వాషింగ్టన్: దాయాది దేశం పాకిస్తాన్‌పై అమెరికా నిఘా విభాగం చీఫ్ తులసీ గబ్బార్డ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు అత్యంత భారీ అణు ముప్పును కలిగించే దేశాలలో పాకిస్తాన్ కూడా ఒకటి అంటూ బాంబు పేల్చారు. ఇదే సమయంలో రష్యా, చైనా, ఉత్తరకొరియా, ఇరాన్ దేశాలు.. అధునాతన క్షిపణి ప్రయోగ వ్యవస్థలను చురుకుగా అభివృద్ధి చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఆయా దేశాలతో ప్రపంచానికి ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యలు చేశారు.
అమెరికా నిఘా విభాగం చీఫ్ తులసీ గబ్బార్డ్ తాజాగా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. పెరుగుతున్న ప్రపంచ భద్రతా ముప్పులపై తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్బంగా తులసీ గబ్బార్డ్..‘చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా, పాకిస్తాన్ వంటి దేశాలు అణ్వాయుధాలు, సంప్రదాయ పేలోడ్‌లతో కూడిన అనేక రకాల కొత్త రకాల సాంప్రదాయ క్షిపణి ప్రయోగ వ్యవస్థలపై పరిశోధనలు చేస్తున్నారు. అలాగే, అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాకు అత్యంత భారీ అణు ముప్పును కలిగించే దేశాలలో ఇరాన్, చైనా, రష్యా, ఉత్తర కొరియాలతో పాటు పాకిస్తాన్ కూడా ఒకటి. ఈ దేశాలు అమెరికాను చేరగలిగే అణు సామర్థ్యం ఉన్న క్షిపణులను అభివృద్ధి చేస్తున్నాయి. అమెరికాను వాటి పరిధిలోకి తీసుకువస్తున్నాయి’ అని సంచలన ఆరోపణలు చేశారు.
టార్గెట్ అమెరికా..
అంతేకాదు, మారుతున్న భౌగోళిక రాజకీయ కూటములను హైలైట్ చేస్తూ ఉత్తర కొరియా.. రష్యా, చైనాలతో తన భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటోందని అన్నారు. ఇది అమెరికా శత్రువుల మధ్య సమన్వయ సైనిక సామర్థ్యాలపై ఆందోళనలను పెంచుతోందని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో అమెరికాపై దాడి చేయగల క్షిపణుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉంటుందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయని అన్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం సుమారు 3,000 ఉండగా.. 2035 నాటికి ఈ సంఖ్య 16,000 దాటుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
పాక్ పీఎం షరీఫ్ ఇలా..
అయితే, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రశంసలు కురిపిస్తున్న వేళ తులసీ గబ్బార్డ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. కాగా, 2025లో గాజా పీస్ సమ్మిట్‌లో షరీఫ్ ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. “మ్యాన్ ఆఫ్ పీస్” అని పిలుస్తూ.. ఆయన భారత్–పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని నివారించారని పేర్కొన్నారు. ఆయన ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని కూడా అన్నారు.
ఇరాన్ యుద్ధంపై..
మరోవైపు, ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంపై ఆమె స్పందిస్తూ..‘ఇరాన్‌పై అధ్యక్షుడు ట్రంప్ చర్యలను సమర్థిస్తున్నాను. గత 20 రోజులుగా భీకర దాడులు చేస్తున్నా.. సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నాయకులు, అధికారులు మరణించినా ఇరాన్ మాత్రం పోరాటం ఆపలేదు. యుద్ధంలో భారీ నష్టం జరిగినా.. ఇరాన్‌లో ప్రభుత్వం చెక్కుచెదరలేదు. కానీ, చాలా వరకు ఇరాన్ బలహీనపడిందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇరాన్ సైనిక శక్తి తగ్గినా ఇంకా ప్రమాదకరమే’ అని ఆమె తెలిపారు.


