అతి విశ్వాసంతో స్వారీ | Sakshi Guest Column On Union Budget Overconfidence | Sakshi
Sakshi News home page

అతి విశ్వాసంతో స్వారీ

Feb 2 2026 2:40 AM | Updated on Feb 2 2026 2:40 AM

Sakshi Guest Column On Union Budget Overconfidence

విశ్లేషణ

మొత్తంగా చూస్తే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా రామన్‌ ప్రతిపాదించిన కేంద్ర బడ్జెట్‌ 2026–27... ప్రధానంగా నమ్మకం, ఆశ, దృఢ విశ్వాసం వంటి వాటిపై స్వారీ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) కూడా ఆశించిన మేర ఆదాయ అంచనాలను చేరుకోలేదు. దీనిని బట్టి ప్రభుత్వపరంగానూ ఆయా అంశాలు, రంగాల్లో ఆశించిన మేర పెట్టుబడులు, ఖర్చు పెట్టలేదు. గత బడ్జెట్లోనూ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌పై రూ.వెయ్యి కోట్లు ప్రతిపాదించినా అందులో రూ. 200 కోట్లు కూడా ఖర్చుచేయలేదని ఆ రంగానికి చెందినవారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... ప్రైవేట్‌ రంగం నుంచి ఆశించిన మేర పెట్టుబడులు రాకపోతే ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెట్టిన పెట్టుబడులు ఏ మేరకు ఉపయోగపడతాయనేది చర్చనీయాంశమవుతోంది. 

మన బడ్జెట్లన్నీ కూడా ఎక్కువ మటుకు పెట్టుబడి దారులకు అనుకూలంగానే ఉంటున్నాయి. వీటిపై సమ తూకం సాధించే క్రమంలో ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తామనీ, దీనినుంచి మంచి ఫలితాలు వస్తా యనీ చెబుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవరూపం దాల్చుతుందనేది చూడాల్సి ఉంది. 7.5 కోట్ల యూనిట్లలో 32 కోట్ల మంది ఉపాధి, ఉద్యోగాలు పొందుతున్నందున, గ్రామీణ ప్రాంతాల్లోని ఎంఎస్‌ఎంఈలు కూడా క్రియా శీలమై కొంత శాతం ఉపాధిని కల్పిస్తే వీటి పునరుద్ధరణ జరిగే అవకాశాలున్నాయి. 

జాతీయస్థాయిలో 6.4 శాతం నుంచి 7.2 శాతం దాకా వృద్ధిరేటు సాధిస్తామని ప్రభుత్వం చెబుతున్నా... ఈ వృద్ధి నుంచి ఏ వర్గానికి ఎంత పంపిణీ అవుతుందనేది ముఖ్యం. కొన్నేళు్లగా చూస్తే మన వృద్ధి ఎగుడుదిగుళ్లు గానే ఉంటోంది. ఉదాహరణకు.. తాజా ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్‌ ప్రకారం చూస్తే... మొత్తం వంద రూపాయల జీడీపీ ఉత్పత్తిలో పై వర్గానికి 60 శాతం, మధ్య తరగతికి 25 శాతం, దిగువన ఉన్న వారికి 15 శాతం వస్తోంది. అధిక ఆదాయం పొందుతున్న వారు కొంత అధిక పన్ను కట్టాల్సి ఉండగా ఈ వర్గాన్ని ముట్టుకునే సాహసం చేయడం లేదు. 

అదీగాకుండా ఆరోగ్య రంగం విషయాని కొస్తే... మెడికల్‌ టూరిజంను ప్రోత్సహించడం ద్వారా డబ్బు భరించగలిగిన విదేశీయులకు నాణ్యతా పరమైన వైద్యసేవలు అందించి, దేశంలోని పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుచేయలేని సామాన్యులకు ఆ నాణ్యమైన వైద్య సేవలు ఏవనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశ పౌరు లందరికీ సమానమైన వైద్య సేవలను అందించి... అప్పుడు వ్యాపారం చేస్తే బాగుంటుంది. 

బడ్జెట్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేయడమే కాకుండా, దానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అయితే ప్రైవేట్‌ రంగంలో పెట్టుబడుల్లో గత కొన్నేళ్లలో ఎలాంటి వృద్ధీ లేదు. దీనికి భిన్నంగా భారత పెట్టుబడిదారులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం ఎక్కువైంది. దేశీయంగా తగిన డిమాండ్‌ లేదనీ, తమ పరి శ్రమల్లో పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడం లేదనీ వారు చెబుతున్నారు. తాజాగా బడ్జెట్లో... విదేశాల్లో పెట్టుబడులపై నిబంధనలను మరింతగా సులభతరం చేశారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు రావడం కంటే కూడా ఇక్కడి నుంచి బయటి దేశాల్లో పెట్టే పెట్టుబడులు పెరుగుతున్నాయి. 

ఈ పరిస్థితిని అధిగమించేందుకు దేశీయంగా కేంద్రప్రభుత్వం మాత్రమే పెట్టు బడులు పెడుతోంది. మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడులు గతేడాది రూ.11.20 లక్షల కోట్ల నుంచి ఈ ఏడాది రూ.12.25 లక్షల కోట్లకు పెంచుతామని బడ్జెట్లో ప్రతిపాదించారు. వృద్ధిరేటును నిలబెట్టేందుకు ఈ పెట్టుబడులు పెడుతున్నారు. ప్రభుత్వపరంగా రోడ్లు, కమ్యూ నికేషన్లు, తదితరాలన్నీ చేస్తుంటే దానిని ప్రోత్సాహకంగా తీసుకుని, ప్రైవేట్‌ పెట్టుబడులు రావాలి. కానీ అవి రావడం లేదు. 

మెరుగైన ఆర్థిక పరిస్థితి, వృద్ధిరేటు వంటి వాటిపై  కేంద్ర ప్రభుత్వం అతి విశ్వాసం, నమ్మకం పెట్టుకోవడం వల్ల మిగతా ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టడం లేదు. గతంలో ఎన్నడూలేని విధంగా దేశ రక్షణ బడ్జెట్‌ను ఒక్కసారిగా రూ.27 లక్షల కోట్లు (గతం కంటే 21 శాతం పెంపుదల) ప్రతిపాదించారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ద్వారా విజయం సాధించామనే భావనతో ఈ రంగానికి కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి దీనిని ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. అయితే ఇతర దేశాలతో పోల్చితే ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం, వృద్ధి రేటు 6–7 శాతం మధ్యలో ఉండటం కలిసొచ్చే అంశాలు. 

ప్రొఫెసర్‌ డి. నర్సింహా రెడ్డి 
వ్యాసకర్త ఆర్థికవేత్త, హెచ్‌సీయూ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌సైన్సెస్‌ మాజీ డీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement