నర్సింహారెడ్డి నేతృత్వంలో గూండాల గుంపు గ్రామంపై దాడి చేసింది. కానీ భయపడకుండా ప్రజలు ఐక్యంగా ర్యాలీ చేశారు.ఆ ర్యాలీ ముందు వరుసలో నిలిచిన యువకుడు దొడ్డి కొమరయ్యకు దేశ్‌ముఖ్ తొత్తులు పేల్చిన తూటా తగిలింది. అక్కడే నేలకూలాడు. అతడి రక్తం తెలంగాణ రైతాంగ పోరాటానికి ఎరుపు రంగు పూసింది. ప్రజలు రోడ్లపైకి వచ్చారు. దొడ్డి కొమరయ్య పేరు ఒక నినాదంగా మారింది. అతని బలిదానం తెలంగాణ రైతాంగ ఉద్యమానికి దిశానిర్దేశం చేసింది. వేలాది గ్రామాలు నిరంకుశ పాలన నుంచి విముక్తమయ్యాయి. లక్షలాది ఎకరాలు... భూమిలేని పేదలకు పంచిపెట్టడానికి కారణ మయ్యింది. ప్రపంచ విప్లవాల చరిత్రలో తెలంగాణ పోరాటాన్ని అమరం చేసింది. అతను ఈ రోజు కూడా జీవిస్తున్నాడు, ప్రతి ప్రతిఘటనలో, ప్రతి నినాదంలో, ప్రతి సమానత్వ స్వప్నంలో! – మామిండ్ల రమేష్ రాజా, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి (జూలై 4న దొడ్డి కొమురయ్య వర్ధంతి) -
భారతీయతకు ప్రతీక స్వదేశీ క్రైస్తవం
భిన్న సంస్కృతులు, మతాలు, భాషలు, తత్వాలు కలిసిమెలిసి వికసించినదే భారతీయత. సముద్ర వాణిజ్య మార్గాల ద్వారా ప్రపంచంతో ఏర్పడిన సంబంధాలు భారతీయ సంస్కృతిని మరింత సుసంపన్నం చేశాయి. ఈ చారిత్రక నేపథ్యంలోనే భారతీయ క్రైస్తవ సంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలి.క్రైస్తవ విశ్వాసం భారతదేశానికి వలస పాలనతో వచ్చిందనే అభిప్రాయం చారిత్రకంగా సత్యం కాదు. క్రైస్తవ సంప్రదాయం ప్రకార, అపొస్తలుడైన ‘తోమా’ క్రీ.శ. 52లో మలబార్ తీరానికి చేరుకుని సువార్త ప్రకటించగా, క్రీ.శ. 72లో మైలాపూర్‌లో హతసాక్షిగా మరణించాడు. ఇది దేశంలో క్రైస్తవ వార సత్వానికి దాదాపు రెండువేల ఏళ్ళ చరిత్రను సూచిస్తుంది. ఈ చారిత్రక వార సత్వాన్ని గుర్తు చేస్తూ, 2021లో వివిధ క్రైస్తవ సంప్రదాయాలకు చెందిన నాయకులు కలిసి జూలై 3ను భారతీయ క్రైస్తవ దినోత్సవంగా ప్రకటించారు. ఇది ఏ ఒక్క చర్చికి చెందిన మతపరమైన పండుగ కాదు; భారత్‌లో క్రైస్తవుల ఉనికి, సేవా వారసత్వం, భారతీయ సంస్కృతితో వారి అనుబంధాన్ని స్మరించుకునే జాతీయ సందర్భం. ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల్లో దీనిని ‘యేసు భక్తి దివస్’ అని కూడా వ్యవహరిస్తారు. భార తీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలోని ‘భక్తి’ తత్త్వాన్ని ప్రతిబింబించే పేరుగా ఇది ప్రాచు ర్యంలోకి వచ్చింది.భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ సమాజం అందించిన సేవలు విశేషమైనవి. క్రైస్తవ విద్యా సంస్థలు లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, సేవాభావాన్ని అందించాయి. అనేక ఆసు పత్రులు నిర్మించాయి. మహమ్మారులు తలెత్తినప్పుడు కుల మత భేదాలకు అతీతంగా ఆదుకొన్నాయి. సామాజిక సేవ క్రైస్తవ విశ్వాసంలో అంతర్భాగం. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, వికలాంగుల పునరావాస కేంద్రాలు, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమ కార్య క్రమాల ద్వారా అనేక సంస్థలు సమాజాభివృద్ధికి విశేషంగా దోహదపడ్డాయి.తెలుగు భాషాభివృద్ధిలో కూడా క్రైస్తవ పండితుల పాత్ర ప్రస్తావనీయ మైనది. నిఘంటువులు, వ్యాకరణ గ్రంథాలు, బైబిల్ అనువాదాలు, ముద్రణా సాంకేతికత ద్వారా తెలుగు గద్యాభివృద్ధికి వారు విశేష కృషి చేశారు. భారతదేశ బలం దాని వైవిధ్యంలో ఉంది. ఆ వైవిధ్యానికి భారతీయ క్రైస్తవ సంప్రదాయం కూడా రెండువేల సంవత్సరాలుగా తనదైన ముద్ర వేసింది. – డా. శామ్యూల్ జాన్ ఆదూరి (నేడు భారతీయ క్రైస్తవ దినోత్సవం) -
స్క్రీన్కు దూరం – లైఫ్‌కు దగ్గర!
2026 మార్చి 25న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీ యాంశమైంది. ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా, యూట్యూబ్ మాతృసంస్థ గూగుల్ ఒక యువతి మానసిక ఆరోగ్యానికి హాని కలిగించాయని జ్యూరీ నిర్ధారించింది. బాధితురాలికి 6 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.ఈ సందర్భంగా న్యాయ నిపుణులు సోషల్ మీడియా యాప్స్ బయటకు వినోదం, సమాచారం, స్నేహాలు అందిస్తున్నట్టే కనిపించినా లోపల మాత్రం పిల్లల మానసిక ఆరోగ్యాన్ని మెల్లగా దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే మొదటిసారి సోషల్ మీడియా వేదికలను ‘లోప భూయిష్టమైన ఉత్పత్తులు’గా గుర్తిస్తూ వచ్చిన తీర్పు కావడం దీనికి మరింత ప్రాధాన్యం తెచ్చింది.ఈ కేసులో వాది అయిన కెలీ అనే యువతి చిన్న వయస్సులోనే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వాడటం ప్రారంభించింది. ఇతరులతో తన రూపాన్ని పోల్చుకోవడం, బ్యూటీ ఫిల్టర్స్ వాడటం, లైక్స్, కామెంట్స్ కోసం ఎదురుచూడటం ఆమె మానసిక స్థితిని ప్రభావితం చేశాయి. చివరకు ఆమె డిప్రెషన్, ఆందోళన, బాడీ డిస్మోర్ఫియా వంటి సమస్యలకు గురైంది. ‘నా జీవితంలోని అమూల్యమైన సంవత్సరాలు స్క్రీన్ వెనుక మాయ మయ్యాయి’ అన్న ఆమె మాటలు ఎందరినో ఆలోచనలో పడేశాయి.భారతదేశంలో 75 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉండగా, 40 కోట్లకు పైగా సోషల్ మీడియా వేదికలను వాడుతున్నారు. ముఖ్యంగా 13 నుండి 24 ఏళ్ల మధ్య యువత రోజుకు అనేక గంటలు యాప్స్‌లో గడుపు తున్నారు. ఇందువల్ల నిద్రలేమి, ఆందోళన, సైబర్ బుల్లీయింగ్, బాడీ షేమింగ్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని మానసిక ఆరోగ్య నిపుణులు హెచ్చరి స్తున్నారు. పాఠాలపై శ్రద్ధ తగ్గడం, కుటుంబ సంబంధాలు దూరమవడం, అవుట్డోర్ ఆటలపై ఆసక్తి తగ్గడం వంటి ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తు న్నాయి. భారతదేశపు ‘ఎకనామిక్ సర్వే 2025–26’ నివేదిక పిల్లల్లో పెరుగు తున్న డిజిటల్ వ్యసనాన్ని ప్రస్తావిస్తూ, సోషల్ మీడియా వినియోగానికి తప్పనిసరి వయసు నిర్ధారణ ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. భారత ప్రభుత్వం కూడా ఆస్ట్రేలియా తరహాలో 18 ఏళ్ల లోపు వారికి వయస్సు ఆధారిత నియంత్రణలు పెట్టాలనీ, రాత్రి పూట సోషల్ మీడియా లాగిన్ అవ్వకుండా టైమ్–లిమిట్స్ పెట్టాలనీ యోచిస్తోంది.లాభాల కోసం రూపొందించిన అడిక్టివ్ టెక్నాలజీ ఇప్పుడు పిల్లల బాల్యాన్నీ, యువత మానసిక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తోందనే విషయం స్పష్టమవుతోంది. ఈ విధమైన సాంకేతికతను తిరస్కరించడం సాధ్యం కాక పోయినా, బాధ్యతాయుత వినియోగం అత్యవసరం. భవిష్యత్ భారతాన్ని నిర్మించే యువతను పుస్తకాలు, క్రీడలు, సృజనాత్మకత, మానవ సంబంధాల వైపు మళ్లించాల్సిన సమయం వచ్చింది. – ఏటూరి సోమశేఖర్ శర్మ, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి -
కోరికల తరంగాలు..
నదిలో ఇసుకలాంటివి కోరికలు. ఎంత తవ్వినా నదిలో ఇసుక తరిగిపోదు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కొత్తగా ఇసుక మేటలు వేస్తూనే ఉంటుంది. అలాగే మనసులో కోరికలు తీరేవి తీరుతూంటే కొత్తవి పొటమరిస్తూంటాయి. అందుకనే మనసు కోరికల పుట్ట అని అన్నారు.ఈ కోరికలన్నీ తీరిన తర్వాత పరమార్థం విషయంలో ఆలోచిస్తాననే వాళ్ళున్నారు. అది జరిగే పనేనా? ‘తరంగ ప్రశమా దూర్ధ్వం స్నాస్యామీతి విమూఢతా’ సముద్రంలో తరంగాలన్నీ తగ్గి పోయిన తర్వాత స్నానం చేస్తాను అని అనటం మూఢత్వం కాక మరేమిటి?ఒక గురువుగారు తన శిష్యుణ్ణి సంసార తాపత్రయం నుంచి బయటపడేద్దామనే సత్సంకల్పంతో ఉపదేశం చేద్దామని పిలిచాడు. సంసారి అయిన ఆయన శిష్యుడు, గురువుకు దయకలిగి తనను ఉద్ధరించాలనుకొని ఉపదేశం చేస్తానన్నాడని సంతోషించటానికి బదులుగా ఈ బరువు ఇప్పటి నుంచీ ఎందుకు అను కున్నాడు. ‘అయ్యా! వచ్చే సంవత్సరం మా అమ్మాయి పెళ్ళి చేస్తాను. ఇప్పటినుంచి ఆ పెళ్ళి పనుల్లో సతమతమవు తున్నాను. మీరు ఉపదేశం చేసే మంత్రం అనుష్ఠానం చేసేందుకు సమయం దొరకదు కనుక పెళ్ళయిన తర్వాత ఉపదేశం తీసుకుంటాను. దయ జూపండి’ అన్నాడు. ‘సరే!’ అన్నారు గురువుగారు. ఇలాగే అప్పుడు ఇప్పడు అంటూ ఎన్నో సాకులు చెబుతూ చాలా సంవత్సరాలు గడిపాడు. ఎనభై సంవత్సరాల వయస్సు మీద పడింది.ఒకసారి గురువు తీర్థయాత్రలకు బయలుదేరారు. ఆయనతోపాటు ఈ 80 ఏళ్ళ శిష్యుడు కూడా బయలు దేరాడు. ఆ రోజు కార్తీక పూర్ణిమ. ఇద్దరూ సముద్రానికి వెళ్ళారు. ముందు ఈ సంసారి శిష్యుడు సముద్ర స్నానం చేశాడు. గురువుగారు మాత్రం గట్టునే ఉన్నారు. ‘అయ్యా! ఎందుకు ఆలస్యం. మీరు కూడా స్నానం చేయండి వెళదాం’ అన్నాడు. ‘అలాగేనోయ్! ఈ తరంగాలు తగ్గిపోయిన తర్వాత చేయవచ్చులే అని ఆగాను’ అన్నారు గురువు.‘అయ్యా! మీరన్నది ఎప్పటికైనా జరిగేపనేనా? సముద్రంతో పాటే తరంగాలు పుట్టాయి గదా! అవెప్పుడు తగ్గుతాయి?’ అన్నాడు. ‘ఏమోయీ! నీ సంసార తాపత్రయాలు కూడా తరంగాల్లాగానే ఒకదాని వెనుక మరొకటి వస్తూన్నాయి. మరి నీవు నా ఉపదేశం ఎప్పుడు తీసుకుంటావు నాయనా?’ అని సూటిగా అడిగేసరికి తన తప్పు తెలుసుకొని కాళ్ళ మీద పడ్డాడు ఆ సంసారి శిష్యుడు. - శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
ఎవరు దేశ పౌరులు?
పాస్‌పోర్ట్ ఉన్నంత మాత్రాన దేశ పౌరసత్వం ఉన్నట్టు కాదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అది కేవలం ప్రయాణానికి సంబంధించిన పత్రమని చెప్పింది. ఇది దేశ ప్రజల్లో అలజడి, ఆందోళనలను రేపింది. దేశ పౌరుడిగా నిరూపించుకోవాలంటే, మరింకేమి పత్రాలు కావాలని ప్రజలు అడుగుతున్నారు.మన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 5–11, ఎవరు దేశ పౌరులో నిర్వచించాయి. రాజ్యాంగం అమలు నాటికి ఎవరు భారత పౌరులో, దేశ విభజన వలన ప్రభావితమైనవారికి కొన్ని షరతులకు లోబడి ఈ దేశ పౌరసత్వం పొందే అర్హతను నిర్వచించింది. భారత పార్ల మెంటుకు దేశ పౌరసత్వంపై చట్టం చేయడానికి ఆర్టికల్ 11 అధికార మిచ్చింది. ఆర్టికల్ 5 ప్రకారం, భారత్‌లో జన్మించినవారు లేక దేశంలో వారి తల్లిదండ్రులు జన్మించినా ఈ దేశ పౌరులే అని తెలిపింది.ఎవరు దేశ పౌరసత్వానికి అర్హులు అన్నది పౌరసత్వ చట్టం– 1955 నిర్దేశించింది. పౌరసత్వ చట్టంలోని 3, 4, 5, 6 సెక్షన్లు పౌర సత్వం ఏ విధంగా లభిస్తుందో నిర్వచించాయి. సెక్షన్ 3 ప్రకారం 1950 జనవరి 26 తరవాత, 1987 మధ్యన భారతదేశంలో జన్మించిన ప్రతి వ్యక్తికీ; 1987 జూలై 1 తరువాత భారతదేశంలో జన్మించి నవారి తల్లితండ్రులిద్దరూ భారతీయ పౌరులు అయితే లేక తల్లితండ్రుల్లో ఒకరు భారతీయ పౌరులు, మరొకరు అక్రమంగా భారత దేశానికి వలస రాకుంటే వారికీ భారత పౌరసత్వం లభిస్తుంది. సెక్షన్ 4 ప్రకారం, భారతదేశంలో జన్మించకున్నా, తల్లి, తండ్రి ఈ దేశ పౌరులైతే వారికీ పౌరసత్వం లభిస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థి తుల్లో, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, న్యాచుర లైజేషన్ ద్వారా కూడా సెక్షన్ 5, 6 ప్రకారం పౌరసత్వం లభిస్తుంది.పాస్‌పోర్ట్‌కు ఎవరు అర్హులు? పాస్‌పోర్ట్ చట్టం–1967లో పాస్‌పోర్ట్ పొందడానికి ఎవరు అర్హులో పేర్కొనలేదు. అయితే, ఈ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం, పాస్‌పోర్ట్ అధికారి, పాస్‌పోర్ట్ కోసం పెట్టుకున్న దరఖాస్తును కొన్ని సందర్భాలలో తప్పనిసరిగా తిరస్కరించాలి. దానిలో మొట్టమొద టిగా పేర్కొన్న కారణం, దరఖాస్తుదారు భారత పౌరుడు కాక పోవడం. అంటే చట్ట ప్రకారం భారత పౌరుడు కానివారికి భారత దేశ పాస్‌పోర్ట్ పొందే అర్హత లేదు.మరెందుకు భారత ప్రభుత్వం పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదని చెప్తూ బాంబే హైకోర్టు తీర్పును ఉటంకిస్తున్నది? ‘మోతిమియా రహిమియా వర్సెస్ భారత ప్రభుత్వం’ కేసులో తాము భారతదేశంలోనే జన్మించామనీ, దానికి రుజువుగా పాస్‌పోర్ట్‌ను కోర్టులో సాక్ష్యంగా చూపి తమను భారత దేశం నుంచి పంపకుండా ఆదేశాలివ్వాలనీ కోరారు. బాంబే హైకోర్టు వారి వాదనను తోసిపుచ్చుతూ, ‘కేవలం వారిచ్చిన సమాచారంపై ఆధారపడి పాస్‌పోర్ట్‌ను ప్రభుత్వం ఇచ్చింది. కానీ వారుగానీ, వారి తల్లితండ్రులుగానీ ఈ దేశంలోనే జన్మించారని ఎలాంటి ఆధారం చూపలేదు’ అని పేర్కొంది.చట్టం ప్రకారం పాస్‌పోర్ట్ అధికారి, తప్పనిసరిగా దరఖాస్తు దారులు భారత పౌరులని నిర్ధారించుకున్న తరవాతనే పాస్‌పోర్ట్ ఇవ్వడానికి ఆమోదించాలి. పైన చెప్పినట్టుగా, ఎవరు భారత పౌరులో రాజ్యాంగం, పౌరసత్వ చట్టం–1955లో పొందుపరచ బడింది. ఒకవేళ, ఎవరైనా తప్పుడు సమాచారంతో పాస్‌పోర్ట్ పొందినా, సెక్షన్ 10 ప్రకారం దాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వా నికి ఉంది. కాబట్టి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చిన బాంబే హైకోర్టు తీర్పును కేంద్ర ప్రభుత్వం ఉటంకించి పాస్‌పోర్ట్ దేశ పౌర సత్వానికి రుజువు కాదని చెప్పడం రాజ్యాంగాన్నీ, చట్టాన్నీ వక్రీకరించడమే.అంటే, కేవలం దరఖాస్తుదారులు ఇచ్చిన సమాచారం ప్రకారం పాస్‌పోర్టులు ఆమోదిస్తూ, దేశ భద్రతను పణంగా పెడుతు న్నారని భావించాలా? అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ... పాస్‌పోర్ట్ దేశ పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రం. కాబట్టి, ప్రజలను ఈ విధంగా ప్రభుత్వమే తికమకపెట్టడం దారుణం. గతంలో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్ వంటివి కూడా పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రాలు కావని న్యాయస్థానాలు చెప్పాయి. మరి ఏ పత్రం దేశ పౌర సత్వానికి రుజువో కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – కె.ఎస్. హరీశ్ కుమార్, ఏజీఎం (లా) రిటైర్డ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
యువతకు స్ఫూర్తిప్రదాత
డాక్టర్ బి.సి.రాయ్‌గా సుపరిచితులైన బిధాన్ చంద్రరాయ్ 1882 జూలై 1న నేటి బిహార్‌లోని బాంకీపూర్‌లో జన్మించారు. వైద్యవిద్య అభ్యసించారు. 1925లో రాజకీయాలలో ప్రవేశించారు. బెంగాల్‌లోని బారక్పూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటిచేసి ‘గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ బెంగాల్’గా పేరొందిన సురేంద్రనాథ్ బెనర్జీని ఓడించారు. 1928లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ.ఎం.ఎ.) ఏర్పాటులోనూ, 1939లో దేశంలో వైద్య విద్య నియంత్రణకు, అభివృద్ధికి పాటుపడే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎం.సి.ఐ.) ఏర్పాటు చేయడంలోనూ కీలకపాత్ర పోషించారు.మహత్మాగాంధీకి అనుంగు మిత్రునిగా, వ్యక్తిగత వైద్యునిగా వ్యవహరించారు. 1942లో పుణేలో గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమంలో నిరాహార దీక్షకు దిగారు. ఆరోగ్యం క్షీణించడంతో రాయ్ మందులు ఇచ్చారు. ఆ మందులు ఇండియాలో తయారైనవి కావని గాంధీజీ వాటిని నిరాకరించారు. అంతేకాక... ‘నేను, నువ్వు ఇచ్చిన మందులు ఎందుకు తీసుకోవాలి? ఈ దేశంలోని 40 కోట్ల ప్రజలకు నువ్వు ఉచితంగా వైద్యం చేస్తావా?’ అని ప్రశ్నించారు. అందుకు డాక్టర్ రాయ్ ‘లేదు, అందరికీ ఉచితంగా వైద్యం చేయలేను. కానీ నేను వచ్చింది... మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీకి వైద్యం చేయడానికి కాదు, ఈ దేశంలోని 40 కోట్ల మంది ప్రజలకు సారథ్యం వహిస్తున్న వ్యక్తి’కి అన్నారు. గాంధీజీ మాట్లాడకుండా మందులు తీసుకున్నారు.స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల ఒత్తిడి మేర 1948 జనవరి 23న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రాయ్. ఆ రోజుల్లో దేశవిభజన కారణంగా బెంగాల్ అతలాకుతలమవుతోంది. రాయ్ ప్రణాళికబద్ధంగా పశ్చిమ బెంగాల్‌ను అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టించారు. తన 80వ ఏట 1962 జూలై 1న తన పుట్టినరోజే తుదిశ్వాస విడిచేవరకు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా, ప్రతిరోజూ క్రమం తప్పకుండా రోగులను చూడటం మాత్రం మానుకోలేదు. భారత ప్రభుత్వం బి.సి. రాయ్ సేవలను గుర్తించి, 1961లో దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’తో గౌరవించింది. రాయ్ అవివా హితులు. తన ఇంటిని తల్లి అఘొర్ కామినీదేవి పేరుతో హాస్పిటల్‌కు విరాళంగా ఇచ్చారు. తన ఆస్తులతో ప్రజాప్రయోజనార్థం ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. ఆయన నేటి వైద్యులకు, రాజకీయ నాయకులకే కాదు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి ప్రదాత. – డా. టి. సేవకుమార్, ఐ.ఎం.ఎ. నేషనల్ కౌన్సిల్ సభ్యులు (రేపు డా. బి.సి. రాయ్ జయంతి, వర్ధంతి – జాతీయ వైద్యుల దినోత్సవం) -
అన్నదాతలకు అభయహస్తం
సమాజానికి వెన్నెముక అయిన రైతులకు అధిక ప్రాధాన్యతిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. ‘రైతు భరోసా’తో రైతుల్లో పూర్తి విశ్వాసం కలిగిస్తోంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అన్నదాతలకు అభయం హస్తం అందిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు ‘రైతు భరోసా’ అందించిన ప్రభుత్వం మరోసారి 2026 జూన్ 30న ఖరీఫ్ సీజన్‌కుగానూ ఇచ్చేందుకు సిద్ధమైంది.రైతు సంక్షేమమే ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు వరంగల్ వేదికగా ‘రైతు డిక్లరేషన్’లో ప్రకటించిన విధంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్నా లకు బోనస్, రైతు బీమా, రైతు కూలీలకు ‘ఇందిరమ్మ భరోసా’ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తమది రైతు పక్షపాత ప్రభుత్వమని నిరూపించుకుంది.ప్రభుత్వం ఏటా ఎకరాకు రూ. 12 వేలు రైతు భరోసాగా అందిస్తోంది. 2025 జూ¯Œ లోనూ, 2026 మార్చిలోనూ 70 లక్షల మందికి అందించింది. మూడోసారి జూన్‌లో ఒకే విడతలో ఈ సాయం అందించనున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేసింది. దీంతో 25 లక్షల రైతు కుటుంబాలకు రూ. 21 వేల కోట్ల మేలు చేకూరింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా సన్న వరికి బోనస్ అందించడంతో రాష్ట్రంలో సన్నాల సాగు 60 శాతం పెరిగింది. దేశంలోనే తొలిసారిగా రైతు కూలీలను గుర్తించి వారిలో విశ్వాసం కలిగించేలా ‘ఇందిరమ్మ రైతు భరోసా’ అందిస్తోంది. రైతు కుటుంబాలందరికీ ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తూ వేల కోట్ల రూపాయలతో రైతు బీమా కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకా రాలు లభించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం భారీగా పంటలను కొనుగోలు చేస్తోంది.నిధులు దుర్వినియోగం కాకుండా...అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటే భరించలేని బీఆర్ఎస్ పార్టీ అక్కసుతో అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. గతంలో వారి ప్రభుత్వం ‘రైతు బంధు’ పేరిట ఎకరాకు రూ. 10 వేలు మాత్రమే ఇస్తే... కాంగ్రెస్ సర్కార్ మరో రెండువేలు అధికంగా ఇస్తోంది. గత ప్రభుత్వ అవకతవకలు పునరావృతం కాకుండా ఉండాలనే లక్ష్యంతో ప్రస్తుత సర్కారు వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా అందించాలని నిర్ణయించింది. అందుకే ప్రజా నిధులు దుర్వినియోగం కావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి ఏమాత్రం ఉపయోగపడని భూములకు రైతుబంధు పథకం కింద రూ. 22 వేల కోట్లకుపైగా చెల్లించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసింది.రైతులకే కాకుండా రైతు కూలీలకు కూడా సమన్యాయం జరి గేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూమిలేని రైతు కూలీలకు ప్రభుత్వ నిర్ణయం శాపంగా మారకూడదని, వారిని కూడా ఆదుకోవాలనే లక్ష్యంతో ‘వరంగల్ డిక్లరేషన్’లో ప్రకటించినట్టు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం కింద ఏటా రూ. 12 వేలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంతో వ్యవసాయ యజ్ఞంలో పాల్గొనేవారందరికీ న్యాయం చేసినట్టయ్యింది.శుభప్రదమైన ఏరువాక పౌర్ణమి మరుసటి రోజు జూన్ 30న ప్రభుత్వం నిర్వహించనున్న రైతు భరోసా పంపిణీ మరోసారి అన్న దాతల పట్ల కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనంగా నిలవనుంది. రైతు సంతోషమే రాష్ట్ర సుభిక్షతకు పునాది అనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.- బి. మహేశ్ కుమార్ గౌడ్, వ్యాసకర్త ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు -
విశ్రాంత స్వాంతుడు..
దీపం ఉన్నచోట వెలుగు ఉన్నట్లుగా, ఒక పువ్వు ఉన్న ప్రదేశం మనసును ఆహ్లాదపరచే సుగంధంతో నిండి ఉన్నట్లుగా, సూర్యుడు ఉంటే అది పగలై ఉన్నట్లుగా, చిత్తము, చేతన జాగ్రదావస్థలో ఉంటే సమస్త ప్రపంచము ఉత్తేజితమై ఉంటుంది. రత్నము తన నైజగుణంగా ఏ ప్రయత్నమూ లేకుండానే ఎలా ప్రకాశిస్తుందో, ప్రపంచంలో ప్రకృతి సిద్ధములు, మానవ నిర్మితములు అయినట్టి వివిధ వస్తు సముదాయములు అన్నీ ఏ ప్రయత్నమూ లేకుండానే ఎలా దృష్టి గోచరములు అవుతాయో, ఆ విధముగానే కేవలం అణుమాత్రమైన పరమాత్మునిలో జగములన్నియు నిండి ఉండి సంచరిస్తూ ఉంటాయి.మనిషి అనుభవించే సుఖానికైనా, దుఃఖానికైనా ఆ మనిషి మనసులోని ఆలోచనలే కారణం. ఆ ఆలోచనలను తగిన విధంగా కట్టడి చేసి అదుపులో పెట్టుకోకుంటే కొండంతగా ధనమున్నా, కోట్లకు పడగలెత్తిన మిత్రులు ఎంత మంది ఉన్నా, ఎన్ని తీర్థయాత్రలు చేసి ఎందరు దేవుళ్ళకు మొక్కుకున్నా, ఎన్ని ఉపవాసాలు చేసి శరీరాన్ని కష్ట పెట్టుకున్నా, మనశ్శాంతి మాత్రం కరవైనదిగానే మిగులుతుంది.కం. సంతోషము సుఖతరమగు, /సంతోషము నిత్యమోక్షసంప్రాప్తి యగున్, సంతుష్టుండెందును వి / శ్రాంతస్వాంతుండు, రామ సౌజన్యనిధీ!మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అన్ని సుఖాలకు మూలం. ప్రయత్నం చేసి మనసుని దుఃఖం వైపునకు మరలకుండా చేయడాన్ని సాధించాలి. అనవసరమైన దిగులుని దరిచేరనీయకుండా చూసుకుంటూ, మనసును ఆనందంగా ఉంచుకోవడం వలన సుఖశాంతులు దక్కుతాయి. విశ్రాంత స్వాంతుడు మోక్షప్రాప్తికి దగ్గరివాడౌ తాడు– అని మడికి సింగన రచించిన ‘వాసిష్ఠ రామాయణము’, ప్రథమాశ్వాసములోని పై పద్యంలో చెప్పబడిన మాటలు వెలలేనివి. మానసిక ప్రశాంతతను కోరుకునే మనుషులకు అవి బహుదా ఆచరణీయములైనట్టివి. – భట్టు వెంకటరావు -
మహోన్నత శిఖరాలు
వారికి వారే సాటి. వారిద్దరినీ క్రీస్తు ప్రధాన శిష్యులుగా చెప్పుకోవడం పరిపాటి. ఇద్దరూ ఇద్దరే! సౌవార్తిక సేవలో మహోన్నత శిఖరాలు! క్రీస్తు తన వారసులుగా ఎన్నుకున్న ప్రధాన వ్యక్తులు. ఒకరు క్రీస్తు మొదటి శిష్యుడు పేతురు. మరొకరు క్రీస్తుకు ప్రత్యేక శిష్యుడు పౌలు! ఇద్దరూ జైలు జీవితం అనుభవించారు. సంఘానికీ, వ్యక్తులు మారడానికీ పత్రికలు రాశారు.పేతురు సముద్ర తీర వాసి, ఒక జాలరి. పౌలు రోమన్ సామ్రాజ్య ఉద్యోగి, ఒక సైనికుడు. పేతురు ‘నన్ను వెంబడించు’ అని పిలువబడి సిలువ వరకు వెళ్ళాడు. పౌలు ‘నా నామం కోసం శ్రమపడాలి’ అని పిలువబడితల ఇచ్చాడు. ఒకరు క్రీస్తుచే యాదృచ్ఛికంగా ఆహ్వానితుడైనవాడు. మరొకరు క్రీస్తుచే అదృశ్యకంగా కొట్టబడి ప్రశ్నింప బడినవాడు. ఒకరు ఇజ్రాయేలీయ దేశ స్వస్థలీయుడు. మరొకరు ఇరాన్ దేశం నుంచి వచ్చి స్థిరపడినవాడు.ఒకరు నిరక్షర కుక్షి. మరొకరు విద్యా బుద్ధులు బాగా నేర్చినవాడు. ఒకరు పన్నెండు మంది శిష్యుల్లో జ్యేష్ఠుడు. మరొకరు సువార్త అందించ పంపబడ్డ అపోస్తులుడు. ఒకరు క్రీస్తుతోపాటు సుఖ దుఃఖాల్లో కలిసి తిరిగాడు. మరొకరు క్రీస్తును చూడలేదు. ఆయన గురించి విన్నాడు. ఒకరు క్రీస్తు స్థాపించిన సంఘానికి మూల రాయిలాంటి వాడు. మరొకరు ఆ మూలరాతిని కరిగించి సారం అందించిన వాడు. పేతురు రాసిన పత్రికలు రెండు. పౌలు రాసిన పత్రికలు పదమూడు. ఇద్దరూ యేసు కోసం ప్రాణం పెట్టి, హతసాక్షులుగా రోమ్‌లో చనిపోయినవారే. ఇద్దరూ క్రీస్తు సువార్తా ప్రకటనకు మూలస్తంభాల్లా నిలిచినవారే! – డా. దేవదాసు బెర్నార్డ్ రాజు (జూన్ 29న పునీత పేతురు – పౌల్ మహోత్సవం) -
ప్రజాస్వామ్యం నుంచి అనుచర గణానికి!
ప్రశ్నించే పౌరులు... అనుసరించే జనసమూహంగా మారుతున్న నేటి సామాజిక పరిణామం ఆందోళనకరం. నేటి భారత రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే కేవలం ఎన్నికల ఫలితాలను చూడటం సరిపోదు. అసలు మార్పు అధికార కేంద్రీకరణలో మాత్రమే లేదు; సమాజపు ఆలోచనా నిర్మాణంలో ఉంది. ఒకప్పుడు అధికారాన్ని ప్రశ్నించే ప్రజాస్వామిక సంస్కృతి కొంతవరకు కనిపించేది. ఇప్పుడు మాత్రం ‘ఏం అడగాలి?’, ‘ఏం అడగకూడదు?’ అన్న అప్రకటిత నియమాలే సమాజాన్ని నియంత్రిస్తున్నాయి. ఇది అత్యంత ప్రమాదకర సంకేతం.దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సంక్షోభం, విద్య–వైద్య రంగాల అసమానతలు, కుల హింస వంటి అనేక సమస్యలు ముదురుతున్నప్పటికీ, ప్రజా చర్చల కేంద్రంలో అవి కనిపించడం తగ్గుతోంది. వాటి స్థానంలో యోగా దినోత్సవాలు, భారీ సాంస్కృతిక ప్రదర్శనలు, జాతీయ గర్వ నినాదాలు ముందుకు వస్తున్నాయి. యోగ సాధనపై ఎలాంటి అభ్యంతరం ఉండనవసరం లేదు. కానీ ప్రశ్న యోగాపై కాదు. యోగాను ఎవరు, ఎలా, ఏ రాజకీయ సందర్భంలో వినియోగిస్తున్నారు అన్నదే ముఖ్యం. ప్రజా సమస్యలపై చర్చ తగ్గిపోతూ, ప్రతీకల చుట్టూ సమాజం తిరుగు తుంటే దానిని విమర్శనాత్మకంగా పరిశీలించాల్సిందే.ఈ పరిస్థితి యాదృచ్ఛికంగా రాలేదు. దీని వెనుక దీర్ఘకాలిక భావజాల విస్తరణ ఉంది. పాలక వర్గాలు తమ భావజాల సంబంధాలను విద్య, మీడియా, మత–సాంస్కృతిక వేదికలు, ప్రచార యంత్రాంగం ద్వారా విస్తృతం చేశాయి. ఫలితంగా రాజకీయ ఆధిపత్యం క్రమంగా భావజాల ఆధిపత్యంగా మారింది. అధికా రాన్ని నిలబెట్టేది కేవలం రాజ్య యంత్రాంగం కాదు; సమాజంలో ‘ఇదే సహజం’, ‘ఇదే దేశహితం’ అనే అంగీకార వాతావరణాన్ని నిర్మించడమే.భయం నుంచి పుట్టే అనుచరత్వం ఒకటì , నమ్మకం నుంచి పుట్టే అనుచరత్వం మరొకటి. ఇప్పుడు రెండూ కలిసి పనిచేస్తున్నాయి. రాజ్యం అణచివేత భయాన్ని సృష్టిస్తే, భావజాల యంత్రాంగం నమ్మకాన్ని తయారుచేస్తోంది. ఈ రెండు శక్తులూ కలిసి పౌరుడిని అనుచరుడిగా మారుస్తున్నాయి.ఇక్కడే పౌర సమాజం, ప్రజాస్వామ్యవాదులు, సామ్యవాద శక్తులు, దళిత, బీసీ, ఎస్టీ ఉద్యమాల వైఫల్యం స్పష్టమవుతోంది. ఒకప్పుడు సామాజిక న్యాయం, కుల ఆధిపత్యం, వర్గ అసమాన తలు, హక్కుల రాజకీయాలపై ప్రత్యామ్నాయ చర్చను నిర్మించిన ఈ శక్తులు ఇప్పుడు విభజితంగా, రక్షణాత్మకంగా కనిపిస్తున్నాయి. వీరి వైఫల్యం కేవలం సంస్థాగత బలహీనత కాదు, ప్రత్యామ్నాయ భావజాలాన్ని సమాజంలో విస్తరించడంలో వచ్చిన పరాజయం.నేటి ప్రధాన సవాలు కేవలం ప్రభుత్వ మార్పు కాదు. భావ జాల ఆధిపత్యాన్ని సవాలు చేసే ప్రత్యామ్నాయ సామాజిక–రాజ కీయ చైతన్యాన్ని నిర్మించడం. పౌర సమాజం, ప్రజాస్వామ్య వాదులు, దళిత–బీసీ–ఎస్టీ శక్తులు, వామపక్ష ఉద్యమాలు తమ వైఫ ల్యాన్ని నిజాయితీగా సమీక్షించి కొత్త ప్రజా చైతన్యాన్ని నిర్మించా ల్సిన అవసరం ఉంది. ప్రశ్న చనిపోయిన చోట ప్రజాస్వామ్యం కూడా క్రమంగా చనిపోతుంది. – పాపని నాగరాజు, సామాజిక కార్యకర్త -
అసాధారణ మూర్తి
మరణించడానికి కొన్ని నెలల ముందు, పీవీ నరసింహారావు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్‌లో బస చేశారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావిడి ఎలా ఉండేదో ఒక విలే ఖరిగా నాకు తెలుసు.నేనూ, ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్ ఆర్వీవీ కృష్ణారావు, గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం వెళ్లి, ఆ పని పూర్తిచేసుకున్న తరవాత, రాజ్ భవన్ గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి వెడుతూ అటువైపు తొంగి చూశాము. సెక్యూ రిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించకపోవడంతో లోపలకు వెళ్ళాము. ‘పీవీ గారిని చూడటం వీలుపడుతుందా’ అని భద్రతాధికారిని అడిగాము. ‘లోపలకు వెళ్ళండి’ అన్నట్టు సైగ చేశాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.అంతే... మా ఆశ్చర్యం రెట్టింపయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్‌బాల్ మాచ్ చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే, మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకుని ఉన్న పీవీగారు నా వైపు చూస్తూ, ‘మీ అన్నయ్య పర్వతాలరావు ఎలా వున్నాడయ్యా!’ అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం, పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్ర సమాచార శాఖలో పని చేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు ఆయనకు పీఆర్వోగా కొద్దికాలం పనిచేశారు. పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం.అప్పటి విషయాలను గుర్తుపెట్టు కోవాల్సిన అవసరం ఆయనకు లేదు. అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ పీవీ గొప్పతనం. ఆ తరవాత కూడా ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ మాకు ‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగా ఉంది. మేము కలసి కూర్చుంది, కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ ఉండటం వల్ల, కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత, కొణిజేటి రోశయ్య వచ్చారు. ఆయన్ని చూడగానే పీవీ మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. కాసేపు ఉండి మేము వచ్చేశాము.అంతకుముందు పీవీని మరోసారి ఢిల్లీలో కలిశాను. రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్రమంత్రిగా అత్యంత ఉచ్ఛస్థానంలో ఉన్న పీవీని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా నిశ్శబ్దం. ఎవరో అటుగా వస్తే, ‘పీవీ గారిని కలవడానికి వీలుంటుందా’ అని హిందీలో అడిగాను. ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. నా మొహంలో భావాలు పసికట్టినట్టున్నారు. ‘పనులు చేసి పెడుతూ ఉంటే కదా పదిమంది వచ్చేది’ అన్నారు.‘మాస్కో ఎందుకయ్యా వేరే దేశంలో మీ రేడియో ఉద్యో గాలు లేవా? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలా వుంటావు’ అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ, నేను వూహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను. ఆయన మాజీ ప్రధానమంత్రిగా పాల్గొన్న ఒక సదస్సు హైదరాబాదులోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగింది. మధ్యాన్నం భోజన విరామ సమయంలో విలేఖరులు ఒక్కొక్కరుగా కలుస్తున్నారు. ఆలిండియా రేడియో ప్రాంతీయ విభాగంలో పనిచేసే ఆర్వీవీ కృష్ణారావు, నేనూ కాస్త వెనగ్గా నిలబడి ఉన్నాం. చివరికి ఆయనే మమ్మల్ని దగ్గరకు పిలిచారు.‘ఏమయ్యా కృష్ణారావూ. ఢిల్లీలో పద్మనాభరావుకి కూడా చెప్పాను. ఏవయ్యా నా టేపులు?’ పీవీ ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు తెలుగులో అనేక రేడియో ప్రసంగాలు చేశారు. వాటిని గురించి చేసిన వాకబు ఇది. కృష్ణారావు ఏదో చెప్పారు. ఆయన నా వైపు తిరిగారు. ‘మీ అన్నయ్య పుట్టపర్తిలో ఉంటున్నాడట కదా! ఏం చేస్తున్నాడు?’ ‘నరసింహావతారం గురించి పుస్తకాలు రాస్తున్నాడు.’‘అలా అయితే నేనడిగానని చెప్పు. మనిషి శారీరకంగా సింహం కంటే బలహీనుడు. ఆ అవతారంలో సింహం తలా, మనిషి శరీరం ఏమిటో రాయమని చెప్పు.’ నమస్కారం పెట్టి మేము వచ్చేశాము. - భండారు శ్రీనివాసరావు, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రజాస్వామ్య స్ఫూర్తి
రాజకీయ అస్థిరత కారణంగా నేతలు పదవులు కోల్పోవడం, ప్రభుత్వాలు పడిపోవడం ప్రజా స్వామ్య వ్యవస్థలో సహజమైన పరిణామం. అయితే దేశంలో ఏర్ప డిన ఆర్థిక అస్థిరత కారణంగా ప్రజా దరణ కలిగిన నాయకులు ప్రధాని పదవి నుండి వైదొలగడం బ్రిటన్‌లో తరచుగా చోటు చేసుకుంటున్న పరిణామం కావడం గమనార్హం.తాజాగా ప్రధాని కీర్ స్టార్మర్ రెండేళ్ళ పదవీకాలం ముగి యకుండానే పదవి నుంచి తప్పుకొన్నారు. సొంత లేబర్ పార్టీ ఎంపీల విశ్వాసం కోల్పోవడంతో స్టార్మర్‌కు రాజీనామా చేయడం మినహా గత్యంతరం లేకపోయింది. దీంతో గత ఏడేళ్ళలో ఆరవ ప్రధాని రాబోతున్నారు. బ్రిటన్‌లో నాయ కత్వ మార్పు తరచుగా ఎందుకు జరుగుతోంది? రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి గత 81 ఏళ్లలో 65 ఏళ్ల పాటు 18 మంది ప్రధాన మంత్రులు అధికారంలో ఉండగా, చివరి 16 ఏళ్లలో ఏడుగురు ప్రధాన మంత్రులు మారడం విశేషం. ఇందులో భారత సంతతికి చెందిన రుషి సునాక్ ఎన్నికలలో ఓడిపోగా, బ్రెక్సిట్ ప్రజాభిప్రాయ సేక రణలో ఓటమి కారణంగా డేవిడ్ కామెరూన్ వైదొలిగారు.గెలిచినా ఓడిపోయి...ప్రధాని పదవి నుంచి తప్పుకున్న కీర్ స్టార్మర్ రెండేళ్ళ క్రితమే చరిత్రాత్మక మెజారిటీతో ఎన్నికయ్యారు. అంతర్జా తీయ సమాజంలో ఆయనకు మంచి గౌరవం ఉంది. అయితే మే నెలలో జరిగిన స్థానిక ఎన్నికలలో లేబర్ పార్టీకి ఘోర మైన ఫలితాలు వచ్చాయి. ప్రతిష్ఠాత్మకమైన స్థానిక ఎన్నిక లలో సొంత పార్టీని విజయ తీరాలకు చేర్చలేకపోవడం అనే వైఫల్యం కంటే... కొన్ని పాలనా విధానాల వైఫల్యాల కారణంగానే పదవినుండి తప్పుకోవాలని స్టార్మర్‌పై సొంత పార్టీ ఎంపీల నుండి తీవ్ర ఒత్తిడి వచ్చిందనుకోవాలి.దశాబ్ద కాలంగా బ్రిటన్‌లో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు అనూహ్యంగా పెరిగి పోతున్నాయి. అందుకు అనుగుణంగా ప్రజల ఆదాయం పెర గడం లేదు. జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ఒక శాతం మించడం లేదు. బ్రిటన్ ప్రభుత్వ ఋణ భారం జీడీపీలో 95 శాతం దాటింది. అప్పులు దాదాపు 2.8 లక్షల కోట్ల పౌండ్లకు చేరింది. దీనితో ప్రభుత్వానికి వచ్చే రాబడిలో అభివృద్ధి పనులకు ఖర్చు చేయడం కష్టమౌతోంది.ఈ రెండేళ్ళ స్వల్ప కాలంలో స్టార్మర్ పలు విజయాలు నమోదు చేసిన మాట నిజం. ప్రభుత్వ దుబారాను తగ్గించారు. ప్రభుత్వ రంగంలోని కార్మికులు, ఉద్యోగులు సమ్మెలకు దిగి ఉత్పత్తిని దెబ్బతీయకుండా, వారి డిమాండ్లలో కొన్నింటిని నెరవేరుస్తూ, దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటించి, ఆ దేశం నుంచి విలువైన ఖనిజాల దిగుమతికి మార్గం సుగమం చేశారు. భారత్‌కు స్నేహ హస్తం చాచి ఇరుదేశాల నడుమ చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) అమలు కోసం కృషి చేశారు.ఎన్ని సుగుణాలున్నా... రాజకీయాలలో బంధుప్రీతికి, ఆశ్రిత పక్షపాతానికి తావు ఉండరాదు. కానీ స్టార్మర్ తన స్నేహితుడైన పీడర్ మాండెల్సన్‌ను యూఎస్ రాయబారిగా నియమించడం సొంత పార్టీ నేతలకు కంటగింపుగా మారింది. అదే సమయంలో దేశ ఆర్థికాభివృద్ధి పడిపోవడం, మౌలిక సదుపాయాల విస్తరణ మందగించడం, గృహ నిర్మాణం చతికిల పడటం స్టార్మర్ మెడకు చుట్టుకున్నాయి.ప్రధాని పదవికి స్టార్మర్ రాజీనామా తర్వాత ఆ పదవిని చేపట్టే గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ ఆండీ బర్న్‌హామ్ నేతృత్వంలో బ్రిటన్ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే... బ్రిటన్‌లో రెండు ప్రధాన రాజకీయ పార్టీలలో నాయకుల కంటే పార్టీయే సుప్రీమ్ అనే పంథా కొనసాగడమే ఇక్కడ చర్చనీయాంశం. రాజకీయ నాయకులు తమపై విమర్శలు వచ్చినపుడు హుందాగా ఆ పదవుల నుండి దిగిపోవడం ముదావహం. వారు మెజారిటీ ప్రజల మనోభీష్టాన్నీ, దేశ ప్రయోజనాలనూ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం గొప్ప విషయం. - డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి -
ప్రేమ నిర్వచనం..
పూజలు–పునస్కారాలు, నోములు–వ్రతాలు, గుళ్ళు–గోపురాలు అన్నీ మనలో సంకుచిత స్వార్థాన్ని నిర్మూలించటానికీ, విశ్వప్రేమను విష్ణుప్రేమగా గ్రహించటానికీ నిర్దేశింపబడ్డాయి. ప్రేమే దైవమని మహర్షులు నొక్కి వక్కాణిస్తారు. ప్రేమ, ద్వేషం అంటూ రెండు ఉండటంవల్ల దేన్ని ఎంచుకొంటే మనకు శ్రేయస్సు కల్గుతుందో వివరించటానికి పెద్దలు నానా తంటాలు పడ్డారు. కేరళకు చెందిన స్వామి రామదాసు చేసిన చక్కటి విశ్లేషణను చూడండి:ప్రేమ హృదయాన్ని వికసింపజేస్తుంది – ద్వేషం దానిని ముకుళింపజేస్తుంది. ప్రేమ కంటే మధురం లేదు – ద్వేషం కంటే చేదు లేదు. ప్రేమ సహజం – ద్వేషం కృత్రిమం. ప్రేమ నిర్మాణం – ద్వేషం వినాశకము, విధ్వంసము. ప్రేమ మనోహరం– ద్వేషం అసహ్యకరం. ప్రేమ ఆహ్లాదకర ప్రకృతి దృశ్యం – ద్వేషం శుష్కమైన మరుభూమి.ప్రేమ లయబద్ధం – ద్వేషం చిందర వందర. ప్రేమ ప్రకాశం – ద్వేషం అంధకారం. ప్రేమ ఆనందం – ద్వేషం దుఃఖం. ప్రేమ జీవనం – ద్వేషం మరణం. ప్రేమ పవిత్రం – ద్వేషం అపవిత్రం. ప్రేమ జత చేస్తుంది – ద్వేషం విడదీస్తుంది. ప్రేమ సురూపం – ద్వేషం కురూపం. ప్రేమ ఆరోగ్యం – ద్వేషం అనారోగ్యం. ప్రేమ మధుర సంగీతం – ద్వేషం కర్కశ ధ్వని. ప్రేమ జ్ఞానం– ద్వేషం అజ్ఞానం. ప్రేమ చురుకుదనం – ద్వేషం మందత్వం. ప్రేమ స్వర్గం– ద్వేషం నరకం. ప్రేమే దైవం – ద్వేషమే దయ్యం – మాయ. (భగవదన్వేషణము– స్వామి రామదాసు; పుటలు 188, 189) ఇంత స్పష్టమైన విశ్లేషణను చదివిన తర్వాత ఎవరైనా ప్రేమను పెంపొందించుకోవటానికే కృషి చేస్తారు. చేయాలి. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిద్దాం. దైవాశీస్సులు ఉండి తీరుతాయి. – రాచమడుగు శ్రీనివాసులు -
నిశ్శబ్దపు చీకటిలో ఆశాకిరణం
జూన్ నెల చివరి వారాన్ని ‘బధిరాంధ అవగాహనా వారం’గా అంతర్జాతీయ బధిరాంధ దినోత్సవం (జూన్ 27) సందర్భంగా జరుపుకోవడం 2025 నుంచి ప్రారంభమైంది. రచయిత్రి, సామా జిక కార్యకర్త హెలెన్ కెల్లర్ జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి వీటిని ప్రకటించింది. బధిరాంధత్వం అంటే కళ్లతో పాటు చెవులు కూడా పనిచేయకపోవడం. గాఢాంధకారం, భయంకరమైన నిశ్శబ్దం...ఈ రెంటి కలయిక వల్ల అత్యంత సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య ఉన్నవారు బాహ్య ప్రపంచంతో సంభాషించడానికి ప్రధానంగా చేతిపై చేతితో రాసే సంకేత భాష (టాకై్టల్ సైన్ లాంగ్వేజ్), బ్రెయిలీ లిపి, ఇంటర్ప్రెటర్లపై ఆధారపడ తారు. ప్రపంచ జనాభాలో 0.2% – 2% ప్రజలు ఏదో ఒక స్థాయి బధిరాంధత్వంతో జీవిస్తున్నారు. ఒక్క భారతదేశంలోనే దాదాపు 5 లక్షల మందికి పైగా ఈ సమస్యతో పోరాడుతున్నారు.ప్రభుత్వాలు బధిరాంధత్వాన్ని చట్టపరంగా ఒక ప్రత్యేక వైకల్యంగా గుర్తించాలి. అంధులకు, బధిరులకు విడివిడిగా ఇచ్చే సేవలను కలిపి వీరికి అంటగట్టడం సరైన విధానం కాదు. రోజువారీ పనులకు అవసరమైన ప్రత్యేక శిక్షణ పొందిన ఇంటర్ప్రెటర్–గైడ్ల సేవలను ఉచితంగా ప్రభు త్వాలు అందించాలి. అలాగే, పాఠశాలల్లో సమ్మిళిత విద్యను ప్రోత్సహించ డానికి ప్రత్యేక టీచింగ్ అసిస్టెంట్లను నియమించి, పాఠ్యాంశాలను వీరికి అనుకూలంగా మార్చాలి. ఆధునిక సాంకేతికత తోడ్పాటుతో టాకై్టల్ పరిక రాలు, రిఫ్రెషబుల్ బ్రెయిలీ డిస్ప్లేలు, వైబ్రేషన్ ద్వారా అలర్ట్ చేసే స్మార్ట్ పరికరాలను అందుబాటులోకి తేవాలి.హబెన్ గిర్మా, హార్వర్డ్ లా స్కూల్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మొదటి బధిరాంధ మహిళ. వైబ్రేషన్–బ్రెయిలీ డిస్ప్లే కలిగిన డిజిటల్ టెక్నాలజీ సహాయంతో సంభాషిస్తూ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. చిన్న తనంలోనే చూపు, వినికిడి కోల్పోయిన ప్రదీప్ సిన్హా, అసిస్టివ్ టెక్నాలజీ సహాయంతో కంప్యూటర్ ఆధారిత నైపుణ్యాలను నేర్చు కుని కార్పొరేట్రంగంలో ఉపాధి పొందుతుండగా, మహారాష్ట్రకు చెందిన శ్రద్ధా శిఖరే ఆభర ణాల తయారీలో రాణిస్తూ సొంతంగా ఆర్థిక స్వాలంబన సాధించారు. తగిన సదుపాయాలు కల్పిస్తే, బధిరాంధులు అత్యున్నత శిఖరాలను అధిరోహించగలరనే నిజాన్ని స్పష్టం చేస్తున్నాయి. – శ్రీనివాస్ మాధవ్, సామాజిక కార్యకర్త (నేడు ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెఫ్బ్లైండ్నెస్’) -
రైతన్నకు మార్గం చూపే అభియాన్
నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, వ్యవసాయ భూమిని కాపాడటం, రైతుల మధ్య శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా చేపట్టిన దేశవ్యాప్త ప్రచారాన్ని ‘ఖేత్ బచావో అభియాన్’గా పిలుస్తున్నారు. ‘నేలను కాపాడండి, వ్యవసాయాన్ని కాపాడండి, రైతులను కాపాడండి’ అనే ప్రధాన సందేశంతో 2026 జూన్ 1 నుండి జూన్ 30 వరకు ఈ ప్రచారం సాగుతోంది.ఎరువులను నిరంతరం వాడటం, అది కూడా అసమతుల్యంగా ఉపయోగించడం వల్ల అనేక ప్రాంతాలలో పోషకాల కొరత ఏర్పడి, నేల నాణ్యత క్షీణిస్తోంది. మేలు చేసే సూక్ష్మజీవులు నశించి పోతు న్నాయి. వానపాములకు నష్టం వాటిల్లుతోంది. నీటి నిల్వ సామర్థ్యం పడిపోతోంది. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. రైతులు వీటిని దృష్టిలో పెట్టుకుని సాగు చేయాల్సి ఉంది. అందుకు కేంద్రం భారీ ఎత్తున ఈ విషయా లపై అవగాహన కల్పించేందుకు రంగంలోకి దిగింది. ఖేత్ బచావో అభియాన్ ప్రధానాంశాలు:1. మట్టి పరీక్ష – మట్టి ఆరోగ్య కార్డులకు ప్రోత్సాహం: రైతులను క్రమం తప్పకుండా మట్టి పరీక్షలు చేయించుకోవడానికీ, పోషక అవసరాలను శాస్త్రీయంగా నిర్ధారించడానికీ మట్టి ఆరోగ్య కార్డులను ఉపయోగించేలా ఈ ప్రచారం ప్రోత్సహిస్తుంది. ఇది సమతుల్య ఎరువుల వాడకాన్ని సాధ్యం చేస్తుంది. అనవసర ఖర్చు లను తగ్గిస్తుంది. పంట ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలి కంగా నేల సారాన్ని కాపాడుతుంది.2. సమతుల్య పోషక నిర్వహణ: అధిక రసాయన ఎరువులపై ఆధారపడకుండా, వాస్తవ నేల అవస రాలకు అనుగుణంగా ఎరువులను ఉపయోగించేలా రైతులను ప్రోత్స హిస్తున్నారు. సమతుల్య పోషక నిర్వహణ నేల నాణ్యతను మెరుగు పరుస్తుంది. సుస్థిర వ్యవసాయ ఉత్పత్తిని నిర్ధారిస్తుంది.3. సహజ – సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహం: ఈ ప్రచారం కృత్రిమ రసాయ నాలపై ఆధారపడటాన్ని తగ్గించి, పర్యావరణ సుస్థిరతను మెరుగు పరిచే సహజ వ్యవసాయ పద్ధతులకు మద్దతు ఇస్తుంది.4. నీటి సంరక్షణ: నీటి కొరత – భూగర్భ జలాల క్షీణతపై పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి సమర్థవంతమైన నీటి నిర్వహణ పద్ధతులను ప్రోత్సహిస్తున్నారు.5. శాస్త్రీయ వ్యవ సాయ పద్ధతులు: ఆధునిక విత్తే పద్ధతులు, విత్తన శుద్ధి, పంట ప్రణాళిక, సాంకేతికత ఆధారిత వ్యవసాయ పద్ధతులను పాటించ డానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నారు.6. పచ్చిరొట్ట ఎరువు–నేల సారం: నేలలోని సేంద్రియ పదార్థాన్ని మెరుగుపరచ డానికీ, నేల సారాన్ని సహజంగా పెంచడానికీ పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు.7. పంట మార్పిడి ఆవశ్యకత: వరి వంటి కొన్ని పంటలకే పరిమితం కాకుండా వ్యవసాయాన్ని ఏక రూప పంట విధానం నుంచి బహుళ పంటల సాగు వైపునకు మళ్లించి... సిఫారసు చేసిన పంటల సరళిని, అంతర పంటలను, సమగ్ర వ్యవసాయాన్ని చేపట్టే విధంగా రైతాంగాన్ని ప్రోత్సహించడం మరో అంశం. దీని వల్ల వ్యవసాయం లాభసాటిగా ఉండటమే కాకుండా సుస్థిర అభివృద్ధి జరుగుతుంది.8. సమగ్ర సస్య రక్షణ: రైతులు తాము పండించే పలు పంట లలో ఆశించే పురుగులు, తెగుళ్ళు, కలుపు వంటి వాటి నుండి పంటను కాపాడుకోవడానికి ఎక్కువగా పెస్టిసైడ్స్ (పురుగు మందులు) వాడుతున్నారు. చాలా ఏళ్ళుగా పంటలలో పురుగు మందు లను విచ్చలవిడిగా, అధిక మోతాదుల్లో, అనేకసార్లు వాడటం వలన అనేక దుష్ప్రభావాలు చూస్తున్నాము. అందుకే పంటలో ఉన్న అసలు సమస్యను వీలైనంత తొందరగా గుర్తించి ఆ సమస్యకు తగ్గట్టుగా రసాయనాలు వాడాలి. ఉదా: పురుగుకు పురుగు మందు, తెగుళ్ళకు తెగులు మందులు, నల్లికి నల్లి మందులు వాడాలి.చీడపీడలు, కలుపు కనిపించిన వెంటనే రసాయన మందులను వాడాల్సిన అవసరం లేదు. వీటి ఉధృతి ఒక స్థాయి దాటినప్పుడు మాత్రమే రసాయనాలు పిచికారీ చేసుకోవాలి. ఉత్పాదకతను ప్రతి కూలంగా ప్రభావితం చేసి, ఆర్థిక నష్టాలను పెంచే నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల నుండి రైతులను రక్షించాలి. – డా. కె. తేజేశ్వరరావు, డా. బి. సహదేవ రెడ్డిప్రధాన శాస్త్రవేత్తలు, ఆచార్య ఎన్ .జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం -
అతడు సామాజిక న్యాయ పతాక!
శూద్ర, అతి శూద్ర కులాల అస్తిత్వమే భారతదేశ అస్తిత్వమనీ, ఆ వర్గాల విముక్తే దేశ విముక్తి అనీ, వారి హక్కులే పౌరసమాజం హక్కులనీ కొల్హాపూర్ సంస్థానాధీశుడు సాహు మహారాజ్ తేల్చి చెప్పారు. ఆయనే దేశంలో తొలి సారిగా కింది కులాలకు రిజర్వేషన్లను ఇచ్చి బహుజన రిజర్వేషన్ల పితామహు డిగా చరిత్రలో నిలిచిపోయారు.మహాత్మా జ్యోతిబాఫూలే ఆలోచనలకు ఆచరణాత్మక ప్రయోగశాలగా కోల్హాపూర్ సంస్థానాన్ని ఆయన తీర్చిదిద్దారు. బుద్ధుడు, కబీర్, జ్యోతిబాఫూలేల ఆలోచనలు ఆయన్ని బాగా ప్రభావితం చేశాయి. డా‘‘ బాబాసాహెబ్ అంబేడ్కర్ చదువుకు సాయం చేయడంతోపాటు ఆయన స్థాపించిన ‘మూక్ నాయక్’ పత్రికకు కూడా వెన్నుదన్నుగా నిలిచారు. అంబేడ్కర్ ఆలోచనలతో దేశంలో దళిత బహుజన సూర్యోదయం జరుగుతుందని 106 ఏళ్ల క్రితమే 1920 మార్చి 22న జాగిర్థారీ మాగాణంలో జరిగిన ‘దక్కన్ అçస్పృశ్య సమాజ సమ్మేళన సభ’లో సాహూజీ ప్రకటించారు. 1918లోనే వెట్టిపని చేసే తలారీ వ్యవస్థను రద్దుచేసి రాజదర్బా రుల్లో దళితులకు ఉద్యోగాలిచ్చే ఉత్తర్వులిచ్చారు. మహర్లకు ఇనాంగా ఇచ్చిన భూములకు వారి పేరుననే పట్టాలు ఇచ్చారు.మరాఠాల బావిలో మంచినీళ్లు తోడుకున్నందుకు దళితుడు గంగారాం కాంబ్లేపై దొంగతనం నేరం ఆరోపించి నడివీధిలో కొరడా దెబ్బలు కొట్టి అవమానించిన విషయం సాహూజీ దృష్టికిరాగానే... దళితుణ్ణి కొట్టిన వ్యక్తిని పిలిపించి అతనివీపు ఎర్రబడేటట్లు కొరడాలతో కొట్టించారు. గంగారాం కాంబ్లే ఆత్మగౌరవాన్ని కాపాడటమే కాకుండా ఆర్థికంగా అతను నిల దొక్కుకునేందుకు హోటల్ పెట్టేందుకు సాయంచేశారు. ఆ హోటల్‌కు తానే స్వయంగా వెళ్లి టీ తాగివచ్చారు. కులాధిపత్య గోడలు బద్దలు కొడుతూ కులాంతర వివాహాలను ప్రోత్సహించారు. ‘వితంతు వివాహచట్టం’ తెచ్చారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 8 దశాబ్దాలు కావస్తున్నా సగం దేశానికి చట్ట బద్ధ రిజర్వేషన్లు లేవని ఎగుస్తున్న ఉద్యమాలకు ఆయన ఆలోచనలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. సగానికిపైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవటం వల్లనే వారి ప్రాతినిధ్యం పార్లమెంటు, అసెంబ్లీలలో అతితక్కు వగా ఉంది. రాజ్యాంగ సవరణచేసి బీసీలకు జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఉద్యమాలు రగులుకుంటున్న సందర్భంలో సాహూజీని స్మరించుకుంటూ భారత పాలకులు బీసీల చట్టబద్ధ రిజర్వేషన్లకోసం రాజ్యాంగ సవరణ చేయాలి. 1902 జూలై 26న దేశ చరిత్రలో మొదటిసారిగా వెనుకబడిన వర్గాలకు 50% రిజర్వేషన్లు ఆయన కల్పించారు. బీసీ విప్లవానికి పాటుపడేవారు సాహూజీ స్ఫూర్తితో ముందుకు అడుగులు వేయాలి. – జూలూరు గౌరీశంకర్, బహుజన ఉద్యమకవి (జూన్ 26న ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి) -
సత్యం కోసం మహా త్యాగం..
‘ముహర్రం’ ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల. త్యాగానికి, సత్యానికి, అచంచలమైన ధైర్యానికి ప్రతీక. ఈ నెలలో అత్యంత ప్రాముఖ్యమైనది పదవ రోజైన ‘ఆషురా’. ఆరోజు ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. శతాబ్దాల క్రితం, కర్బలా మైదానంలో ప్రవక్త(స) వారి మనుమడైన హజ్రత్ ఇమామ్ హుసైన్ (రజి) ఆయన 72 మంది అనుచరులు అధర్మానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి అమరులయ్యారు.యజీద్ అనే పాలకుడి అన్యాయాన్ని అంగీకరించకుండా, ఇస్లామీయ మానవీయ విలువలను, శాంతిని కాపాడటం కోసం ఇమామ్ హుసైన్ తన ప్రాణాలను పణంగా పెట్టారు. ఆకలి దప్పులతో అలమటించినాసరే, ధర్మం వైపే నిలబడి వీరమరణం పొందిన ఆయన ఉదంతం ప్రపంచ చరిత్రలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన ఘట్టంగా నిలిచిపోయింది. అందుకే ముహర్రం అంటే పండుగ కాదు, అది సత్యం కోసం జరిగిన మహా త్యాగానికి ప్రతిరూపం.ఈ కర్బలా యుద్ధం కేవలం రెండు శక్తుల మధ్య జరిగిన పోరాటం కాదు; అది న్యాయానికి – అన్యాయానికి, సత్యానికి – అసత్యానికి మధ్య జరిగిన చారిత్రాత్మక సంగ్రామం. తన కళ్లెదుటే పురిటిపాపల నుండి వృద్ధుల వరకు దాహంతో విలవిల్లాడుతూ ప్రాణాలు వదులుతున్నా, ఇమామ్ హుసైన్ అధర్మానికి తలవంచలేదు. ఆయన చూపిన ఈ ధీరత్వం శతాబ్దాలు దాటినా నేటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది గుండెల్లో స్ఫూర్తి రగిలిస్తూనే ఉంది.అందుకే ఈ రోజున ముస్లింలే కాకుండా, మానవత్వాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఆ మహనీయుని త్యాగాన్ని స్మరించుకుంటారు. సత్యం కోసం ప్రాణాలనైనా అర్పించవచ్చు కానీ, అన్యాయంతో చేతులు కలపకూడదు. అనే గొప్ప జీవన సందేశాన్ని ముహర్రం మానవాళికి అందిస్తోంది. – ఎం.డి. ఉస్మాన్ ఖాన్ -
ఒక సామాజిక ఆవేదన..
మనిషి చరిత్రలో ఇంత సౌకర్యవంతమైన కాలం మరొకటి లేదు. ఆకలి వేస్తే స్విగ్గీ ఉంది. మందులు కావాలంటే బ్లింకిట్ ఉంది. ప్రయాణానికి ఉబెర్ ఉంది. సందేహాలకు ఏఐ ఉంది. వినోదానికి అంతులేని రీల్స్ ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఒక చేతిలో ఇమిడి పోయింది. కానీ ఒక్క ప్రశ్న మాత్రం మిగిలిపోయింది – ఇంత కనెక్ట్ అయిన ప్రపంచంలో మనుషులు ఎందుకు మరింత ఒంటరిగా మారుతున్నారు?ఒకప్పుడు దుకాణానికి వెళితే పొరుగు వారితో మాట్లాడేవాళ్లం. వీధి చివర టీ దుకాణం ఒక చిన్న సామాజిక వేదికగా ఉండేది. ప్రయా ణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడేవి. ఇప్పుడు ఆ అవసరాలన్నీ యాప్‌ల ద్వారా తీరిపోతున్నాయి. తక్కువగా నడుస్తున్నాం. తక్కువగా కలుస్తున్నాం. తక్కువగా మాట్లాడు తున్నాం. ఎక్కువగా స్క్రోల్ చేస్తున్నాం. ఇది సేవల ఆర్థిక వ్యవస్థ విజయం. కానీ సంబంధాల ఆర్థిక వ్యవస్థ వైఫల్యం.ప్రపంచ ఆరోగ్య సంస్థ–2025 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. 2014–19 మధ్య ఒంటరితనం కారణంగా సంవత్సరానికి 8.7 లక్షల మరణాలు సంభవించాయి. భారతీయులు సగటున రోజుకు ఐదు గంటలకు పైగా స్మార్ట్‌ఫోన్‌లో గడుపుతున్నారు. అందులో ఎక్కువ భాగం సోషల్ మీడియా, వీడియోలు, గేమింగ్‌కే. ప్రతి రీల్, ప్రతి లైక్, ప్రతి నోటిఫికేషన్... ప్రతి కొన్ని సెకన్లకు మెదడుకు ఒక చిన్న డోపమైన్ రివార్డ్. ఇది అలవాటు అవుతుంది. తర్వాత అవసరం అవుతుంది. చివరకు వ్యసనం అవుతుంది.మాదకద్రవ్యాల సమస్య గురించి మాట్లాడినప్పుడు సాధారణంగా స్మగ్లింగ్, నేరాలు, అరెస్టుల గురించి చర్చిస్తాం. కానీ యువత డ్రగ్స్ వైపు ఎందుకు వెళ్తున్నారనే ప్రశ్నను విస్మరిస్తాం. డ్రగ్స్ సమస్యకు అసలు మూలం చాలాసార్లు డ్రగ్స్ కాదు – ఒంటరితనం, నిరాశ, అనుబంధాల కొరత. అందుకే డ్రగ్స్‌పై యుద్ధం గెలవాలంటే, ఒంటరితనంపై పోరాటం ప్రారంభించాల్సిందే. ఇందులో భాగంగా యువత కోసం 24 గంటల హెల్ప్ లైన్లు, సహచరమద్దతు వేదికలు అందుబాటులోకి రావాలి. ఒంటరితనానికి మందు మందుల దుకాణంలో దొరకదు. అది ఒక స్నేహితుడి ఫోన్ కాల్లో ఉంటుంది.ఒక కుటుంబ సంభాషణలో ఉంటుంది. ఒక ఉపాధ్యాయుడి ప్రోత్సాహంలో ఉంటుంది. మనం యంత్రాలను కలిపాం. డేటాను కలిపాం. ప్రపంచాన్ని కలిపాం. కానీ మనిషిని మనిషికి కలపడం మర్చిపోయాం. ఇప్పుడు చెయ్యాల్సింది అదే! – వంగవోలు రవి, ఉపాధ్యాయుడు, ఒంగోలు(రేపు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం) -
మూసీపై ఆ రెండు వంతెనల వ్యథ..
హైదరాబాదులో మూసీ నదిపై చాలా వంతెనలున్నాయి. అందులో రెండు వంతె నలు నగరానికి రెండు ముఖాలను చూపి స్తాయి. ఒకటి చారిత్రక ప్రాధాన్యం గల చాదర్‌ఘాట్ వంతెన, రెండోది ఆధునిక డిజైన్‌తో కూడిన నాగోల్ వంతెన. మొద టిది నగరం నడిబొడ్డున ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రెండోది నగర శివారులో వరదను దాటించలేకపోతోంది. ఈ రెండు వంతెనల పరిస్థితి తెలిస్తే హైదరాబాద్ వరద సమస్యకు అసలు కారణం బోధపడుతుంది.నిజాం కాలంలో పాతబస్తీకీ, రెసిడెన్సీకీ మధ్య వారధిగా చాదర్ ఘాట్ వంతెన నిర్మించారు. అప్పట్లో ఎడ్లబండ్లు, గుర్రపు బగ్గీల కోసం కట్టిన ఈ వంతెన నేడు లక్షలాది వాహనాల భారాన్ని మోస్తోంది. కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్ వ్యాపార కేంద్రాలకు ఇది జీవనాడి. ఇటీవలి కాలంలో పిల్లర్ల బలోపేతానికి చేపట్టిన పనులవల్ల, పిల్లర్ల మధ్య ఖాళీ కుంచించుకుపోయింది. వర్షాకాలంలో నీటితో పాటు వచ్చే వ్యర్థాలు ఈ ఇరుకు సందుల్లో చిక్కుకుపోతున్నాయి. వంతెన కిందే అవరోధం ఏర్పడి, నీరు వెనక్కి పొంగి కోఠి మార్కెట్‌ను ముంచెత్తుతోంది.క్షేత్రస్థాయి పరిశీలనల ప్రకారం, గత కొన్ని దశాబ్దాలలో చాదర్‌ఘాట్ వద్ద పురాతన కాలం నుండి సహజంగా ఉన్న నది వెడల్పు చాలావరకు తగ్గినట్లు కనిపిస్తుంది. నది గర్భంలో విస్తృతంగా పార్కింగ్, మెకానిక్ షెడ్లు వెలిశాయి. వర్షం రాగానే అవే మొదట మునుగుతున్నాయి. ఆ వాహనాలు, సామగ్రి నీటి ప్రవాహా నికి అడ్డుపడి వరద తీవ్రతను అనేక రెట్లు పెంచుతున్నాయి..చాదర్‌ఘాట్ వంతెన గత కాలపు దూరదృష్టికి నిదర్శనం. నాగోల్ వంతెన ఆధునిక ఇంజినీరింగ్‌కు కొలమానం. కానీ రెండూ వరదల్లో మునుగుతున్నా యంటే తప్పు వంతెనలది కాదు, నది సహజ స్వభా వాన్ని అర్థం చేసుకోని మనది!ఇక నాగోల్ వంతెన ఔటర్ రింగ్ రోడ్లో భాగంగా ఎల్బీ నగర్–ఉప్పల్ ట్రాఫిక్‌ను తగ్గించేందుకు నిర్మించారు. ఆధునిక డిజైన్, వెడల్పాటి రోడ్డు, ఎత్తైన పిల్లర్లు– పైకి అన్నీ బాగానే కనిపి స్తాయి. కానీ సమస్య వంతెనలో లేదు, కట్టిన ప్రదేశ స్వభావంలో ఉంది. నాగోల్ వంతెన మూసీ నది పెద్ద మియాండర్ (వంపు తిరిగే) ప్రాంతంలో ఉంది. వరద సమయంలో నీరు నేరుగా పారదు. మియాండర్ వద్ద నీటి వేగం తగ్గి ఒడ్డును బలంగా కోస్తుంది. ఫలితంగా 2020 అక్టోబర్ వరదల్లో నాగోల్ వంతెన వద్ద నీటిమట్టం వంతెన స్థాయికి చేరి పక్కనే ఉన్న బండ్లగూడ, నాగోల్ కాలనీలు ముంపునకు గురయ్యాయి. నాగోల్ వంతెనకు ఇరువైపులా కాల క్రమేణా నిర్మాణాలు వెలిశాయి. దీనితో వరద మైదానం విస్తీర్ణం తగ్గింది. 2023లో నాగోల్ ప్రాంతంలోని కొన్ని అపార్ట్మెంట్ల సెల్లార్లు మునిగి వాహనాలు పాడయ్యాయి. భారీ వర్షం వస్తే నీళ్లు పోవడానికి తగినంత స్థలం లేకుండా పోయింది.ఏం చెయ్యాలి?హైడ్రాలిక్ అధ్యయనాలు చెబుతున్నదేమిటంటే, భారీ వర్షాల సమయంలో మూసీలోకి చేరే నీటి పరిమాణం అధికంగా ఉంటుంది. కానీ ఆక్రమణల వల్ల చాదర్‌ఘాట్, నాగోల్ వంటి కీలక పాయింట్ల వద్ద నది మోయగలిగే సామర్థ్యం తగ్గిపోయింది. ‘మూసీ రివర్‌ఫ్రంట్ రీజువెనేషన్’ పథకంలో భాగంగా ఇక్కడ రియల్ టైమ్ వాటర్ లెవల్ సెన్సార్ ఏర్పాటు చేసి స్థానిక వ్యాపార సంఘాలతో అనుసంధానిస్తే వరద సమయంలో వ్యాపారులు నష్టపోకుండా కాపాడుకోగలుగుతారు. నాగోల్ వద్ద వంతెనకు ఎగువన, దిగువన నది సహజ ప్రవాహానికి ఆటంకం కలగకుండా వరద మైదానాన్ని శాస్త్రీయంగా పునరుద్ధరించే ప్రణాళికను అమలు చేయాలి.అలాగే నదీ తీరంలో కొత్తగా నిర్మించే భవనాలకు ‘స్టిల్ట్ ఫ్లోర్’ విధానాన్ని తప్పనిసరి చేసి, సెల్లార్ల నిర్మాణాన్ని పరిమితం చేసే దిశగా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. చాదర్‌ఘాట్ నుంచి నాగోల్ వరకు డ్రోన్ సర్వేతో త్రీడీ మ్యాపింగ్ చేపట్టి ఎక్కడ వరద ముప్పుందో, ఎక్కడ నీటి ప్రవాహం నిరోధించ బడుతోందో ముందుగానే గుర్తిస్తే వర్షాకాలంలోపు నివారణ చర్యలు తీసుకోవచ్చు.- డా. రామకృష్ణ మనిమద్దె, వ్యాసకర్త ఎర్త్ సైంటిస్ట్ – నదీ వ్యవస్థల పరిశోధకులు -
వ్యవసాయ రుణాలు రైతులకు కాదా?
‘భారత రైతులు అప్పుల్లోనే పుడతారు, అప్పుతోనే జీవిస్తారు, అప్పుతోనే చని పోతారు, అప్పునే వారసత్వంగా వదిలి పెడతారు’ అని బ్రిటిష్ అధికారి సర్ మాల్కం డార్లింగ్ 1925లో రాశారు. అది వలస పాలన మీద నిందగా ఉద్దేశించింది. వంద సంవత్సరాల తర్వాత, జాతీయీకృత బ్యాంకులు, ప్రాధాన్య రంగ రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు, స్వయం సహాయక బృందాలు, రూ.2.5 లక్షల కోట్లకు పైగా రుణమాఫీలు జరిగిన తర్వాత కూడా– 2013 పార్లమెంట్ రికార్డులు చూస్తే, 52 శాతం వ్యవసాయ కుటుంబాలు ఇంకా అప్పుల్లో ఉన్నాయి. మాల్కం డార్లింగ్ మాటలు ఇప్పుడు స్వతంత్ర భారతదేశం మీద నిందగా మారాయి.ఎన్ఎస్ఎస్ఓ 2018 ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో 92.9 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి. తెలంగాణలో 89.1 శాతం. ఇవి బ్యాంక్ శాఖలు, స్వయం సహాయక సంఘాలు అత్యధి కంగా ఉన్న రాష్ట్రాలు. ఈ నివేదిక ప్రకారం ఏపీ రైతు సగటు అప్పు రూ.1,23,400 కాగా, సంవత్సర ఆదాయం రూ. 1,25,760. ఇదే తెలంగాణలో ఆదాయం రూ. 1,12,836, అప్పు రూ. 1,52,000. ఈ అప్పు–ఆదాయ నిష్పత్తులు చూస్తే ఎక్కువ రుణాలు ఎప్పటికీ పరిష్కారం కావని అర్థమవుతుంది.వ్యవస్థలో ఆరు లోపాలు1. ఏపీ, తెలంగాణలో సాగు భూమిలో 30–40 శాతం కౌలు రైతులు సాగు చేస్తున్నారు. వారికి భూమి పట్టా లేదు కాబట్టి కిసాన్ క్రెడిట్ కార్డు రాదు. ప్రభుత్వం రూ.20,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న వడ్డీ రాయితీ పథకం పట్టా ఉన్నవారికే వర్తిస్తుంది. దున్నే రైతుకు రుణం రాదు; దున్నని భూయజమానికి వస్తుంది.2. 1975లో చిన్న రైతుల కోసం ప్రత్యేకంగా స్థాపించిన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 1991 తర్వాత వ్యాపార బ్యాంకుల్లా మారిపోయాయి. 3. వ్యవసాయ రుణాలు 2000ల దశకంలో గణాంకాల్లో పెరిగాయి– కానీ రైతుకు అనుభవంలోకి రాలేదు. కారణం ఏమిటంటే, ‘వ్యవసాయ రుణం’ అనే నిర్వచనాన్ని విస్తరించారు. అగ్రి–ప్రాసెసింగ్ కంపెనీలకు, గ్రామీణ మౌలిక సదుపాయాలసంస్థలకు ఇచ్చిన రుణాలు కూడా వ్యవసాయ రుణాల లెక్కలోకి వచ్చాయి. 4. రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణానికి ఎలాంటి హామీ అడగకూడదని ఆర్బీఐ నిబంధన చెప్తోంది. కానీ బ్యాంకులు సర్వే నంబర్ లేకుండా వడ్డీ రాయితీ క్లెయిమ్ చేయలేవు కాబట్టి ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నాయి. 5. హిందూ రుణచట్టంలో ‘దమ్దుపత్’ అనే పురాతన సూత్రం ఉంది– ఒకే సమయంలో వసూలు చేయగలిగే వడ్డీ అసలు మొత్తాన్ని మించకూడదు. ఇది కర్ణాటక మనీలెండర్స్ యాక్ట్ సహా అనేక రాష్ట్రాల రుణ చట్టాల్లో పొందుపరచబడింది. ఆర్బీఐ కూడా ఈ విషయమై స్పష్టమైన ఆదేశం జారీచేసింది. అయినా ఉల్లంఘించబడుతోంది. పంట రుణం బాకీ పడినప్పుడు – కరవు తర్వాత, ధర పతనమైన తర్వాత, వర్షాలు విఫలమైన తర్వాత ఇది సాధా రణంగా జరుగుతుంది. ఖాతాపై సాధారణ వడ్డీతో పాటు పెనాల్టీ వడ్డీ కూడా పడుతుంది. ప్రతి మూడు నెలలకు కాంపౌండ్ అవుతుంది. ఖాతా నాన్–పర్ఫార్మింగ్ అసెట్‌గా వర్గీకరించబడిన తర్వాత కూడా వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. రెండు మూడు సంవత్సరాల బాకీ తర్వాత, రూ.50,000 స్వల్పకాలిక పంట రుణంపై పేరుకు పోయిన వడ్డీ అసలును దాటిపోతుంది. ఆ సమయంలో బ్యాంకు ఆర్బీఐ ఆదేశాన్ని నేరుగా ఉల్లంఘిస్తోంది. రైతుకు ఈ నిబంధన తెలియదు. బ్యాంకు అసలు, పేరుకుపోయిన మొత్తం వడ్డీ రెండూ చెల్లించమని సెటిల్మెంట్ చర్చలు జరుపుతుంది. అనధికారికరంగంలో ఉల్లంఘన మరింత ప్రత్యక్షంగా ఉంటుంది. 36–60 శాతం వడ్డీకి అప్పిచ్చే మనీలెండర్ రెండు మూడేళ్లలో అప్పునురెట్టింపు చేస్తాడు– ఎలాంటి నియంత్రణ లేకుండా.6. బ్యాంకుల రుణంలో 18 శాతం వ్యవసాయానికి ఇవ్వాలని చట్టం. కానీ – (అ) ‘వ్యవసాయ రుణం’ నిర్వచనంలో కార్పొరేట్ ఫుడ్ కంపెనీలను చేర్చారు; (ఆ) పీఎస్ఎల్సీ సర్టిఫికెట్లు కొనుగోలు చేయడం ద్వారా బ్యాంకులు ఒక్క రైతుకూ రుణం ఇవ్వకుండా లక్ష్యాలు చేరుకుంటున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ సర్టిఫికెట్ల మార్కెట్ రూ.9 లక్షల కోట్లు (మొత్తం వ్యవసాయ రుణ వితరణ కంటే ఎక్కువ); (ఇ) లక్ష్యం తప్పిన బ్యాంకులు నాబార్డ్ ఆర్ఐడీఎఫ్ ఫండ్‌లో డబ్బు వేస్తాయి. ఆ డబ్బు రాష్ట్ర మౌలిక సదుపా యాలకు వెళ్తుంది, రైతులకు కాదు.మూడు సంస్కరణలు1. వడ్డీ రాయితీ సాగు చేసేవారికి చేరాలి, పట్టా ఉన్నవారికి కాదు: సాగు చేయనివాళ్లకు సాగుకోసం ఇచ్చే వడ్డీ రాయితీ చట్ట పర మైన నేరంగా పరిగణించాలి. పంట బీమా (పీఎంఎఫ్‌బీవై) నమోదు, పీఎం–కిసాన్ రిజిస్ట్రేషన్, జాయింట్ లయబిలిటీ గ్రూపులు (జేఎల్‌జీ) లేదా రైతు ఉత్పత్తిదారు సంఘాలు (ఎఫ్‌పీఓ) సభ్యత్వం – ఇవన్నీ సాగు ఆధారాలు. జేఎల్జీలు, ఎఫ్పీఓలు ధ్రువీకరణ, రుణ వితరణ వేదికలుగా పని చేయాలి.2. రుణమాఫీ బదులు రుణ మార్పిడి: రుణమాఫీలు సంస్థాగత రుణాలనే రద్దు చేయగలవు– అదే అత్యంత నష్టపడిన రైతులు తీసుకున్న మనీలెండర్లు, ఇన్ పుట్ డీలర్ రుణాలను తాకలేవు. రుణ మార్పిడి నిర్మాణం ఇందుకు మెరుగైన పరిష్కారం. గ్రామసభ ద్వారా రూ.25,000 కంటే ఎక్కువ అన్ని అనధికారిక రుణాలను సర్వే చేయాలి. ప్రభుత్వ హామీతో ఒక డెట్ కన్వర్షన్ ఫండ్... మనీలెండర్ నుండి రుణాన్ని అదే మొత్తానికి కొనుగోలు చేయాలి. రైతు అప్పు 7 శాతం వడ్డీతో అధికారిక రుణంగా మారుతుంది,పంట కాలానికి అనుగుణంగా వాయిదాలు ఉంటాయి. పంట నష్టం జరిగితే వాయిదా పడుతుంది, డిఫాల్ట్ అవ్వదు. కేరళ ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నం ఇప్పటికే చేసింది.3. చిన్న–సన్నకారు రైతుల 10 శాతం ఉప–లక్ష్యాన్ని పీఎస్ఎల్సీ సర్టిఫికెట్ కొనుగోలు ద్వారా చేరుకోకుండా నిరోధించాలి. ప్రత్యక్ష రుణ వితరణే ఆమోదయోగ్యం కావాలి. ‘వ్యవసాయ రుణం’ నిర్వచనం నుండి అగ్రి–బిజినెస్ కంపెనీలను తొలగించాలి. మాల్కం డార్లింగ్ వ్యాఖ్యకు ప్రాసంగికత పోయిదా? ప్రాధాన్య రంగ రుణం కార్పొరేట్‌కు వెళ్ళింది. రూ.2.5 లక్షల కోట్ల రుణ మాఫీలు కౌలు రైతును తాకలేదు. హామీ లేని రుణం హక్కు కాగితంపైనే ఉంది. వడ్డీ పరిమితి చట్టం ఉంది, అమలు లేదు. ఈ ప్రతి లోపాన్నీ సరిచేయవచ్చు. కొత్త విధానం అవసరం లేదు, ఉన్న నిబంధనలను అమలు చేయగలిగే సంకల్పం చాలు.-వ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-డా‘‘ జి.వి.రామాంజనేయులు -
ఆధ్యాత్మిక జ్వాల..
క్రీస్తు కంటే ముందు పుట్టి, ఈ నేలపై క్రీస్తు మార్గం సరాళం చేయడానికి శ్రమించినవాడు యోహాను. ఆనాటి ప్రజల్ని దేవునివైపు తిప్పుతూ, వస్తాడు నా దేవుడంటూ ప్రజలకు నీళ్ళతో బాప్తిస్మం ఇస్తూ, ఓ చైతన్య జ్వాలలా అరణ్య ప్రాంతాల్లో దైవ స్వరం వినిపించిన సంచార స్వరాల ప్రయోక్త, మహా భక్త బాప్తిస్మ యోహాను.‘స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు’– ఈ మాటలు మరియతో ఎలిజబెత్ అన్నది. అప్పటికి ఆమె ఆరు నెలల గర్భవతి. అన్నది ఎలిజబెత్. విన్నది మరియ. అక్కడ ఉన్నది వీరిద్దరే. కానీ ఆ మాటల్ని మరియతో పాటు ఇంకా మరో ఇద్దరు విన్నారు. ఒకరు ఎలిజబెత్తమ్మ గర్భంలోని బాప్తిస్మ యోహాను, మరొకరు మరియ గర్భంలోని యేసు.యేసు గురించి గర్భస్థ శిశువుగా విన్నాడు కాబట్టే, ఆయన ఔన్నత్యాన్ని ఘంటాపథంగా లోకానికి చాటగలుగు తున్నాడు యోహాను! లోకంలో జరిగే మంచీ చేడుల్ని చూచినవి చూచినట్టుగా ప్రజలకి వివరిస్తూ, రాచరికంలోని వైనా ఘాటుగా విమర్శించేస్తున్నాడు. ప్రజలంతా ఆయన్ను ఓ అడవిలో అన్నగా గుర్తిస్తే, రాచరికం మాత్రం ఓ తిరుగు బాటుదారునిగా గుర్తించింది.ఫిలిప్పు భార్య హేరోదియ. ఆమె తన భర్త ఫిలిప్పును వదిలేసి, అతని తమ్ముడు హేరోదు అంతిపస్ని పెళ్లి చేసుకుంది. అంతిపసు ప్రస్తుతం ఆ గలిలయ రాజు. ఓసారి తన ప్రసంగంలో ‘నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట న్యాయము కాదు’ అని రాజును బహిరంగంగా ఖండించాడు. అగ్గిమీద గుగ్గిలమైంది రాజు కాడు, హేరోదియ.హేరోదియకు ఓ కూతురు. పేరు సలోమి. ఆరితేరిన నర్తకి. ఓ రోజు ఆడింది పాడింది, ఆ రాజును మెప్పించింది. ఏమి కావాలో కోరుకోమన్నాడు రాజు. తల్లిచేసిన దుర్బోధలచే సలోమి యోహాను శిరస్సు కోరుకొంది. సరే అన్నాడు రాజు. మరుక్షణంలోనే పళ్ళెరాన యోహాను శిరస్సు! కానీ మరణంనుంచే గలిలయలో కొత్త విప్లవం ఆవిర్భవించింది. యోహాను స్ఫూర్తి ఖండఖండాలకు పాకింది. – డా‘‘ దేవదాసు బెర్నార్డ్ రాజు (జూన్ 24న బాప్తిస్మ యోహాను జన్మదినం) -
ఎంతలో ఎంత మార్పు!
1977 మార్చిలో ప్రప్రథమంగా కేంద్రంలో ఏర్పాటైన కాంగ్రెసేతర ప్రభుత్వ (జనతా పార్టీ) సంబరం మూన్నాళ్ళ ముచ్చటగా ముగిసింది. కారణం, పార్టీ నాయకుల అంతర్గత కుమ్ములాట. తనకు దక్కవలసిన ప్రధాని పీఠం, మొరార్జీ దేశాయికి దక్కడంతో, ఉపప్రధాని చౌధరీ చరణ్ సింగ్ జీర్ణించుకోలేక పోయారు. ఈ తరుణంలో జనతా ప్రభుత్వాన్ని కూలదోయటానికి పక్కా వ్యూహం పన్నారు ఇందిరాగాంధీ. సరిపడా ఎంపీలతో జనతా నుండి బయ టకు వస్తే, ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌కు చెందిన 154 మంది ఎంపీలు ఆయనకు మద్దతు ఇస్తార ని చరణ్ సింగ్‌కు సంజయ్ గాంధీ ద్వారా ఆఫర్ పంపారామె. 1979 జూలై 1న మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ నుండి బయటకు వచ్చారు చరణ్ సింగ్. ఆమె ఆశించినట్టే మొరార్జీ ప్రభుత్వం పడిపోయింది.రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి 1979 జూలై 28న చరణ్ సింగ్‌తో రాష్ట్రపతి భవన్లో ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. 23 రోజులు గడిచాక కాంగ్రెస్ ఎంపీలు చరణ్ సింగ్ ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతును వెనక్కి తీసుకున్నారు. పార్లమెంటులో బల పరీక్షకు వెళ్ళకుండానే, ఆగష్టు 20 నాడు పదవికి రాజీనామా చేసి పార్లమెంటును రద్దు చేయాల్సిందిగా రాష్ట్రపతిని కోరారు కిసాన్ నేత చరణ్ సింగ్.ఆగస్టు 22న లోక్‌సభ రద్దు కావడంతో 1980 జనవరిలో మధ్యంతర ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ గెజిట్ నోటిపికేషన్ విడుదల చేసింది. సంజయ్ గాం«ధీ తన సన్నిహితులకు, యువతకు అత్యధిక టిక్కెట్లు ఇచ్చి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపారు. కాంగ్రెస్ 353 సీట్లతో అఖండ విజయం సాధించింది. ఎమర్జెన్సీ రోజుల్లో రాజ్యాంగేతర శక్తిగా అధికారం చలాయించిన సంజయ్... అమేథీ నియోజకవర్గం నుండి గెలిచి అఫీషియల్ సూపర్ పవర్ సెంటర్‌గా ఎదిగారు.1980 జూన్ 23న ఉదయం 8 గంటలు. డిల్లీ సఫ్దర్‌జంగ్ ఎయిర్‌పోర్టు గగన వీధుల్లో టూ సీటర్ పిట్స్ – 2ఏ విమానం పచార్లు చేస్తూ దగ్గరే ఉన్న చెట్టుకు ఢీకొని మంటలతో నేలకూలింది. చెట్టు కొమ్మల్లో ఇరుక్కున్న రెండు శవాలు గుర్తుపట్టలేనివిధంగా కాలిపోయాయి. అవి ఆ విమానంలోని ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ సుభాష్ సక్సేనా(50), ట్రైనీ పైలట్ సంజయ్ గాంధీ (33)వి అని తేలాయి. సంజయ్ గురించి కుష్వంత్ సింగ్ ‘99: అన్ఫర్గెటబుల్ ఫిక్షన్, నాన్– ఫిక్షన్, పొయిట్రీ అండ్ హ్యూమర్’ పుస్తకంలో ఇలా అన్నారు: ‘నాకు సంజయ్ అంటే ఇష్టం. కానీ అతను జీవించి ఉంటే, ఈ దేశంలో క్రమశిక్షణ ఉండేది, అభివృద్ధి కూడా వేగంగా జరిగేది. ప్రజాస్వామ్యం మాత్రం ఉండేది కాదు.’ – జిల్లా గోవర్ధన్ ‘ రిటైర్డ్ పీఎఫ్ కమిషనర్, ముంబై -
అక్కడికే ఎక్కువమంది!
భారతదేశం నుండి బయల్దేరే, లేదా భారతదేశంలో ఆగే విమాన ప్రయాణికుల సంఖ్యను బట్టి... గల్ఫ్ దేశాలకూ, భారత్‌కూ మధ్యే అత్యధికంగా రాకపోకలు సాగుతున్నాయి. వలసలు, వ్యాపారాలు ఇందుకు ప్రధాన కారణం కాగా, పర్యాటక రంగం తర్వాతి స్థానంలో ఉంది. -
కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు
ఇటీవల ఒకరు గౌరవ తెలంగాణ హైకోర్ట్‌లో తెలుగులో వాదనలు వినిపించబోతే, ద్విసభ్య ధర్మాసనం తెలుగులో వాదనలు వినిపించ రాదని ఆక్షేపించింది. రాజ్యాంగంలోని 348 (1)(ఏ) అధికరణం ప్రకారం, సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కార్యకలాపాలు ఆంగ్ల భాషలోనే జరగాలి. అయితే, 348(2)వ అధికరణం ప్రకారం – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో హైకోర్టులో హిందీ లేదా వేరే ఇతర భాషల్లో కార్యకలాపాలు జరపవచ్చు. ఆదేశాలు, తీర్పులు మాత్రం ఆంగ్లంలోనే ఉండాలి. ఇతర భాషలో తీర్పు ఉంటే, దాని ఆంగ్లాను వాదం కూడా జత చేయాలి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాలు హైకోర్టులో హిందీలో కార్య కాలాపాలు నిర్వర్తించడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందాయి.తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వరుసగా తమిళం, గుజరాతీ, హిందీ, బెంగాలీ, కన్నడ భాషలను తమ తమ హైకోర్టుల్లో ఉపయోగించ డానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరాయి. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయం కోరగా, 2012లో సుప్రీంకోర్టు ఆ సిఫారసులను అంగీకరించలేదు. 2016లో తమిళనాడు ప్రభుత్వం, 2012 నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ తిరిగి అదే సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు తిరిగి ఆ అభ్యర్థనను అంగీకరించలేదు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు న్యాయమూర్తులుగా నియమితులవుతారు కాబట్టి వారు ప్రాంతీయ భాషలను అర్థంచేసుకోలేరు కాబట్టి ప్రాంతీయ భాష లలో వాదనలను వినిపించవద్దనేది సుప్రీం అభిప్రాయం.అయితే, ఇదే పరిస్థితి, పార్లమెంటులో కూడా ఉంటుంది. దేశ నలుమూలల నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులుంటారు. 2025 వరకు, కేవలం, ఇంగ్లీష్, హిందీ భాషలలో మాట్లాడటానికే అను మతి ఉండేది. కానీ, సాంకేతికతను ఉపయోగించి, 2025 నుంచి, 22 అధికార భాషలలో నుండి ఏ భాషలోనైనా పార్లమెంటు సభ్యులు మాట్లాడవచ్చు. పార్లమెంటుకు వర్తించే ఇదే సూత్రం, అదే సాంకేతి కతను ఉపయోగించి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కూడా ప్రాంతీయ భాషలో వాదనలకు అనుమతించవచ్చు.దిగువ కోర్టుల విషయానికి వస్తే, ఏ ప్రాంతీయ భాషనైనా కోర్టు భాషగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. దిగువ కోర్టుల్లో సాక్ష్యాన్ని ప్రాంతీయ భాషలోనే నమోదు చేయాలి. 1984లోనే అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగులోనే దిగువ కోర్టు వ్యవహారాలను నడపా లని ఆదేశించింది. 2013లో మొదటిసారిగా అప్పటి శ్రీకాకుళం జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ నాలుగు తీర్పులను తెలుగులో వెలువరించారు. కానీ ఆ తరువాత, దిగువ కోర్టులు తెలుగులో తీర్పులను రాయడంపై శ్రద్ధ వహించడం లేదు.అప్పటి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ 2017లో చేసిన సూచ నతో, చొరవతో తీర్పులు ప్రాంతీయ భాషల్లో లభ్యమయ్యేలా సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. 2019లో మొదటిసారిగా, 114 తీర్పుల ప్రాంతీయ భాషల అనువాదాలను సుప్రీంకోర్టు తమ వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది.ఇక హైకోర్టుల విషయానికి వస్తే, అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా 2023 ఫిబ్రవరి 21న కేరళ హైకోర్టు రెండు తీర్పులను మలయాళంలో వెలువరించింది. అదే సంవత్సరం జూన్‌లో తెలంగాణ ౖహె కోర్టు మొట్టమొదటిసారిగా ఓ వివాదాన్ని పరిష్కరిస్తూ తెలుగులో తీర్పు వెలువరించింది. ఇప్పుడు అన్ని తీర్పులకు తెలుగు అనువాదాలు కోర్టు వెబ్సైటులో లభిస్తున్నాయి. అయితే అవి అంతగా అర్థవంతంగా ఉండటంలేదు. న్యాయ స్థానాల్లో భాషా పండితులను నియమించడం ద్వారా అనర్థం నివా రించవచ్చు. ప్రస్తుతం, న్యాయవిద్య కేవలం ఆంగ్ల మాధ్యమంలోనే లభ్యమవుతోంది. తెలుగులో నాణ్యమైన తీర్పులు రావాలంటే, తెలుగు భాషలో కూడా న్యాయవిద్యను ప్రవేశ పెట్టాలి. – కె.ఎస్. హరీష్ కుమార్, విశ్రాంత అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
హైటెక్ – హైరిస్క్
1990ల చివరలో ప్రారంభమైన ఐటీ విప్లవం హైదరాబాద్ రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్ రామ్‌గూడా వంటి ప్రాంతాలు ప్రపంచస్థాయి వ్యాపార కేంద్రాలుగా ఎదిగాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, డెలాయిట్, యాక్సెంచర్ వంటి సంస్థలు వేలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించాయి.దేశం నలుమూలల నుంచి యువత ఇక్కడికి వచ్చారు. అధిక వేతనాలు, వేగవంతమైన జీవనశైలి, ఆర్థిక స్వేచ్ఛ నగర సంస్కృతిని కొత్త దిశలో నడిపించాయి. పబ్‌లు, లాంజ్ బార్లు, వీకెండ్ పార్టీలు, ఫామ్‌హౌజ్ ఈవెంట్లు వేగంగా విస్తరించాయి. నైట్ లైఫ్ ఉండటం తప్పు కాదు. ప్రపంచంలోని ప్రతి ఆధునిక నగరంలో అది ఉంటుంది. కానీ వినోదం నియంత్రణ కోల్పోయినప్పుడు, స్వేచ్ఛ బాధ్యతను విస్మరించినప్పుడు, రాత్రి జీవితం చట్టాన్ని సవాలు చేయడం మొదలైనప్పుడు సమస్యలు మొదలవుతాయి.ప్రస్తుతం హైదరాబాదులో వందల సంఖ్యలో పబ్‌లు, నైట్ క్లబ్బులు పని చేస్తున్నాయి. వీటి చుట్టూ కోట్లాది రూపా యల వినోద ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ రీల్స్, సెల బ్రిటీ సంస్కృతి యువతలో ఒక భ్రమను సృష్టిస్తున్నాయి. మద్యం సేవించడం, పార్టీలకు హాజరుకావడం వంటివి ఆధునికతకు చిహ్నంగా యువత భావిస్తోంది. ఇదే వాతావరణాన్ని డ్రగ్స్ మాఫియా అవకాశంగా మార్చుకుంటోంది. ఒకప్పుడు గంజాయికి పరిమి తమైన మాదకద్రవ్యాల నెట్వర్క్ ఇప్పుడు ఎమ్డీఎమ్ఏ, ఎల్ఎస్డీ, కోకైన్ వంటి సింథటిక్ డ్రగ్స్ వరకు విస్తరించింది. డార్క్‌వెబ్, క్రిప్టోకరెన్సీల సహా యంతో జరిగే అక్రమ వ్యాపారం యువతను లక్ష్యంగా చేసుకుంటోంది. హైదరాబాద్ ఎందుకు డ్రగ్స్ మాఫియాకు ఆకర్షణీయంగా మారింది? అధిక ఆదాయం కలిగిన యువ జనాభా, అంతర్జాతీయ కనెక్టివిటీ, నైౖట్లైఫ్, ఫామ్ హౌజ్ సంస్కృతి... ఇవన్నీ కారణాలే.అభివృద్ధి అంటే ఐటీ టవర్లు, ఫ్లైఓవర్లు, మెట్రో రైళ్లు, స్కైస్క్రాపర్లు మాత్రమే కాదు. మహిళలు రాత్రి వేళ భయపడకుండా ప్రయాణించగలగడం, యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం, చట్టం పట్ల గౌరవం ఉండటం కూడా అభివృద్ధి సూచికలే. స్వేచ్ఛ–అనాగరికత మధ్య గీత చెదిరి పోకుండా కాపాడుకోవడం సమాజం బాధ్యత. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే ప్రభుత్వం, పోలీసులు, కుటుంబాలు, విద్యాసంస్థలు, మీడియా సమన్వయంతో పనిచేయాలి. చివరికి ప్రశ్న ఒక్కటే– మన యువతను, నగర భవి ష్యత్తును కాపాడగలమా? సమాధానం కాలం కాదు, మన చర్యలే చెబుతాయి. – డా‘‘ బి. హర్షిణి ‘ సైకియాట్రిస్ట్ -
వరం ఎలా కోరాలి?
ఆ దేవుడే ఎదురై, ‘వరమిస్తాను, కోరుకో!’ అంటే ఎలాంటి వరం, ఎలా కోరుకోవాలో చాలామందికి తెలియదు. అతితెలివి వరాలడిగి ఆత్మనాశం కొనితెచ్చుకొన్న అసురులెందరో ఉన్నారు. ధర్మమైన వరం అడిగి, శుభపరంపరను సాధించిన ధర్మరాజులు అరుదు.వనవాసంలో యక్షుడడిగిన యక్షప్రశ్నలన్నిటికీ ధర్మరాజు చక్కగా సమాధానాలిచ్చిన సందర్భంలో, ఆ యక్షుడు మెచ్చి, ‘ధర్మజా! ఇక్కడ చనిపోయి పడి ఉన్న నీ నలుగురు తమ్ముళ్ళలో ఒక్కరిని బ్రతికిస్తాను. ఎవరు కావాలో కోరుకో’ అని అడిగాడు. ‘నా తల్లి సంతానంలో నేను బ్రతికి ఉన్నాను. నా సవతి తల్లి మాద్రిసంతానమైన నకులుడిని సజీవుడిని చేయటం ధర్మంగా ఉంటుంది’ అని కోరాడు ధర్మరాజు. యుధిష్ఠిరుడి ధర్మబుద్ధికి అబ్బురపడి, యక్షుడు ఆయన నలుగురు సోదరులనూ బ్రతికించాడు. ‘ధర్మజా! నేను యక్షుడిని కాదు. నిన్ను పరీక్షించేందుకు వచ్చిన ధర్మదేవతను. వరం అడగటంలో నీ ధర్మబుద్ధిని మెచ్చాను. నీ కోసం మరో వరం కూడా ఏదయినా కోరుకో’ అన్నాడు. ‘అయ్యా, మాతో పాటు అరణ్యంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడు అగ్నిని మథించుకొనేందుకు వాడే అరణి కొయ్యను, లేడి ఎత్తుకు పోవటం చేత మేం అయిదుగురమూ దానిని వెతుకుతూ వచ్చాం. దయతో దానిని ప్రసాదించు, చాలు’ అన్నాడు ధర్మజుడు.‘అదెంతపని? మిమ్మల్ని పరీక్షించేందుకు లేడి రూపంలో వచ్చి, ఆ అరణిని తెచ్చింది నేనే!’ అని, ధర్మదేవుడు అరణిని ధర్మజుడికి అందించాడు. ‘ఇప్పటికీ నీ కోసం నువ్వు వరం కోరుకోలేదు కనుక నేనే, అయాచితంగా, మీకొక వరమిస్తున్నాను. మీ పన్నేండేళ్ళ అరణ్యవాసం నేడో, రేపో ముగియబోతున్నది. అజ్ఞాతవాసం అనే అతి క్లిష్టమైన కాలం ఆరంభం కాబోతున్నది.మీరు మీకు అనువైన మారువేషాలు ధరించి, ఎవ్వరూ మిమ్మల్ని గుర్తించకుండా మీ అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇది నా వరం. ఇది కాక, నువ్వు కోరేదేమైనా ఉంటే అడుగు. అనుగ్రహిస్తాను!’ అన్నాడు ధర్మదేవత. ‘దేవా! ఇంతకంటె ఏం కావాలి? అయినా అడిగావు కనక, నా బుద్ధి ఎల్ల వేళలా ధర్మాన్నే అనుసరించి ఉండేట్టు అనుగ్రహించు’ అన్నాడు ధర్మజుడు. ధర్మనిష్ఠుడైన వాడికిక లోటేమిటి? ఎప్పుడు ఏ దేవతను ఏది కోరినా లభిస్తుంది! – ఎం. మారుతి శాస్త్రి -
దక్షిణాసియాలో కనబడని సంక్షోభం
దక్షిణాసియా ప్రస్తుతం ఒక విరుద్ధమైన కూడలిలో నిలిచి ఉంది. సాంకేతికత, వ్యవస్థాపకత కారణంగా ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థలు అద్భుతమైన వేగంతో దూసుకు పోతుండగా, మరోవైపు ఒక నిశ్శబ్ద జీవ క్రియ సంక్షోభం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తోంది. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లా దేశ్ టైప్ 2 డయాబెటిస్ (మధుమేహం), గుండె జబ్బులకు ప్రపంచ కేంద్రాలుగా మారాయి. ఆందోళనకరమైన విషయం ఏంటంటే, పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే దాదాపు పదేళ్లు ముందే – అంటే 30 ఏళ్ల చివర్లో, 40 ఏళ్ల ప్రారంభంలోనే – ఇక్కడి ప్రజలు గుండెపోట్లు, తీవ్రమైన జీవక్రియ రుగ్మతల బారిన పడుతున్నారు.శతాబ్దాల నాటి పొదుపు వాస్తవికతఇది కేవలం జీవనశైలి లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మాత్రమే జరుగుతున్నది కాదు. దీని వెనుక ‘దక్షిణాసియా థిన్–ఫ్యాట్ ఫినోటైప్’ అనే ప్రత్యేకమైన జీవశాస్త్ర సత్యం దాగుంది. ఇక్కడి ప్రజలు బయటికి చూసేందుకు సన్నగా కనిపించినప్పటికీ, వారి లోపల ముఖ్యమైన అవయవాల చుట్టూ ప్రమాదకరమైన స్థాయిలో అంతర్గత కొవ్వు (విసెరల్ ఫ్యాట్) పేరుకుపోయిఉంటుంది. ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకోవడం, దీనికి పరిష్కారం కనుగొనడం దక్షిణాసియా దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికీ, కుటుంబ సంక్షేమానికీ అత్యంత అవసరం.శతాబ్దాలుగా పదే పదే వచ్చిన కరవులు, ఆహార కొరత ఇక్కడి ప్రజల జన్యురూపాన్ని ప్రభావితం చేశాయి. ప్రకృతి ఎంపిక ప్రకారం, శరీరంలో శక్తిని అత్యంత సమర్థవంతంగా నిల్వ చేసు కోగల వ్యక్తులకే మనుగడ సాధ్యమైంది. ఈ మనుగడ యంత్రాంగాన్నే ఇప్పుడు ‘థ్రిఫ్టీ జీన్’ (పొదుపు జన్యువు) సిద్ధాంతం అని పిలుస్తున్నారు. కేలరీలు సమృద్ధిగా లభిస్తున్న, శారీరక శ్రమ లేని ఆఫీస్ ఉద్యోగాలు, మోటారు వాహనాలు, విపరీతంగా ప్రాసెస్ చేసిన ఆహారాలున్న నేటి యుగంలో, ఒకప్పుడు ప్రాణాలు కాపాడిన ఈ జన్యు లక్షణమే ఇప్పుడు శాపంగా మారింది. దీని ఫలితంగా శరీరంలో దీర్ఘకాలిక తక్కువ స్థాయి వాపు, ఇన్సులిన్ నిరోధకత, అవయవాల చుట్టూ వేగంగా కొవ్వు పేరుకు పోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. లక్షలాది కుటుంబాలలో, ఒకే ఒక్క దీర్ఘకాలిక అనారోగ్యం – ముఖ్యంగా అదికుటుంబ పెద్దకు వచ్చినప్పుడు – వారిని తీర్చలేని వైద్య అప్పుల్లోకీ, తరతరాల పేదరికంలోకీ నెట్టేస్తుంది. ప్రధానంగా పాశ్చాత్య జనాభాను బట్టి రూపొందించిన సాంప్ర దాయ బి.ఎమ్.ఐ. (బాడీ మాస్ ఇండెక్స్) బరువు చార్టులు తరచుగా దక్షిణాసియా ప్రజలకు ఒక తప్పుడు భద్రతా భావాన్ని (భ్రమను) కల్పిస్తాయి. దీనివల్ల, చాలామంది అంతర్గతంగా ఆరోగ్య ప్రమాదా లను ఎదుర్కొంటున్నప్పటికీ, వారి బరువు ‘సాధారణంగానే’ఉంటుంది. ‘ప్రామాణిక’ కొలతలు పట్టించే తప్పుదోవపాశ్చాత్యులలో అధిక బరువు పరిమితి 25.0 బీఎంఐగా ఉంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా ప్రజలకు దీనిని 23.0 గానే నిర్ణయించింది; ఎందుకంటే మనకు తక్కువ బరువు ఉన్నప్పటికీ శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే, పాశ్చా త్యులలో 50 ఏళ్ల తర్వాత మధుమేహం వచ్చే ముప్పు ఎక్కువగాఉంటే, దక్షిణాసియా వాసులలో 30 ఏళ్ల నుండే ఈ ప్రమాదంపొంచి ఉంది. పాశ్చాత్యులలో సాధారణంగా చర్మం కింద కొవ్వు చేరితే, దక్షిణాసియా ప్రజలలో కీలక అవయవాల చుట్టూ పేరుకు పోతుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను ప్రేరేపించి మధుమేహం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఖరీదైన జిమ్‌లు, సుదీర్ఘమైన వర్కవుట్ సెషన్ లతో కూడిన పాశ్చాత్య తరహా ఫిట్నెస్ సంస్కృతి ఇక్కడి రద్దీ నగరాలు, ట్రాఫిక్, కాలుష్యం కారణంగా ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు. అదృష్టవ శాత్తూ, సైన్స్ మనకు ఒక ఆచరణాత్మకమైన, ప్రభావవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది: అదే ‘ఎక్సర్సైజ్ స్నాకింగ్’ (చిన్న చిన్న విరామాలలో వ్యాయామం చేయడం).‘డయాబెటోలాజియా’ వంటి జర్నల్స్‌లో ప్రచురితమైన పరిశో ధనల ప్రకారం – ముఖ్యంగా భోజనం చేసిన 20–30 నిమిషాల తర్వాత 8–12 నిమిషాల పాటు వేగంగా నడవడం, మెట్లు ఎక్కడం లేదా ఒకే చోట నిలబడి మార్చ్ చేయడం వంటి చిన్నపాటి శారీరక శ్రమలు భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు ప్రమాదకరంగా పెరగకుండా గణనీయంగా తగ్గిస్తాయి. సహజంగానే తక్కువకండర ద్రవ్యరాశి (మన శరీరంలోని సహజ ‘గ్లూకోజ్ సింక్’) ఉండే దక్షిణాసియా శరీర తత్వానికి, ఈ చిన్న, స్థిరమైన పనులు ఎంతో శక్తిమంతంగా పనిచేస్తాయి. ఆచరణాత్మక పరిష్కారాలు30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ సింపుల్ పరీక్షల ద్వారా తమ వార్షిక ‘మెటబాలిక్ బేస్‌లైన్’ (జీవక్రియ స్థితి)ని తెలుసుకోవాలి: హెబీఏ1సీ (3 నెలల సగటు రక్తంలో చక్కెర శాతం), ఫాస్టింగ్ గ్లూకోజ్, బీపీ, మూత్రపిండాల పనితీరు (క్రియాటినిన్), కాలేయ ఎంజైములు, థైరాయిడ్ ఆరోగ్యం కోసం టీఎస్‌హెచ్ పరీక్షలు చేయించుకోవాలి. స్థానిక ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ స్క్రీనింగ్ పరీక్షలను గ్రామాల్లో సైతం అందుబాటులోకి తేవచ్చు.భారీగా కార్బోహైడ్రేట్లు ఉండే భోజనాలకు దూరంగాఉండండి. పప్పులు, శనగలు, పెరుగు, గుడ్లు, మొలకెత్తిన గింజలు వంటి మనకు అలవాటైన ఆహారాలతో ప్రోటీన్ పరిమాణాన్నిపెంచండి. సబ్జా గింజలు, ఇసబ్గోల్ను రోజూ మీ ఆహారంలో చేర్చుకోండి. ఈ సాంప్రదాయ పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయు లను స్థిరీకరించడానికీ, ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికీ అద్భుతంగా పనిచేస్తాయి. ప్రధాన భోజనంలో ప్రోటీన్, కార్బో హైడ్రేట్ల నిష్పత్తి సుమారుగా 1:1 ఉంచడంవల్ల శరీరంలో వాపు గణనీయంగా తగ్గుతుంది. పాశ్చాత్య నమూనాలను గుడ్డిగా అనుస రించకుండా మన ప్రత్యేక జీవశాస్త్రాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, మన శరీరాలకూ, మన వాస్తవికతలకూ సరిపోయే పరిష్కారాలను మనం కనుగొనవచ్చు.-వ్యాసకర్త ఇండో–అమెరికన్ బయోకెమిస్ట్రీ శాస్త్రవేత్త; ‘రెడ్డి సెంటర్ ఫర్ క్రిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్’ డైరెక్టర్-మేడా పరమేశ్వర రెడ్డి -
ఇరాన్లో తగ్గి క్యూబాలో నెగ్గేనా?
