అభిప్రాయం
సంక్షేమ సంస్కరణల విషయంలో బహి రంగ చర్చ అవసరమైనదే కాకుండా ఆరోగ్యకరమైనది కూడా. ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ)’ (వీబీ జీ– రామ్ జీ) బిల్లుకు సంబంధించి కొన్ని వర్గాల నుంచి వ్యక్తమౌతున్న ఆందోళనలు... చారిత్రక ఉపాధి హామీ చట్టంలో వచ్చే మార్పులు కార్మికుల హక్కులను బలహీనపరుస్తాయేమో అనే భయం నుంచి వచ్చాయి.
అటువంటి ఆందోళనలను గౌరవించాల్సిందే. అయితే ఊహల కంటే కూడా ‘వీబీ జీ రామ్ జీ’ బిల్లు అసలు ఏం చేస్తుందో క్షుణ్ణంగా పరిశీలించడం ముఖ్యం. ఈ బిల్లులోని అత్యంత ప్రధానమైన అంశం ఏంటంటే, ఇది ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధమైన హామీని ఇస్తోంది. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోపు ఉపాధి కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతిని అందించే నిబంధనను కూడా ఈ బిల్లు కలిగి ఉంది.
125 రోజుల గ్యారంటీ పని!
జాతీయ గ్రామీణ ఉపాధి చట్టంలో బలహీనత అనేది ఉద్దేశంలో లేదు... నిర్మాణపరమైన లోపాలలో ఉంది. ఈ విషయంలో సంస్కరణలు అవసరం. ‘వీబీ–జీ రామ్ జీ’ని ఈ వాస్తవికతకు అనుగుణంగా అంచనా వేయాలి. హక్కులను బలహీనపరచడానికి బదులుగా ప్రతిపాదిత చట్రం ‘ఎంజీ నరేగా’లోని లోపాలను నేరుగా పరిష్కరిస్తుంది. కార్మికులకు రావలసిన వాటిని నిరాకరించే అనర్హత నిబంధనలను తొలగించడంతో పాటు పారదర్శకత, సామాజిక తనిఖీ, ఫిర్యాదుల పరిష్కారానికి చట్టబద్ధమైన బాధ్యత లను బలోపేతం చేస్తుంది.
‘వీబీ–జీ రామ్ జీ’ గ్రామీణ ఉపాధి విషయంలో డిమాండ్– ఆధారిత స్వభావాన్ని దెబ్బతీస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ బిల్లును క్షుణ్ణంగా చదివితే ఆ వాదన నిలబడదు. సెక్షన్ 5(1) ప్రకారం, గ్రామీణ కుటుంబానికి చెందిన వయోజనులు ఎవరైనా శారీరక శ్రమతో నైపుణ్యం లేని పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారికి ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం 125 రోజుల ఉపాధిని కల్పించాల్సిన స్పష్టమైన చట్టబద్ధమైన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఉపాధి హామీని 125 రోజులకు విస్తరించడం, ‘ఎంజీ నరేగా’ కాలం నాటి అనర్హత నిబంధనలను తొలగించడం ద్వారా ఈ బిల్లు ఈ హక్కును మరింత బలోపేతం చేస్తోంది. తద్వారా నిరుద్యోగ భృతిని ఒక నిజమైన చట్టబద్ధమైన రక్షణ కవచంగా పునరుద్ధరిస్తోంది.
బలోపేతం కానున్న జీవనోపాధి హామీ
ఈ సంస్కరణ ఉపాధిని పక్కన పెట్టి కేవలం ఆస్తుల కల్పనకే ప్రాధాన్యత ఇస్తుందన్నది మరో విమర్శ. ఈ బిల్లు స్పష్టంగా చట్ట బద్ధమైన జీవనోపాధికి హామీని ఇస్తూనే ఉపాధిని ఉత్పాదక, మన్నికైన ప్రభుత్వ ఆస్తుల కల్పనతో అనుసంధానిస్తుంది.షెడ్యూల్ ‘ఐ’తో కలిపి సెక్షన్ 4(2)... నీటి భద్రత, కీలకమైన గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించే పనులు అనే నాలుగు ప్రధాన రంగాలను గుర్తించింది. దీనివల్ల వేతన ఉపాధి అనేది తక్షణ ఆదాయ మద్దతును అందించడమే కాకుండా దీర్ఘకాలిక గ్రామీణ దృఢత్వం, ఉత్పాదక తకు కూడా దోహదపడుతుంది. అందువల్ల ఉపాధి, ఆస్తుల కల్పన అనేవి పరస్పర విరుద్ధమైన లక్ష్యాలు కావు. అవి ఒకదానికొకటి తోడ్పడుతూ సుసంపన్న గ్రామీణ భారతానికి పునాది వేస్తాయి.
కేంద్రీకరణ కాదు, సమన్వయం ద్వారా వికేంద్రీకరణ
ఈ బిల్లు అధికారాల కేంద్రీకరణను వ్యతిరేకిస్తోంది. సెక్షన్ 4(1) నుంచి 4(3)... అన్ని పనులను గ్రామ స్థాయిలో స్థానిక అవస రాల ఆధారంగా రూపొందించిన, గ్రామసభ ఆమోదించిన వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్‌లతో (వీజీపీపీలు) అనుసంధానిస్తాయి. పాత చట్రంలో ఉన్న ప్రధాన లోపం విభజన. దీనిని తొలగించేందుకు అన్ని పనులను వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ స్టాక్‌లో (వీబీఎన్‌ఆర్‌ఐఎస్) చేర్చాలని ఈ బిల్లు చెబుతోంది. దీని వల్ల ప్రణాళికా రచనలో ఏకరూపత, పారదర్శకత ఉంటాయి.
