November 14 Childrens dayబాలలు కేవలం కాబోయే పౌరులు కాదు, వాళ్ళు భవిష్యత్తు సృష్టికర్తలు. బాలల్లో సృజనాత్మకత అంటే... కేవలం కథలు, కవిత్వం కళలు కాదు; అది ఒక జీవన శిక్షణ. సృజనాత్మకత బాలల మన సుల్లో వెలిగే దీపమై, వారిని విజ్ఞానంతో, విలువలతో, చైతన్యంతో నింపుతూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది.
సృజనాత్మకత ఒక శిక్షణ కాదు. అది ఒక సంస్కారం. ఆ సంస్కారం బాల్యంలోనే మొదల వుతుంది. ప్రతి బాలుడు/బాలిక ఒక కొత్త ప్రపంచం వైపు అడు గులు వేస్తున్న శిల్పిగా ఎదగాలంటే... పెద్దలుగా మనం ఇవ్వాల్సినవి ప్రేమ, స్వేచ్ఛ, ప్రోత్సాహం.బాలల్లో సృజనాత్మకత అంటే వెలుగుతున్న ఒక దీపశిఖ. అది ఒకసారి వారి మనసుల్లో వెలిగితే, సమాజం మొత్తానికి వెలుగును పంచుతుంది. ఆ వెలుగులో అతడు కేవలం విజ్ఞానవంతుడిగానే కాదు; మానవత్వం, విలువ లతో కూడిన సమగ్ర మనిషిగా ఎదుగుతాడు. నిజానికి మనిషిలో బాల్యంలోనే సరికొత్త ఆలోచనలకు విత్తనం పడుతుంది. ఆ చిన్న మనసుల్లో మెరుస్తున్న ఆలోచనలు పెద్ద పెద్ద ప్రపంచాలను నిర్మించగలవు. కానీ ఆ కాంతిని మసక బారనీయకుండా దానికి ఒక అందమైన అర్థ వంతమైన దిశ చూపడం పెద్దల బాధ్యత.
సృజనాత్మకత ఒక నది లాంటిది. దాన్ని అడ్డుకుంటే నిలిచిపోతుంది. దారి ఇస్తే మొత్తం సమాజాన్నే సారవంతం చేస్తుంది. ఒక బాలుడు కాగితపు పడవను వర్షపు నీటిలో వదిలినప్పుడు అది కేవలం ఆట కాదు; అందులో ప్రకృతిని, ప్రవాహాన్ని, గమ్యాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది. ఈనాటి విద్యావ్యవస్థలో ‘పుస్తకాలు’, ‘బోధన’ కేవలం మార్కులు,ర్యాంకులు సాధించడానికి మాత్రమే కాకుండా బాలల్లో ఊహాశక్తిని పెంచే సాధనాలుగా ఉండాల్సిన అవసరం ఉంది. పాఠశాలలు బాలల నుంచి ‘సరైన సమాధానం’ రాబట్టడం కన్నా, ‘సరైన ప్రశ్న’ వేయగలిగిన ధైర్యాన్ని పెంపొందించాలి. కథలు చెప్పడం, చిత్రకళ, నాటకాలు, శాస్త్రీయ ప్రయోగాలు ఇవన్నీ బాలల్ని విభిన్నంగా ఆలోచించడానికీ, ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడటా నికీ ప్రేరేపిస్తాయి. తప్పులు చేయడం, విఫలమవడం కూడా సృజనలో భాగమే. తల్లితండ్రులు, ఉపాధ్యాయులు బాలల వైఫల్యాలను విమర్శించకుండా వాటిని ఒక అనుభవంగా చూడాలి. వర్తమాన ఏఐ కాలంలో స్మార్ట్ ఫోన్స్‌లు, ట్యాబ్‌లు, గేమ్‌లు, రీళ్ళు బాలల జీవన గతిలో భాగమైపోయాయి. ఆ స్థితిని ఆపలేం. వాటిని బాలలకు సృజనా త్మక మిత్రులుగా మార్చడం పెద్దల చేతిలో ఉంది.
– వారాల ఆనంద్ కవి – కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత
(నేడు బాలల దినోత్సవం)


