లక్నో: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ పప్పూయాదవ్‌పై హిందూ సన్యాసులు, లాయర్లు ఫిర్యాదు చేశారు.అయోధ్య రామమందిర హుండీ చోరీ పేరుతో పార్లమెంట్ ఎదుట వీరు నాటకం వేశారన్నారు. ఆ నాటకం హిందూ ధర్మాన్ని సన్యాసులను అవమానించే విధంగా ఉందని వారణాసిలోని వివిధ పోలీస్ స్టేషన్లలలో ఫిర్యాదు చేశారు.
హిందూ సాధువు బాలక్‌దాస్ దేవచార్య మాట్లాడుతూ "పార్లమెంటు బయట పప్పు యాదవ్ చేసిన చర్య ద్వారా, ఆయన కాషాయ వస్త్రాలను, సాధు సమాజాన్ని, శ్రీరాముడినీ అవమానించారు. ఇందులో ప్రమేయం ఉన్న ప్రతిపక్ష నాయకులందరిపై ఫిర్యాదు దాఖలు చేశాం, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాం," అని అన్నారు.
అదే న్యాయవాది వినీత్ కుమార్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షం సనాతన ధర్మాన్ని అవమానిస్తోందన్నారు "నిన్న పార్లమెంటులో సనాతన ధర్మాన్ని అవమానించారని మేము భావిస్తున్న దానిపై ఫిర్యాదు చేశాము. పప్పు యాదవ్, రాహుల్ గాంధీలపై కేసు నమోదు చేయాలని కోరాము. మేము కేవలం వినతిపత్రం కాకుండా, కంటోన్మెంట్ పోలీసు అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదును సమర్పించాము." అని తెలిపారు.
ఫిర్యాదు ఎందుకు
కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర కానుకల దొంగతనాలపై పార్లమెంటు ఎదుట నిన్న (శుక్రవారం) కాంగ్రెస్ వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. ఆ పార్టీ ఎంపీ పప్పూయాదవ్ కాషాయ వస్త్రాలు ధరించారు. పూజారి వేషంలో విరాళాల పెట్టె పట్టుకొని ముఖద్వారం వద్ద కూర్చొని నిరసన తెలిపారు.ఆ సమయంలో అక్కడి ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అరుస్తూ హుండీలో కానుకలు వేశారు. ఈ సందర్బంగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పప్పూయాదవ్‌కు నమస్కారం పెట్టి హుండీలో కానుకలు వేశారు. కాగా దీనిపై ఇప్పుడు ఫిర్యాదు చేశారు.


