సముద్రంలో ఈదుతున్న ఓ వ్యక్తిని అకస్మాత్తుగా ఆక్టోపస్ పట్టేసింది. అతను దాని నుంచి బయటపడేందుకు చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ ఆక్టోపస్ పట్టును వదల్లేదు. చివరకు దాన్ని తొలగించేందుకు అతను గుద్దులు గుద్దాడు. ఈ ఘటన తర్వాత ప్రజల్లో ఒక ప్రశ్న తలెత్తింది. ఆక్టోపస్ మనుషులకు ఎందుకు అంటుకుంటుంది? అది దాడి చేస్తుందా? లేక దీని వెనుక మరో కారణం ఉందా? ఆక్టోపస్ అంటుకుంటే ఏం చేయాలో చూద్దాం..
ఆక్టోపస్ పట్టు అంటే ఉడుంపట్టువంటిదే. అయితే శాస్త్రవేత్తలు చెప్పిన వివరాల ప్రకారం.. అది సాధారణంగా మనుషులపై దాడి చేయదు. అది మనిషికి అంటుకుంటే మాత్రం సాధారణంగా భయపడతాం. మనల్ని రక్షించుకునే ప్రయత్నం వంటివి చేస్తుంటారు. ఆక్టోపస్ అంటుకుంటే ఏమి చేయాలనే విషయాన్ని తెలుసుకోవడం కూడా ముఖ్యం.
ఎందుకు అంటుకుంటుంది?
నిపుణుల ప్రకారం.. ఆక్టోపస్ మనుషులను వేటాడదు. తన చుట్టూ ఉన్న వస్తువులను తాకి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆసక్తితో మనిషిని పట్టుకుంటుంది. ఆక్టోపస్‌కు 8 భుజాలు ఉంటాయి. ప్రతి భుజంపై చిన్న చిన్న సక్షన్ కప్‌లు ఉంటాయి. అంటే గాలి లేదా నీటి ఒత్తిడితో ఉపరితలంపై గట్టిగా అతుక్కునే వలయాకార నిర్మాణాలు. ఇవే ఏ వస్తువునైనా గట్టిగా పట్టుకునేందుకు సహాయపడతాయి. పెద్ద ఆక్టోపస్ శరీరంపై 2,000కి పైగా సక్షన్ కప్‌లు ఉండొచ్చు. అందుకే దాని పట్టు చాలా బలంగా ఉంటుంది. దాని నుంచి బయటపడటం సులభం కాదు.
ఆక్టోపస్ అంటుకుంటే ఏమి చేయాలి?
నిపుణుల సూచనల ప్రకారం.. ముందుగా భయపడకూడదు. బలంగా లాగితే దాని పట్టు ఇంకా బలపడే అవకాశం ఉంది. దాని భుజాల అంచులను నెమ్మదిగా విడదీయడానికి ప్రయత్నించాలి. సమీపంలో లైఫ్‌గార్డ్ ఉంటే వారి సహాయం తీసుకోవాలి. ఆక్టోపస్ నీటి బయట మీ శరీరానికి అంటుకుని ఉంటే, ఆ అవయవాన్ని మళ్లీ సముద్రం లేదా నీటిలోకి తీసుకెళ్లాలి. నీరు తగిలిన వెంటనే అది సాధారణంగా ఈదుకుంటూ దూరంగా వెళ్లిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఆక్టోపస్‌ను నెమ్మదిగా వెనక్కి జరిపితే అది స్వయంగా వదిలేస్తుంది.
ఆక్టోపస్ అంత ప్రత్యేకం ఎందుకు?
ప్రపంచంలో 300 కంటే ఎక్కువ ఆక్టోపస్ జాతులు ఉన్నాయి. ఇది అత్యంత తెలివైన సముద్ర జీవుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది తన రంగును మార్చుకోగలదు. చాలా చిన్న ప్రదేశం నుంచి కూడా బయటకు రావచ్చు. ప్రమాదం ఎదురైతే సిరా వంటి ద్రవాన్ని విడుదల చేసి తప్పించుకుంటుంది. దీని భుజాలపై ఉన్న సక్షన్ కప్‌లు కేవలం పట్టుకోవడానికే కాదు, చుట్టూ ఉన్న వస్తువులను గుర్తించేందుకు కూడా సహాయపడతాయి.
I'm officially never swimming ever again pic.twitter.com/CclCE8wXJI
— Mario Nawfal (@MarioNawfal) August 1, 2026