ఇది కేవలం పై నుంచి రుద్దిన కేంద్రీకరణ కాదు. సెక్షన్ 16, 17, 18, 19 ప్రకారం ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ అధికారాలు ఆ యా స్థాయుల్లోని పంచాయతీలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, జిల్లా అధికారు లకు ఉంటాయి. ఈ బిల్లు కేవలం పనుల పట్ల స్పష్టత, సమన్వయం, సమగ్రతను కల్పిస్తుందే తప్ప నిర్ణయాధికారాన్ని కేంద్రీకరించదు. స్థానిక ప్రాధాన్యతల ఆధారంగా ప్రణాళికలను రూపొందించడంలో గ్రామ సభలదే ప్రధాన పాత్ర.
భద్రత, ఉత్పాదకత మధ్య సమతుల్యత
సాగు పనులు ఎక్కువగా ఉండే సమయాల్లో వ్యవసాయ కూలీల కొరతపై ఉన్న ఆందోళనలను ఈ బిల్లు స్పష్టంగా పరిష్కరించింది. ఈ బిల్లు కింద సెక్షన్ 6 ప్రకారం విత్తనాలు నాటడం, కోతల సమయాలను కలుపుకొని ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం 60 రోజుల వరకు పనులు చేపట్టుకూడదని ముందుగానే ఆదేశాలు జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది.
ముఖ్యంగా సెక్షన్ 6(3) ప్రకారం వ్యవసాయ–వాతావరణ పరిస్థితుల ఆధారంగా జిల్లా, బ్లాక్ లేదా గ్రామ పంచాయతీ స్థాయుల్లో వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేసేందుకు రాష్ట్రాలను ఇది అనుమతిస్తుంది. ఈ అంతర్నిర్మిత సౌలభ్యం పెరిగిన ఉపాధి హామీని వ్యవసాయ పనులకు ఆటంకం కలిగించకుండా... దానికి అనుబంధంగా ఉండేలా చూస్తుంది. చాలా తక్కువ సంక్షేమ చట్టాలు మాత్రమే సాధించగలిగిన ఒక సున్నితమైన సమతుల్యత ఇది.
కేటాయింపుల ద్వారా సమానత్వం
ఆర్థికపరమైన కోతలకు సంబంధించిన ఆందోళనలను కూడా విమర్శకులు వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ 4(5), సెక్షన్ 22(4) ప్రకారం నిబంధనల్లో చెప్పిన అంశాల ఆధారంగానే రాష్ట్రాల వారీగా నిధు లను కేటాయిస్తారు. ఈ చట్రం రాష్ట్రాలను కేవలం అమలు చేసే వాటి గానే కాకుండా అభివృద్ధిలో భాగస్వాములుగా పరిగణిస్తుంది. నిర్దేశించిన కనీస చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా సొంత పథకాలను నోటిఫై చేసి అమలు చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి ఉంటాయి. ఆచరణ పరంగా ‘సహకార సమాఖ్య’ ఇది.
సాంకేతికత కారణంగా లబ్ధిదారులు దూరమవుతారనే వాదన ఈ బిల్లులో పొందుపరిచిన రక్షణ చర్యలను విస్మరిస్తోంది. సెక్షన్ 23, 24లు బయోమెట్రిక్ ధ్రువీకరణ, జియో–ట్యాగ్ పనులు, రియల్–టైమ్ డ్యాష్‌బోర్డ్‌లు, క్రమబద్ధమైన బహిరంగ వెల్లడి ద్వారా సాంకేతికతతో కూడిన పారదర్శకతను తప్పనిసరి చేస్తాయి. ఇవి నకిలీ హాజరు, ఉనికిలో లేని కార్మికులు, ధ్రువీకరించలేని రికార్డులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తాయి. సెక్షన్ 20 అనేది గ్రామ సభ ద్వారా సామాజిక తనిఖీలను బలోపేతం చేస్తుంది. సాంకేతికత జవాబుదారీతనాన్ని దాటవేయదు... పునాదిగా నిలుస్తుంది.
హామీకి మళ్లీ విశ్వసనీయత
ఉపాధి హామీని పెంపొందించడం, స్థానిక ప్రణాళికను అంత ర్భాగం చేయడం, వ్యవసాయ ఉత్పాదకతతో కార్మిక భద్రతను సమ తుల్యం చేయడం, పథకాలను అనుసంధానించడం, మెరుగైన పరిపాలనా మద్దతు ద్వారా క్షేత్రస్థాయి సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, పరిపాలనను ఆధునీకరించడం ద్వారా ఆచరణలో తర చుగా విఫలమౌతున్న ఒక హామీకి విశ్వసనీయతను పునరుద్ధరించేందుకు ఈ బిల్లు ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఎంపిక అనేది సంస్కరణ, సానుభూతికి మధ్య కాదు... తక్కువ ఫలితాలనిచ్చే నిలకడ లేని హక్కు, గౌరవం – స్పష్టమైన ఉద్దేశ్యంతో ఫలితాలను అందించే ఆధునిక చట్రానికి మధ్య ఉంది. ఈ కోణంలో చూస్తే ‘వీబీ–జీ రామ్ జీ’ అనేది సామాజిక రక్షణ నుంచి వెనక్కి తగ్గడం కాదు, దాన్ని పునరుద్ధరిస్తోంది.
శివరాజ్ సింగ్ చౌహాన్
వ్యాసకర్త కేంద్ర గ్రామీణాభివృద్ధి,వ్యవసాయం–రైతు సంక్షేమ మంత్రి