మెరుపు దాడిలో వెనిజులా అధ్యక్షుడిని బంధించిన తరువాత యూఎస్ అధ్యక్షుడి తరువాతి లక్ష్యం క్యూబా అని అందరూ భావించారు. అనుకోని పరిస్థితులలో ఇరాన్ యుద్ధం క్యూబాను వెనక్కు నెట్టే సింది. ఇరాన్ ఎదురు దెబ్బల నేపథ్యంలో యూఎస్ పక్కా ప్రణాళికతో క్యూబా పథకాన్ని రచిస్తున్నట్లుగా విశదమవుతు న్నది. మే నెల చివరలో యూఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిమిట్జ్‌ను కరేబియన్ సముద్రంలోకి పంపించటంతో యుద్ధమేఘాలు కమ్ముకోవటం ప్రారంభమైంది. క్యూబా మాజీ అధ్యక్షుడు రావుల్ కాస్ట్రోపై యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ హత్యానేర అభియోగాలను మోపటం క్యూబాపై దాడికి యూఎస్ పావులు కదుపుతున్నట్లుగా అర్థమవుతున్నది. క్షేత్ర స్థాయిలో క్యూబా కూడా దాడికి సన్నద్ధమవుతున్న వార్త లొస్తున్నాయి. ‘ప్రజలందరి యుద్ధం’ డాక్ట్రిన్‌ను క్యూబా పాటించ బోతున్నది. ఈ సిద్ధాంతం ప్రకారం అమెరికా దాడిని క్యూబా సైన్యమే కాకుండా, క్యూబా పౌరులందరూ ప్రతిఘటిస్తారు. కమ్యూ నిస్టు పార్టీ వ్యవస్థ, విప్లవ చరిత్ర కలిగిన క్యూబాను దారికి తేవడం యూఎస్‌కు తేలిక కాదు. కానీ ఇరాన్ వైఫల్యాల నుండి ప్రజలదృష్టిని మరలించటానికి ట్రంప్‌కు క్యూబాపై విజయం కీలకం.గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నంకరేబియన్ సముద్రంలో అమెరికాకు కేవలం 90 మైళ్ల దూరంలో ఉన్న క్యూబా దీవి వ్యూహాత్మకంగా భౌగోళిక ఉనికిని కలిగి ఉన్నది. క్యూబాలో విదేశీ శక్తులు తిష్టవేస్తే ఫ్లోరిడా జలసంధిని దిగ్బంధించి యూఎస్‌ను కట్టడి చేయవచ్చు. అందుకే 200 ఏళ్ళ క్రితమే మన్రో డాక్ట్రిన్‌లో భాగంగా ఉత్తర, దక్షిణ అమెరికా ఖండా లను యూఎస్ తన వ్యూహాత్మక ప్రాంతాలుగా ప్రకటించింది. 1898లో స్పెయిన్‌ను యూఎస్ ఓడించటంతో క్యూబాకు వలస పాలన నుండి విముక్తి లభించింది. కానీ 1901 ప్లాట్ సవరణ చట్టం ద్వారా క్యూబాను యూఎస్ తన నియంత్రణలో ఉంచుకొన్నది. 1934లో ఈ చట్టాన్ని రద్దు పరచినప్పటికీ క్యూబా ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నది. యూఎస్ పెత్తనాన్ని ఎదిరించి ఫిడెల్ కాస్ట్రో 1959లో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పరచి క్యూబాలోని యూఎస్ వ్యాపారాలను, ఆస్తులను జాతీయీకరణం చేశాడు. 1960లో క్యూబాపై అమెరికా ఆంక్షలు విధించింది. 1961లో యూఎస్‌లోని క్యూబా ప్రవాసుల ద్వారా ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సీఐఏ ప్రయత్నించి విఫలమైంది. దీనిని ‘బే ఆఫ్ పిగ్స్ తిరుగుబాటు’గా పిలుస్తారు. యూఎస్‌ను ఎదు ర్కోవటానికి కాస్ట్రో సోవియట్ రష్యా పంచన చేరాడు. 1962లో సోవియట్ యూనియన్ క్యూబాలో అణుక్షిపణులను మోహరించ టంతో అగ్ర రాజ్యాలు అణుయుద్ధపు అంచులకు చేరాయి. 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నమవటంతో క్యూబాకు దిక్కుతోచలేదు. కాస్ట్రో ఒకవైపు ఉక్కు పిడికిలితో క్యూబాను పాలిస్తూనే కమ్యూనిజంను లాటిన్ అమెరికా అంతటా వ్యాప్తి చేయటానికి ప్రయత్నించాడు. అంగోలా, ఇథియోపియాలలో కూడా క్యూబన్ గెరిల్లా సైనికులు సేవలందించారు.సంబంధాలు కొంత మెరుగైనా...రావుల్ కాస్ట్రో 2008లో క్యూబా పగ్గాలు చేపట్టాక యూఎస్‌తో కొంత సుహృద్భావ వైఖరిని ప్రదర్శించాడు. ఒబామా హయాంలో యూఎస్–క్యూబా సంబంధాలు కొంత గాడిన పడ్డాయి. 2015లో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణ జరిగింది. 2016లో క్యూబా పర్యటనలో భాగంగా క్యూబాను టెర్రరిజంను ప్రోత్సహించే దేశాల లిస్టు నుండి తొలగించారు. ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ట్రంప్ 2017లో అధికారంలోకి రావటంతోనే మళ్లీ ఘర్షణ వాతావరణం పునఃస్థాపితమైంది. బైడెన్ కూడా క్యూబాపై ఆంక్షలను చాలావరకు కొనసాగించాడు. వెనిజులాపై దాడి తరువాత తన తదుపరి లక్ష్యం క్యూబా అని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించాడు. ఆరు దశాబ్దాలుగా కొనసాగు తున్న ఆర్థిక–వాణిజ్య ఆంక్షలు చాలవన్నట్లు ఈ ఏడాది జనవరిలో ట్రంప్ చమురు దిగ్బంధనాన్ని (ఆయిల్ ఎంబార్గో) ప్రకటించాడు. క్యూబాకు చమురు సరఫరా కాకుండా యూఎస్ నౌకాబలం అడ్డు కుంటున్నది. ముఖ్యంగా వెనిజులా నుండి చమురు దిగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. క్యూబా తన శక్తి అవసరాలకు 60 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నది. దీనితో క్యూబాలో శక్తి సంక్షోభం ఏర్పడింది. ప్రతిరోజు 20–22 గంటల కరెంటు కోతలు సాధారణ మైనాయి. రవాణా స్తంభించింది. నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెత్త రవాణాకు కూడా వాహనాలకు ఇంధనం లేక పోవటంతో హవానాతో సహా పలు పట్టణాలలో వీధులలో చెత్త పేరుకుపోయింది. ఆసుపత్రులలో కరెంటు కొరతతో పలు వైద్య సేవలు స్తంభించాయి. పాఠశాలలు, యూనివర్సిటీలు మూత పడ్డాయి. కోవిడ్ తరువాత కోలుకుంటున్న పర్యాటక రంగం కుదేల యింది. అమెరికా పథకం ప్రకారమే క్యూబా సమాజాన్ని ఒత్తిడి లోనికి నెట్టి వేసింది. క్యూబాతో వాణిజ్యం చేసే దేశాలు, సంస్థలపై ద్వితీయ శ్రేణి ఆంక్షలకూ సిద్ధమైంది. ఈ సంక్షోభం నుండి క్యూబా సమాజంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్యుద్ధం, తిరుగుబాటు కోసం యూఎస్ వేచి చూస్తుండవచ్చు.మూడు శక్తులు ‘ఒక్కటైతే’?నాణ్యమైన విద్య, వైద్యాన్ని చౌకగా అందించటంలో విజయం సాధించిన క్యూబా ఈ ఆర్థిక యుద్ధాన్ని ఎదుర్కోవటం కష్టమే. రష్యా, చైనా ఆర్థికంగా, సైనికపరంగా ప్రత్యక్షంగా క్యూబాకు దన్నుగా ఉండటం సందేహాస్పదమే. చైనా సౌర విద్యుత్ పలకల సరఫరా ద్వారా క్యూబా విద్యుత్ గ్రిడ్‌ను స్థిరీకరించటానికి ప్రయత్ని స్తున్నది. దీర్ఘకాలంలో మాత్రమే క్యూబా ఈ రంగంలో విజయం సాధించగలుగుతుంది. కానీ క్యూబాకు అంత సమయం లేదు. మెక్సికో లాంటి పొరుగు దేశాలు ఆహారం, మందులు, మానవతా సహాయం చేస్తున్నా, అవి యూఎస్‌ను ఎదిరించి క్యూబాకు సహాయ పడే సాహసం చేయలేవు. రష్యా ప్రస్తుత దృష్టి ఉక్రెయిన్‌పై, నాటోపై ఉన్నది. చైనా దృష్టి తైవాన్‌పై ఉన్నది. తైవాన్, ఉక్రెయిన్ విషయంలో అమెరికా మెతక వైఖరికి సిద్ధపడితే, ప్రతిగా రష్యా, చైనా మధ్య ప్రాచ్యం, కరేబియన్ ప్రాంతాల నుండి తమ దృష్టిని పూర్తిగా మరల్చ టానికి సిద్ధపడవచ్చును. దీనినే ‘గ్రేట్ పవర్స్ బార్గెయిన్’ అని పిలుస్తారు.బహుశా రష్యా, చైనాలతో లోపాయికారీ అంగీకారంతో క్యూబాపై ట్రంప్ పూర్తి స్థాయిలో దాడి చేయవచ్చు. కానీ క్యూబా గెరిల్లా పోరాట సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు. పెద్ద మొత్తంలో రక్తపాతం సంభవిస్తుంది. క్యూబా నుండి పెద్ద మొత్తంలో యూఎస్‌కు వలసలు జరగవచ్చు. యూఎస్ ఈ రెండు పరిణా మాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో క్యూబన్ సంతతికి చెందినవాడు. ఈ పరిణామాలపై పూర్తి అవగాహన ఉండి ఉంటుంది. క్యూబాలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి రావుల్ కాస్ట్రో అంగీకరిస్తే సమస్యకు శాంతియుత పరిష్కారం లభించినట్లవుతుంది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు-గురజాల శ్రీనివాసరావు -
నవ భారతంలో నరేంద్ర శకం
నరేంద్ర మోదీ అనుకోకుండా రాబర్ట్ ఫ్రాస్ట్ సిద్ధాంతాన్ని నమ్మినట్టున్నారు: అందరూ వెళ్లే దారిని కాకుండా అతి తక్కువ మంది పయనించే మార్గాన్నిఎంచుకున్నారు. బహుశా అదే నేటి మార్పులకు దారితీసి ఉంటుంది.జవహర్లాల్ నెహ్రూ, నరేంద్ర మోదీ ద్వారా భారత ప్రధానమంత్రిత్వం రెండు విభిన్న శకాలను ఆవిష్కరించింది. ప్రతి శకానికీ తనదైన పరిమితులు, అవకాశాలు, ఆశయాలున్నాయి. నెహ్రూ ఒక దుర్బల, సరికొత్త సార్వభౌమాధికార సముపార్జిత దేశానికి నాయకత్వం వహించారు. మోదీ వంతు వచ్చేసరికి ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కొంటూ, సువిశాల, డిజిటల్ నెట్వర్క్ అను సంధానిత, అత్యంత పోటీతత్వ ప్రజాస్వామ్యానికి నేతృత్వం వహించాల్సి వచ్చింది. దిగువ నుంచి ఎగువకు!నెహ్రూ పాలనా విధానానికి ఎగువ నుంచి దిగువకు సంస్థల రూపకల్పన, ప్రభుత్వ నిర్దేశిత ఆర్థిక వ్యవస్థ కేంద్రస్థానంలో ఉన్నాయి. దేశ విభజన తర్వాత చెల్లాచెదురైన దేశాన్ని కూడదీసుకునే క్రమంలో ఇది సముచిత విధానమే అయినప్పటికీ, ఇది కేంద్రీకృత నియంత్రణకు దారితీసింది. తద్వారా పౌరులను దేశ ప్రగతిలో భాగ స్వాములుగా కాకుండా, లబ్ధిదారులుగా మాత్రమే పరిగణించింది.మోదీ విధానం ఆ తర్కాన్ని ఆమూలాగ్రం మారుస్తూ– ఆత్మ గౌరవం, అవిశ్రాంత పనితీరు మేళవింపుతో పాలనను ప్రజా ఉద్య మంగా రూపుదిద్దింది. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ సూత్రాన్ని అనుసరించింది. ఆ మేరకు బ్యాంకు ఖాతాలు, ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డీబీటీ), గ్యాస్ కనెక్షన్లు,గృహ నిర్మాణం, మరుగుదొడ్లు, ‘ఎక్స్‌ప్రెస్‌వే’ల నిర్మాణం, సంక్షేమ పథకాల డిజిటలీకరణ వంటి ‘దిగువ నుంచి ఎగువకు’ పద్ధతిలో సత్ఫలితాల సాధనతోపాటు విశ్వాసాన్ని కూడా పెంచుకుంది.ఈ రెండు శకాల నడుమ గల పరిమాణమే ఇక్కడ ప్రధాన వ్యత్యాసం. దేశ జనాభా దాదాపు 34 కోట్లుగా ఉండి, రాజకీయ పార్టీల మధ్య నామమాత్రపు పోటీ ఉన్న తరుణంలో నెహ్రూ పదవీ బాధ్యతలు చేపట్టారు. జనాభా 131 కోట్లు దాటి, వేలాది నమోదిత పార్టీల మనుగడతోపాటు సార్వత్రిక ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లోవందలాది పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన రాజకీయ వ్యవస్థలో మోదీ ప్రధాని అయ్యారు. భారత తొలి సార్వత్రిక ఎన్నిక లలో ఓటర్ల సంఖ్య సుమారు 17 కోట్లు మాత్రమే కాగా, 2014 నాటికి 83 కోట్లు దాటి, 2024కల్లా మరింత పెరిగింది.పునాది–విస్తరణనెహ్రూ నమూనా ప్రాథమిక పరిశ్రమలను, శాస్త్రవిజ్ఞాన సంస్థ లను ఆర్థికంగా పెంచిపోషించింది. అయితే, ‘హిందూ వృద్ధి రేటు’గా ప్రాచుర్యంలోకి వచ్చిన 3–4 శాతం స్థాయికే అది పరి మితమైంది. కానీ మోదీ నేతృత్వంలోని భారత దేశం కోవిడ్–19, ద్రవ్యోల్బణ ఉధృతి, సరఫరా వ్యవస్థల్లో ఒడిదుడుకులు, భౌగో ళిక–రాజకీయ సంఘర్షణల పీడిత దశాబ్దంలోనూ 6.5–7 శాతం సగటు వృద్ధితో ప్రపంచ ప్రగతికి చోదకశక్తిగా రూపొందింది. 2014–24 మధ్య జాతీయ రహదారులు 54,000 కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. దీంతో రవాణా వ్యవస్థ ఒక సమస్య స్థాయి నుంచి పోటీతత్వ సాధనంగా మారింది. మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ మార్గాలైన యూపీఐ చెల్లింపులు, ఆధార్ ఆధారిత సేవా ప్రదానం వంటివి విధాన ప్రకటనకూ–పౌరులపై దాని ప్రభావానికీ మధ్య అంతరాన్ని తగ్గించాయి.ఐఐటీలు, ఎయిమ్స్ వంటి సంస్థాగత మూల స్తంభాలతో నెహ్రూ ఒక బలమైన పునాది వేశారు. ఇవి దేశ విజ్ఞానార్థిక వ్యవస్థకు బీజావాపనం వేశాయి. మోదీ పాలన సామూహిక విస్తరణకు ప్రాధాన్యమిస్తూ ఐఐటీల సంఖ్యను 23కు, ఐఐఎంలను 21కి, ఎయి మ్స్లను 23కు పెంచింది. ప్రతిష్ఠాపనతో విస్తరణను ముడిపెట్టే ఈ ద్వంద్వ విధానం, ఆకాంక్షలనే విధానోపకరణంగా పరిగణించే రాజ కీయ దృక్కోణానికి ప్రతీకగా నిలిచింది.మోదీ హయాంలో మంత్రిమండలి కూర్పు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రాతినిధ్యాన్ని అసాధారణ స్థాయికి చేరుస్తూ సామాజికంగా ఆ వర్గాలను ముందుకు తెచ్చింది. మహిళా ప్రాతినిధ్యం 1950ల నాటి ఏకాంక స్థాయి నుంచి ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ ద్వారా మూడింట ఒక వంతు రిజర్వేషన్‌కు శాసనబద్ధ మార్గాన్ని ఏర్పరచింది. అంటే, నామమాత్రపు సార్వజనీనత నుంచి నిర్మాణాత్మక హామీల దిశగా మార్పును ఇది సూచిస్తుంది.నెహ్రూ అనుసరించిన అలీన విధానం సూత్రబద్ధమైనదే అయినా, రెండు ధ్రువాల ప్రపంచంలో తరచూ ఒంటరిగా ఉండి పోయింది. ఇది భౌతిక ప్రతిష్ఠకన్నా నైతిక నేతృత్వంపైనే ఎక్కువగా ఆధారపడింది. కాగా, మోదీ విధానం బహుళ అనుసంధాన లావా దేవీల స్వభావంతో కూడినది. అమెరికా, రష్యా, యూరప్, గల్ఫ్ సహా వర్ధమాన దేశాలతోనూ ఏకకాలంలో సంబంధాలు నెరపుతూ భారత విపణి, సాంకేతిక పరిజ్ఞాన డిమాండ్ సహా ప్రవాస భారతీయుల ప్రభావాన్ని కూడా ఇది బేరసారాల ఉపకరణంగా మారుస్తుంది.తొలిసారి భారత్, పాకిస్తాన్ యుద్ధం నుంచి 1962లో చైనాతో యుద్ధం దాకా ‘శాంతియుతమైనది’గా గుర్తుచేసుకునే నెహ్రూ పాలన అనేక సంఘర్షణలకు సాక్షిగా నిలిచింది. మోడీ సిద్ధాంతాన్ని పరికిస్తే – అనిశ్చిత పొరుగు ప్రాంతాల్లో భారత్ తన పూర్తిస్థాయిసంప్రదాయ యుద్ధ నివారణ, నిరోధక శక్తిసామర్థ్యాలను వ్యూహా త్మక ప్రతిస్పందన, సునిశిత సరిహద్దు నిర్వహణలతో జోడించింది. ఇక్కడ ప్రమాదమే లేదని కాదు, దేశీయంగా ఆధునికీకరణ కొనసాగు తున్న తరుణంలో భద్రతా వాతావరణ స్థిరత్వాన్ని ఇది సూచిస్తుంది.కాలానికి తగిన నాయకుడుస్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో పీఎల్–480 పథకం కింద ‘ఓడ నుంచి విస్తరిలోకి’ అనే దిగుమతి పరాధీనత ఉండేది. ఇప్పు డది సమసిపోయి, దాదాపు 80 కోట్ల మంది పేదలకు ఉచిత ధాన్యం సరఫరా చేసే ‘పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ అమలు స్థాయికి భారత్ దూసుకెళ్లింది. మరోవైపు జాతీయంగా ఒక ప్రధాన వ్యవ సాయ ఉత్పత్తిదారుగానూ, అంతర్జాతీయంగా ఎగుమతిదారుగానూ ఎదుగుతోంది. పదవీ కాలాన్ని కొలబద్దగా పరిగణించినా, మోదీ హయాం ఓ కీలక మలుపు. ఇది ఇందిరాగాంధీ సుదీర్ఘ నిరంతరాయ పదవీ కాలాన్ని అధిగమించి, నెహ్రూ అనుసరించిన నిరంతర సేవా ప్రమా ణానికి చేరువవుతూ వచ్చింది. రాష్ట్ర, జాతీయ స్థాయి పదవులకు ఎన్నికైన ప్రభుత్వాధినేతగా దేశంలోనే అత్యంత సుదీర్ఘ సంచిత పదవీ కాలపు రికార్డును మోదీ పాలన ఇప్పటికే బద్దలు కొట్టింది. అయితే, ఈ ప్రాధాన్యం రోజుల సంఖ్యకు అతీతంగా దాని సంచిత ప్రభావంలో కనిపిస్తుంది.వేర్వేరు కాలాల్లో విభిన్న నాయకత్వ అవసరం ఏర్పడింది. తదనుగుణంగా తొలినాళ్ల నాయకత్వం చట్రాన్ని రూపొందిస్తే, మలినాళ్ల నేతృత్వం దాని ఆధారంగా ఉపరితల నిర్మాణానికి ఉపక్రమించి రహదారులను విస్తరించి, దేశాన్ని డిజిటలీకరణతో అనుసంధానించి, ఆ ప్రగతి ప్రకాశాన్ని ప్రపంచం నలుమూలలా ప్రసరించేలా చేసింది. సార్వజనీనత, సేవా ప్రదానం, మౌలిక సదుపాయాల కల్పన, బేరసారాల సామర్థ్యం తదితర ప్రమాణాల ప్రాతిపదికన చూస్తే – మోదీ నిస్సందేహంగా అత్యంత ప్రభావశీల ప్రధానమంత్రిగా నిలుస్తారు. కోట్లాది భారతీయుల దృక్కోణంలో మోదీ ఈ దేశానికి అత్యంతావశ్యక సమర్థ నేతగా నిలిచారు. - సుహేల్ సేథ్వ్యాపారవేత్త, కాలమిస్ట్; ‘కౌన్సెలేజ్ ఇండియా’ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు–మేనేజింగ్ పార్ట్నర్ -
అపచారం... దైవద్రోహం
‘ధర్మో రక్షతి రక్షిత:’ అనే వేదోక్తి ప్రకారం, మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని సర్వకాలాలా కాపాడుతుంది. అయితే, గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల భూములు, పవిత్ర ప్రసాదాలు, వైదిక సంప్రదాయాల నిర్వ హణపై జరుగుతున్న పరిణామాలు, వివాదాలు కోట్లమంది హైందవ భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నాయి. రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో దాదాపు 4 లక్షల ఎకరాల ఆలయ భూములు విస్తరించి ఉన్నాయి. దురదృష్టవశాత్తూ ఒక లక్ష ఎకరాల నుండి మాత్రమే దేవునికి నియమిత ఆదాయం లభిస్తోంది. మిగిలిన భూముల్లో సుమారు 87,000 ఎకరాలు ఆక్రమణల పాల య్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇలాంటి గడ్డుకాలంలో, కూటమి ప్రభుత్వం పారదర్శకమైన బహిరంగ వేలం నిర్వహించ కుండా, విలువైన దేవాలయ భూములను 33 ఏళ్ల సుదీర్ఘ కాలానికి నామమాత్రపు అద్దెకు ప్రైవేటు సంస్థలకు, తమ తాబేదారులకు లీజుకు ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఇది దైవద్రోహం కాదా? గత 2014–19 టీడీపీ హయాంలోనూ సదావర్తి సత్రం భూములను ఇదే రీతిన అప్పగించే ప్రయత్నం చేయగా, అప్పట్లో న్యాయస్థానం జోక్యంతో అది ఆగింది.సంస్కృతికి ద్రోహం – గోసంరక్షణ వైఫల్యంహైందవ ధర్మంలో గోమాత అత్యంత పవిత్రమైనది. కానీ ప్రస్తుత పాలనలో గోసంరక్షణ పూర్తిగా అటకెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ గోవధ శాలలు విచ్చలవిడిగా పెరిగిపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. 2025 నవంబరులో విజయవాడలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గోపూజలు నిర్వహించి దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. అయినా దున్నపోతుపై వర్షం కురిసిన చందాన ప్రభుత్వం వ్యవహరిస్తోంది.మరోవైపు, తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో వంద లాది ఆవులు రోగాల బారిన పడి మృత్యువాత పడటం కలకలం రేపింది. టీటీడీ ఈవో 43 ఆవులు చనిపోయాయని చెబితే, చైర్మన్ 22 అని, ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు ‘చావులే లేవు’ అని ప్రకటించడం భక్తులను పక్కదారి పట్టించడమే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో శ్రీవారి కైంకర్యాలకు, అభిషేకాలకు స్థానిక గోశాలల నుండి రోజుకు 1,700 లీటర్ల స్వచ్ఛమైన పాలు తిరుమలకు వెళ్లేవి. ప్రస్తుత పాలనలో కనీసం 500 లీటర్ల పాలు కూడా రావడం లేదన్నది సత్యం.2024 ద్వితీయార్ధంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడారంటూ, చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువు లను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఎలాంటి పూర్తిస్థాయి దర్యాప్తు, స్వతంత్ర సంస్థల నివేదికలు రాకముందే, కేవలం రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి ప్రసాదంపై అపవిత్రమైన అసత్య ప్రచారాలు చేశారు.లబ్ధి కోసం నీచ రాజకీయాలుమరింత హేయమైన అంశం ఏంటంటే – గ్రామీణ ప్రాంతా లలో పురాతన దేవాలయాల పునరుద్ధరణ, ధర్మ ప్రచారం, భజన మందిరాల స్థాపన అనే ఉన్నత ఆశయంతో జగన్ ప్రభుత్వం ‘శ్రీవాణి’ పథకాన్ని ప్రారంభించింది. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ నూతన చైర్మన్ బి.ఆర్. నాయుడు ఈ పథకాన్ని ఒక ‘క్లాసికల్ ఫ్రాడ్’ (పెద్ద స్కామ్) అని అభివర్ణిస్తూ, దీనిని రద్దు చేస్తామని ప్రకటించారు. ఆశ్చర్యకరంగా, ఆ మాటలు కేవలం రాజకీయ వేదికలకే పరిమితమయ్యాయి.ప్రస్తుతం అదే శ్రీవాణి పథకాన్ని రద్దు చేయకపోగా, మరింత విస్తరిస్తున్నారు. రద్దు చేస్తామన్న పథకాన్ని కొనసాగించడం వెనుక ఉద్దేశం, పారదర్శక తను పక్కనబెట్టి దళారీ వ్యవస్థకు పెద్దపీట వేయడమే. శ్రీవాణి టికెట్లు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జారీలో జరుగుతున్న అక్రమాలకు అంతులేకుండా పోయింది. సామాన్య భక్తునికి సమాన హక్కులతో కూడిన దైవ దర్శనం కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ఆచార్య రాణి సదాశివమూర్తిని నిబంధనలకు విరుద్ధంగా పదవి నుండి తొల గించడానికి పాలకమండలి తీర్మానం చేయడం హేయమైన అంశం. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన 700 ‘వేద పారాయణదార్ల’ (శ్రీవారి వేద పారాయణ పథకం) పోస్టుల భర్తీలో స్థానిక వేదపండితులను కాదని, నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు.భద్రతా లోపాలు – ఆలయాల కూల్చివేతలుఅలాగే, తిరుమలలోని పరకామణి (కానుకల లెక్కింపు) విభా గంలో గతంలో రోబోటిక్ టెక్నాలజీని ప్రవేశపెట్టి దొంగతనాలను అరికట్టగా, ఇప్పుడు పాత విషయాలను రాజకీయం చేస్తూ ఆలయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారు. ఇటీవల జరిగిన చెన్నై పరకామణి అక్రమంపైగానీ, తిరుమల పరకామణి చోరీపైగానీ... ఇటు తితిదే, అటు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. మరోవైపు, తెలుగుసంస్కృతికి వెన్నెముకలైన హరికథ, కూచిపూడి వంటి సాంప్రదాయ కళారూపాల విభాగాలను మూసివేయడం తితిదే విద్యా వ్యవస్థకే తీరని కళంకం.గత రెండేళ్ల కాలంలో వివిధ ప్రముఖ ఆలయాలలో జరిగిన ప్రమాదాలు భక్తుల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తు న్నాయి: తిరుపతిలో వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు జరిగిన ఘోరమైన తొక్కిసలాటలో 6 గురు భక్తులు మృతి చెందారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ముఖ్యమంత్రివర్యులు గతంలో గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో కనీసం మొసలి కన్నీరైనా కార్చారు. కానీ ఇక్కడ, భక్తుల అత్యుత్సాహమే దానికి కారణమని చర్చ లేవదీశారు. అసలు బాధ్యులపై చర్యలు చేపట్టకపోవడం ఘోరమైన తప్పిదం.సింహాచలం అప్పన్న కొండపై రక్షణ గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టి నంత ఆవేదన కూడా కలగలేదు. శ్రీకూర్మం ఆలయంలో విష్ణు అవ తారంగా భావించే పవిత్ర నక్షత్ర తాబేళ్లు చనిపోతే, కనీసం పోస్ట్ మార్టం కూడా లేకుండా దహనం చేశారు. కాశీబుగ్గలో 9 మంది భక్తులు మరణిస్తే ప్రభుత్వం ఏమాత్రం చలించలేదు. వీటికి తోడు, కడపలో కాశీ నాయన జ్యోతి క్షేత్రం గోశాలను, అన్నదాన సత్రాలను అటవీ శాఖ బుల్డోజర్లతో కూల్చివేయడం, నెల్లూరు, నరసరావు పేటలో రోడ్డు విస్తరణ పేరుతో ఆలయ నిర్మాణాలను తొలగించడం ఎంతటి అమానుషం!జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పీఠాధిపతుల సదస్సును వైభవంగా నిర్వహించి, వారిచ్చిన సూచనలతో తిరుమలపై అన్య మతస్థులు హిందూమతం స్వీకరించటానికి ఓ వేదిక ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ప్రభుత్వాలు మారవచ్చు, పాలకులు మారవచ్చు... కానీ శాశ్వతమైన ధర్మసూత్రం ఎప్పటికీ చెరిగిపోదు. భగవంతుని ఆస్తులను, భక్తుల నమ్మకాన్ని సంపూర్ణంగా కాపాడ టమే నిజమైన రాజధర్మం. కానీ ఆలయాల పవిత్రతను, భక్తుల విశ్వాసాన్ని వ్యాపార వస్తువులుగా మార్చి, భగవంతుని సంపదను ధార్మిక కార్యాలకు ఉపయోగించకుండా, స్వార్థ రాజకీయాలకు వనరుగా మార్చిన ఘనత చంద్రబాబుది. అయితే మోసం అనే దట్టమైన చీకటి మేఘాలు ఎంతగా కమ్మేసినా, సత్యం అనే సూర్య కాంతి చివరికి వాటిని ఛేదించుకుని వెలుగులోకి రావడం ఖాయం.-వ్యాసకర్త టీటీడీ పూర్వ అధ్యక్షులు-భూమన కరుణాకర రెడ్డి -
విద్యావ్యవస్థ : చైనాలో అలా.. ఇక్కడిలా!
ఒకే వయసు, ఒకే ప్రతిభ, ఒకే కలలు కంటున్న పిల్లల మధ్య భవిష్యత్తు పూర్తిగా వేరుగా ఉండటానికి కారణం ఒక్కటే – చదివే స్కూల్. ఇది సాధారణ విద్యా వ్యత్యాసం కాదు, కొత్త అసమానతల అగాథం. పిల్లల మధ్య పోటీ ఇప్పుడు 10వ తరగతిలో కాదు, ఎల్కేజీలోనే మొదలవు తోంది. ధనికుల పిల్లలు ఇంటర్నేషనల్ స్కూళ్లలో గ్లోబల్ ఎక్స్‌పోజర్‌తో చదువుతుంటే, మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు భారీ ఫీజులు, రుణాలు చెల్లించి ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా విద్య అనేది పెట్టుబడిగా కాకుండా రుణ ఉచ్చుగా మారుతోంది. ఇది ‘ఎవరు బాగా చది వారు’ అనే పోటీ కాదు, ‘ఎవరు మంచి ప్రారంభ స్థానం పొందారు’ అనే అసమాన పోటీగా మారింది. 1990ల తర్వాత జనాభా పెరిగింది, చదువు మీద ఆసక్తి పెరిగింది. కానీ ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు సకాలంలో విస్తరించలేదు. ఇంగ్లీష్ మీడియం ఆలస్యంగా ప్రవేశ పెట్టింది. ఈ ఖాళీని ప్రైవేటు రంగం పూరించింది. ఏసర్ 2024 ప్రకారం 6–14 వయసు పిల్లల్లో ప్రభుత్వ స్కూళ్ల ఎన్రోల్మెంట్ 66.8 శాతానికి పడిపోయింది (2022లో 72.9%, 2018లో 65.6%). తెలంగాణలో యూడీఐఎస్ఈ 2024–25 డేటా ప్రకారం, క్లాస్ 1లో ప్రభుత్వ స్కూళ్ల ఎన్రోల్మెంట్ 26 శాతానికి పడిపోయింది. 2013–14తో పోలిస్తే 40 శాతం తగ్గుదల. ప్రైవేటు స్కూళ్లలో విద్యా వంతులైన తల్లిదండ్రులు, హోమ్ సపోర్ట్, సెలెక్టివ్ అడ్మిషన్స్ ఉంటాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్, పేదరికం, ఆరోగ్య–పోషకాహార సమస్యలు ఉన్న పిల్లలు ఎలాంటి సెలెక్షన్ లేకుండా చేరుతారు. ‘నీళ్లు ఉన్న చోట ఎవరైనా పంట పండించ వచ్చు. ఎడారిలో పంట పండించడం కష్టం’ అన్న సూక్తి ఇక్కడ పూర్తిగా వర్తిస్తుంది. సమస్య ప్రభుత్వ స్కూళ్ల వైఫల్యం కాదు, వ్యవస్థ డిజైన్, అమలు, పెట్టుబడి లోపాల్లో ఉంది. ఒకప్పుడు రైతు కొడుకు డాక్టర్ అయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు పుట్టిన కుటుంబం భవి ష్యత్తును చదువు నిర్ణయిస్తోంది.విద్యా వర్గ విభజనవరల్డ్ బ్యాంక్ అధ్యయనాల ప్రకారం భారతదేశంలో అంతర్ తరం సామాజిక గతిశీలత (ఒక సామాజిక వర్గం నుంచి మరొక వర్గానికి ఎదగడం) నాలుగు దశాబ్దాలుగా స్థిరంగా ఉంది. పేద కుటుంబాల నుంచి ఉన్నత స్థాయికి ఎక్కడం అరుదైన విషయం. ఇది క్లాస్ లాక్–ఇన్‌కు (వర్గ బంధనం) దారి తీస్తోంది. ఇలా కొనసాగితే మన సమాజం అవకాశాలు కలిగినవారు, అవకాశాలు కోల్పోయినవారు అనే రెండు భాగాలుగా విడిపోయే ప్రమాదముంది.చైనాలో విద్యా వ్యవస్థ ద్వారా అన్ని వర్గాల విద్యార్థులు నాణ్య మైన విద్యను పొందుతున్నందున వారు ఆర్థిక వ్యవస్థకు భారీగా దోహద పడుతున్నారు. కానీ మన దేశంలో మిడిల్ క్లాస్, పేద వర్గాల విద్యార్థులు సమాన అవకాశాలు లేకపోవడం వల్ల చైనా విద్యార్థులతో పోలిస్తే చాలా తక్కువగా జీడీపీకి దోహదపడుతున్నారు. ఇది దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వృద్ధిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అందుకే మన విద్యావ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు కావాలి. అన్ని వర్గాల పిల్లలు ఒకే స్కూల్లో చదివే కామన్ స్కూలింగ్ సిస్టమ్ ఉండాలి. దానికి తగినట్టుగా ఆధునిక మౌలిక వసతులు, ఉపాధ్యాయ శిక్షణ, పెట్టుబడుల పెంపు అవసరం. ‘క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ – నాట్ ఫర్ ది ప్రివిలేజ్డ్’ అన్నది మన మార్గదర్శక సూత్రం కావాలి.చైనాలో విద్యావ్యవస్థ ద్వారా అన్ని వర్గాల విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందుతున్నందున వారు ఆర్థిక వ్యవస్థకు భారీగా దోహద పడుతున్నారు. -డా. మేడా జగన్మోహన రావు వ్యాసకర్త విద్యారంగ నిపుణులు -
పోక్సో చట్టం : బాలల పాలిట రక్షణ కవచం
దేశంలో ఇటీవల ‘పోక్సో’ చట్టం (POCSO Act 2012) గురించిన ప్రస్తావన తరచూ వినిపిస్తోంది. ఇందుకు కారణం బాలలపై అత్యాచారాలు పెరిగి పోవడమే. 2012 నవంబర్ నుండి అమలులోకి వచ్చిన ఈ ప్రత్యేక చట్టం పాత విచారణ పద్ధతిని పూర్తిగా మార్చి, పిల్లల మానసిక స్థితికి ప్రాధాన్యత ఇచ్చే సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. పిల్లలకు ఉండే ప్రత్యేక మానసిక, శారీరక బలహీనతలను గుర్తించి, వారికి రక్షణ కల్పించడమే ఈ చట్టం ముఖ్యోద్దేశం. ఈ చట్టంలోని సెక్షన్ 29, 30ల ప్రకారం, నేరానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలను ప్రాసిక్యూషన్ కోర్టుముందు ఉంచినట్లయితే, నిందితుడే తప్పు చేశాడనే చట్టపరమైన ఊహను కోర్టు చేస్తుంది. దీనివల్ల నిందితుడే తాను నిర్దోషినని నిరూపించుకోవలసి ఉంటుంది. ఈ విధానం నేరస్థులు చట్టపరమైన లొసుగుల నుండి తప్పించుకోకుండా అడ్డుకట్ట వేసింది.18 సంవత్సరాలలోపు పిల్లలకు ఈ చట్టం కల్పించే రక్షణలు బలమైనవి, రాజీలేనివి. మొదటిది, ఈ చట్టం 18 సంవత్సరాల వయస్సును స్పష్టమైన పరిమితిగా నిర్ణయించింది. మైనర్ పిల్లలు లైంగిక చర్యకు సమ్మతి తెలపడానికి చట్టబద్ధంగా అర్హులు కాదనీ, అందువల్ల పిల్లల ఇష్టపూర్వకంగానే ఇది జరిగిందనే వాదనకు చట్టంలో తావులేదనీ స్పష్టం చేసింది. రెండవది, ఈ చట్టం బాలురకు, బాలికలకు సమానమైన రక్షణను కల్పిస్తూ పూర్తి లింగ సమతుల్యతను పాటించింది. మూడవది, సెక్షన్ 19 ప్రకారం పిల్లలపై జరిగే వేధింపులను ఉపాధ్యాయులు, వైద్యులు లేదా పొరుగువారు ఎవరైనా గుర్తిస్తే వెంటనే అధికారులకు నివేదించడాన్ని తప్పనిసరి చేసింది. అలా సమాచారం ఇవ్వడంలో విఫలమైతే అది కూడా నేరంగా పరిగణించబడుతుంది. చివరగా, విచారణ సమయంలో పిల్లలు భయాందోళనలకు గురికాకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. పోలీసు అధికారులు సాధారణ దుస్తులలోనే పిల్లలను విచారించాలి, కోర్టు విచారణలు రహస్యంగా (ఇన్–కెమెరా) జరగాలి. పిల్లలు నిందితుడిని నేరుగా ఎదుర్కొనే అవసరం లేకుండా సాక్ష్యం చెప్పేలా ఏర్పాట్లు చేయాలి.ఇదీ చదవండి: బిడ్డల్ని వదిలేసి, డబ్బు, స్కూటర్ తీసుకొని ప్రియుడితో పరార్మార్పులు, సవరణలు పార్లమెంటు ఈ చట్టానికి కాలక్రమేణా కీలకమైన సవరణలను చేసింది. 2019 సవరణ ద్వారా తీవ్రమైన లైంగిక దాడులకు పాల్పడే వారికి మరణశిక్షను విధించే నిబంధనను తెచ్చారు. కనీస జైలుశిక్షను 7 ఏళ్ల నుండి 10 ఏళ్లకు పెంచారు. డిజిటల్ మాధ్య మాలలో పిల్లల లైంగిక చిత్రాలను ఉంచడం లేదా నిల్వ చేయడాన్ని నేరంగా పరిగణించారు. జూలై 2024లో భారతీయ న్యాయ సంహిత అమలులోకి వచ్చిన తర్వాత, ఈ చట్టాన్ని డిజిటల్ యుగానికి అనుగుణంగా మార్చారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా సృష్టించే డీప్‌ఫేక్‌లు, ఆన్లైన్ వేధింపులు, డిజిటల్ దోపిడీల నుండి పిల్లలను రక్షించేలా మరిన్ని కఠినమైన నిబంధన లను చేర్చారు. ఈ చట్టపరమైన మార్పులకు భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు మరింత బలాన్ని చేకూర్చాయి.చారిత్రాత్మక ‘ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్‌ఆఫ్ ఇండియా (2017)’ కేసులో, 15 నుండి 17 సంవత్సరాల మధ్య ఉన్న మైనర్ భార్యలతో భర్తలు జరిపే లైంగిక చర్యలను అత్యాచారంగా పరిగణించాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అదేవిధంగా, 2021 నాటి ‘అటార్నీ జనరల్ వర్సెస్ సతీష్’ కేసులో (ద స్కిన్ టు స్కిన్ కేసు), బట్టలపై నుండి తాకడం వల్ల అది లైంగిక దాడి కిందకు రాదన్న బొంబాయి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. చట్టంలో ముఖ్యంగా కావలసింది నేరస్థుడి ‘లెంగిక ఉద్దేశ్యం’ మాత్రమేననీ, దుస్తులు అనేవి నేరస్థుడికి రక్షణ కవచాలుగా మారకూడదనీ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.– ఎస్. అక్బర్, ఎస్.ఎఫ్.ఐ. తిరుపతి జిల్లా కార్యదర్శి ఇదీ చదవండి : ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సునామీ : ఎవరీ అభిజీత్? -
‘ఏయూ శతాబ్ధి ఉత్సవాల్లో చారిత్రక తప్పిదం’
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వార్షికోత్సం జరుగుతున్నందుకు సంతోషమే. ఈ సందర్భంలో ఈ యూనివర్శిటీ స్థాపన జరిగిన తీరు, అందుకు కృషి చేసిన మహానుభావులను స్మరించుకోవడం అవశ్యం. లక్షలాది మంది విద్యార్ధులకు విద్యావకాశాలు కల్పించిన ఆంధ్ర యూనివర్శిటీ ఇప్పటికీ సమున్నతంగా వెలుగుతోంది. శతాబ్ది ఉత్సవాలలో ప్రసంగించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు కొన్ని చారిత్రక అంశాలను ప్రస్తావించినట్లు కనిపించలేదు. అందుకే చరిత్ర కొంత గుర్తు చేయడం అవసరం అనిపిస్తోంది..ఈ యూనివర్శిటీని స్థాపించడానికి పానగల్ మహారాజు కారణమని చెప్పాలి. ఈయన గొప్పదనం గురించి అతిధులు మాట్లాడినట్లు కనిపించలేదు. ఆంధ్ర విశ్వ విద్యా పరిషత్తు ను స్థాపించాలని కోరుతూ ప్రఖ్యాత స్వాతంత్ర యోధులు, తెలుగు నేతలు ప్రకాశం పంతులు ,కొండా వెంకటప్పయ్య పంతులు తదితరులు ఆంధ్ర మహాసభల ద్వారా ప్రజలను చైతన్యపరచేవారు. ఆ దశలో పానగల్లు రాజా పానుగంటి వెంకట రాయనం మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా (1925- 28) ఎన్నికయ్యారు. ఆయన చొరవ చూపించి, ఆంధ్ర నేతల డిమాండ్ ను పరిగణనలోకి తీసుకుని ఆంధ్ర యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ ప్రతిపాదనను తమిళ ప్రజా ప్రతినిధులు వ్యతిరేకించినా ఈయన ముందుకు తీసుకువెళ్లారు. ఈ యూనివర్శిటీని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న చర్చ వచ్చినప్పుడు కొంతమంది రాయలసీమను సూచించారు. కాని అన్నిటిని పరిగణనలోకి తీసుకున్న పానగల్ రాజా దీనిని విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం తన రాజకీయ ప్రత్యర్ధి అయిన సర్ సీఆర్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి సహకరించాలని కోరారు. అప్పటికే ప్రముఖ విద్యావేత్తగా పేరొందిన సీఆర్ రెడ్డి అందుకు అంగీకరించడంతో ఈ యూనివర్శిటీ ఏర్పాటు సాధ్యమైంది. తొలి వీసీగా ఉండాలని రాజా కోరడం, సీఆర్ రెడ్డి సిద్దపడడం విశేషం. ఈ సందర్భంగా సీఆర్ రెడ్డి పానగల్ రాజాగారికి ఒక సలహా ఇచ్చారు. యూనివర్శిటీ పెట్టాలంటే కాలేజీలు అవసరం అని.. కాలేజీలకు హైస్కూళ్లు అత్యవసరం అవుతాయని చెప్పారు. ఈ కారణంగా ప్రతి తాలూకా కేంద్రంలో ఒక హైస్కూలును ఏర్పాటు చేయాలన్న సీఆర్ రెడ్డి సలహాను పానగల్ రాజా గారు పాటించారు. (అప్పట్లో కృష్ణా జిల్లాలో బందరు, విజయవాడల్లో హైస్కూళ్లు ఉండేవి. రాజా గారి నిర్ణయం కారణంగా ప్రతి తాలూకా కేంద్రంలో ఒక హైస్కూల్ ఏర్పాటైంది.) ఈ చర్య వల్ల ఆంధ్ర ప్రాంతంలో విద్యావ్యవస్థకు బలమైన పునాది పడింది.తదుపరి 1926లో యూనివర్శిటీ ఏర్పాటు జరిగింది. మౌలిక వసతులు వచ్చేవరకు తాత్కాలికంగా విజయవాడలో నిర్వహించి తదుపరి విశాఖకు తరలించారు. సీఆర్ రెడ్డి తర్వాత ప్రముఖ విద్యా వేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ వైస్ చాన్సలర్‌గా నియమితులై అనన్యమైన సేవలు అందించారు. తదనంతర కాలంలో ఆయన రాష్ట్రపతి అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి మహనీయుల కృషి వల్ల కోస్తా, రాయలసీమలలోని పలు జిల్లాలలో కాలేజీలు హైస్కూళ్లు స్థాపితం అయ్యాయి. ఇందుకు పలువురు జమిందార్ రాజాలు కూడా సహకరించారు. పర్లాకిమిడి జిల్లాలోని జైపూర్ మహారాజు విక్రమ్ దేవ్ విశాఖలో యూనివర్శిటీ భవనాల నిర్మాణానికి ఆర్ధిక సాయం చేశారు. అందుకు కృతజ్ఞతగా యూనివర్శిటీ ప్రాంగణంలో ఆయన విగ్రహం కూడా పెట్టారు. ఆంధ్ర యూనివర్శిటీ స్థాపనకు కారకుడైన పానగల్ మహారాజ తన విగ్రహం వద్దని, విక్రమ్ దేవ్ విగ్రహం పెట్టాలని సూచించడం ఆయన ఔదార్యానికి నిదర్శనం. శతవార్షికోత్సవం సందర్భంగా ఈ చరిత్ర ప్రజలకు తెలియాలని ఆశిస్తున్నాను.:::దేవులపల్లి గోపాలరావు, హైకోర్టు న్యాయవాది -
ఒలింపిక్స్‌కు 'సై' అంటున్న ఇండియా
ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ సైఅంటోంది. అహ్మదాబాద్ లో 2036లో ఈ పోటీలకు ఆతిథ్యం వహించేందుకు భారత్ అధికారికంగా బరిలోకి దిగింది. ఖతార్ (దోహాలో), చిలీ (శాంటియాగోలో), తుర్కియే (ఇస్తాంబుల్‌లో) ఈ పోటీలు నిర్వహిస్తామంటూ మనకు ప్రస్తుతానికి పోటీగా నిలుస్తున్నాయి. దక్షిణాఫ్రికా కూడా ముందుకొచ్చిందికానీ, ఏ నగరంలో నిర్వహించదలచుకున్నదీ పేర్కొన లేదు. బెర్లిన్, కలోన్, హ్యాంబర్గ్, మ్యూనిక్‌లలో ఎక్కడో ఒకచోట నిర్వహించాలని జర్మనీ యోచిస్తోంది. సెప్టెంబర్‌లో తుది నిర్ణ యాన్ని ప్రకటించవచ్చు. అయితే, బెర్లిన్, మ్యూనిక్ నగరాలు చేదు జ్ఞాపకాలనే రేపుతాయి. జర్మనీ 2036 అవకాశాన్ని దక్కించుకోలేక పోతే, 2040 లేదా 2044లలో నిర్వహించేందుకు ప్రయత్నించవచ్చు. అపఖ్యాతిని మూటగట్టుకున్న జర్మనీజర్మనీ నేడున్నట్లుగా సమైక్యంగా ఉన్నప్పుడు 1936లో బెర్లిన్‌లో ఒకసారి ఒలింపిక్స్ నిర్వహించింది. ఆ తర్వాత, 1972లో ఆనాటి పశ్చిమ జర్మనీలోని మ్యూనిక్‌లోనూ నిర్వహించారు. 1936లో ఎక్కడ పోటీలు నిర్వహించాలో 1931లో నిర్ణయించారు. ఆ మరుసటి ఏడాది (1932లో) అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి వచ్చారు. ఆయన ఆ క్రీడోత్సవాలను ప్రాపగాండా వ్యవహారంగా మార్చేశారు. తమను ఆధిపత్య (ఆర్య) జాతికి చెందినవారుగా చాటుకోవాలని హిట్లర్ చేసిన ప్రయత్నంతో, అవి ‘నాజీ ఒలింపిక్స్’గా అపకీర్తిని మూటగట్టుకున్నాయి. దాని ప్రతీకార జ్వాలను మ్యూనిక్ 1972లో చవిచూసింది. పాలస్తీనా విమోచన సంస్థకు చెందినవారు ఒలింపిక్ గ్రామంలోకి అథ్లెట్ల ముసుగులో అడుగుపెట్టి, ఇజ్రాయెల్ క్రీడాకారుల బసలోకి ప్రవేశించి కొందరిని బందీలుగా పట్టుకుని, ఆ తర్వాత వారిని హత మార్చారు. మొత్తం 11 మంది క్రీడాకారులను బలి తీసుకున్న ఆ ఉదంతం క్రీడా చరిత్రలో మాయని మచ్చగా నిలిచింది. జర్మన్లకు వారి నాజీ గతం ఇబ్బందికరంగానే ఉంది. బెర్లిన్ను 2036 క్రీడలకు ఎంచుకుంటే, పాత గాయాలను రేపినట్లు అవుతుందేమోనని జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్–వాల్టర్ స్టెయిన్మయర్ ఆందోళన వ్యక్తపరచారు. అపఖ్యాతి పాలైన ‘నాజీ ఒలింపిక్స్’కు సరిగ్గా ఆ ఏడాదిలోనే నూరేళ్ళు నిండుతాయి. హిట్లర్‌కు ప్రీతిపాత్రమైన జాతి సిద్ధాంతం బెర్లిన్‌లో తుత్తు నియలైంది. ఆఫ్రో–అమెరికన్ జెస్సీ ఓవెన్స్ ఆ పోటీల్లో 100 మీటర్ల, 200 మీటర్ల , 4గీ100 మీటర్ల రిలే, లాంగ్ జంప్ విభాగాల్లో స్వర్ణాలు సాధించి శాశ్వత కీర్తిని గడించారు. 1936 ఒలింపిక్స్‌లో ఇండియాబ్రిటన్ పతాకం కింద భారత బృందం పాల్గొన్న చివరి ఒలింపిక్స్‌గా కూడా 1936 ఒలింపిక్స్ లెక్కకు వస్తాయి. ఆ బృందంలో ధ్రువతార ధ్యాన్‌చంద్ నేతృత్వంలోని హాకీ జట్టు, నలుగురు రన్నర్లు, బర్మా (నేటి మయన్మార్) నుంచి వచ్చిన ఒక వెయిట్ లిఫ్టర్ కూడా ఉన్నారు. అప్పట్లో బ్రిటిష్ ఇండియాలో బర్మా భాగంగాఉండేది. బెర్లిన్ (1936) ఒలింపిక్స్‌లో భారత్ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా, నేటి సోషల్ మీడియాయుగంలో కల్పనల నుంచి వాస్తవాలను వేరు చేసి చూడటం కష్టం. వీఐపీ బాక్స్‌లో కూర్చున్న హిట్లర్ వంక చూస్తూ కుడివైపు తిరిగి శాల్యూట్ చేయడానికి అమెరికాతోపాటు తిరస్కరించిన ఏకైకబృందం భారతదేశానిదేనని ఒక కథ ప్రచారంలో ఉంది. దాన్ని మన ధైర్యానికి, లొంగనితత్వానికి ప్రతీకగా చెప్పుకుంటూ ఉంటారు. అది వాస్తవం కాదు. కవాతులో పాల్గొన్న 49 బృందాలలో నాజీ వందనం సమర్పించింది ఆతిథేయ దేశమైన జర్మనీ మాత్రమే. జర్మన్ ఒలింపిక్ చరిత్రకారుల పితామహుడు, ముఖ్యంగా, 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌కు సంబంధించిన నిపుణుడు ఫోల్కా క్లట్జ్ ప్రకారం, నాజీ శాల్యూట్‌కి, ఒలింపిక్ శాల్యూట్‌కి మధ్యనున్న సారూప్యత కారణంగా రకరకాల అపోహలు తలె త్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఒలింపిక్ శాల్యూట్‌కి 1946లో స్వస్తి పలికింది. సాటిలేని భారత హాకీ జట్టు 1928, 1932 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు గెలుచుకుని, 1936లో హ్యాట్రిక్ సాధించే ప్రయత్నంచేసింది. దానికి తగ్గట్లుగానే ఫైనల్లో జర్మనీతో తలపడి 8–1 గోల్స్ తేడాతో దాన్ని ఓడించింది. ఆగస్టు 14న జరగవలసిన ఆ పోటీ భారీ వర్షం వల్ల వాయిదా పడి ఆ మరుసటి రోజైన ఆగస్టు 15న ఉదయం 11 గంటలకు జరిగింది. ఆ తర్వాత, ఆగస్టు 15 భారతదేశ చరిత్రలో మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. భారత్–జర్మనీల మధ్య ఫైనల్ మ్యాచ్ చూసేందుకు హిట్లర్ వచ్చారనీ, ధ్యాన్‌చంద్ హాకీ స్టిక్ ఒడుపులు చూసి, ఆయన కళ్లు చెదిరాయనీ చెప్పే కథనంలో కూడా వాస్తవం లేదని క్లట్జ్ అంటారు.ఒలింపిక్స్‌లో క్రీడా జర్నలిస్ట్!ఈ సందర్భంగా చార్లెస్ సెబాస్టియన్ అరుళ్ స్వామి గురించి కూడా చెప్పుకోవాలి. మన స్వామి ఎంత ఘటికుడో తెలుసా? ‘హిట్లర్ అంతటివాడిని టీ తాగేందుకు వేచి ఉండేటట్లు చేశాడు’ అని క్రీడా జర్నలిస్టులు ఆయనను ఆటపట్టిస్తూ ఉండేవారు. స్పోర్ట్స్ జర్నలిజంలో ఆయనే నాకు గురువు. ఇంతకూ ఏం జరిగిందంటే, ఆ ఒలింపిక్స్ మారథాన్‌లో స్వామి పాల్గొన్నారు. ఆయన ఆపసోపాలు పడుతూ చివరలో ఎప్పటికో వచ్చారనీ, ఫలితంగా ముగింపు వేడు కలో జాప్యం జరిగిందనీ జర్నలిస్టులు ఆ విధంగా ఎద్దేవా చేసేవారు. వాస్తవం ఏమిటంటే, మారథాన్ పూర్తి చేసిన 42 మందిలో స్వామి 37వ వ్యక్తిగా నిలిచారు. ఆ రోజు 14 మంది దాన్ని పూర్తి చేయలేకపోయారు. కనుక, స్వామి దృఢత్వాన్ని మెచ్చుకోవాల్సిందే. పైగా, జ్వరంతో కోలుకుని మరీ ఆ పోటీలో పాల్గొన్నారు. సుదీర్ఘ నౌకాయానం వల్ల పారాటైఫాయిడ్ బారినపడ్డారు. ఫలితంగా, 3 వారాలు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత కాలంలో, మార థాన్‌ను చివరకు మార్చారుకానీ, అప్పట్లో అది ముందే ఉండేది. స్వామి తన 83వ ఏట, కోయంబత్తూరులో 1997లో కన్ను మూశారు. భారతదేశపు క్రీడా జర్నలిజం వైతాళికు లలో ఆయనొ కరు. స్వామి గట్టి పోటీనివ్వగల షూటర్ కూడా. ఫుట్‌బాల్ కోచ్‌గా, రిఫరీగా కూడా వ్యవహరించారు. ఒలింపిక్స్ పోటీలో పాల్గొన్న ఏకైక క్రియాశీల జర్నలిస్ట్ ఆయనొక్కరేనని చెబుతారు. -వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)-గులు ఇజికియల్ -
నారీశక్తికి వందనం ఇంకెప్పుడు?
2023 సెప్టెంబర్‌లో ‘నారీ శక్తి వందన్ అధినియం’ పేరుతో వచ్చిన మహిళా రిజర్వేషన్ చట్టం ‘జనాభా గణన జరిగి,ఆ ప్రాతిపదిక మీద నియోజక వర్గాల పునర్విభజన జరిగిన తరువాతనే అమల వుతుందన్న నిబంధన అప్పుడే విమర్శకు గురైంది. ఆ లెక్కన 2030 నాటికి గానీ ఆ చట్టం అమలులోకి రాదని చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం కోసం మూడు దశాబ్దాలుగా పోరాడుతున్న మహిళా ఉద్యమకారులు ఆవేదన పడ్డారు. మహిళల హక్కుల అమలులో సాచివేత ధోరణిని నిరసించారు.ఇప్పుడు మూడేళ్లు పూర్తి కాకుండానే, జనగణన జరగకుండానే 2011 జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనతో కలిపి మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు అవసరమైన సవర ణలతో కేంద్రప్రభుత్వం ముందుకు వచ్చింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసింది. ప్రజాప్రతినిధుల వాదోపవాదాలతో వాతావరణం వేడెక్కి ఉంది. ఈ సందర్భంలో చట్ట సభలలో మహిళ లకు రిజర్వేషన్ కల్పించటానికి తాము సంసిద్ధంగా ఉంటే ప్రతి పక్షాలు వ్యతిరేకంగా ఉన్నాయనీ, మహిళా ప్రపంచం వాళ్ళను క్షమించదనీ కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వం అన్నది. ఇది చూస్తుంటే మహిళా రిజర్వేషన్ బిల్లు భుజాల మీదుగా దక్షిణ ప్రాంతాల రాజ కీయ ప్రాతినిధ్యం గురించి అనేక సందేహాలకు తావిస్తున్న నియో జకవర్గాల పునర్విభజన బిల్లును నెగ్గించుకొనే ప్రయత్నం చేసిందా ప్రభుత్వం అన్న సందేహం కలుగుతుంది. అయితే, దక్షిణాది రాష్ట్రా లకు అన్యాయం జరగకుండా, దేశంలోని అన్ని నియోజక వర్గాలసంఖ్యను సమంగా 50 శాతానికి పెంచుతామనే ప్రతిపాదనపై గట్టి విశ్వాసాన్ని ప్రభుత్వం కలిగించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో!నియోజక వర్గాల పెంపు ద్వారా తప్ప స్త్రీలకు చట్ట సభలలోకి ప్రవేశం సాధ్యం కాకపోవటం అన్న భావన ప్రజాస్వామికమైనదేమీ కాదు. ఇప్పటికి అనుభవిస్తున్న రాజకీయాధికారాన్ని ఉన్నది ఉన్న ట్లుగా స్త్రీలతో పంచుకొనటానికి పురుష సమాజం భావజాలసంస్కారాన్ని అభివృద్ధి చేసుకోలేదన్న సంకేతాన్ని ఇస్తుందది. పితృస్వామిక స్వభావంమహిళా సాధికారత లక్ష్యంగా 1990లలో ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన చైతన్యం, ఒత్తిడి నుండి 1992లో 73,74రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక పాలనా వ్యవస్థలలో స్త్రీలకు 33 శాతం స్థానాలను కేటాయిస్తూ చట్టం వచ్చింది. కానీ 2001ని మహిళా సాధికార సంవత్సరంగా ప్రకటించిన ప్రభుత్వం చట్ట సభలకు మహిళా రిజర్వేషన్‌ను విస్తరింపచేయటానికి మాత్రం వెనకడుగు వేస్తూ ఉండటమే మనకు తెలిసిన చరిత్ర. 1996 నుండి స్థానిక సంస్థలలో ఎన్నికల ద్వారా పదవులు చేపట్టిన స్త్రీల స్థానంలో కుటుంబ సభ్యులైన పురుషులో, గ్రామ పెత్తందారులో అధికారాలు చలాయించటం, ప్రభుత్వ పాలనా వ్యవస్థలు ఆ విషయం తెలిసి కూడా చర్యలు ఏవీ చేపట్టకపోవడం ప్రజాక్షేత్రంలో జరిగిన పరిశోధనలు, ప్రజల అనుభవాల నుండి వచ్చిన సాహిత్యం లోకానికి తెలియచెప్పాయి. ఇటువంటి పరిస్థి తులలో చట్టసభలలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టిన ప్పుడల్లా వీగిపోవటంలో, 2010లో రాజ్యసభ ఆమోదం పొందిన ప్పటికీ లోకసభలో చర్చకు రాకుండా కోల్డ్ స్టోరేజిలో పెట్టబడటంలో ఆశ్చర్యపడవలసింది ఏమున్నది?మొత్తంగా మహిళలు అధికార స్థానంలో ఉండటాన్ని అంగీకరించలేని సగటు పితృస్వామిక స్వభావమే దీని మూలం. 2001ని మహిళా సాధికారతా సంవత్సరంగా ప్రకటించినప్పుడు స్త్రీ పురుష వివక్షకు సంబంధించిన పాతబడ్డ భావజాల నిర్మూలనకు, మనుషులలో నూతన ప్రజా స్వామిక చైతన్య వికాసానికి చేపట్టే ఎన్నెన్నో కార్యక్రమాల గురించిన వాగ్దానాల వైఫల్యం మనం చూస్తున్నదే. స్త్రీలు అందరూ ఒకటి కాదు. కులంవల్ల, సామాజిక ఆర్థిక స్థాయివల్ల వాళ్ళు భిన్న సమూహాలుగా ఉన్నారు. లింగ వివక్ష నిరపేక్ష అంశం కాదన్న ఎరుక... చట్టసభలలో మహిళా ప్రాతినిధ్యం అగ్రవర్ణ మహిళల అవకాశంగా మాత్రమే మిగిలిపోకూడ దన్న ఆకాంక్షగా వ్యక్తం కావటం సహజం. అందువల్లనే బహుజన మహిళలకు అంతర్గత రిజర్వేషన్ ఉండాలన్న ప్రతిపాదనమహిళా రిజర్వేషన్ బిల్లు చర్చలోకి వచ్చినప్పుడల్లా వినబడుతూనే ఉంది. అయినా దానికి పెడచెవి పెట్టడానికి కారణం మనువాద సంస్కృతే అన్నది తెలిసిందే. ఆ చరిత్రను సౌకర్యవంతంగా విస్మరించి ఆ ప్రసక్తే లేకుండా ‘నారీ శక్తి వందన్ అధినియం’ వచ్చింది.ఇప్పుడు ఆ బిల్లు పార్లమెంటులో వీగి పోయింది. అందుకు మహిళలు నిరాశపడవలసినది ఏమీ లేదు. విశాల ప్రతిపాదిక మీద భిన్న సమూహాల స్త్రీల సరైన ప్రాతినిధ్యాన్ని చట్టంలో భాగంగా చేసేవరకూ ఉద్యమాలతో ఒత్తిడి తీసుకురావటం, నియోజకవర్గాల పునర్విభజనతో పనిలేకుండా మహిళా రిజర్వేషన్ చట్టం అమలును డిమాండ్ చేయటం ఇప్పుడు తక్షణ కర్తవ్యాలు.-వ్యాసకర్త ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ సమన్వయకర్త-కాత్యాయనీ విద్మహే -
నేటికీ దారిచూపే ధ్రువతార
ఏప్రిల్ 11 మనందరికీ ప్రత్యేకమైన రోజు. భారతదేశపు అగ్రశ్రేణి సంఘ సంస్కర్తల్లో ఒకరు, తరతరాలకూ మార్గదర్శిగా నిలిచిన క్రాంతి పథ గామి మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి నేడు. ఆయన ద్విశతాబ్ది జయంత్యుత్సవాల ప్రారంభం నేప థ్యంలో, ఈ ఏడాది మరింత విశిష్ట తను సంతరించుకున్నది.నైతిక స్థైర్యం, నిరంతర సత్యా న్వేషణ, సామాజిక శ్రేయస్సు పట్ల అచంచలమైన అంకితభావం కల బోసిన ఉదాత్త జీవితం ఆయనది. ఎన్నో సంస్థలను నెలకొల్పి, ఎన్నో ఉద్యమాలకు సారథ్యం వహించి చిరస్మరణీయులయ్యారు. ఆయన రేకెత్తించిన సరికొత్త ఆశలు, దేశజనుల్లో నింపిన ఆత్మవిశ్వాసం,మన నాగరికతా పరిణామ క్రమంలో ఆయన చేసిన అసమానమైన సేవలు నేటికీ లక్షలాది మందికి స్ఫూర్తిని అందిస్తున్నాయి. సమానత్వ సాధనం తరగతి గదిపుణ్యభూమి మహారాష్ట్రలో 1827లో ఫూలే జన్మించారు. అతి సామాన్య నేపథ్యం నుంచి ఎదిగారు. తొలినాటి కష్టాలేవీ ఆయన అభ్యాసానికీ, సామాజిక నిబద్ధతకూ అడ్డుగోడలు కాలేకపోయాయి. చిన్నతనంలోనే, విద్యార్థి దశ నుంచే అపారమైన జిజ్ఞాస ఉండేది. తన వయసు పిల్లల స్థాయికి మించిన పుస్తకాలను చదివేవారు. ‘మనం ఎంత ప్రశ్నిస్తే అంత జ్ఞానాన్ని పొందుతాం’ అని తర్వాతి కాలంలో ఆయనే చెప్పారు. చిన్ననాటి నుంచే అలవడిన ఆ సత్యాన్వే షణ దృక్పథం ఎక్కడా రాజీపడకుండా జీవితాంతం కొనసాగింది. విద్యనూ, జ్ఞాన సముపార్జననూ జీవిత లక్ష్యాలుగా మలచు కున్నారు మహాత్మా ఫూలే. జ్ఞానం కొందరి గుత్తాధిపత్యం కాదనీ, ఆ శక్తి అందరికీ అందాలనీ స్పష్టంగా గుర్తించారు. అనేకులకు అక్షర జ్ఞానం అందని ద్రాక్షగా ఉన్న ఆ కాలంలోనే బాలికల కోసం, విద్యా వకాశాలు లేని వర్గాల కోసం పాఠశాలలను తెరిచి విద్యా విప్లవానికి నాంది పలికారు. ‘తల్లి ద్వారా బిడ్డకు అందే సంస్కారం అమూల్య మైనది. అందుకే, పాఠశాలలు తెరవాలనుకుంటే మొదట బాలికల కోసమే తెరవాలి’ అనేవారాయన. సామాజిక న్యాయాన్నీ, సమాన త్వాన్నీ సాధించే శక్తిమంతమైన సాధనంగా తరగతి గదిని నిలిపి, ఓ సరికొత్త సామాజిక దృక్పథాన్ని ఆవిష్కరించేందుకు కృషి చేశారు.విద్య పట్ల ఆయన దార్శనికత స్ఫూర్తిదాయకం. దేశ యువతలో పరిశోధన, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించడం లక్ష్యంగా గత పదేళ్లుగా మేమెంతో కృషి చేశాం. విజ్ఞానం, నైపుణ్యాలు, అవకా శాల్లో పెట్టుబడుల ద్వారా... సమస్యల పరిష్కర్తలుగా, దేశ ప్రగతికి సారథులుగా భారత్ తన యువతను తీర్చిదిద్దుతోంది. సమాన హక్కులతోనే నిజమైన స్వేచ్ఛమహాత్మా ఫూలే తన విజ్ఞానంతో, వివేకంతో... వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాలపై విస్తృత అవగాహనను పెంపొందించుకున్నారు. రైతులు, కార్మికులకు అన్యాయం జరిగితే మన సమాజం బలహీనపడుతుందని చెప్పేవారు. పేదలు, అణగా రిన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో నిమగ్నమయ్యారు. ‘జోపర్యంత సమాజాతీల సర్వానా సమాన అధికార మిళత్ నాహీత్, తోపర్యంత ఖరే స్వతంత్య్ర మిళత్ నాహీ (సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించేంత వరకు నిజమైన స్వేచ్ఛను సాధించలేము)’ అన్నది ఫూలే అభిప్రాయం. సమ సమాజం లక్ష్యంగా, ఈ ఆశయాన్ని కార్యాచరణగా మలిచే దిశగా ఎన్నో సంస్థలను ఆయన నెలకొల్పారు. ఆయన స్థాపించిన ‘సత్య శోధక’ సమాజం ఆధునిక భారతదేశంలో అత్యంత ముఖ్యమైన సామాజిక సంస్కరణ ఉద్యమాల్లో ఒకటి. సామాజిక సంస్కరణ, సమాజ సేవ, మానవ గౌరవాన్ని పెంపొందించడంలో ఇది అగ్రగా మిగా నిలిచింది. మహిళలు, యువత, గ్రామీణులకు గొంతుకైంది. ఆయన వ్యక్తిగత జీవితమూ ధైర్యసాహసాలను బోధించే పాఠమే! నిరంతరం జనబాహుళ్యంలో ఉంటూ ప్రజల కోసం పరిత పించడం ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపింది. పక్షవాతం బారిన పడి శరీరం సహకరించని స్థితిలోనూ తన కృషిని కొనసాగించారు. ఆయన శరీరం కఠిన పరీక్షను ఎదుర్కొని ఉండవచ్చు, కానీ సమాజం పట్ల ఆయన నిబద్ధత మాత్రం సడలలేదు.సావిత్రీబాయి ఫూలేను స్మరించుకోకుండా జ్యోతిరావు ఫూలే స్మృతి అసంపూర్ణమే అవుతుంది. దేశపు తొలితరం మహిళా ఉపాధ్యా యినిగా, బాలికా విద్యావికాసంలో ఆమె నిర్ణయాత్మక పాత్ర పోషించారు. మహాత్మా ఫూలే మరణానంతరమూ ఆ ఆశయ దీప్తిని సావిత్రీబాయి ఆరనివ్వలేదు. 1897లో ప్లేగు వ్యాధి విరుచుకుపడిన తరుణంలో బాధితుల సేవలో ఆమె పునరంకిత మయ్యారు. చివ రకు అదే వ్యాధికి గురై ప్రాణాలు విడిచిన త్యాగమూర్తి ఆమె. నవ భారత దీప్తిమనది పుణ్యభూమి. విశిష్టమైన భావాలు, నిరుపమాన త్యాగాలతో మన సమాజాన్ని శక్తిమంతంగా మలచిన మహనీ యులకు నిలయమిది. మార్పు ఎక్కడో మొదలవుతుందని ఎదురు చూడలేదు. వారే మార్పునకు నాంది పలికారు. శతాబ్దాల నుంచి దేశంలో సామాజిక పురోగతి దిశగా మన సమాజం నుంచే శంఖా రావం వినిపించింది. పీడితుల వ్యధను గుర్తించి, దానిని ‘తలరాత’ అని సరిపెట్టుకోకుండా ఎదురుతిరిగిన వారినుంచి ఆ చైతన్యం పుట్టుకొచ్చింది. అలాంటి యోధుల్లో ఒకరు మహాత్మా ఫూలే.2022లో పుణె పర్యటన సందర్భంగా, అక్కడి ఫూలే భవ్య విగ్రహం వద్ద నివాళి అర్పించడం నాకెప్పటికీ గుర్తుంటుంది. ఆయన ద్విశతాబ్ది జయంత్యుత్సవాల ప్రారంభ వేళ, ఆయన ఆశయాలకు పునరంకితం కావడమే మనం అర్పించే నివాళి. ముఖ్యంగా ఆయన కెంతో ఇష్టమైన విద్య వంటి ఆదర్శాలకు పునరంకితం కావాలి. అన్యాయంపై నిరసన తెలిపే సున్నితత్వాన్ని పెంచుకోవాలి. సమాజ స్వయం సంస్కరణ సామర్థ్యంపై మన విశ్వాసాన్ని బలంగా చాటాలి. నైతిక స్పష్టత, ప్రజా ప్రయోజనం రెండూ తోడైతే... ఈ సమాజశక్తి దేశంలో అద్భుతాలు సృష్టించగలదని ఆయన జీవితం నిరూపించింది. అందుకే నేటికీ లక్షలాది మందికి ఆయన ఆలోచ నలు బలాన్నిస్తున్నాయి. ఆయన మాటలూ, చర్యలూ ఆశను చిగురింపజేస్తున్నాయి. జన్మించి రెండు వందల ఏళ్లు గడుస్తున్నా – మహాత్మా జ్యోతిరావు ఫూలే గత కాలపు శక్తిగానే కాకుండా, నవ భారత భవితకు మార్గదర్శిగా విరాజిల్లుతున్నారు.-నరేంద్ర మోదీ-భారత ప్రధాని -
స్వర్ణాంధ్రానికి స్వతంత్రం లేదా?
శూన్యం నుంచి గారడీ వీరుడు ఒక రాజధానిని పుట్టించవచ్చు అన్నట్టుగాఉంది ‘అమరావతి’ అనే ఆంధ్రప్రదేశ్ రాజధాని కథ. తెలంగాణ నుంచి విడి పోయిన తరువాత ఇప్పటి దాకా ఆంధ్ర ప్రదేశ్‌కు నిర్దిష్టమైన రాజధాని లేకపోతే అది శాపమా లేక చేవలేనితనమా? ప్రభుత్వ పరిపాలనా కేంద్రాలన్నీ ఒకే చోట నిర్మించడం తప్పు అని శివరామకృష్ణన్ కమిటీ చెబితే అది పనికిరాదు. వికేంద్రీకరణ వద్దు, ప్రతిచోటా కేంద్రీకరణ. తద్వారా రియల్ ఎస్టేట్ దుకాణాలు!ఇదొక సంక్షోభంమన భారత రాజ్యాంగం ప్రకారం ఆ యా రాష్ట్రాలు, పార్లమెంట్ ఆమోదం మేరకు ఏర్పడతాయి. రాష్ట్ర ప్రభుత్వం తన పాలనలో భాగంగా రాజధాని ఏర్పాటు చేసుకుంటుంది. హైదరాబాద్ తరతరాలు, శతాబ్దాల క్రమంలో రాజధానిగా నిలబడింది.ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈ కథ వేరు. ఒక బలీయమైన ప్రభుత్వం ఉంటే ఒక జీవో ద్వారా రాజధాని ఏదో నిర్ణయించవచ్చు. కొన్ని రాష్ట్రాలలో ఒకటికన్నా ఎక్కువ రాజధానులు ఉన్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఒకే రాజధాని ఉండటం కూడా మనకు తెలుసు. 2014లో ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్ప డితే... 2026లో పార్లమెంట్ అమరావతిని రాజధాని అని చెబుతూ చట్టం చేసిందంటే... ఇంతకన్నా విషాదం ఏమైనా ఉందా? శాసనసభలో అమరావతిని రాజధానిగా పేర్కొంటూ ఆమోదించిన తీర్మానాన్ని శాసన మండలిలో ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఎక్కడో ఢిల్లీలో ఉన్న పార్లమెంట్‌కు పంపే ముందు... ఏపీ శాసన వ్యవస్థలో భాగమైన శాసన మండలిలో తీర్మానం ప్రవేశపెట్టక పోవ డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వికేంద్రీకరణ వద్దా?ఒక దశలో సీఆర్డీఏ చట్టం ద్వారా అమరావతిని రాజధాని అన్న మాట ఈ సందర్భంగా గుర్తుంచు కోవాలి. అలాగే ఒక విధానం ద్వారా (సంవిధానంగా కాదు) ల్యాండ్ పూలింగ్ చేసి నిర్మించాలను కున్న విషయాన్నీ గమనంలో ఉంచుకోవాలి. దీన్ని నిర్మించడానికి లక్షల కోట్లు కుమ్మరించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరా బాదులోనే సమస్త అభివృద్ధినీ కేంద్రీకరించి మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారనే విమర్శ ఉంది.అందుకే వైఎస్ జగన్ మోహనరెడ్డి పాలనా కాలంలో ఆంధ్ర ప్రదేశ్‌కు మూడు రాజధానులను ప్రతిపాదించారు. ఈ విధానం వికేంద్రీకరణ లక్ష్యంతో ముందుకు వచ్చింది. ఒకే నగరంలో అధికార కేంద్రీకరణ తగ్గించాలనే ఉద్దేశ్యం దీనిలో ఉంది. ఇందువల్ల నిధులు, ఉద్యోగాలు, పరిశ్రమలు, అధికారాలు వికేంద్రీకరించే అవకాశంఉంటుంది. కానీ అమరావతిపై ఉన్న భ్రమల కారణంగా భూములు ఇచ్చిన రైతులు కోర్టులను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని ఆదేశించింది. రాజధాని లేని దయనీయ పరిస్థితి ఉన్నందున విధిలేక కోర్టు ఈ తీర్పుఇచ్చింది. ఈ తీర్పు న్యాయవ్యవస్థ పరిమితులపై కొన్ని ప్రశ్నలను లేవనెత్తింది: రాజధానిని నిర్ణయించేది ఒక పాలసీ అయితే, దాన్ని ఎప్పుడైనా మార్చవచ్చా? కోర్టులు ప్రభుత్వ విధానాన్ని నిర్దేశించ గలవా వంటి ప్రశ్నలు రాజ్యాంగంలో ఈ విషయంపై ఉన్న ఖాళీని గుర్తించేలా చేశాయి. నిజానికి ఇదొక సంక్షోభం!ఏదో కారణంగా విశాఖపట్టణం రాజధానిగా వద్దనుకున్నారు. విశాఖ కాకపోతే ‘మావిగ¯Œ ’ పేరుతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల కారిడార్ రాజ ధాని ప్రాంతం అయితే బాగుంటుందన్నది మంచి ప్రతిపాదన. మచిలీపట్నం వద్ద జగన్ ప్రభుత్వం నౌకాశ్రయ (పోర్టు) నిర్మాణం చేపట్టింది. మచిలీపట్నం–విజయవాడకు, విజయవాడ–గుంటూరు మధ్య ఆరు వరుసల జాతీయ రహదారులు ఉన్నాయి. విజయవాడ శివార్లలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అమరావ తిలో పెట్టే 10 శాతం ఖర్చుతోనే ఇక్కడ రాజధాని సాధ్యం అవుతుందని చెబుతుంటే వినేవాళ్లెవరు? పారదర్శకత ఉందా?తెలుగు ప్రజలందరికీ ఇది చరిత్రాత్మకమైన రోజని టీడీపీమంత్రులు సంతోషపడుతున్నారు. ప్రజా రాజధాని అమరావతి చరిత్రలో గుర్తుంటుందనీ, కృష్ణానది తీరంలో అమరావతి నిర్మించా లనేది ఏపీ ప్రభుత్వ నిర్ణయమనీ, ఐకానిక్, వరల్డ్ క్లాస్ రాజధానిగా నిర్మాణం జరుగుతోందనీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. బాగానే ఉంది కానీ అది ఏపీ ప్రభుత్వ నిర్ణయమైతే, పార్లమెంట్ చట్టం అవసరం ఎందుకు వచ్చింది? పైగా ఇంతటి భారీ వ్యయాలపై, పారదర్శకత లోపంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరమని చెప్పడం, ఆ నిధుల మూలాలు స్పష్టంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇది రాజ్యాంగబద్ధ విశ్లేషణ. ప్రాంతాల వారీగా, కులాల వారీగా రాజధాని నిర్మాణానికి ప్రతిబం«ధకాలు గమనించక తప్పదు. మౌలిక సదుపాయాలకు గాను లక్ష ఎకరాలకు ఎకరానికి 2 కోట్ల చొప్పున 2 లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతున్నది. ఇంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది అంటూ పార్లమెంట్లో బిల్లు ఎలా పెడతారు అన్న ఆయన ప్రశ్న కీలకమైనది. అలాగే సచివాలయానికి 52 లక్షల చదరపు అడుగుల స్థలం కావాలనడం ఆశ్చర్యం కలిగించే మరో అంశం. తెలంగాణలో కొత్త సచివాలయానికి 600 కోట్ల రూపాయలు ఎక్కువ అనే విమర్శలు ఉండేవి. కానీ ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు కావాలి? అనేక ప్రశ్నలు, గందరగోళాలు, కుంభకోణాల గండాలను దాటి, 12 సంవత్సరాల తరువాతైనా ఒక స్థిరమైన రాజధాని వస్తుందా?-వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్-మాడభూషి శ్రీధర్ -
పొసగని పొత్తులతోనే పోరాటం
తమిళనాడు శాసనసభకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరుగనున్నాయి. కొన్ని దశాబ్దా లుగా రాష్ట్రం ద్విముఖ పోటీలనే చవి చూస్తూ వచ్చింది. ఇపుడు మూడవ గణనీయమైన పార్టీ ప్రవేశంతో ఎన్నికలు ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. సినీ నటుడు విజయ్ రాజకీయ బరిలోకి దిగడంతో ఆయనకు విజయావకాశాలు ఎంతవరకు ఉంటాయన్న దానిపై ఎక్కువగా చర్చలు సాగుతున్నాయి. రాజకీయ అనుభవం సంపాదించడానికి కాక, ఏకంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకే బరిలోకి దిగుతున్నట్లు విజయ్ స్పష్టం చేశారు. విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళగం (టీవీకే)ను జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్డీయే) లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన అన్నా డీఎంకే ఆయన డిమాండ్లు చూసి ఖంగుతింది. జన నాయకుడు కాగలడా?బీజేపీ 2024 లోక్ సభ ఎన్నికలలో కన్నా మెరుగైన ఫలితాలను కోరుకుంటోంది. అన్నా డీఎంకేతో పొత్తు ఏదో ఒరగబెట్టగలదనే ఆశ బీజేపీకే లేదు. కానీ టీవీకే ఆగమనం ఈ కూటమికి ఇపుడు లేని ఆధి క్యాన్ని తెచ్చిపెట్టగలదు. ఎన్నికల ప్రచార ఖర్చులు రూ. 40 లక్షలు మించకూడదని ఎన్నికల కమిషన్ నిర్దేశిస్తోంది. వాస్తవంలో, రూ. 5 కోట్లు అవసరమవుతాయని అంచనా. టీవీకే అభ్యర్థులలో కొందరికి అంత స్తోమత లేదని ఇటీవల జరిగిన ఆ పార్టీ సమావేశంలో చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. ఫలితంగా, ఏదైనా పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, దాని పైన కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని అంటున్నారు. విజయ్ గతంలో బీజేపీని తన ‘సైద్ధాంతిక శత్రువు’గా అభివర్ణించారు. హిందుత్వ పార్టీతో పొత్తు పెట్టుకుంటే, క్రైస్తవ, ముస్లిం మైనా రిటీల ఓట్లకు గండిపడవచ్చని ఆయన సందేహిస్తున్నారు. ఆయన అనుయాయుల్లో ఆ రెండు వర్గాలవారే ఎక్కువగా ఉన్నట్లు చెబు తున్నారు. టీవీకే వచ్చి చేరడం పట్ల అన్నా డీఎంకేకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను అది చీలుస్తుందని దానికి తెలుసు. అయినా టీవీకే తనకు కూడా గ్రహణం పట్టిస్తుందే మోనని అన్నా డీఎంకే లోలోపల ఆందోళన చెందుతోంది. సినిమాలలో మాదిరిగానే ప్రత్యర్థుల దుమ్ము దులిపి ‘జన నాయగన్’ అనిపించుకోవాలని ఆయన ఉవ్విళ్ళూరుతున్నారు. ఎన్ని కల బరిలో నిలిచిన అభ్యర్థి హీరోగా నటించిన సినిమా విడుదల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం అవుతుందా? ఇది ఎన్నికల కమిషన్‌కు ఎదురవుతున్న ప్రశ్న. రెండు ద్రవిడ కూట ములలో విజయ్ దేనిని దెబ్బతీస్తారనే దానిపైనే దాని జవాబు ఆధారపడి ఉంటుందని గత కొద్ది ఏళ్ళ చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. చిత్ర దర్శకుడు సీమాన్ కూడా నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) పేరుతో ఒక చిన్న తమిళ జాతీయవాద పార్టీని ఇదివరకే ప్రారంభించారు. దాని ఓట్ల శాతం క్రమంగా వృద్ధి చెందుతూ వస్తోంది. విజయ్ రాకతో ఎక్కువ దెబ్బతినేది ఆ పార్టీయేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యుద్ధం స్టాలిన్‌తోనే!అభిమానులు దళపతిగా పిలుచుకునే విజయ్ తన విమర్శ నాస్త్రాలన్నింటినీ పాలక డీఎంకే పైన, దాని నాయకుడు, ముఖ్య మంత్రి ఎం.కె. స్టాలిన్ పైన మాత్రమే ఎక్కుపెడుతున్నారు. విజయ్ 2025 సెప్టెంబర్‌లో కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఆ ఘటన తర్వాత ఆయన కొద్ది బహిరంగ సభలలోనే పాల్గొన్నారు. కానీ, ఆ తర్వాత, ఏ బహిరంగ సభలో మాట్లాడినా ఆయన ఎన్నికల ‘యుద్ధం’ తనకూ, స్టాలిన్‌కూ మధ్యనేనని చెబుతూ వస్తున్నారు. పాలకడీఎంకే పాల్పడినట్లు చెబుతున్న అవినీతి, దుష్పరిపాలనను తొల గించగల వ్యక్తిగా విజయ్ తనను తాను చాటుకుంటున్నారు. పెరి యార్, కె. కామరాజ్, సి.ఎన్. అన్నాదురై, ఎమ్జీఆర్ల సిసలైన వారసుడిని తానేనని చెప్పుకుంటున్నారు. ఆయన అన్నా డీఎంకే ప్రస్తావనే తీసుకురావటం లేదు. తన ‘సైద్దాంతిక శత్రువు’ను కూడా విమర్శించడం లేదు. తమిళ నాడు నాయకత్వాన్ని కోరుకుంటున్నా, ఇంతకూ రాష్ట్రానికి సంబంధించి విజయ్ ప్రణాళికలేమిటో స్పష్టం కాలేదు. మీడియా ఇంటర్వ్యూలకు కూడా ఆయన దూరంగాఉంటున్నారు. స్టాలిన్ మాత్రం తన వంతుగా, అభివృద్ధికి సంబంధించి ‘ద్రావిడ నమూనా’ను పరిరక్షించుకునేందుకు సాగుతున్న నిర్ణయా త్మక పోరాటంగా ఈ ఎన్నికలను అభివర్ణిస్తున్నారు. కేంద్రం నుంచి ఒత్తిడులను ఎదుర్కొంటూ కూడా, ‘డబుల్ ఇంజిన్’ సర్కారు ఉన్న రాష్ట్రాలకన్నా తమిళనాడు మెరుగైన పనితీరును కనబరచిందని ఆయన చెబుతున్నారు. అయినా ఆయన దేనినీ తేలికగా తీసు కోవడం లేదు. ఇతర రాష్ట్రాల్లో మాదిరి కాకుండా, తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేకత ప్రతి ఐదేళ్ళ కొకసారి పొడసూపుతూఉంటుంది. జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే మాత్రమే గత దశాబ్దంలో ఒకేసారి 2016లో వరుసగా రెండవ విడత విజయాన్ని నమోదు చేసుకోగలిగింది. అన్నా డీఎంకే గురించి విజయ్ ఎలా ప్రస్తావించడం లేదో, అలాగే స్టాలిన్ కూడా విజయ్ పేరును ఎత్తడం లేదు. విజయ్‌పై ధ్వజమెత్తే పనిని ఆయన పార్టీలోని ఇతరులకు వదిలేశారు. కానీ, కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత కూడా, ఆయన జన సమ్మోహక శక్తి తరగక పోవడంతో డీఎంకే ఆందోళనకు లోనవుతోంది. పైగా, ప్రధాన మిత్రపక్షమైన కాంగ్రెస్‌తో డీఎంకే సంబంధాలు గత ఎన్నిక లప్పుడున్నంత బలంగా లేవు. సీట్ల పంపంకంపై అవి బాహాటంగానే కీచులాడుకున్నాయి.అన్నా డీఎంకే అంతంతే!ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకే పాత్ర కుంచించుకుపోయినట్లుగా కనిపిస్తోంది. దాని కూటమిలో బీజేపీతో పాటు టి.టి.వి. దినకరన్ కూడా ఉన్నారు. జయలలితకు సన్నిహితురాలైన శశికళకు ఆయన మేనల్లుడు. కాగా, శశికళ సొంత కుంపటి ఉండనే ఉంది. ఆమె పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో అన్నా డీఎంకేను చికాకు పరచగలదని భావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, అంతో ఇంతో పలుకుబడి కలిగిన ఒ.పన్నీర్ సెల్వం కూడా అన్నా డీఎంకేను వీడి డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. మహారాష్ట్ర, బిహార్ వంటి రాష్ట్రాల్లో కాషాయ పార్టీతో జత కట్టిన ప్రాంతీయ పార్టీలు ఎటువంటి ఫలితాలు సాధించిందీ పార్టీ నాయకుడు ఎళప్పాడి పళనిస్వామి గమనించకపోలేదు. అన్నా డీఎంకే కూటమిలో కెమిస్ట్రీ లోపించిందని తెలుస్తూనే ఉంది. మొత్తం 234 మంది సభ్యులు గల అసెంబ్లీలో 2021 ఎన్నికల్లోడీఎంకే 133 సీట్లు సాధించింది. డీఎంకేను ఎన్డీయే ఓడించలేక పోయినా, మహా అయితే, హంగ్ అసెంబ్లీ ఏర్పడే విధంగా, డీఎంకే కూటమికి చిల్లు పెట్టవచ్చు. ఎన్డీయేతో కలిసో లేదా కలవకుండానో విజయ్ తన వంతు పాత్ర తాను పోషిస్తారు. విజయ్ ‘రాజు కాలేరు. రాజుగా ఎవరినో కూర్చోపెట్టనూ లేరు. ఓట్లను చీలుస్తారంతే’ అని తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ పీయూష్ గోయల్ అందుకే వ్యాఖ్యానించినట్లుంది!-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్-నిరుపమా సుబ్రమణియన్ -
మారిన మనిషి ఇస్తున్న హామీ!
గుజరాత్ అల్లర్ల సంద ర్భంగా రెండు ఫొటోలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. మొదటిది – అశోక్ పర్మార్‌ది. కుడి చేతిలో ఇనపరాడ్డు పట్టు కుని, తలకు కాషాయపు గుడ్ద చుట్టుకుని అతను వీరావేశంతో కనిపిస్తాడు. ఆ ఫొటో ద్వారా జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. అయితే గుజరాత్ అల్లర్లకు కిరీట ధారులు, సూత్రధారులు, అమలుకర్తలు వేరేగా ఉన్నారు. ఆ అల్లర్ల నిర్వాహకులు ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారిని పెద్ద ఎత్తున సమీకరించి విశాలమైన కాల్బలాన్ని నిర్మించారు. అశోక్ పర్మార్ వంటి వారిది అందులో కాల్బలం పాత్ర.1970ల నాటి గుజరాత్లో బనియా, పటేల్, బ్రాహ్మణ సామాజిక వర్గాలు రాజకీయ రంగాన్ని శాసించేవి. దానికి విరుగుడుగా ఒక కొత్త సామా జిక కూర్పును కాంగ్రెస్ నాయకుడు మాధవ్ సింగ్ సోలంకీ రూపొందించారు. క్షత్రియులు, హరిజ నులు, ఆదివాసులు, ముస్లింలను ఇందులో సమీకరించారు. దానికి అనుగుణంగా ఈ సమీ కరణను ‘ఖామ్’ (కేహెచ్‌ఏఎమ్) అని పేరు పెట్టారు. ఇది గుజరాత్ రాజకీయాల్లో ఒక దశలో బాగా పనిచేసింది. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 56 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో 142 స్థానాలు దక్కాయి. అలా దెబ్బతిన్న పటేల్ సామాజిక వర్గం హిందూ సమూహాల ఐక్యతకు పూనుకున్నాయి. అప్పటి ‘బీసీ రిజర్వేషన్’ వ్యతిరేక ఉద్యమం వాళ్లకు కలిసి వచ్చింది. దానితో, ‘ఖామ్’ బలహీనపడింది.హిందూ సమాజంలో అణగారిన సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు దూరం అయ్యాయి. బీజేపీకి దగ్గరయ్యాయి. గుజరాత్ అల్లర్లలో ఈ సమూహాలు రిజర్వుడు సైన్యంగా రంగంలోనికి దిగి చెలరేగి పోయాయి. అలాంటి ఒక అణగారిన వర్గానికిచెందిన వ్యక్తి అశోక్ పర్మార్. అల్లర్ల కిరీటధారులు, సూత్రధారులు, అమలు కర్తలు అలాంటి వారికి సామాజిక అణిచివేత నుండి ఇలా విముక్తిని ప్రసాదించారు. ముస్లింలను ఊచకోత కోయడానికి సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చారు.ఆ అల్లర్లలో ఒక మూకకు చిక్కి ప్రాణభిక్ష పెట్టమంటూ దయనీయంగా వేడుకున్న వేలాది మందిలో కుతుబుద్దీన్ అన్సారీ ఒకరు. నిస్సహాయ స్థితిలో చేతులు జోడించి వేడుకుంటున్న అన్సారీ ఫొటో కూడా అప్పట్లో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గుజరాత్ అల్లర్లు జరిగిన చాలాకాలం వరకు అన్సారీ మామూలు మనిషి కాలేదు. మనుషుల్ని చూస్తే చాలుభయంతో వణికిపోయేవాడు. అప్పట్లో చాలామంది గుజరాత్ ముస్లింల పరిస్థితి ఇదే. మానవ జాతి మీదే నమ్మకాన్ని కోల్పోయే అమానవీయ వాతావరణం అది.చేయి చేయి కలిపిన సందర్భంమరోవైపు, అశోక్ పర్మార్‌కు వాస్తవ సాంఘిక జీవితం గొప్ప పాఠాన్ని నేర్పింది. అల్లర్ల నిర్వ హణలో తనది కాల్బలం పాత్ర మాత్రమేనని అత నికి తెలిసివచ్చింది. అంతకు మించిన సాంస్కృతిక స్థానాన్ని కోరుకుంటే తమ సామాజిక వర్గం మీద కూడా అల్లర్లు జరుగుతాయని కొంచెం ఆలస్యంగా అర్థమయ్యింది. తను చాలా తప్పు చేశానని పశ్చా త్తాపపడ్డాడు. ఇనుప రాడ్డును పడేశాడు. నెత్తిన కట్టుకున్న కాషాయ గుడ్దను విసిరి కొట్టాడు. తన కులవృత్తి అయిన చెప్పులు కుట్టుకోవడం మొదలెట్టాడు. కుతుబుద్దీన్ అన్సారీని వెతికి పట్టుకున్నాడు. తన చెప్పుల బడ్డీ కొట్టును ఆవిష్కరించడానికి ఒప్పించాడు. అలా ఒక విషాదం ఒక పరిష్కారంగాముగిసింది. అశోక్ పర్మార్ , కుతుబుద్దీన్ అన్సారీఇవ్వాళ్టి కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్షిప్... అప్రతిహత శక్తిగా కనిపిస్తున్న మాట నిజమే. దాన్ని ఎవరూ ఏమీ చేయ లేరని చాలామంది అనుకుంటున్న మాట కూడా నిజమే. పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్థలో కమ్యూనిస్టు పార్టీల దగ్గర కార్యక్రమం లేదు. ‘ఇండియా బ్లాక్’ సమష్టిగా లేదు. రాహుల్ గాంధీ ఉండాల్సినంత చొరవగా లేరు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేదు. ఎన్నికల ప్రక్రియ హైజాక్ అయిపోతున్నా దాన్ని సరిదిద్దే మార్గాలు కనిపించడం లేదు.మరోవైపు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి భిన్నంగా సాయుధ పోరాటం సాగిస్తామన్న మావో యిస్టులు సహితం భవిష్యత్తు మీద నమ్మకాన్ని కోల్పోయారు. ఇలాంటి నేపథ్యంలో కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్‌షిప్‌ను ఓడించగలమనే ఊహ కూడా దుస్సాహసం అనేలా ఉంది. కానీ కార్పొ రేట్ కమ్యూనల్ డిక్టేటర్షిప్ కాల్బలం దానిది కాదుఅని అశోక్ పర్మార్ కథ చెబుతోంది. ఈ రోజు కాక పోయినా రేపయినా దాడి మూకల నుండి అశోక్ పర్మార్లు బయటికి వస్తారు. మరో కోరేగావ్ యుద్ధం జరగవచ్చు. అప్పుడు కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ వ్యవస్థ పూర్తిగా బీటలు వారుతుంది. -వ్యాసకర్త రాజకీయ, సామాజిక విశ్లేషకులు-డానీ -
యుద్ధ విరమణ మార్గాలేమిటి?
యూఎస్, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం నాలుగవ వారంలోకి ప్రవేశించింది. అయినా ముగింపు సూచనలు కన బడటం లేదు సరికదా మరింత తీవ్రతర మవుతున్నది. యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక మార్కెట్ల పైన, చమురు మార్కెట్ల పైన స్పష్టంగా కనపడుతున్నది. భారత దేశం కూడా ఈ జియో పొలిటికల్ చరంగంలో చిక్కుకున్నది. చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఫిలిప్ఫైన్స్, సింగపూర్, పాకిస్తాన్ వంటి దేశాలలోని సగటు పౌరులకు యుద్ధ సెగ తగులు తున్నది. సుమారుగా ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న హార్మూజ్ జలసంధి దాదాపుగా మూతపడింది.యుద్ధాలను ప్రారంభించటం దేశాధినేతల చేతిలో ఉంటుంది కానీ ముగింపు మాత్రం వాళ్ల చేతుల్లో ఉండదని ప్రస్తుత సంక్షోభం సూచిస్తున్నది. ప్రారంభం నుండి కూడా యుద్ధ ‘అంతిమ లక్ష్యం’ ఏమిటనే దానిపై యూఎస్–ఇజ్రాయెల్ విధానంలో గందరగోళం కన్పడుతున్నది. ఇరాక్, అఫ్గాన్ యుద్ధాల్లో అగ్రశ్రేణి నాయకత్వాన్ని అంతమొందించి యూఎస్ఏ సులువుగా అక్కడి ప్రభుత్వాలను పడ గొట్టింది. ఇరాక్ అనుభవాల నేపథ్యంలో ఇరాన్ తన నాయకత్వాన్ని పూర్తిగా వికేంద్రీకరించినట్లు స్పష్టమవుతున్నది.ఇరాన్ వ్యూహంఅమెరికా–ఇజ్రాయెల్‌లు ఇరాన్‌ను తమ అస్తిత్వానికి ముప్పుగా పరిగణిస్తున్నాయి. ఈ ముప్పు తప్పాలంటే మూడు లక్ష్యాలను నిర్దే శించుకున్నాయి: 1. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం. 2. ఇరాన్ క్షిపణి కార్యక్రమాన్ని పూర్తిగా ధ్వంసం చేయటం. 3. ఇరాన్లో అధికారం మతతత్వ శక్తుల నుండి బాధ్యతా యుతమైన వర్గాలకు బదలాయింపు. ఈ మూడు లక్ష్యాలు కేవలం గగనతల యుద్ధం ద్వారా సాధించాలనుకోవటం అత్యాశ. వెని జులాలో మాదిరిగా అధ్యక్షుడిని తప్పించటంతో ప్రభుత్వం మారు తుందని ట్రంప్ భావించినట్లయితే అది హాస్యాస్పదం. మధ్య ప్రాచ్యంలో ఇరాన్ ఒక బలమైన రాజకీయ శక్తి. రెండు దశాబ్దాలకు పైగా ఆర్థిక ఆంక్షలు ఉన్నప్పటికీ బలమైన సాయుధ సంపత్తిని ఏర్పరచుకున్నది. రష్యా–చైనాలతో వ్యూహాత్మక సంబంధాలనుపెంపొందించుకున్నది. 2025 జూన్‌లో జరిగిన పన్నెండు రోజుల యుద్ధం తర్వాత ఒక సుదీర్ఘ పోరాటానికి సమగ్ర ప్రణాళికతో సున్నద్ధంగా ఉన్నట్లుగా కన్పిస్తున్నది. అందుకే ప్రస్తుత యుద్ధం ప్రారంభం కాగానే ఇరాన్ నేరుగా గల్ఫ్ దేశాలను ఈ యుద్ధం లోనికి లాగింది. ఇది ఊహించని పరిణామం ఏమీ కాదు. మధ్యప్రాచ్యంలో సంక్షోభానికి, పాలస్తీనా సంక్షోభానికి ముఖ్య కారణం యూఏఈ, సౌదీ, ఖతర్ వంటి దేశాలు యూఎస్ఏ కొమ్ముకాయటమేనని ఇరాన్ మొదటినుండీ వాదిస్తున్నది. యూఎస్ఏ మధ్యవర్తిత్వంతో అరబ్ దేశాలు 2020లో ఇజ్రా యెల్‌తో సంబంధాలు మెరుగు పరచుకోవటానికి ఒప్పందాలు (అబ్రహాం ఒప్పందాలు) చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా యూఏఈ, బహ్రెయిన్లు ఇజ్రాయెల్‌తో ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకున్నాయి. సౌదీ, యూఏఈ, ఖతర్ గత దశాబ్ద కాలంగా తమ ఆర్థిక వ్యవస్థలను కేవలం చమురు ఎగుమతులపై ఆధారపడకుండా పారిశ్రామికాభివృద్ధి, ఐటీ, పర్యాటక రంగం, బ్యాంకింగ్–ఫైనాన్స్ రంగాల వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తు న్నాయి. యూఎస్ఏ – ఐరోపా ఆర్థిక వ్యవస్థలతో తమ ఆర్థిక వ్యవ స్థలను అనుసంధానిస్తున్నాయి. ఇందులో భాగంగానే పాలస్తీనా (గాజా), ఇజ్రాయెల్ విషయాలలో కొంత మెతక లేదా పాశ్చాత్య సానుకూల ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ హమాస్ (గాజా), హెజ్బొల్లా (లెబనాన్), హౌతీ (యెమెన్) వంటి రాడికల్ ఇస్లామిక్ సంస్థలను పెంచి పోషిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌తో బాటుగా, లెబనాన్‌లోని హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీంతో సౌదీ యువరాజు యూఎస్ఏ ఒత్తిడిని తట్టుకుని అబ్రహాం ఒప్పందాలపై సంతకం చేయటానికీ నిరాకరించాడు.పోరాడితే పోయేదేమీ లేదు!ఇరాన్ – ఖతర్‌లలో విస్తరించిన దక్షిణ పార్స్ సహజ వాయువు నిల్వల క్షేత్రం ప్రపంచంలో కెల్లా అతిపెద్దది. ఈ క్షేత్రం మీద దాడి ద్వారా ఇజ్రాయెల్ యుద్ధాన్ని క్లిష్ట దశలోనికి నెట్టివేసినట్లే. ఇప్పటి వరకూ యుద్ధంలో ఇరాన్ కొత్తగా ఆర్థికంగా నష్టపోయిందేమీ లేదు. ఇరాన్ చౌకగా తయారు చేసిన డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, అమెరికా లక్ష్యాలను దెబ్బతీస్తున్నది. అమెరికా – ఇజ్రా యెల్ ఈ చౌక డ్రోన్లను, క్షిపణులను పేల్చి వేయటానికి అత్యంత ఖరీ దైన పేట్రియాట్, థాడ్ క్షిపణులను వాడాల్సి వస్తున్నది. ఈ రకంగా యూఎస్–ఇజ్రాయెల్‌లకు ఇది ఖరీదైన యుద్ధంగా పరిణమించింది.అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు పెరగటం ఇరాన్‌కు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలోనే యూఎస్ మొదటగా ఇరాన్ చమురు ఎగుమతి కూడలి అయిన ఖర్గ్ దీవిపైనా, ఇజ్రాయెల్... ఇరాన్ ప్రధాన సహజ వాయువు క్షేత్రమైన దక్షిణ పార్స్ నిల్వలపైనా దాడి చేశాయి. ఆర్థికంగా ఇరాన్‌ను దిగ్బంధించటానికి ఈ ఎత్తుగడ. దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాల ఆయువుపట్టులపై ప్రతీకార దాడులకు దిగుతోంది. ఈ వ్యూహంలో భాగంగానే ఖతార్ ప్రధాన ఎల్ఎన్జీ కేంద్రం ‘రస్ లఫాన్’పై దాడికి దిగింది. దీనివల్ల ఐరోపా దేశాలకు గ్యాస్ ఎగుమతికి ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అమెరికా– ఇజ్రాయెల్ వైపు వేలెత్తి చూపుతున్నాయి. అమెరికాలో కూడా ఇంధన ధరలు పెరిగిక్రమంగా ప్రజాభిప్రాయం యుద్ధానికి వ్యతిరేకంగా మారుతున్నది. రష్యాకు ఉపయుక్తంనిశితంగా పరిశీలిస్తే, యూఎస్–ఇజ్రాయెల్‌లకు ఈ యుద్ధాన్ని ముగించటానికి మార్గాలు చాలా తక్కువ. అవి కూడా క్లిష్టమైనవి. ఇరాన్ తనంత తానుగా బేషరతుగా లొంగిపోయి యుద్ధాన్ని విర మించే అవకాశాలు మృగ్యం. అమెరికా ప్రత్యేక దళాలను రంగంలోకి దించి, ఇరాన్ పాక్షికంగా శుద్ధి చేసిన యురేనియంను మెరుపు దాడిలో చేజిక్కించుకొని, ఆ సాకుతో యుద్ధ విరమణ చేయటం ఒక ప్రత్యామ్నాయం. కుర్ద్ తిరుగుబాటు దారులను ప్రోత్సహించి వారి ద్వారా ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోయటం మరొక మార్గం. టర్కీ లేదా ఇరాక్ భూతల మార్గాల ద్వారా అమెరికా–ఇజ్రాయెల్ సైనిక బలగాలు ఇరాన్లో ప్రవేశించి ప్రభుత్వాన్ని కూలదోయటం అతిసంక్లిష్టమయిన ప్రత్యామ్నాయం. ఈ ప్రత్యామ్నాయాలన్నింటిలో పెద్ద సంఖ్యలో యూఎస్/ఇజ్రాయెల్ సైనికులు చనిపోయే అవకాశా లున్నాయి. ఇవి వాటికి రాజకీయంగా ఆత్మహత్యా సదృశం. ఈ యుద్ధం ఒక రకంగా రష్యాకు ఉపయుక్తంగా మారినట్లుగా కన్పిస్తున్నది. రష్యా చమురు గ్యాస్‌కు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరిగింది. తప్పనిసరి పరిస్థితులలో రష్యా నుండి చమురు కొనుగోళ్ల ఆంక్షలను అమెరికా సడలించాల్సి వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధంనుండి యూఎస్ఏ–ఐరోపా దృష్టి మరలటం కూడా రష్యాకు కలి సొస్తుంది. మధ్య ప్రాచ్యం, గల్ఫ్ దేశాలలో రష్యా ప్రాపకం మరింతగా బలపడే అవకాశాలు కన్పిస్తున్నాయి.జియో పొలిటికల్ కోణంలో పరిశీలిస్తే, అమెరికా ప్రాంతీయ శక్తులను బలహీనపరిచే వ్యూహంలో ఈ యుద్ధాన్ని ఒక భాగంగా పరిగణించవచ్చు. మధ్య ఆసియాలో ఇరాన్–ఇరాక్ సహజప్రాంతీయ శక్తులు. వీటిని బలహీనపరచటానికి యూఎస్ఏ మొదటి నుండి సౌదీ అరేబియా, యూఏఈలను బలోపేతం చేస్తున్నది. ఇదివరకు గల్ఫ్ యుద్ధంలో భాగంగా ఇరాక్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆ సందర్భంగా కూడా ఇరాక్‌లో అణ్వాయుధాలు (వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్) ఉన్నాయని నింద మోపింది. ఏ రకమైన అణ్వా యుధాలు లేవని చివరకు ఒప్పుకొన్నది. ప్రభుత్వాల మార్పిడి, ముందస్తు దాడులు వంటి సిద్ధాంతాలను యూఎస్ఏ తన జియో పొలిటికల్ వ్యూహంలో భాగంగా అమలు చేస్తున్నది. ఇరాన్‌పై యుద్ధాన్ని కూడా ఈ కోణం నుండే చూడాల్సి ఉంటుంది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల బోధకులు-గురజాల శ్రీనివాసరావు -
అసలు పోరు దీదీతో!
అసెంబ్లీ ఎన్నికలు త్వరలో అయిదు రాష్ట్రాలకు జరగనున్నాయి గానీ, దేశందృష్టి ప్రధానంగా ఉండేది ‘దీదీ’ పైనే. బీజేపీ అసలు యుద్ధం కూడా మమతా బెనర్జీతోనే. ఇప్పటికే వరుసగా మూడు సార్లు పశ్చిమ బెంగాల్ సీఎం అయిన ఆమె నాల్గవసారి కూడా విజయం సాధి స్తారా, లేక బీజేపీ ఈసారి అధికార లక్ష్యాన్ని చేరగలదా అన్నది ముఖ్యమే అయినా, అది మాత్రమే కాదు ప్రశ్న. సీట్లు అధికారానికి సంబంధించిన విషయం కాగా, ఇందులో దీర్ఘకాలిక సైద్ధాంతిక అంశాలు కూడా ఉన్నాయి.ఐదు ప్రచారాంశాలుతన 55 సంవత్సరాల రాజకీయ జీవితం పొడవునా ‘ఫైర్‌బ్రాండ్’గానే నిలిచిన మమత, ఒక విలక్షణమైన నాయకురాలు. 70 సంవత్సరాల వయసు దాటిన స్థితిలోనూ తనలోని అగ్ని మందగించక పోవటం అసాధారణ విషయం. 1998లో తృణమూల్కాంగ్రెస్ (టీఎంసీ) స్థాపించినప్పటి నుంచి కాంగ్రెస్‌తో పాటు వామ పక్ష కూటమిని, బీజేపీని కూడా ఒంటి చేత ఢీకొని వరుసగా గెలుస్తూ వస్తు న్నారు. ఆమె వరుసగా మూడవసారి రాష్ట్రంలో విజయ పతాకను ఎగరవేసినట్లే, వరుసగా మూడవసారి కేంద్రంలో గెలిచిన బీజేపీ, ఈసారి ఏ విధంగానైనా పశ్చిమ బెంగాల్‌ను వశపరచుకుని తీరా లన్న పట్టుదలతో ఉంది. అక్కడి మొత్తం స్థానాలు 294లో పోయిన మారు తృణమూల్ గెలిచిన 213కు, బీజేపీ తెచ్చుకోగలిగిన 77కు మధ్యగల తేడా 136 చాలా పెద్దదే అయినా, దానిని అధిగమించేదుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం, అధికారపక్షమైన బీజేపీ, వారి మాతృ సంస్థ అయిన సంఘ్ పరివార్ భూమ్యాకాశాలను ఏకం చేస్తున్నాయి.ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడినపుడు ఏమి జరగవచ్చు నన్నది అట్లుంచితే, రాగల ఆరు వారాల ప్రచారం స్థూలంగా అయిదు అంశాల చుట్టూ తిరగగలదని భావించవచ్చు. ఒకటి– మమత, మోదీ నాయకత్వాల స్పర్థ. రెండు– హిందూ జాతీయ వాదం, బెంగాలీ జాతీయవాదం. మూడు–ఫెడరలిజం, యూనిట రిజం. నాలుగు–తృణమూల్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం. అయిదు– సెక్యులరిజం, మతతత్వం. బెంగాలీ జాతీయవాదంస్వాతంత్య్రోద్యమ కాలం నుంచి బెంగాలీ జాతీయవాదంఎంత బలంగా రూపు దిద్దుకున్నదో తెలిసిందే. విశేషమేమంటే, 34 సంవత్సరాలపాటు పాలించిన వామపక్ష కూటమి సైతం మార్క్సిజ మని ఎంత మాట్లాడిందో బెంగాల్ జాతీయవాదాన్ని అంత పాటించింది. ఆ సుదీర్ఘ సంప్రదాయానికి మమత వారసురాలిగా మారారు. అందుకే గత ఎన్నికలలో బీజేపీ శ్రీరాముడిని, హిందూత్వాన్నిముందుకు తేగా, మమతా బెనర్జీ తమ దేవతలు కాళిక, కృష్ణుడుబెంగాలీ సంస్కృతి అంటూ వారి చిత్రాలతో ర్యాలీలు జరిపారు. శ్రీరాముడు 19వ శతాబ్దంలో మాత్రమే బయటి వ్యాపారులతోబెంగాల్కు ‘దిగుమతి’ అయ్యాడని ప్రకటించారు. అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ సర్కార్ అక్కర లేదంటూ, తన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, రాష్ట్రంపట్ల మోదీ ప్రభుత్వ వివక్షను ప్రజల దృష్టికి తీసు కువెళ్లారు. ఫెడరలిజం, సెక్యులరిజం తమ నినాదాలని స్పష్టం చేశారు. ఫలితాలు కనిపించినవే. వామపక్ష కూటమి, కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బతినటంతో పాటు వారి నాయకులు, ఓటర్లు బీజేపీ వైపు మళ్ల టంతో 2019, 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ తగినన్ని సీట్లు (మొత్తం 42లో 18; 12) గెలవగలిగింది గానీ, అసెంబ్లీ సీట్లు 294లో తృణమూల్ బలం 210 కన్న తగ్గలేదు. వామపక్షాలు, కాంగ్రెస్ ఉమ్మడి బలం 2016 నాటి 120 నుంచి 2021లో దారుణంగా పత నమై వారి ఓటర్లు మళ్లటం వల్ల బీజేపీ సీట్లు 3 నుంచి 77కు పెరి గాయి. గత ఎన్నికలలో మమత పట్ల ఆగ్రహంతో బీజేపీ వైపు మొగ్గిన లెఫ్ట్, కాంగ్రెస్ శ్రేణులు ఈసారి తీసుకోగల వైఖరి ఏమి టన్నది గమనించదగినదవుతున్నది. బీజేపీని బాహాటంగా ఢీకొంటున్న నాయకురాలిగా ప్రశంసలు పొందుతున్న మమతా బెనర్జీ, ‘సర్’ పేరిట సాగిన ఓటర్ జాబితాల సవరణను ఏ మేరకు ఎదు ర్కొనగలరన్నది ఈసారి కొత్త పరీక్ష అవుతున్నది.తమిళనాడు రాజకీయాలుబెంగాల్లో వలె తమిళనాడులోనూ అధికార స్పర్థకు సైద్ధాంతిక అంశాలు తోడవుతున్నాయి. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఎంత ప్రభావం చూపవచ్చుననే అంచనాలను తప్పిస్తే, యథాతథంగా తమిళనాట పాలిస్తున్న డీఎంకే కూటమి బలమైనది. అక్కడి 234 స్థానాలలో ఆ కూటమి పోయినమారు 159 గెలిచింది. 75 తెచ్చుకున్న అన్నాడీఎంకే కూటమి చీలింది. ఒక వర్గం మాజీ ముఖ్య మంత్రి పన్నీర్ సెల్వం నాయకత్వాన డీఎంకేలో విలీనమైంది. అన్నాడీఎంకే కూటమిలోకి కొత్తగా ఎవరూ రాలేదు. ముఖ్యంగా జయలలిత మరణం తర్వాత బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వ మేదీ ఆవిర్భవించలేదు. స్టాలిన్ ప్రభుత్వ పాలన పట్ల చెప్పుకోదగిన అసంతృప్తి కనిపించటం లేదు. బెంగాల్లో వలెనే తమిళనాడులో కూడా తమిళ జాతీయవాదం, లేదా ద్రవిడ వాదం, ఫెడరల్ హక్కుల నినాదం దశాబ్దాలుగా కలగలిసిపోయి ఉన్నాయి. అందుకు ఉత్తరాది వ్యతిరేకత నుంచి ఒక పాయగా పుట్టుకు వచ్చిన సెక్యులరిజం తోడైంది. తమిళ సమాజాన్ని హిందూత్వ స్రవంతిలోకి తెచ్చేందుకు సంఘ్ పరివార్ అనేక ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు. అన్నాడీఎంకేను వెంట చేర్చుకునేందుకు లోగడ విఫల ప్రయత్నాలు చేసిన మీదట, రజనీకాంత్‌పై ఆశలు పెట్టుకోగా ఆయన రాజకీయా లలోకి రాకపోగా, ఇపుడు విజయ్ వైపు చూస్తున్నారు. ఇంతవరకైతే ఆయన ససేమిరా అంటున్నారు. అనూహ్యంగా విజయ్ గెలిచినట్ల యితే తప్ప మరోసారి డీఎంకేదే అధికారం కావచ్చు. కేరళ పరిస్థితి కూడా ఇటువంటిదే. 140 సీట్లు గల ఆ రాష్ట్రంలో మళ్లీ లెఫ్ట్ ఫ్రంట్, లేదా కాంగ్రెస్ నాయకత్వాన గల యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మినహా, కనీసం ఒక్క స్థానమైనా లేని బీజేపీకి అధికారమన్నది వారు సైతం ఆలోచించటం లేదు. పోయినమారు అనూహ్యంగా త్రిస్సూర్‌లో లోక్‌సభ గెలిచినందున ఆ పరిధిలోని అసెంబ్లీలు ఏవైనా గెలవగలరేమో చూడాలి. పుదుచ్చేరి విషయం అట్లుంచితే, అస్సాంలో గత పదేండ్ల నుంచి ప్రభుత్వంలో గల బీజేపీకి అధికారాన్ని నిలబెట్టుకోవటం పరీక్ష అవుతుంది. పోయిన మారు 126 స్థానాలలో 60 మాత్రమే తెచ్చుకుని, తర్వాత పరిపా లనా వైఫల్యాలతో కొంత అప్రతిష్ఠ పాలైనా, హిందూత్వ వాదం బలంగా ఉండటంపై వారు ఆశలు పెట్టుకుని ఉన్నారు. హిందూత్వ వాదం, కేంద్రీకృత అధికారం ఒకవైపు; ప్రాంతీయ జాతీయ వాదాలు, ఫెడరలిస్టు భావనలు మరొకవైపు అన్నట్లుగాఉంది. ఈ రెండు శక్తుల సైద్ధాంతిక పోరాటాలకు బెంగాల్, తమిళనాడు కేంద్రం కానున్నాయి. ఆ ఫలితాల ప్రభావం అనేక విధాలుగా ఉండగలదు.-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు-టంకశాల అశోక్ -
పశ్చిమాసియాలో ప్రపంచీకరణ శిథిలం
ఇరాన్‌పై లెక్కలేనితనంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలెట్టిన యుద్ధం ఆయన చేయి దాటిపోయింది. ట్రంప్ ప్రభుత్వ సామ్రాజ్యవాద పర్యవసానంగా నష్టాన్ని చవిచూస్తున్న ఓ భారతీయురాలిగా ఆయన పరాజయం చూసి కొంత పైశాచికానందం పొందాలని అనుకుంటున్నాను. ఎందుకంటే, ఇరాన్‌పై సైనిక చర్య మన ఆర్థిక వ్యవస్థకు వినాశకర పరిణామాలను కలుగజేస్తోంది. మన ఇంధన భద్రతకు ముప్పు తెస్తోంది. మన భౌగోళిక రాజకీయ సమీకరణాలను తారుమారు చేస్తోంది. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న దాదాపు కోటి మంది భారతీయులు వారు ఏమాత్రం ఆశించని యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. భారతదేశపు ముడి చమురు దిగుమతులలో దాదాపు నలభై శాతం హోర్మూజ్ జలసంధి ద్వారానే వస్తాయి. ఆ సముద్ర మార్గం ఇపుడు పూర్తిగా ఇరానియన్ల చేతిలో ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే తాము విధిస్తామని చెప్పిన అపరాధ సుంకాన్ని మాఫీ చేస్తున్నట్లు అమెరికా చెప్పుకొంది. నిజానికి, శ్వేత సౌధం చెప్పుకుంటున్నట్లుగా, మనం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఎన్నడూ ఆపలేదు. అమెరికా రాయితీ అధిక చమురు ధరల నుంచి మనకేమీ రక్షణ కల్పించలేదు. పెట్టుబడిదారులకూ రక్షణ కరవుఇది పైకి ప్రపంచీకరణ పర్యవసానంగా కనిపించవచ్చు. వాస్తవానికి, ఈ యుద్ధం ప్రపంచీకరణకు వ్యతిరేకమైనది. ట్రంప్ పాలన ప్రపంచీకరణకు చెందిన మూల సూత్రాన్నే ధ్వంసం చేసింది. ప్రపంచీకరణ అంటే, కేవలం పరస్పరం ఆధారపడటమే కాదు, ఏకీకరణ చెందడం కూడా. దుబాయ్, అబు దాబీ రోజూ డ్రోన్లు, క్షిపణుల దాడులకు లోనవుతున్నాయి. ప్రపంచీకరణ యుగంలో, పెత్తందారీ దేశాల పెనుగాలుల నుంచి పెట్టుబడిదారీ ఒయాసిస్సులకు రక్షణ ఉంటుందనే ఆలోచనను ట్రంప్ యుద్ధం పటాపంచలు చేసింది.ట్రంప్ అచ్చం ఒక నిర్దాక్షిణ్య నయా సామ్రాజ్యవాదిగానే ప్రవర్తిస్తున్నారు. అమెరికా అణు జలాంతర్గామి ఒకటి అంతర్జాతీయ జలాలలో ఇరానియన్ యుద్ధ నౌకను ముంచేసింది. ‘మిలన్’ నౌకాదళ విన్యాసాలలో అది భారతదేశానికి అతిథిగా వ్యవహరించిన రెండు వారాలకే ఆ దుర్ఘటన చోటుచేసుకుంది. అమెరికా దుశ్చర్య ఒక ప్రమాదకర, అశాంతిదాయక ప్రమాణాన్ని నెలకొల్పింది. రేపు, చైనా కూడా తన స్వీయ సైనిక చర్యకు తన నౌకలను ఇలాగే హిందూ మహా సముద్రంలోకి పంపించవచ్చు.భారత్‌కు రెండు వైపులా పాఠాలుఉన్న సమాచారం మేరకు, ఆ తర్వాత, భారత్ మంచి పనే చేసింది. శరణు కోరిన మూడు ఇరానియన్ నౌకలకు అభయమిచ్చింది. ఆ నౌకలకు 24 గంటల్లోగా అండగా నిలిచింది. కొలంబోలో ఉన్న ఐ.ఆర్.ఐ.ఎస్. దేనా నౌక నుంచి ఆపదలో ఉన్నట్లు సంకేతం రాగానే అన్వేషణ, రక్షణ సిబ్బందితో రంగంలోకి దిగింది. అమెరికా తన కార్యకలాపాలను హిందూ మహా సముద్రంలో, శ్రీలంకకి సమీపంలోకి విస్తరిస్తున్నట్లు మన నౌకాదళానికి తెలియజేయలేదు. ఎలాంటి కలాపాలు చేపట్టబోతున్నారో మనకేమీ చెప్పనవసరం లేదు. కనీసం తమ ఉనికిని తెలియచేయడం వృత్తిపరమైన మర్యాద అనిపించుకుంటుంది. అదే సమయంలో, అక్కడి జలాలలో ఒక భారతీయ నౌక ఉండి ఉంటే పరిస్థితి ఏమిటి? ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. కానీ, ఆ సమరం నాలుగు రోజులకు బదులు నాలుగు వారాల పాటు సాగి ఉంటే పరిస్థితిని ఊహించండి. ఉగ్రవాదులు లేదా పోషకుల చేతుల్లో డ్రోన్లు ఉండి ఉంటే! స్వల్ప కాలిక భద్రతా సవాళ్ళ నుంచి రక్షణకైనా లేదా దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి పెట్టి అయినా, భారత్ సైనిక శక్తిని బలోపేతం చేసుకుని తీరాలి. ఆ దిశగా సాగించే దీర్ఘకాలిక పయనానికి మన ప్రజాస్వామ్యం, వైవిధ్యం, బహుళత్వం, రాజ్యాంగ విలువలకు మనం ఇచ్చే ప్రాధాన్యం కరదీపికలు కావాలి. ట్రంప్ గద్దె దిగిన తర్వాత కూడా, ప్రపంచంలో మరెవరైనా ఇదే రీతిలో వ్యవహరించవచ్చు. మన మార్కెట్లు, సైనిక శక్తే మనకు శ్రీరామ రక్ష. మరింత తిరోగమన వ్యవస్థలుఅమెరికా అధ్యక్షులలో బాధ్యతారహితమైన యుద్ధాలను ప్రారంభించింది ట్రంప్ ఒక్కరే కాదు. దాదాపుగా 1960ల నుంచి ఇదే కథ నడుస్తోంది. క్యూబాలో కెన్నెడీ వేలు పెట్టడం నుంచి అఫ్గానిస్తాన్‌లో పరాభవం వరకు వివిధ దేశాల్లో పాలనా వ్యవస్థలను మార్చడానికి అమెరికా చేసిన ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. వారు ఏ పాలనా వ్యవస్థను కూలదోస్తామని చెబుతున్నారో ఆ పాలనా వ్యవస్థ కంటే రాక్షసమైన వ్యవస్థలు పుట్టుకొస్తున్నాయి. ఇరాక్‌లో ‘ఐసిస్’ లేదా అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ పునరాగమనం కన్నా నిదర్శనం ఏం కావాలి? కాకపోతే దౌత్యానికి సంబంధించిన మొత్తం రీతి రివాజులను పక్కకు నెట్టేసిన మొదటి ప్రభుత్వంగా ట్రంప్ ప్రభుత్వం అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఈ సందర్భంగా, కెనడా ప్రధాని మార్క్ కార్నీ దావోస్‌లో చేసిన ప్రసంగం గుర్తుకు వస్తోంది. దౌత్యపరమైన పరిభాష చక్కెర పూతగా మారిందనీ, దౌత్యపరమైన చర్చలు కపటంగానే సాగుతున్నాయనీ ఆయన పేర్కొన్నారు. అది నిజమే కావచ్చు కానీ, కనీసం దానివల్ల కలసి కూర్చుని మాట్లాడుకునేందుకు ఒక ఉమ్మడి భాష అంటూ ఉంటుంది. పాటించవలసిన మానవ మర్యాదలు ఉంటాయి. ముఖ్యంగా, ప్రత్యర్థి దేశాన్ని బలహీనపరచేందుకు సాగే రణ తంత్రాలలో అవి సహాయపడతాయి. ఇది ఇరానియన్ పాలక వ్యవస్థకో లేదా మరి ఏ ఇతర నిరంకుశ ప్రభుత్వానికో చేస్తున్న సంగ్రహ హెచ్చరిక కాదు. నియంతృత్వాలకు లేదా మతపరమైన ఛాందసవాద పాలకులకు లేదా నియాండర్తల్ వ్యవస్థలకు గుణపాఠం నేర్పేందుకు చేసే యుద్ధాలకు ఒక అంతిమ లక్ష్యం అంటూ ఉండాలి. సాధారణ ప్రజానీకంపై విరుచుకుపడటం వల్ల ప్రయోజనం ఉండదు. ఒక వ్యక్తి చపలచిత్త ధోరణులు, హద్దులేనితనానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఐక్యం అయితే తప్ప ఫలితం ఉండదు. లేదంటే ప్రపంచీకరణ ఛిన్నాభిన్నమవుతుంది. ఏ దేశానికాదేశం అతలాకుతలం అవుతుంది.-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-బర్ఖా దత్ -
మారిన మనిషి ఇస్తున్న హామీ!
గుజరాత్ అల్లర్ల సందర్భంగా రెండు ఫొటోలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. మొదటిది – అశోక్ పర్మార్‌ది. కుడిచేతిలో ఇనపరాడ్డు పట్టుకుని, తలకు కాషాయపు గుడ్ద చుట్టుకుని అతను వీరావేశంతో కని పిస్తాడు. ఆ ఫొటో ద్వారా జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. అయితే గుజరాత్ అల్లర్లకు కిరీట ధారులు, సూత్రధారులు, అమలుకర్తలు వేరేగా ఉన్నారు. ఆ అల్లర్ల నిర్వాహకులు ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారిని పెద్ద ఎత్తున సమీకరించి విశాలమైన కాల్బలాన్ని నిర్మించారు. అశోక్ పర్మార్ వంటి వారిది అందులో కాల్బలం పాత్ర.1970ల నాటి గుజరాత్లో బనియా, పటేల్, బ్రాహ్మణ సామాజిక వర్గాలు రాజకీయ రంగాన్ని శాసించేవి. దానికి విరు గుడుగా ఒక కొత్త సామాజిక కూర్పును కాంగ్రెస్ నాయకుడు మాధవ్ సింగ్ సోలంకీ రూపొందించారు. క్షత్రియులు, హరిజ నులు, ఆదివాసులు, ముస్లింలను ఇందులో సమీకరించారు. దానికి అనుగుణంగా ఈ సమీ కరణను ‘ఖామ్’ (కేహెచ్‌ఏఎమ్) అని పేరు పెట్టారు. ఇది గుజరాత్ రాజకీయాల్లో ఒక దశలో బాగా పనిచేసింది. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 56 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో 142 స్థానాలు దక్కాయి. అలా దెబ్బతిన్న పటేల్ సామాజిక వర్గం హిందూ సమూహాల ఐక్యతకు పూనుకున్నాయి. అప్పటి ‘బీసీ రిజర్వేషన్’ వ్యతిరేక ఉద్యమం వాళ్లకు కలిసివచ్చింది. దానితో, ‘ఖామ్’ బలహీనపడింది. హిందూ సమాజంలో అణగారిన సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు దూరం అయ్యాయి. బీజేపీకి దగ్గరయ్యాయి. గుజరాత్ అల్లర్లలో ఈ సమూహాలు రిజర్వుడు సైన్యంగా రంగంలోనికి దిగి చెలరేగిపోయాయి. అలాంటి ఒక అణగారిన వర్గానికి చెందిన వ్యక్తి అశోక్ పర్మార్. అల్లర్ల కిరీటధారులు, సూత్రధారులు, అమలుకర్తలు అలాంటివారికి సామాజిక అణిచివేత నుండి ఇలా విముక్తిని ప్రసాదించారు. ముస్లింలను ఊచకోత కోయడానికి సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చారు.ఆ అల్లర్లలో ఒక మూకకు చిక్కి ప్రాణభిక్ష పెట్టమంటూ దయనీయంగా వేడుకున్న వేలాది మందిలో కుతుబుద్దీన్ అన్సారీ ఒకరు. నిస్సహాయ స్థితిలో చేతులు జోడించి వేడుకుంటున్న అన్సారీ ఫొటో కూడా అప్పట్లో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గుజరాత్ అల్లర్లు జరిగిన చాలాకాలం వరకు అన్సారీ మామూలు మనిషి కాలేదు. మనుషుల్ని చూస్తే చాలు భయంతో వణికిపోయేవాడు. అప్పట్లో చాలామంది గుజరాత్ ముస్లింల పరిస్థితి ఇదే. మానవజాతి మీదే నమ్మకాన్ని కోల్పోయే అమానవీయ వాతావరణం అది.చేయి చేయి కలిపిన సందర్భంమరోవైపు, అశోక్ పర్మార్‌కు వాస్తవ సాంఘిక జీవితం గొప్ప పాఠాన్ని నేర్పింది. అల్లర్ల నిర్వహణలో తనది కాల్బలం పాత్ర మాత్రమేనని అతనికి తెలిసివచ్చింది. అంతకు మించిన సాంస్కృతిక స్థానాన్ని కోరుకుంటే తమ సామాజిక వర్గం మీద కూడా అల్లర్లు జరుగుతాయని కొంచెం ఆలస్యంగా అర్థమయ్యింది. తను చాలా తప్పు చేశానని పశ్చాత్తాప పడ్డాడు. ఇనుప రాడ్డును పడేశాడు. నెత్తిన కట్టుకున్న కాషాయ గుడ్దను విసిరి కొట్టాడు. తన కుల వృత్తి అయిన చెప్పులు కుట్టుకోవడం మొదలె ట్టాడు. కుతుబుద్దీన్ అన్సారీని వెతికి పట్టు కున్నాడు. తన చెప్పుల బడ్డీ కొట్టును ఆవిష్క రించడా నికి ఒప్పించాడు. అలా ఒక విషాదం ఒక పరిష్కా రంగా ముగిసింది. ఇవ్వాళ్టి కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్షిప్... అప్రతిహత శక్తిగా కనిపిస్తున్న మాట నిజమే. దాన్ని ఎవరూ ఏమీ చేయ లేరని చాలామంది అనుకుంటున్న మాట కూడా నిజమే. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కమ్యూనిస్టు పార్టీల దగ్గర కార్యక్రమం లేదు. ‘ఇండియా బ్లాక్’ సమష్టిగా లేదు. రాహుల్ గాంధీ ఉండాల్సినంత చొరవగా లేరు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేదు. ఎన్నికల ప్రక్రియ హైజాక్ అయిపోతున్నా దాన్ని సరిదిద్దే మార్గాలు కనిపించడం లేదు.మరోవైపు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి భిన్నంగా సాయుధ పోరాటం సాగిస్తామన్న మావోయిస్టులు సహితం భవిష్యత్తు మీద నమ్మకాన్ని కోల్పోయారు. ఇలాంటి నేపథ్యంలో కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్‌షిప్‌ను ఓడించగలమనే ఊహ కూడా దుస్సాహసం అనేలా ఉంది. కానీ కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్షిప్ కాల్బలం దానిది కాదు అని అశోక్ పర్మార్ కథ చెబుతోంది. ఈ రోజు కాకపోయినా రేపయినా దాడి మూకల నుండి అశోక్ పర్మార్లు బయటికి వస్తారు. మరో కోరేగావ్ యుద్ధం జరగవచ్చు. అప్పుడు కార్పొరేట్ కమ్యూ నల్ డిక్టేటర్ షిప్ వ్యవస్థ పూర్తిగా బీటలు వారుతుంది. డానీవ్యాసకర్త రాజకీయ, సామాజిక విశ్లేషకులు -
ఒక విఫల కుట్ర – ఒక సామ్రాజ్య జననం!
అది క్రీస్తుపూర్వం 44వ సంవత్సరం, మార్చి 15వ తేదీ మధ్యాహ్నం. రోమ్ నగరంలోని సెనేట్ హాల్ రక్తంతో తడిసి ముద్దయింది. నియంతృత్వం నుంచి రోమన్ రిపబ్లిక్‌ను రక్షించాలనుకున్న సుమారు అరవై మంది కుట్రదారులు... ఆ కాలపు అత్యంత శక్తిమంతుడైన జూలియస్ సీజర్‌ను కత్తులతో పొడిచిచంపారు. ఆ క్షణంలో వారు తాము ఒక నియంతను అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడామని భ్రమపడ్డారు. సీజర్ మరణం ప్రజాస్వామ్యాన్ని పరిఢవిల్లజేయడం అటుంచి... పదమూడేళ్ల సుదీర్ఘ అంతర్యుద్ధానికీ, తద్వారా ఒక నిరంకుశ సామ్రాజ్య ఆవిర్భావానికీ దారితీసింది. ఈ హత్య ప్రపంచ చరిత్ర గమనాన్ని శాశ్వతంగా మార్చేసిన ఒక రాజకీయ పరిణామంగా మిగిలి పోయింది.రోమన్ రిపబ్లిక్‌ను పాలిస్తున్న పాలక వర్గం (నొబిలిటీ) అప్పటికే అవినీతిలో కూరుకుపోయి, సామాన్య ప్రజల దృష్టిలో విశ్వసనీయతను కోల్పోయింది. రోమన్ ప్రభువులు విదేశీ దండ యాత్రల ద్వారా వచ్చే సంపదను పంచుకోవడంలో నిమగ్నమై, దేశీయ సమస్యలను విస్మరించారు. సామాన్య ప్రజలు, రైతులు నిరుపేదలుగా మారుతుంటే... వ్యాపారవేత్తలు, ప్రభు వర్గీయులు మరింత ధనవంతులయ్యారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో... వ్యవస్థలోని శూన్యాన్ని పూరించడానికి సీజర్ వంటి ఒక శక్తిమంతు డైన సైనిక నాయకుడు అవసరమయ్యాడు. ముక్కలైన రోమన్ వ్యవస్థను తనదైన పద్ధతిలో చక్కదిద్దాలనే లక్ష్యంతో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ముందుకు సాగాడు సీజర్. అతడు ఒక అసాధారణ మేధావి. యుద్ధతంత్రంలోనే కాక, రాజకీయ వ్యూహ రచనలోనూ దిట్ట. గాల్ (ప్రస్తుత ఫ్రాన్స్) ప్రాంతాన్ని జయించడం ద్వారా అపారమైన సంపదను, సైనిక బలాన్ని, ప్రజల్లో గొప్ప పేరును సంపాదించుకున్నాడు. అయితే, అతడి ఈ అద్భుతమైన ఎదుగుదల పాత తరం సెనేటర్లలో భయాన్ని కలిగించింది. అతడు తన పాలనలో అనేక సామాజిక, రాజకీయ సంస్కరణలను చేపట్టాడు. భూములను పంపిణీ చేయడం, క్యాలెండర్‌ను సంస్కరించడం, సెనేట్ పరిధిని పెంచి మరింత మందికి అవకాశం కల్పించడం వంటి చర్యలు ప్రభువర్గీయులను బెంబేలెత్తించాయి. ఇదే సమయంలో సీజర్ తనను తాను ‘జీవితకాలపు నియంత’ అని ప్రకటించుకుని రాజ కీయంగా పెద్ద తప్పు చేశాడు. ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ను రాచరికం వైపు మరల్చడాన్ని సెనేటర్లు సహించలేకపోయారు. అదే సమ యంలో క్లియోపాత్రాను రోమ్కు తీసుకురావడం వంటి చర్యలు ప్రజాభి ప్రాయాన్ని అతనికి వ్యతిరేకంగా మార్చాయి. క్షమాగుణం కూడా అతడికి ముప్పు తెచ్చింది. బ్రూటస్, కాసియస్ వంటి తన మాజీ శత్రువులను క్షమించి, వారికి ఉన్నత పదవులను ఇచ్చాడు. అయితే తాను ప్రేమించిన, నమ్మిన వ్యక్తే తనపై కత్తి ఎత్తినప్పుడు ‘నువ్వు కూడానా, బ్రూటస్?’ (యూ టూ బ్రూటస్?) అని అతడన్న మాటలు ఆనాటి అతని మానసిక వేదనకు నిదర్శనం.హత్యలతో వ్యవస్థను మార్చవచ్చా?సీజర్ హత్య తర్వాత కుట్రదారులు ఆశించినట్లుగా స్వేచ్ఛ తిరిగి రాలేదు. నిజానికి సీజర్ హత్య తర్వాత రోమ్ మరింత అరా చకంలోకి వెళ్ళింది. అతడి వారసుడైన అగస్టస్ కాలంలో రోమ్ పూర్తిస్థాయి సామ్రాజ్యంగా మారింది. కుట్రదారులు సీజర్‌ను చంపి అతడిని ఒక ‘అమర వీరుడిని’ చేశారు. ఒక వ్యక్తిని అంతం చేయవచ్చు కానీ, అతను నెలకొల్పిన వ్యవస్థనూ, ఆలోచనలనూ అంతం చేయడం సాధ్యం కాదని చరిత్ర నిరూపించింది. జూలి యన్ క్యాలెండర్ నేటికీ ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక రూపంలో అమలులో ఉండటం విశేషం. నేటి గ్రెగోరియన్ క్యాలెండర్ కూడా సీజర్ ప్రవేశపెట్టిన క్యాలెండర్‌కు చిన్న సవరణ మాత్రమే!ప్రపంచ చరిత్రపై సీజర్ ప్రభావం అపారమైనది. అతని పేరు కేవలం ఒక వ్యక్తి పేరుగా మిగిలిపోకుండా, ఒక ‘సర్వోన్నత అధికారం ఉన్న వ్యక్తి’కి బిరుదుగా మారింది. జర్మనీలో ‘కైజర్’, రష్యాలో ‘జార్’, ఇస్లామిక్ ప్రపంచంలో ‘ఖైసర్’ వంటి పదాలు సీజర్ పేరు నుండే పుట్టుకొచ్చాయి. భాషా పరంగా చూస్తే, అతడు పుట్టిన నెల గౌరవార్థం ‘జూలై’ అనే పేరు స్థిరపడిపోయింది. సీజర్ జీవితం, మరణం మనకు నేర్పే పాఠం ఏమిటంటే, మార్పును నిరోధించే ప్రయత్నం ఒక్కోసారి ఆ మార్పును మరింత వేగవంతం చేస్తుందని! వ్యవస్థల బలహీనతలను వ్యక్తి గత హత్యలతో సరిదిద్దలేమనీ, ప్రజాస్వామ్య సంస్థలు బలంగా లేకపోతే అధికార పోరాటాలు దేశాన్ని అస్థిరతలోకి నెడతాయనీ తేటతెల్లమవుతుంది. -
అభివృద్ధిలో ఆమె స్థానం ఎక్కడ?
దేశ జనాభాలో 48%గా ఉన్న మహిళల విద్య, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, భద్రత తదితర అంశాలను తరచుగా సమీక్షించుకుంటూ, లోపాలను సవరించుకుంటూ ముందుకు సాగినప్పుడే దేశం వడివడిగా అభివృద్ధి పథంలోకి సాగుతుంది. మనం ఎంతో గొప్పగా, ఘనంగా చాటుకుంటున్న భారతదేశ ఆర్థికాభివద్ధి కథ (గ్రోత్ స్టోరీ)లో మహిళల భాగస్వామ్యం లేకుంటే అది ఓ అసంపూర్ణ కథాచిత్రంగానే మిగిలిపోతుంది. దేశం 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ కావాలన్న కల సాకారం కావాలంటే మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు గణనీయంగా మెరుగుపడక తప్పదు. మెరుగుదల ఉన్నప్పటికీ...నిజం చెప్పాలంటే గత ఆరేళ్లలో దేశంలో మహిళల వికాసం, ప్రగతి అంతకు ముందెన్నడూ లేని స్థాయిలో మెరుగుపడ్డాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, ప్రపంచ బ్యాంకు నివేదిక వంటి ప్రామాణిక సంస్థలు వెలువరించిన లెక్కల ప్రకారం చూస్తే మహిళల విద్య, ఆరోగ్యం, ఉపాధి, భద్రత రంగాలలో పెద్ద అడుగులేముందుకు పడ్డాయి. ముఖ్యంగా... 2023–24 నాటికి దేశంలో మహిళల విద్య 73 శాతానికి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘బేటీ బచావో, బేటీ పఢావో’, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు... రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మహిళాసంక్షేమ కార్యక్రమాల వల్ల పాఠశాలల్లో బాలికల ప్రవేశాలు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో గణనీయంగా పెరిగాయి. స్టెవ్ు గ్రాడ్యుయేట్లలో మహిళల వాటా 43%కు పెరిగింది. ఇది ప్రపంచ దేశాలలోనే అత్యధికం. 2023–24 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం, మహిళా కార్మికశక్తి భాగస్వామ్యం 2017–18లో 23.3% ఉండగా 2024–25 నాటికి 37%కు పెరిగింది. ఇక చిన్న, సన్నకారు పారిశ్రామిక సంస్థలను నిర్వహించే మహిళా పారిశ్రామికవేత్తలసంఖ్య కోటిన్నరకు పెరిగి తద్వారా పుష్కలంగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలలో... ‘స్టాండ్ అప్ఇండియా’, ‘ముద్ర యోజన’, స్వయం సహాయక సంఘాలువంటివి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సహాయం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశ స్థూల ఉత్పత్తిలో ఆర్థికంగా మహిళలు అందిస్తున్న వాటా 18 శాతంగా ఉంది. మహిళల సాధికారత దిశగా సాగిస్తున్న ప్రయాణం అంతకుముందు కంటే సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, ప్రపంచ దేశాలతో, మరీ ముఖ్యంగా దక్షిణాసియా దేశాల కంటే కూడా బాగా వెనుకబడి ఉన్నాం. ఇందుకు అనేక కార ణాలు కనిపిస్తాయి. మహిళల విద్య, వారి భద్రత, ఆరోగ్యం, ఉపాధి రంగాలలో మన దేశం ర్యాంకు సంతృప్తికరంగా లేదు. చైనా,జపాన్‌లే కాదు థాయిలాండ్, శ్రీలంకల కంటే మనం వెనుకబడి ఉన్నాం అన్నది ఓ చేదు వాస్తవం.కొనసాగుతున్న హింసమహిళలకు భారతీయ సంస్కృతిలో గొప్ప స్థానం ఉందని చెబుతారు. కానీ ఆచరణలో అది అంతగా కనిపించదు. అయితే మహిళలపై ఒకప్పటిలా తీవ్రస్థాయిలో సాగిన దురాచారాలు,అకృత్యాలు ఇప్పుడు లేకపోవచ్చు గాని నేటికీ మహిళలపై భిన్న రూపాలలో హింస చోటు చేసుకుంటూనే ఉంది. మహిళల భద్రత అంశంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాలలో భారత్ ఒకటిగా ఉంది. ‘నేషనల్ క్రైవ్‌ు రికార్డ్స్ బ్యూరో’ ప్రకారం 2022–23లో దేశంలో మహిళలపై 4.45 లక్షల నేరాలు జరిగాయి. రికార్డులకు ఎక్కని ఘోరాలు ఇంకా మరెన్నో ఉంటాయి.‘సమాన పనికి సమాన వేతనం’ అన్న చట్టం అమలులోకి రాకముందు మహిళలకు అతి తక్కువ వేతనాలు ఇవ్వడం భారత దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. భవన నిర్మాణ రంగం, ఇతర రోజువారీ కూలీ పనులలో మగ కూలీకి ఇచ్చే భత్యం కంటే ఆడకూలీకిచ్చే మొత్తం ఇప్పటికీ తక్కువగా ఉంటోంది. నిజానికి మగవారు చేసే పని కంటే ఆడ వారు చేసే పని పొందికగా, నాణ్యతతో, అధిక ఉత్పాదకతతో ఉంటుందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. అన్ని రంగా లలో మహిళల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచడం ద్వారా సింగపూర్ ఆర్థికాభివృద్ధిలో ఎంతో ముందంజ వేసింది. కాగా, మన దేశంలో ఎటువంటి జీత భత్యాలు లభించని ఇంటి పనుల్లో పనిచేసే ఆడవారి సంఖ్య మగవారి కంటే మూడు నుంచి పది రెట్లు ఎక్కువ అని తేలింది.రాజకీయ విజయందేశ మహిళలకు స్థానిక సంస్థలలో గత కొన్నేళ్లల్లో రాజకీయ భాగస్వామ్యం పెరగటం వారు సాధించిన అతి గొప్ప విజయంగా పరిగణించాలి. మెజారిటీ రాష్ట్రాలు మహిళలకు స్థానిక సంస్థలలో 50 శాతం మేర రిజర్వేషన్లు అందిస్తున్నాయి. దీనివల్ల మొత్తం స్థానిక సంస్థలలో 14 లక్షల మహిళా ప్రజా ప్రతినిధులు భాగస్వాముల య్యారు. మరికొన్నేళ్లలో అసెంబ్లీ, పార్లమెంట్లలో సైతం మహిళ లకు 33% సీట్లు లభించనున్నాయి. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగంగా మహిళల భాగ స్వామ్యం అన్ని రంగాలలో ఉండాలంటే అందుకు నిర్మాణాత్మకమైన ప్రణాళికతో పాటు కార్యాచరణ అవసరం. ప్రధానంగా మహిళలకు నాణ్యమైన విద్య, సాంకేతిక నైపుణ్యాలు అందించాలి. స్కాలర్ షిప్‌లు, మెంటార్షిప్లతో వారికి ప్రోత్సాహం కల్పించాలి. స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలలో వారిని పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలి. గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి పొదుపు సంఘాలను మరింతగా ప్రోత్సహించాలి. మహిళా ఆంట్రప్రెన్యూర్సును తయారు చేయడానికి అవసరమైన బ్యాంకు రుణాలు, మార్కెట్ లింకేజీలు, ఇంక్యుబేషన్లు వంటివి అందించ గలగాలి. పాఠశాలలు, కాలేజీలు, పనిచేసే ప్రాంతాలలో మహిళలకు పూర్తి భద్రత కల్పించాలి. ప్రసిద్ధ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ చెప్పినట్లు – ప్రతి మహిళ తెలివితేటలను, సామర్థ్యాలను ఆర్థిక వనరుగా తీర్చిదిద్ది దేశ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేయాలి. అప్పుడే భారతదేశం ఎదురుచూస్తున్న 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ ముందుగానే సాకారం అవుతుంది.-వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు-డా‘‘ ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు -
అంతులేని ట్రంప్ అబద్ధాలు
ఎక్కువ ఉపయోగంలో లేదు గానీ ‘పారదర్శక అబద్ధాలు’ అనే మాట ఒకటుంది. దాని అర్థం, ఒక మనిషి అబద్ధాలు చెప్తే అవి అబద్ధాలని వెంటనే అందరికీ అర్థమైపోవటం. అటువంటి పారదర్శక అబద్ధాలు చెప్పటంలో ఘనా పాఠిగా మారిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మరో వరుస అబద్ధాలు చెప్తూ ఇరాన్‌పై ఫిబ్రవరి 28న యుద్ధానికి తలపడ్డారు. యుద్ధానికి చెప్పిన కారణాలన్నీ పచ్చి అబద్ధాలని పరిశోధనలు చేసి నిరూపించవలసిన అవసరమేమీ లేదు. స్వయంగా అమెరికన్ ప్రభుత్వపు నివేదికలు, అక్కడి మీడియా, చివరకు గతంలో ట్రంప్ తానే చేసిన ప్రకటనలు తేల్చి చూపుతున్నాయి. ‘యుద్ధాలు చేయ బోను, యుద్ధాలను అంతటా ఆపుతున్నాను’ అంటూ జనవరిలో మాదక ద్రవ్యాల విషయమై అబద్ధపు ఆరోపణలతో వెనిజులా అధ్యక్షుడిని, ఆయన భార్యను అపహరించారు; కేవలం రెండు నెలల తర్వాత, ఇరాన్ ‘కొద్ది రోజులలోనే’ అణ్వస్త్రాలు తయారు చేసి తమకు ముప్పుగా మారనుందనే అబద్ధం చెప్తూ ఆ దేశ అధినేతను కుటుంబ సభ్యులతో సహా బలిగొన్నారు.మళ్లీ అవే అబద్ధాలుప్రస్తుత యుద్ధం ఎట్లా సాగి, ఏ విధంగా ముగుస్తుందన్నది అట్లుంచుదాం. అమెరికా, ఇజ్రాయెల్ తామే ప్రకటించినట్లు ‘గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో’ సైనిక సన్నాహాలు సాగించి మొదలుపెట్టిన యుద్ధం వారు ఆశించినట్లు రెండు రోజులలోనే ముగియక పోగా, రోజులు గడిచేకొద్దీ ఇరాన్ పట్టుదలతో మరింత భీకరంగా మారటం మాత్రం కనిపిస్తున్నది. ఇరాన్ అణుకేంద్రాలపై నిరుడు జూన్‌లో ఇజ్రాయెల్‌తో కలిసి దాడులు జరిపిన ట్రంప్, ఆ కేంద్రాలు ‘పూర్తిగా తుడిచి పెట్టుకుపోయా’యని ప్రకటించారు. ఆ దాడులకు ముందు కూడా, ఇరాన్ అణ్వస్త్రాలు ఇక ‘కొద్ది వారాలలోనే’ తయారు కానున్నాయన్నారు. ఆ మాట అబద్ధమని అపుడు కూడా ప్రపంచానికి వెంటనే అర్థమైంది. తమ లక్ష్యం శాంతియుత వినియోగమే తప్ప అస్త్రాల తయారీ ఎంత మాత్రం కాదనీ, అంతర్జాతీయ చట్టాల మేరకు శాంతియుత వినియోగం తమ హక్కనీ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో అందుకే చేరామనీ అన్న ఇరాన్ మాటలను నమ్మకపోయినా, యథాతథంగా అణ్వస్త్ర తయారీ సన్నాహాలు ఎప్పుడూ ఎవరికీ కనిపించలేదు. అస్త్రాల కోసం యురేనియం శుద్ధి 90 శాతం అవసరం కాగా ఆ కేంద్రాలలో శుద్ధి ఎన్నడూ 60 శాతానికి దాట లేదు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నది. అమెరికన్ నిఘా సంస్థల నివేదికలు సైతం 60 శాతమనే చెప్పాయి. ఇవన్నీ గాక, అణుశక్తి వినియోగంపై ఇరానియన్ ప్రభుత్వం అమెరికా, యూరప్‌లతో చర్చలు జరుపుతూనే ఉంది. అయినా తమ సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం, ట్రంప్ ఇరాన్ కేంద్రాలపై బి–52 బాంబర్లతో దాడులు చేశారు.గ్రేటర్ ఇజ్రాయెల్ కోసమే!అవే ప్రయోజనాల కోసం ఇపుడు తిరిగి సరిగా అవే అబద్ధాలు చెప్తూ యుద్ధం మొదలు పెట్టారు. గత జూన్ దాడులలో ఆ నిర్మాణాలు బాగా దెబ్బతినగా అక్కడి యురేనియం నిల్వలు, యంత్ర సామగ్రి ఆ శిథిలాల కింద కూరుకుపోయి ఉన్నాయి. వాటిని ఇరాన్ కనీసం బయటకు అయినా తీయలేదు. అటువంటపుడు అస్త్రాల తయారీ ప్రసక్తి ఎక్కడిది? పైగా, భవిష్యత్తులో శాంతియుత వినియోగం లేదా మరొకటి అన్న ప్రశ్నలపై ఇరాన్, అమెరికాల మధ్య కొద్ది నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. ఆ విషయమై ఒప్పందం కుదిరే సూచనలున్నట్లు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఒమన్ గత వారమే ప్రకటించింది. విషయమేమంటే, ఇజ్రాయెల్‌కు, వారి పలుకుబడితో వ్యవహ రిస్తున్న ట్రంప్‌కు, పశ్చిమాసియాలో ఇరాన్ ఒక్కటే స్వతంత్రంగా నిలబడి అభివృద్ధి చెందటం కంటగింపుగా మారింది. వారి పరమ లక్ష్యం పాలస్తీనా దేశం ఏర్పడక పోవటం, గ్రేటర్ ఇజ్రాయెల్ సృష్టి, ఇరాన్‌ను సామంత రాజ్యంగా మార్చి అక్కడి చమురు నిల్వలు కాజేయటం! అమెరికా అధ్యక్షుడు అంతే పెద్ద అబద్ధం మరొకటి ప్రచారం చేస్తున్నారు. ఇరాన్ అణ్వస్త్రాలనే గాక, వాటిని అమెరికాపై ప్రయో గించగల క్షిపణుల తయారీని పూర్తి చేస్తున్నదని! ఇరాన్ వద్ద గల క్షిపణులలో అతి ఎక్కువ దూరం ప్రయాణించగల వాటి పరిధి సుమారు 1,200 కి.మీ. కాగా, ఇరాన్ నుంచి అమెరికా దూరం దాదాపు 12,000 కి.మీ.లు. అనగా 10 రెట్లు ఎక్కువ. ఇవన్నీ అమె రికా నివేదికలు, నిపుణుల లెక్కలే. అటువంటి స్థితిలో అణ్వస్త్రా లెక్కడ? వాటిని అమెరికా వరకు ప్రయోగించగల క్షిపణులెక్కడ? అసలు విషాదంట్రంప్ ఒక పారదర్శక అబద్ధాలకోరు అన్నది ప్రపంచంతో పాటు స్వయంగా అమెరికన్లకు, తన ‘మాగా’ ఓటర్లకు కూడా అర్థమైంది. అందువల్లనే ఆయన ‘అప్రూవల్ రేటింగ్’ 27 శాతానికి పడిపోయింది. ‘మాగా’ అనే ఉత్తేజకర నినాదంతో గెలిచిన ఆయన ఆ లక్ష్యాల సాధనకు సవ్యమైన మార్గాలను ఎంచుకునే బదులు, వ్యక్తిగత ప్రయోజనాలకు, విధానపరమైన వైఫల్యాలకు, ఇజ్రాయెలీ లాబీకి బందీ అయి, ఈ అరాచకాలన్నీ సృష్టిస్తున్నారు.యుద్ధం మొదలు పెట్టినప్పుడు ఇరాన్లో ప్రభుత్వాన్ని, రాజ కీయ వ్యవస్థనే మార్చివేసి, రివల్యూషనరీ గార్డ్స్‌ను అంతం చేయగలమన్న ట్రంప్, 48 గంటలు గడవగానే ప్రభుత్వాన్ని, వ్యవస్థను మార్చటం తమ లక్ష్యం కాదంటున్నారు. ఆయన బహిరంగంగా పిలుపు ఇచ్చినట్లు అక్కడి ప్రజలేమీ తిరుగుబాటు చేసి ‘ప్రభుత్వాన్ని తమ చేతులలోకి తీసుకోవటం’ లేదు. ట్రంప్, నెతన్యాహూల దుర్మా ర్గానికి, పశ్చిమాసియాలో అమెరికన్ స్థావరాలకు అవకాశమిచ్చి సామంతులుగా వ్యవహరిస్తున్న గల్ఫ్ దేశాలు బలవుతున్నాయి. గతంలోకి వెళితే, ఇరాన్ చమురును మొదటి నుంచి తమ అధీనంలో ఉంచు కున్న పాశ్చాత్య దేశాలు అక్కడ ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చిన ప్రధాని మొసాదెగ్ను 1953లో సీఐఏ, ఎంఐ6 కుట్రతో పడగొట్టినప్పటి నుంచి ఈ క్రీడ సాగుతున్నది. 1979లో వచ్చిన ఇస్లామిక్ పాలన అందుకు అడ్డుకట్ట వేయటాన్ని సహించలేక, షా పహ్లవీ కుమారుడిని తిరిగి అమెరికా నుంచి దిగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ పరిణామాల మధ్య పెద్ద విషాదం ఒకటున్నది. గ్లోబల్ సౌత్‌కు నాయకత్వం వహించాలని ఉవ్విళ్లూరుతున్న ప్రధాని మోదీ– మదురో దంపతుల అపహరణను, వెనిజులాపై దాడిని, ఇరాన్‌పై దాడిని, ఖమేనీ హత్యను కనీసం పరోక్షంగానైనా ఖండించే సాహసం చేయలేదు.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నియమబద్ధ వాణిజ్యమే శరణ్యం
చీకటిని చూస్తేనే వెలుగు విలువ మరింత తెలుస్తుందంటారు. అదే ప్రకారం, అంత ర్జాతీయ వాణిజ్య సంబంధాల విషయమై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిరుడు ఏప్రిల్‌లో సృష్టించిన చీకటిని పది నెలల పాటు చూసిన ప్రపంచానికి, నియ మబద్ధమైన వాణిజ్యపు విలువ ఏమిటో గతం కన్నా ఎక్కువగా అర్థమైంది. కానీ ఇప్పటికీ అర్థం కానిది అమెరికా అధ్య క్షునికే! లేని అధికారాలను ఉపయోగించి ఇష్టారీతిన దిగుమతి సుంకాలు విధించటం చెల్లుబాటు కాదని అక్కడి సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పును ఈ నెల 20వ తేదీన చెప్పిన తర్వాత కూడా ఆయన తమ విధానాలు మారబోవని ప్రకటించారు. మరొక రూపంలో అదనపు సుంకాలను అమలుకు తేవటంలోని అవివేకం ప్రపంచానికంతా అర్థమవుతున్నది ఆయనకు తప్ప!అయినా మారడా?ఇక్కడ గమనించదగ్గది మరొకటి ఉంది. అమెరికాను తిరిగి గొప్పదిగా చేసే ప్రణాళికలో సుంకాల హెచ్చింపు ఒక భాగం. దాని కోసం ఈ పది నెలలుగా సాధించిన ఫలితాలలో, సుమారు 120 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయాన్ని మినహాయించితే, ఇతర లక్ష్యాలు ఒక్కటైనా సిద్ధిస్తున్న సూచనలు లేవు. నికర బడ్జెట్ లోటు అంతకుమించి పెరుగుతున్నది. ఒక డజను దేశాలపై సైనిక దాడులు జరిపి, మరిన్ని దాడులకు సన్నాహాలు చేస్తున్నందున సైనిక ఖర్చుల రూపంలో జీడీపీ పెరుగుదల 1.4 శాతానికి తగ్గగా, ద్రవ్యోల్బణం మళ్లీ 3 శాతానికి చేరింది. ఉద్యోగాల పెరుగుదల ఇంత తక్కువగా ఉండటం 2013 తర్వాత ఎప్పుడూ లేదని గణాంకాలు చెప్తున్నాయి. డాలర్ విలువ, స్టాక్ మార్కెట్లు, బాండ్ మార్కెట్లు గందరగోళానికి గురవుతున్నాయి. వీటన్నింటి ఫలితాలను అనుభవిస్తున్న అమెరికన్ ప్రజలలో ట్రంప్ ప్రజాదరణ వరుసగా పడిపోతున్నట్లు ప్రజాభిప్రాయ సేకర ణలు చెప్తున్నాయి. అంతకుమించి, స్వయంగా తనకు బలమైన మద్ద తుగా నిలిచి అధికారంలోకి తెచ్చిన ‘మాగా కానిస్టిట్యుయెన్సీ’ అని పిలిచే సామాజిక తరగతులలోనూ బలం తగ్గుతుండగా, ఈ కాలంలోనే జరిగిన మూడు గవర్నర్ ఎన్నికలను రిపబ్లికన్ కంచుకోట లుగా భావించే రాష్ట్రాలలో ఓడిపోయారు. రానున్న నవంబర్ నాటి మధ్యంతర ఎన్నికలలోనూ ఇదే జరిగితే పరిస్థితి ఏమిటన్న భయాలు ట్రంప్ పార్టీలో మొదలయ్యాయి. ‘అయినా ఆయన మార లేదు’ అన్న ఒక తెలుగు కథలోని వాక్యం వలె, ‘అయినా ట్రంప్ మారటం లేదు’.అందరితోనూ అదే ధోరణిఇవి, ఇంకా ఇటువంటివి అమెరికాలో అంతర్గతంగా కనిపి స్తున్న పరిస్థితులు. బయటి మాట చెప్పనక్కర లేదు. ట్రంప్ గత ఏప్రిల్‌లో ‘విమోచనా దినం’ అంటూ ప్రపంచంలోని సమస్త దేశా లపై సమాంతరమైన ఎదురు సుంకాలు అంటూ ఒక పిడుగును విసిరినప్పటి నుంచి వాణిజ్య ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారటం తెలిసిందే. ఆ పరిస్థితి ఇప్పటికీ కుదుట పడలేదు సరికదా సమీప భవిష్యత్తులో కుదుటపడే సూచనలు కూడా లేవు. అందుకు కారణం తిరిగి ఆయన చర్యలే! ఏ దేశంపై సుంకాలను ఎపుడు ఇంకా పెంచుతారో, తగ్గిస్తారో తెలియదు. ఒక దేశానికి తమతో వాణిజ్యం కావాలంటే వారు మరేదో మూడవ దేశంపై సుంకాలు పెంచాలని ఒత్తిడి చేస్తారో తెలి యదు. వాణిజ్యంతో నిమిత్తం లేకుండా రాజకీయాల కోసం చేసేదీ తెలియదు. ఇతర దేశాలలో నడుస్తున్న అమెరికన్ కంపెనీలను వాపస్ రానట్లయితే వంద శాతం సుంకాలంటారో తెలియదు. తమ ఆయుధాలు, బోయింగ్‌లు, చమురు, వ్యవసాయ ఉత్పత్తులు, పారి శ్రామిక ఉత్పత్తులను చచ్చినట్లు ఖరీదు చేసే వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేయనట్లయితే సుంకాలు వంద శాతమనేదీ, 500 శాతమ నేదీ తెలియదు. ‘మీరు మీకు కావలసిన చమురు వగైరాలను మాకు నచ్చని దేశాల నుంచి ఖరీదు చేయటం ఆపివేసి మేము చెప్పిన చోటు నుంచే కొనుగోలు చేయా’లని ట్యారిఫ్ల కొరడా ఝళిపించేదీ తెలియదు. దీనంతటికి తమ కూటమి దేశాలు సైతం మినహాయింపు కాకపోవటమే కాదు, వారికి చెందిన భూభాగాలను తమకు స్వాధీనం చేయకున్నా ట్యారిఫ్ల ఖడ్గ చాలనం చేస్తారు. కెనడావంటి అతి సన్నిహిత దేశంపై పెంచిన సుంకాలను స్వయంగా తన రిపబ్లికన్ సెనేటర్లు వ్యతిరేకించి ఓడించినా లెక్క చేయరు.అదే శరణ్యంఇన్నిన్ని వివరాలు ఇంత సుదీర్ఘంగా చెప్పుకోవటం ఎందుకంటే, ఏప్రిల్‌లో ‘విమోచనా దినం’ నాడు అమెరికా అధ్యక్షుడు అడ్వాన్స్ విజయ దరహాసంతో ప్రకటించినట్లు, ట్యారిఫ్లన్నవి ‘మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ’ ఏమీ కాదు. తనవి పూర్తిగా తప్పుడు అంచనాలతో కూడిన లెక్కలని ఈ పది మాసాలలో ఇంటా బయటా కూడా రుజువైంది. అసమర్థుని జీవయాత్ర వలె ఇది ఒక అవివేకపు అధ్యక్షుని ఆర్థిక యాత్ర. ఆ యాత్రలో రెండవ అంకాన్ని ఆయన ఈనెల 20న సుప్రీం కోర్టు తీర్పు కలిగించిన భయం నుంచి మొదలు పెట్టారు. న్యాయమూర్తులను మనం ఊహించలేని భాషలో దూషించి, తమ విధానాలు మారబోవని ప్రకటించారు. తనకు ఇతర మార్గాలు ఉన్నాయని, వాటిని ఉపయోగించి దేశాలను ‘సర్వ నాశనం’ చేయగలనన్నారు. 150 రోజుల కాల పరిమితి గల సెక్ష న్లను, అమెరికా చరిత్రలోనే ఏ అధ్యక్షుడూ ఉపయోగించని వాటిని బయటకు తీసి, ఆ ప్రకారం అన్ని దేశాలపై 10 శాతం అదనపుసుంకమని, అంతలోనే 15 శాతానికి పెంచారు. ఇప్పటికే జరిగిన వాణిజ్య ఒప్పందాల నుంచి ఏ దేశమూ తప్పించుకోరాదని హెచ్చ రించారు. ఈ అదనపు సుంకాలను తాము చెల్లించబోమని యూరో పియన్ యూనియన్ స్పష్టం చేయగా, అసలు తన ఒప్పందంపై తుది చర్చలను ఇండియా వాయిదా వేసింది. ఈ విధమైన రెండవ అంకపు నాటకంలో ఇంకేమి పరిణామాలుండగలవో చూడాలి.మొత్తం మీద తేలుతున్న పాఠం ఏమిటంటే, తనకు ఏ అంత ర్జాతీయ నియమాలు లేవంటూ ట్రంప్ విచ్ఛిన్నం చేయబూనిన నియమాల ప్రకారం వాణిజ్యం, ఆర్థిక, రాజకీయ సంబంధాలే బలో న్మత్త మదపుటేనుగులకైనా అనుసరించదగిన విధానాలవుతాయి. ఈ నియమాలను అమెరికాయే నాయకత్వం వహించి రెండవ ప్రపంచ యుద్ధం దరిమిలా రూపొందించటం గాని, ఇన్ని దశాబ్దాలుగా పాటించటంగాని ఎంతో దూరదృష్టితో జరిగినటువంటిదే! ఆ నియ మాలు పూర్తి న్యాయబద్ధమైనవేమీ కాదు. అవి ధనిక దేశాలకు అను కూలం, వర్తమాన దేశాలకు ప్రతికూలం అయినా కనీసం ఒక పద్ధతిలో సాగుతూ వచ్చాయి. ట్రంప్‌కు అదే శరణ్యం కావాలి.-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు-టంకశాల అశోక్ -
చేయాల్సింది చాలా ఉంది!
ప్రపంచ ఏఐ యవనికపై శక్తిమంత మైన పాత్ర వహించగల దేశంగా భారతదేశాన్ని రూపు కట్టించడంలో ఏఐ ఇంప్యాక్ట్ సమ్మిట్, దానికి సంబంధించి న్యూఢిల్లీలో ఏర్పాటైన ఎగ్జిబిషన్ సఫలమై ఉండాల్సింది. కానీ, దేశంలో పరిశోధన–అభివృద్ధి (ఆర్–డి), నవీ కరణలో వైఫల్యాలకు అది అద్దం పట్టింది. గల్గోటియాస్ అనే ప్రైవేటు విశ్వవిద్యాలయం చైనా నుంచి రోబో డాగ్‌ను దిగుమతి చేసుకుని, ఏఐ నవీకరణ కేంద్రంగా తనను తాను చాటుకోవాలని ఉబలాటపడటం ఒక ప్రహసనంగా మారింది. దేశ విదేశాల్లో పత్రికలకెక్కి అపఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ ఉదంతం గత కొన్నేళ్లుగా పరిశోధన రంగాల్లో క్షీణిస్తున్న ప్రమాణాలకు పరాకాష్ఠగా నిలిచింది.నిధుల లేమి‘ఆర్–డి’పై భారతదేశ స్థూల వ్యయం, స్థూల జాతీయో త్పత్తి (జీడీపీ)లో కనాకష్టంగా 0.64 శాతంగా ఉంది. అమెరికా (3.48), చైనా(2.43)లతో పోల్చితే ఇది చాలా తక్కువ. పరిశోధ నకు ప్రస్తుతం తరలిస్తున్న నిధులలో చాలా భాగం జాతీయ లాబొరేటరీలు, ఐఐటీల వంటి అగ్రశ్రేణి సంస్థలకు వెళుతు న్నాయి. ఈ విషయంలో విశ్వవిద్యాలయాలు చాలా వెనుకబడి పోయాయి. ‘అనుసంధాన్ నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్’, ‘రిసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్’ వంటి నూతన పథకాల ప్రభావం ఇంకా కనపడవలసి ఉంది. ఏఐ, దాని అనుబంధ రంగాలకు చెందిన పేటెంట్లకు దరఖాస్తు చేయడంలో, పరిశోధన పత్రాల సమర్పణలో చైనా చాలా ముందుంది. బోధనా ప్రమాణాలు, పరిశోధనల ఫలితా లపై భారత్ దృష్టి పెట్టడం లేదు. యూనివర్సిటీలు, పరిశ్రమల మధ్య పొత్తును కూడా సరిగ్గా ఏర్పరచలేకపోతున్నాం. ఫలితంగా, విషయ చౌర్యం, నకిలీ పరిశోధనలు, కుహనా సైన్స్‌ను ప్రోత్సహించడం, సమర్పించిన పత్రాలను వెనక్కి తీసుకోవడం తదితర సమస్యలు తలెత్తుతున్నాయి. ఆహా ఓహో అంటూ ఆకా శానికెత్తేయడం, స్టార్టప్‌లకు మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మన సంస్థలు గొప్ప వాగ్దానాలు చేస్తున్నాయి; లేదా గల్గోటియాస్లాగా నకిలీ గొప్పలకు పోతున్నాయి.సోషలిస్టు ఏఐ పంథాశాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న ఆంత్రోపిక్ సంస్థ ఏఐ టూల్స్‌కు సంబంధించి ఇటీవల క్లాడ్ ఓపస్ సిరీస్ విడుదల చేయడం ద్వారా టెక్నాలజీ మార్కెట్లలో కలకలం సృష్టించింది. దాని ప్రకంపనలు స్టాక్ మార్కెట్లలోనూ నమోదయ్యాయి. ఆ టూల్స్ జటిలమైన ఆర్థిక విశ్లేషణకు, లాంగ్–ఫారమ్ కోడింగ్‌కు ఉపయోగపడతాయి. ఈ ఆటోమేషన్ టూల్స్ ఆవిష్కరణకు భయపడి సంప్రదాయ సిద్ధమైన సాఫ్ట్వేర్, లీగల్–టెక్ కంపెనీల షేర్లను ఇన్వెస్టర్లు అయినకాడికి అమ్మేశారు. అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న ఐటీ సేవల రంగాన్ని కూడా ఏఐ ఏజెంట్లు అతలాకుతలం చేస్తాయే మోనని ఆందోళన వ్యక్తమవుతోంది. మన దేశంలోని అతి పెద్ద ఔట్ సోర్సింగ్ సంస్థలకు కూడాఆంత్రోపిక్ ఏఐ ఏజెంట్లను విక్రయిస్తోంది. అవి పెద్ద సంఖ్యలో సిబ్బందికి ఉద్వాసన చెప్పేందుకు దారితీయవచ్చు. కొన్ని భౌగోళిక ప్రాంతాలు, కొద్ది సంస్థల చేతుల్లోనే ఏఐకేంద్రీకృతమవుతోందని పసిగట్టిన భారత్ ‘ఏఐ ప్రజాస్వామికీక రణ’కు శ్రీకారం చుట్టింది. ఈ రంగంలో సాగుతున్న అంతర్జా తీయ పోటీలో తన స్థానాన్ని చాటుకునేందుకు ఢిల్లీ సదస్సు ద్వారా భారత్ ఒక ప్రయత్నం చేసింది. విద్య, ఆరోగ్యం, పరిపా లన, వస్తూత్పత్తి, వ్యవసాయం వంటి భిన్నమైన రంగాలలో కూడా ఏఐ సేవలను వినియోగించుకునేటట్లు చేయాలన్నది ఈ సమ్మిట్ వెనుక ఉన్న భావన. పాశ్చాత్య దేశాల్లో ఏఐలో ప్రైవేటు పెట్టుబడులు ముందున్నాయి. కానీ, భారత్ సోషలిస్టు పంథాను ఎంచుకుంది. మన దేశంలో ఏఐ అభివృద్ధికి ఏఐ మిషన్ ద్వారా ప్రభుత్వమే నిధులు సమకూరుస్తోంది. భారత్ జెన్ వంటి వాటిలోనూ ప్రభుత్వ పెట్టుబడులున్నాయి. చాట్ జీపీటీ వంటి కమర్షియల్ మోడళ్లను కాకుండా ‘సావరిన్’ ఏఐ మోడళ్ళను భారత్ అభివృద్ధి చేస్తోంది. బహుళ భాషా, బహుళ సాంస్కృతిక పర్యావరణాలకు అనువైన కొత్త మోడళ్ళను అభివృద్ధి చేస్తోంది. వాటిని ప్రజా శ్రేయస్సుకు వినియోగించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఎన్నో రకాల సవాళ్లుఅయితే, దార్శనికతను వాస్తవికతగా మార్చడం పైకి కనిపి స్తున్న దానికన్నా ఎక్కువ సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. అవసరమైన నిపుణులైన సిబ్బంది కొరత అన్నింటి కన్నా పెద్ద సవాల్. దేశంలో ఐటీ సేవల రంగంలో సుమారు 60 లక్షలమంది పనిచేస్తున్నారు. క్లాడ్ వంటి ఏఐ టూల్స్‌తో చాలా మంది ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడింది. మిగిలినవారికి మళ్ళీ తర్ఫీదు నివ్వడం, కొత్త నైపుణ్యాలను నేర్పించడం చేయాలి. అయితే, లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ళు, అప్లికేషన్లు, భద్రత, నియంత్రణ పార్శా్వలకు సంబంధించి చాలా మంది ఉద్యోగులు కూడా అవసరమవుతారు. వాస్తవిక పరిస్థితులు ఇలా ఉంటే, గ్లోబల్ టెక్నాలజీ సంస్థలకు ఏఐ ఇంజినీర్లను సరఫరా చేసే దేశంగా భారత్ అవతరిస్తుందని విధాన నిర్ణేతలు అత్యుత్సాహం ప్రదర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఐటీ సేవల విషయంలో కూడా 1990లలో మనం ఇదే రకమైన తప్పు చేశాం. ఫలితంగా, ప్రొడక్ట్ డెవలప్మెంట్లో భారత్ వెనుకబడింది. ఏఐ విషయంలో మనం అదే బాట పట్టకూడదు. లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లను డెవలప్ చేసి, తర్ఫీదు నిచ్చేందుకు అత్యుత్తమ శ్రేణి హార్డ్‌వేర్ అవసరం. ఆ కొరత మరో సవాల్. సావరిన్ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసేందుకు ఏఐ మిషన్ జీపీయు క్లస్టర్ ఏర్పాటుపై అహరహం శ్రమిస్తోంది.కానీ, హార్డ్‌వేర్ వెల అధికంగా ఉండటం, గ్లోబల్ సప్లై చైన్‌లో జాప్యాలు గణనీయమైన ప్రతిబంధకాలుగా ఉన్నాయి. వాటిపై చైనా దాదాపు 98 బిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది. అలాంటిది మనం 2029 వరకు ఐదేళ్ళ కాలంలో 1.25 బిలియన్ డాలర్లను మాత్రమే వెచ్చించాలని నిర్ణయించుకున్నాం. బలమైన, సుస్థిరమైన ఏఐ మౌలిక వసతులను సృష్టించుకోవడంపై దృష్టి పెట్టాలి. కొత్త విధులకు తగ్గట్లుగా ఇపుడున్న సిబ్బందికి కొత్త నైపుణ్యాలను నేర్పించాలి. భారత విధాన నిర్ణేతలు దానికి బదులు, ప్రైవేట్ క్లౌడ్ల రూపంలో క్యాప్టివ్ జీపీయు మౌలిక వసతులను ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రైవేటు క్లౌడ్లు మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాల చేతుల్లో ఉన్నాయి. ఇది మరో రకమైన ఔట్ సోర్సింగ్ కిందకు వస్తుంది. ఇది మరింత హానికరమైనది. భారీ డేటా సంస్థలు విద్యుత్తును, నీటిని పెద్ద మొత్తాలలో మింగేస్తాయి. పర్యావర ణాన్ని కూడా పణంగా పెట్టి ట్యాక్స్ హాలిడేల రూపంలో వాటిని ప్రోత్సహించడం ఎంతవరకు సబబో ఆలోచించాలి. పరిశోధన, నవీకరణను ప్రోత్సహించడంపై ప్రభుత్వానికి నిజంగా ఆసక్తి ఉంటే, అది ప్రాథమికాంశాలను విస్మరించ కూడదు. మౌలిక, అనువర్తిత ఆర్–డి రెండింటికీ మద్దతు ఇవ్వాలి. విద్యా, నాణ్యతా పరామితులను అమలుపరచాలి. మన విధాన నిర్ణేతలు, మంత్రులు డంబాలకు స్వస్తి చెప్పాలి. ఏఐవంటి నూతన రంగాలు సామాజికంగా కూడా తీవ్ర పర్యవసా నాలకు దారితీసేవిగా ఉన్నాయి కనుక కూలంకషమైన చర్చ అవసరం. పరిశోధన, నవీకరణపై గొప్పలు చెప్పుకోవడం ఆపా లని గాల్గోటియాస్ ఉదంతం గుర్తు చేస్తోంది. -వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత-దినేశ్ సి. శర్మసదస్సుతో ఏం సాధించామంటే...20 దేశాల అధినేతలు, 59 మంది మంత్రులు, అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు, దాదాపు 2.5 లక్షల మంది అతిథులతో ఢిల్లీలో ఐదు రోజులపాటు నిర్వహించిన ఏఐ సదస్సు కీలకమైనముందడుగుగా చెప్పాలి. ఫ్యాక్టరీలు, హెల్త్ కేర్ రంగంలో ఉన్న రోబోలు, వ్యాపార రంగంలో ఉన్న డ్రోన్లు, ప్రజలకు ఉపయోగించుకోవటానికి వీలుగా ఉండే వేరబుల్ డివైసెస్‌ను ఇక్కడ ప్రద ర్శించారు. 300కు పైగా ఎంపిక చేసిన పెవిలియన్లు, 600 స్టార్టప్‌లు ఇందులో భాగస్వామ్యం వహించాయి.బెంగళూరు ఆధారిత స్టార్టప్ ‘సర్వం’ ఏఐ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విదేశీ టెక్ కంపెనీలకు సవాలు విసిరేలా తన ప్రత్యే కతను చాటుకుంది. విప్రో సంస్థ ఏఐ ఆధారిత మెడికల్ రోబోను ప్రదర్శించింది. క్వాల్కం ఓపెన్ ఏఐ రోబో పారిశ్రామిక రక్షణ సామర్థ్యాన్ని చాటింది.ఏఐ ఎకో సిస్టంలో చిప్పులు, డేటా సెంటర్లు, సర్వర్లు, ఎనర్జీ మోడళ్ళు, అప్లికే షన్లు అత్యంత ప్రధానమైనవి. ఈ రంగంలో స్వయం సమృద్ధిని సాధించాలంటే మనం వాటిని సొంతంగా నిర్వహించు కునే శక్తిని సంపాదించుకోవలసి ఉంటుంది. ఇందుకు చాలా దూరం ప్రయాణించాలి. ఇప్పుడు అమెరికా నేతృత్వంలోని పార్క్ సిలికా టెక్ కూటమిలో భారత్ చేరింది. దీనివల్ల సెమీ కండక్టర్లు, ఏఐ టెక్నాలజీ, కీలక ఖనిజాల సప్లై చైన్లు, భారత్‌కు రక్షణ ప్రాధా న్యం లభిస్తాయి.వివిధ దేశాలతో జట్టు కట్టి...ఆఫ్రికాలో ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయ డానికి భారత్, ఇటలీ, కెన్యా మధ్య త్రైపాక్షిక కూటమి ఏర్పడింది. ఐరోపా, ఇండో– పసిఫిక్ దేశాల మధ్య భారత్‌ను ఒక సాంకేతిక వారధిగా నిలపటం ఇటలీ లక్ష్యం. అలాగే ఏఐ భద్రత, ఆన్లైన్ సేఫ్టీ అంశాల పైన భారత్, బ్రిటన్ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న సైన్స్ అండ్ ఇన్నొవేషన్ కౌన్సిల్ సమావేశం ద్వారా ఈ సహకారం మరింత బలపడుతుంది. పాలన, రక్షణ రంగాల్లో ఏఐ వినియోగంపై భారత్‌తో కలిసి ఫ్రాన్స్ పనిచేస్తోంది. ఈ ఏడాది సదస్సులో ఫ్రాన్స్ క్రియాశీలక పాత్ర పోషించింది. ప్రభుత్వ సేవలో ఏఐ వినియోగం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణపై భారత్‌తో బ్రెజిల్ తన అనుభవాలను పంచుకుంది. ఇలా వివిధ దేశాలు భారత్‌తో తమ సంబంధాలను మెరుగు పరచుకోవ డానికి ముందుకు రావడం శుభ పరిణామం. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఏఐ మౌలిక సదుపాయాలు, క్లౌడ్ కంప్యూటింగ్,స్కిల్లింగ్ కోసం ఇండియాలో 17.5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి ప్రకటించింది. ఇది ఆసియాలోనే ఆ సంస్థకు అతి పెద్ద పెట్టుబడి. ఏఐ రంగంలో స్వయంసమృద్ధిని సాధించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ‘భారత్ జెన్’ పేరుతో మల్టీ మోడల్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టును ప్రారంభించింది. భార తీయ భాషలు, సంస్కృతికి అనుగుణంగా కృత్రిమ మేధను అభివృద్ధి చేయటం ప్రధాన ఉద్దేశం. దేశంలోని 22 అధికార భాషల్లో ఏఐ మోడల్స్ రూపొందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. భారత్... గ్లోబల్ సౌత్‌లో మొట్టమొదటి సారిగా, అంతర్జా తీయంగా 4వ సదస్సు నిర్వహణ ద్వారా కొంత ప్రగతిని సాధించింది. రాబోయే రోజుల్లో మరిన్ని మైలురాళ్లు సాధిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.– డా‘‘ పార్థసారథి చిరువోలు ‘ సీనియర్ జర్నలిస్ట్ -
సైనిక ఓటమా? సైద్ధాంతిక వైఫల్యమా?
నడుస్తున్న చరిత్రలో కొన్ని దశలు మన కళ్లముందే మూసుకుపోతాయి. తుపాకీతో ప్రారంభమైన దశ, తలవంచి ముగిసిన దశగా మారిపోతుంటే అది కేవలం సంఘటన కాదు– ఒక యుగాంత సంకేతం. పోరాట సంసిద్ధత క్షీణించినప్పుడు, విజయంపై విశ్వాసం సన్నగిల్లినప్పుడు నక్సలైట్లు లొంగిపోవడం కొత్త విషయం కాదు. గతంలోనూ లొంగుబాట్లు జరిగాయి. అయితే అవి నిశ్శబ్ద ఘటనలు. ముఖం చాటేసి, ప్రధాన స్రవంతి జీవితంలో కలిసిపోయే వ్యక్తిగత నిర్ణయాలు. ఇప్పుడు దృశ్యం భిన్నంగా ఉంది. సరళీకృత ఆర్థిక విధానాల కాలం ఇది. లొంగుబాటు ఇక ఏమాత్రం వ్యక్తిగత నిర్ణయం కాదు; అదొక ప్రజా ప్రదర్శన. తుపాకీని ప్రభుత్వానికి అప్పగించడం కూడా ఒక సిద్ధాంత విజయం అన్నట్టు ప్రచారం. ఒకప్పుడు ‘తుపాకీ గొట్టం ద్వారానే విప్లవం’ అన్నవాళ్లు, ఇప్పుడు ‘తుపాకీ స్వాధీనం ద్వారానే శాంతి’ అంటున్నారు. ఇప్పుడు మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీతో సహా మరో నలుగురు కీలక నేతలు లొంగిపోవడం ఆ శ్రేణిలో తాజా పరిణామం. ఆ పార్టీ కేంద్ర కమిటీ పూర్వ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి సహా మరో 11 మంది ముఖ్య నాయకుల లొంగుబాటుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్టు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మీడియా ముందు ప్రకటించారు. ఇది యాదృచ్ఛికమా? లేక ఒక సంకేతమా? దేవ్ జీ (Devji) మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీ కార్యదర్శి అయ్యారనో, అవుతున్నారనో ఇటీవల వార్తలు వచ్చాయి. పీపుల్స్ వార్ గ్రూపు కేంద్ర కమిటీ కార్యదర్శిగా పని చేసిన కేజీ సత్యమూర్తి 1990లో అజ్ఞాత జీవితం ముగించి బయటకు వచ్చారు. కానీ లొంగుబాటు కార్యక్రమం జరపలేదు. ఆ పార్టీ వ్యవస్థాపకులైన కొండపల్లి సీతారామయ్య 1995లో జైలు నుండి విడుదలయ్యారు. ఆయనకూ లొంగుబాటు సంస్కారం అవసరం రాలేదు. కానీ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి హోదాలో ఉండగా లొంగిపోవడం – ఇది మొదటిసారి. కానీ అది గర్వించదగిన రికార్డా? లేక చరిత్రలో ఒక మలుపా? ఒకరు లొంగిపోతే యాదృచ్ఛికం. ఇద్దరు లొంగిపోతే వ్యక్తిగత వైఫల్యం. వరుసగా నాయకత్వం లొంగిపోతే అది ధోరణి. ధోరణిపై సైద్ధాంతిక చర్చ తప్పనిసరి. గణపతి అనారోగ్యంతో చాలాకాలం క్రితమే కేంద్ర కమిటీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అసలు ప్రశ్న వ్యక్తుల గురించి కాదు, ఉద్యమం గురించి! ఈ ముగింపు సైనిక ఓటమా? లేక సైద్ధాంతిక వైఫల్యమా? నిజానికి 1990 వరకు భారత దేశంలో అనేక మార్పులకు కమ్యూనిస్టులు దోహదం చేశారు. అయితే 1990ల తర్వాత ప్రపంచం మారిపోయింది. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణలతో భారత సామాజిక–ఆర్థిక నిర్మాణం పూర్తిగా మారింది. కానీ, పోరాట కార్యక్రమం మారిందా? అర్ధ–వలస, అర్ధ–భూస్వామ్య వ్యవస్థ నిర్ధారణ, నాలుగు వైరుద్ధ్యాలు, వ్యావసాయిక విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవం– ఈ సిద్ధాంత భాష అంతా 1970లది. గట్టిగా మాట్లాడితే చైనాలో 1930ల నాటిది. 2020ల నాటి భారతదేశానికి అది పనికి వస్తుందా? ఇక్కడే భారత కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం సృజ నాత్మకతను కోల్పోయింది. పాత మ్యాప్‌తో కొత్త భూభాగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇది సైద్ధాంతిక వైఫల్యం. మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం గడువు పెట్టి, బలగాలను ఒకే ప్రాంతంలో – దంతెవాడలో – మోహరించినప్పుడు, వ్యూహాత్మక చాతుర్యం అవసరం. కానీ అన్ని శక్తులనూ ఒకే ప్రదేశంలో దించి, చుట్టుముట్టే పరిస్థితిని తెచ్చుకున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ సైనిక పరాజయం తాత్కాలికం. సిద్ధాంత పరాజయం అంతకన్నా పెద్ద దెబ్బ. ఒక పార్టీ కథ ముగిసి పోవచ్చు. ఒక దశ చరిత్రలోకి వెళ్లిపోవచ్చు. కానీ ప్రజల మీద అణచివేత ముగిసిందా? అసమానత అంతరించిందా? అణచివేత ఉన్నంతకాలం పోరాటం అంతరించదు. కేవలం రూపం మారుతుంది. సిద్ధాంతం మారుతుంది. చరిత్ర ఖాళీని సహించదు. పాత సిద్ధాంతం విఫలమైతే ఆ స్థానంలో కొత్తది వస్తుంది. పాత పార్టీ ఆయుధాలను వదిలేసి లొంగిపోతే కొత్త పార్టీ వస్తుంది. పోరాడే సమూహాలు మారుతాయి. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే; కొత్తగా వస్తున్న సిద్ధాంతం ఏమిటీ? కొత్తగా పోరాడే శక్తులు ఏవీ?- డానీ వ్యాసకర్త సామాజిక–రాజకీయ విశ్లేషకులు -
ఇన్ని అబద్ధాలా? ఇంత విషమా?
అబద్ధాలు చెప్పడం చంద్రబాబు గారి జన్మహక్కు. దాన్ని మనం కాదన్నా ఆయన ఒప్పుకోరు. అందుకే అసెంబ్లీ లోనూ, బయటా, దేవుడి ముందూ, దేవుడి మీదా కూడా అబద్ధాలు చెప్ప గలరు. కోట్లాది మంది భక్తితో మోకరిల్లే తిరుమల శ్రీవారికే పంగనామం పెట్టగల సమర్థత బాబు గారి సొత్తు. మంగళవారం జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తిరుమల గురించి గుక్క తిప్పుకోకుండా అబద్ధాలు చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి గారు తిరుమలను రెండు కొండలుగా ప్రకటించారని ఘోరమైన అసత్యం ప్రకటించారు. దాదాపు 20 ఏళ్లుగా ఈ ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఒక అబద్ధాన్ని కోట గోడలా కట్టి, నమ్మించడం చంద్రబాబు స్పెషా లిటీ. గోడలు బద్ధలు కొట్టకపోతే దేవుడు మమ్మల్ని క్షమించడు. బ్రిటిష్ వారి మాన్యువల్ లెక్కఏడుకొండలపై వెలసిన తిరుమల క్షేత్రం సువిశాలమైంది. శేషాచలం కొండలు సమస్తం శ్రీవారి నిలయమే. దైవానికీ, భక్తికీ పరిధి లేదు. అయితే బ్రిటిష్ వారి నార్త్ ఆర్కాట్ మాన్యుయల్‌లో తిరుమల పరిధి 27 చదరపు కిలోమీటర్లు అని లిఖితమై ఉంది. టీటీడీ నిర్మాణాలకు అవసరమైన అనుమతులన్నీ కేంద్ర అటవీ శాఖ నుంచి లభించేవి కాబట్టి ఎప్పుడూ ఏ సమస్యా రాలేదు. స్వాతంత్య్రానికి ముందూ, తర్వాతా పాలకులూ, ముఖ్యమంత్రులూ వచ్చారు. టీడీపీ ఎన్టీఆర్ హయాంలోనూ, తొమ్మిదేళ్లచంద్రబాబు హయాంలోనూ కూడా బ్రిటిష్ వారి లెక్కల ప్రకారమే తిరుమల ఉండింది. ఎవరికీ ఏ సందేహం లేదు, రాలేదు. ఇది దైవ కార్యం కాబట్టి! వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, చంద్ర బాబు దిగజారి తిరుమలను రాజకీయం చేయడం మొదలు పెట్టారు. కొండపై పంచాయతీ ఎన్నికల విషయమై జయచంద్ర నాయుడు అనే తెలుగుదేశం నాయకుడితో కోర్టులో పిటిషన్ వేయించారు. ఈ సందర్భంగా అప్పటి పంచాయతీ రాజ్ సెక్రటరీ శామ్యూల్ జీవో నంబర్ 338 విడుదల చేశారు. శతాబ్దాలుగా ఉన్న బ్రిటిష్ వారి ఉత్తర్వుల్లోని 27 చ.కి.మీ. పరిధినే జీవోలో తెలిపారు. ఇదే అదనుగా చంద్రబాబు గగ్గోలు పెట్టి బురద చల్లడం ప్రారంభించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమలను రెండు కొండ లుగా మార్చాడని అబద్ధం ప్రచారంలోకి తెచ్చారు. అయితే ఆ రెండు కొండలు ఏమిటి? మినహాయించిన ఐదు కొండల పేర్లను చంద్ర బాబు జన్మలో చెప్పలేరు. ఎందుకంటే, అటువంటి ఆలోచనే జరగ లేదు కాబట్టి! వైఎస్‌తో బాబుకు పోలికా!అయితే చంద్రబాబు కుటిలత్వాన్నీ, దేవుణ్ణి రాజకీయానికి వాడుకునే దుర్మార్గాన్నీ అప్పటి టీటీడీ అధ్యక్షుడిగా ఉన్న నేను గుర్తించాను. అప్పటి ఈవో కేవీ రమణాచారి, ఎండోమెంట్ సెక్రటరీ ఐవీ సుబ్బారావు గార్లతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌తో స్వయంగా చర్చించాం. చంద్రబాబు దురుద్దేశాన్ని వివరించాం. వెంటనే ఆయన తిరుమల పరిధిని 352 చదరపు కిలోమీటర్లుగా నిర్దేశిస్తూ జీవో 746, తిరుమలలో అన్య మత ప్రచారాన్ని నిషేధిస్తూ జీవో నంబర్ 747ను విడుదల చేశారు. తిరుమల శ్రీవారికి భక్తితో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో చేశారు. ఏడుకొండల చట్టం తెచ్చింది ఆయనే. అన్యమత ప్రచారాన్ని నిషే ధించింది ఆయనే. వైఎస్ హయాంలోనే, నేను టీటీడీ చైర్మన్‌గా ఉన్నపుడు, టీటీడీలో హిందువులు తప్ప మిగతా మతస్థులతోఉద్యోగాల నియామకాలు చేపట్టకూడదని చట్టం తెచ్చాం. ఎన్టీఆర్ హయాంలో గొల్లపల్లి, పైడిపల్లి, తిరుపతమ్మ, పెద్దింటి కుటుంబాల వంశ పారంపర్య మిరాశీ హక్కును రద్దు చేశారు. 2007లో దేవుణ్ణి నమ్ముకున్న ఆ కుటుంబాల ఆనువంశిక హక్కును వైఎస్ రాజశేఖర రెడ్డి పునరుద్ధరించారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం సాధు పుంగవుల సమ్మేళనం నిర్వహించింది వైఎస్సార్ హయాంలోనే!తిరుమల వేంకటేశ్వరస్వామి పవిత్రతను కాపాడ్డానికీ, ధర్మాన్ని, విశ్వాసాల్ని పరిరక్షించడానికీ వైఎస్ రాజశేఖరరెడ్డి నిరంతరం పాటుపడ్డారు. ఆయన పాదాల చెంత ఉన్న నారావారిపల్లెలో పుట్టి, తెల్లారి లేస్తే స్మరించుకుంటానని అబద్ధాలు చెప్పే చంద్రబాబు తిరుమలకు పంగనామం పెట్టడం తప్ప, చేసిందేమీ లేదు. దేవుడి పేరుతో ఇంత రాజకీయమా?అలిపిరి సంఘటనలో వేంకటేశ్వరస్వామి చంద్రబాబును కాపాడిన మాట నిజమే. అయితే దేవుణ్ణి రాజకీయాలకు వాడే ఆయన స్వభావానికి అది శ్రీవారు చేసిన హెచ్చరిక కూడా! ఆ తర్వాత కూడా తిరుమల శ్రీనివాసుడిని రాజకీయాలకు వాడారు, ఇంకా వాడుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి వస్త్రాలు భక్తితో తీసుకెళ్లిన వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్ ఇద్దరూ తిరు మలను రాజకీయాలకు వాడలేదు. ఇపుడు కూడా చంద్రబాబునిందలకు సమాధానం మాత్రమే చెబుతున్నాం. ఎందుకంటే అబ ద్ధాన్ని నిజమని నమ్మించడంలో భారత రాజకీయాల్లోనే ఆయన్ని మించినవారు లేరు, ఇప్పట్లో రారు. 2009లో జరిగిన రాజకీయ సభలో జీవోలు 746, 747 రద్దు చేస్తానని చెప్పిన చంద్రబాబే,అసెంబ్లీలో జంకు లేకుండా మాట్లాడుతున్నారు. ఇదంతా సిగ్గుగా అనిపించదా? పీవీ నరసింహారావు గారితో సహా ఎందరో మహనీయుడిగా భావించే పెజావర్ స్వామి ఈ జీవోల మీద వైఎస్‌ను ప్రశంసించారు. హైందవ ప్రచారానికి వైఎస్ చేసిన కృషిని పత్రికా సమావేశంలో కొనియాడారు. చంద్రబాబుకు బురద రాజకీయమే తెలుసు. మాకు గౌరవ రాజకీయాలు మాత్రమే తెలుసు. అందుకే ఆయన కుమారుడు లోకేశ్ పెళ్లికి, ఆయన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ కోరిక మేరకు శేషాద్రి స్వామిని, తిరుమల అర్చకుల్ని స్వయంగా నేనే ఏర్పాటు చేశాను. బాలకృష్ణ కూడా సౌకర్యాలకు ధన్యవాదాలు తెలిపారు. కానీ చంద్రబాబు మాత్రం దర్శన ఏర్పాట్లు ఘోరంగా ఉన్నాయని చెప్పారు. ఇదే విషయం బాలకృష్ణతో చెబితే, ‘రాజకీ యాలతో నాకు సంబంధం లేదు. మనస్ఫూర్తిగా చెబుతున్నా, మీ ఏర్పాట్లు బాగున్నాయి’ అన్నారు. ధైర్యం ఉంటే జగన్ తో రాజకీయంగా తలపడండి. మతాన్నీ, దేవుడినీ అడ్డు పెట్టుకుని అబద్ధాల్ని చెప్పకండి చంద్రబాబూ!ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. దేవుడు ఇంకా బాగా గమనిస్తు న్నాడు. తిరుమల క్షేత్రం చాలా శక్తిమంతమైనది. ఆ దైవం ప్రతిసారీ మిమ్మల్ని క్షమించక పోవచ్చు! -వ్యాసకర్త టీటీడీ పూర్వ అధ్యక్షులు-భూమన కరుణాకరరెడ్డి -
బాధ్యత నిండిన భవిత కోసం...
కృత్రిమమేధ (ఏఐ) ప్రపంచాన్ని సమ్మోహపరుస్తోంది. దాని ప్రభావంతో మానవ జీవితంలోని ప్రతి పార్శ్వమూ రూపాంతరం చెందుతోంది. మానవాళికీ, అవనికీ మేలు చేకూర్చగల గొప్ప సామర్థ్యం దానికి ఉందనడంలో సందే హం లేదు. అయితే, అది చూపగల ప్రభా వాల గురించే తీవ్ర ఆందోళనలు వ్యక్తమ వుతున్నాయి. ముఖ్యంగా చాలామంది ఉపాధి కోల్పోతారని, తప్పుడు సమా చారం పెరుగుతుందని చెబుతున్నారు. మానవాళికి ఏఐ గొప్ప మేలు చేసినదవుతుంది, లేదా భయంకరమైన శత్రువుగా పరిణమిస్తుందని నేను భావిస్తున్నాను. ఏఐకి మార్గదర్శక సూత్రాలు లేదా నియంత్రణలు తీసుకురావాలనే ప్రయత్నం ఊపందుకుంది. నేను ‘కరుణా పూరిత ఏఐ’ అనే కొత్త భావనను పరిచయం చేయాలనుకుంటు న్నాను. ఇది దయా గుణంలో ఏఐకి దారి చూపుతుంది. దానిగురించి మరింత వివరించే ముందు ఇపుడు ఎదురవుతున్న కొన్ని తీవ్రమైన సవాళ్ళు ఏమిటో చూద్దాం. ఏఐ విసురుతున్న సవాళ్ళు ఒకటి – భారీ ప్రయోజనాలు పణంగా ఉన్న రేసులో ఏఐ అత్యంత శక్తిమంతమైన ఆయుధంగా పరిణమించింది. ఏఐ తెచ్చి పెట్టగల లాభాలు, అధికారం కోసం కొద్దిపాటి దేశాల మధ్య, దిగ్గజాల వంటి టెక్ కంపెనీలు, ప్రైవేటు సంస్థల మధ్య పోటీ మొద లైంది. సంపన్న దేశాలు, అభివృద్ధిలో ఇంకా అఆలు కూడా నేర్చు కోని దేశాల మధ్య అంతరం ఎక్కువగా ఉంది. ఏఐపై గుత్తాధిపత్యం సంపాదించినవాళ్ళు రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలపైన కూడా అసా ధారణమైన పట్టును ప్రదర్శించ గలుగుతారు. రెండు – ఏఐ ఇక ఎంతమాత్రం సాంకేతిక సాధనం కాదు. అది తనకుతాను మార్గదర్శనం చేసుకుని, సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వయం ప్రతిపత్తిగల ఏజెంట్‌గా పరిణమిస్తోంది. ఇపు డున్న మానవ పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఏఐ సిస్టంలు సిద్ధమవుతున్నాయి. వీటిలో పక్షపాతపూరిత చారిత్రక కథ నాలు, భ్రమలు, విశ్వాసాలు, అభూత కల్పనలు, అసత్యాలు కూడా ఉన్నాయి. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ఏఐ ఆటోమేటిక్‌గా సృష్టించగలదు. మోసపూరిత చర్యలకు వెసులుబాటు కల్పించ గలదు. విభేదాలను, విద్వేషాలను రెచ్చగొట్టగలదు. హింసకు కూడా ప్రేరేపించగలదు. మానవ సంభాషణలను ఏఐ సిస్టంలు తిమ్మిని బమ్మి చేయగలవు. బ్యాంకులను వంచించడం, డీప్ ఫేక్ పోర్నోగ్రఫీ, ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువతతో సహా ఏఐ సంబంధిత నేరాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మూడు – సమాజంపై సైకలాజికల్ ప్రభావం. ముఖ్యంగా ఏఐపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్న యువత దాని ప్రభావా నికి లోనవుతున్నారు. భవిష్యత్తులో వచ్చే సూపర్ ఇంటెలిజెన్స్ ఊహించనలవికానిది. తల్లితండ్రులు, టీచర్లు, సహాధ్యాయులతో నామమాత్రపు చనువు, లేదా అసలేమీ పట్టనట్లుగా పెరిగే తరాన్ని ఊహించుకోండి. ఏఐ ప్రాథమిక రూపంపై ఆధారపడిన సోషల్ మీడియా ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపుతోందో ఇప్పటికే మనం గమనిస్తున్నాం. కౌమారంలో ఉన్న ప్రతి ఆరుగురిలో ఒకరు మానసిక వైకల్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒంటరితనం, మనోవ్యధ, ఆందోళనతో వారు సతమతమవుతున్నారు. నాలుగు – సహజంగానే మెషీన్ మెదడు మానవ మెదడు కన్నా చురుకుగా పనిచేస్తుంది. ఏఐ వల్ల లాభాలు ఉత్తేజపరచేవిగాను, వినోదపరచేవిగాను కనిపిస్తున్నప్పటికీ, ఎవరు ఎవరిని అంతిమంగా నియంత్రిస్తారనే తాత్త్విక ప్రశ్న తలెత్తుతోంది. సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, న్యాయం, పరిపాలనను కాపాడే నిర్ణయాలు ఎవరివవుతాయి? భావోద్రేకాలు, స్పందించే గుణం ఉన్న మానవ మెదళ్ళవా, లేక ఇతరుల బాధలను, కష్టాలను కనిపెట్టగల జీవశాస్త్ర సామర్థ్యం కొరవడిన కలనగణితాలవా? కరుణ ఆధారంగా...నైతికత, నియంత్రణలు ముఖ్యమే. కానీ, వాటికి పరిమి తు లున్నాయి. వాటిని సృష్టించేది, పర్యవేక్షించేది మనుషులే కదా! తన మార్గాన్ని నిర్ణయించుకోవడంలో మెషీన్ మెదడు యుక్తితో, వేగంతో వ్యవహరిస్తుంది. ఏఐ వెనుక ఉండే మానవ మనస్తత్త్వం మారకపోతే ఎటువంటి నియంత్రణనైనా అది పక్కన పెట్టి ముందుకు వెళ్ళి పోగలదు. కనుక, ఏఐ దిక్సూచి కరుణను ఆధారం చేసుకున్నదిగా ఉండాలి. కరుణను నేనొక విలువగానో, సద్గుణంగానో, బలహీ నమైన మనస్కుల నుంచి వ్యక్తమయ్యేదిగానో, లేదా నైతిక నైరూప్య ఆలోచనగానో చెప్పడం లేదు. ఇతరుల బాధను చూసి అలాంటి కష్టం తనకూ రావచ్చుననే జ్ఞానంతో, ఎదుటి వ్యక్తిని దాన్నుంచి బయటపడేయడానికి కార్యాచరణకు దిగాలని ప్రోత్సహించే శక్తిగా చూస్తున్నాను. న్యాయం, సమానత్వం, శాంతి, స్వావలంబనను ఏర్పరచడానికి అటువంటి చోదక శక్తి అత్యవసరం. మనసు లోపల ఉండే ఆర్ద్రతను కనిపెట్టవచ్చు. వ్యక్తులు,సంస్థలలో దానిని పెంపొందించవచ్చు. దీని నిమిత్తం మేమొక శాస్త్రీయ చట్రాన్ని అభివృద్ధి చేశాం. దానిని ‘సత్యార్థి కంప్యాషన్ కోషియంట్’గా పిలుస్తున్నారు. యుక్తితోనే కాకుండా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించగల భవిష్యత్తుకు అది తోడ్పడ గలదు. అందరూ పంచుకోవలసిన విలువలు, సంపద, బాధ్యత, జవాబు దారీతనంతో కూడిన ప్రపంచాన్ని అది స్వప్నిస్తోంది. ఏఐని సృజించే, అమలుపరచే, దాన్నుంచి లబ్ధి పొందేవారిలో మనం దయా గుణాన్ని ప్రోత్సహించాలి. కరుణలో చైతన్యం, అను సంధానమవడం, స్పందించడం, కార్యాచరణకు దిగడమనే నాలుగు కీలక కోణాలున్నాయి. మానవ, జీవావరణ సవాళ్ళను ఎదుర్కొనేందుకు ఆ నాలుగింటి గురించి ఏఐ అభివృద్ధిలో చొప్పించాలి. తొలు తటి ఆలోచన నుంచి తుది ఉత్పత్తి వరకు ఆ అంశాలను సమైక్య పరచాలి. సమస్య నిర్వచనం, వ్యూహం, డేటా సేకరణ, ఇంజనీరింగ్, మోడల్ డెవలప్మెంట్, మదింపు, పరీక్ష, డిప్లాయ్‌మెంట్, ఇంటెగ్రేషన్, నిర్వహణ... ఇలా అన్నింటిలోనూ ఆ నాలుగూ మమేక మవ్వాలి. ఈ విధానం కంప్యాషనేట్ ఏఐ అభివృద్ధికి దారి తీస్తుంది. టెక్ కంపెనీలు, ఇన్వెస్టర్లు, ప్రభుత్వాలతో సహా ఈ విభాగంలో పాత్రధారులైన అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి తీరాలి. ఉమ్మడి శ్రేయస్సును ప్రాధాన్యంగా ఎంచుకోవాలి. ఋగ్వేదం‘సంగచ్ఛధ్వవం, సంవదధ్వవమ్, సం వో మనాంసి జానతావ్ు’అంటుంది. మనందరం కలసి నడుద్దాం. ఉమ్మడి భాషను మాట్లాడు కుందాం. అందరి క్షేమం కోసం అందరం పంచుకునే విధంగా సమష్టిగా విజ్ఞానాన్ని సృష్టించుకుందాం అని దాని అర్థం.-వ్యాసకర్త నోబెల్ బహుమతి గ్రహీత-కైలాశ్ సత్యార్థి -
అప్పులే ఆధారమా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన 2026 –27 బడ్జెట్లో రెవెన్యూ – వ్యయం మధ్య అధిక వ్యత్యాసం, మూలధన కల్పన తక్కువగా ఉండటం; ఆరోగ్యం, సామాజిక సేవలకు వనరుల కేటా యింపు తక్కువగా ఉండటం; రుణాలు, కేంద్ర సహాయంపై అధి కంగా ఆధారపడటం; సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధనకు అవసరమయిన చర్యలు లోపించడం కారణంగా సంతులనం లోపించింది. రాష్ట్ర సొంత రెవెన్యూ రాబడిలో వృద్ధి ఆశించినంతగా లేకపోవడం, మరోవైపు రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు కారణంగా ప్రాధాన్యతా రంగా లపై పెట్టుబడి తగ్గుతుంది. తద్వారా స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి క్షీణించడంతో పాటు ప్రభుత్వానికి రుణ భారం పెరిగి అభివృద్ధి ప్రాజెక్టులపై వ్యయం తగ్గుతుంది. కొరవడిన ఆర్థిక క్రమశిక్షణ2024 జూన్ తర్వాతి కాలంలో ప్రభుత్వం రుణాలపై అధికంగా ఆధార పడటం, రెవెన్యూ సమీకరణలో నిర్మాణా త్మక బలహీనతలు, వ్యయ యాజమాన్యంలో విఫలమవ డాన్ని సూచిస్తున్నది. పన్నేతర రాబడిలో తగ్గుదల, మూలధన వ్యయం తగ్గుదల, కమిటెడ్ వ్యయం (వేతనాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు)లో పెరుగుదలను ఇటీవలి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టపరుస్తున్నది. కాగ్ గణాంకాల ప్రకారం, 2025 –26 ఆర్థిక సంవత్సరంలో 2025 నవంబర్ నాటికి రెవెన్యూ లోటు రూ. 54,355 కోట్లకు చేరు కుంది. 2026–27 బడ్జెట్లో మొత్తం వ్యయం రూ. 3,32,205 కోట్లుగా ప్రతిపాదించగా, ఈ మొత్తంలో రెవెన్యూ వ్యయం 77.1 శాతం కాగా, మూలధన వ్యయం 16.2 శాతం. మూలధన వ్యయాన్ని 2025–26 బడ్జెట్లో రూ. 40,636 కోట్లుగా అంచనా వేయగా, ప్రస్తుత 2026–27 బడ్జె ట్లో రూ. 53,915 కోట్లుగా ప్రతిపాదించారు. మూలధన వ్యయం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికంగా రుణా లపై ఆధారపడినట్లయితే భవిష్యత్తు బడ్జెట్లలో అధిక మొత్తాన్ని వడ్డీ చెల్లింపులపై వెచ్చించవలసి ఉంటుంది. తద్వారా నూతన మూలధన ప్రాజెక్టులు, సంక్షేమంపై వ్యయం తగ్గుతుంది. రాష్ట్ర మొత్తం రుణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019–24 మధ్య కాలంలో రూ. 2,61,302 కోట్ల నుండి రూ. 4,85,491 కోట్లకు చేరు కోగా, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి పది నెలల కాలం నాటికి (మార్చి 2025) ఈ మొత్తం రూ. 6,62,557 కోట్లకు చేరుకుందని ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు పార్ల మెంటులో ప్రస్తావనకు రావడం జరిగింది. 2019–24 మధ్య అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతలుగా ప్రతి ఆర్థిక సంవత్సరంలో సగటున రూ. 31,000 కోట్లను మూల ధన వ్యయానికి కేటాయించింది. కోవిడ్–19 సమయంలో రెవెన్యూ రాబడి తగ్గినప్పటికి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచు కొని ఒకవైపు సంక్షేమంపై వ్యయాన్ని పెంచుతూ మరోవైపు దీర్ఘకాల ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకొని మూలధన పెట్టు బడులను పెంచగలిగి, ఆర్థిక క్రమశిక్షణను పాటించడాన్ని గమనించాలి. మానవాభివృద్ధి, రైతుల సంక్షేమం, హౌసింగ్, ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు, గ్రామీణ మరియు పట్టణాభివృద్ధి రంగాలకు 2019–24లో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిన క్రమంలో జీఎస్ డీపీ వృద్ధిలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది.మరోవైపు రుణాలవృద్ధిలోనూ తగ్గుదలను గమనించవచ్చు. వివిధ అంశాలకు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యతల క్రమంలో పేదరిక స్థాయి 2015–16లో 11.77 శాతం నుండి 2023 నాటికి 4.2 శాతానికి తగ్గింది. 2025–26 ఆర్థిక సంవ త్సరంతో పోల్చినప్పుడు 2026 –27లో రెవెన్యూ లోటు, ఆర్థిక లోటులో తగ్గుదలను ప్రతిపాదించినప్పటికీ రెవెన్యూ రాబడిలో తగ్గుదల కారణంగా తిరిగి బడ్జెట్ లోటులు పెరిగే అవకాశం ఉంది. రుణాలపై, కేంద్ర గ్రాంట్లపై అధికంగా ఆధారపడటం వలన స్వయం నిరంతర ఆదాయ వృద్ధి ప్రశార్థకంగా కన్పిస్తున్నది.ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమం, వివిధ ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తూ, ‘ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం’ నియమావళిని పాటిస్తూ, పన్నేతర రాబడిని పెంచుకునే మార్గాలను అన్వేషించాలి. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సంక్షేమ పథకాల అమలు లక్ష్యాన్ని సాధించడం, తప్పనిసరి వ్యయానికి సంబంధించి కాలానుగుణంగా సమీక్ష, అధిక వడ్డీతో కూడిన స్వల్పకాల రుణాల తగ్గింపు ద్వారా ఆర్థిక క్రమశిక్షణ సాధనకు కృషి చేయాలి.-వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్‌ఛార్జి), ఇక్ఫాయ్ -ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
సభ్యుల మధ్య లోపిస్తున్న సమాచారం
లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చను అడ్డుకున్న వ్యవహారం సద్దుమణగింది. కానీ, లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లాపై ప్రతిపక్షాలు అవి శ్వాస తీర్మానం ప్రతిపాదించడంతో పాలక, ప్రతిపక్షాల మధ్య మరో ఘర్షణాయుత అంకానికి తెర లేచింది. సభా వ్యవహారాలలో తమకు తగినంత సమయం ఇవ్వలేదని ప్రస్తుత సమావేశాల పొడవునా ప్రతిపక్షాలు స్పీకర్ బిర్లాపై ఆగ్రహంగా ఉన్నాయి. మాజీ ప్రధాన సైనికాధికారి జనరల్ మనోజ్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకంలోని అంశాలను చర్చకు పెట్టాలని రాహుల్ గాంధీ కోరుకున్నారు. ఈ పుస్తకం ఇంకా అధికారికంగా మార్కెట్లోకి రాలేదు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రచురణకు ఇంకా ఆమోదం తెలుపవలసి ఉంది. ప్రచురణకర్తలు అనుమతి కోరుతూ పుస్తక ప్రతిని రక్షణ శాఖకు పంపినట్లు జనరల్ నరవణె వెల్లడించారు. రాహుల్ ఆ పుస్తకం హార్డ్ కాపీని పార్లమెంట్ ఆవరణలో చూపించారు. పుస్తకం సాఫ్ట్ కాపీలు ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవు తున్నాయి. ప్రచురణకు ఆమోద ముద్ర కోసం ఎదురు చూస్తున్న పుస్తకం ఇంటర్నెట్లో ఎలా అందుబాటులోకి వచ్చిందంటూ దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఎంతవరకు రాయొచ్చు?ప్రచురణకు అనుమతి పొందని పుస్తకంలోని అంశాలను ఎలా లేవనెత్తుతారన్న వైఖరిని ప్రభుత్వం తీసుకుంది. అది సాంకేతికంగా సరైనదే కావచ్చు. కానీ, 2020లో తూర్పు లద్దాఖ్‌లో భారత–చైనా సైనికుల మధ్య ఘర్షణలకు సంబంధించి నరవణె ఏం రాసిఉంటారో ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. ప్రభుత్వం పెదవి విప్పక పోవడం వల్ల ఈ అంశంపై దాని అభిప్రాయం ఏమిటో తెలుసు కోకుండానే, సర్క్యులేషన్లో ఉన్న అంశాలను ఆధారం చేసుకుని చాలా మంది ఒక నిర్ధారణకు వచ్చేసే ప్రమాదం ఉంది. జ్ఞాపకాలకు అక్షర రూపం ఇచ్చేటపుడు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఒకటుంది. సీనియర్ పదవులను నిర్వహించిన సైనిక, పౌర అధికారులు రహస్య విషయాలను బయటకు పొక్కించే ఉబలా టాన్ని వదులుకోవడం మంచిది. తాము సర్వీసులో ఉన్నపుడు రాజ కీయ నాయకత్వంతో జరిపిన మాటామంతీ నమ్మకం పునాదిగా సాగి ఉంటుందనే సంగతిని వారు గుర్తెరగాలి. దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని భావించినపుడు ఆ చర్చల వివరాలను రాయకపోవడం వారికి గౌరవ ప్రదమే కాదు, పాటించవలసిన విధి కూడా. సర్వీసులో ఉన్నపుడు, రిటైరైన తర్వాత కూడా ఏది ఎంత వరకు చెప్పాలో అంతవరకు చెప్పడమే విధాయకం. నాయకులు పొరపాటు చేశారని లేదా తమ నమ్మకాన్ని వమ్ము చేశారని ఈ అధి కారులు భావించినా, ఆ నమ్మకానికి గండి కొట్టే విధంగా వ్యవహరించే లగ్జరీ లేదా స్వేచ్ఛ (రిటైరైన తర్వాత కూడా) వారికి ఉండదు. సీనియర్ సైనిక, పౌర అధికారులు తమకు అప్పగించిన పను లకు తమ బాధ్యతల పరిధి లోపలే వారు భాష్యం చెప్పాల్సిఉంటుంది. ఏదైనా ఒక అంశాన్ని తమ విచక్షణకు విడిచిపెట్టినపుడు తమ సైనిక బాధ్యతలకు పరిమితమై మాత్రమే వారు వాటికి భాష్యం చెప్పాలి తప్ప, వాటిని దౌత్య, రాజకీయపరమైన పరిధి వరకు తీసుకెళ్ళకూడదు. రాజకీయ నాయకత్వం దేశ ప్రయోజనా లను దృష్టిలో పెట్టుకుని, దౌత్య, రాజకీయ పరమైన అంశాలను పరి గణనలోకి తీసుకుని, అటువంటి సందర్భాలలో తమకు ఆ విచక్ష ణాధి కారాలు కల్పించిందని సైనిక నాయకులు గ్రహించాలి. కొరవడిన సంభాషణభిన్న రాజకీయ పార్టీల మధ్య తగినంత కమ్యూనికేషన్ లోపించిన వెలితిని లోక్ సభలో ఇటీవలి ప్రతిష్టంభన, తదనంతరం ఓం బిర్లాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వెల్లడిస్తున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. జాతీయ ప్రాధాన్యంగల అంశాలపై పాలక, ప్రతిపక్ష నాయకులు ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకునే వారని మాజీ సివిల్ సర్వెంట్ల అనుభవాలను చదివితే తెలుస్తుంది. దౌత్యపరంగా ఏదైనా ఒక పెద్ద ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్న పుడు లేదా దేశం హఠాత్తుగా ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్పుడు ప్రభుత్వ నేతలు ప్రతిపక్ష నాయకులకు పరిస్థితిని వివరించిన సందర్భాలు దౌత్యవేత్తగా గడిపిన వృత్తి జీవితంలో నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అంతమాత్రాన ఆ యా అంశాలపై ఆ యా పార్టీల వైఖ రులు కానీ, రాజకీయ గతులు కానీ మారిపోవు. కానీ, ఆ యాఅంశాలపై ఎదురవుతున్న సవాళ్ళు, అవకాశాలకు సంబంధించి రాజకీయంలోని అన్ని వర్గాలవారికి ఒక అవగాహన కల్పించినట్లు అయ్యేది. భిన్న స్రవంతులకు చెందిననాయకులు కొన్ని సందర్భా లలో నేరుగా మాట్లాడుకునేవారు. ఒక్కోసారి వారు నమ్మినబంట్ల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకునేవారు.నేడు పాలక, ప్రతిపక్ష నాయకులు వైషమ్యాలు, కోపతాపాలు, దూషణలతో కూడిన దాడులకు దిగడం చూస్తూంటే, ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ నెరపుకునే ఆ సంప్రదాయం లోపించిందని లేదాఉండవలసినంతగా లేదని తేటతెల్లమవుతోంది. గోప్యంగా వివరించొచ్చు!నరవణె పుస్తకంలోని అంశాలను లేవనెత్తడానికి ప్రయత్నించి నపుడు, ఆ పుస్తకాన్ని ఆధారం చేసుకున్న ఎటువంటి చర్చకు తాము అనుమతించలేమని ప్రభుత్వం చెప్పి ఉండాల్సింది. ఆ పుస్తక ప్రచు రణకు అనుమతించకపోవడానికి గల కారణాలను తాము విడిగా వివరించగలమని తెలిపి ఉండాల్సింది. పుస్తకంలో ఉన్నదని చెబు తున్న ఉదంతంతో సహా, తూర్పు లద్దాఖ్ ఘటనల పూర్వాపరాల గురించి గోప్యంగా వివరించి ఉండవచ్చు. రాజకీయ నాయకులందరూ దేశ ప్రయోజనాలకు అంకితమై ఉన్నవారేనన్న ఉద్దేశంతో ఈ మాట చెప్పవలసి వస్తోంది. వేటిని వెల్లడించవచ్చు వేటిని రహస్యంగా ఉంచాలనే వివేచన వారందరికీ ఉండి ఉంటుంది. మాజీ ప్రధాని ఐ.కె. గుజ్రాల్ హయాంలో విదేశీ వ్యవహారాలపై స్థాయీ సంఘం సమావేశంలో జరిగిన ఓ ఘటనను చెబుతాను. వేటిపై చర్చించవచ్చునో, వేటిని చర్చించకూడదో రాజకీయ తర గతికి తెలుసునని ఆ సంఘటన నిరూపించింది.అఫ్గానిస్తాన్‌లో ‘నార్తర్న్ అలయన్స్’కు భారత్ చేస్తున్న సాయం గురించి అప్పటి విదేశాంగ కార్యదర్శి కె. రఘునాథ్‌ను లోతుగా ప్రశ్నిస్తున్నారు. ఆయన సూటిగా జవాబివ్వకుండా అరకొర మాటలతో దాట వేస్తు న్నారు. సభ్యులు అసహనానికి లోనవడంతో, గుజ్రాల్ జోక్యం చేసు కుని, విదేశాంగ శాఖ ఏం చేస్తున్నదీ తనకు తెలుసునని, చర్చనుఅంతటితో ముగించారు. ఏ సభ్యుడూ ఇక నిరసన తెలుపలేదు. -వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-వివేక్ కాట్జూ -
చైనాను బెదరగొడితే చాలు!
