అవకాశమొస్తే ఆడకుండా ఉంటానా? | Reason Why Suryakumar Yadav Does Not Play Test-ODI Formats | Sakshi
Sakshi News home page

Suryakumar Yadav: అవకాశమొస్తే ఆడకుండా ఉంటానా?

Mar 16 2026 6:27 PM | Updated on Mar 16 2026 7:07 PM

Reason Why Suryakumar Yadav Does Not Play Test-ODI Formats

ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా టైటిల్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ధోనీ, రోహిత్‌ శర్మ తర్వాత టీ20 ప్రపంచకప్‌ గెలిచిన కెప్టెన్‌గా సూర్యకుమార్‌ అరుదైన ఘనత సాధించాడు.క్రికెట్‌లో మూడు ఫార్మాట్లు ఆడాలనే కల ఏ క్రికెటర్‌కైనా ఉంటుంది. సూర్య జట్టులోకి వచ్చి ఐదేళ్లు గడుస్తున్నప్పటికీ కేవలం టీ20లకే పరిమితం కావడం కొంతమేర ఆశ్చర్యం కలిగిస్తుంది. 

కెరీర్‌ ఆరంభంలో వన్డేలతో పాటు ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆడిన సూర్యకుమార్‌ ఆ తర్వాత టీ20 స్పెషలిస్ట్‌గానే ముద్ర వేసుకున్నాడు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యకుమార్‌ తాను వన్డేలు, టెస్టు మ్యాచ్‌లు ఆడకపోవడానికి గల కారణాలను వెల్లడించాడు. 

‘ఏది రాసిపెట్టి ఉంటే జీవితంలో అదే జరుగుతుంది. తొలుత నేను క్రికెట్‌ ఆడడం ప్రారంభించినప్పుడు రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఆడా. దాదాపు పదేళ్లు రంజీ ట్రోఫీలో ఆడాను. ముంబైకి ప్రాతినిధ్యం వహించాను. ఇక్కడ ప్రతి ఒక్కరూ రెడ్‌బాల్‌ క్రికెట్‌తోనే మొదలుపెడతారు. క్రమంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆట వైపు వచ్చినప్పుడు ఇక్కడే సౌకర్యంగా అనిపించింది. 

మరీ ముఖ్యంగా టీ20లకు బాగా సెట్‌ అయ్యా. వన్డేల్లోనూ మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. నాకు టెస్టు క్రికెట్‌పై ప్రేమ లేదని చెప్పను. ఎందుకంటే 2010 నుంచి 2020 వరకూ రంజీల్లో ఆడా. ఆ ఫార్మాట్‌ను ఆస్వాదించా. ఎవరైనా సరే టెస్టు క్రికెట్‌ ఆడే అవకాశం వస్తే వద్దంటారా చెప్పండి? అయితే నాకున్న క్రికెట్‌ అనుభవం ప్రకారం ఈ ఫార్మాట్‌లో మూడు భిన్నమైన మార్గాల్లో ఆడాల్సి ఉంటుంది.

కొన్నిసార్లు త్వరగా వికెట్లు పడి ముందుగా క్రీజులోకి వెళ్తే టెస్టుల్లో మాదిరిగా నెమ్మదిగా ఆడాలి. మధ్య ఓవర్లలో స్ట్రైక్‌ట్‌ పెంచుకుంటూ పోవాలి. ఇక ఆఖర్లో టీ20ల మాదిరిగా చెలరేగాలి. అందుకేనేమో నాకు ఈ వన్డే ఫార్మాట్‌ సరిగా అర్థం కాలేదు అనిపిస్తుంది. నేను వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్లో ఆడాను.

అభిమానుల నుంచి విపరీతమైన ఆదరణ దక్కింది. మూడు ఫార్మాట్లకు ఉన్న ఆకర్షణ పూర్తిగా భిన్నమైంది’ అని చెప్పుకొచ్చాడు. ఇక సూర్యకుమార్‌ ఇప్పటివరకు ఒక టెస్టు మ్యాచ్‌ ఆడి 8 పరుగులు, 37 వన్డేల్లో 773 పరుగులు సాధించాడు. ఇక 113 టీ20ల్లో 3,272 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 25 హాఫ్‌ సెంచరీలున్నాయి.

చదవండి: రెండు ముక్కల్లో విషెస్‌.. ట్రోల్‌కు గురైన బుమ్రా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement