భారత ఆర్థిక వ్యవస్థకు ఎఫ్‌టీఏల ఊపు | Key Highlights from CEA V Anantha Nageswaran view about FTAs budget 2026 | Sakshi
Sakshi News home page

భారత ఆర్థిక వ్యవస్థకు ఎఫ్‌టీఏల ఊపు

Jan 31 2026 1:17 PM | Updated on Jan 31 2026 1:25 PM

Key Highlights from CEA V Anantha Nageswaran view about FTAs budget 2026

అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా పయనిస్తోందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటులో 2025-26 ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన మరుసటిరోజు దేశ ఆర్థిక స్థితిగతులు, సవాళ్లు, భవిష్యత్తు అవకాశాలపై ఆయన పలు కీలక అంశాలను వెల్లడించారు. ముఖ్యంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) భారత ఎగుమతులకు సరికొత్త అవకాశాలు కల్పిస్తాయని స్పష్టం చేశారు.

ఎగుమతులకు ఎఫ్‌టీఏలే కీలకం

ఇటీవల వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారత్‌కు వ్యూహాత్మక ప్రయోజనాన్ని చేకూరుస్తాయని నాగేశ్వరన్ తెలిపారు. ‘శ్రమ ఆధారిత రంగాలైన టెక్స్‌టైల్స్, లెదర్ వంటి ఎక్కువ మందికి ఉపాధినిచ్చే తయారీ రంగాలకు ఈ ఒప్పందాల వల్ల భారీ లబ్ధి చేకూరుతుంది. యూరోపియన్ యూనియన్ వంటి పెద్ద మార్కెట్లలోకి ప్రవేశించేందుకు తక్కువ లేదా జీరో సుంకాలు ఎంతో తోడ్పడుతాయి. దీనివల్ల ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి’ అన్నారు.

పెట్టుబడుల ప్రవాహం

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) గురించి మాట్లాడుతూ.. స్థూల పెట్టుబడులు మెరుగ్గానే ఉన్నప్పటికీ నికర పెట్టుబడుల్లో(డెప్రిసియేషన్‌ను పరిగణిస్తారు) హెచ్చుతగ్గులు ఉన్నాయని అంగీకరించారు. ‘విదేశీ సంస్థలు తమ లాభాలను వెనక్కి తీసుకోవడం, భారత కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల నికర పెట్టుబడుల ప్రవాహంలో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ రంగ పెట్టుబడులు మందగించాయన్న వాదన సరికాదు. 2024-25 గణాంకాలు విడుదలయ్యాక ప్రైవేట్ రంగంలో వృద్ధి మరింత స్పష్టంగా కనిపిస్తుంది’ అన్నారు.

రూపాయి విలువ

రూపాయి విలువ పతనంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయికి ఒక నిర్దిష్ట స్థాయి అంటూ ఏదీ ఉండన్నారు. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా అది సర్దుబాటు అవుతుందని పేర్కొన్నారు. దిగుమతులకు సంబంధించి దీని ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: బంగారం, వెండి ధరలు క్రాష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement