టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు భారత్‌తో పాటు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్య దేశంగా ఉంది. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లన్నీ లంకలోనే నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, బంగ్లాదేశ్ సైతం శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడతామంటూ మొండిపట్టు పట్టి మూల్యం చెల్లించింది.
భారత్- బంగ్లాదేశ్ మధ్య గత కొంతకాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. ఐపీఎల్ నుంచి బంగ్లా ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ (Mustafizur Rahman)ను బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ జట్టుకు భారత్‌లో భద్రత లేదని.. వరల్డ్‌కప్‌లో తమ మ్యాచ్‌లు భారత్‌లో కాకుండా లంకలో ఆడతామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) పంతం పట్టింది.
బంగ్లాదేశ్‌ను తప్పించి..
అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మాత్రం ఇందుకు నిరాకరించింది. భారత్‌లో బంగ్లా ఆటగాళ్లు, సిబ్బందికి వచ్చిన ముప్పేమీ లేదని తేల్చి చెప్పగా.. బీసీబీ మాత్రం పట్టువీడలేదు. ఫలితంగా 24 గంటల తుది గడువు తర్వాత.. బంగ్లాదేశ్‌ను తప్పిస్తూ ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను మెగా టోర్నీలో చేర్చింది ఐసీసీ.
మాకు స్నేహపూర్వక దేశాలు
ఈ పరిణామాలపై శ్రీలంక క్రికెట్ బోర్డు తాజాగా స్పందించింది. లంక క్రికెట్ బోర్డు కార్యదర్శి బందులా దిస్సనాయకే AFPతో మాట్లాడుతూ.. "ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వివాదాల విషయంలో మాది తటస్థ వైఖరి. ఈ మూడూ మాకు స్నేహపూర్వక దేశాలు.
మా దేశంలో మున్ముందు కూడా ఇలాంటి టోర్నీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాము. ఏ దేశం అడిగినా మేము సానుకూలంగా స్పందిస్తాము’’ అని పేర్కొన్నాడు. మరోవైపు.. బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము కూడా టోర్నీని బహిష్కరిస్తామని ప్రగల్బాలు పలుకుతూ ఓవరాక్షన్ చేసిన పాకిస్తాన్.. ఇప్పటికే లంకకు టికెట్లు బుక్ చేసుకున్నట్లు సమాచారం.
ఈ మ్యాచ్ మాకు అత్యంత ముఖ్యం
ఈ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ సాఫీగా సాగేందుకు తాము ప్రత్యేకమైన, మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు శ్రీలంక క్రీడా శాఖా మంత్రి సునిల్ కుమార గమేజ్ తెలిపారు. ఈ మ్యాచ్ తమకు ప్రథమ ప్రాధాన్యం అని.. ఎలాంటి అవాంతరాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.


