ఇస్తాంబుల్: శాంతియుత ఆందోళనలను తీవ్రంగా అణచివేయడంతోపాటు మూకుమ్మడి మరణశిక్షలను అమలు చేస్తున్న ఇరాన్‌పై మిలటరీ దాడులు తప్పవంటూ అమెరికా చేస్తున్న హెచ్చరికలను ఆ దేశం బేఖాతరు చేస్తోంది. ఉద్రిక్తతలను సడలించేందుకు అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామంటున్న ఇరాన్ ప్రభుత్వం.. ప్రస్తుతానికి అందుకు సంబంధించిన ప్రణాళికేదీ లేదని మరోవైపు చెబుతోంది.
ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి శుక్రవారం తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్‌తో కలిసి ఇస్తాంబుల్‌లో మీడియాతో మాట్లాడారు. అమెరికాతో నిష్పక్షపాత, సమానత్వంతో కూడిన చర్చలకు సిద్ధమన్నారు. అయితే, ముందుగా ఏ అంశంపై చర్చ జరగాలి, ఎక్కడ కలుసుకోవాలి అనే వాటిపై నిర్ణయం జరగాలని స్పష్టం చేశారు. చర్చలకు, అవసరమైతే యుద్ధానికి కూడా తాము సిద్ధమేనంటూ అరాగ్చి వ్యాఖ్యానించారు.
అమెరికా ఆంక్షలు
మరోవైపు.. ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఇస్కందర్ మోమినీపై అమెరికా శుక్రవారం ఆంక్షలు విధించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన నిరసనకారులపై మోమినీ ఆదేశాల మేరకు భద్రతా సిబ్బంది దమనకాండకు పాల్పడ్డారని ట్రంప్ యంత్రాంగం పేర్కొంది. మోమినీతో పాటు.. ఇరాన్ పారిశ్రామిక బాబక్ జంజానీ సహా 18 మంది వ్యక్తులు, కొన్ని సంస్థలపై ఆంక్షలు విధించినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.