ప్రపంచం దృష్టి వెనిజులా, గ్రీన్‌ల్యాండ్, ఇరాన్ పరిణామాలపై కేంద్రీకృతం అయి ఉండటంతో, అమెరికన్లు మళ్లీ మళ్లీ ప్రక టిస్తున్న ఇండో–పసిఫిక్ వ్యూహం చర్చకు రావటం లేదు. ఈ వ్యూహంలో భారత దేశాన్ని కూడా భాగంగా చేసి చూపుతున్నందున, మౌలికంగా ఆ వ్యూహం ఏమిటో తెలుసుకోవటం అవసరం. ఆ వ్యూహం ఏమిటో తెలిసేందుకు మూడు డాక్యుమెంట్లను చూడవలసి ఉంటుంది: ఒకటి – 2022 ఫిబ్రవరిలో అప్పటి డెమోక్రటిక్ బైడెన్ ప్రభుత్వం ప్రకటించిన ‘ఇండో–పసిఫిక్ స్ట్రాటజీ’. రెండు – 2025 నవంబర్‌లో ప్రస్తుత రిపబ్లికన్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన ‘నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ’. మూడు – ఇదే ప్రభుత్వం 2026 జనవరిలో, అనగా గత నెలలో ప్రకటించిన ‘నేషనల్ డిఫెన్స్ స్ట్రాటజీ’. వీటన్నింటిలో ఇండో–పసిఫిక్ గురించిన సారాంశం ఈ విధంగా ఉంది. ప్రపంచ వాణిజ్యానికే అతిపెద్ద, అత్యంత క్రియా శీలమైన మార్కెట్ ప్రాంతం ఇది. కనుక అమెరికా భద్రత, స్వేచ్ఛ, సౌభాగ్యాలపై చాలా ప్రభావం చూపుతుంది.చైనా సవాల్ఈ ప్రకటనతో ఆరంభించిన అమెరికా వ్యూహం, తమ ప్రయోజనాల పరిరక్షణకు అక్కడ ఏమేమి చేయాలన్న విషయమై చాలానే చెప్పింది: పశ్చిమార్ధ భూగోళాన్ని మన్రో, డోన్రో డాక్ట్రిన్లను అనుసరించి పూర్తి నియంత్రణలోకి తెచ్చుకుంటున్నాము. పశ్చిమాసి యాలో ప్రయోజనాలు ఇజ్రాయెల్ ద్వారా నెరవేరుతున్నాయి. యూరోపియన్ దేశాలు తమ సహచరులే గనుక, వారు తమ రక్షణ వ్యయాన్ని మాత్రం పెంచి తమతో నిలబడితే సరిపోతుంది. ఆర్కిటిక్‌కు సంబంధించి గ్రీన్‌ల్యాండ్‌ను ఏదో ఒక విధంగా అధీనంలోకి తెచ్చుకుంటే ఆ సమస్య తీరుతుంది. ఉక్రెయిన్ యుద్ధం తేలిపోతే రష్యాతో పేచీ ఉండదు. పైగా అది ఒక ప్రాంతీయ శక్తి మాత్రమే. ఆ విధంగా ఇక మిగిలేది ఇండో–పసిఫిక్ ఒక్కటే!ఇండో–పసిఫిక్ మాత్రమే మిగిలి ఉండటం ఎందుకంటే చైనా కారణంగా. మరొక విధంగా చెప్పాలంటే, మొత్తం ప్రపంచపు భౌగోళిక వ్యూహంలోనే అమెరికాకు మిగిలి ఉండగల సమస్య చైనా అన్నమాట. వేరెవరో అనవలసిన అవసరం లేకుండా, వ్యూహ పత్రా లలో అమెరికన్ ప్రభుత్వాలే అరమరికలు లేకుండా చెప్పాయి. చైనా పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, ఆర్థికంగానే గాక సైనిక బలం రీత్యా కూడా ఎదిగి ఇపుడు తమకు పోటీదారుగా మారిందన్నాయి. ఒత్తిడిలో అమెరికాఈ స్థితిని ఎదుర్కోవటం ఎట్లాగన్నది ప్రశ్న. మరొక మాటలో చెప్పాలంటే ఈ స్థితిని ఎదుర్కొని అమెరికా అగ్రస్థానాన్ని పదిలపర చుకోవటం, చైనాను ఇంతకుమించి ముందుకు రానివ్వక పోవటం అన్నమాట. రాగల కాలంలో అమెరికన్ వ్యూహాల కేంద్రీకరణ అంతా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఉంటుందన్నది స్పష్టం. వాస్తవా నికి ఈ ఆలోచనలు కొత్తవి కావు. పశ్చిమాసియాలో ఎదురు దెబ్బల తర్వాత డెమోక్రటిక్ అధ్యక్షుడు ఒబామా(2009–17), ఇక తమ దృష్టి అటునుంచి ఆసియాకు మారాలని ప్రతిపాదించారు. బైడెన్ (2021–25) పైన పేర్కొన్న ‘ఇండో–పసిఫిక్ స్ట్రాటజీ’ని ప్రకటించారు. చైనాపై వాణిజ్య, పారిశ్రామిక యుద్ధాలను ట్రంప్ శక్తి మేర సాగించారు. అమెరికా ప్రయోజనాల కోసం ఇండో–పసిఫిక్ విధాన మన్నది డెమోక్రటిక్, రిపబ్లికన్ ప్రభుత్వాల రెండింటి ఉమ్మడి సంప్రదాయం అయింది.తన మొదటి విడత పాలనా కాలంలో (2017–21) ఏ వ్యూహ పత్రమూ ప్రకటించని ట్రంప్ ఇపుడు ఏడాదిలోనే రెండు పత్రాలు తేవటం గమనించదగ్గది. పదేళ్ల క్రితంతో పోల్చితే అమెరికా బలహీన పడగా, చైనా బలపడింది. అమెరికాపై పలు విధాలైన ఒత్తిళ్లు పెరుగు తున్నాయి. చైనాను కట్టడి చేయక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్థికంగా చూసినట్లయితే వారికి వేర్వేరు దేశాల నుంచి ఇంధనంతో సహా వనరుల సేకరణకు, మార్కెట్లకు, పెట్టుబడులకు ఆటంకాలు కల్పించాలి. వాటిని తమ నియంత్రణలోకి తెచ్చుకుని, ఇంతవరకు వలె గాక రాగల కాలంలో తమ అభివృద్ధిని వేగవంతం చేయాలి. సైన్స్, టెక్నాలజీ ఆధునికీకరణలు, వాటి ఆధారంగా ఆధునిక ఉత్ప త్తులు భవిష్యత్తుకు కీలకం అయినందున, ఆ రంగాలలో చైనా పురో గతి ఒక సవాలుగా మారినందున... ఆ విషయమై మరింత దృష్టి పెట్టాలి.ఎన్ని వ్యూహాలు?సైనిక విషయాలకు వస్తే వ్యూహ పత్రాలు ఒక సూత్రాన్ని పదే పదే పేర్కొనటం గమనించదగ్గది. అది– చైనాను కట్టడి చేయటమైతే తప్పనిసరి. కానీ యుద్ధం ద్వారా కాదు. ఒక బెదురు అన్నది సృష్టించి నిలువరించటం ద్వారా! బెదురును సృష్టించటం ఏ విధంగా? ఒకటి– ఇండో–పసిఫిక్ ప్రాంతంలోని తమ సైనిక స్థావ రాలను (66 అని అంచనా) శక్తిమంతం చేయటం. రెండు– అక్కడి తమ కూటమి దేశాల సైన్యాలను బలోపేతం చేయటం. వారు తమ రక్షణ వ్యయాలను పెంచటం. మూడు– ఒకే చైనా విధానాన్ని కొన సాగిస్తూనే, తైవాన్ను తమ రక్షణ వ్యూహం కోసం ఉపయోగించు కోవటం. నాలుగు– జపాన్ నుంచి బోర్నియో వరకు వరుసగా గల మొదటి వరుస దీవులను (ఫస్ట్ ఐలాండ్ ఛెయిన్) దాటి చైనా యుద్ధ నౌకలు పసిఫిక్‌లోకి రాకుండా అడ్డుగోడ వంటిది తయారు చేయటం అన్నది వ్యూహం. దీనంతటి అమలు కోసమే ఇండియాతో కూడిన ‘క్వాడ్’ను 2017లో క్రియాశీలం చేసి, 2021లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో కలిసి ‘ఆకస్’ తదితర సంస్థలు ఏర్పాటు చేశారు.ట్రంప్ వ్యూహ పత్రాలలో ఆసక్తికరమైన అంశం ఒకటి కనిపి స్తుంది. దాని ప్రకారం, చైనా అభివృద్ధికి వారు వ్యతిరేకం కాదు. కానీ అమెరికా అగ్రస్థానానికి మాత్రం చైనా సవాలు కారాదు. ఇందు కోసం ఇండో–పసిఫిక్‌లోని అన్ని దేశాలనూ రకరకాల పేర్లతో ఉపయోగించుకుంటారు. ఈ వ్యూహాల అమలుకు వచ్చినప్పుడు మాత్రం కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతోపాటు ఇండో–పసిఫిక్‌లోనూ అనేక దేశాలు అమెరికా ప్రయోజనాల కోసం ఉపయోగపడేందుకు సిద్ధంగా లేక బహుళ ధ్రువ ఆలోచనలు, అమెరికా–చైనా మధ్య సమతుల్యతల పాటింపు వంటివి చేస్తున్నాయి. ఇండియా కూడా ఈ కోవలోకే వస్తుంది. ట్రంప్ బుల్డోజరిజం కెనడా, యూరప్లలోనే వ్యతిరేకతను ఎదు ర్కొంటూ, ఆ దేశాలు చైనాతో వరుస ఒప్పందాలు చేసు కోవటం ఇందుకు అద్దం పడుతున్నది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
జెఫ్ బెజోస్ (వ్యాపార దిగ్గజం) రాయని డైరీ
సంతకం పెడుతున్నప్పుడు చేయి వణికిందంటే చేయకూడని పని ఏదో చేస్తున్నట్లు! లేదా, జరగవలసిన పనే ఏదో జరుగుతున్నట్లు!! ‘వాషింగ్టన్ పోస్ట్’లో ఒకేసారి 300 మంది జర్నలిస్టులను తొలగిస్తూ నేను చేసిన సంతకం... చేయక తప్పనిదా? చేసినా తప్పవనిదా? సిబ్బందిని తగ్గిస్తూ, నేను సంతకం చేస్తున్నప్పుడు నా వేలికి అంటిన ఫౌంటైన్ పెన్ ఇంకు నాకు భారంగా తోచింది. అయితే, నా గుండెను బరువెక్కించిన విషయం వేరే ఉంది. ఏ పత్రికలోని ఉద్యోగులనైతే తొలగించ టానికి నేను సంతకం చేయవలసి వచ్చిందో సరిగ్గా ఆ పత్రికే, నా తొలగింపుల సంతకపు కాగితానికి ‘ఒత్తు’గా ఉండటం నా మనసును కలవరపరిచిన కో–ఇన్సిడెన్స్!తొలగింపుల జాబితాలో తమ పేరు కనిపించిన ఉద్యోగులకు కూడా నాలాగే గుండె బరువెక్కి ఉంటుంది. కాళ్ల కింద భూమి కదిలే ఉంటుంది. కానీ, చెట్టును బతికించటానికి కొమ్మలను నరికేయక తప్పని స్థితి. ఈ ఏడాది మళ్లీ మరొక 100 మిలియన్ డాలర్ల నష్టాల్లోకి పేపర్ వెళ్లబోతోంది. పోయిన సంవత్సరం వంద మిలియన్ల నష్టం! ఆ ముందు ఏడాదీ వంద మిలియన్ల నష్టం! పన్నెండేళ్ల క్రితం నేను ‘వాషింగ్టన్ పోస్ట్’ను కొన్నదే 250 మిలియన్ డాలర్లకు!పేరున్న ఒక న్యూస్ పేపర్‌గా మాత్రమే ఆనాడు నేను ఈ 148 ఏళ్ల చరిత్ర కలిగిన ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రికను కొనలేదు. ప్రజాస్వామ్య మూలస్తంభాన్ని కొన్నట్లుగా కొన్నాను. లాభాలు చూసుకోలేదు. కానీ ఇప్పుడు నష్టాలను చూసుకోవలసి వస్తోంది. ‘వాషింగ్టన్ పోస్ట్’లో న్యూస్ రూమ్‌లు, న్యూస్ బ్యూరోలు ఎక్కువైపోయాయి. న్యూస్ పేపర్ చదివేవాళ్లు తక్కువైపోయారు. ‘న్యూయార్క్ టైమ్స్’కూ, ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’కూ... ‘వాషింగ్టన్ పోస్ట్’ పోటీ ఇవ్వలేకపోతోంది.‘‘ఏం చేద్దాం, మిస్టర్ మ్యాక్’’ అని అడిగాను ఒకరోజు. ఆయన మౌనంగా ఉండిపోయారు! మ్యాక్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. ఆయన పక్కనే సీఈవో విలియం ఉన్నారు. ‘‘మీరు చెప్పండి మిస్టర్ విలియం’’ అన్నాను. ఆయనా మౌనంగా ఉన్నారు!! ఆ ఇద్దరి మౌనాల తర్వాత నేను తీసుకోవలసి వచ్చిన కఠినమైన నిర్ణయమే... ‘వాషింగ్టన్ పోస్ట్’లోని కొన్ని డెస్క్‌లను, కొన్ని బ్యూరోలను ఎత్తివేయటం, మూకుమ్మడిగా కొందరు జర్నలిస్టులను తొలగించటం.270 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులున్న జెఫ్ బెజోస్‌కు 100 మిలియన్ డాలర్ల నష్టం ఒక లెక్కా అని ఎవరికైనా అనిపించవచ్చు. ఇది లెక్కల విషయం కాదు. నెలనెలా తన బిలియనీర్ యజమాని జేబు లోంచి వచ్చే డబ్బుతో ఏ సంస్థా నడవకూడదు. ‘వాషింగ్టన్ పోస్ట్’ వంటి దిగ్గజమైతే తన ఇంజిన్ తోనే రన్ అవ్వాలి. అలా నడవటమే పత్రికకు, పత్రికలోని ఉద్యోగులకు గౌరవం. అమెజాన్ ఆఫీస్ బిల్డింగ్‌కు నేను పెట్టుకున్న పేరు ‘డే–1’. కొత్తగా పెట్టిన కంపెనీ తొలి రోజు ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటుందో, పదివేల ఏళ్ల తర్వాత కూడా ఆ కంపెనీ, తొలి రోజు ఉన్నట్లే ఉండాలన్నది ‘డే–1’ వెనుక నా ఫిలాసఫీ. కంపెనీ ‘డే–2’ లోకి వచ్చిందంటే... స్తబ్ధత, అసంబద్ధత, క్షీణత తప్ప ఇక అక్కడేం లేవని!‘వాషింగ్టన్ పోస్ట్’ ప్రస్తుతం ‘డే–2’ లో ఉంది. తిరిగి ‘డే–1’లోకి తెచ్చేందుకే ఈ తొలగింపులు, ఎత్తివేతలు అంటే ఎవరైనా ఎందుకు సంతోషిస్తారు? ఆఖరికి మ్యాక్, విలియమ్ కూడా సమ్మతంగా లేరు. 18 సొంత కంపెనీలు ఉండొచ్చు, 31 కంపెనీల్లో వాటాలు ఉండవచ్చు. బిలియన్ల కొద్దీ ఆస్తులు ఉండవచ్చు. లక్షలాది మంది వర్కర్లు ఉండవచ్చు. కానీ, కొద్దిమంది ఉద్యోగులను తొలగించవలసి వచ్చినప్పుడు మాత్రం... అన్నన్ని కంపెనీలు, అన్నన్ని వాటాలు, అన్నన్ని ఆస్తులు, అంతంత మంది వర్కర్లు ఉన్న ఏ బిజినెస్ టైకూన్కైనా ఒక్క అపరాధ భావన మాత్రమే తోడుగా ఉంటుందేమో! -
అంతరిక్షానికి నిచ్చెనౌతాను!
ఇటీవలి తన భారతదేశ పర్యటనలో భాగంగా ‘నాసా’ వ్యోమగామి సునీతా విలియమ్స్ ‘అన్పాలిటిక్స్’ పాడ్ కాస్ట్లో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో, మునుపెన్నడూ వెల్లడించని విషయాలను, భావోద్వేగాలను సునీత పంచుకున్నారు.‘ద మార్షియన్’ సినిమా గుర్తొచ్చింది!‘‘మేము అంతరిక్ష నౌకను అంతరిక్ష కేంద్రంతో కలుపు తున్న (డాకింగ్) సమయంలో ఐదు ఇంజిన్లు ఆగి పోయాయని తెలిసి ఆందోళన కలిగింది. అది మా పుస్త కాల్లో ఎక్కడా లేని ఒక పెద్ద సాంకేతిక సమస్య. కానీ ఒక పెద్ద సమస్యను ఎలా పరిష్కరించాలి? చిన్న చిన్న భాగా లుగా చేసుకుని ఒక్కొక్కటిగా పరిష్కరించాలి. అప్పుడు నాకు ‘ద మార్షియన్’ సినిమా గుర్తొచ్చింది. పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు, ఆ సమస్య ఎంత పెద్దదని చూడకూడదు; మన ముందున్న చిన్న పని మీద మాత్రమే దృష్టి పెట్టాలి. పనిలో పడిపోతే భయపడటా నికి సమయం ఉండదు.కల్పన కుటుంబంతో మూడు నెలలు‘కొలంబియా’ ప్రమాదం జరిగిన తర్వాత, నేను హ్యూస్టన్‌లోని కల్పన (చావ్లా) కుటుంబంతో మూడు నెలల పాటు గడిపాను. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వారితోనే ఉండేదాన్ని. అది ఊహించని, విపత్కాలం. వారికి ఆ బాధ నుండి ఉపశమనం కలిగించాలని అనుకున్నాను. ఆ మూడు నెలల్లో మేము ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. కల్పనలోని సుగుణాల గురించి నేను వారికి చెప్పాను. ఇండియాలో కల్పన చిన్ననాటి కథలను వారు నాకు చెప్పారు. అది మా అందరికీ ఎంతో ఊరటనిచ్చింది. రానున్న కాలమంతా చంద్రుడిదే!‘‘నా రిటైర్మెంట్ గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఎందుకంటే ఈ అధ్యాయాన్ని ముగించడానికి ఇదే సరైన సమయం అని నా భావన. నా కెరీర్ అంతా అంతరిక్ష కేంద్రంతోనే సరిపోయింది కానీ, రాబోయే కాలం చంద్రుడికి సంబంధించింది. ఇప్పుడు నాకంటే చిన్న వయస్సులో ఉన్నవాళ్లు బాధ్యతలు చేపట్టారు. వారు చరిత్ర సృష్టించటానికి సిద్ధంగా ఉన్నారు. ఇకపై ఆ సీటులో నేనే కూర్చోవాలని లేదు. నేనేమీ అద్భుతాలు చేసే మెజీషియన్‌ని కాదు. నేను కూడా వారిలో ఒకరిని మాత్రమే. వారు పైకి ఎదగడానికి నేను ఒక నిచ్చెనలా తోడ్పడాలని కోరుకుంటున్నాను. (సునీత 27 ఏళ్ల కెరీర్ తర్వాత ‘నాసా’ నుంచి 2025 డిసెంబర్ 27న రిటైర్ అయ్యారు. ఆ సంగతిని నాసా, సునీత ఇండియా పర్య టనలో ఉండగా 2026 జనవరి 21న ప్రకటించింది.)అదొక అందమైన జీవ ప్రవాహం!‘‘అంతరిక్షం నుండి భారతదేశాన్ని చూడటం అద్భుతంగా ఉంటుంది, ముఖ్యంగా రాత్రిపూట. మనం పైనుండి వెళ్తున్నప్పుడు, నగరాలన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక ‘నరాల వ్యవస్థ’ లాగా కనిపిస్తాయి. మా నాన్న మైక్రోస్కోప్ కింద చూసే బొమ్మల్లా ఉంటా యవి. ముంబై తీరంలో చేపల పడవలు వెలుగుతున్న దీపాల్లా కనిపిస్తాయి. తీరం వెంబడి కాంతులు ఒక ముత్యాల హారంలా మెరుస్తాయి. ఇవన్నీ చూస్తుంటే మా కుటుంబ చరిత్ర, ఈ దేశంతో మాకున్న అనుబంధం నాకు బలంగా గుర్తొస్తాయి. చూడటానికి అది ఒక అందమైన జీవప్రవాహంలా అనిపిస్తుంది.పెంపుడు కుక్క ప్రేమ జ్ఞాపకాలు‘‘నా చేతిపై ఉన్న ఈ పాదముద్రల పచ్చబొట్లు మాపెంపుడు కుక్కవి. ఇవి నా దగ్గర 2001 నుండి 2017 వరకు ఉన్న ‘జాక్ రస్సెల్ టెర్రియర్’ రకానికిచెందిన నా పెంపుడు కుక్క అసలు పాద ముద్రలు. అది నాతో పాటు శిక్షణ కోసం రష్యాకు కూడా వచ్చింది. నేను పరిగెత్తేటప్పుడు లేదా ఈత కొట్టేటప్పుడు దానిని చూస్తుంటే, నాకు ఇంటితో ఉన్న అనుబంధం గుర్తు కొస్తుంది. అంతరిక్షంలో ఉన్నప్పుడు, జంతువులు మనకు స్వచ్ఛమైన నిజాయితీ గల ప్రేమను గుర్తు చేస్తాయి. మన మనుషుల్లాగా వాటికి మనసులోగందరగోళం ఉండదు. నా శరీరంపై ఉన్న ఈ గుర్తులు నన్ను ఎప్పుడూ నా ఇంటి జ్ఞాపకాలతో, ఆ స్వచ్ఛతతో కలుపుతూ ఉంటాయి.-ఎడిటోరియల్ టీమ్ -
పరిశోధనలు ప్రైవేటు పరమా?
సాధారణంగా అందరూ అనుకునేట్టు కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ కేవలం పన్నులు, ఆదాయం, ఆ యారంగాలకు కేటాయింపులు మాత్రమే కాదు. కీలక రంగాల విషయంలో ప్రభుత్వ ఆలోచనలు, విధానపరమైన మార్పులు ఇందులోనే వ్యక్తమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానరంగం ఉరకలేస్తున్న తరుణంలో అంతర్జా తీయ రాజకీయ పరిణామాలనూ దృష్టిలో ఉంచుకుంటే ఈ ఏడాది బడ్జెట్ సరికొత్త సవాళ్లకు సమాధానాలు తెలిపేదిగా ఉంటుందని ఆశించడం సహజం. కానీ ఈ దిశలో బడ్జెట్ నిరాశ పరిచిందనే చెప్పాలి. ప్రభుత్వం ప్రకటించుకున్నట్టు ఇది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ కాదు. కృత్రిమ మేధ, సెమీ కండక్టర్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాల విషయంలో ఇది యథాతథ స్థితిని కొనసాగించే సాధారణ బడ్జెట్. మార్పునకు సూచికలేనా?ఆర్థిక శాఖ మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో సైన్స్, టెక్నాలజీ రంగాలకు సంబంధించి ఏం మాట్లాడారో చూద్దాం. కొత్త టెలిస్కో పులు, వేధశాలల ఏర్పాటును ప్రస్తావించారు. అరుదైన మూలకా లకు సంబంధించిన కారిడార్ల గురించి, సెమీ కండక్టర్ మిషన్ రెండో అధ్యాయం ప్రారంభం, బయోఫార్మా తయారీ వ్యూహాలూ ప్రసంగంలో ఉన్నాయి. ఇవన్నీ చేయాల్సిన పనులే. అయితే ఏవీ ఓ గొప్ప మార్పునకు సూచికలైతే కావు. ‘ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్’ (ఐఐఏ) 15 ఏళ్లుగా నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోపు తయారీ కోసం శ్రమిస్తోంది; ఐదేళ్లుగా నేషనల్ లార్జ్ ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోపు నిర్మాణ ప్రయత్నాల్లోనూ ఉంది. ఆర్థిక మంత్రి వీటి గురించే బడ్జెట్లో ప్రస్తావించారు. వీటి డిజైనింగ్, స్థలంఎంపిక, పరిశోధన వేదిక పునాదులు, సిబ్బంది వంటి కీలకమైన ఏర్పాట్లు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. స్థలం ఎంపిక కోసం ఆర్థిక మంత్రి స్వయంగా లద్దాఖ్‌ను సందర్శించారు కూడా.సూర్యుడిపై పరిశోధనల విషయంలో భారత్ సామర్థ్యం గట్టిదే. ప్రతిపాదిత టెలిస్కోపు కూడా ఆదిత్య ఎల్, ఉదయ్‌పూర్‌లోని మల్టీ అప్లికేషన్ సోలార్ టెలిస్కోపుల ద్వారా అందుతున్న సమాచారానికి సాయంగా నిలుస్తుంది. కొత్త టెలిస్కోపు నిర్మాణ వ్యయం దాదాపు రూ.3,500 కోట్లుగా లెక్కగట్టారు. అయితే ఐఐఏకు అదనపు బడ్జెట్ కేటాయింపులేవీ జరగలేదు. ఐఐఏ సహా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్్సకు అనుబంధంగా ఉన్న 25 అటానమస్ సంస్థలకు ఈ ఏడాది బడ్జెట్లో దక్కింది రూ.1,623 కోట్లు మాత్రమే.సాధారణ ప్రక్రియలో భాగమే!రానున్న ఐదేళ్లలో రూ.10,000 కోట్లతో బయోఫార్మా ‘శక్తి’ కార్యక్రమాన్ని కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా బయలాజిక్స్, బయో సిమిలర్స్ తయారీ చేపడతారు. అయితే మంత్రి ప్రకటించిన మొత్తం... మూడు కొత్త ‘నేషనల్‌ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’ (నైపర్)ల నిర్మాణానికీ, వీటికి అనుబంధంగా ఉన్న వెయ్యి అక్రిడి టెడ్ క్లినికల్ ట్రయల్స్‌కూ ఖర్చు చేస్తారు. ఈ రెండూ సాధారణ ప్రక్రి యల్లో భాగమే కానీ, బయోఫార్మాకు ప్రత్యేకమైనవి ఏమీ కాదు.‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్’ను బలోపేతం చేస్తామని బడ్జెట్లో ప్రకటించారు. ఇది అవసరమే కానీ బయో ఫార్మా వ్యూహంలో దీన్ని భాగం చేయడం ఆశ్చర్యకరం. శక్తి కార్యక్ర మంలో భాగంగా కేటాయించిన పదివేల కోట్ల రూపాయల్లో నైపర్ లకు ఎంత, మిగిలిన వాటికి ఎంతెంత అన్న స్పష్టత లేదు. వాస్తవా నికి, శక్తి కార్యక్రమం 2017లో వరల్డ్ బ్యాంక్ సాయంతో నేషనల్ బయోఫార్మా మిషన్‌లో భాగంగా 25 కోట్ల డాలర్లతో చేపట్టారు. దీని ద్వారా టీకాలు, బయోసిమిలర్లు, వైద్య పరికరాల తయారీ, పరిశో ధనలు చేయాలన్నది లక్ష్యం. హాట్ టాపికే కానీ...బడ్జెట్ ప్రసంగంలో సెమీ కండక్టర్లు, రేర్ఎర్త్ మినరల్స్, ఏఐ వంటి వాటి ప్రస్తావన వచ్చినప్పటికీ ఏదీ గేమ్‌ఛేంజర్ స్థాయికి చేరలేదు. రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారీ కేంద్రం ఒకదాన్ని గత ఏడాది నవంబరులో ప్రారంభించామని ప్రకటించిన మంత్రి... ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రేర్ ఎర్త్ కారిడార్ల ఏర్పాటు చేసుకునేందుకు సహకరిస్తామని తెలిపారు. గతేడాది ప్రకటించిన నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌లో ఇవన్నీ భాగం కావడం గమనార్హం. కొన్నేళ్లుగా బడ్జెట్ ప్రసంగాల్లో తరచూ వినిపించిన ఇంకో ఆలోచన ‘అనుసంధాన్ నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్’. ఈసారి దీన్ని కేవలం ప్రస్తావనకు మాత్రమే పరిమితం చేశారు. ఐదేళ్లలో రూ. 50,000 కోట్లు కేటాయిస్తామని చెప్పినా గతేడాది రూ. 2,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ ఏడాది కేటాయింపులు కూడా అంతే మొత్తంలో ఉండటం గమనార్హం. గతేడాది ప్రకటించిన రిసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్(ఆర్డీఐ) స్కీమ్ ద్వారా ప్రైవేట్‌రంగ డీప్ టెక్ ప్రాజెక్టులకు వచ్చే ఏడేళ్లలో రూ.లక్ష కోట్లు అందాల్సి ఉండగా గతేడాది రూ.20,000 కోట్లు దక్కాయి. ఇందులో ఖర్చ య్యింది రూ. 3,000 కోట్లు మాత్రమే. కేంద్ర కేబినెట్ దీన్ని గత ఏడాది జూలైలో ఆమోదించడం ఇందుకు కారణం. నియమ నిబంధనలు కాస్తా నవంబరుకు కానీ పూర్తి కాలేదు.కేటాయింపులో ఖర్చు చేసిన మొత్తం తక్కువైనా... అమలు తీరులో ఎన్నో లోపాలున్నా ఆర్‌డీఐకి జరిపిన కేటాయింపులను బట్టి చూస్తే... ప్రభుత్వం పరిశోధనలను ప్రైవేట్‌పరం చేసేందుకు నిర్ణ యించినట్టుగా కనిపిస్తోంది. ‘అనుసంధాన్’కు కేవలం రూ. 2,000 కోట్లే దక్కాయి. ఆర్‌డీఐకి ఇంతకు పది రెట్లు ఎక్కువ కేటాయించారు. ప్రభుత్వ పరిశోధన సంస్థలకు కేటాయింపులు తగ్గిపోగా... ప్రైవేట్ రంగానికి ఎక్కువయ్యాయి. ఇదేమంత మంచి పరిణామం కాదు.-వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత-దినేశ్ సి. శర్మ -
లడ్డూపై అబద్ధాల ప్రచారం రాజకీయ కుట్రే!
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగకుండానే జరిగిందని ప్రచారం చేయడం పెద్ద నేరం. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు లడ్డూలో కల్తీ జరిగిందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్ను దోషిగా నిలబెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన స్వామివారి ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్డుకు ఈడ్చడం ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తికి ఏమాత్రం తగనిది. సీబీఐ నేతృత్వంలోని స్వతంత్ర సిట్ దర్యాప్తులో ఈ విషయాలన్నీ నేడు స్పష్టమయ్యాయి. అయినా వైఎస్సార్ సీపీని టార్గెట్ చేసేందుకు మళ్లీ దర్యాప్తు కమిటీని నియమిస్తామంటున్నారు. సీబీఐ తమకు అనుకూలంగా నివేదిక ఇవ్వనందుకే ఈ కమిటీని నియమిస్తున్నారా?రాజకీయ లబ్ధి కోసం భక్తుల భావోద్వేగాలతో ఆడుకున్న చంద్రబాబు, ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని ప్రజలకు క్షమాపణ చెబుతారని ఆశించినవారికి నిరాశే మిగిలింది. తన తప్పు బయటపడకుండా ఉండేందుకు అనుకూల మీడియాతో కలిసి ప్రజ లను తప్పుదోవ పట్టించే కొత్త పంథాను ఆయన అనుసరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ‘నేను మారిన మనిషిని, నన్ను నమ్మండి’ అని చెప్పి అధికారం దక్కించుకున్నాక, తన సహజ స్వరూపాన్ని మరో సారి బయటపెట్టుకున్నారు. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో జంతు కొవ్వు కలవ లేదని తేలినా, పదే పదే అబద్ధాలు చెప్పి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామి గురించి మాట్లాడేటప్పుడు ఓపిక, సహనం ఉండాలి. ఎటు వంటి విచారణ లేకుండా, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండా ముఖ్యమంత్రే స్వయంగా కల్తీ జరిగిందని ప్రకటించడం వెనుక ఉన్న ప్రాతిపదిక ఏమిటో అర్థం కావడం లేదు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సైతం ఘాటుగా స్పందించింది. సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి అపోహలు సృష్టించడం తగదని మందలించింది.భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అనుబంధ సంస్థ లైన హరియాణాలోని ‘నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్ లోని ‘నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు’ పరిశోధనల ప్రకారం లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ అయింది. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కూడా జంతు కొవ్వు ప్రస్తావనే లేదు. ఇలాంటప్పుడు ప్రజల్లో తప్పుడు ప్రచారం చేసినందుకు చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. హిందువుల మనోభావాలను తాకట్టు పెట్టి చేసిన ఈ రాజకీయ క్రీడ అత్యంత దురదృష్టకరం. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు, ఇప్పటికైనా బాబు తన తప్పును ఒప్పుకుని హుందాగా వ్యవహరించడం అవసరం.దేవుని పేరుతో రాజకీయం చేసే బీజేపీ నాయకత్వం ఈ విష యంలో అనుసరిస్తున్న మౌనం విస్మయకరంగా ఉంది. ఒక మహిళా నేత తమ పార్టీకి కష్టం వచ్చినప్పుడు మౌనంగా ఉండి, పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీకి చిన్న ఇబ్బంది కలిగినా వెంటనే స్పందిస్తున్నారు. గతంలో కేంద్రం తెచ్చిన రైతు చట్టాలపై సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పుడు నోరు మెదపని ఆమె, ఇప్పుడు కోర్టు చేసిన వ్యాఖ్యలపై వింతగా స్పందిస్తున్నారు. తన బంధువు దోషిగా తేలుతారని తెలిసి ఇటువంటి విమర్శలు చేస్తున్నారా? మరొక నాయకుడు ఆలయ మెట్లు కడుగుతూ, సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. తన రాజకీయ భాగస్వామిని రక్షించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. జరిగిన తప్పునకు బాధ్యత వహిస్తూ భక్తులకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది.డా‘‘ పూనూరు గౌతమ్ రెడ్డివ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు -
అంతా ప్రైవేటు రూటే!
ఈ ఏడాది బడ్జెట్లో అమెరికా టారిఫ్‌ల తాకిడిని తట్టుకోవడంపై దృష్టిని కేంద్రీకరించినట్టు కేంద్రం చెబుతూనే వారితో ఒప్పందానికి తలుపులు తీసి ఉంచింది. ఈయూతో ఒప్పందం కూడా చాలా విధాలుగా మన దేశీయ ఉత్పత్తులను, వ్యాపారాలను దెబ్బ తీస్తుంది. అంతర్జాతీయంగా చాలా ఆర్థికాంశాలు మన అధీనంలో లేకుండాపోయాయంటూ ఆర్థిక సర్వేలోనే కేంద్రం మూడు అవకాశాలు సూచించింది. అధ్వాన్నమైన పరిస్థితి వస్తే 2008 నాటి ఆర్థిక సంక్షోభం కన్నా దారుణంగా ఉండొచ్చని కూడా పేర్కొంది. మరి బడ్జెట్లో స్వావలంబన కోసం ఏవైనా నిర్మాణాత్మక పథకాలున్నాయా అంటే చాలా భాగం విదేశాలతో ముడిపడిన ప్రైవేటు ప్రాజెక్టులే. అన్నీ ప్రైవేటుకు అప్పగించే పీపీపీ నమూనా దీనంతటి వెనక దాగి ఉంది. ఆర్థిక సర్వేలోనే కేంద్రం ప్రైవేటు రంగంపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేసింది. ప్రభుత్వ సంస్థల్లో సర్కారుకు 51 శాతం వాటా ఉండాలనే విధానాన్ని మార్చి... 26 శాతం ఉంటే సరిపోతుందని సూచించింది. ఆర్థిక అంచనా ఆందోళన కరంగా ఉంటే ముందు ఆదుకో వలసింది పేద, మధ్య తరగతి వర్గాలను! కానీ ఆర్థిక క్రమశిక్షణ పేరిట వారికి ఇచ్చే సంక్షేమ పథకాలనే నిర్మలమ్మ టార్గెట్‌గా చేసుకున్నారు. 2025–26లో పన్ను ఆదాయం ఆశించిన మేర కైనా పెరిగింది లేదు. 2026– 27కు చూపించిన అంచనాలు 2025–26 స్థాయిలోనే ఉండటం ఇందుకు నిదర్శనం. కార్పొరేట్ రంగానికి లక్షల కోట్ల రాయితీల వల్ల గండి కొనసాగించారు. పీఎమ్ పోషణ్, పీఎమ్శ్రీ, పంటల బీమా వంటి వాటన్నిటికీ కేటాయింపుల్లో కోత వేశారు. మహిళల కోసం ఉద్దేశించిన నిధులలో 51,444 కోట్లు కోత పెట్టారు. 2026–27లో ఎరువులు, ఆహారం, పెట్రోలియం, సబ్సిడీ లలో మరింత కోత ప్రతిపాదించారు. ప్రజా సంక్షేమం ప్రధానంగా భావించకపోవడం వల్లనే నగదు బదిలీలు 1.7 కోట్లు దాటిపోతున్నాయని సర్వేలోనే ఆందోళన వెలిబుచ్చింది. గిగ్ వర్కర్ల జీతాలు పెరVýæక పోవచ్చని కూడా సర్వేలోనే వెల్లడించింది. కొత్త లేబర్ కోడ్లు, పనిగంటల పెంపు వంటివన్నీ కలిపి చూసుకుంటే ఏలినవారు ఏ దిశలో ఆలోచించారో తెలుస్తుంది. ఇవన్నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలే.ఏఐ డేటా సెంటర్లకు, క్లౌడ్ కంపెనీలకు 2047 దాకా భారీ రాయితీలు ప్రకటించింది. కంటైనర్లపై, విమాన తయారీ పరికరాలపై రాయితీలు కూడా కార్పొరేట్లకే కానుక లవుతాయి. ఇన్ఫ్రా రంగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ పెట్టుబడులకు ఆధారమవుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అరుదైన మృణ్మయ నమూనాలపై ఇప్పుడు అంతర్జాతీయ పెట్టుబడి కన్నుపడింది గనక ఏపీలోనూ అలాటి ఒక పరిశోధనా కేంద్రం నెలకొల్పు తామన్నారు. ఈనగాచి నక్కల పాలైనట్టు ఇవన్నీ తర్వాత ప్రైవేటు బాటలోకి తరలించబడతాయి. రక్షణ రంగం కేటా యింపుల పెంపు కూడా ప్రైవేటు భాగస్వామ్యంలోనే ఖర్చయి పోతుంది. అప్పుల శాతం జీడీపీలో 50 శాతానికి తగ్గించడం లక్ష్యమైందంటే పరిస్థితి తెలుస్తోంది. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించవలసిన రాష్ట్రాలు ఎంత మొరపెట్టుకున్నా వాటి కేటాయింపుల పెంపు లేదు. 16వ ఆర్థిక సంఘం చెప్పిందంటూ గత ఏడాది ఇచ్చిన 41 శాతం వాటాను కొనసాగించ డమే గొప్ప వరంగా బడ్జెట్ చిత్రించింది. 2025–26 బడ్జె ట్లో చెప్పినదానితో పోలిస్తే ఆచర ణలో కేంద్ర పథకాలు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, ఇతర బదలా యింపుల కింద వచ్చే మొత్తం రాష్ట్రాల వాటాకు రూ. 2,03,801 కోట్లు కోత పడింది. జీఎస్టీ రేట్ల తగ్గింపు రాష్ట్రాలపై ముందే వేటు వేసింది. ‘వీబీ జీ రామ్ జీ’ – కింద మరింత తగ్గింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలను ఆదుకో వడానికి ముందుకు రాకపోవడం దారుణం, విభజిత రాష్ట్రమైన ఏపీ వంటి వాటిని తీసుకుంటే... ఒక్కటంటే ఒక్క పథకం కింద కూడా నిధులు ఇవ్వలేదు. పోలవరం నిర్మాణానికి కేటాయింపు రూ. 3000 కోట్లు తగ్గించారు. నిర్వాసితులకు అవసరమైన 21 వేల కోట్లలో ఎంత ఇచ్చేదీ పేర్కొనలేదు. అమరావతి గురించి అప్పుల గొప్పలు చెప్పడం తప్ప సహాయం ఊసే లేదు. విశాఖ ఉక్కుపై ముఖ్య మంత్రి చంద్రబాబు వంటి వారు కార్మికులపై విరుచుకుపడ్డారు గానీ బడ్జెట్లో నిర్దిష్ట ప్రకటనలేమీ చేయించలేక పోయారు. అసలు కూటమిలో ఉండటం వల్ల రాష్ట్రానికిఏమి తీసుకురాగలిగారంటే శూన్యమే! అలాగే తెలంగాణ ప్రభుత్వం పలుసార్లు కోరిన అంశాలేవీ చోటు సంపాదించ లేకపోయాయి. కనుక ఏ విధంగా చూసినా నిర్మలమ్మ బడ్జెట్ నిస్సారమైన, నిరుత్సాహ కర వ్యవహారం. పైగా బడ్జెట్లో చూపించకుండా తర్వాత పన్ను పెంచడం ఇటీవలి రివాజు గనక పారా హుషార్!తెలకపల్లి రవి వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
పరిశ్రమలకు మేలు చేసే ఒప్పందం
భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సుదీర్ఘమైన, క్లిష్టమైన చర్చల అనంతరం ఒక కొలిక్కి వచ్చినది మాత్రమే కాదు; మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్న తీరుకు అది ప్రతీకగా నిలుస్తోంది. పైగా ఇచ్చిపుచ్చుకోవడంలో పరస్పర ప్రయోజనాలున్న రెండు పెద్ద ఆర్థిక వ్యవ స్థలను అది కలుపుతోంది. ఈ రెండింటి వాటా ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో నాల్గవ వంతుగా ఉంది. భవిష్యత్తులో కూడా ఆర్థిక బంధం స్థిరంగా కొనసాగేందుకు అది పునాది వేసింది. ఇది తాత్కాలిక బేరసారాల ప్రయోజనాల చుట్టూ అల్లుకున్నది కాకపోవడం వల్లనే ‘అన్ని భాగస్వామ్యాలకు మాతృక’ లాంటిది అనే పేరు తెచ్చుకుంది. ఇది దీర్ఘకాలిక ఆశయంతో సమగ్రంగా రూపుదిద్దుకున్న ఒప్పందం. వస్తు వాణిజ్యం, సేవలతోపాటు ఇన్వెస్ట్ మెంట్, డిజిటల్ ట్రేడ్, సతత వికాసం, రాకపోకలు, సాంకేతిక పరి జ్ఞాన సహకారాన్ని కూడా జోడించుకోవడం వల్ల ఇదేదో కేవలంసుంకాలలో వెసులుబాటు కల్పించుకున్నదిగా కాక, రెండు పక్షాలకు ప్రయోజనదాయకమైన ఆర్థిక చట్రాన్ని రూపొందించుకోగలిగింది. భారతీయ పారిశ్రామిక రంగానికి ఇది చాలా అవసరం. ఎందుకంటే, పోటీ సామర్థ్యం ప్రస్తుతం మార్కెట్ల సౌలభ్యానికి మాత్రమే పరిమితమైనదిగా లేదు. దానికి ఒక స్థిరమైన, నమ్మకమైన, స్థితి స్థాపక సామర్థ్యమున్న వాతావరణం అవసరమవుతోంది.స్థిరమైన మార్కెట్ఐరోపా వంటి విస్తృత, నియమ–ఆధారిత మార్కెట్ వల్ల ఒక లాభం ఉంది. వివిధ సంస్థలు స్వల్పకాలిక లాభాలకు అతీతంగా, పెట్టుబడులు, ఎగుమతులు, ఉత్పాదక సామర్థ్యం, భాగస్వామ్యా లపై దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుంది. వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు వస్తువులు, పాదరక్షలు, ఎలక్ట్రికల్ యంత్ర పరికరాలు, రసాయనాలు, మోటారు వాహనాల విడి భాగాల వంటి ఎక్కువ మంది శ్రమ అవసరమైన రంగాలకు అది మరీ అవసరం. ఎక్కువ మందికి ఉపాధి కల్పించగల శక్తి కూడా ఆ రంగాలకు ఉంది. ఆయా రంగాలకు యూరోపియన్ మార్కెట్లు మునుపటికన్నా మెరుగ్గా అందుబాటులోకి వస్తే గణనీయమైన లాభం చేకూరుతుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలతో సహా భారతీయ సంస్థలకు మరో మహత్తర అవకాశం లభిస్తోంది. అవి కేవలం ధర విషయంలో పోటీపడటం కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా మరింత మన్నికైన, విలువ ఆధారిత వస్తువుల ఉత్పత్తికి, విక్రయానికి యూరోపియన్ సంస్థలతో భాగ స్వామ్యం కుదుర్చుకోవడం తేలికవుతుంది. కేవలం కొన్ని దేశాలపైనే ఆధారపడటం వల్ల రిస్కులుంటాయి. వాటిని తగ్గించుకునేందుకు, ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకునేందుకు భారత్–యూరప్ కంపెనీలు రెండూ సప్లై చైన్లను చురుకుగా విస్తరించుకుంటున్నాయి. స్థాయి, సమరశీల సంస్కరణల అజెండా, మెరుగుపడిన పారిశ్రామిక మౌలిక వసతులతో యూరప్కుఇండియా నమ్మదగిన ఉత్పత్తి కేంద్రంగా, నవీకరణ భాగస్వామిగా ఆవిర్భవించగల స్థితిలో ఉంది. ఆ రకమైన మార్పునకు చాలా వరకు టెక్నాలజీ సహకారం పునాదిని అందిస్తుంది. కాలుష్య రహిత టెక్నాలజీలు, డిజిటల్ మౌలిక వసతులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, అగ్రికల్చర్ టెక్నాలజీ, అడ్వాన్డ్స్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో బలమైన సహకారాన్ని పాదుకొల్పుకునేందుకు తగిన పరిస్థితులను ఈ ఒప్పందం సృష్టిస్తోంది. నవీకరణలో ఐరోపాకున్న బలం, భారీ స్థాయిలో ఉత్పత్తి చేపట్టగల భారత్ సామర్థ్యం ఈ విషయంలో సహజసిద్ధమైన పరస్పర ప్రయోజనదాయకమైన అంశాలుగా పరిణ మిస్తాయి. అధునాతన టెక్నాలజీలను అనుసరించడంలోనేకాదు, వాటి సహ అభివృద్ధిలో, స్థానికీకరణలో, నియోగించడంలో పాలు పంచుకునే అవకాశం భారత్ పరిశ్రమలకు లభిస్తుంది. ఫలితంగా, హెచ్చు విలువ కలిగిన వస్తూత్పత్తి, టెక్నాలజీ సునిశిత రంగాల్లోకి భారత్ పయనం వేగవంతమవుతుంది.పరస్పర తోడ్పాటు సేవలు, మానవ మూలధనంపై ఈ ఒప్పందం చూపగల ప్రభావం కూడా తక్కువదేమీ కాదు. జనాభా వర్గాలలో భారత దేశానికి ఉన్న సానుకూలాంశం వ్యూహాత్మక ఆస్తిగా పరిణమిస్తుంది. ప్రపంచంలోని పెద్ద యువ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఇండియా, టెక్నాలజీ, ఇంజినీరింగ్, పరిశోధన, ఆరోగ్య రక్షణ, వ్యాపార సేవలు వంటి వివిధ విభాగాల్లోకి వృత్తినిపుణులను తీసుకురాగలదు. యూరప్‌లో వయసు మీదపడుతున్నవారి సంఖ్య పెరుగుతూ ఉండ వచ్చు. కానీ, వాటి ఆర్థిక వ్యవస్థలు నవీకరణతో నడుస్తున్నాయి. వాటికి సేవలను, మొబిలిటీని అందుబాటులోకి తెచ్చేందుకు యూరప్‌తో సంబంధాలు నెరపడంలో భారత నిపుణులకున్న సామ ర్థ్యాన్ని ఈ ఒప్పందం మెరుగుపరుస్తుంది. భద్రత–రక్షణ రంగాల్లో కూడా ఉభయ పక్షాల ప్రయోజనాలు సమ్మిళితం కావడం ఈ ఒప్పందంలో మరో ముఖ>్యంశం. అధునా తన రక్షణ పరికరాలు, ద్వంద్వ వినియోగ టెక్నాలజీ ఆవరణ వ్యవస్థ లలో తోడ్పాటుకు భారతీయ పరిశ్రమలకు ఈ ఒప్పందం ద్వారాలు తెరుస్తోంది. క్రమేపీ సమస్యాత్మకంగా మారుతున్న ప్రపంచ వాతా వరణంలో బలహీనతలను తగ్గించుకుంటూ, దేశీయ పారిశ్రామిక సామర్థ్యాలను పటిష్టపరచుకునేందుకు కూడా వీలుంది. మరో రకంగా కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గణనీయమై నదే. సమ్మిళితం ద్వారా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని భారతదేశం పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఈఒప్పందం ఎంతగానో అవసరమవుతుంది. దేశీయ ఉత్పాదక సామ ర్థ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా నిష్ఠగా ఈ ఒప్పందాన్ని అమలు జరిపితే, భారతదేశపు పారిశ్రామిక పథం రూపురేఖలు కొన్ని దశాబ్దాలపాటు కొత్త అంచులను తాకుతూ ముందుకు సాగుతాయి. ప్రపంచ వాణిజ్యంలో భారత పారిశ్రామిక రంగ స్థితి ఎక్కడో అంచుల లోకాక, కేంద్ర స్థానాన్ని సుస్థిరంగా ఆక్రమించుకోగలుగుతుంది. -వ్యాసకర్త భారతీయ పరిశ్రమల సంఘాల సమాఖ్య (సీఐఐ) డైరెక్టర్ జనరల్ (‘ద హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)- చంద్రజిత్ బెనర్జీ -
ఈసారి రాజకీయ దావోస్
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ‘ప్రపంచ ఆర్థిక సదస్సు’లు ఇంతకుముందు 1971 నుంచి 55 సార్లు జరిగాయి గానీ, ఈ తరహా పరిస్థితులు ఎప్పుడూ తలెత్తినట్లు లేవు. సాధారణంగా ఆ సదస్సు అజెండా లోకి ఆర్థికాభివృద్ధి, వాణిజ్యం, ప్రైవేట్ రంగానికీ ప్రభుత్వాలకూ మధ్య సహ కారం, సామాజిక అసమానతలు, సాంకే తిక రంగం, వాతావరణ పరిరక్షణ, రాజ కీయ సుస్థిరతల వంటి అంశాలు వస్తాయి. వీటన్నింటిని కూడా ఆర్థిక రంగ కోణం నుంచే చూస్తారు. అందుకే వాటికి ఆర్థిక సదస్సులనే పేరు వచ్చింది. కానీ, ఈ నెల 19 నుంచి 23 వరకు జరిగిన సమావేశాలలో ఈ అంశాలపై ఏ చర్చలు జరిగినా జరగకున్నా, గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ వివాదాలు రాజ్యమేలాయి. అది ఆర్థిక దావోస్‌కు బదులు రాజకీయ దావోస్ అయింది.మిత్రుల మధ్యే భేదాభిప్రాయలుతిరిగి అందులోనూ గమనార్హమైన విశేషం ఒకటున్నది. దావోస్ సమావేశాలు మొదలైనప్పటినుంచి ఇంతవరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అమెరికా, యూరప్ కలిసి శాసిస్తూ వచ్చాయి. అటువంటిది ఈసారి ఆ రెండు పక్షాల మధ్యనే భేదాభిప్రాయాలు ఏర్ప డ్డాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రెట్టన్ ఉడ్స్ సమావేశా లతో ఆరంభించి అమెరికా, యూరప్‌లు కలిసి పలు అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య సంస్థలను సృష్టించాయి. అన్ని చట్టాలూ తామే చేశాయి. ఆర్థిక, వాణిజ్య రంగాలను తమ గుప్పిట పెట్టుకుని లాభ పడ్డాయి. అటువంటిది ఈసారి సమావేశాలు వచ్చేసరికి అంతర్గత విభేదాలతో పరస్పరం కత్తులు దూసుకున్నాయి. ఈసారి దావోస్ భిన్నమైనది కావటం అందువల్లనే!అయితే ఇది ఆకస్మిక పరిణామం కాదు. ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత గత ఏడాదిగా ఉభయపక్షాల మధ్య పొగ రాజుకుంటూనే వస్తున్నది. అది, తక్కిన దేశాలతో పాటు యూరప్‌పై భారీ సుంకాలు, ఉక్రెయిన్ విషయంలో రష్యా అను కూల వైఖరి తీసుకోవటం, యూరప్ తన రక్షణ వ్యయాన్ని రెట్టింపు చేసి తన భద్రతను తాను చూసుకోవాలనటం, ‘నాటో’తో సంబంధాలు గతంలో వలె ఉండబోవన్న సూచనలు, యూరప్ ఇంతకాలం ‘తమపై పడి తిన్న’దనే తరహా వ్యాఖ్యలు, యూరప్‌లోని ఉదార వాద ప్రభుత్వాలు, పార్టీలకు వ్యతిరేకంగా తమ తరహా మితవాద – జాతీయవాద పార్టీలకు బహిరంగ మద్దతు వంటి చర్యలు ఆ పొగకు కారణమయ్యాయి. అలాగే గత కొద్ది నెలలుగా యూరప్‌ను ఈసడించి మాట్లాడటం ఒకటైతే, గత నవంబర్‌లో ట్రంప్ ప్రకటించిన ‘జాతీయ భద్రతా వ్యూహ పత్రం’లో అదే వైఖరిని చూపుతూ, అసలు యూరోపియన్ నాగరికత అన్నదే ‘తుడిచి పెట్టుకుపోయే’ పరిస్థితి వచ్చిందనటం మరొకటి అయింది.గ్రీన్‌ల్యాండ్‌తో పైపైకి...ఆ విధంగా పొగలు దట్టం కాగా, తమ సాటి ‘నాటో’ దేశమైన డెన్మార్క్‌కు చెందిన గ్రీన్‌ల్యాండ్ విషయమై జరుగుతున్న తతంగంతో ఆ పొగ కాస్తా భగ్గున మంటగా మారింది. మొదట ఇదే విధంగా కెనడాను సైనిక బలంతోనైనా తమ 51వ రాష్ట్రంగా మార్చుతామన్న ట్రంప్ పుట్టించిన ఆ మంటలు ఇప్పటికీ ఆగ్రహాన్ని రగుల్చుతుండగా, ఇపుడు గ్రీన్‌ల్యాండ్‌ను బలప్రయోగంతో 51వ రాష్ట్రం చేయగల మనటం అగ్నికి ఆజ్యంగా మారింది. గత వారపు దావోస్‌కు ముందు అందరూ ఎవరి దేశంలో వారుండి రాళ్ళు విసురుకోగా, దావోస్‌లో ఒకేచోట సమావేశమయే పరిస్థితితో బాహాబాహీ వంటి సన్నివేశాలు కనిపించాయి.ఇది అంతిమంగా ఏ విధంగా పరిణమించేదీ చెప్పలేము. మౌలికంగా ఇరువురివీ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద విధానాలు. ఉభయుల ప్రయోజనాలు కలిసి ఉన్నాయన్నది ట్రంప్ వ్యూహపత్రంలోనూ వివరించిన విషయమే. కానీ గతానికీ, ఇప్పటికీ ఒక కీలక మైన తేడా ఉంది. ‘అమెరికా ఫస్ట్’, ‘మాగా’ లక్ష్యాలను ప్రకటించిన ట్రంప్, యూరప్ సహా ప్రపంచ దేశాలన్నింటినీ అందుకోసం ఉప యోగించుకోవటమే తన విధానమైనట్లు ఆ పత్రంలో దాపరికం లేకుండానే ప్రకటించారు. ఆ పద్ధతిలో ముందుకు సాగుతుండటం వల్లనే ఇరువురి మధ్య గతంలో లేని విధంగా పొగలు, మంటలు రాజుకుంటున్నాయి. దావోస్‌లో సమావేశాలు జరుగుతున్నప్పుడు, అవి ముగిసిన తర్వాత కూడా రెండు వైపుల నుంచి వినవచ్చిన మాటలను గమనించగా, రాజీలు కనీసం ప్రస్తుతానికి జరగక పోవచ్చు. తన వ్యూహాలు, ఎత్తుగడలు నెగ్గే పరిస్థితి లేదని ట్రంప్ గ్రహించి బాగా వెనుకకు తగ్గితే తప్ప. కానీ ఆయన స్వభావం తెలిసిన వారిలో అటువంటి ఆశాభావం కనిపించటం లేదు.ఢీ అంటే ఢీపరిస్థితి అర్థం అయేందుకు రెండువైపుల నుంచి వినవచ్చిన కొద్ది మాటలను గమనించాలి. ట్రంప్ అన్నది, ‘నేను మితిమీరిన బలప్రయోగానికి నిర్ణయిస్తే తప్ప బహుశా మాకేదీ లభించదు. అపుడు మమ్ములను ఎవరూ ఆపలేరు. అయితే నేనాపని చేయను’. ఇది గ్రీన్‌ల్యాండ్ గురించినది. మరొకవైపు యూరోపియన్ యూని యన్ కమిషనర్ ఉర్సులా వ్యాఖ్యలు ఇవి: ‘గతాన్ని (ఇరువురి సంబంధాలపై) గుర్తు చేసుకున్నంత మాత్రాన గత వ్యవస్థలు,సంబంధాలు తిరిగి రావు. ఈ మార్పే గనుక శాశ్వతమైతే, యూరప్ కూడా శాశ్వతంగా మారాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కుని ఒక కొత్తదైన యూరప్‌ను శాశ్వతంగా నిర్మించుకోవాలి’. ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన గీతా గోపీనాథ్, ‘అమెరికా, యూరప్‌ల మధ్య విశ్వాసమన్నది పూర్తిగా భంగపడి పోయింది. ఇపుడు యూరప్ ఆర్థికంగా, అంతర్గత భద్రత రీత్యా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కోసం ఆలోచిస్తున్న’దని అన్నారు.ఈ కొత్త పరిస్థితికి బాగా అద్దం పట్టింది కెనడా ప్రధాని మైక్ కార్నీ ఉత్తేజకర ప్రసంగం. అది అంతే ఆలోచనాస్ఫోరకం కావటంతో వెంటనే దావోస్‌లోనే గాక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్‌కు అదే స్థాయిలో ఆగ్రహాన్ని తెప్పించింది. దానిపై ఆయన వ్యాఖ్యను హైదరాబాద్ పరిభాషలో చెప్పాలంటే, ‘యాద్ రఖ్లో బేటా, దేఖ్ లూంగా’ అవుతుంది. అట్లా అని ఊరుకోలేదు. అమెరికా లేనిదే కెనడా అసలు బతకలేదన్నారు. దానిని కార్నీ తిప్పి కొట్టడమేగాక, పది రోజుల క్రితం చైనా వెళ్లి భారీ ఒప్పందాలు చేసుకున్నారు. పైగా చైనా నమ్మదగ్గ భాగస్వామి అనీ, అమెరికా కాదనీ ప్రకటించటాన్ని ట్రంప్ గుర్తు చేసుకుంటూ... ఆ ఒప్పందాలు చేసుకున్నందుకు కెనడాపై వందశాతం సుంకాలు విధించగలనని ప్రకటించారు. వాస్తవానికి కార్నీ ప్రసంగం పూర్తి పాఠంగా పత్రిక లలో రాదగ్గది. మొత్తంమీద ఈసారి దావోస్ సమావేశాల ప్రభావం దీర్ఘకాలం ఉండనున్నది.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కమ్యూనిస్టు కూటమికి ఎదురుగాలి
కమ్యూనిస్టు సంకీర్ణ సర్కారుకు కేరళలో కష్టాలు మొదలయ్యాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారిది నల్లేరు మీద బండి నడక కాదని ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ఇప్పుడు వీస్తున్న గాలి సంకేతాలిస్తోంది. దళిత రిజర్వు నియోజక వర్గాల్లో ఓటర్లంతా దళితులే ఉండరు. కానీ, గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో లభించిన మద్దతు అటువంటిది. అసెంబ్లీకి మరో మూడు నెలల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇదీ పరిస్థితి. మరోవైపు ఎన్డీయే కూటమి ఉనికి పెంచుకుంటుంటే, కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రత్యర్థి కూటమి ‘యూడీఎఫ్’ బలపడుతోంది. దేశంలోనే ఏకైక కమ్యూనిస్టు ప్రభు త్వాన్ని కేరళలో నడుపుతున్న వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్డీఎఫ్) పదేళ్ల పాలన తర్వాత ఎదురీదుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు సైద్ధాంతిక మందగింపు, కులాల కుమ్ములాటలు కూటమిని బల హీనపరుస్తున్నాయి. ముఖ్యంగా రిజర్వుడు స్థానాల్లో వివిధ ప్రభా వాల వల్ల ఎల్డీఎఫ్ బలహీనపడ్డ తీరు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో పతనం తర్వాత దేశంలో మిగిలిన ఏకైక కమ్యూనిస్టు (కూటమి) ప్రభుత్వం ఇక్కడుంది. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో గెలుపు వరించాలంటే 71 స్థానాల మేజిక్ ఫిగర్ చేరుకోవాలి. 16 రిజర్వుడ్ (పద్నాలుగు ఎస్సీ, రెండు ఎస్టీ) స్థానాలపై పట్టు కీలకం! 2011, 2016, 2021 మూడుఅసెంబ్లీ ఎన్నికల్లోనూ 14లో 12 ఎస్సీ స్థానాల్లో ఎల్డీఎఫ్ విజయ పరంపర కొనసాగించింది. ఇతర స్థానాల్లోనూ ఎల్డీఎఫ్ దళితుల మద్దతు అపారంగా పొందుతూ వచ్చింది. కార్మికోద్యమాలు, బడు గుల సంక్షేమం, పింఛన్లు, రిజర్వేషన్లు వంటి అంశాల్లో కమ్యూని స్టుల సహజ సైద్ధాంతిక బలం, వ్యవస్థీకృత నిర్వహణ వంటివి దళితుల మద్దతు కూడగట్టడంలో కూటమికి కలిసి వచ్చిన అంశాలు. కానీ, ఇప్పుడా మద్దతు సన్నగిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో... ఎన్నిక లకు సంబంధించి కేరళలో ‘పీపుల్స్ పల్స్’ సర్వే ప్రారంభించింది. వేగంగా మార్పులుకేరళ అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో మూడు ముఖ్య కూట ముల గెలుపోటములను ప్రధానంగా మూడంశాలు ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కమ్యూనిస్టు మూస విధానాలను వ్యతిరేకిస్తూ ఆశావహంగా పెరిగిన నగర–పట్టణ ఓటర్ ఆకాంక్షలు; కులాల కుంపట్లతో, విభిన్న సామాజిక వాదాలతో వచ్చిన చీలికల్లో ‘ఎల్డీఎఫ్ ఓటు బ్యాంకులు’ బలహీనపడటం; కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ బీజేపీ, తిరిగి పుంజుకుంటూ, యూడీఎఫ్ కిందటిఅసెంబ్లీ ఎన్నికల నుంచి బలపడుతూ రావటం... ఈ మూడంశాలు ‘ఓటు రాజకీయాల్ని’ ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడక్కడ బీజేపీ ఎదుగుదల నేరుగా సొంతానికైనా లాభించ వచ్చు, లేదా ఓటు బ్యాంకు చీలికల వల్ల పరోక్షంగా యూడీఎఫ్‌కైనా మేలు చేయ వచ్చన్న వాదన వినిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో తిరువ నంతపురం కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకోవడం, అంతకు ముందరి అసెంబ్లీ ఎన్నికల (2021) ఫలితాలకు భిన్నంగా పలుచోట్ల యూడీఎఫ్ కొత్తగా బలపడటం ఇందుకు నిదర్శనం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే వాతావరణం కొనసాగితే.... నికరంగా నష్ట పోయేది ఎల్డీఎఫ్ అనడంలో సందేహమే లేదు. గతంతో పోల్చి చూస్తే దేశవ్యాప్త రాజకీయ పరిణామాల ప్రభావం కేరళ రాజకీయాలపైన ఇప్పుడు అధికంగా కనిపిస్తోంది. వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గెలిచి రాజీనామా చేయడం, ఫలితంగా జరిగిన ఉప ఎన్నికలో ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ గెలవడం ఓ పెద్ద పరిణామమే! పార్టీ మరో ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నాయ కుడు కె.సి. వేణుగోపాల్‌కు ఏఐసీసీలో ప్రాధాన్యం పెరగటంవంటివి కేరళ రాజకీయాల్ని నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో బీజేపీ ఒక లోక్‌సభ స్థానాన్ని గెలవటం, మరుసటి యేడు (2025) జరిగిన స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడం బీజేపీకి కలిసివచ్చిన అంశాలే! లోక్‌సభ ఎన్ని కల్లో 11 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ఆధిక్యత లభించగా అందులో 2 ఎస్సీ రిజర్వుడు స్థానాలున్నాయి. పరిమిత వర్గాల్లోనే అయినా దళి తుల్లో బీజేపీ బలపడటం సీపీఎంకు ఆందోళన కలిగిస్తున్న అంశం. చీలిక విసిరిన సవాల్ దళిత ఉప కులాల్లో వచ్చిన చీలికలు అటు యూడీఎఫ్‌కు, ఇటు ఎన్డీయేకు ఎంతో కొంత మేలు చేస్తున్నాయి. ఫలితంగా రిజర్వుడు స్థానాల్లో రాజకీయ వాతావరణం వేగంగా మారుతోంది. మొత్తం కేరళలో ఎస్సీల జనాభా 9 శాతం. దళితుల్లో ప్రధానంగా ఉన్న పులియలకు తోడు పరయ, కురవ, కనక్కన్, తండన్ వంటి ఉప కులాలున్నాయి. రెండు ఎస్టీ రిజర్వు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తూ వస్తున్నా, 14 ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో 12 చోట్ల ఎల్డీఎఫ్ వరుస ఎన్నికల్లో గెలుస్తూ వస్తోంది. మిగిలిన రెండు స్థానాల్లో ఒకటికాంగ్రెస్ చేతిలో ఉంటే మరొక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. రాబోయే ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో యూడీఎఫ్ ఆధిక్యత 3–6 స్థానాలకు పెరిగితే, ఎల్డీఎఫ్ పట్టు 10–7 స్థానాలకు పరిమితం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. దళితుల్లో అధిక సంఖ్యాకులైన పులియ సామాజికవర్గం పైన కమ్యూనిస్టులకు గట్టి పట్టుంది. ఎస్సీల్లోని ఇతర ఉపకులాలు సహజంగానే దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం సాను కూలంగా నిర్ణయం తీసుకున్న ఎస్సీ వర్గీకరణ అంశం కూడా ఎస్సీల్లో కుల వివాదాలకు, వైషమ్యాలకు, తద్వారా చీలికకు హేతువవుతోంది. అది కూడా పరోక్షంగా కమ్యూనిస్టులు దళితుల్లో పట్టు కోల్పోవడానికి కారణంగా నిలుస్తోంది. పార్టీ సైద్ధాంతికంగా మంద గిల్లడం, ఇతరేతర కారణాల వల్ల పులియ వర్గంలోనూ కమ్యూని స్టులకు కొంత పట్టు సడలింది. కురవ సామాజికవర్గ మద్దతు పరంగా ఎల్డీఎఫ్కు గట్టి పట్టున్న దక్షిణాది జిల్లాలు కొల్లం, పత్తనంతిట్టలలోనూ కులాల్లో వచ్చిన చీలిక వారిని బలహీనపరిచింది.ప్రజానాడి సంకేతాలే కీలకంప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ స్థానిక స్వపరిపాలనను పటిష్ఠపరచుకున్న కేరళలో గత స్థానిక ఎన్నికలు జనం మనోగతాన్ని కొంతమేర వెల్లడి చేశాయి. అలా చూస్తే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పునకు భిన్నమైన ఫలితాలు 2025 స్థానిక ఎన్నికల్లో వచ్చాయి. అవి యూడీఎఫ్, ఎన్డీయేకు కొంత ఆశావహంగానే ఉన్నాయి. వరుస రాజకీయ పరిణామాల్లో వచ్చిన మార్పు, దళిత ఉప కులాల్లో వచ్చిన చీలిక పాలక ఎల్డీఎఫ్ వ్యతిరేక వాతావరణాన్నే స్పష్టం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకున్న దాదాపు మూడు మాసాల వ్యవధిలో పరిస్థి తులు ఇంకా ఎలా మారనున్నాయో వేచి చూడాల్సిందే!-వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్ -దిలీప్ రెడ్డి -
అధికారం లేని ఆర్థిక రాజధాని
ముంబై మునిసిపల్ ఎన్నికలను నాలుగేళ్ళు ఆలస్యంగా నిర్వహించారు. రాజ్యాంగ ఉల్లంఘనతో సమానమైన ఈ జాప్యం భారతీయ ప్రజాస్వామ్యం గురించి చెప్పకనే చెబుతోంది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేకుండా, పర్యవసానాలపై ధ్యాస లేకుండా భారతదేశపు సంపన్న మునిసిపాలిటీ పాలనను సస్పెన్షన్‌లో ఉంచారు. అయితే, మూడవ అంచెలోని రాజ్యాంగపరమైన స్వయం– పాలనా ప్రభుత్వం ఐచ్ఛికమైనది కాదని మనం గుర్తుంచుకోవాలి. మొత్తం 227 మంది సభ్యుల బృహన్ ముంబై పాలక సంస్థ (బీఎంసీ)లో బీజేపీ 2017 నాటి (82) స్థితిని మెరుగుపరచుకుని ఈసారి 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేనలో చీలిక దానికి బాగా ఉపయోగపడింది. మహారాష్ట్రలో ఎన్నికలు జరి గిన ఇతర పురపాలక, నగర పాలక సంస్థల ఎన్నికల్లో కూడా కమలమే ఎక్కువచోట్ల వికసించింది. కానీ, ముంబై ఫలితం కనీసం ఒక చక్కని రాజకీయ భాష్యా నికైనా అనువైనదిగా లేదు. ఎందుకంటే, ముంబై మామూలు నగరం కాదు. అదొక నగర రాజ్యం. దాని బడ్జెట్ ముందు దేశంలోని చాలా రాష్ట్రాల బడ్జెట్లు కూడా తక్కువే. అది భారతదేశపు ఆర్థిక రాజధాని. బాలీవుడ్‌కు నెలవు. కార్మికులు పెద్ద సంఖ్యలో వచ్చి వాలే పెద్ద చెట్టు. సృజనాత్మక కళాకారుల ఆట మైదానం. ఆ విధంగా అది సాంస్కృతిక చోదక శక్తి. దాని బహుళత్వం, విస్తృత దృక్పథ స్వభావం దాని సంపదకు ఏమీ తీసిపోనంత విలువైనవి. బాధ్యత లేని సంస్థలుఅయినా ఎందుకో నామమాత్రపు జవాబుదారీతనమనే జబ్బుతో, ఈ మహా నగరం బాధపడుతోంది. దాని పాలనా విభా గాలు సాలెగూడును తలపిస్తాయి. బీఎంసీ (పౌర సంస్థ), ఎంఎంఆర్డీఏ (ప్రాంతీయ ప్రణాళిక), ‘బెస్ట్’ (రవాణా), ఎంహెచ్ఏడీఏ (గృహ నిర్మాణం), ఎస్ఆర్ఏ (మురికివాడల వాసులకు పునరా వాసం), రైల్వేలు... ఇలా చెప్పుకొనేందుకు చాలా ఉన్నాయి. కానీ, ఏ సంస్థా పూర్తి బాధ్యత తీసుకోదు. ఒకదాని పరిధిలోకి ఒకటి చొరబడే వీలుంటుంది. నింద నుంచి తప్పించుకునే మార్గాలను అవి జాగ్రత్తగా రూపొందించుకున్నాయి. ప్రణాళిక– అమలు, రవాణా– భూవినియోగం, హౌసింగ్–కనెక్టివిటీల మధ్య సంబంధం లేదు. నగరం స్తంభిస్తే ఏ సంస్థనూ బాధ్యురాలిగా చేయడానికి లేదు. కనుక బీఎంసీ ఎన్నికలను పర్మిషన్లు, కాంట్రాక్టులు, భారతదేశపు అత్యంత విలువైన పట్టణ జాగ్రఫీని తీర్చిదిద్దగల హక్కుపై పట్టు సంపాదించ డానికి జరిగినవిగా చెప్పుకోవాలి. ముంబైలో వైచిత్రి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అది అసాధా రణమైన సంపదను సృష్టిస్తోంది. అయినా, దాని పౌరులు దుర్బలురు. రియల్ ఎస్టేట్ బంగారం అంత విలువైనది. అయినా, పట్టణ జనాభాలో చెప్పుకోతగినంత మంది మురికి వాడల్లో నివసిస్తున్నారు. దేశం మొత్తంమీద లెక్కకు వచ్చే కుబేరుల్లో కొంతమంది ఇళ్ళు అక్కడే ఉన్నాయి. సాధారణ పౌర జీవనం బీటలువారిన ఫుట్‌పాత్‌లు, క్రిక్కిరిసిన రైళ్ళ గుండా సాగిపోతుంది. వర్షా కాలం వచ్చిందంటే, ఇంట్లోకి వరద నీరు రాదనే గ్యారంటీ లేదు. ముంబైని అంతర్జాతీయ ఫైనాన్సియల్ కేంద్రం (ఐఎఫ్‌సీ)గా తీర్చిదిద్దుతామని 2006లో అప్పటి ప్రధాని వాగ్దానం చేశారు. సింగపూర్, దుబాయ్, హాంగ్‌కాంగ్ లేదా లండన్లతో పోటీ పడగలిగిన నగరం ఏదైనా ఉందీ అంటే అది ముంబయ్యే! ప్రణాళి కలు రచించారు. కమిటీలు వేశారు. రెండు దశాబ్దాలు గడిచినా, ముంబై అంతర్జాతీయ ఫైనాన్షియల్ సెంటర్ కాలేకపోయింది. అది ఇప్పటికీ భారతదేశపు ఆర్థిక రాజధానిగానే ఉంది. అది దేశం ఇచ్చిన పతకం. అంతర్జాతీయ గమ్యస్థానంగా గౌరవం దక్కనే లేదు.అంతర్జాతీయ ఆర్థిక కేంద్రం?ఐఎఫ్‌సీ కల సాకారం కాకపోవడానికి బ్యాంకర్లు, వ్యవస్థాపక సామర్థ్యం ఉన్నవారు, న్యాయవాదులు లేదా మూలధనం కొరవ డటం కారణం కాదు. అంతర్జాతీయ నగరాలుగా గుర్తింపు పొంద డానికి పొందికతో కూడిన పాలన, ఉత్తమ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు పెద్ద స్థాయిలో ఉండటం అవసరం. అవి కొరవడటం ముంబై వైఫల్యానికి కారణం. ఈ విషయంలో గుజరాత్ లోని ‘గిఫ్ట్’ సిటీ ముందంజ వేయగలిగింది. ముంబైకున్న సాంస్కృతిక లేదా మార్కెట్ పరిపూర్ణత దానికి ఉండబట్టి కాదు. స్నేహ పూర్వక రెగ్యులేషన్, నగదు ప్రోత్సాహకాలు, ఉన్నత స్థాయి నుంచి లభించిన ప్రోద్బలం ఇతోధికంగా తోడ్పడ్డాయి. ముంబైకున్న ఆర్థిక స్వయం ప్రతిపత్తి పరిమితం. అక్కడి ఆస్తి పన్ను రేట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఆకర్షణీ యమైన కోస్టల్ రోడ్ ప్రాజెక్టునకు కేంద్రం నుంచో, ఇతర వనరుల నుంచో నిధులు అందాల్సిందే. మెట్రో నెట్వర్క్ కూడా చాలావరకు బాహ్య వనరులపైనే ఆధారపడింది. నిర్మాణం పూర్తయి, అమ్ముడుకాని ఫ్లాట్లు రెండు లక్షలకు పైగా ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. సబబైన ధరలకు గృహ సదుపాయం, వరద నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ లేదా రోడ్డు మరమ్మతులు వంటివి ఎన్నికల ప్రణాళికల్లో ప్రముఖంగా కనిపించవు. రాయితీలు, ఉచిత బస్సు ప్రయాణాలు మేనిఫెస్టోలలో కనిపించాయి కానీ, వాటికి నిధులు ఎక్కడ నుంచి తెస్తారో పేర్కొన లేదు. ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండే పాలనా వ్యవస్థ పురపాలక సంస్థే. కానీ, వాటి రాజకీయాలు కూడా రాష్ట్ర రాజకీ యాల్లా తయారయ్యాయి. స్వయం పాలన సాగినప్పుడే...ట్రిపుల్ (కేంద్ర, రాష్ట్ర, స్థానిక) ఇంజిన్ నినాదం 2017లో మాదిరిగానే మళ్ళీ పనిచేసింది. చీలికలు పీలికల రాజకీయ పర్వంలో ఓటర్లు సుస్థిరతనే ఎంచుకున్నట్లు సంకేతమిచ్చారు. కాస్మోపాలిట నిజంకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. ‘మరాఠీ అస్మిత’కు ముప్పు వాటిల్లుతోందంటూ చూపించబోయిన బూచి పనిచేయలేదు. ముంబై ప్రధాన సమస్య దాన్ని ఎవరు పాలిస్తున్నారు అన్నది ఒక్కటే కాదు. నికరంగా నగర–ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటన్నది! భారత పబ్లిక్ ఫైనాన్స్, గవర్నెన్సు... రెండూ కూడా నగరాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అనుబంధంగానే చూస్తున్నాయి తప్ప, వాటిని స్వయం ప్రతిపత్తి అవసరమైన ఆర్థిక ఇంజిన్లుగా చూడటం లేదు. వాటికి సామర్థ్యాన్ని సమకూర్చుకునే శక్తినిచ్చి, దీర్ఘకాలిక విస్తృత ప్రణాళికలో భాగం చేయడం లేదు. పట్టణాభివృద్ధి శాఖను ముఖ్యమంత్రే అట్టేపెట్టుకోవడం ఊహించదగిన అంశం అవుతోంది. అది బంగారు బాతు లాంటి శాఖ. అంతర్జాతీయ నగరంగా మారాలని ముంబై నిజంగా భావించే పక్షంలో, దానిలో సంస్థాగతమైన మార్పులు అవసరం. నగరంలో పరిస్థితులకు ఒకే సంస్థ బాధ్యత వహించేటట్లు చేయాలి. వివిధ ఏజెన్సీలను ఒక కోవలోకి తేవాలి. కోశ సంబంధ స్వయం ప్రతిపత్తి ఉండాలి. నియమ నిబంధనల ననుసరించి పర్మిషన్లు తప్పక లభిస్తాయనే నమ్మకం కలగాలి. ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో బతికే గుమాస్తాలా మునిసిపాలిటీ పరిణమించకూడదు.అజీత్ రానాడేవ్యాసకర్త ప్రముఖ ఆర్థికవేత్త -
అందరినీ కలుపుకొంటేనే అభివృద్ధి
సమాజంలో అణగారిన వర్గాల ప్రజలను సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగస్వాములను చేయడం ద్వారా సమానత్వంతో కూడిన అభివృద్ధిని సాధించడమే సామాజిక సమ్మిళితత్వం. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుక బడిన తరగతుల వారికి రిజర్వేషన్లు, పేదరిక నిర్మూలనపై దృష్టి సారించడం, భూసంస్కరణల అమలు; 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పట్టణ స్థానిక సంస్థలను పటిష్ఠపరచటం వంటి చర్యలు సామాజిక సమ్మిళితత్వం సాధించటంలో పూర్తిగా విజయవంతం కాలేకపోయాయి. అనేక ప్రాంతాలలో ఇప్పటికీ కుల ఆధారిత వివక్ష, అవస్థాపనా సౌకర్యాల అందుబాటులో వ్యత్యాసాలు, అసంఘటిత రంగంలో ఉపాధి అధికంగా ఉండటం లాంటి అంశాలు సామాజిక సమ్మిళితత్వానికి అవరోధంగా నిలుస్తున్నాయి. వివిధ రాష్ట్రాల చర్యలుకుల, మత, రాజకీయ వివక్షకు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో 2019–24 మధ్య అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక రంగాలలో సంస్కరణలను ప్రవేశ పెట్టింది. సామాజిక ఇంజి నీరింగ్‌లో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యంతోపాటు కౌన్సిల్, స్థానిక సంస్థలలో నామినేషన్ కోటాలో ప్రాధాన్యమిచ్చింది. దేశ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా విప్లవాత్మకమైన చర్యలను విద్య, ఆరోగ్య రంగాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబించింది. తెలంగాణలో దళిత బంధు, ఆసరా పెన్షన్లు, గొర్రెల పంపిణీ, శిశు ఆరోగ్య సంరక్షణతో పాటు ఇటీవలి ప్రభుత్వం మహిళలు, మైనారిటీలు, ఇతర అణగారిన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఆరు గ్యారెంటీలతో అనేక ప్రోత్సాహ కాలను ప్రకటించింది.తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 5వ తరగతి వరకు విద్యనభ్యసించే వారిలో పౌష్టికాహారం పెంపు, డ్రాపవుట్ రేట్ తగ్గింపు లక్ష్యంగా ఆర్థికంగా వెనుకబడిన, గిరిజన ప్రాంతాలలో ముఖ్యమంత్రి ఉదయం అల్పాహార పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నభ్యసించే 6 నుండి 12వ తరగతి బాలికలకు నెలవారీ రూ. 1,000 ఆర్థిక సహాయం వంటి చర్యలను చేపట్టింది. వృద్ధులు, వితంతు వులు, అంగవైకల్యం కలిగినవారు, పేద ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంగా కేరళ ప్రభుత్వం ప్రారంభించిన సామా జిక భద్రతా మిషన్ సత్ఫలితాలనిచ్చింది. భూమి హక్కు, విద్య అందుబాటుకు కేరళ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది.ఢిల్లీ ప్రభుత్వం అల్పాదాయ, అణగారిన వర్గాల ప్రజలకు ఒక పరిమితి వరకు ఉచిత విద్యుత్, నీరు అందించడం; ప్రైవేట్ ఆసు పత్రులలో ఉచిత ట్రీట్మెంట్ కోసం ప్రజల ఆదాయ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచడం, వికలాంగులకు పెన్షన్ లాంటి చర్యలు చేపట్టింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మూడు కోట్ల మంది స్వయం సహాయక బృందాల సభ్యులతో ఆర్థిక సాధికారత పెంపు, ఎస్టీ, ఎస్సీ యువతలో ఎంట్రప్రెన్యూర్షిప్ పెంపు లాంటి చర్యలు చేపట్టింది.గుజరాత్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల బాలికల్లో పాఠశాల నమోదు నిష్పత్తి పెంచడానికి చర్యలతోపాటు, మల్టీపర్పస్ మహిళా సంక్షేమ కేంద్రాలను ప్రారంభించింది. బిహార్ ప్రభుత్వం మహిళల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ప్రతి మహిళ అకౌంట్లో రూ. 10,000 జమ చేయడం, సామాజిక భద్రతా పెన్షన్లను అందిస్తున్నది.ఆచరణలో విఫలంవివిధ కార్యక్రమాల ప్రభావం వలన విద్యావకాశాలు మెరుగ యినప్పటికీ, ఉన్నత విద్యలో ఇప్పటికీ లక్షిత వర్గాల ప్రజల నమోదు తక్కువగా ఉండటం, సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం, ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు అల్పా దాయ వర్గాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ వాటి ప్రభావం వివిధ ప్రాంతాల మధ్య వేరుగా ఉండటం స్పష్టమవుతున్నది.భూసంస్కరణలు ఆచరణలో విఫలమయ్యాయి. లబ్ధిదారులకు పంపిణీ చేసిన భూమి ఆర్థిక కమతంగా లేకపోవడం వలన ఆయా వర్గాల ప్రజల జీవన ప్రమాణంలో మార్పు సంభవించలేదు. మార్చి 2003 నాటికి 56.73 లక్షల లబ్ధిదారులకు 52.93 లక్షల ఎకరాల భూమిని పునఃపంపిణీ చేయడం జరిగింది. మొత్తం లబ్ధిదారులలో ఎస్టీల వాటా 15 శాతం కాగా, ఎస్సీల వాటా 36 శాతం. దేశంలోని మొత్తం వ్యవసాయ భూమిలో 2 శాతం మాత్రమే భూసంస్కరణలలో భాగంగా పంపిణీ చేయడం జరిగింది.ఆర్థిక సర్వే 2024–25 ప్రకారం, దేశంలో స్వయం ఉపాధిలో నిమగ్నమయిన వారి నెలవారీ ఆదాయం రూ. 13,279గా నమోదు కావడాన్ని బట్టి వివిధ వర్గాల ప్రజల మధ్య ఆదాయపరమైన అసమానతలు స్పష్టమవుతున్నాయి. లాక్డౌన్ తర్వాతి కాలంలో గ్రామీణ వ్యవసాయేతర వేతన రేటులో ఏ విధమైన పెరుగుదల లేకపోగా వ్యవసాయ వేతనాలలో 2 శాతం మాత్రమే పెరుగుదల ఏర్పడింది. దళితులు, ఆదివాసీలలో ఆయుఃప్రమాణం ఉన్నత వర్గాలతో పోల్చినప్పుడు 3 నుండి 5 సంవత్సరాలు తక్కువ.ప్రపంచ అసమానత నివేదిక 2026 ప్రకారం జాతీయాదాయంలో 58 శాతం సంపన్నులైన మొదటి 10 శాతం ప్రజలలో కేంద్రీకృతం కాగా, చివరి 50 శాతం ప్రజల వాటా 15 శాతం మాత్రమే. మొదటి 1 శాతం ప్రజల వాటా మొత్తం సంపదలో 40 శాతం. ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 28.4 శాతం కాగా, ఎస్సీ వర్గాల వారిలో ఇది 23 శాతం, ఎస్టీ వర్గాల వారిలో కేవలం 17.2 శాతం. శిశు మరణాల రేటు సగటు ప్రతి వెయ్యి జననాలకు 29.2 కాగా, ఎస్సీలలో 39.6గా ఉంది. అయిదు సంవత్సరాల లోపు మరణాల రేటు సగటు ప్రతి వెయ్యి జననాలకు 33.2 కాగా, ఎస్సీలలో ఇది 45.9. విధానాలు ఎలా ఉండాలి?అయితే, సుస్థిర ఆర్థిక విధానాలకు పూర్తిగా తిలోదకాలిచ్చి అధికంగా సంక్షేమంపై దృష్టి సారిస్తే మాత్రం పనిచేసే వయస్సుగల జనాభాను నిరుత్సాహపరుస్తుంది. పటిష్ఠమైన ఉత్పాదకతతో కూడిన శ్రామిక శక్తి, మార్కెట్ అవకాశాల పెంపు, సామాజిక స్థిరత్వాన్ని పెంపొందించే విధానాలు ఆర్థిక వృద్ధి వేగవంతం కావడానికి దోహద పడతాయి. సంక్షేమం లక్ష్యంగా అవలంబించే సమ్మిళిత సాధన విధా నాలను ఆర్థికాభివృద్ధి, నాణ్యమైన సేవలు, సామాజిక మార్పుతో అనుసంధానపరచాలి. సుస్థిరతకు మద్దతు నిచ్చే పటిష్ఠమైన ఆర్థిక వృద్ధి జరగనప్పుడు, సంక్షేమం మాత్రమే నాణ్యతతో కూడిన ఉపాధి, మార్కెట్ అందుబాటుకు దారి తీయదు. వ్యక్తుల సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి లింగ సంబంధిత; జాతులు, అంగ వైకల్యం కల్గినవారి మధ్య అసమానతలు తొలగించే ఆర్థిక విధానాలు అవసరం. పురోగామి పన్ను విధానం, కనీస వేతనాల చట్టాలు, సామాజిక భద్రతా పథకాలు అల్పాదాయ వర్గాల వ్యయార్హ ఆదాయ పెరుగుదలకు దారి తీసి స్వదేశీ వినియోగ మార్కెట్‌ను విస్తృత పరచగలవు. తద్వారా సమష్టి డిమాండ్ పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. వ్యాపార అభివృద్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా చిన్న వ్యాపారాలు వృద్ధి చెంది నూతన వ్యవస్థాపకులు పెరుగుతారు. సమీకృత పట్టణ ప్రణాళిక, సమ్మిళిత ఫైనాన్స్ సేవలు, శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన విధానాలు అవసరం.డా‘‘ తమ్మా కోటిరెడ్డివ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్ఛార్జ్),ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
'క్విక్' డెలివరీలో భద్రత ఎంత?
సుమారు రెండేళ్ళ క్రితం నాటి ఘటన. డెలివరీ బాయ్ ఇంటి తలుపు తట్టాడు. వస్తువును అందుకునేందుకు తలుపు తెరవగానే ఆతని చీలమండపై లోతైన గాయం కనిపించింది. చిరిగిన ప్యాంటు అతని యాక్సిడెంట్ గురించి చెప్పకనే చెబుతోంది. నొప్పిని ఓర్చుకుంటూనే చెప్పిన సమయానికే వస్తువును అందజేశాడు. నేను ఊహించినట్లుగానే, అతని స్కూటర్‌ను ఏదో కారు ఢీకొట్టిందని తెలి సింది. కిందపడి గాయపడ్డాడు. అదృష్టవశాత్తు, స్కూటర్‌కు ఏమీ కాలేదని అతను ఊరట చెందడం నన్నింకా బాధించింది. అది అతనికి దినసరి అద్దెపై ఇచ్చింది కనుక, దానికి ఏమైనా అయితే, అతని అరకొర ఆదాయానికి మరింత చిల్లుపడుతుంది. నైతిక బాధ్యతగా భావించి ఒకటి రెండు బ్యాండ్–ఎయిడ్లు, ఒక 200 రూపాయల నోటు అతని చేతిలో పెట్టాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొమ్మని ఒక సలహా కూడా ఇచ్చాను. కానీ అతను ఆ నోటును జేబులో కుక్కుకుని, మళ్ళీ పనిలో పడతాడనే అనిపించింది. అతనికి గాయానికి ఏదో మందు పూయించుకోవ డమో లేదా కట్టు కట్టించుకోవడమో చేసేంత వ్యవధి కూడా లేదు. ఇతని తప్పిదం వల్లనే ఆ యాక్సిడెంట్ అయివుంటుందని కూడా నా అనుమానం. డెలివరీ బాయ్‌లు తాము తీసుకెళుతున్నవాటిని వీలై నంత త్వరగా అందించాలన్న తొందరలో ట్రాఫిక్ సిగ్నల్స్ పట్టించు కోకపోవడం, రాంగ్ సైడులో వెళ్ళిపోవడం నేను అంతకుముందు గమనించక పోలేదు. ట్రాఫిక్ ఉల్లంఘనలుఅంత హడావిడి పడవలసిన అవసరం లేదని వారికి పని ఇస్తున్న క్విక్–సర్వీస్ కంపెనీలు వాదిస్తాయి. ఆ రంగం పరిభాషలో వారు ‘భాగస్వాముల’ కింద కూడా లెక్క. తాము వారికి సరుకును అందించే ‘గుప్త’ ప్రదేశాలు, గమ్యస్థానాలకు తక్కువ సమయంలో వెళ్ళదగినవిగానే ఉంటాయని అవి చెబుతాయి. సిద్ధాంతం ప్రకారం డెలివరీ బాయ్ నడచుకుంటూ వెళ్ళి కూడా ఇచ్చి రావచ్చు. వారు గంటకు సగటున 15 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళుతున్న మాట కూడా నిజం. అయినా, వారు ట్రాఫిక్ రూల్స్‌ను ఎప్పటి కప్పుడు ఎందుకు అతిక్రమిస్తున్నట్లు? ఒక్క బెంగళూరు నగరంలోనే, 2025లో వీరు దాదాపు 64,000 ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలింది. ఇది నవంబర్ 15 నాటి వరకు అందు బాటులో కొచ్చిన డేటా మాత్రమే. మరి, డెలివరీ బాయ్‌లు ఎందుకంత పరుగులు తీస్తున్నట్లు? ఈ ప్రశ్నకు జవాబు క్విక్–సర్వీస్ రంగ లాభ నష్టాల లెక్కల్లో ఉంది. బాయ్‌లు గంటకు సగటున రూ. 102 సంపాదిస్తారని కామర్సు కంపెనీలు పేర్కొంటున్నాయి. అవి తమకయ్యే ఖర్చును లెక్కలోకి తీసుకోవడం లేదని యూనియన్లు చెబుతున్నాయి. పెట్రోల్, మెయింటెనెన్స్ ఖర్చులు పోగా, మహా అయితే, గంటకు రూ. 81 చొప్పున లభిస్తుందని అవి అంటున్నాయి. నెలకు 26 రోజులు ఎవరన్నా రోజుకు 10 గంటలు పనిచేస్తే వచ్చేది రూ. 21,000. నెలకి ఆ పాటి సంపాదించాలన్నా ఆ 10 గంటల లోపల డెలివరీ వర్కర్ 30–35 ట్రిప్పులు వేయాలి. ఒక డెలివరీ పూర్తి చేసి, దాన్ని యాప్‌లో మార్క్ చేసిన తర్వాతనే, అతనికి మరో ట్రిప్పునకు అవకాశం లభిస్తుంది. వారికి వెంట వెంటనే డెలివరీ అవకాశాలు రావు. కొంత సమయం వేచి ఉండక తప్పదు. అందుకని వేగంగా చేరవేస్తే మరో అసైన్మెంట్ లభిస్తుందని తాపత్రయపడతారు. సరుకును అందివ్వడంలో మందకొడిగా వ్యవహరిస్తే వర్కర్లు పరోక్షంగా శిక్షకు గురవుతారని యూనియన్లు వెల్లడిస్తున్నాయి. అంతకుముందు వెన్ను తట్టి ఇచ్చిన ‘బ్యాడ్జీ’లను కంపెనీలు వెనక్కి తీసేసుకుంటాయి. ఆ మేరకు డెలివరీ అవకాశాలు తగ్గిపోతాయి. ఇంతమందికి చేర్చగలిగితే అంటూ లక్ష్యాలు నిర్దేశించి, వాటిని పూర్తి చేసినవారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ఇది వారు బండ్లు నడపడంలో వ్యక్తిగత భద్రతను గాలికొదిలేసేటట్లు చేస్తోంది. శ్రమ–ఒత్తిడిఅయినా, వేలాది మంది ఈ ఉద్యోగానికి ఎందుకు తరలి వస్తున్నట్లు? ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు లేకపోబట్టే అని దానికి జవాబు చెప్పుకోవచ్చు. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు ఉద్యోగాలు రెండూ అంతగా లేకపోవడంతో, వారికి ఇంతకన్నా గత్యంతరం కనిపించడం లేదు. దేశంలో గిగ్ వర్కర్లలో దాదాపు మూడొంతుల మంది 24–38 ఏళ్ళ మధ్య వయసు వర్గం వారని వివిధ సర్వేలలో తేలింది. వారిలో చాలా మంది మిడిల్ లేదా హైస్కూలు విద్యతో ఆపేసినవారని మరికొన్ని సర్వేల్లో వెల్లడైంది. దీన్ని బట్టి వారు ఏదైనా మంచి ఉద్యోగం లభిస్తుందేమోనని కొంత కాలం ఎదురు చూసి, ఆ తర్వాత, క్విక్–కామర్స్ డెలివరీలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారని స్పష్టమవుతోంది. కానీ ఈ ఉద్యోగాల్లో చేరుతున్నవారిలో చాలామంది శ్రమ, ఒత్తిడి తట్టుకోలేక మూడు నెలల లోపలే వీడ్కోలు పలుకుతున్నారు. సత్వర సేవ సంస్థల మధ్య ముఖ్యంగా బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టోల మధ్య పోటీ పెరిగింది. వేటికవి వ్యాపార విస్తరణకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫలితంగా, చేతులూ కాల్చుకుంటు న్నాయి. ఉదాహరణకు, కడచిన నాలుగు త్రైమాసికాలలో బ్లింకిట్‌కు వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచన వంటివాటికి ముందు ఆదాయాన్ని సర్దుబాటు చేసి చూసినా కూడా దాదాపు రూ. 600 కోట్ల నష్టం వచ్చినట్లు చెబుతున్నారు. ఉద్యోగుల స్టాక్ యాజమాన్య ప్రణాళికను మినహాయించగా తేలిన లెక్క అది.అంటే, అసలు నష్టం అంతకన్నా ఇంకా ఎక్కువే ఉండవచ్చు. బ్లింకిట్ తమ వేదిక, డెలివరీ రుసుము కింద కొద్ది మొత్తాన్ని వసూలు చేస్తోంది. స్విగ్గీ ఒక నిర్దిష్ట మొత్తానికి మించిన విలువైన ఆర్డర్లకు ఏ రకమైన చార్జీలూ వసూలు చేయడం లేదు. దీంతో క్విక్–కామర్స్ రంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వ్యయాలు మరీ పెరగకుండా చూసుకుంటూనే, సేవలను మరిన్ని విభాగాలకు పెంచి, మరింత మంది కస్టమర్లను కూడగట్టుకోవాలి. ఇంకా ఎక్కువ రాయితీలు ఆఫర్ చేయాలి. అదే సమయంలో, డెలివరీకి మరింత మంది సిబ్బందిని తీసుకోవాలి. ఇదొక దురవస్థఅయితే, గత కొద్ది నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు ఉపాధి అవకాశాలు (వార్షికంగా లెక్కగట్టి చూసినపుడు) 4.5 శాతం నుంచి 5 శాతం రేటు చొప్పున పెరిగినట్లు ‘సెంటర్ ఫర్ మానిట రింగ్ ఇండియన్ ఎకానమీ’ చెబుతోంది. గత ఏడాది అదే కాలంతో పోల్చి చూసినపుడు ఆ రకమైన మెరుగుదల కనిపించినట్లు అది పేర్కొంది. ‘కోవిడ్’ తర్వాత ఉద్యోగ వృద్ధిలో ఇదే వేగవంతమైన రేటు. దాంతో గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి తిప్పలు పడాల్సిన అవసరం తప్పుతోంది. గ్రామాలకు తిరిగి వెళ్లినా ఫరవాలేదని భరోసా ఏర్పడుతోంది. మరింత నగదు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, సమ్మెకు దిగడానికి గిగ్ వర్కర్లకు అందుకే ధైర్యం వచ్చింది. కానీ, దురదృష్టవశాత్తు, ఇది ఈ రంగంలోని అందరికీ నష్ట దాయకంగానే ఉంది. మూసేయకుండా వ్యాపారం కొనసాగించా లంటే, క్విక్–కామర్స్ సంస్థలు ఇప్పటికన్నా ఎక్కువ ఇవ్వగలిగిన స్థితిలో లేవు. ఇంతోటి ఆదాయానికి అంత ఒత్తిడిని తట్టుకోవడం అవసరమా అని డెలివరీ వర్కర్లు భావిస్తున్నారు. ఇంకో వైచిత్రి ఏమిటంటే, ప్రారంభ స్థాయి వైట్–కాలర్ ఉద్యోగులకన్నా, ప్రస్తుతా నికి డెలివరీ వర్కర్లు గడిస్తున్నదే కాస్త ఎక్కువ. అలాగని ఎంబీఏ డిగ్రీ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు రాలేరు కదా! ఇది సత్వర పరిష్కారం కనుచూపు మేరలో కనిపించని ప్రతిష్టంభన.అనింద్యో చక్రవర్తి వ్యాసకర్త ఆర్థికాంశాల విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అసలు సంక్షోభం అమెరికాదే!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యల వల్ల ప్రపంచం సంక్షోభంలో పడుతున్నదనేది సర్వసాధారణ అభిప్రాయం. స్థూలంగా చూసినపుడు అది సరైన అభిప్రాయమే. కానీ కొంత లోతులకు వెళ్లి పరిశీలించి నట్లయితే, అమెరికాయే సంక్షోభానికి గుర వుతున్నదనీ, ఆ స్థితి నుంచి కాపాడుకు నేందుకే ట్రంప్ ఇటువంటి విపరీత ధోర ణిని అనుసరిస్తున్నారనీ బోధపడుతుంది.వందల సంవత్సరాల పాశ్చాత్య సామ్రాజ్యవాదాన్ని గమనించినప్పుడు, అందులో పలు విధాలైన దుర్మార్గాలు కనిపిస్తాయి. హిట్లర్ వంటి వారు తీవ్రమైన మారణకాండకు కూడా పాల్పడ్డారు. కానీ, ట్రంప్ వంటి ఏ నియమ నిబంధ నలూ లేని సర్వతోముఖ అరాచక విజృంభణ ఏ దశలోనూ లేదు. ‘నాకు అంతర్గతంగా, అంతర్జాతీయంగా ఏ నియమాలూ, చట్టాలూ లేవు. నా మనసుకు తోచింది చేస్తా’నని ఆయన బాహాటంగా ప్రకటిస్తూ, అందుకు తగినట్లే వ్యవహరిస్తున్నట్లు ఇంతవరకు ఏ సామ్రాజ్యవాదీ చేయలేదు.అరాచకానికి కారణాలు?అయితే ఇందుకు మూలకారణం ట్రంప్‌కు గల విలక్షణమైన అరాచక వ్యక్తిత్వం మాత్రమేనా? అమెరికా కొంత కాలంగా ఎదు ర్కొంటున్న రకరకాల తీవ్ర సమస్యలు, ఎదురు దెబ్బలు, ఇతరుల నుంచి సవాళ్ళు తీవ్రమైన ఒత్తిడులను, ఒక కొత్త చారిత్రక దశను సృష్టిస్తున్నట్లు అర్థమవుతుంది. ఆ కారణంగా, ప్రపంచంపై అమె రికా గత పాతికేళ్ళ ఏకధ్రువ ఆధిపత్యం స్పష్టమైన రీతిలో బీటలు వారుతున్నది. పరిణామాలు ఇదే విధంగా కొనసాగితే మరొక 15–20 సంవత్సరాలలో తమ ఆధిపత్యాన్ని పూర్తిగా కోల్పోవటం తథ్యమన్న భావన పాశ్చాత్య ప్రపంచం సహా ప్రపంచమంతటా ఏర్పడింది. వాస్తవానికి ఈ కోణం కొంతకాలంగా అందరూ చర్చిస్తున్నదే తప్ప కొత్తది కాదు. కానీ ఎందుకోగానీ, వెనిజులాపై ప్రళయ భీకరమన్నట్లు జరిగిన సైనిక చర్య, ఆ వెనువెంటనే ట్రంప్ ఇతర ప్రకటనలతో ప్రపంచం దృష్టి ఈ నేపథ్యం నుంచి మళ్ళీ తక్షణ ఘటనలు, తదనంతర ప్రకటనలే సర్వస్వమన్నట్లు మారింది.ఇంతకూ ట్రంప్‌ను ఈ ఆకస్మిక అరాచక ధోరణికి పురికొల్పిన నేపథ్య పరిణామాలేమిటి? 1991లో సోవియట్ యూనియన్ కుప్ప కూలిన తర్వాత అవతరించిన ఏకధ్రువ ప్రపంచానికి, సుమారు 15 సంవత్సరాలు గడిచేసరికి అదే రష్యా దేశం పుతిన్ నాయకత్వాన తిరిగి పుంజుకుంటుండటంతో మొదటి సవాలు మొదలైంది.అందుకే అమెరికా అధ్యక్షులందరూ వరుసగా యూరప్‌తో కలిసి ‘నాటో’ను విస్తరించటం మొదలుపెట్టారు. ఇది జరుగుతుండగా మరొకవైపు చైనా అదే కాలంలో మరొక సవాలుగా ఎదగసాగింది. ఇవి చాలదన్నట్లు అదే సమయంలో (2008) అమెరికాతోపాటు యూరప్ అంతా ఆర్థిక సంక్షోభానికి గురయింది. ఈ పరిణామాలు అక్కడి సమాజాలపై ప్రభావాన్ని చూపటంతో ‘ఆక్యుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమం (2011) వచ్చి ఆ దేశాలను ఊపివేసింది. పుండుపై కారం చల్లినట్లు చైనా, రష్యాల ఆర్థిక వ్యవస్థలు మరింత ఊపందుకో సాగాయి. ఆ పరిస్థితులకు జడిసిన అమెరికా తన సైనిక బడ్జెట్లను ప్రతి సంవత్సరం పెంచసాగింది. ఇదే క్రమం ఇపుడు తాజాగా ట్రంప్, ఆ బడ్జెట్‌ను ఒకేసారి ఏకంగా 50 శాతం పెంచి 1.5 ట్రిలి యన్ డాలర్లకు ప్రతిపాదించే పరిస్థితి వచ్చింది.రక్షణ బడ్జెట్ పైపైకి...21వ శతాబ్దం వచ్చినప్పటి నుంచి అమెరికా పరిస్థితి ఏమిటో సూక్ష్మంగా అర్థం చేసుకునేందుకు బహుశా ఈ వివరణలు సరి పోతాయి. అమెరికా పతన క్రమం గురించి ఎంత తీవ్రమైన ఆందో ళన చెందకపోతే ట్రంప్ రక్షణ బడ్జెట్‌ను ఈ స్థాయికి పెంచజూస్తారు! యథాతథంగానే సుమారు 900 బిలియన్ డాలర్ల మేర గల ఈ బడ్జెట్, అమెరికా తరువాత వరుసలో గల తొమ్మిది దేశాల బడ్జెట్ కన్నా ఎక్కువ. అదిగాక ‘నాటో’ దేశాల బడ్జెట్లు ఉన్నాయి. అవి ఆ మొత్తాలను రెట్టింపు చేయాలని ఇటీవల ఒత్తిడి చేస్తున్నారాయన. ప్రపంచ పరిస్థితులు తమకు వ్యతిరేకమవుతున్నాయనీ, తమ ఆధి పత్యం చేజారుతున్నదనీ, దాని అర్థం వివిధ దేశాల వనరులు, మార్కెట్లు, వాటిపై పరోక్ష రాజకీయ నియంత్రణలు చేజారటమనీ క్రమంగా ఎంతగా భయపడకపోతే ట్రంప్ ఇదంతా చేస్తారో ఆలో చించండి. అది కూడా తమకు ఎటు నుంచీ సైనిక ముప్పు లేనపుడు. ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనే ప్రణాళికలో ఒక సంకేతం వంటిదే వెనిజులాపై దాడి. అందువల్ల నిజమైన దీర్ఘకాలిక సంక్షోభం వెనిజులాది కాదు, ప్రపంచానిది కాదు. అది స్వయంగా అమెరికాది! అందుకు అనుబంధంగా యూరప్‌ది, ‘నాటో’ది, సామ్రాజ్యవాదానిది. ముఖ్యంగా సామ్రాజ్యవాద కూటమికి అధిపతిగా అమెరికాకు ఎదురవుతూ వస్తున్న సవాళ్లు ఇంకా ఉన్నాయి. వాటన్నింటి జమిలి ప్రభావాన్నే మనమిపుడు చూస్తున్నాము. ఇదే కాలంలో ఇటువంటి ఇంకా పలు పరిణామాలు అమెరికాను భయపెట్టాయి. కరోనా (2020–22) సమస్యను అమెరికా ఎదుర్కొనలేక పోవటమే గాక ఆర్థికాభివృద్ధి దెబ్బతినగా, చైనా అందుకు విరుద్ధ ఫలితాలు సాధించటం వాటిలో ఒకటి. ప్రపంచంలో అమెరికా అగ్రస్థానానికి ఆధారాలు... సైనిక బలం, ఆర్థిక బలం, శాస్త్ర–సాంకేతిక బలం, డాలర్ బలం, ప్రపంచ వ్యాప్తంగా గల రాజకీయ ప్రాబల్యం. వీటన్నింటికి చైనా, రష్యాల నుంచే గాక బహుళ ధ్రువ ప్రపంచ నిర్మాణం కోసం పలు రూపాలలో జరుగుతున్న ప్రయత్నాలు క్రమంగా ముందుకు సాగు తున్నాయి. వాటిని నిరోధించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు నెరవేరటం లేదు. ఈ విషయాలు స్వయంగా అమెరికన్, యూరో పియన్ రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు, ఇతర నిపుణులుఅంగీకరిస్తున్నవే!అందుకే ఆక్రమణలుఅమెరికాతోపాటు పాశ్చాత్య సామ్రాజ్యవాద సంక్షోభమంటున్నది ఈ స్థితినే! దీనిని తట్టుకునేందుకు ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలోనే ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) నినాదంతో ఆరంభించి, పదవిని స్వీకరించిన తర్వాత గత ఏడాది కాలంలో కాలుగాలిన పిల్లి తరహా చర్యలు అనేకం ఇంటా బయటా, చివరకు మిత్ర దేశాలపైనా తీసుకుంటూ వస్తున్నారు. ఆ ఫలితాలతో సంతృప్తి లేక, కనీసం పశ్చి మార్ధ గోళాన్ని, పశ్చిమాసియాను అయినా పూర్తిగా నియంత్రిం చేందుకు గత నవంబర్‌లో ‘జాతీయ భద్రతా వ్యూహపత్రం’ ఒకటి ప్రకటించారు. ‘మన్రో డాక్ట్రిన్’కు తోడు ‘డోన్రో డాక్ట్రిన్’ అంటూ లాటిన్ అమెరికాతో పాటు ఈ ప్రాంతాల వనరులన్నీ చేజిక్కించు కునేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రీన్‌ల్యాండ్, పనామా ఆక్రమణలూ ఇందులోకే వస్తాయి. అంతిమంగా ఈ భయకంపిత అరాచక చర్యలు అమెరికా సంక్షోభాన్ని దీర్ఘకాలంలో పరిష్కరిస్తాయా అన్నది ప్రశ్న. టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


