మాట జారిన రాహుల్‌.. ఇండియా కూటమిలో దుమారం | Rahul Gandhi Comments On Vijayan Effects Cracks In Opposition Unity | Sakshi
Sakshi News home page

మాట జారిన రాహుల్‌.. ఇండియా కూటమిలో దుమారం

Jun 14 2026 1:22 PM | Updated on Jun 14 2026 1:48 PM

Rahul Gandhi Comments On Vijayan Effects Cracks In Opposition Unity

తిరువనంతపురం: ప్రతిపక్ష ఇండియా (INDIA) కూటమిలో అంతర్గత విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ.. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై చేసిన వ్యాఖ్యలు  రాజకీయ దుమారం రేపాయి. రాహుల్‌ వ్యాఖ్యలపై విజయన్‌తో పాటు సీపీఎం అగ్రనేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇండియా కూటమిలో ఐక్యతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. ఇంతకీ రాహుల్‌ ఏమన్నారంటే..

ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో మిత్రపక్షాల మధ్య సంబంధాలపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పోరాడుతున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం రాజకీయ ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా కేరళ రాజకీయాలను ప్రస్తావిస్తూ..‘కేరళలో మేము సీపీఎంతో రాజకీయంగా పోరాడుతున్నాం. అక్కడ పినరాయి విజయన్ మా ప్రధాన ప్రత్యర్థి. అందుకే నేను వెళ్లి ఆయనను హగ్ చేసుకోలేను, చేయను కూడా’ అని కామెంట్స్‌. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

పినరాయి ఘాటు స్పందన..
రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన పినరాయి విజయన్.. తనకు హగ్ చేయడం లేదా చేయకపోవడం అసలు సమస్య కాదన్నారు. అయితే ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశమే ఆందోళన కలిగిస్తోందని విమర్శించారు.‘నన్ను హగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ రాహుల్ గాంధీ గతంలో పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హగ్ చేసిన విషయం దేశం మొత్తం చూసింది. ఇప్పుడు నన్ను హగ్ చేయలేనని చెప్పడం ద్వారా ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. అంతేకాకుండా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పే కాంగ్రెస్ నాయకత్వం, అదే సమయంలో మిత్రపక్షాలపై దాడి చేయడం సరైన రాజకీయ విధానం కాదని విమర్శించారు.

సీపీఎం నుంచి తీవ్ర ప్రతిస్పందన..
రాహుల్ వ్యాఖ్యలపై సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేజీ కూడా తీవ్రంగా స్పందించారు. ‘పినరాయి విజయన్‌ను హగ్ చేయమని ఎవరూ రాహుల్ గాంధీని అడగలేదు. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న ఆరోపణలను బలపరిచేలా మాట్లాడటం మాత్రం మానుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడులు బీజేపీకి రాజకీయంగా లాభం చేకూర్చేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష ఐక్యతను బలోపేతం చేయాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు అనవసర వివాదాలకు దారితీస్తాయని అన్నారు.

కేరళలో కాంగ్రెస్-సీపీఎం ప్రత్యర్థులే
ఇండియా కూటమిలో కాంగ్రెస్, సీపీఎం జాతీయ స్థాయిలో మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ, కేరళలో మాత్రం రెండు పార్టీలు దశాబ్దాలుగా ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాయి. కేరళలో ఎల్‌డీఎఫ్‌కు సీపీఎం నాయకత్వం వహిస్తుండగా, యూడీఎఫ్‌కు కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది. ప్రతి ఎన్నికలోనూ ఈ రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ జరుగుతుంది. అందువల్ల జాతీయ స్థాయిలో కలిసి పనిచేస్తున్నప్పటికీ, రాష్ట్ర రాజకీయాల్లో పరస్పరం విమర్శించుకోవడం కొనసాగుతోంది.

కూటమికి కొత్త తలనొప్పి..
ఇప్పటికే ఇండియా కూటమిలోని పలు మిత్రపక్షాల మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్ మధ్య, పంజాబ్‌లో కాంగ్రెస్-ఆప్ మధ్య, కేరళలో కాంగ్రెస్-సీపీఎం మధ్య రాజకీయ పోటీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కూటమి ఐక్యతపై కొత్త సందేహాలకు తావిచ్చాయి. 2029 లోక్‌సభ ఎన్నికల దిశగా ప్రతిపక్ష ఐక్యతను బలోపేతం చేయాల్సిన సమయంలో మిత్రపక్షాల మధ్య బహిరంగ విమర్శలు కూటమికి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ఇండియా కూటమి నాయకుల మధ్య పరస్పర విమర్శలు అధికార బీజేపీఒకి రాజకీయ అస్త్రంగా మారే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతిపక్షాలు వేదికలపై ఐక్యంగా ఉన్నామని చెబుతూనే, మరోవైపు పరస్పరం విమర్శించుకోవడం ప్రజల్లో గందరగోళానికి దారితీస్తుందని అభిప్రాయపడుతున్నారు. కాగా రాహుల్ వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం కాంగ్రెస్-సీపీఎం మధ్య మాటల యుద్ధానికి దారితీయగా, ఇండియా కూటమి భవిష్యత్తుపై కూడా కొత్త చర్చకు తెరలేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement