breaking news
Union Budget 2026-27
-
చిక్కుముడిలో రూ.1.52 లక్షల కోట్లు.. ప్రభుత్వం క్షమాభిక్ష?
న్యూఢిల్లీ: కస్టమ్స్ సుంకం వివాదాల్లో రూ.1.52 లక్షల కోట్ల మొత్తం చిక్కుకుపోయినందున, వాటికి ముగింపు పలికి, వ్యాపార సంస్థలకు స్పష్టతనిచ్చేందుకు 2026–27 బడ్జెట్లో ప్రభుత్వం క్షమాభిక్ష పథకాన్ని ప్రకటించే అవకాశముందని ప్రైస్ వాటర్‌హౌస్ అండ్ కో తెలిపింది. ఈ దిశగా పరిశ్రమ డిమాండ్ చేస్తున్నట్టు తెలిపింది.పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్యఒప్పందాలు (ఎఫ్‌టీఏ) కుదుర్చుకున్నందున కస్టమ్స్ సుంకాల్లో శ్లాబులను ప్రస్తుతమున్న 8 నుంచి 5–6కు తగ్గించడాన్ని ప్రభుత్వం పరిశీలించొచ్చని అంచనా వేసింది. తయారీలోకి వినియోగించే ముడి సరుకుల ధరల కంటే.. వాణిజ్య ఒప్పందాల ఫలితంగా దేశంలోకి దిగుమతి అవుతున్న తుది ఉత్పత్తులు చౌకగా మారాయని, కనుక ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించాల్సిన సమయం ఇదేనని పేర్కొంది.న్యూజిలాండ్, యూకే, ఒమన్ తదితర దేశాలతో భారత్ ఎఫ్‌టీఏలు కుదుర్చుకోవడాన్ని ప్రస్తావించింది. 2025–26 బడ్జెట్లోనూ కేంద్రం కస్టమ్స్ డ్యూటీలను హేతుబద్దీకరించి, సుంకాల శ్లాబులను 8కి తగ్గించినట్టు తెలిపింది. 2024 మార్చి నాటికి కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి 38,014 కేసులు వివాదాల్లో ఉన్నట్టు పేర్కొంది.చిక్కుముడి ఎందుకంటే..అధికారులు జారీ చేసే కస్టమ్స్ డ్యూటీ డిమాండ్లను దిగుమతి, ఎగుమతిదారులు విభేదించి చెల్లించకపోవడంతో కేసులు ఏర్పడ్డాయి.కస్టమ్స్ వర్గీకరణ, ఉత్పత్తి విలువ, మినహాయింపు లాంటి వివాదాలు చాలా కాలం నలుగుతూ రావడం వల్ల ఇంత మొత్తంలో కస్టమ్స్ బకాయిలు పేరుకుపోయాయి.దీర్ఘకాల లిటిగేషన్ కారణంగా కంపెనీల డబ్బు స్తంభించడం వల్ల వాణిజ్యం, పెట్టుబడులపైనా ప్రభావం పడుతోంది.ఇంత మొత్తంలో కస్టమ్స్ బకాయిలు వివాదాల్లో చిక్కుకుపోయిన నేపథ్యంలో దీనికో పరిష్కారం చూపేందుకు వచ్చే 2026–27 బడ్జెట్లో ప్రభుత్వం క్షమాభిక్ష పథకాన్ని ప్రకటిస్తుందని వ్యాపార వర్గాలు ఆశిస్తున్నాయి. -
కేంద్ర బడ్జెట్ 2026: బియ్యం ఎగుమతులను ప్రోత్సహించండి
పన్ను ప్రోత్సాహకాలు, రుణాలపై వడ్డీ రాయితీలు, రవాణా పరమైన మద్దతు చర్యలను 2026–27 బడ్జెట్లో ప్రకటించాలని భారత బియ్యం ఎగుమతిదారుల సమాఖ్య (ఐఆర్ఈఎఫ్) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తద్వారా ఈ రంగం పోటీతత్వం బలపడుతుందని పేర్కొంది. ఎగుమతుల కోసం తీసుకునే రుణాలపై 4 శాతం మేర వడ్డీలో రాయితీ కల్పించాలని.. అలాగే, రోడ్డు, రైలు రవాణాపై వ్యయాలపైనా 3 శాతం రాయితీ కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరింది.ఎగుమతులపై సుంకాలు, పన్నుల మినహాయింపులను సకాలంలో అందించాలని పేర్కొంది. ఈ చర్యలతో వ్యయాలు తగ్గుతాయని, ఎగుమతులు పెరుగుతాయని సూచించింది. అంతర్జాతీయంగా బియ్యం వాణిజ్యంలో భారత్ వాటా 40 శాతంగా ఉంటుందని, 2024–25లో 170కు పైగా దేశాలకు భారత్ నుంచి బియ్యం ఎగుమతులు జరిగినట్టు ఐఆర్ఈఎఫ్ ప్రెసిడెంట్ ప్రేమ్ గార్గ్ తెలిపారు.రైతుల ఆదాయానికి, గ్రామీణ ఉపాధికి బియ్యం ఎగుమతులు ఎంతో కీలకమన్న విషయాన్ని గుర్తు చేశారు. విలువైన వరి రకాలకు (ప్రీమియం బాస్మతి, ఆర్గానిక్/నాన్ బాస్మతి రకాలు) మళ్లేందుకు ప్రోత్సాహకాలను బడ్జెట్లో ప్రకటించాలని ఈ సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది.


