హనీ ట్రాప్‌.. రాజకీయ నేతలే టార్గెట్? | West Bengal STF Arrests Woman in Terror Plot to Honey Trap Politicians | Sakshi
Sakshi News home page

హనీ ట్రాప్‌.. రాజకీయ నేతలే టార్గెట్?

Aug 1 2026 3:51 PM | Updated on Aug 1 2026 4:00 PM

Terror Plot To Honey Trap Politicians: Bengal Cops Arrest Jharkhand Woman

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని లక్ష్యంగా చేసుకుని పన్నిన కుట్ర కేసుకు సంబంధించి ఇటీవల అరెస్టయిన అనుమానిత జైషే-మొహమ్మద్ ఉగ్రవాది హమిమ్ మండల్‌ దర్యాప్తులో భాగంగా.. జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో ఓ మహిళను పశ్చిమ బెంగాల్ పోలీసులు (స్పెషల్ టాస్క్ ఫోర్స్) అరెస్ట్ చేశారు. అరెస్టయిన అర్పితా సర్కార్‌.. మండల్‌తో నిత్యం టచ్‌లో ఉండేదని.. ప్రముఖులను టార్గెట్ చేయడానికి హనీట్రాప్ నెట్‌వర్క్‌లో ఆమె భాగస్వామ్యం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థతో నిందితులకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ మహిళను శుక్రవారం జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్‌లో అరెస్ట్ చేసి.. బెంగాల్‌లోని బర్ధమాన్‌కు తీసుకొచ్చారు. బీజేపీ నాయకులతో సహా వీఐపీలపై నిఘా వేయడం.. కొత్త కార్యకర్తలను రిక్రూట్ చేయడం.. రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించడానికి ఐఎస్‌ఐ మద్దతుగల నెట్‌వర్క్‌తో నిందితులకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి సువేది అధికారి ప్రయాణించే మార్గాలను, ఆయన కాన్వాయ్ కదలికలను మండల్‌ నిరంతరం గమనిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

పశ్చిమ బెంగాల్‌లోని ప్రముఖ రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకోవడానికి.. వారి గురించి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి మండల్.. ఆ  మహిళను ఉపయోగించుకున్నాడని పోలీసులు తెలిపారు. ఉగ్ర మాడ్యూల్ కార్యకలాపాలలో భాగంగా నేతలకు వలపువల విసిరేందుకు అర్పితా సర్కార్ కీలక పాత్ర పోషించిందని భావిస్తున్నారు. రాజకీయ ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు ఆమె ఓ నెట్‌వర్క్‌ను నిర్మించడానికి ప్రయత్నించినట్లు తమ విచారణలో తేలిందని ఓ అధికారి వెల్లడించారు. 

‘‘ప్రముఖులతో పరిచయాలను పెంచుకోవడానికి ఈ మహిళను ఉపయోగించారు. మేము డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నాం. ఆమె సేకరించిన సమాచారాన్ని దాడుల పథక రచనకు ఉపయోగించాలని భావించారా? అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. మండల్ అరెస్ట్‌పై సీఎం సువేందు అధికారి స్పందిస్తూ.. ఇది చాలా సున్నితమైన అంశమని.. ఎస్‌టీఎఫ్, సీనియర్ పోలీసు అధికారులు ఈ కేసును విచారిస్తున్నారని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement